గన్‌ఫౌండ్రి (హైదరాబాద్): వచ్చే ఏడాది గద్దర్ జయంతి రోజున ప్రభుత్వం తరపున కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్ పురస్కారాలు ప్రదానం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ‘ఇటీవల సినీ ప్రముఖులు నన్ను కలిశారు. గత ప్రభుత్వాలు నంది అవార్డులు ఇచ్చాయని, వాటిని పునరుద్ధరించాలని అడిగారు. నంది అవార్డులు కాదుగానీ, మా ప్రభుత్వం గద్దర్ పేరిట అవార్డులు ఇస్తుంది..బాహుబలిలో శివగామి శాసనం మాదిరి ఈ వేదికగా చెబుతున్న ఈ ప్రకటనే శాసనం, జీఓ’అని సీఎం తెలిపారు.
బుధవారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గద్దర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడాలన్న గద్దర్ మాటలే తమకు స్ఫూర్తి అన్నారు. సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జెకట్టి గళం విప్పిన గొప్పవ్యక్తి గద్దర్ అని కొనియాడారు. ఆయనతో మాట్లాడితే వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని, ఆ బలంతోనే గడీల ఇనుప కంచెలను బద్ధలు కొట్టామని తెలిపారు.
దళితుడిని సీఎంను చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని, ప్రజాప్రభుత్వంలో జ్యోతిరావుపూలే విగ్రహం కోసం ఎమ్మెల్సీ కవిత వచ్చి ఆ దళితుడికే వినతిపత్రం ఇచ్చిందన్నారు. ప్రజాప్రభుత్వంలో ఎవరైనా వచ్చి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. ట్యాంక్‌బండ్‌పై గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసే విషయమై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని కొందరు కలలు కంటున్నారు
ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారంటూ కొందరు కలలు కంటున్నారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అలాంటి ఆలోచన చేసేవారికి తెలంగాణ ప్రజలే ఘోరీ కడతారని స్పష్టం చేశారు. అది వారి ఒంటికి, ఇంటికి మంచిది కాదని హితవు పలికారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, ఐదు సంవత్సరాల పాటు సుస్థిరమైన పాలన అందించే బాధ్యత తమపై ఉందన్నారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గద్దర్‌ను అవమానించిన ప్రగతిభవన్ గేట్లను బద్ధలు కొట్టామని, దానిని ప్రజలకు అంకితం చేస్తూ ప్రజాభవన్‌గా మార్చామన్నారు. గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి, అందరం కలిసి నడుద్దామని, సామాజిక ప్రగతిశీలరాష్ట్రాన్ని నిర్మి ద్దామని పిలుపునిచ్చారు. అనంతరం ‘పాటకు జీవకణం’, ‘తరగని ఘని’పుస్తకాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, గద్దర్ సతీమణి విమల, కుమారుడు సూర్యకిరణ్, కూతురు వెన్నెలఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, ప్రొఫెసర్ కంచె ఐలయ్యతోపాటు వివిధ సంఘాల ప్రతినిధులు, గద్దర్ అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment