new ration cards
-
మార్చి మొదటివారం తర్వాతే కొత్త రేషన్‌కార్డులు!
సాక్షి, హైదరాబాద్: కొత్త రేషన్‌కార్డుల జారీకి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. మార్చి మొదటివారం తర్వాతనే కొత్తగా ఆహారభద్రత (రేషన్) కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ మార్చి 1న లక్ష కార్డులు జారీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అధికార యంత్రాంగం మాత్రం మొదటివారం తర్వాతే కొత్తకార్డుల జారీ చేసే అవకాశం ఉన్నట్టు చెబుతోంది. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడు కార్డులు జారీ చేయమంటే అప్పుడు ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధంగా ఉందన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం కూలి 8 మంది కార్మికులు గల్లంతైన నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బిజీగా ఉన్నారని, కొత్త రేషన్‌కార్డులు ఎలా ఉండాలనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో మార్చి మొదటి వారం తర్వాతే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని సమాచారం. చిప్‌తో కూడిన కార్డు అనుకున్నారు...ఏటీఎం తరహాలో స్మార్ట్‌కార్డు రూపంలో కొత్త రేషన్‌కార్డులు తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ఆహారభద్రత కార్డుగా పేర్కొనే దీనికి చిప్‌ను అటాచ్ చేసి, యూనిక్ నంబర్ కేటాయించి, కుటుంబం వివరాలన్నీ పొందుపరచాలనుకున్నారు. ఆ శాఖ కమిషనర్ చౌహాన్ సైతం చిప్ సిస్టమ్‌తో కూడిన రేషన్‌కార్డు తీసుకురాబోతున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను కూడా సీఎంకు పంపారు.అయితే ఇప్పటివరకు స్మార్ట్‌కార్డులకు ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర రాలేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడితోపాటు సీఎం ఢిల్లీ పర్యటన, ఎస్ఎల్బీసీ ఘటన నేపథ్యంలో సీఎం, మంత్రులు బిజీబిజీగా ఉన్నారు. దీంతో దీనిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, స్మార్ట్‌కార్డు తయారీకి కంపెనీకి టెండర్లు పిలవడం, అర్హులను ఎంపిక చేయడం, చిప్‌తో కూడిన కొత్తకార్డుల తయారీ, కుటుంబ వివరాలన్నీ పొందుపరచడం లాంటివి ఇప్పట్లో అయ్యే పరిస్థితులు లేవు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే లోపే కొత్త రేషన్‌కార్డుల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాత పద్ధతిలో ఆహారభద్రత కార్డులను జారీ చేసి, తర్వాత వాటిని ఏటీఎం కార్డు రూపంలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. కొత్తగా ఎన్ని కార్డులో ?» రాష్ట్రంలో ప్రస్తుతం 89 లక్షల ఆహారభద్రత కార్డులున్నాయి. ఈ కార్డుల్లో 2.81 కోట్ల మంది లబ్ధిదారులుగా నమోదై ఉన్నారు. » కాంగ్రెస్ సర్కారు కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ప్రజాపాలన, గ్రామసభలు, మీ సేవ కేంద్రాల్లో కలిపి సుమారు 7 లక్షల కుటుంబాల నుంచి కొత్త దరఖాస్తులు అందించినట్టు సమాచారం.» ఆ దరఖాస్తుల్లో అర్హులను గుర్తించి కొత్తగా తొలివిడతగా 3 నుంచి 4 లక్షల వరకు రేషన్ కార్డులు జారీ చేయనున్న ట్టు తెలిసింది.» హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 1.12 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించినట్టు తెలుస్తోంది. » కాగా గత జనవరి 26న ఎంపిక చేసిన 577 గ్రామాల్లో 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. » ఈనెల 28వ తేదీ వరకు మీసేవ సెంటర్ల నుంచి కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. వివిధ రూపాల్లో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి, జిల్లా స్థాయిలోనే అర్హులను ఎంపిక చేసి, ఆమోదానికి కమిషనర్ కార్యాలయానికి పంపుతారు. -
తెలంగాణలో కొత్తరేషన్ కార్డుల పంపిణీకి తేదీ ఖరారు.. ఎప్పటినుంచంటే?
సాక్షి,హైదరాబాద్ : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం తేది ఖరారు చేసింది. ఎలక్షన్ కోడ్ లేని ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మార్చి 1 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. ‘కోడ్’ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్‌వేదికగా పోస్ట్ చేశారు. ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు✅మార్చి 1న పంపిణీ చేయనున్న ప్రజాప్రభుత్వం ✅హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి,మహబూబ్ నగర్ జిల్లాల్లో పంపిణీ✅మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులు ✅ పదేండ్ల తర్వాత నెరవేరుతున్నపేద బిడ్డల కల pic.twitter.com/iuT0ATFieE— Ponnam Prabhakar (@Ponnam_INC) February 25, 2025 -
వెంటనే కొత్త రేషన్‌కార్డులు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాల్సిందేనని, ఈ మేరకు కొత్త రేషన్‌కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలసి రేషన్‌కార్డుల జారీ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. కొత్త రేషన్‌కార్డుల కోసం ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, రేషన్‌కార్డుల్లో కొత్తగా పేర్ల చేర్పు, తొలగింపు కోసం వచ్చిన విజ్ఞప్తులపై ఆరా తీశారు. ప్రజాపాలన అర్జీలు, కులగణనతోపాటు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులు, మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మళ్లీ దరఖాస్తులు అవసరం లేదు..: ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశం ఇచ్చినా.. మీసేవ కేంద్రాల వద్ద రేషన్ దరఖాస్తుల కోసం రద్దీ ఎందుకు ఉంటోందని సీఎం ఆరా తీశారు. అయితే దరఖాస్తు చేసిన కుటుంబాలే మళ్లీ చేస్తున్నాయని, అందుకే రద్దీ ఉంటోందని అధికారులు వివరణ ఇచ్చారు. వెంటనే కార్డులు జారీ చేస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ఆలస్యం చేయకుండా కొత్త రేషన్‌కార్డులు జారీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే కార్డుల కోసం దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో వెంటనే షురూ.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఆ కోడ్ అమల్లో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ మొదలుపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. కోడ్ ముగిసిన తర్వాత అన్ని జిల్లాల్లో కొత్త కార్డులు ఇవ్వాలని సూచించారు. కొత్త కార్డులకు సంబంధించి పౌర సరఫరాల విభాగం తయారు చేసిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కొత్త రేషన్‌కార్డుల జారీ ఆపోద్దు: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నవాళ్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఆలస్యం చేయకుండా కార్డులను వెంటనే జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అధికారులను ఆదేశాలు జారీ చేశారు.సోమవారం తెలంగాణ కొత్త రేషన్ కార్డులకు(Telangana New Ration Cards) సంబంధించి పలు డిజైన్లను సీఎం రేవంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా.. కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారాయన. అయితే.. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్(Election Code) అమలు ఉంది. అందుకే కార్డుల జారీ నిలిచిపోయింది. అయితే.. కోడ్ అమలు లేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారాయన. అలాగే..అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని సీఎం రేవంత్ మరోసారి అధికారులకు స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు.. మళ్లీ మళ్లీ దరఖాస్తులు(Ration Card Apply) చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా అవగాహన కల్పించాలని సూచించారాయన. -
Telangana: 4 పథకాలు నేడే షురూ
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కారు్డల జారీ పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఒక్కో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని.. తొలిరోజున ఆ గ్రామంలో పూర్తి శాచురేషన్ పద్ధతిలో పథకాలను వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు. లక్షల్లో వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలను ఇవ్వాలని ఆలోచనతో ఉన్నామని.. దీనిపై ఎలాంటి పరిమితి లేదని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియను మార్చి 31 కల్లా పూర్తి చేయనున్నట్టు తెలిపారు. పథకాల అమలుకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి శనివారం పలువురు మంత్రులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సచివాలయంలో సహచర మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి సమావేశం వివరాలను వెల్లడించారు.అర్హత ఉన్న అందరికీ పథకాలు..‘‘లక్షల మంది తమ పేర్లు లేవంటూ గ్రామసభల్లో దరఖాస్తులు పెట్టుకోవడంతో పరిశీలన కోసం మార్చి వరకు సమయం పడుతుంది. ఈ ప్రక్రియలో ఏ ఒక్కరూ మిగిలిపోరు. రైతు భరోసా కింద వ్యవసాయోగ్యమైన ప్రతి ఎకరానికి సాయం చేస్తాం. ఉపాధి హామీ పథకం కింద ఏడాదిలో కనీసం 20 రోజులు పనిచేసిన కూలీలను గుర్తించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేస్తాం. షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు నిర్వహిస్తున్నాం. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన లక్షలాది దరఖాస్తులను క్రోడీకరించి అర్హత ఉన్న వారందరికీ ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పరమ పవిత్రమైన రోజు కావడంతో ఈ ఉదాత్తమైన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం..’’ అని భట్టి తెలిపారు. ఈ ఆనందాన్ని రాష్ట్ర ప్రజలందరితో పంచుకోవాలని ఈ ప్రకటన చేస్తున్నామన్నారు. తనతో సహా సీఎం, మంత్రులు స్వయంగా గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. భూమి లేని కూలీలందరూ ఉపాధి హామీ పనులకు వెళ్తారని ఓ ప్రశ్నకు బదులుగా భట్టి పేర్కొన్నారు.70శాతానికిపైగా జనాభాకు సన్నబియ్యం: ఉత్తమ్ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 గంటల మధ్య నాలుగు పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గ్రామంలో అర్హులందరికీ పథకాలను అందిస్తామన్నారు. రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. గతంలో దరఖాస్తులిచ్చినా, సామాజిక ఆర్థిక సర్వే, గ్రామసభ, ప్రజాపాలనలో ఇచ్చినా అర్హత ప్రకారం పరిశీలించి రేషన్‌కార్డులు ఇస్తామని చెప్పారు. స్వతంత్ర భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో ఆహార భద్రత కల్పించడానికి చొరవ తీసుకోలేదన్నారు. గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలన్నింటికీ ఆహార భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నమని చెప్పారు. కొత్త రేషన్కార్డులిచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యాన్ని ఇస్తామని.. రాష్ట్ర జనాభాలో 70–72శాతం మందికి ప్రతి నెలా ఉచితంగా ఇవ్వబోతున్నాని తెలిపారు.రబీకి ముందే రైతు భరోసా..: తుమ్మలతమ సర్కారు ఒకే ఏడాదిలో రైతుల ఖాతాల్లో రూ.40 వేల కోట్లను నేరుగా జమ చేసిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. రబీ సీజన్‌కు ముందే వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రూ.12 వేల చొప్పున రైతు భరోసా ఇచ్చి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చబోతున్నామని తెలిపారు.అనర్హులకు ఇళ్లు ఇస్తే రద్దు: పొంగులేటి శ్రీనివాసరెడ్డిఎక్కడైనా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తే వాటిని రద్దు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. అనర్హులు లబ్ధిపొంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఎక్కడా అవినీతి, పైరవీలకు స్థానం లేకుండా పేదలను గుర్తించి ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 606 మండలాల్లోని ప్రతి గ్రామంలో ఇళ్లను ఇవ్వబోతున్నామని, ఇది నిరంతర ప్రక్రియగా జరుగుతుందని తెలిపారు. అర్హులైన వారందరికీ జనవరి 26న ఒకేసారి పథకాలను ఇవ్వాలని అనుకున్నామని.. కానీ గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించాల్సి ఉండటంతో తొలుత ప్రతి మండలంలోని ఒక గ్రామంలో ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు. గ్రామసభల్లో కొంత మంది, కొన్ని రాజకీయ పార్టీలు దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కుట్రలు పన్నాయని ఆరోపించారు. పథకాలను పూర్తిస్థాయిలో ఎప్పుడు, ఎక్కడ అమలు చేస్తారన్న షెడ్యూల్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రకటిస్తామని తెలిపారు. -
నాలుగు పథకాలపై.. నేడు కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా పథకాలను ఈనెల 26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు ప్రారంభించాలన్న దానిపై కీలకభేటీ జరగనుంది. దావోస్ పర్యటన ము గించుకొని శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి శనివారం అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమవుతారు. ఈ నాలుగు పథకాలను జిల్లా స్థాయిలో కార్యక్రమాలు పెట్టి ప్రారంభించాలా లేక రాష్ట్రస్థాయిలో లాంఛనంగా ప్రారంభించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.లబ్ధిదారుల ఎంపిక విషయంలో కూడా ఆ సమావేశంలోనే స్పష్టమైన మార్గ దర్శకాలు జారీ చేస్తారని, అదే సమయంలో లబ్ధిదారుల సంఖ్యపై కూడా పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు తెలిసింది. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామసభల్లో పేర్లు చదవడంపై కొన్ని జిల్లాల్లో లబ్ధిదారులు ఆందోళన చేయడం, అధికారుల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. మంత్రులతో సమావేశానంతరం పథకాల ప్రారంభానికి సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు సమాచారం. నాలుగు రోజుల గ్రామసభలు పూర్తి: ఇందిరమ్మ ఇళ్లతోపాటు ఇతర మూడు పథకాలకు సంబంధించి గ్రామస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభలు శుక్రవారంతో ముగిశాయి. రాష్ట్రంలో మొత్తం 16,348 గ్రామ/వార్డు సభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం వార్డు సభలు మరికొన్ని రోజులు జరగనున్నాయి. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరిగిన ఈ సభల్లో ఆయా పథకాల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలు, లబ్ధిదారుల జాబితాలను చదివి వినిపించిన అధికారులు పలు పథకాల కోసం మళ్లీ ప్రజల నుంచి కొత్తగా దరఖాస్తులు కూడా తీసుకున్నారు.ప్రధానంగా రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు అందినట్టు సమాచారం. ఈ దరఖాస్తులను వడపోసిన తర్వాతే పూర్తిస్థాయి లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన గత సంవత్సరంలో నిర్వహించిన ప్రజాపాలన సమావేశాల్లో 83 లక్షల దరఖాస్తులు రాగా, అందులో 30 లక్షల మంది అర్హులుగా తేల్చారని, అందులోనూ తొలి విడతలో భాగంగా అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్ల, గిరిజనులకు ప్రాధాన్యమివ్వాలని, వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్టు సర్టిఫికెట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ⇒ రేషన్‌కార్డులకు సంబంధించి 6.85లక్షల మంది లబ్ధిదారుల జాబితాను గ్రామసభల్లో చదివి వినిపించారు. ఇందులో అభ్యంతరాలు వచ్చిన దరఖాస్తులను, గ్రామసభల్లో కొత్తగా వచ్చిన దరఖాస్తులను పునఃపరిశీలించనున్నారు. ఆ తర్వాతే కొత్త రేషన్‌కార్డుల లబ్ధిదారుల తుది జాబితా తయారు చేయనున్నారు. ⇒ రైతు భరోసా కోసం ఈనెల 16 నుంచి 20వ తేదీవరకు గ్రామస్థాయిలో సాగు యోగ్యం కాని భూముల గుర్తింపు ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా 10–15 లక్షల ఎకరాలు సాగు యోగ్యం కావని తేల్చినట్టు తెలిసింది. ఆత్మీయ భరోసా కింద 10 లక్షల మంది వరకు అర్హులను గుర్తించారని, వీరికి తొలి విడతలో భాగంగా అవసరమయ్యే నిధుల చెక్కును కూడా విడుదల చేస్తారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.సీఎం రేవంత్‌కు ఘన స్వాగతంశంషాబాద్: దావోస్‌లో మూడురోజుల పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయ లాంజ్‌లో ఎమ్మెల్యేలు శాలువాలతో సీఎంను సత్కరించారు. -
కొత్త రేషన్ కార్డులపై ప్రజల్లో గందరగోళం
-
కోతలపైనే సర్కారు దృష్టి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకుండా, కోతలు విధించడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆరు గ్యారంటీల హామీ తో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం వాటిని నిజాయితీగా అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. రేషన్ కార్డులు, వ్యవసాయ కూలీలకు భరోసా, రైతుబంధు, పేదల గృహ నిర్మాణ పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యను భా రీగా కుదిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివా రం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, చింత ప్రభాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్టీ నాయకుడు దేవీప్రసాద్‌తో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ ఈ సందర్భంగా హరీశ్‌రావు బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘రేషన్‌కార్డు లబ్ధిదారుల ఎంపికను గ్రామాల్లో చేయకుండా, కులగణన సర్వే ఆధారంగా జాబితా తయారు చేశారు. గతంలో ప్రజాపాలనలో వచ్చిన 11 లక్షల దరఖాస్తులతో పాటు రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను చెత్తబుట్టలో వేశారు’అని ఆయన ధ్వజమెత్తారు. ఆదాయ పరిమితి పెంచాలి.. ‘పదేళ్ల క్రితం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదల ఆదాయ పరిమితిని పెంచి కొత్తగా 6.47 లక్షల రేషన్‌కార్డులు ఇచ్చాం. ఇప్పుడు కూడా పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ, ఆశ వర్కర్లు, ప్రైవేటు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, పేద వర్గాలకు లాభం జరిగేలా ఆదాయ పరిమితిని పెంచాలి. లేకుంటే అనేక కుటుంబాలు కొత్త రేషన్‌కార్డులకు అర్హత కోల్పోతాయి. అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వకుంటే బీఆర్ఎస్ తరఫున నిలదీస్తాం. వ్యవసాయ కూలీలకు ఇచ్చే భరోసా విషయంలోనూ క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులను గుర్తించడం లేదు. 20 రోజుల పనిదినాలు అనే నిబంధనతో అర్హుల సంఖ్యను ఆరు లక్షలకు కుదించారు. రైతు రుణమాఫీలో రేవంత్ చేసిన మోసంతో ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారాన్ని ఆ రైతు కుటుంబానికి చెల్లించాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నెలలు గడిచినా వేతనాలేవీ.. ముఖ్యమంత్రి పాలనలో చిరుద్యోగులకు నెలల తరబడి వేతనాలు అందడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. చిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే మంత్రి సీతక్క రాజకీయం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
కేసీఆర్ హయాంలో అందరికీ న్యాయం జరిగింది
-
కొత్త రేషన్ కార్డుల పంపిణీపై జిల్లాల్లో గందరగోళం
-
‘కులగణన’ ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: కులగణన సర్వే ఆధారంగానే రేషన్‌కార్డులు లేని కుటుంబాలను గుర్తించి అర్హులకు కొత్త ఆహారభద్రత (రేషన్) కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 26 నుంచి అర్హులకు కొత్త రేషన్ కా ర్డులు అందజేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. రేషన్‌కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనున్నట్టు తెలిపింది. విధి విధానాలు ఇవే..కులగణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్‌కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీవో, మునిసిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)/ డీసీఎస్ఓ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శించి, చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదిస్తారు.గ్రామసభ, వార్డు సభల్లో ఆమోదించిన లబ్ధిదారుల అర్హత జాబితాను మండల, మునిసిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్‌లో నమోదు చేసి జిల్లా కలెక్టర్ , జీహెచ్ఎంసీ కమిషనర్లకు పంపాలి. వాటిని పరిశీలించి సంతృప్తి చెందిన వీరు ఆ జాబితాను పౌరసరఫరాల శాఖ కమిషనర్ లాగిన్‌కు పంపించాల్సి ఉంటుంది. తదనుగు ణంగా కమిషనర్ కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తారు. రేషన్‌కార్డు పొందేందుకు అర్హత కలిగిన వ్యక్తి ఒకేఒక్క ఆహార భద్రత (రేషన్) కార్డులొ తన పేరు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఆహార భద్రత కార్డుల్లో కొత్తగా సభ్యుల పేర్ల చేర్పులు, తొలగింపులు చేసుకోవచ్చు. దీంతో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న వినతుల పరిష్కారం దిశగా సర్కారు ముందడుగు వేసినట్టయ్యింది. -
హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విపత్తు నిర్వహణ– ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ (హైడ్రా)కు పూర్తిస్థాయి స్వేచ్ఛ కలి్పస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో, నాలాలపై ఉన్న అక్రమ కట్టడాల కూలి్చవేతల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, రెవెన్యూ, నీటిపారుదల తదితర శాఖలకు ఉన్న విశేష అధికారాలను హైడ్రాకు ఇవ్వాలని నిర్ణయించింది.సంస్థకు చట్టబద్ధత కూడా కల్పించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు మూడు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సచివాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ట్రిపుల్ ఆర్ దక్షిణ అలైన్‌మెంట్‌పై కమిటీ ‘ఓఆర్ఆర్కు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లోని 24 పురపాలికలు, 51 గ్రామ పంచాయతీల పరిధిలో అన్ని శాఖలకు ఉన్న స్వేచ్ఛ(అధికారాలు)ను హైడ్రాకు కల్పించేలా నిబంధనలను సడలించాం. వివిధ విభాగాలకు చెందిన 169 మంది అధికారులు, 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను డిప్యుటేషన్‌పై హైడ్రాలో నియమించాలని నిర్ణయం తీసుకున్నాం.రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు చేసేందుకు ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 12 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ కనీ్వనర్‌గా ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా పురపాలక, రెవెన్యూ శాఖల కార్యదర్శులు, ఐదారు జిల్లాల కలెక్టర్లు, ఆర్అండ్బీ, నేషనల్ హైవే ఆథారిటీ, జియోలాజికల్ విభాగాల అధికారులు ఉంటారు..’ అని పొంగులేటి తెలిపారు. 8 కొత్త వైద్య కళాశాలలకు 3 వేల పైచిలుకు పోస్టులు ‘హైదరాబాద్ నగరం కోఠిలోని మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టాలని నిర్ణయించాం. ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీసు ఆరోగ్య భద్రత పథకాన్ని ఎస్పీఎల్ కింద కూడా వర్తింపజేయాలని నిర్ణయించాం.తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు గాను 72 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ నుంచి పరిశ్రమల శాఖకు బదిలీ చేయాలని నిర్ణయించాం. అలాగే ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఇండ్రస్టియల్ పార్క్ ఏర్పాటుకు 58 ఎకరాల భూమిని రెవెన్యూ నుంచి పరిశ్రమల శాఖకు బదిలీ చేయనున్నాం. ములుగు జిల్లా ఏటూరునాగారం ఫైర్ స్టేషన్‌కు 34 మంది సిబ్బందిని మంజూరు చేశాం. రాష్ట్రంలో కొత్తగా అనుమతి పొందిన 8 వైద్య కళాశాలలకు బోధన, బోధనేతర సిబ్బంది కలిపి మొత్తం 3 వేల పైచిలుకు పోస్టులను మంజూరు చేశాం. కొద్దిరోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తాం. కోస్గికి ఇంజనీరింగ్ కాలేజీ, హకీంపేటకు జూనియర్ కళాశాల మంజూరు చేశాం. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై తదుపరి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటాం..’ అని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్‌కు పేరొస్తుందనే ఎస్ఎల్బీసీపై నిర్లక్ష్యం: కోమటిరెడ్డి ‘కాంగ్రెస్ పారీ్టకి, తనకు పేరు వస్తుందనే అక్కసుతో కేసీఆర్ గత 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. నల్లగొండ జిల్లాలో రూ.6 వేల కోట్ల మిషన్ భగీరథ పనులు జరిగితే, రూ.4 వేల కోట్ల కుంభకోణం జరిగింది. నల్లగొండలో ఫ్లోరైడ్ తగ్గిందంటూ కేసీఆర్ అబద్ధాలు చెప్పారు. వాస్తవానికి ఫ్లోరైడ్ తీవ్రత పెరిగినట్టు కేంద్రం నివేదిక ఇచి్చంది..’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.2027 నాటికి ఎస్ఎల్బీసీ, డిండి పూర్తి: ఉత్తమ్ ‘ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.4,637 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ఎస్ఎల్బీసీ, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసి 2027 సెపె్టంబర్‌లోగా ప్రారంభిస్తాం. ఎస్ఎల్బీసీ సొరంగం రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్‌ను ఆదేశించాం.డిండి ప్రాజెక్టు కు పర్యావరణ అనుమతుల సాధనకు, మిగిలి న 5 శాతం పనుల పూర్తికి ఒక ప్రత్యేకాధికారిని నియమించాల్సిందిగా సీఎం సూచించారు. ఖరీఫ్‌లో సన్నాలను పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఖరీఫ్‌లో రికార్డు స్థాయి లో 1.43 లక్షల మెట్రిక్ టన్నుల పంట రానుంది. వచ్చే నెలలో కొత్త తెల్లరేషన్ కార్డుల జారీని ప్రారంభిస్తాం. జనవరి నుంచి రేషన్‌కార్డులపై సన్నబియ్యం సరఫరా చేస్తాం.. అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ తెలిపారు.బిల్లులు రావట్లేదు సార్ కేబినెట్ భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తం తాము మంజూరు చేసిన పనులకు సకాలంలో బిల్లులు విడుదల చేయడం లేదని పలువురు మంత్రులు..సీఎం రేవంత్ దృష్టికి తెచి్చనట్లు తెలిసింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. ఆయా బిల్లులు త్వరితగతిన విడుదల చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
కొత్త రేషన్‌కార్డులకు అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రేషన్ కార్డుల జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కొత్త కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ పలుసూచనలు చేశారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వడంపై చర్చించారు. దీనిపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రేషన్.. పరేషాన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్‌కార్డుల అంశం ప్రజల్లో పరేషాన్ రేపుతోంది. లక్షలాది మంది కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. దీనిపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వెల్లడించిన అంశాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నా యి. రేషన్‌కార్డులకు కోత పెడతారా? పెళ్లిళ్లు అయి కొత్తగా ఏర్పడిన కుటుంబాలన్నింటికీ కొత్తకార్డులు జారీ చేస్తారా? పాతవాటిలో మార్పు చేర్పులపై ఏం చేస్తారు? రేషన్‌కార్డులు లేకుంటే ప్రభుత్వ పథకాలు అందడం ఎలా? అర్హతల పునః సమీక్ష అంటే ఎలాంటి నిబంధనలు పెడతారనే ప్రశ్నలు వస్తున్నాయి.వచ్చే నెల ప్రారంభం నుంచే కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రులు వెల్లడించారు. రేషన్‌కార్డులను విభజించి, స్మార్ట్ రేషన్‌కార్డులు, స్మార్ట్ హెల్త్‌కార్డులు ఇస్తామని.. రేషన్‌కార్డులకు అర్హతలపై పునః సమీక్ష చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలు.. ప్రస్తుతం మంత్రులు వెల్లడించిన అంశాలు.. ఇటీవలి పరిణామాలను బేరీజు వేసుకుంటూ.. రేషన్‌కార్డుల అంశంపై తీవ్రస్థాయిలో చర్చలు మొదలయ్యాయి. రేషన్ కార్డుల్లో కోత పడుతుందా? అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తామని మంత్రులు ప్రకటించారు. అయితే అర్హు లను ఎలా నిర్ధారిస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్తగా కార్డుల కోసం ఏడెనిమిది లక్షల మంది ఎదురుచూస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీల దరఖాస్తులతోపాటు కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఆ దరఖాస్తుల డేటాపై స్పష్టత లేదు. దీంతో మరోసారి ప్రజాపాలన నిర్వహించి రేషన్‌కార్డులకు దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.కొత్త రేషన్‌కార్డుల జారీకి విధి విధానాలేమిటనే విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించాల్సి ఉంది. వార్షికాదాయం ప్రాతిపదికన జారీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కొత్తగా ఇచ్చే రేషన్‌కార్డులకే పరిమితి అమలు చేస్తారా? పాతకార్డులకూ వర్తింపజేస్తూ.. అధికాదాయం ఉన్నవారికి రద్దు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో అడ్డగోలుగా రేషన్‌కార్డులు జారీ చేశారని, అధికాదాయం ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, ఐటీ కడుతున్నవారికి కూడా రేషన్‌కార్డులు ఉన్నాయని సీఎం రేవంత్ గతంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కార్డులకు కోతపడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పథకాలు అందేది ఎలా? రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్డులే ప్రామాణికమని సీఎం రేవంత్ గతంలోనే స్పష్టం చేశారు. ఇప్పటికే రేషన్‌కార్డు సమస్యలతో చాలా మంది రైతులకు ‘రుణమాఫీ’ అందలేదు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందనివారూ ఎంతో మంది ఉన్నారు. భవిష్యత్తులో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాలకూ రేషన్‌కార్డుల లింకు ఉండనుంది. దీనివల్ల ఉన్న రేషన్‌కార్డులు రద్దయినా, కొత్త రేషన్‌కార్డులు మంజూరుకాకున్నా.. తమకు పథకాలు అందేది ఎలాగని పేదల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నేళ్లుగా జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని.. అర్హతకోసం పరిగణించే వార్షికాదాయ పరిమితిని దానికి అనుగుణంగా పెంచాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇక రేషన్‌కార్డులను విభజించి బియ్యం వద్దనుకునే వారికి స్మార్ట్ హెల్త్‌కార్డులు జారీ చేస్తామన్న మంత్రుల ప్రకటనతోనూ సందేహాలు మొదలయ్యాయి. అలా స్మార్ట్ హెల్త్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయా, లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ నెల 21న మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. అనంతరం రేషన్‌కార్డుల అంశంపై స్పష్టత రావొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
వచ్చే నెల నుంచి కొత్త రేషన్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల కోసం అక్టోబర్ నుంచి దరఖాస్తులు స్వీకరించి, వేగంగా జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రేషన్‌కార్డులను విభజించి స్మార్ట్ రేషన్ కార్డులు, స్మార్ట్ హెల్త్ కార్డులను వేర్వేరుగా జారీ చేస్తామన్నారు. రేషన్ బియ్యం అవసరం లేకున్నా ఆరోగ్యశ్రీ వంటి ప్రయోజనాల కోసం తెల్లరేషన్ కార్డులున్న వారి కోసం ప్రత్యేకంగా స్మార్ట్ హెల్త్ కార్డులను జారీ చేస్తామని వెల్లడించారు. కొత్త రేషన్‌కార్డులు, హెల్త్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో నాలుగోసారి సమావేశమై చర్చించింది. ప్రభుత్వానికి కొన్ని మధ్యంతర సిఫార్సులు చేసింది. అనంతరం మంత్రులు ఉత్తమ్, పొంగులేటి మీడియాతో మాట్లాడారు. అర్హతలపై పునః సమీక్ష చేస్తున్నాం.. తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారుల అర్హతలను పునఃసమీక్షిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ నెల 21న ఇంకోసారి సమావేశమై కొత్త విధివిధానాలను ఖరారు చేస్తామని చెప్పారు. అర్హులైన అందరికీ రేషన్‌కార్డులు జారీ చేయాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ ఏర్పాటైన నాటికి 91,68,231 రేషన్‌కార్డులు, 3,38,07,794 మంది లబ్ధిదారులు ఉంటే.. గత ప్రభుత్వం పాత రేషన్‌కార్డులన్నీ రద్దు చేసి కొత్తగా దరఖాస్తులు స్వీకరించిందని చెప్పారు. అప్పట్లో 89,21,907 కొత్త రేషన్‌కార్డులను జారీ చేయగా.. 2,70,36,250 మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.6 లక్షల కార్డులు, 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం లబ్ధిదారుల వార్షికాదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షల్లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షల్లోపు ఉండాలని.. 3.5 ఎకరాలు/ఆ లోపు తడి, 7.5 ఎకరాలు/ఆ లోపు మెట్ట భూములు ఉండాలని చెప్పారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌లలో అమలు చేస్తున్న ఆదాయ పరిమితులను పరిశీలించామని.. రాష్ట్రంలో లబ్ధిదారుల ఆదాయ పరిమితిని పెంచాలా? తగ్గించాలా? ప్రస్తుత నిబంధనలనే కొనసాగించాలా? అన్న అంశాలపై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొత్త రేషన్‌కార్డుల జారీ విషయంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు కోరుతూ లేఖలు రాయగా.. ఇప్పటివరకు 16 మంది నుంచి స్పందన వచ్చిందన్నారు. మిగతావారు ఈ నెల 19లోగా అభిప్రాయాలను పంపితే.. పరిశీలిస్తామని చెప్పారు. జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ.. తెల్ల రేషన్‌కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీని జనవరి నుంచి ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. నిరుపేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు ఈ పథకం దోహదపడుతుందని చెప్పారు. దొడ్డు బియ్యం బ్లాక్ మార్కెటింగ్, రిసైక్లింగ్‌కు దారితీస్తోందని.. సన్న బియ్యంతో ఈ సమస్య ఉండదని వివరించారు. వానాకాలంలో పండించిన సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామని తెలిపారు. ఉప ఎన్నికలుంటేనే రేషన్ కార్డులిచ్చారు: పొంగులేటి గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసరా పెన్షన్లు ఇచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. 2016–2024 మధ్య కాలంలో 6,47,479 కొత్తకార్డులు జారీ చేయగా.. 5,98,000 కార్డులను తొలగించిందని చెప్పారు. అంటే ఇచ్చినది 49,476 కార్డులేనని పేర్కొన్నారు. తాము పారదర్శకత కోసం ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని, వారు విలువైన సలహాలిస్తే భేషజాలకు పోకుండా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం మధ్యంతర సిఫారసులివీ.. – క్యూఆర్ కోడ్/ మైక్రో చిప్/ బార్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డులను జారీ చేయాలి. – ప్రస్తుత అర్హతలను కొనసాగించాలి. – ‘పరిమితికి లోబడి భూమి ఉండడం ఒక్కటే అర్హత కాదు. భూమి ద్వారా వచ్చే ఆదాయం సైతం ఆదాయ పరిమితికి లోబడి ఉండాలి’అనే నిబంధనను తొలగించాలి. గందరగోళానికి గురిచేసే ఈ నిబంధన అనవసరం. – సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సక్సేనా కమిటీ సిఫారసులను పరిశీలించాలి. -
రూ.500 సిలిండర్‌కు అర్హులు 42.90 లక్షలేనా?
సాక్షి, హైదరాబాద్: రూ.500 లకే గ్యాస్ సిలిండర్ రాష్ట్రవ్యాప్తంగా కేవలం 42,90,246 కుటుంబాలకే అందుతోంది. మొదటివిడత ప్రజాపాలనలో భాగంగా అన్ని జిల్లాల్లో కోటి ఐదు లక్షల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించారు. ఇందులో 89,21,269 దరఖాస్తులను కంప్యూటరైజ్ చేశారు. కానీ ఇందులో సగానికన్నా తక్కువ 42.90 లక్షల కుటుంబాలను మాత్రమే సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌కు అర్హులుగా ఎంపిక చేశారు.వీరికి గత ఏప్రిల్ నుంచి ఆగస్టు 15 వరకు 56,46,808 గ్యాస్ సిలిండర్లకు ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని భరించింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలకు రూ.168.17 కోట్లు చెల్లించింది. రేషన్‌కార్డు (ఆహారభద్రత కార్డు) ఉన్న ప్రతీ కుటుంబానికి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని తొలుత ప్రభుత్వం చెప్పింది. ఎన్నికల్లో ఇచి్చన హామీని నెరవేర్చాలనే తొందరలో లబి్ధదారుల ఎంపికలో సరైన ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు వచ్చాయి. రేషన్‌కార్డు ఉన్నా... రాష్ట్రంలో భారత్, ఇండేన్, హెచ్పీలకు చెందిన కోటి 30 లక్షలకు పైగా గృహావసర (డొమెస్టిక్) గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 33 జిల్లాల్లో 90 లక్షలకు పైగా రేషన్‌కార్డులు ఉన్నాయి. అత్యంత పేదరికం అనుభవిస్తున్నవారు, అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి మినహా రేషన్‌కార్డులు ఉన్న వారందరికీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన రేషన్‌కార్డులు ఉన్న వారంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలే అని ప్రభుత్వం భావిస్తే మహాలక్ష్మి పథకం కనీసం 70 లక్షల కుటుంబాలకైనా వర్తించాలి.కానీ ప్రస్తుతం కేవలం 42.90 లక్షల కుటుంబాలకు మాత్రమే రూ.500కు గ్యాస్ సిలిండర్‌ను అందిస్తుండడాన్ని బట్టి మహాలక్ష్మి పథకానికి రేషన్‌కార్డుతో పాటు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారని స్పష్టమవుతోంది.ఈ నేపథ్యంలో తమకు కూడా రూ. 500 సిలిండర్ పథకాన్ని వర్తింపజేయాలని రేషన్‌కార్డుదారులంతా కోరుతున్నారు. కాగా కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తే లబి్ధదారుల సంఖ్య మరింత పెరిగి అవకాశముంది. -
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. నిర్ణయాలివే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రిమండలి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ 1లో జరిగిన ఈ కేబినెట్ భేటీ దాదాపు గంటన్నరపాటు సాగింది.కేబినెట్ నిర్ణయాలు..యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగురోడ్డు వరకూ విస్తరించే ముసాయిదా బిల్లుకు ఆమోదం..కొత్త రేషనుకార్డుల జారీకి కేబినెట్ ఆమోదం..హైదరాబాద్ అభివృద్ధికి విదేశీ ద్రవ్య సంస్థల నుంచి రుణాలను సమకూర్చుకునే అంశానికి కేబినెట్ నిర్ణయంక్రికెటర్ సిరాజ్, నిఖత్ జరిన్‌కు ఆర్థిక సాయం, గ్రూప్ 1 డీఎస్పీ పోస్టు కేటాయింపు..ధరణి పోర్టల్‌ను భూమాతగా మారుస్తూ కేబినెట్ నిర్ణయంరేపు జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్న ప్రభుత్వంనిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవడానికి కేబినెట్ ఆమోదంఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్‌కు మరోసారి రకమండ్ చేశాం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిఇటీవల విది నిర్వాహాణలో చనిపోయిన ఉన్నతస్థాయి ఉధ్యోగుల పిల్లలకు ఉద్యోగాలు.గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం 437 కోట్లు కేటాయింపు.గోదావరి నీటిని మల్లన్న సాగర్‌కు అక్కడి నుంచి శామిర్ పేట్ చెరువు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు తరలించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. -
TS: రేషన్‌కార్డులిస్తూనే ఉంటాం
సాక్షి, హైదరాబాద్: ‘తెల్ల రేషన్‌కార్డు లేకుంటే ప్రజాపాలన కింద పథకం రావడం కష్టం. అందువల్ల కొత్త రేషన్‌కార్డులు కూడా ఇస్తాం. రేషన్‌కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా ముందుకు వెళుతుంది. అలాగే ప్రజాపాలన దరఖాస్తులు రేషన్‌కార్డులు లేనివారు ఇచ్చినా తీసుకుంటాం. ప్రజాపాలనలో సంబంధిత దరఖాస్తుతో పాటు ఇతర విజ్ఞాపనలను కూడా స్వీకరిస్తాం. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నాం. రేషన్‌కార్డు, భూముల వారసత్వ బదిలీ, ఇతర ఏం సమస్యలున్నా దరఖాస్తు తీసుకుంటాం..’ అని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల డేటా ఇప్పటికే తమ వద్ద ఉందని చె ప్పారు. పథకాలు కావాల్సిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. యువ వికాసం కింద విద్యా భరోసా కార్డుల జారీ కోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాలల్లోనే కౌంటర్లు పెట్టి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించా రు. ఎన్నికల హామీని నిలబెట్టుకునే క్రమంలో ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 8 పనిదినాల్లో గ్రామాలు, మున్సిపల్ వార్డులు, పట్టణాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. తండాలు, గూడేలు, మారుమూల పల్లెల్లోని అత్యంత నిరుపేదలు, నిస్సహాయులకు సహాయం అందించడానికే గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రజాపాలన కార్యక్రమం లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల చెంతకు పాలన ‘సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి సచివాలయం లేదా ప్రజాభవన్‌లో జరిపే ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేయడం పేదలకు అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఒకరోజు ముందే వచ్చి రాత్రబస ఇక్కడే చేస్తున్నారు. గత ప్రభుత్వం అందుబాటులో లేకపోవడం, పరిపాలన ప్రజల వద్దకు చేరకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులు పేరుకుపోయి ప్రభుత్వాలు మోయలేనంత భారంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ప్రజావాణి కోసం ప్రజాభవన్‌కు రప్పించుకోవడం కాకుండా, గతంలో గడీల లోపల జరిగిన పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెట్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులను ఏ ప్రజలైతే ఎన్నుకున్నారో వారి గ్రామాలకే పంపించడం ద్వారా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లిన భావన కలుగుతుంది. ఇది ప్రజల ప్రభుత్వం అని, సమస్యలు పరిష్కరిస్తుందనే విశ్వాసం ఏర్పడుతుంది. వారంలో రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తేనే దాదాపుగా 24 వేల పైచిలుకు దరఖాస్తులొచ్చాయి. భూసమస్యలు, ఇళ్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి సమస్యలే అధికం. వీలున్న విజ్ఞాపనలన్నింటినీ పరిష్కరిస్తాం ఈ ప్రజావాణి దరఖాస్తులన్నిటికీ ఒక నంబర్ ఇచ్చి డిజిటలైజ్ చేస్తున్నాం. వాటిని సంబంధిత శాఖలకు, అధికారులకు పంపిస్తున్నాం. ఒక ఐఏఎస్ అధికారి, సిబ్బందితో ఇందుకు వ్యవస్థను ఏర్పాటు చేశాం. విజ్ఞాపన పత్రం పురోగతిని, అది ఎక్కడో ఉందో తెలుసుకోవడానికి ట్రాకింగ్ సిస్టం పెట్టాం. పరిష్కారానికి వీలు ఉన్నవన్నీ పరిష్కరిస్తాం. వీలు లేనప్పుడు దరఖాస్తుదారులకు కారణాలు తెలియజేస్తాం..’ అని సీఎం చెప్పారు. అర్హులెవరో తెలుసుకోవడానికే దరఖాస్తులు ‘మహాలక్ష్మీ, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు లాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే నిజమైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం వద్ద ఉండాలి. అప్పుడు లక్ష్యం పెట్టుకుని, దానిని చేరడానికి అహరి్నశలు కృషి చేయగలం. ఎంతమంది అర్హులు దరఖాస్తు చేసుకుంటే ఎన్ని పరిష్కరించాం, ఇంకా ఎన్ని పరిష్కరించాల్సి ఉందనేది తెలుస్తుంది. జనాభా అధికంగా ఉండే గ్రామాల్లో ఎక్కువ కౌంటర్లు, మహిళలు, పురుషుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. రైతుబందు సీలింగ్‌పై అసెంబ్లీ చర్చ రైతుబంధుపై సీలింగ్ విధించే అంశంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి అందరి సమ్మతితో నిర్ణయం తీసుకుంటాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుందని ముందే ఊహించి వారికి ఆర్థిక సహాయం అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాం. వారి వివరాలూ సేకరిస్తాం. తబ్లిగీ జమాత్ సమావేశాలకు 2006 నుంచి ప్రభుత్వం సాయం చేస్తోంది. ఆ సమావేశాలను ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది..’ అని రేవంత్ తెలిపారు. తర్వాత కూడా దరఖాస్తులు ఇవ్వొచ్చు ‘గ్రామసభల్లో దరఖాస్తు ఇవ్వలేకపోయిన వారు తమకు పథకాలు వర్తించవని ఆందోళనపడాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ పంచాయతీల్లో గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్లకు దరఖాస్తు సమర్పించవచ్చు. ఆ తర్వాత కూడా నిజమైన లబ్ధిదారులు ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో ఇవ్వవచ్చు. హైదరాబాద్‌లో దరఖాస్తును ఉర్దూలో కూడా ఇస్తాం. గ్రామాల్లో ఉదయం 8–12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2–6 వరకు దరఖాస్తులు ఇవ్వొచ్చు. పట్టణాల్లో ఉదయం 10–5 గంటల వరకు అందజేయవచ్చు. డిసెంబర్ 7న బాధ్యతలు చేపట్టిన మా ప్రభుత్వం జనవరి 7లోపే లబ్ధిదారుల సమారాన్ని సేకరిస్తుంది..’ అని చెప్పారు. గవర్నర్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తాం ‘సచివాలయంలో లోపల పత్రికా సమావేశం పెట్టుకోగలమని, ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి కూర్చోగలుగుతామని జర్నలిస్టులు భావించి ఉండకపోవచ్చు. అప్పట్లో పోలీసులు అడ్డుకుంటే ప్రజాప్రతినిధులమైనా రాలేక మేం అటు నుంచి అటే వెళ్లిపోయాం. ఇకపై సీఎం, మంత్రులు ఇదే హాల్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. మేము స్వేచ్ఛనిస్తాం, మీరు (జర్నలిస్టులు) దురి్వనియోగం చేయకుండా సహకరించాలి. జర్నలిస్టుల సమస్యలూ చాలా కాలంగా పేరుకుపోయాయి. త్వరలో దృష్టి పెడ్తాం. ఆందోళన వద్దు. మాకు హిడెన్ ఎజెండా లేదు. మాపై కేసులు లేవు. లూట్మార్ చేసిన వారిలాగా మాఫీల కోసం వంగాల్సిన అవసరం లేదు. ప్రధానికి దరఖాస్తు ఇచ్చాం. రాష్ట్రానికి సహకరిస్తామని ప్రధాని కూడా హామీ ఇచ్చారు. రాష్ట్ర గవర్నర్‌తో సత్సంబంధాలు ఇలాగే కొనసాగిస్తాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు. -
కొత్త రేషన్‌కార్డులు ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ మొదలు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు లబ్ధిదారులుగా ఉండాలంటే..రేషన్‌కార్డు తప్పనిసరి అయ్యింది. అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌కార్డులు (ఆహారభద్రత కార్డులు) జారీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మంగళవారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసే సమీక్ష సమావేశంలో కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంలో ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్‌కార్డుల కోసం ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా, ఇప్పటికే రాష్ట్రంలో 90 లక్షలకు పైగా కార్డులు ఉన్నాయనే కారణంతో ఆ దిశగా దృష్టి పెట్టలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో 3 లక్షల కార్డులు జారీ చేశారు. అప్పటి నుంచి కొత్తగా దరఖాస్తులు ఆహ్వనించలేదు. ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడినవారు... ఈ పదేళ్లలో జన్మించిన పిల్లల పేర్లు కూడా కార్డుల్లో చేర్చలేదు. చనిపోయిన వారి పేర్లు మాత్రమే ఎప్పటికప్పుడు తొలగించారు. రాష్ట్రంలో 90.14 లక్షల రేషన్‌కార్డులు: రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆహారభద్రత కార్డులు 90.14 లక్షలు ఉన్నాయి. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 54.48 లక్షల కార్డులు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహారభద్రత కార్డులు 35.66 లక్షలు ఉన్నాయి. ఇవి కాకుండా అంత్యోదయ అన్నయోజన కింద 5.62 లక్షల కార్డులు, అన్నపూర్ణ పథకం కింద 5,211 కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల పరిధిలో 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న జనాభా, ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుంటే ఈ కార్డుల లబ్ధిదారుల్లో 20 శాతం వరకు అనర్హులే ఉన్నట్టు గత ప్రభుత్వం గుర్తించింది. అయితే అనర్హుల నుంచి కార్డులను ఏరివేత ప్రక్రియ ప్రారంభిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే కారణంగా యథాతథ స్థితి కొనసాగించింది. అనర్హులను తొలగిస్తారా...? గతంలో తెలుపు, గులాబీ రేషన్‌కార్డులు ఉండేవి. 2014లో కేంద్ర ప్రభుత్వం గులాబీకార్డులను పూర్తిగా ఎత్తివేసి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) వారికే ఆహారభద్రత కార్డులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన రేషన్ కార్డులు పొందలేని వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహారభద్రత కార్డులు ఇచ్చిం ది. ఈ లెక్కన రాష్ట్రంలో 90.14 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉండగా, లబ్ధిదారుల సంఖ్య దాదాపు 2.83 కోట్లు. రాష్ట్ర జనాభానే 4 కోట్లు అనుకుంటే సుమారు 3 కోట్ల మంది ఆహారభద్రత కార్డులకు అర్హులుగా ఉన్నారు. కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాల్సి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలు రూపొందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రేషన్‌కార్డులలో అర్హులైన వారిని మాత్రమే కొనసాగించి, కొత్తగా బీపీఎల్ పరిధిలోకి వచ్చే వారికి కార్డులు జారీ చేస్తారా లేక ఉన్న వాటి జోలికి వెళ్లకుండా కొత్తగా అర్హులను గుర్తిస్తారా చూడాలి. -
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపు ఏళ్లు గడుస్తున్నా కదలని ఫైళ్లు
వికారాబాద్: జిల్లాలోని అనేక మంది అర్హులకు ఆహార భద్రత కరువైంది. తెలంగాణ సర్కారు కొలువుదీరిన తర్వాత ఒకేసారి కొత్త కార్డులు జారీచేసింది. ఈ సమయంలో కూడా దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు సగం మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంది. దీంతో మిగిలిన వారంతా రేషన్‌తో పాటు అనేక ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ఇదిలా ఉండగా కార్డుల్లో కొత్త పేర్లను చేర్చే విషయంపై ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంబిస్తోంది. ఆహార భద్రతపథకంలో భాగంగా ఏడేళ్ల క్రితం లబ్ధిదారులను ఎంపిక చేసి సుమారు ఆరు వేలకు పైగా కొత్త కార్డులు జారీ చేశారు. కానీ గడిచిన ఏడేళ్లలో ఆయా కుటుంబాల్లో పెళ్లిళ్లు, ప్రసవాలు జరిగి సభ్యులసంఖ్య పెరిగింది. మృతి చెందిన వారి పేర్లను కార్డుల్లోంచి తొలగిస్తున్న అధికారులు.. కొత్తగా వచ్చిన వారి వివరాలను మాత్రం పట్టించుకోవడంలేదు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. 35,000 పెండింగ్ ఏడేళ్ల క్రితం లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం అర్హుల జాబితాను ఆన్లైన్లో పెట్టింది. కానీ వీరికి కార్డులు జారీ చేయకుండా ఏడాదికి సరిపడే కూపన్లు అందజేసింది. ఆతర్వాత బయోమెట్రిక్ విధానంలో బియ్యం సరఫరా చేస్తోంది. కానీ కొత్తగా ఆయా కుటుంబాల్లోకి వచ్చిన వారిని చేర్చడంపై మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదు. ఇలాంటి వారు జిల్లా వ్యాప్తంగా 35,000 మంది ఉన్నారు. వీరందరూ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. దరఖాస్తు చేసుకోని వారు సైతం వేల సంఖ్యలో ఉన్నారు. వీటన్నింటికీ మోక్షం కలిగితే జిల్లాకు మరో 210 మెట్రిక్ టన్నుల బియ్యం కోటా పెరగనుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్‌పై రాష్ట్ర సర్కారు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా అనేక మంది పేదలు నష్టపోతున్నారు. 2,41,622 కార్డులు జిల్లాలోని 20 మండలాల్లో 588 చౌకధరలదుకాణాలు, 2,41,622 ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. వీటిలో 2,14,853 ఎఫ్ఎస్సీ, 26,730 అంత్యోద య, 39 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా 4,673 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతున్నాయి. గతంలో లబ్ధిదారులందరికీ సబ్సిడీపై చక్కర పంపిణీ చేయగా ప్రస్తుతం అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు మాత్రమే ఇస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చేందుకు మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాం. వీటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేశాం. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆదేశాలు వస్తే అమలు చేస్తాం. – రాజేశ్వర్, డీఎస్ఓ -
వారికి కొత్త రేషన్ కార్డులు
-
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ
-
కొత్త రేషన్ కార్డులు నేటి నుంచి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుపేదల కడుపు నింపే నూతన రేషన్ కార్డుల జారీకి సోమవారం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 3.09 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్త కార్డులు అందజేయనుంది. భూపాలపల్లి జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు ప్రతీ మండల కేంద్రంగా లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందిస్తారని మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క పెండింగ్ అప్లికేషన్ లేకుండా అన్నింటిని పరిశీలించి కార్డులు జారీ చేశామన్నారు. ఈ 3.09 లక్షల కార్డుల ద్వారా 8,65,430 మంది లబ్ధిదారులు నూతనంగా ప్రతీ నెల 6 కిలోల బియ్యాన్ని పొందనున్నట్లు చెప్పారు. ఇందుకుగానూ నెలకు 5,200 మెట్రిక్ టన్నులతో ఏడాదికి 62,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే ఉన్న కోటాకు అదనంగా పౌరసరఫరాల శాఖ అందించనున్నట్లు తెలిపారు. దీనికోసం ఏటా ప్రభుత్వం రూ.168 కోట్లు అదనంగా వెచ్చించనుందన్నారు. ఇప్పటికే ఉన్న 87.41 లక్షల కార్డులకు కొత్తవి జత కావడంతో వాటి సంఖ్య 90.50 లక్షలకు చేరనుండగా, మొత్తం లబ్ధిదారులు 2.88 కోట్లు ఉంటారని చెప్పారు. బియ్యం పంపిణీకి ఏటా ప్రభుత్వం రూ.2,766 కోట్లు వెచ్చిస్తోందని వివరించారు. -
రేపటి నుంచే కొత్త రేషన్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: అర్హులైన పేదలకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. 3.09 లక్షల మంది లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్డులను అందజేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాలకు.. పౌర సరఫరాల శాఖ సమాచారం అందించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు జూలై 26 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందజేయనున్నారు. నిజానికి గడిచిన నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించిన సమయంలో కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల సంఖ్య 4,46,169గా ఉండగా, వీటిని అన్ని దశల్లో పరిశీలన చేశారు. డూప్లికేట్లు లేకుండా, ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి అన్ని కోణాల నుంచి పరిశీలించి.. 3,09,083 మందిని అర్హులుగా తేల్చారు. అధికంగా హైదరాబాద్‌లో 56,064 మందిని అర్హులుగా తేల్చగా, రంగారెడ్డిలో 35,488 మందిని, మేడ్చల్‌లో 30,055 మందిని అర్హులుగా గుర్తించారు. -
త్వరలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు
జడ్చర్ల/అచ్చంపేట: రాష్ట్రంలో త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు, కొత్త పింఛన్లు జారీ చేస్తామని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 1.52 లక్షల ఉద్యోగాలు కల్పించామని, త్వరలోనే మరో 52 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నామని ప్రకటించారు. కరోనా కారణంగా పలు అంశాల్లో కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అధోగతి పాలైన తెలంగాణను.. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీల్లో, రంగారెడ్డి జిల్లా కొత్తూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయా చోట్ల జరిగిన బహిరంగ సభల్లో కేటీఆర్ మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్ పాలనలో వివక్షకు గురైన తెలంగాణను.. ఇప్పుడు సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఉమ్మడి పాలనలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పింఛన్ రూ.75 ఇచ్చేవారని, ఎవరైనా లబ్ధిదారు మరణిస్తే గానీ కొత్తగా మరొకరికి పింఛన్ వచ్చే పరిస్థితి ఉండేది కాదని గుర్తు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200 చొప్పన పింఛన్ ఇచ్చిందని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ పది రెట్లు పెంచి రూ.2,000 చొప్పున.. ఏకంగా 40 లక్షల మందికి అందిస్తున్నారని పేర్కొన్నారు. అర్హులైన మహిళల పేరిట డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయిస్తామన్నారు. ఒంటరి మహిళలకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా పింఛన్లు ఇస్తున్నామన్నారు. ‘‘ఇల్లు నేనే కట్టిస్తా, పెళ్లి నేనే చేయిస్తానంటూ మేనమామలా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు’ అని కేటీఆర్ కొనియాడారు. రైతులకు మేలు కోసం.. రాష్ట్రంలో మాతాశిశు మరణాల రేటు తగ్గిందని, జాతీయ స్థాయి గణాంకాలు కూడా ఇదే చెప్తున్నాయని కేటీఆర్ అన్నారు. 75 ఏళ్ల ఎందరో పీఎంలు, సీఎంలు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించారని.. అంతా రైతుల గురించి మాట్లాడే వారేగానీ చేసిందేమీ లేదని చెప్పారు. కేసీఆర్ వచ్చాక రైతు బంధు, బీమాతో భరోసా కల్పించారన్నారు. జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. కాగా.. కేటీఆర్ పర్యటన ఉండటంతో అచ్చంపేటలో బీజేపీ, పలు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అయినా కొందరు నేతలు, కార్యకర్తలు అచ్చంపేట బస్టాండ్ సమీపంలో కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు శ్రీనివాస్‌రెడ్డి, రాములు, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి.. అచ్చంపేట సభలో ఎంపీ రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, హర్షవర్ధన్‌రెడ్డి, అబ్రహం తదితరులు పాల్గొన్నారు. చదవండి: కరోనా రోగుల్లో మూడోవంతు ఆసుపత్రుల్లోనే..! -
ఏరివేత తర్వాతే కొత్త రేషన్ కార్డులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేత మళ్లీ తెరపైకి వచ్చింది. అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులు జారీ చేస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన నేపథ్యంలో.. కొత్త కార్డుల కంటే ముందుగా బోగస్ కార్డుల ఏరివేతపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టనుంది. రాష్ట్రంలో సుమారు 8 లక్షలకు పైగా బోగస్ కార్డులు చెలామణీలో ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో ముందుగా వాటిని తొలగించాకే కొత్తవాటిపై దృష్టి పెట్టాలని యోచిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో సీఎం స్థాయిలో జరిగే సమీక్ష అనంతరం కార్యాచరణ సిద్ధం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో మాదిరే మళ్లీ ఏరివేత.. రాష్ట్రంలో ప్రస్తుతం 87.56 లక్షల రేషన్ కార్డులు ఉండగా, వీటి ద్వారా 2.8 కోట్ల మంది లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున రూపాయికి కిలో బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇందులో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద గుర్తించిన వారు 1.91 కోట్ల మంది ఉన్నారు. రాయితీ బియ్యం పంపిణీకి ప్రభుత్వం ఏటా రూ.2,200 కోట్ల మేర ఖర్చు చేస్తోంది. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే బోగస్ కార్డుల ఏరివేతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించిన ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ కోసం సేకరించిన ఐరిస్, వేలిముద్రలతో పాటు ఆధార్ కార్డుల జారీకి తీసుకున్న కుటుంబాల వివరాలను కూడా ప్రత్యేక సర్వర్ ద్వారా క్రోడీకరించి బోగస్ కార్డులను తొలగించింది. వలస వెళ్లిన కుటుంబాలు, ఒకే కుటుంబంలో రెండు, అంతకంటే ఎక్కువ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, ఒకే కుటుంబంలో తెలుపు, గులాబీ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, నివాసంలో లేకుండా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, చనిపోయిన వారి వివరాలను సేకరించి సుమారు 10 లక్షల కార్డులను తొలగించింది. ప్రస్తుతం కొత్త కార్డులు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో బోగస్ కార్డుల ఏరివేత మళ్లీ కానుంది. రాష్ట్రంలో ఈ ఏడేళ్లలో చనిపోయిన వారు, ఇతర రాష్ట్రాల్లో కార్డులు కలిగి ఉన్న వారు సుమారు 8 లక్షల వరకు ఉంటారని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. ఈ కార్డులన్నింటినీ ఆధునిక పరిజ్ఞానం ద్వారా తొలగించాలని చూస్తోంది. కొత్త కార్డుల కోసం ఎదురు చూపులు బోగస్ కార్డుల ఏరివేత తర్వాతే కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో చాలా ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది. ప్రతి జిల్లాలో కుప్పలు తెప్పలుగా రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు రాగా, వీటిల్లో కొన్ని పరిశీలనలోనే నిలిచిపోగా, మరికొన్ని మంజూరు కాకుండా ఆగిపోయాయి. మీ–సేవ ద్వారా, ఆహార భద్రతా కార్డు వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా కొత్త కార్డులు, రద్దయిన కార్డుల పునరుద్ధరణ, కార్డుల్లో మార్పుచేర్పులు చేసుకునేందుకు భారీగా దరఖాస్తులు వచ్చినా చాలా వరకు పరిష్కారం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా పౌర సరఫరాల వద్ద కనీసం 5.5 లక్షల కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో గ్రేటర్ పరిధిలోనే 1.65 లక్షల దరఖాస్తులు, రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో లక్ష దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా వేస్తున్నా రు. ప్రస్తుతం కొత్త కార్డుల జారీ మొదలు పెడితే పాత దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం కొత్తగా మళ్లీ వచ్చే దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంటుంద ని పౌర సరఫరాల వర్గాలు చెబుతున్నాయి. ఇక అర్హులందరికీ గతంలో మాదిరి లామినేషన్ చేసిన కార్డును కాకుండా యూవిక్ పేపర్‌తో కూడిన కార్డును అందజేయాలనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
బియ్యం కార్డులు 10 రోజుల్లో..
మన ముఖం చూడాలంటే అద్దం చూసుకోవాలి.. కానీ వేరొకరి మనసు చూడాలంటే అర్థం చేసుకోవాలి.. అలాంటి అర్థం చేసుకోగలిగే పాలకులు ఉంటే పేదవాడికి ఆకలిదప్పికలు ఉండవు. వారి కష్టాల్లో నేతలు భాగస్వాముల వుతారు. వారికి కావాల్సినవన్నీ వేళకు సమకూర్చుతారు. ప్రధానమైనవన్నీ అమర్చుతారు. అలాంటి వాటిల్లో ఒకటి బియ్యం కార్డులు. పేదవాడికి ఇది చాలా ముఖ్యమైనది. ఒకప్పుడు ఇది దక్కించుకోవాలంటే ఎన్నో తిప్పలు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇంటి దగ్గర్లోని సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేస్తే అర్హతలన్నీ సమీక్షించి పదిరోజుల్లో మంజూరైన కార్డును వలంటీరే స్వయంగా ఇంటికే వచ్చి అంద జేస్తారు. అలా కార్డు అందుకున్న పలువురు ప్రభుత్వ పనితీరుపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, విజయవాడ: గతంలో తెల్ల రేషన్ కార్డు కావాలంటే ప్రభుత్వ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలాగా తిరగాలి. జన్మభూమి మీటింగ్‌లలో గంటలు తరబడి వేచి ఉండి.. దరఖాస్తు చేసుకోవాలి. అదృష్టం ఉంటే కార్డు వస్తుంది. అన్ని అర్హతలు ఉన్నా ఆ దరఖాస్తును ప్రక్కన పడేయవచ్చు. దీంతో తమకు కార్డులు ఇప్పించమంటూ పేదలు కార్పొరేటర్, ఎమ్మెల్యేల చుట్టూ కాళ్లు అరిగేలాగా తిరిగేవారు. పది రోజుల్లో బియ్యం కార్డు వై.ఎస్.జగన్ మెహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పేదల కష్టాలను అర్ధం చేసుకున్నారు. పేదలకు బియ్యం కార్డు ఇవ్వడం నిరంతరం ప్రక్రియగా చేపట్టేటట్లు చర్యలు తీసుకున్నారు. అర్హతలుంటే పది రోజుల్లో బియ్యం కార్డు జారీ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను జిల్లా పౌరసరఫరా అధికారులు తూచ తప్పకుండా పాటిస్తున్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి మోహన్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో పరిశీలించి అర్హత ఉంటే కార్డు జారీ చేస్తున్నారు. ఆరుదశల్లో దరఖాస్తు పరిశీలన కార్డుకు దరఖాస్తు చేయగానే కొత్త కార్డు జారీ చేస్తున్నారనుకుంటే పొరపాటే. వారికి ఆదాయ సర్టిఫికెట్ ఉందా? లేదా? ప్రభుత్యోద్యోగం ఏమైనా చేస్తున్నారా? విద్యుత్ వినియోగించే బిల్లు ఎంత వస్తోంది? భూమి ఎంత ఉంది? నాలుగు చక్రాల వాహనం ఉందా? సొంత ఇళ్లు ఉంటే ఎంత విస్తీర్ణంలో ఉంది? తదితర వివరాలన్నీ ఆయా శాఖల నుంచి తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. ఇవేమి లేని వారికి తెల్లకార్డు జారీ చేస్తున్నారు. ఆయా శాఖల నుంచి దరఖాస్తు దారుల సమాచారం శరవేగంగా తెప్పించుకుంటున్నారు. అనర్హులైతే వారి దరఖాస్తులను ప్రక్కన పెడుతున్నారు. అర్హులైతే కార్డులు జారీ చేసి వెంటనే వారి ఇళ్ల వద్దకు తీసుకువెళ్లి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. కార్డుదారుల్లో ఆనందం వలంటీర్లే తమ ఇళ్ల వద్దకు వచ్చి దరఖాస్తు చేయించడం. ఆ తరువాత విచారణ చేయడం, దరఖాస్తుల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఆయా శాఖలకు వెళ్లి వాటిని మార్చుకోమని సూచించడం చేస్తున్నారు. తమకు కార్డు వచ్చే వరకు వలంటీర్లు కృషి చేసి కార్డు ఇప్పించడం పట్ల పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేసినందుకు తమకు పూర్తి న్యాయం జరుగుతోందని వారంతా సంతోషిస్తున్నారు. కార్డు వస్తుందనుకోలేదు ‘వాంబే కాలనీకి చెందిన కర్రె జయలక్షి్మ, సుదర్శనరావు కుటుంబానికి బియ్యం కార్డు లేదు. కష్టపడి పనిచేసుకుని జీవిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కాళ్లు అరిగేలాగా తిరిగినా మంజూరు కాలేదు. ఈ విషయాన్ని గత నెల 24వ తేదీన తాము నివసించే వాంబే కాలనీలోని సచివాలయంలో తెలియచేసి దరఖాస్తు చేశారు. 1వ తేదీన వలంటీర్లు బియ్యం కార్డును ఇంటికి తెచ్చి ఇవ్వడంతో వారి ఆనందానికి అవథుల్లేవు. పది రోజుల్లో చేతికొచ్చింది! వాంబే కాలనీకి చెందిన చెందిన జ్యోతుల శాంతి, భర్త హంకాక్లను సమస్య ఇదే. బియ్యం కార్డు లేక ఇబ్బంది పడుతున్నారు. తమ ఇంటి కి వచ్చిన వలంటీర్లుకు ఈ విషయం చెప్పారు. ఆమె దరఖాస్తు చేయించి ఈ నెల 1వ తేదీన బియ్యం కార్డు వారి చేతికి అందింది -
కొత్త రేషన్ కార్డుల దిశగా కేంద్రం అడుగు
న్యూఢిల్లీ: ‘వన్ నేషన్–వన్ రేషన్ కార్డు’దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశమంతటా ఒకే రేషన్ కార్డు ఉండేలా కార్డులకు ఒక ప్రామాణిక ఆకృతిని నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే సమయంలో వీటిని ప్రామాణికంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రేషన్ కార్డులపై రెండు భాషలు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి. ఒకటి ప్రాంతీయ భాష కాగా.. మరొకటి హిందీ లేదా ఇంగ్లిష్ ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. -
కొత్తగా కార్డులొచ్చేనా?
(సాక్షి, నెట్వర్క్) : రేషన్‌కార్డు అనగానే.. సరుకులు తీసుకునే మాట ఏమోగాని స్థానికతకు, ఇతర అర్హతలకు ఇదే ప్రధానం. ఒకప్పుడు దీనిపై ఐదారు రకాల సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు ఒకటిరెండుతోనే సరిపెడుతున్నారు. ప్రస్తుతం బియ్యం తీసుకునేందుకు ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. తెలంగాణ జిల్లాల (హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు మినహా) నెలవారీ రేషన్ బియ్యం కోటా 1,52,128 మెట్రిక్ టన్నులు. 9 ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 71,51,150 రేషన్ కార్డులున్నాయి. ఇవికాక, అంత్యోదయ కార్డులు (నిరుపేదలకు నెలకు ఈ కార్డుపై 30 కిలోల వరకు బియ్యం ఇస్తారు) 4,71,125 కాగా, అన్నపూర్ణ కార్డులు (అనాథలు, నిరాదరణకు గురైన వారికి ఇచ్చే కార్డులు) 5,285. కొత్తగా రేషన్ కార్డుల కోసం 4,44,439 దరఖాస్తులొచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు మంజూరైనవి 1,62,591 మాత్రమే. మిగతావి వివిధ దశల్లో పరిశీలనలో ఉన్నాయి. రేషన్ కార్డు కోసం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. కొత్త రేషన్ దరఖాస్తులు ఎక్కువగా డీఎస్ఓ, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్థాయిల్లోనే ఆగిపోతున్నాయని సమాచారం. ప్రస్తుతం 2,81,848 మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. వీటిపై నెలవారీ రేషన్ సరుకులు తీసుకునే అవసరం కంటే, రేషన్ కార్డు స్థానికతకు, ఇతర అర్హతలకు ఆధారంగా నిలుస్తుందనే ఉద్దేశంతోనే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. -
నిలిచిన ఆహార భద్రత కార్డుల జారీ!
సాక్షి, మెదక్: కొత్తగా ఆహార భద్రత కార్డుల(ఎఫ్ఎస్సీ) జారీకి బ్రేక్ పడింది. దరఖాస్తు చేసుకున్న వేలాది మందికి సుమారు రెండు నెలలుగా ఎదురుచూపులే మిగిలాయి. సివిల్ సప్లయ్ కమిషనర్ ఇటీవల అన్ని జిల్లాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రస్తుతానికి కొత్త రేషన్ కార్డుల జారీని నిలిపివేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు దరఖాస్తుల పరిశీలనను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా కార్డులందక నిరుపేద కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎదురుచూపులే మిగిలాయి. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అర్జీలను రెండు నెలల క్రితం వరకు యుద్ధప్రాతిపదికన క్లియర్ చేసిన జిల్లా యంత్రాంగం ప్రస్తుతం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. దరఖాస్తుల పరిశీలనపై ఏ ఒక్క అధికారి దృష్టిసారించడం లేదు. ఆరోగ్యశ్రీ, కుటుంబ వార్షిక ఆదాయ నిర్ధారణ, సీఎం సహాయనిధి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఉపకార వేతనాల జారీలో ఆహార భద్రత కార్డులు ప్రామాణికంగా నిలుస్తాయి. ఈ క్రమంలో సివిల్ సప్లయ్ కమిషనర్ కొత్తగా ఆహార భద్రత కార్డులను జారీ చేయొద్దని ఆదేశించడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకటిన్నర నెలలుగా జిల్లాలో సుమారు వేలాదిగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. పలువురు నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నారు. పెండింగ్‌లో 2,658 దరఖాస్తులు ఆహారభద్రత కార్డుల జారీకి సంబంధించి అధికారులు మూడంచెలుగా పరిశీలన చేస్తున్నారు. వచ్చిన దరఖాస్తులను ముందుగా మండలాల వారీగా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు(ఆర్ఐ), ఆ తర్వాత ఎమ్మార్వో, అనంతరం జిల్లా స్థాయిలో డీసీఎస్ఓ పరిశీలించి రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌లోని కమిషనర్‌కు పంపుతారు. అక్కడ పరిశీలించి అప్రూవల్ ఇస్తే.. ఆహార భద్రత కార్డులు జారీ అవుతున్నాయి. ప్రస్తుతం జూన్ నెల నుంచి ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ మేరకు ఆర్ఐల వద్ద 1290, ఎమ్మార్వోల వద్ద 213, డీసీఎస్ఓ వద్ద 1,155.. మొత్తం 2,658 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మార్పు చేర్పుల అర్జీలు సైతం జిల్లాలో రేషన్ షాపులు 521 ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఆహార భద్రత కార్డులు 2,14,165 ఉండగా.. ఇందులో అంత్యోదయ కార్డులు 13018, అన్నపూర్ణ కార్డులు 88, ఎఫ్ఎస్సీ కార్డులు 2,01,059 ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అయితే ఇదివరకు ఆహార భద్రత కార్డులు జారీ అయి కుటుంబ సభ్యులను అందులో చేర్చాల్సి(మెంబర్ అడిషన్) ఉన్న వారికీ ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఇలాంటి మార్పుచేర్పుల దరఖాస్తులను కూడా మూడంచెలుగా పరిశీలన చేయాల్సి ఉండగా.. ప్రక్రియ నిలిచిపోయింది. మెంబర్ అడిషన్‌కు సంబంధించి ఆర్ఐల వద్ద 1,765, ఎమ్మార్వో వద్ద 555, డీసీఎస్ఓ వద్ద 2,104.. మొత్తం 4,424 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అర్ధాకలితో అలమటిస్తున్న నిరుపేదలు కొత్తగా ఆహార భద్రత కార్డుల జారీ నిలిచిపోవడంతో జిల్లాలో నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. జిల్లాలో మొత్తం 2,658 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. ఇందులో 20 శాతం మేర కుటుంబాలు పస్తులతో కాలం వెళ్లదీస్తున్నట్లు తెలుస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే కొత్త ఆహార భద్రత కార్డుల జారీకి ఆదేశాలు ఇవ్వాలని నిరుపేదలు కోరుతున్నారు. ఆదేశాలు రాగానే ప్రారంభిస్తాం రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ఆహార భద్రత కార్డుల జారీని నిలిపివేశాం. మళ్లీ మొదలు పెట్టాలని ఆదేశాలు వస్తే.. వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తాం. రెండు నెలల క్రితం వరకు ఎలాంటి దరఖాస్తులు పెండింగ్‌లో లేవు. ఒక్క మెదక్ జిల్లాలోనే క్లియర్‌గా ఉన్నాయి. ఇతర జిల్లాల్లో పది వేలు, అంతకు మించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. – సాధిక్, డీటీసీఎస్ -
నెలకు రెండు వేలు కొత్త రేషన్ కార్డులు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య నెలనెలకు పెరుగుతోంది. కొత్త కార్డుల మంజూరు, పాత కార్డుల్లో పేర్లను కలిపేందుకు ప్రభుత్వం అనుమతించడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. వీటిని పరిశీలిస్తున్న అధికారులు అర్హులకు కార్డులు మంజూరు చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో జిల్లా 8 వేలకు పైగా కొత్త కార్డులు మంజూరయ్యాయి. జనవరిలో జిల్లాలో 3,81,083 రేషన్ కార్డులు ఉండగా, ఇందులో 12,71,610 మంది లబ్ధిదారులకు రేషన్ అందించారు. అప్పుడు నెలకు 8 వేల మెట్రిక్ టన్నులుగా బియ్యం కోటా అవసరమఅయ్యేది. అయితే, ప్రస్తుతం మే నెల లో రేషన్ కార్డుల సంఖ్య 3,89,827కు చేరింది. 13,01,616 మంది లబ్ధిదారులకు రూ.1కి కిలో చొప్పున రేషన్ అందించడానికి జిల్లాకు 8,185 మెట్రిక్ టన్నుల బియ్యం కోటా అవసరం అవుతోంది. గత జనవరి నుంచి మే నెల వరకు 8,744 కొత్త రేషన్ కార్డులు మంజూరు కాగా, అదనం గా 185 మెట్రిక్ టన్నుల బియ్యం నెల వారీ కోటాలో పెరిగింది. ఈ లెక్కల ప్రకారం నెలకు రెండు వేల చొప్పున కొత్త రేషన్ కార్డులు పెరిగాయి. మరింత పెరగనున్న సంఖ్య అర్హులైన వారిందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు సివిల్ సప్లయి కమిషనర్ అకున్ సబర్వాల్ ప్రకటించారు. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం జిల్లాలో చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల కొత్త పేర్లను చేర్చేందు కు కూడా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో మూడు, నాలుగు నెల ల్లో జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య నాలుగు లక్షలకు చేరే అవకాశం కనిపిస్తోంది. అర్హులైన వారందరికీ మంజూరు.. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న అర్హులందరికీ నిబంధనల ప్రకారం మంజూరు చేస్తున్నాం. అంతకు ముందు మండలాల నుంచి తహసీల్దార్లు సమ్మతి తెలిపి డీఎస్వో కార్యాలయానికి ఆన్లైన్లో పంపుతారు. వాటిని మేము కూడా పరిశీలించి అర్హులని తేలితే మంజూరు చేస్తున్నాం. గడిచిన నాలుగు నెలల్లో 8 వేలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వీటి సంఖ్య ఇది వరకంటే బాగా పెరిగింది. – కృష్ణప్రసాద్, డీఎస్వో, నిజామాబాద్ -
కార్డులొచ్చేస్తున్నాయి
మోర్తాడ్(బాల్కొండ): కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల కోరిక త్వరలో నెరవేరనుంది. ఈ నెలాఖరుతో ఎన్నికల కోడ్ ముగిసి పోనుండగా వచ్చే నెల ఆరంభంతోనే కొత్త కార్డుల జారీకి పౌర సరఫరాల శాఖ శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆయా జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ మొదటి వారం నుంచే కొత్త కార్డులు ఇచ్చే అవకాశముంది. దీంతో జిల్లాలో రేషన్‌కార్డుల సంఖ్య పెరగనుంది. ఇప్పటికే జిల్లాలో 3,89,827 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా 7 వేల మంది కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుండడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముంది. పెండింగ్‌లో దరఖాస్తులు.. ముందస్తు శాసనసభ ఎన్నికలతో మొదలైన ఎన్నికల కోడ్.. పంచాయతీ, పార్లమెంట్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ వల్ల ఇంకా అమలులోనే ఉంది. దీంతో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ పడింది. గతంలోనే కొత్త రేషన్ కార్డుల జారీకి పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసినా, జిల్లాల పునర్విభజన వల్ల ఆ ప్రక్రియ నిలిచి పోయింది. రేషన్ వినియోగదారులకు సరుకులు అందుతున్నా కార్డులు మాత్రం అందలేదు. గతంలో జారీ అయిన రేషన్ కార్డులు మాత్రమే వినియోగదారుల వద్ద ఉన్నాయి. అలాగే, అర్హులైన వారందరికీ రేషన్ సరుకులను అందించాలని ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందే నిర్ణయించింది. అప్పటి నుంచే దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. కొంత మందికి రేషన్ మంజూరు కాగా, ఎన్నికల కోడ్ కారణంగా చాలా మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒకటో తేదీ నుంచే ప్రారంభం! అయితే, వరుస ఎన్నికల కారణంగా దరఖాస్తులకు మోక్షం లభించలేదు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వారికి రేషన్ కార్డులను జారీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పౌర సరఫరాల శాఖ వెబ్సైట్లో లాగిన్ అయిన వారం రోజుల్లో అర్హులైన వారికి రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. అంటే జూన్ ఒకటి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ కానున్నాయి. వారికి రూ.1కి కిలో బియ్యం, ఇతర రేషన్ సరుకులు అందనున్నాయి. అర్హులందరికీ రేషన్ కార్డులు.. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ అవుతాయి. ఎన్నికల కోడ్ ఎత్తివేసిన వెంటనే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి కొత్త కార్డులను జారీ చేస్తాం. అలాగే కొత్తగా వచ్చే దరకాస్తులను పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులు అందజేస్తాం. – కృష్ణప్రసాద్ -
కొత్త రేషన్ కార్డులు ఇస్తరట!
ఆదిలాబాద్‌అర్బన్: చౌకధరల దుకాణాల నుంచి ప్రభుత్వం అందజేసే బియ్యం తీసుకోవడానికి తప్ప.. సంక్షేమ పథకాల అమలుకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోకపోయినా.. ఆ కార్డులకు డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. కొత్త రేషన్ కార్డుల కోసం కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడుటమే ఇందుకు నిదర్శనం! దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జూన్ ఒకటో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ఏడు రోజుల్లో కొత్త కార్డులు అందజేయాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా, ప్రభుత్వం మొదటిసారిగా 2015–జనవరిలో ఆహార భద్రత కార్డులను అందజేసింది. అప్పుడు దరఖాస్తు చేసుకున్న చాలా మంది అర్హులకు ఎఫ్ఎస్సీ కార్డు అందలేదు. దీంతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. బియ్యం కోసం తాత్కాలిక కార్డు అందజేసినా.. శాశ్వత రేషన్ కార్డు ఇంత వరకూ ఇవ్వలేదు. గడిచిన ఐదేళ్లలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకొని కుటుంబంతో కాకుండా సెపరేట్‌గా ఉంటున్న వారు, ఇప్పటి వరకు కార్డు లేని వారు, గతంలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నా.. మంజూరుకాని వారు కొత్త కార్డులకు దరఖాస్తులు చేసుకొని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంకేం..ఇప్పుడు వీరందరికీ కొత్త కార్డులు అందనున్నాయన్న మాట! ఆదిలాబాద్‌అర్బన్: ఇప్పటిదాక 27,171 దరఖాస్తులు.. గతేడాది ఏప్రిల్–1 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. సుమారు పదమూడు నెలలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరగడంతో జిల్లాలోని 18 మండలాల పరిధిలో ఇప్పటి వరకు 27,171 దరఖాస్తులు వచ్చాయి. ‘మీ సేవ’ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించడంతో అధిక సంఖ్యలో తహసీల్దార్ లాగిన్‌కు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వ నిబంధనలు కూడా తోడవడంతో దరఖాస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. (ఉదాహరణకు.. ఒక కుటుంబంలో ఐదుగురికి కలిపి ఒక రేషన్ కార్డు ఉందనుకుందాం. ఆ కుటుంబంలో ఎవరైనా ఒకరు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారు.. అయితే ఆ రేషన్ కార్డులో ఉన్న సదరు కుటుంబ సభ్యులెవరూ ఐదేళ్ల వరకు ఎలాంటి లబ్ధి పొందరాదనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి.. దీంతో ఆ కుటుంబంలో పెళ్లి చేసుకున్న వారు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది.) కాగా, ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా ఆదిలాబాద్ అర్బన్‌లో 5,834 దరఖాస్తులు రాగా, అతితక్కువగా నార్నూర్ మండలంలో 437 దరఖాస్తులు వచ్చాయి. అయితే మీసేవ ద్వారా కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులపై ముందుగా ఆర్ఐ క్షేత్ర స్థాయి విచారణ జరుపుతారు. సదరు ఆర్ఐ అప్రూవల్ లభిస్తే.. తహసీల్దార్ లాగిన్‌కు చేరుతాయి. అక్కడ డీసీఎస్వో, డీసీఎస్వో నుంచి పౌర సరఫరాల కమిషనర్‌కు పంపుతారు. కమిషనర్ అమోదం లభిస్తే.. కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయి. పెండింగ్‌లో 7,039.. జిల్లాలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు మొత్తం 27,171 దరఖాస్తులు రాగా, అందులో 7,039 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మిగతా 20,132 దరఖాస్తులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వొచ్చని జిల్లా స్థాయి అధికారులు కమిషనర్ కార్యాలయానికి నివేదిక పంపించారు. ఇందులో ఇప్పటి వరకు కేవలం 1,027 దరఖాస్తులకు మాత్రమే అప్రూవల్ లభించగా, మిగతా వాటికి లభించలేదు. మరో 176 దరఖాస్తులను కమిషనర్ కార్యాలయం అధికారులు వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పెండింగ్‌లో ఉన్న 7,039 దరఖాస్తులను ఓసారి పరిశీలిస్తే.. రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయిలో విచారణ జరపాల్సినవి 6,136 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, తహసీల్దార్ల లాగిన్‌లో 546 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రెండు స్థాయిల నుంచి డీసీఎస్వో లాగిన్‌కు వచ్చిన మరో 357 దరఖాస్తులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. -
కొత్త కార్డులెప్పుడో!
నార్నూర్(ఆసిఫాబాద్): పేదలు రేషన్ షాపుల్లో సబ్సిడీపై నిత్యావసర సరుకులు తీసుకునేందుకు ప్రభుత్వం కొత్తగా రేషన్‌కార్డులు జారీ చేయడం లేదు. రేషన్‌కార్డుల కోసం అర్హులు మీసేవ కేంద్రాల్లో ఆన్లైన్ చేసుకొని నెలలు గడుస్తున్నా కార్డులు జారీ చేయకపోవడంతో ప్రతీనెల రేషన్ షాపుల నుంచి బియ్యం తీసుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లబ్ధిదారులు ప్రతీ నెల మీసేవ కేంద్రాలకు పరుగులు పెట్టి ఆహారభద్రత కార్డు జిరాక్స్ తీసుకువస్తేనే రేషన్ డీలర్లు సరుకులు ఇస్తున్నారు. జిల్లాలో 365 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రస్తుతం బీపీఎల్ కార్డులు 1,85,255 ఎఫ్ఎస్సీ కార్డులు 1,72,065 ఏఎఫ్ఎస్సీ కార్డులు 12,914 ఏఏపీ కార్డులు 570 కార్డులు ఉన్నాయి. రేషన్ షాపుల్లో ఈ–పాస్ విధానం అమలు చేయగా ప్రతీ లబ్ధిదారుడు తప్పనిసరిగా ఆహార భద్రత కార్డు ఉంటేనే దానిపై ఉన్న నంబర్‌ను ఈ–పాస్ మిషన్‌లో ఎంటర్ చేసి సదురు లబ్ధిదారుడి వేలిముద్ర వేస్తే గాని సరుకులు అందించే పరిస్థితి లేదు. ప్రభుత్వం గతంలో కొంతమందికి తాత్కాలికంగా ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసినా పూర్తిస్థాయిలో కార్డులు ఇవ్వకపోవడంతో ప్రతీ నెల లబ్ధిదారులు మీసేవ కేంద్రాలకు వెళ్లి ఆహార భద్రత కార్డుల జిరాక్స్ కాఫీలను తీసుకొచ్చి షాపుల్లో సరకులు తీసుకోనే దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులను పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు. 11,027 దరఖాస్తులు జిల్లాలో మొత్తం 365 రేషన్‌షాపుల పరిధిలో నూతన కార్డులు కోసం మీసేవ కేంద్రాల్లో 11,027 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ వద్ద 3,226, తహశీల్దార్ కార్యాలయాల్లో 290, డీఎస్వో కార్యాలయంలో 544 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా జిల్లా వ్యాప్తంగా 4,060 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కార్డుల కోసం దరఖాస్తులు చేసుకొని నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను జారీ చేయకపోవడంతో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులు తహశీల్ కార్యాలయంలోనే పెండింగ్‌లో ఉన్నాయి. నూతన రేషన్‌కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేస్తున్నామని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. అర్హులందరికీ అందిస్తాం ఆహారభద్రత కార్డుల జారీ కోసం లబ్ధిదారులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వానికి ఆ¯న్‌లైన్ ఆప్‌లోడ్ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి కార్డుల జారీ చేస్తే తప్పనిసరిగా అర్హులందరికీ జారీ చేస్తాం. – సుదర్శనం, డీఎస్వో ఆదిలాబాద్ -
‘ఆహార భద్రత’ అందేనా..!
ఆదిలాబాద్‌అర్బన్ : కొత్త రేషన్‌కార్డుల(ఆహార భద్రత)కు దరఖాస్తులు అధిక సంఖ్యలో వస్తున్నాయి. ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే వేల సంఖ్య లో దరఖాస్తులు స్వీకరించగా, చేర్పులు, మార్పు ల కోసం ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. కానీ అధికారులు నూతన రేషన్ కార్డుల మంజూరుపై దృష్టి సారించలేకపోతున్నారు. గత పక్షం రోజుల క్రితం ప్రారంభమైన రైతుబంధు పథకం ఆర్థిక సాయం చెక్కులను రైతులకు పంపిణీ చేయడంలో యంత్రాంగం బీజీగా ఉంది. జిల్లా స్థాయి అధికారులు మండల ప్రత్యేక అధికా రులుగా వ్యవహరిస్తుండగా, మండలాల్లోని తహసీల్దార్‌తోపాటు వీఆర్ఏ, వీఆర్వో, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పెట్టుబడి పథకంలో ప్రతి రోజు పాల్గొం టున్నారు. దీంతో నూతన రేషన్‌కార్డుల మంజూ రుకు వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో తమకు ఆహారభద్రత కార్డు ఎప్పుడు మంజూరు అవుతుందోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కొత్త కార్డులకు వెల్లువలా.. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం జిల్లాలో 2015లో ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. ఈ లెక్కన జిల్లాలో 1,81,926 ఆహార భద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. కార్డు మంజూరు చేయడమే కాకుండా రేషన్ కార్డుకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇది నిరంతర ప్రక్రియ అయినందున కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జిల్లాలో 2015 తర్వాత కూడా 1,425 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులు ప్రస్తుతం ఆయా మండలాల తహసీల్దార్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్లు కార్డులు పొందడం, ఒక్కో కుటుంబానికి రెండు, మూడు కార్డులు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం 2017 మే నెలలో కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకునే ఆన్లైన్ వెబ్‌సైట్‌ను నిలిపివేసింది. దీంతో గత రెండేళ్లుగా ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు మంజూరు కాలేదు. తాజాగా ప్రభుత్వం మళ్లీ ఆన్లైన్ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించింది. అర్హులైన లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. ఇవీ ప్రస్తుతం ఆయా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయిలో పెండింగ్... రేషన్‌కార్డులకు అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా అవి ప్రస్తుతం రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 4,941 దరఖాస్తులు రాగా, తహసీల్దార్ స్థాయిలో 8, డీఎస్వో స్థాయిలో 4 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా 4,929 దరఖాస్తులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయిలో పెండింగ్‌లో ఉండడం గమనార్హం. జిల్లాలోని 18 మండలాల్లో కొత్త రేషన్‌కార్డులకు ఏప్రిల్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆర్ఐ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పరిశీలించిన తర్వాత తహసీల్దార్ లాగిన్‌కు వస్తాయి. అక్కడి నుంచి డీఎస్వో లాగిన్లోకి వెళ్తాయి. డీఎస్వో పౌర సరఫరాల కమిషనర్ కార్యాలయానికి పంపితే అక్కడ ఆమోదం పొంది కొత్త కార్డులు జారీ అవుతాయి. కానీ గత పక్షం రోజులుగా రెవెన్యూ యంత్రాంగం పెట్టుబడి చెక్కుల పంపిణీలో బీజీగా ఉంది. దీంతో కొత్త రేషన్ కార్డులవైపు అధికారులు చూడడం లేదని తెలుస్తోంది. ఇందుకు కొంత సమయం పట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. పెరగనున్న కోటా... జిల్లాలో ప్రస్తుతం 1,81,926 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులకు ప్రతి నెల 4,015 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ అవుతున్నాయి. ప్రతి రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల పరిమితి లేకుండా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ అవుతున్నాయి. తాజాగా కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నందున రేషన్ కార్డుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. కొత్త కార్డులు మంజూరైతే జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతుంది. జిల్లాకు కేటాయించనున్న కోటా సైతం పెరిగే అవకగాశం ఉంది. ప్రస్తుతం స్వీకరిస్తున్న దరఖాస్తుల్లో ఎక్కువగా కార్డులో పేర్లు చేర్చాలని, సభ్యుల పేర్లను తొలగించాలని, ఆధార్ అనుసంధానం చేయాలనే దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. ఇంకొన్ని దరఖాస్తులు రేషన్‌కార్డు పేరు మార్పు కోసం రావడంతోపాటు కొత్త కార్డులకు సైతం వచ్చాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. -
ఏప్రిల్ 1నుంచి.. కొత్త రేషన్ కార్డులు
బాన్సువాడ టౌన్(బాన్సువాడ) : కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి పౌరసరఫరాల శాఖ తీపికబురు అందించింది. ఏప్రిల్ ఒకటో తేదీనుంచి రేషన్‌కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏడాదిగా ఎదురుచూపులు.. గతేడాది మే నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ నిలిపేశారు. ఈ–పాస్ విధానం అమల్లోకి వచ్చేంత వరకు కొత్త కార్డులు ఇవ్వడం, కార్డులో మార్పులు, చేర్పులు చేయకుండా చర్యలు తీసుకున్నారు. అప్పటికే జిల్లాలో 1,700 లకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ –పాస్ (ఎలక్ట్రానిక్ పోర్టల్ ఆక్సెస్ సర్వీసెస్) విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. ఈ విధానం అమల్లోకి రావడంతో రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్టపడింది. దీంతో డీలర్ల వద్ద మిగులు బియ్యం లెక్కలు బయటపడుతున్నాయి. ఈ పాస్ విజయవంతం కావడంతో కొత్త కార్డులు ఇవ్వాలని సివిల్ సప్లై అధికారులు నిర్ణయించారు. మీ సేవ కేంద్రాల్లో ఈ –పీడీఎస్ వెబ్సైట్ తిరిగి ప్రారంభించాలని డైరెక్టర్‌కు సూచించారు. ఈ వెబ్సైట్ వినియోగంలో రాగానే కొత్త దరఖాస్తులు స్వీకరిస్తారు. పాత పద్ధతిలోనే దరఖాస్తులు.. దరఖాస్తుల స్వీకరణ పాత పద్ధతిలోనే కొనసాగుతుంది. రేషన్ కార్డు కోరుకునే వారు ఆధార్ కార్డు తీసుకుని మీ సేవ కేంద్రాలకు వెళ్లాలి. ఈ పీడీఎస్ వెబ్సైట్లో వివరాలను నమోదు చేయాలి. మీ సేవ కేంద్రాల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు తహసీల్దార్ లాగిన్‌కు వెళ్తాయి. వాటిని తహసీల్దార్ పరిశీలించి విచారణ నిమిత్తం రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ రెవెన్యూ కార్యదర్శికి అప్పగిస్తారు. దరఖాస్తుదారుడి వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. ఈ దరఖాస్తులు తిరిగి తహసీల్దార్ లాగిన్‌కు వెళ్తాయి. తహసీల్దార్ ఆప్రూవ్ చేసిన దరఖాస్తులు సివిల్ సప్లై అధికారుల లాగిన్‌కు చేరుతాయి. డీఎస్వో ఆమోదంతో కొత్త కార్డులను మంజూరు చేస్తారు. అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలు ఇంకా రాలేదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. నేడు వీడియో కాన్ఫరెన్స్.. కొత్త రేషన్‌కార్డులకు సంబంధించి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాలని సివిల్ సప్లై అధికారులు నిర్ణయించారు. అయితే కొత్త కార్డులకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాల గురించి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించనున్నారు. కార్డుల జారీ విషయంలో అక్రమాలకు ఏ విధంగా అడ్డుకట్ట వేయాలనే దానిపైన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తారని భావిస్తున్నారు. రెండేళ్లుగా తిరుగుతున్నా మా బాబుకు రేషన్ బియ్యం వస్తున్నాయి. నాకు మాత్రం రావడం లేదు. రేషన్ దుకాణంలో అడిగితే కార్డులో నీ పేరు లేదు, అందుకే బియ్యం రావడం లేదు అంటున్నారు. కార్డులో పేరు చేర్చాలని రెండేళ్లుగా తహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. కార్డులో పేరు చేర్చాలి. – మోచి విజయ, బాన్సువాడ ఉత్తర్వులు వచ్చాయి... కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయాలని ఉన్నతాధికారులనుంచి ఉత్తర్వులు వచ్చాయి. అర్హులైనవారు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బుధవారం పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కార్డుల జారీపై మార్గదర్శకాలను తెలియజేయనున్నారు. – రమేశ్, డీఎస్వో, కామారెడ్డి -
ఊరట
సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. కొత్త రేషన్‌కార్డుల జారీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏడాదికాలంగా ఎదురు చూస్తున్న ఆహారభద్రతా కార్డులను పరిశీలించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 20,787 మందికి ఊరట కలుగనుంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ ఈ–పాస్ పద్ధతి ప్రవేశపెట్టింది. ఈ విధానం అమలులో అవరోధాలు రాకుండా కొత్త రేషన్‌కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం తీసుకునే నాటికి అంటే 2017 మే నెల వరకు 20,787 దరఖాస్తులు మీ–సేవ ద్వారా యంత్రాంగానికి చేరాయి. అప్పటి నుంచి కార్డుల కోసం వేచిచూస్తున్న అర్జీదారులకు ప్రభుత్వ తాజా నిర్ణయం ఆశలు రేకెత్తిస్తోంది. పెండింగ్‌లో ఉన్న అర్జీలను పరిశీలించి పక్షం రోజుల్లో ఆమోదముద్ర వేయాలని ఆదేశించింది. దరఖాస్తుదారు వ్యక్తిగత సమాచారం, బీపీఎల్ కుటుంబమా కాదా? ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా, వ్యవసాయ భూమి తదితర వివరాలతో కూడిన చెక్స్లిప్ను పంపింది. దీనికి అనుగుణంగా ధ్రువీకరిస్తే కొత్త కార్డులను జారీచేయాలని నిర్దేశించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకే తెల్ల రేషన్‌కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఆరోగ్యశ్రీ, రెండు పడక గదుల ఇల్లు, కల్యాణలక్ష్మి తదితర పథకాల అమలులో ఈ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్న కారణంగా ప్రతి వ్యక్తి ఆహారభద్రతాకార్డు కోసం దరఖాస్తు చేయడం అలవాటుగా మారింది. దీంతోనే ఇబ్బడిముబ్బడిగా అర్జీలు వచ్చాయని యంత్రాంగం అంటోంది. రేషన్‌కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయనే అభిప్రాయం తప్పని, కేవలం రేషన్ సరుకులు మాత్రమే ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేసినా పెద్దగా మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయని తెలుస్తోంది. కొత్తవాటి సంగతేంటి? గత ఏడాది మే వరకు పెండింగ్‌లో ఉన్న వాటికే మోక్షం కలిగించమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ తర్వాత వచ్చిన సుమారు 10వేల దరఖాస్తులపై ఎలాంటి స్పష్టతనివ్వకపోవడంతో ప్రజల్లో గందరగోళానికి తావిస్తోంది. పాత వాటిని పరిశీలించి.. కొత్త అర్జీలను పట్టించుకోకపోతే ప్రజాప్రతినిధులకు కూడా తలనొప్పిగా మారే అవకాశంలేకపోలేదు. యంత్రాంగం మాత్రం తొలుత పాత దరఖాస్తులను పరిష్కరించి.. ఆ తర్వాత తాజాగా వచ్చేవాటిపై దృష్టిసారించే వీలుందని అంటోంది. అర్హులకు ఆహారభద్రత పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తున్నాం. ఆన్లైన్లో నమోదైనవాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తాం. అర్జీదారుల సమాచారం సేకరించమని తహసీల్దార్లకు సూచనలు చేశాం. అక్కడి నుంచి రాగానే కార్డుల జారీకి చర్యలు తీసుకుంటాం. –గౌరీశంకర్, డీఎస్ఓ -
3,842 కొత్త రేషన్ కార్డులకు మంగళం
–ప్రజా సాధికార సర్వే ఆధారంగా తొలగింపు కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం ఇటీవల జిల్లాకు 87,302 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. ఇందులో వెంటనే 3,842 కార్డులను రిజెక్టు చేసింది. ఇచ్చినట్లే ఇచ్చి వెంటనే తొలగించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాసాధికార సర్వేను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సర్వే ప్రాతిపదికగా రేషన్ కార్డులకు ప్రభుత్వం మంగళం పలుకుతోంది. 5 ఎకరాలు పైబడి భూములు కలిగిన వారు, ఆస్తి పన్ను చెల్లించే వారు, కార్లు ఇతర నాలుగు చక్రాల వాహనాలు కలిగిన వారు, ఆధార్ తప్పులు, డూప్లికేట్ కార్డులను ప్రభుత్వం తొలగించింది. ఇవన్నీ ప్రజాసాధికార సర్వే ద్వారా వెలుగు చూశాయి. ప్రస్తుతానికి పరిమితంగా తొలగించినా రానున్న రోజుల్లో ప్రజాసాధికార సర్వే ఆధారంగా మరిన్ని కార్డులపై వేటు పడే అవకాశం ఉంది. అయితే వీటిపై మరోసారి విచారణ జరపాలని, వీరిలో దారిద్య్ర రేఖకు దిగువనున్న వారు ఉంటే రేషన్ కార్డులను పునరుద్ధరించాలని సూచించింది. జిల్లాకు ప్రభుత్వం 87వేల కార్డులు మంజూరు చేసినప్పటికీ ఇందులో కొత్త కార్డులు పరిమితంగానే ఉన్నాయి. ఉమ్మడి కుటుంబాలకు ఉన్న కార్డులను విభజించి వేరుగా కార్డులు మంజూరు చేశారు. కాకపోతే కొంతమేర యూనిట్ల సంఖ్య పెరిగింది. ఇంతవరకు ఎలాంటి కార్డుల్లేని కుటుంబాలకు పరిమితంగానే కార్డులు మంజూరు చేశారు. వీటిని కొత్తకార్డులుగా వ్యవహరిస్తారు. ఇందులోని 3,842 కార్డులు తొలగించడం పట్ల కొత్త కార్డుల సంఖ్య మరింత తగ్గిపోయింది. – ప్యాపిలి మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన మంజుల మల్లికార్జునకు ఇటీవల జేఏపీ 134805400032 నెంబర్ కార్డు కొత్తగా వచ్చింది. ఆయన ఆస్తి పన్ను కడుతున్నారనే ఉద్దేశంతో రేషన్ కార్డును రిజెక్టు చేశారు. -
8.44 లక్షల మందికి కొత్త రేషన్‌కార్డులు
కణేకల్లు : రాష్ట్ర వ్యాప్తంగా ‘జన్మభూమి- మా ఊరు’లో 8.44 లక్షల మంది పేదలకు కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. కణేకల్లు మండలం యర్రగుంటలో బుధవారం జరిగిన ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేషన్‌కార్డు రాని వారు ప్రస్తుత ‘జన్మభూమి’లో అర్జీలు ఇస్తే మంజూరు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటీ 35లక్షల మందికి చంద్రన్న సంక్రాంతి కానుకలిస్తున్నట్లు చెప్పారు. జూన్ నాటికి 24 లక్షల మందికి ‘దీపం’ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకమ కింద ఒక్కో గ్రూపునకు రూ.30వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా నేరుగా తమ సమస్యలు విన్నవించుకునేందుకు అర్జీలతో ఎదురుచూసిన ప్రజలకు నిరాశే ఎదురైంది. వచ్చిన వారికి అర్జీలు అధికారులకు ఇవ్వండంటూ మంత్రి వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, రాయదుర్గం మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రహాస్, వైస్ చైర్మన్ వన్నారెడ్డి, ఎంపీపీ షేక్ ఫాతిమాబీ, తహశీల్దార్ ఆర్.వెంకటేశు, ఎంపీడీఓ రెహనబేగం, సర్పంచుల సంఘం అధ్యక్షులు బసవరాజు, గుమ్మఘట్ట జెడ్పీటీసీ పూల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమానికి కత్తెర
సంక్షేమ పథకాల అమలుకు సిక్స్ పాయింట్ ఫార్ములా పక్కాగృహాలు, రేషన్ కార్డులు, పింఛన్లలో కోత సాక్షి, చిత్తూరు: సంక్షేమ పథకాల్లో కోత విధించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. నిబంధనల పేరుతో పేదలకడుపు కొట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులోభాగంగా సిక్స్‌పాయింట్ ఫార్ములాను తెరపైకి తెచ్చింది. ఇకనుంచి పేదలకు పక్కాగృహాలు మంజూరు కావాలంటే రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు తప్పనిసరి. గృహం కోరే వ్యక్తి నెలకు రూ.500 విద్యుత్ బిల్లు చెల్లిస్తుంటే అర్హులు కాదు. ఐదు ఎకరాల మాగాణి, పది ఎకరాల మెట్ట పొలం ఉండకూడదు. ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం, నాలుగు చక్రాల సొంతవాహనం ఉండకూడదు. తెల్లరేషన్ కార్డు ఉండి వరుసగా నాలుగు నెలల పాటు రేషన్ తెచ్చుకోకపోయినవారూ అనర్హులే. ఈ కొత్త నిబంధనలు ఇప్పటికే అమల్లోకొచ్చాయి. ఈ లెక్కన చాలామంది అర్హులకు పక్కా గృహాలు అందే పరిస్థితి లేదు. జిల్లాకు 15,250 పక్కా గృహాలు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అధికార పార్టీ నాయకులున్న జన్మభూమి కమిటీలు అర్హుల జాబితాలను ఇప్పటికే సిద్ధం చేశాయి. ఈ జాబితా జిల్లా ఇన్చార్జి మంత్రిద్వారా గృహ నిర్మాణ శాఖకు వెళుతుంది. ఆ తరువాత ఆధార్ ఆధారంగా సిక్స్ పాయింట్ ఫార్ములా మేరకు వివరాలను సేకరించి అర్హుల జాబితాలను ఖరారు చేస్తారు. కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరుకు సైతం సిక్స్‌పాయింట్ ఫార్ములాను అమలుచేయనున్నారు. ఇప్పటివరకూ జిల్లాలో తెల్ల రేషన్‌కార్డులు 10.83 లక్షలు ఉండగా పింఛన్లు పొందేవారు 3.92 లక్షల మంది ఉన్నారు. వారికి కూడా ఈ నిబంధనలు వర్తించనున్నాయి. దీంతో చాలామంది పేదలు సంక్షేమ పథకాలను కోల్పోనున్నారు. అర్హులందరికీ సంక్షేమపథకాలను అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కి వంచనకు పాల్పడడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త నిబంధనల వల్ల చాలా పేదలకు సంక్షేమ పథకాలు అందే పరిస్థితి లేదని జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
కొత్త రేషన్ కార్డులపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్
అనంతపురం: కొత్త రేషన్ కార్డులు, చంద్రన్న సంక్రాంతి కానుకలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోందని, వీటి పంపిణీపై జిల్లాలో ఏమైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ 18004256401కు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని అనంతపురం కలెక్టర్ కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కొత్త రేషన్ కార్డులు, చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీలో రేషన్ దుకాణం డీలర్లు ఏమైనా చేతివాటాన్ని ప్రదర్శిస్తే.. వారిపై సస్పెన్షన్ వేటు వేసి.. క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. -
చింపినా చిరగదు.. కాల్చినా కాలదు
- నవంబర్ 1 నుంచి కొత్త రేషన్‌కార్డులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డులను ఈ ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుంచి జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. గతంలో మాదిరి లామినేషన్‌తో కూడిన కార్డును కాకుండా ఈ ఏడాది యూవిక్ పేపర్‌తో చేసిన కార్డును లబ్ధిదారులకు అందజేయనుంది. లామినేషన్ కార్డుతో పోలీస్తే దీని ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని, వినియోగం సైతం సులభమని పౌర సరఫరాల శాఖ చెబుతోంది. పాతకార్డుల తయారీకి ఒక్కంటికీ రూ.14 మేర ఖర్చుకాగా, కొత్త కార్డు తయారీకి రూ.4 నుంచి రూ.5 మించదని అధికారులు చెబుతున్నారు. యూవిక్ పేపర్ చించినా చిరగదు. కాల్చినా కాలదు. నీటిలోనూ తడవదు. దీనిపై ఉన్న వివరాల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలన్నా సులభంగా చేసుకోవచ్చు. కేంద్ర ఆహార భద్రతాచట్టం, రాష్ట్ర పరిధిలోకి వచ్చే లబ్ధిదారులతోపాటు అంత్యోదమ కార్డులన్నీ గులాబీ రంగులోనే ఉండనున్నాయి. ఈ కార్డుల జారీకి ఇప్పటికే టెండర్లను సైతం శాఖాపరంగా పిలిచారు. ఈ ప్రక్రియంతా వచ్చే నెలాఖరులోగా పూర్తి చేసి నవంబర్ 1 నుంచి కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ స్పష్టం చేస్తోంది. -
బతుకు బరువు.. భద్రత కరువు
విజయనగరం కంటోన్మెంట్: కొత్త రేషన్ కార్డులు రాక, రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్ల చేర్పు జరగక సామాన్య, మధ్యతరగతి ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఆధార్, ఫొటోలు ఇచ్చినా అవి అప్లోడ్ కాక పోవడం వల్ల రేషన్ కార్డులుండీ సరుకులు అందక అధిక సంఖ్యలోని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరో పక్క కుటుంబ సభ్యుల నుంచి విడిపోయిన వారు, వివాహాలు జరిగి వేరే గ్రామాలకు వెళ్తున్నవారు కొత్త కార్డులకు దరఖాస్తులు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా వారికి రేషన్ కార్డులందడం లేదు. గిరిశిఖర ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాల వరకూ నచ్చిన విధంగా కార్డులు రద్దు చేయడంతో వినియోగ దారులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. జిల్లాలో 649576 తెల్ల రేషన్‌కార్డులున్నాయి. ఇందులో ఏఏవై కార్డులు 86,256 కాగా అన్నపూర్ణ కార్డులు 895 ఉన్నాయి. ఇవి కాకుండా ఏ విధమైన ప్రయోజనం లేకపోయినా 42,935 పింక్ రేషన్ కార్డులున్నాయి. ఏఏవై కార్డులకు ఒక్కో కార్డుకు కిలో రూపాయి చొప్పున 35 కిలోల బియ్యం ఇస్తారు. అన్నపూర్ణ కార్డులకు ఒక్కో కార్డుకు ఉచితంగా ప్రతి నెలా 10 కిలోల బియ్యం ఇస్తారు. జిల్లాలోని 15 ఎంఎల్ఎస్ పాయింట్లు(మండల లెవెల్ స్టాక్ పాయింట్లు),1388 రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు ఇస్తారు. ప్రతి నెలా రూ.కోటీ 83లక్షల 678 సబ్సిడీ భరించి సరుకులు అందిస్తున్నారు. పరిష్కారం కాని సమస్యలు అయితే ఈ ప్రయోజనాలు అందుకునేందుకు వినియోగదారులకు సవాలక్ష నిబంధనలు విధించినప్పటికీ వినియోగదారులు వాటిని సమర్పించుకుంటున్నారు. అయినా ఇంకా కార్డులు రద్దయి రేషన్ సరుకులు అందక ఇక్కట్లు పడుతున్నారు. ఒకే కుటుంబ సభ్యుడు ఉన్న వృద్ధులకు బయోమెట్రిక్ రావడం లేదు. ఇటువంటి వారి సమస్యలను పరిష్కరించడం లేదు. అలాగే రేషన్ కార్డుల్లో కొత్త కుటుంబ సభ్యుల పేర్ల కోసం గత కొన్ని సంవత్సరాలుగా 12,851 కుటుంబాలు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నాయి. అయితే ఈ కుటుంబాలకు సంబంధించి విచారణ చేసింది మాత్రం కేవలం 7099 కుటుంబాలను మాత్రమే! విచారణపూర్తయిన వారికి కూడా కొత్తగా రేషన్ కార్డుల్లో సభ్యుల పేర్లు చేర్చలేదు. అలాగే జిల్లాలో కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుని ఎదురు చూస్తున్నవారు 19629 కుటుంబాలున్నాయి. ఇవి కేవలం డీఎస్వో కార్యాలయంలో ఉన్న వివరాలు మాత్రమే. అరకొరగా సరుకులు వాస్తవానికి జన్మభూమి తదితర గ్రామ సభలతో పాటు వ్యక్తిగత దరఖాస్తులు అయితే దాదాపు 42వేలకు పైగా ఉన్నాయి. మరో పక్క వినియోగదారులకు బియ్యం, పంచదార, కిరోసిన్మాత్రమే ఇస్తున్నారు. పామాయిల్, కందిపప్పు, గోధుమ పిండి, గోధుమలు తదితర సరుకులు ఇవ్వడమే లేదు.ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారా అందే సరుకులపై ఆధార పడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నా పట్టించుకోవడం లేదు. -
ఎడతెగని నిరీక్షణ
కొత్త సర్కార్ వచ్చాక కొత్త రేషన్ కార్డులు, కొత్త దీపం గ్యాస్ కనెక్షన్లు వస్తాయని ఎంతోమంది ఆశపడ్డారు. కొత్త కార్డుల కోసం ఎంతో ఆశతో దరఖాస్తు చేశారు. నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా ఫలితం సున్నా. ఇప్పటివరకూ జిల్లాలో కొత్తగా ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో కూడా వారికి రేషన్ కార్డులు దక్కే అవకాశం లేకుండా పోయింది. మరోపక్క దీపం కనెక్షన్లు మంజూరైనా లబ్ధిదారుల జాబితాకు మోక్షం కలగడంలేదు. దీంతో వారికి ఎడతెగని నిరీక్షణ తప్పడంలేదు. - సాక్షి ప్రతినిధి, కాకినాడ సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో కొత్త రేషన్ కార్డులకోసం వేలాదిమంది దరఖాస్తు చేసుకుని నెలల తరబడి నిరీక్షిస్తున్నారు. వారిలో అర్హులను అధికారులు పక్కాగా గుర్తించి, ప్రతిపాదనలు పంపించినా.. ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకు లేదు. గత అక్టోబర్‌లో జరిగిన జన్మభూమిలోను, కలెక్టరేట్ గ్రీవెన్స్సెల్లోను జిల్లా నలుమూలల నుంచి రేషన్ కార్డుల కోసం 1,61,410 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై గ్రామస్థాయిలో పక్కాగా సర్వే చేసిన పౌర సరఫరాల అధికారులు 1,48,520 మంది కొత్త కార్డులకు అర్హులని తేల్చారు. 12,890 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. అర్హులుగా జిల్లా యంత్రాంగం గుర్తించిన వారంతా గత తొమ్మిది నెలలుగా కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఎటూ పాలుపోని అధికారులు రేపు మాపు అంటూ ఇంతకాలం వారికి చెబుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో బుధవారం నుంచి రెండో విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమం ప్రారంభమవుతోంది. కనీసం ఇందులోనైనా కార్డులు వస్తాయని అంతా ఆశించారు. ఇప్పుడు ఆ ఆశలు కూడా అడియాసలు అవుతున్నాయి. ఎందుకంటే ఈసారి జన్మభూమి కార్యక్రమంలో ప్రభుత్వం అసలు రేషన్‌కార్డుల ప్రస్తావనే తీసుకురాలేదు. దీంతో కొత్త కార్డులు వస్తాయని ఆశిస్తున్న వారంతా ప్రభుత్వ తీరుపై ఆవేదన చెందుతున్నారు. గాలిలో ‘దీపం’ దీపం గ్యాస్ కనెక్షన్ల మంజూరులోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. 2014-15 సంవత్సరానికిగానూ జిల్లాకు ప్రభుత్వం 29 వేల దీపం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది. వీటిని జిల్లాలోని 64 మండలాలకు 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన కేటాయించారు. కాకినాడ డివిజన్‌కు 6,301, రాజమండ్రి డివిజన్‌కు 5,518, రామచంద్రపురానికి 3,597, అమలాపురం డివిజన్‌కు 6,588, పెద్దాపురానికి 5,077, రంపచోడవరం డివిజన్‌కు 1,917 కనెక్షన్లను కేటాయించారు. ఇవి మంజూరై మూడు నెలలు దాటినా లబ్ధిదారుల జాబితాకు ఇంతవరకూ గ్రీన్‌సిగ్నల్ లభించలేదు. మండలాలవారీగా కేటాయించిన గ్యాస్ కనెక్షన్లకు లబ్ధిదారుల జాబితాను మండల స్థాయిలో తయారు చేసినప్పటికీ ఆన్లైన్లో పరిశీలన జరగాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 9,42,472 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో హెచ్‌పీ 6,63,846, ఇండేన్ 1,40,018, భారత్ గ్యాస్ 1,38,608 కనెక్షన్లు ఉన్నాయి. వీటికి అదనంగా ఒక్క గ్యాస్ కనెక్షన్‌కు కూడా ఆమోదం లభించకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఇక తెల్లకార్డులకు కత్తెర ...?
* ఏరివేతకు రంగం సిద్ధం * జనవరిలో కొత్త కార్డులు * రాజకీయ జోక్యం ఉంటే అర్హులకు అన్యాయం... విజయనగరం కంటోన్మెంట్: ఇక రేషన్‌కార్డుల కోత ప్రారంభం కానుంది. ఇటీవల ఆధార్, సమగ్ర విచారణ వంటి వంకతో వేలాది మంది నిరుపేద పింఛనర్లను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డులపై దృష్టి సారించింది. అర్హత లేని వారికి కూడా తెల్ల రేషన్ కార్డులున్నాయనే నెపంతో భారీగా తెల్ల రేషన్‌కార్డులను తగ్గించుకోనుంది. పింఛన్ల ఏరివేతకు అనుసరించిన విధానంలాగే సర్వే చేపట్టనున్నారు. ప్రస్తుతం అధికారుల బదిలీల పర్వం నడుస్తుండడంతో అది పూర్తయ్యాక అనర్హుల ఏరివేత కార్యక్రమాన్ని నిర్వహించి, జనవరిలో కొత్త కార్డులను ఇవ్వనున్నారనీ విశ్వసనీయ వర్గాల సమాచారం. డిసెంబర్లో సర్వే నిర్వహించి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జనవరిలో పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 7,05,592 రేషన్ కార్డులున్నాయి. ఇందులో 44,296 పింక్ రేషన్ కార్డులు కాగా, మిగతా 6,61,296 తెల్ల రేషన్ కార్డులు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న తెల్ల రేషన్ కార్డుదారుల్లో చాలా మంది అనర్హులున్నారని ప్రభుత్వం భావిస్తోంది. 10 నుంచి 30 ఎకరాల సాగు భూములున్నవారు, నెలకు రూ.20 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకూ లావాదేవీలు నిర్వహిస్తున్న వ్యాపారులు, వేలాది రూపాయల జీతాలు పొందుతున్న ప్రైవేటు ఉద్యోగులతో పాటు వేలాది మంది ధనిక వర్గీయులు తెల్ల రేషన్ కార్డులు పొందారని, వారందరికీ కార్డులు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుందని భోగట్టా! ఇప్పటికే గతంలో నిర్వహించిన రచ్చబండలోనూ, ప్రస్తుతం నిర్వహించిన జన్మభూమిలోనూ వేలాది మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా పెళ్లయిన వారు, త ల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారు దరఖాస్తు చేసుకున్నవారిలో ఉన్నారు. అసలు జిల్లాలో ఉన్న జనాభాకు, రేషన్ కార్డులకూ పొంతన లేకుండా ఉంది. జనాభాకూ, రేషన్ కార్డుల్లోని యూనిట్లతో(రేషన్ కార్డుల్లోని కుటుంబ సభ్యుల సంఖ్య) పోలిస్తే ఎక్కువగా ఉండడంతో అప్పట్లో యంత్రాంగం కలవరపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆధార్ అనుసంధానంతో దాదాపు 17వేల కార్డులు రద్దయ్యాయి. ఇంకా డీలర్ల వద్ద, ఇతర వ్యాపారుల వద్ద వేలాది కార్డులు బోగస్‌వి, తనఖా కార్డులు కూడా ఉన్నాయని అంటున్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా సాధ్యమా? జిల్లాలో కొత్త రేషన్ కార్డులకు తెర లేచినా, పాత కార్డులను రద్దు చేసినా రాజకీయ నాయకుల పైరవీలు, పెత్తనాలు తప్పవు. రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా ఉన్నవారి కార్డులను ఉంచేసి అనుకూలం కాని వారి కార్డులను రద్దు చేసే పరిస్థితులున్నాయి. ఇటీవల పింఛన్ల విషయంలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అదే జరిగే మళ్లీ పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. -
కొత్తకార్డులకు నేటినుంచి దరఖాస్తుల స్వీకరణ
నీలగిరి : కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లకు శుక్రవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని కలెక్టర్ టి.చిరంజీవులు చెప్పారు. కలెక్టరేట్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రద్దుచేసిన రేషన్‌కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులిస్తామని చెప్పారు. రేషన్‌కార్డులు, పింఛన్లకు గ్రామస్థాయిలో దరఖాస్తు చేసుకోవాలని, పథకాలకు ఎంపిక చేసిన వారి వివరాలను గ్రామ పంచాయతీల్లో నోటీస్‌బోర్డు మీద ప్రకటిస్తామన్నారు. ఈ అంశాలకు సం బంధించి ఎలాంటి సమస్య ఎదురైనా టోల్‌ఫ్రీ నంబర్ 18004251442కు ఫోన్ చేయాలన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి నియోజకవర్గానికో ఫ్ల్లయింగ్ స్క్వాడ్‌ను నియమిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం పేరిట కొత్త రేషన్‌కార్డులను కూడా నవంబర్‌లో ముద్రించి ఇస్తామన్నారు. పెంచిన కొత్త పింఛన్లు కూడా నవంబర్ 1వ తేదీ నుంచే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. ఫాస్ట్ పథకం ద్వారా లబ్ధి పొందాలని అనుకునే విద్యార్థులు మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నుంచి ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించిన పిదప అర్హులైన వారికి నవంబర్ 1 నుంచి కొత్త సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. సమావేశంలో జేసీ ప్రీతిమీనా, అదనపు జేసీ వెంకట్రావ్, డీఎస్ఓ నాగేశ్వరరావు, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, ఏఓ రాజు పాల్గొన్నారు. -
బోగస్ కార్డులు రెండు లక్షలు..!
సెప్టెంబర్ 15 డెడ్‌లైన్ - ఇప్పటికి ఏరేసిన కార్డులు 65,115 - 39,350 కార్డులకు సరుకులు నిలిపివేత - దసరాకు కొత్త కార్డులు! ముకరంపుర : బోగస్ తెల్లరేషన్‌కార్డులకు కాలం చెల్లనుంది. కార్డుల ఏరివేతకు ఈ నెల 15ను అధికారులు డెడ్‌లైన్ విధించారు. ఇప్పటికే జిల్లాలో 65,115 కార్డులు బోగస్‌గా గుర్తించి రద్దు చేశారు. ఆధారాలు సమర్పించని, 39,350 రచ్చబండ కార్డుదారులను సరుకులు నిలిపివేశారు. మిగతా బోగస్‌కార్డులను ఈ పది రోజుల్లో ఏరివేయాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని పౌరసరఫరాలశాఖ కమిషనర్ ఆదేశించారు. జిల్లాలో 9,76,022 కుటుంబాలుండగా.. 10,86,427 కార్డులున్నాయి. కుటుంబాలకంటే 1.11 లక్షల కార్డులు ఎక్కువగా ఉన్నాయి. రచ్చబండ-3లోనూ పలువురికి కార్డులిచ్చారు. అధికారుల సూచనతో కొందరు డీలర్లు, బోగస్ లబ్ధిదారులు తమవద్ద ఉన్న కార్డులు స్వచ్ఛందంగా అప్పగించారు. బోగస్‌ల గుర్తింపుపై అధికారులూ దూకుడుగానే వ్యవహరిస్తూ ఇప్పటివరకు 65,115 బోగస్ కార్డులను రద్దు చేశారు. రచ్చబండ-3లో 86,350 మందికి తెల్లకార్డులిచ్చిన ప్రభుత్వం అందులోనే చాలావరకు బోగస్‌వి ఉన్నాయని గుర్తించింది. పూర్తి సమచారమివ్వాలని కార్డుదారులను ఆదేశించింది. ఫొటోలు, ఆధార్‌నంబర్లు సమర్పించని వారు బోగస్‌కార్డుదారులేనని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వివరాలను సమర్పించని 39,350 మంది రచ్చబండ కార్డుదారులకు ప్రభుత్వం ఈనెల కోటా సరుకులు నిలిపివేసింది. ఈ లెక్కన ఇప్పటివరకు మొత్తం 1,04,465 కార్డులు బోగస్విగా తేలాయి. గడువు ముగిసేలోపు మరో లక్ష వరకు బోగస్‌కార్డులు గుర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దసరాకు కొత్తకార్డులు లబ్ధిదారులందరికీ తెలంగాణ ప్రభుత్వ ముద్రతో దసరా, దీపావళి పండుగల వరకు కొత్తరేషన్‌కార్డులు అందించడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ అంశాన్ని రాష్ట్రస్థాయిలో ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీ పరిశీలిస్తోంది. 15లోపు బోగస్‌కార్డుల ఏరివేత పూర్తిచేసి అనంతరం గ్రామసభలు నిర్వహించి, కొత్తగా దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరించి అర్హులను గుర్తించే ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం. 15లోగా బోగస్‌కార్డులు తొలగించాలి ఈ నెల 15లోగా బోగస్ రేషన్‌కార్డులను గుర్తించి తొలగించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.పార్థసారథి తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఆర్డీవోలు, తహశీల్దార్లతో బోగస్ రేషన్‌కార్డుల ఏరివేతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 లక్షలకు పైగా బోగస్ రేషన్‌కార్డులు తొలగించినట్లు తెలిపారు. రచ్చబండ-3 లో ఇచ్చిన కార్డుల్లో ఆధార్ అనుసంధానం చేయని వాటిని పరిశీలించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.