మోర్తాడ్(బాల్కొండ): కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల కోరిక త్వరలో నెరవేరనుంది. ఈ నెలాఖరుతో ఎన్నికల కోడ్ ముగిసి పోనుండగా వచ్చే నెల ఆరంభంతోనే కొత్త కార్డుల జారీకి పౌర సరఫరాల శాఖ శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆయా జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ మొదటి వారం నుంచే కొత్త కార్డులు ఇచ్చే అవకాశముంది. దీంతో జిల్లాలో రేషన్‌కార్డుల సంఖ్య పెరగనుంది. ఇప్పటికే జిల్లాలో 3,89,827 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా 7 వేల మంది కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుండడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముంది.
పెండింగ్‌లో దరఖాస్తులు..
ముందస్తు శాసనసభ ఎన్నికలతో మొదలైన ఎన్నికల కోడ్.. పంచాయతీ, పార్లమెంట్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ వల్ల ఇంకా అమలులోనే ఉంది. దీంతో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ పడింది. గతంలోనే కొత్త రేషన్ కార్డుల జారీకి పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసినా, జిల్లాల పునర్విభజన వల్ల ఆ ప్రక్రియ నిలిచి పోయింది. రేషన్ వినియోగదారులకు సరుకులు అందుతున్నా కార్డులు మాత్రం అందలేదు. గతంలో జారీ అయిన రేషన్ కార్డులు మాత్రమే వినియోగదారుల వద్ద ఉన్నాయి. అలాగే, అర్హులైన వారందరికీ రేషన్ సరుకులను అందించాలని ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందే నిర్ణయించింది. అప్పటి నుంచే దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. కొంత మందికి రేషన్ మంజూరు కాగా, ఎన్నికల కోడ్ కారణంగా చాలా మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఒకటో తేదీ నుంచే ప్రారంభం!
అయితే, వరుస ఎన్నికల కారణంగా దరఖాస్తులకు మోక్షం లభించలేదు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వారికి రేషన్ కార్డులను జారీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. పౌర సరఫరాల శాఖ వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన వారం రోజుల్లో అర్హులైన వారికి రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. అంటే జూన్ ఒకటి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ కానున్నాయి. వారికి రూ.1కి కిలో బియ్యం, ఇతర రేషన్ సరుకులు అందనున్నాయి.
అర్హులందరికీ రేషన్ కార్డులు..
అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ అవుతాయి. ఎన్నికల కోడ్ ఎత్తివేసిన వెంటనే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి కొత్త కార్డులను జారీ చేస్తాం. అలాగే కొత్తగా వచ్చే దరకాస్తులను పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులు అందజేస్తాం. – కృష్ణప్రసాద్
కార్డులొచ్చేస్తున్నాయి
Published Fri, May 10 2019 9:32 AM | Last Updated on Fri, May 10 2019 9:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment