జగనే ఎందుకంటే..  | Why AP Needs Jagan Campaign Starts From 9th November 2023, Know Complete Details And Schedule Inside - Sakshi
Sakshi News home page

Why AP Needs Jagan Campaign: జగనే ఎందుకంటే.. 

Published Thu, Nov 9 2023 4:07 AM | Last Updated on Thu, Nov 9 2023 10:23 AM

Why AP Needs Jagan campaign Starts From 9th November 2023 - Sakshi

సాక్షి, అమరావతి: చరిత్ర పుటలు ఎరుగని విప్ల­వాత్మక పాలనతో నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ, ప్రతి పౌరుడికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా చేకూర్చిన మేలును వివరిస్తూ రూపొందించిన భారీ కార్యక్రమం ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ (ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే..) గురువారం నుంచి ప్రారంభం కానుంది. పరిపాలనా సంస్కర­ణలు, వినూత్న కార్యక్రమాల ద్వారా దేశమంతా ప్రశంసించేలా మన రాష్ట్రం సాధించిన పురోభివృద్ధిని అందరికీ క్షుణ్నంగా తెలియ­జెప్పేలా దీనికి రూపకల్పన చేశారు. 

మండలం ప్రాతిపదికన ప్రతి మండలంలో రోజు­కొక సచివాలయం పరిధిలో ఈ ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 711 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వేడుకగా ప్రారంభం కానుంది. గ్రామాలు, పట్టణాలు, నగరాలలో ఏయే పథకాల ద్వారా ఎంత మంది లబ్ధి పొందారనే వివరాలతో ఆయా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద సంక్షేమ అభివృద్ధి బోర్డులను ఆవిష్కరిస్తారు. ప్రతి రోజు సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్య ఆయా సచివాలయాల పరిధిలో దీన్ని నిర్వహిస్తారు.

స్థానిక ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో చేపట్టే ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఇతర ప్రముఖలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. గృహ సారథులు, పార్టీ సానుభూతిపరులు, సీఎం వైఎస్‌ జగన్‌ అభిమానులు ఇందులో పాల్గొంటారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా జరిగిన ప్రగతి, సాకారమైన మార్పులను తెలియచేయడంతోపాటు గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తారు. సచివాలయ పరిధిలోని ప్రతి ఒక్కరినీ భాగస్వాములను ఈ కార్యక్రమంలో చేసేలా ఒక రోజు ముందే వివరాలను ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తారు.

ఆ తర్వాత రోజు నుంచి వలంటీర్లు వారి పరిధిలో రోజుకు 15 ఇళ్ల చొప్పున సందర్శించి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక కొత్తగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి చెప్పడంతో పాటు ఆయా కుటుంబాలకు ఎలాంటి లబ్ధి చేకూరింది? ఆ గ్రామానికి ఎంత మేలు జరిగింది? అనే వివరాలను సమగ్రంగా వెల్లడిస్తారు.

ఒక్కో గ్రామ సచివాలయం పరిధిలో ఐదు రోజుల పాటు, వార్డు సచివాలయం పరిధిలో దాదాపు ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సచివాలయాల వారీగా  ఏర్పాటు చేసే సంక్షేమ, అభివృద్ధి బోర్డులను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇప్పటికే ఆయా ప్రాంతాలకు చేరవేసింది. 

షెడ్యూల్‌ వివరాలతో సచివాలయాలకు సమాచారం..
రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు గురువారం 711 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో కలిపి మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా మండలాల ప్రాతిపదికన రోజుకొక సచివాలయం పరిధిలో కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. నగరాలు, పెద్ద పట్టణాల్లో సులభంగా కొనసాగించేలా చిన్న ప్రాంతాలుగా వర్గీకరించారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో కలిపి మొత్తం దాదాపు 900 మండలాల ప్రాతిపదికన కార్యక్రమం అమలుకు కార్యాచరణ సిద్ధం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈవోపీఆర్‌డీ, పట్టణ ప్రాంతాల్లో అడిషనల్‌ కమిషనర్లు దీనికి నోడల్‌ ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారు. ఈ నెల 23వతేదీ వరకు 7,610 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఏ రోజు, ఎక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే వివరాలతో ఇప్పటికే షెడ్యూల్‌ రూపొందించి కలెక్టర్ల ద్వారా ఆయా సచివాలయాలకు సమాచారం అందించినట్లు అధికారులు వెల్లడించారు.

మిగతా సచివాలయాలకు కూడా త్వరలో షెడ్యూల్‌ ఖరారు కానుంది. సచివాలయాల పరిధిలో ‘సంక్షేమ, అభివృద్ధి బోర్డు’ ఆవిష్కరణ కార్యక్రమం పూర్తయిన వెంటనే ఎవరెవరు దీనికి హాజరయ్యారనే వివరాలతోపాటు ఫోటోను ఆయా మండల ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు ప్రత్యేక వెబ్‌పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 

24 పేజీలతో ప్రత్యేక బుక్‌లెట్లు
వై ఏపీ నీడ్స్‌ జగన్‌ (ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే..) పేరుతో నిర్వహించనున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా 24 పేజీలతో కూడిన ప్రత్యేక బుక్‌లెట్లను రూపొందించారు. వలంటీర్లు ఇంటింటి సందర్శనకు వెళ్లిన సమయంలో వీటిని ప్రతి నివాసంలోనూ పంపిణీ చేస్తారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రజలకు ప్రభుత్వ సేవలను గడప వద్దే అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయాలు – వలంటీర్లు వ్యవస్థను నెలకొల్పిన విషయం తెలిసిందే.

పునర్విభజనతో 26 జిల్లాల ఏర్పాటు, వివక్షకు తావులేకుండా సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాల అమలు, నవరత్నాల పథకాల ద్వారా ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాల కల్పన, సామాజిక న్యాయం నినాదంతో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు సముచిత స్థానం,  మహిళా సాధికారితకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరిస్తూ సీఎం జగన్‌ తనదైన ముద్రతో చేపట్టిన పాలనా సంస్కరణలతో ప్రత్యేకంగా బుక్‌లెట్‌ను రూపొందించారు.అభివృద్ధిపై జాతిపిత గాంధీజీ మొదలు రాజ్యాంగ రూపకర్త బీఆర్‌ అంబేడ్కర్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం, నోబెల్‌ గ్రహీతలు ఆమర్త్యసేన్, అభిజిత్‌ బెనర్జీ, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తదితరుల నిర్వచనాలను బుక్‌లెట్‌లో ప్రత్యేకంగా ప్రచురించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవితాల్లో చోటు చేసుకున్న మార్పులు, తలసరి ఆదాయం, జీఎస్‌డీపీ పెరుగుదల, పారిశ్రామిక వృద్ధి రేటు, పరిశ్రమల ఏర్పాటు, ఎంఎస్‌ఎంఈల ద్వారా కొత్తగా ఉద్యోగాల కల్పన, సమగ్ర భూ సర్వే, రైతు భరోసా, ఇతర కార్యక్రమాల ద్వారా అన్నదాతలకు అందిస్తున్న తోడ్పాటు, వ్యవసాయ వృద్ధి రేటులో పెరుగుదల, అమ్మ ఒడి, నాడు – నేడు ద్వారా మారిపోయిన ప్రభుత్వ స్కూళ్ల స్వరూపం, ఆరోగ్య ఆసరా, ఫ్యామిలీ డాక్టర్‌ లాంటి వినూత్న కార్యక్రమాలతో పాటు వైద్య రంగంలో భారీ మౌలిక వసతుల కల్పనతో పేదలకు సులభంగా అందుతున్న వైద్య సేవలు, పింఛన్లు, సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో చోటు చేసుకున్న మార్పులు, దిశ యాప్, పొదుపు సంఘాలకు ప్రోత్సాహం, మహిళా సాధికారిత కోసం చేపట్టిన చర్యలు, రాష్ట్రంలో కొత్తగా పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం, పేదలందరికీ ఇళ్లు, మౌలిక వసతుల కల్పన లాంటి వివరాలను బుక్‌లెట్‌లో పొందుపరిచారు.

మొత్తంగా వివిధ కార్యక్రమాల ద్వారా నాలుగున్నరేళ్లలో ప్రతి ఒక్కరికీ చేకూరిన లబ్ధి, గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ప్రజలకు జరిగిన మేలును సోదాహరణంగా వివరిస్తూ బుక్‌లెట్‌ రూపుదిద్దుకుంది. పేదల జీవితాలు బాగు పడేవరకు ఈ కార్యక్రమాలు కొనసాగాలన్న ముఖ్యమంత్రి జగన్‌ ఆకాంక్షను బుక్‌లెట్‌లో ప్రత్యేకంగా ఉదహరించారు. 

వలంటీర్లు రోజుకు 15 ఇళ్ల సందర్శన
నాలుగున్నరేళ్లలో ప్రతి గడపకూ జరిగిన మంచిని వలంటీర్లు ఇంటింటి సందర్శన సమయంలో ఆయా కుటుంబ సభ్యులందరికీ సమగ్రంగా తెలియజెప్పేలా రోజుకు 15 ఇళ్ల చొప్పున మాత్రమే సందర్శించేలా ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా సచివాలయం పరిధిలో ఎంత ప్రయోజనం పొందుతున్నారో వలంటీర్లు ప్రతి కుటుంబానికి తెలియజేస్తారు. ఒకవేళ ఎవరికైనా ఏమైనా అందకుంటే సత్వరమే వారికి అందించి ప్రయోజనం చేకూర్చేలా చర్యలు చేపడతారు.

గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో నాడు – నేడు ద్వారా సాకారమైన మార్పులను వివరిస్తారు. ఇంగ్లీషు మీడియం, స్కూళ్లలో 6వ తరగతి నుంచే ఐఎఫ్‌ఫీ ప్యానెళ్లు, 8వ తరగతిలో ట్యాబ్‌లు పంపిణీ వరకూ మారిపోయిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ గురించి తెలియచేస్తారు. వైద్య రంగంలో విలేజ్‌ క్లినిక్స్‌తో సహా గ్రామంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, ఆర్బీకేలు లాంటి వ్యవస్థతో వ్యవసాయ రంగంలో మునుపెన్నడూ చూడని మార్పుల గురించి ప్రతి ఇంటికీ వివరిస్తారు. పథకాల అమలులో పూర్తి పారదర్శకత, సోషల్‌ ఆడిట్‌తో ప్రజలకు అందుతున్న నాణ్యమైన సేవల తీరును వివరిస్తారు.

దిశ యాప్, ప్రభుత్వ పరిపాలనలో వచ్చిన విప్లవాత్మక మార్పులు గురించి వలంటీర్లు తెలియచేస్తారు. ఆర్థిక ప్రగతిలో గతంలో ఎలా ఉన్నాం? ఇప్పుడు ఎలా ఉన్నాం? అన్న అంశాలను ప్రతి ఇంటికీ చాటి చెబుతారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? గడప గడపకూ మన ప్రభుత్వం సమయంలో ప్రజల నుంచి అందిన వినతుల పరిష్కారం కోసం చేసిన వ్యయం వివరాలను వలంటీర్లు ఇంటింటికీ వివరించి చెప్పనున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement