వచ్చే విద్యాసంవత్యరం నుంచి సీబీఎన్‌ఈ సిలబస్
పైలట్ ప్రాజెక్టుగా ఆర్జీ
రామగుండం–2 ఏరియాలోని సెక్టార్–2లో ఏర్పాటు
పోటీ పరీక్షలకు సైతం శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు
సింగరేణిలో విద్యావ్యవస్థ పటిష్టతకు సంస్కరణలు
సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఉన్నత విద్యాప్రమాణాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం సంస్థ పరిధిలో ఉన్న 9 పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యనందించేందుకు కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం (2025–26) నుంచి సీబీఎస్‌ఈ సిలబస్ అమలుకు సన్నాహాలు చేస్తోంది. తొలుత రామగుండం–2 ఏరియాలోని సెక్టార్–2 పాఠశాలను పైలట్ ప్రాజెక్టుగా గుర్తించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిబంధనల ప్రకారం తరగతి గదులు, ల్యాబ్, లైబ్రరీ, మైదానం, కంప్యూటర్ ల్యాబ్ తదితర ఏర్పాట్లపై ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు (డైరెక్టర్) పర్యవేక్షించి అనుమతుల కోసం సన్నాహాలు మొదలుపెట్టారు.
‘కారుణ్య’ ఉద్యోగుల పిల్లలపై నజర్
గత ఏడేళ్లలో సింగరేణిలో కారుణ్య నియామకాల ద్వారా సుమారు 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. వీరిలో కొందరికి వివాహం జరగగా, పలువురు అవివాహితులు కూడా ఉన్నారు. అయితే వివాహమైన వారు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించకుండా.. వారికి మెరుగైన భవిష్యత్ ఇచ్చేందుకు కేంద్రీయ విద్యాలయాలు, ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా సింగరేణి విద్యావ్యవస్థను బలోపేతం చేయనున్నారు. సింగరేణిలో పాఠశాలల ఏర్పాటు సమయం (1975)లో అడ్మిషన్ కావాలంటే ఉన్నతాధికారి సిఫారసు కావాల్సి వచ్చేది. కానీ నేడు సింగరేణి వ్యాప్తంగా ఉన్న తొమ్మిది పాఠశాలలో కేవలం వెయ్యి మంది మాత్రమే చదువుతున్నట్లు అంచనా. ఈ తరుణంలో సింగరేణి పాఠశాలలను మళ్లీ అగ్రస్థానంలో నిలిపేలా సీఎండీ ఎన్.బలరామ్ ప్రత్యేక దృష్టి సారించారు.
తరగతులపై అనునిత్యం పర్యవేక్షణ
గతంలో సింగరేణి పాఠశాలలో 10వ తరగతి ఫలితాలపైనే దృష్టి ఉండేది. కానీ ప్రస్తుతం అనునిత్యం అన్ని తరగతుల నిర్వహణ, పరీక్షలకు ప్రశ్నపత్రాల తయారీ, ఫలితాలపై అధ్యయనం చేస్తున్నారు. అంతేకాక డైరెక్టర్ స్థాయి అధికారులు వారంలో ఒక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచి ఉన్నత స్థానాలకు చేరుకునేలా సన్నద్ధం చేసేందుకు ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నారు.
అన్ని రంగాల్లో రాణించేలా కృషి
సింగరేణిలో విద్యావ్యవస్థ ప్రక్షాళనతో పాటు నూతన కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తాం. ప్రతి ఆరు నెలలకోసారి జాబ్‌మేళాలు నిర్వహిస్తాం. సింగరేణి విద్యాసంస్థలో చేరితే కళాశాల చదువు పూర్తయ్యేసరికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలనేది మా భావన. అలాగే, ఇంగ్లిష్ ల్యాబ్‌లు కూడా ఏర్పాటుచేస్తున్నాం.
– గుండా శ్రీనివాస్, ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ
కార్మికుల పిల్లల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యం
సింగరేణి కార్మికుల పిల్లలను రూ.లక్షలు వెచ్చించి ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. అలాకాకుండా వారికి మంచి భవిష్యత్‌ను అందించేలా సింగరేణి పాఠశాలల్లోనే బోధన అందుబాటులోకి తీసుకొస్తున్నాం. పాఠశాల విద్యతో పాటు పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టి నైపుణ్యాలు పెంపొందించడం ద్వారా ఉజ్వల భవిష్యత్ అందిస్తాం.
– ఎన్.బలరామ్, సింగరేణి సీఎండీ
ప్రతివారంలో ఒక పరిశ్రమకు..
విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాల కోసం ఆసక్తి పెంచేలా వారంలో ఒకరోజు పరిశ్రమకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఆయా పరిశ్రమల్లో ఏం తయారుచేస్తారు, ముడిసరుకు లభ్యత, తయారైన ఉత్పత్తుల మార్కెటింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించి వారిలో ఆలోచనాశక్తిని పెంపొందించాలనేది ఈ కార్యక్రమ లక్ష్యం. అంతేకాకుండా ఆటపాటలు, మార్షల్ ఆర్ట్స్‌పై నిత్యం రోజూ ఒక గంటపాటు తరగతులు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment