మన ముఖం చూడాలంటే అద్దం చూసుకోవాలి.. కానీ వేరొకరి మనసు చూడాలంటే అర్థం చేసుకోవాలి.. అలాంటి అర్థం చేసుకోగలిగే పాలకులు ఉంటే పేదవాడికి ఆకలిదప్పికలు ఉండవు. వారి కష్టాల్లో నేతలు భాగస్వాముల వుతారు. వారికి కావాల్సినవన్నీ వేళకు సమకూర్చుతారు. ప్రధానమైనవన్నీ అమర్చుతారు. అలాంటి వాటిల్లో ఒకటి బియ్యం కార్డులు. పేదవాడికి ఇది చాలా ముఖ్యమైనది. ఒకప్పుడు ఇది దక్కించుకోవాలంటే ఎన్నో తిప్పలు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇంటి దగ్గర్లోని సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేస్తే అర్హతలన్నీ సమీక్షించి పదిరోజుల్లో మంజూరైన కార్డును వలంటీరే స్వయంగా ఇంటికే వచ్చి అంద జేస్తారు. అలా కార్డు అందుకున్న పలువురు ప్రభుత్వ పనితీరుపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, విజయవాడ: గతంలో తెల్ల రేషన్ కార్డు కావాలంటే ప్రభుత్వ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలాగా తిరగాలి. జన్మభూమి మీటింగ్‌లలో గంటలు తరబడి వేచి ఉండి.. దరఖాస్తు చేసుకోవాలి. అదృష్టం ఉంటే కార్డు వస్తుంది. అన్ని అర్హతలు ఉన్నా ఆ దరఖాస్తును ప్రక్కన పడేయవచ్చు. దీంతో తమకు కార్డులు ఇప్పించమంటూ పేదలు కార్పొరేటర్, ఎమ్మెల్యేల చుట్టూ కాళ్లు అరిగేలాగా తిరిగేవారు.
పది రోజుల్లో బియ్యం కార్డు
వై.ఎస్.జగన్ మెహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పేదల కష్టాలను అర్ధం చేసుకున్నారు. పేదలకు బియ్యం కార్డు ఇవ్వడం నిరంతరం ప్రక్రియగా చేపట్టేటట్లు చర్యలు తీసుకున్నారు. అర్హతలుంటే పది రోజుల్లో బియ్యం కార్డు జారీ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను జిల్లా పౌరసరఫరా అధికారులు తూచ తప్పకుండా పాటిస్తున్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి మోహన్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో పరిశీలించి అర్హత ఉంటే కార్డు జారీ చేస్తున్నారు.
ఆరుదశల్లో దరఖాస్తు పరిశీలన
కార్డుకు దరఖాస్తు చేయగానే కొత్త కార్డు జారీ చేస్తున్నారనుకుంటే పొరపాటే. వారికి ఆదాయ సర్టిఫికెట్ ఉందా? లేదా? ప్రభుత్యోద్యోగం ఏమైనా చేస్తున్నారా? విద్యుత్ వినియోగించే బిల్లు ఎంత వస్తోంది? భూమి ఎంత ఉంది? నాలుగు చక్రాల వాహనం ఉందా? సొంత ఇళ్లు ఉంటే ఎంత విస్తీర్ణంలో ఉంది? తదితర వివరాలన్నీ ఆయా శాఖల నుంచి తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. ఇవేమి లేని వారికి తెల్లకార్డు జారీ చేస్తున్నారు. ఆయా శాఖల నుంచి దరఖాస్తు దారుల సమాచారం శరవేగంగా తెప్పించుకుంటున్నారు. అనర్హులైతే వారి దరఖాస్తులను ప్రక్కన పెడుతున్నారు. అర్హులైతే కార్డులు జారీ చేసి వెంటనే వారి ఇళ్ల వద్దకు తీసుకువెళ్లి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు.
కార్డుదారుల్లో ఆనందం
వలంటీర్లే తమ ఇళ్ల వద్దకు వచ్చి దరఖాస్తు చేయించడం. ఆ తరువాత విచారణ చేయడం, దరఖాస్తుల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఆయా శాఖలకు వెళ్లి వాటిని మార్చుకోమని సూచించడం చేస్తున్నారు. తమకు కార్డు వచ్చే వరకు వలంటీర్లు కృషి చేసి కార్డు ఇప్పించడం పట్ల పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేసినందుకు తమకు పూర్తి న్యాయం జరుగుతోందని వారంతా సంతోషిస్తున్నారు.
కార్డు వస్తుందనుకోలేదు
‘వాంబే కాలనీకి చెందిన కర్రె జయలక్షి్మ, సుదర్శనరావు కుటుంబానికి బియ్యం కార్డు లేదు. కష్టపడి పనిచేసుకుని జీవిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కాళ్లు అరిగేలాగా తిరిగినా మంజూరు కాలేదు. ఈ విషయాన్ని గత నెల 24వ తేదీన తాము నివసించే వాంబే కాలనీలోని సచివాలయంలో తెలియచేసి దరఖాస్తు చేశారు. 1వ తేదీన వలంటీర్లు బియ్యం కార్డును ఇంటికి తెచ్చి ఇవ్వడంతో వారి ఆనందానికి అవథుల్లేవు.
పది రోజుల్లో చేతికొచ్చింది!
వాంబే కాలనీకి చెందిన చెందిన జ్యోతుల శాంతి, భర్త హంకాక్‌లను సమస్య ఇదే. బియ్యం కార్డు లేక ఇబ్బంది పడుతున్నారు. తమ ఇంటి కి వచ్చిన వలంటీర్లుకు ఈ విషయం చెప్పారు. ఆమె దరఖాస్తు చేయించి ఈ నెల 1వ తేదీన బియ్యం కార్డు వారి చేతికి అందింది
Comments
Please login to add a commentAdd a comment