జూలై 22 దాశరథి శత జయంతి ప్రారంభం
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో
నా మదిలో నీవై నిండిపోయెనే...
ఈ పాట ఉన్న సినిమా పేరు చాలామందికి తెలియకపోవచ్చు. సినిమా విడుదలయ్యి 50 సంవత్సరాలయ్యిందని కూడా తెలియకపోవచ్చు. హీరో ఎవరో. హీరోయిన్ ఎవరో. కాని పాట నిలిచింది. రాసిన దాశరథి నిలిచారు. పాడిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా. ‘నిదుర మబ్బును మెరుపు తీగవై కలను రేపినది నీవే’ అని ఇదే పాటలో రాశారు దాశరథి. సినిమా సంగీత ఆకాశంలో కొన్ని నిదుర మబ్బులను తన రాకతో దాశరథి చెదరగొట్టారు. కొన్ని దివ్య పద ద్వారాలను తెరిచారు.
దివి నుంచి భువికి దిగి వచ్చె దిగి వచ్చె
పారిజాతమే నీవై నీవై
ఇది ‘తేనె మనసులు’ కోసం దాశరథి రాశాక కె.వి.మహదేవన్ ట్యూన్ చేసిన పాట. కాని ‘ఇద్దరు మిత్రులు’ కోసం సాలూరి రాజేశ్వరరావు హార్మోనియం పెట్టెను ముందరేసుకుని ‘మీరు ట్యూన్‌కి రాస్తారా, రాస్తే నన్ను ట్యూన్ చేయమంటారా?’ అని అడిగారు దాశరథిని. బహుశా దాశరథి ఆ క్షణంలో నవ్వుకుని ఉంటారు. నిజాము మీద యుద్ధగళం విప్పి వరంగల్ జైలులో బందీ అయినపుడు ఒక రాత్రి ఆయనను ఉన్నట్టుండి ఇతర రాజకీయ ఖైదీలతో కలిపి నిజామాబాద్ జైలుకు బయలుదేరదీశారు పోలీసులు.
అది డిసెంబర్ నెల. రాత్రి. భయంకరమైన చలి. ఎక్కడకు తీసుకెళుతున్నారో తెలియని అయోమయం. దాశరథి ఆ చలిలో, బిక్కచచ్చిన తోటి రాజకీయ ఖైదీలను ఉత్తేజపరుస్తూ కవిత్వం అందుకున్నారు. ఆశువుగా. తెగిపడే కంఠంతో. ఒక్కో కవితా కాగడ. వెచ్చదనం రాజేస్తున్న నెగడు.
అలాంటి దాశరథికి– పళ్లు తోముకోవడానికి బొగ్గుముక్క ఇస్తే జైలు గోడలను కవిత్వంతో నింపిన దాశరథికి– ట్యూన్ ఇస్తే ఎంత. నేరుగా రాయమంటే ఎంత. ‘ఎలాగైనా పర్వాలేదండీ’ అన్నారు దాశరథి. సాలూరు ట్యూన్ ఇచ్చారు. ‘నేను తాంబూలం వేసుకు వస్తాను. ఆలోచిస్తూ ఉండండి’ అని బయటకు వెళ్లి వచ్చిన ఆయన ఎర్రబడ్డ నోటిని ఆశ్చర్యంతో తెరిచారు. పల్లవి రెడీ!
ఖుషీ ఖుషీగా నవ్వుతూ చెలాకి మాటలు రువ్వుతూ
హుషారు గొలిపేవెందుకే నిషా కనులదానా
ఈ ఖుషీ ఆ నిషా అప్పటి వరకూ తెలుగు పాట ఎరగదు. ఇది దాశరథి ఇచ్చిన హైదరాబాద్ టచ్. దక్కనీ మిఠాస్. పాట హిట్ అయ్యింది. దాశరథి నుంచి ‘గాలిబ్ గీతాల’ సంపుటిని అంకితం తీసుకున్నందుకు అక్కినేని ‘ఇద్దరు మిత్రులు’ ద్వారా ఇచ్చిన అవకాశం కవికి విజయావకాశంగా మారింది. తెలుగు పాట దాశరథిని చూసి ఇలా అంది –
నా కంటి పాపలో నిలిచిపోరా
నీ వెంట లోకాల గెలవనీరా
ఇద్దరు హైదరాబాద్ కవులు ఒక సంవత్సరం తేడాలో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టారు. మొదట అక్కినేని ద్వారా దాశరథి (1961). తర్వాత ఎన్టీఆర్ ద్వారా సి. నారాయణ రెడ్డి (1962). దాశరథిది మొదటి నుంచి పోరుగీతం. ఆయన స్వయంగా నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు. అజ్ఞాతంలో ఉన్నారు. జైలులో బాధలు పడ్డారు. ఆల్ ఇండియా రేడియోలో 1956 నుంచి ’71 వరకూ ఉద్యోగాన్ని కాపాడుకుంటూ సినిమా కవిగా అవకాశాలు ఉపయోగించుకున్నారు.
1977 నుంచి ’83 వరకు అంటే ఎన్టీఆర్ వచ్చి రద్దు చేసే దాకా దాశరథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆఖరు ఆస్థానకవి. ఆ పదవిలో ఉండగా సినిమా గీతాలు ఆయన పెద్దగా రాయలేదు. దానికి తోడు 1987లో 62 ఏళ్ల వయసులో ఎదురైన అకాల మరణం దాశరథికి సుదీర్ఘ సినిమా కెరీర్ లేకుండా చేసింది. ఆయన సుమారు 620 పాటలు రాసి ఉండవచ్చు. రాసింది తక్కువైనా హిట్ అయినవి ఎక్కువ. చెట్టు పిట్ట కూడా పాడుకున్న పాట ఆయనది.
గోదారి గట్టుంది గట్టు మీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది
అన్నపూర్ణ, ఆదుర్తి ఇలా ఒకటి రెండు అనుబంధాలు తప్ప దాశరథి ప్రత్యేకంగా ఏదో ఒక గ్రూప్‌తో లేదా సంస్థతో కలిసి ఉన్నట్టు లేదు. సినిమా రంగంలో ప్రతిభతో పాటు పి.ఆర్ కూడా ముఖ్యం. తిరగబడే కవికి అలాంటి స్వభావం తక్కువ. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత ఉడుకునెత్తురు కవికి సినిమాలో ఆవేశ కావేశాల పాటలు ఏమాత్రం దక్కలేదు. చాలా మటుకు ప్రేమగీతాలు, ఎన్నటికీ మాయని యుగళగీతాలు.
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది
ఎన్నటికీ మాయని మమత నాది నీది
దాశరథి కుటుంబ అనుబంధాలను రాశారు. ‘అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం’ ఆయనదే. ‘బాబూ వినరా... అన్నాదమ్ముల కథ ఒకటి’... ‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట’.... అలాగే కవ్వింతలూ రాశారు... ‘అది ఒక ఇదిలే అతనికి తగులే’... భార్య అలక భర్త వేడుకోలు... ‘ఓ చెలి కోపమా... అంతలో తాపమా’... ఊరడింపు ‘గోరొంక గూటికే చేరావు చిలక... భయమెందుకే నీకు బంగారు మొలక’... దరఖాస్తు... ‘విన్నవించుకోనా... చిన్న కోరిక’... ‘కాజల్’ సినిమా కోసం సాహిర్ రాసిన
‘ఛూలేనేదో నాజూక్ హోటోంకో’ విఖ్యాత గీతాన్ని దాశరథి ఎంత కోమలంగా తెలుగు చేశారో చూడండి. ‘తాగాలి’ కాదు ‘తాకాలి’ అన్నారు.
నీ లేత గులాబి పెదవులతో
కమ్మని మధువును తాకాలి
దాశరథికి కృష్ణ అనుబంధం ఉంది. దైవబంధం ఉంది. ఆయన పాటలు ఆలయాల్లో నేటికీ సుప్రభాత గీతాలు. ‘పాడెద నీ నా నామమే గోపాల’... ‘రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య’, ‘కన్నయ్యా... నల్లని కన్నయ్య’... ‘మనసే కోవెలగా... మమతలు మల్లెలుగా... నిన్నే కొలిచెదరా... కృష్ణా’... ‘నేనె రాధనోయి గోపాలా’... ‘నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగి వచ్చునో’... ‘మము పాలింపగ నడిచి వచ్చితివా’... వాణి జయరామ్‌కు దాశరథి వల్ల దక్కిన పూలసజ్జ వంటి గీతం చూడండి.
పూజలు చేయ పూలు తెచ్చాను
నీ గుడి ముందే నిలిచాను
తీయరా తలుపులను రామా...
దాశరథికి వీణ ఇష్టం. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్నారు. సినిమా గీతాల్లో కూడా ఆయన ఈ వీణానాదాన్ని పలికించారు. ‘మదిలో వీణలు మ్రోగె’... ‘నీవు రావు నిదుర రాదు’.. ‘వేణుగాన లోలునిగన వేయి కనులు చాలవులే’.... ఇక ఈ పాట?
మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోనా
ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే....
నేటి నుంచి దాశరథి శతజయంతి సంవత్సర వేడుకలు మొదలుకానున్నాయి. సినిమా రంగం, సినీ సంగీత రంగం, సినీ గేయకర్తలు, అభిమానులు సమావేశాలు, సంగీత విభావరులు నిర్వహించుకుని దాశరథి పాటలను మళ్లీ తలుచుకుని పాడుకోవాల్సిన సందర్భం ఇది. అయితే మన సినిమా రంగానికి పెద్దగా ఇటువంటి వాటికి సమయం ఉండదు. కాని ప్రజల వద్ద శ్రోతల వద్ద ఉంటుంది. సత్కవిని తమ నాల్కల యందు నుంచి కడిగేసే మూర్ఖులు ఎంతమాత్రం కారు వారు. పాడుకుంటూ ఉంటారు. పాడుతూనే ఉంటారు. వారికి తనివి తీరదు.
తనివి తీరలేదే నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం – కె
Comments
Please login to add a commentAdd a comment