
(సాక్షి, నెట్‌వర్క్) : రేషన్‌కార్డు అనగానే.. సరుకులు తీసుకునే మాట ఏమోగాని స్థానికతకు, ఇతర అర్హతలకు ఇదే ప్రధానం. ఒకప్పుడు దీనిపై ఐదారు రకాల సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు ఒకటిరెండుతోనే సరిపెడుతున్నారు. ప్రస్తుతం బియ్యం తీసుకునేందుకు ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. తెలంగాణ జిల్లాల (హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు మినహా) నెలవారీ రేషన్ బియ్యం కోటా 1,52,128 మెట్రిక్ టన్నులు. 9 ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 71,51,150 రేషన్ కార్డులున్నాయి. ఇవికాక, అంత్యోదయ కార్డులు (నిరుపేదలకు నెలకు ఈ కార్డుపై 30 కిలోల వరకు బియ్యం ఇస్తారు) 4,71,125 కాగా, అన్నపూర్ణ కార్డులు (అనాథలు, నిరాదరణకు గురైన వారికి ఇచ్చే కార్డులు) 5,285. కొత్తగా రేషన్ కార్డుల కోసం 4,44,439 దరఖాస్తులొచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు మంజూరైనవి 1,62,591 మాత్రమే. మిగతావి వివిధ దశల్లో పరిశీలనలో ఉన్నాయి. రేషన్ కార్డు కోసం ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. కొత్త రేషన్ దరఖాస్తులు ఎక్కువగా డీఎస్‌ఓ, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్థాయిల్లోనే ఆగిపోతున్నాయని సమాచారం. ప్రస్తుతం 2,81,848 మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. వీటిపై నెలవారీ రేషన్ సరుకులు తీసుకునే అవసరం కంటే, రేషన్ కార్డు స్థానికతకు, ఇతర అర్హతలకు ఆధారంగా నిలుస్తుందనే ఉద్దేశంతోనే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటున్నారు.