బాపూ నీ బాటలో.. | PM Narendra Modi releases postage stamps on Mahatma gandhi | Sakshi
Sakshi News home page

బాపూ నీ బాటలో..

Published Thu, Sep 26 2019 3:49 AM | Last Updated on Thu, Sep 26 2019 3:49 AM

PM Narendra Modi releases postage stamps on Mahatma gandhi - Sakshi

ఐరాసలో గాంధీజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మోదీ, పలు దేశాల అధినేతలు

ఐక్యరాజ్యసమితి: మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా రూపొందించిన గాంధీ స్టాంపుని ప్రపంచదేశాల అధినేతల సమక్షంలో బుధవారం విడుదల చేశారు. ఇదే సందర్భంగా ‘‘నాయకత్వ లక్షణాలు సమకాలీన ప్రపంచంలో గాంధీ సిద్ధాంతాల ఔచిత్యం’’అనే అంశంపై మోదీ మాట్లాడారు.

సమష్టి పోరాటం, సంయుక్త లక్ష్యాలు, నైతిక ప్రమాణాలు, ప్రజా ఉద్యమాలు, వ్యక్తిగత బాధ్యత వంటి అంశాలపై గాంధీజీకి ఎనలేని విశ్వాసం ఉందని సమకాలీన ప్రపంచానికి కూడా అవి వర్తిస్తాయని అన్నారు.హింసాత్మక ఘర్షణలు, ఆర్థిక అసమానతలు, సామాజిక ఆర్థిక అణచివేత, వాతావరణంలో అనూహ్య మార్పులు వంటివి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రభావితం చూపిస్తున్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

వీటన్నింటిని ఎదుర్కోవడానికి నాయకత్వ లక్షణాలే అత్యంత ముఖ్యమని గాంధీ విలువలు, పాటించిన సిద్ధాంతాలే నాయకత్వ లక్షణాల్ని పెంపొందిస్తాయని అన్నారు. ‘‘గాంధీజీ భారతీయుడే. కానీ కేవలం ఆయన భారత్‌కు మాత్రమే పరిమితం కాదు. ఎందరో ప్రపంచ అధినేతలపై గాంధీజీ ప్రభావం ఉంది. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్, నెల్సన్‌ మండేలా వంటి నేతలు గాంధీ సిద్ధాంతాలు, ఆశయాలతో స్ఫూర్తి పొందారు. గాంధీతో వ్యక్తిగత పరిచయం లేని వారు కూడా ఆయనకు ఆకర్షితులయ్యారంటే ఆయన ఔన్నత్యం ఎలాంటితో అర్థమవుతుంది’’అని మోదీ అన్నారు.

అందరినీ ఎలా ఆకట్టుకోవాలో అన్న ప్రపంచంలో మనం ఇప్పుడు బతికేస్తున్నాం కానీ గాంధీజీ అందరిలోనూ ఎలా స్ఫూర్తి నింపాలో అన్న ఆశయంతో జీవించారు అని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతకాలంలో ప్రజాస్వామ్యానికి అర్థం కుచించుకుపోతోంది. ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, ప్రభుత్వం వారి ఆకాంక్షల మేరకు పనిచేయాలి. కానీ గాంధీ మాత్రం ప్రజలు ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వావలంబన సాధించాలని కోరుకున్నారని మోదీ గుర్తు చేశారు.
 
ఇదే కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ మాట్లాడుతూ అంటరాని వారు అంటూ సమాజం హేళన చేసిన వర్గాల్ని హరిజనులు, దేవుని పిల్లలంటూ గాంధీజీ అక్కున చేర్చుకున్న విధానం అందరిలోనూ స్ఫూర్తిని రగిలిస్తుందని అన్నారు. నిమ్న వర్గాల దృష్టి కోణం నుంచే సమాజాన్ని చూసి గొప్ప నాయకుడిగా అవతరించారని, ఆయన ఆదర్శాలు ప్రపంచానికే పాఠాలు నేర్పుతాయని అంటోనియో గుటరెస్‌ అన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఐక్యరాజ్యసమితికి భారత్‌ కానుకగా ఇచ్చిన సోలార్‌ పార్క్‌ను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు.

ఖాదీ కర్చీఫ్‌ కానుక
ఇదే సందర్భంలో గాంధీ ఇచ్చే కానుకల గురించి మోదీ గుర్తు చేసుకున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ను మోదీ కలిసినప్పుడు ఆమె ఖాదీతో చేసిన చిన్న రుమాలుని చూపించారట. రాణి వివాహ సమయంలో గాంధీ స్వయంగా ఆ ఖాదీ కర్చీఫ్‌ ఆమెకి కానుకగా ఇచ్చారని రాణి చెప్పారట. ఈ విషయాన్ని చెబుతూ రాణి ఎలిజబెత్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారని మోదీ వెల్లడించారు.

ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మక పురస్కారం
న్యూయార్క్‌: మహాత్మాగాంధీ 150 జయంత్యుత్సవాలను జరుపుకుంటున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అరుదైన గౌరవం దక్కింది. బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రతీ ఏడాది ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్‌ గోల్‌ కీపర్‌ అవార్డు మోదీకి దక్కింది. భారత్‌ను పరిశుభ్రంగా ఉంచడానికి మోదీ సర్కార్‌ చేపట్టిన స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ ఐక్యరాజ్య సమితి విధించిన లక్ష్యాలను చేరుకోవడంతో ఈ అవార్డు ఇస్తున్నట్టు గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది. మంగళవారం రాత్రి న్యూయార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గేట్స్‌ ఫౌండేషన్‌ అధినేత బిల్‌ గేట్స్‌ ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు. ‘మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఈ అవార్డు రావడం వ్యక్తిగతంగా నాకెంతో ప్రత్యేకం’ అని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement