గాంధీ మార్గం నేటికీ అనుసరణీయం
ఐరాసకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ చూపిన మార్గం, ఆశయాలు నేటికీ అనుసరణీయమేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఆయన ఈ మేరకు ఒక సందేశం విడుదల చేశారు. ఐరాస చేపడుతున్న కార్యక్రమాలకు భారత్ మద్దతునిస్తుందని, వాటిలో భాగస్వామ్యం అవుతుందని చెప్పారు. ‘ప్రపంచంలో శాంతి స్థాపనకు ఐరాస గత 70 ఏళ్లుగా కృషి చేస్తోంది. గాంధీజీ మార్గాలు, ఆశయాలు నేటికీ అనుసరణీయం. ఐరాస లక్ష్యాల్లో ఆయన ఆశయాలు ప్రతిబింబిస్తున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు.
దేశంలో మత అసహనం, దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐరాస 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ భవనాలను రాత్రిపూట నీలిరంగు వెలుతురుతో ముస్తాబు చేస్తున్నట్టు, అహ్మదాబాద్‌లో సబర్మతి ఆశ్రమాన్ని ఇలాగే అలంకరించనున్నట్టు ఆయన తెలిపారు.