మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కులగణన సర్వే ఆధారంగానే రేషన్‌కార్డులు లేని కుటుంబాలను గుర్తించి అర్హులకు కొత్త ఆహారభద్రత (రేషన్) కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 26 నుంచి అర్హులకు కొత్త రేషన్ కా ర్డులు అందజేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. రేషన్‌కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనున్నట్టు తెలిపింది.
విధి విధానాలు ఇవే..
కులగణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్‌కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీవో, మునిసిపాలిటీలలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)/ డీసీఎస్‌ఓ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శించి, చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదిస్తారు.
గ్రామసభ, వార్డు సభల్లో ఆమోదించిన లబ్ధిదారుల అర్హత జాబితాను మండల, మునిసిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్‌లో నమోదు చేసి జిల్లా కలెక్టర్ , జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లకు పంపాలి. వాటిని పరిశీలించి సంతృప్తి చెందిన వీరు ఆ జాబితాను పౌరసరఫరాల శాఖ కమిషనర్ లాగిన్‌కు పంపించాల్సి ఉంటుంది. తదనుగు ణంగా కమిషనర్ కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తారు. రేషన్‌కార్డు పొందేందుకు అర్హత కలిగిన వ్యక్తి ఒకేఒక్క ఆహార భద్రత (రేషన్) కార్డులొ తన పేరు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఆహార భద్రత కార్డుల్లో కొత్తగా సభ్యుల పేర్ల చేర్పులు, తొలగింపులు చేసుకోవచ్చు. దీంతో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న వినతుల పరిష్కారం దిశగా సర్కారు ముందడుగు వేసినట్టయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment