సమావేశంలో రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, మోదీ, మన్మోహన్, అడ్వాణీ
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ 150వ జయంతి కార్యక్రమాల ప్రారంభోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిలషించారు. ఐక్యరాజ్య సమితి సహా అన్ని ప్రపంచ వేదికలపై ఈ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. మహాత్ముడి 150వ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం ఏర్పాటైన జాతీయ కమిటీ ప్రథమ సమావేశంలో బుధవారం వారిరువురు ప్రసంగించారు. ఈ సంవత్సరం అక్టోబర్ 2 నుంచి మహాత్ముడి 150వ జయంతి వేడుకలు ప్రారంభమవనున్నాయి.
ఉగ్రవాదం, ఇతర హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లుతున్న నేటి సమాజానికీ గాంధీ ప్రవచించిన అహింస ఆచరణీయమని కోవింద్ పేర్కొన్నారు. గాంధీ కేవలం భారత్‌కే చెందడని, ఆయన ప్రపంచ మానవాళికి భారత్ అందించిన గొప్ప బహుమతి అని అభివర్ణించారు. భవిష్యత్ తరాలకు కూడా మహాత్ముడు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని ప్రధాని మోదీ కోరారు. ‘కార్యాంజలి’ థీమ్ నేపథ్యంలో అన్ని కార్యక్రమాలను రూపొందించాలని, ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.
ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు గాంధీ చూపిన మార్గంలో పరిష్కారాలున్నాయన్నారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్, బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ, కేంద్ర మంత్రులు, 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చైనా మేధావి క్వాన్‌యూ షాంగ్, అమెరికన్ గాంధీగా పేరుగాంచిన బెర్నీ మీయర్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమాల రూపకల్పన కోసం ప్రధాని నేతృత్వంలో 125 సభ్యులతో ఒక కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేశారు.
సీజేఐ, సోనియా, రాహుల్ గైర్హాజరు
ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ హాజరు కాలేదు. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు కూడా గైర్హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment