కొత్త సర్కార్ వచ్చాక కొత్త రేషన్ కార్డులు, కొత్త దీపం గ్యాస్ కనెక్షన్లు వస్తాయని ఎంతోమంది ఆశపడ్డారు. కొత్త కార్డుల కోసం ఎంతో ఆశతో దరఖాస్తు చేశారు. నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా ఫలితం సున్నా. ఇప్పటివరకూ జిల్లాలో కొత్తగా ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో కూడా వారికి రేషన్ కార్డులు దక్కే అవకాశం లేకుండా పోయింది. మరోపక్క దీపం కనెక్షన్లు మంజూరైనా లబ్ధిదారుల జాబితాకు మోక్షం కలగడంలేదు. దీంతో వారికి ఎడతెగని నిరీక్షణ తప్పడంలేదు. - సాక్షి ప్రతినిధి, కాకినాడ
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
జిల్లాలో కొత్త రేషన్ కార్డులకోసం వేలాదిమంది దరఖాస్తు చేసుకుని నెలల తరబడి నిరీక్షిస్తున్నారు. వారిలో అర్హులను అధికారులు పక్కాగా గుర్తించి, ప్రతిపాదనలు పంపించినా.. ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకు లేదు. గత అక్టోబర్‌లో జరిగిన జన్మభూమిలోను, కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌లోను జిల్లా నలుమూలల నుంచి రేషన్ కార్డుల కోసం 1,61,410 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై గ్రామస్థాయిలో పక్కాగా సర్వే చేసిన పౌర సరఫరాల అధికారులు 1,48,520 మంది కొత్త కార్డులకు అర్హులని తేల్చారు. 12,890 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు.
అర్హులుగా జిల్లా యంత్రాంగం గుర్తించిన వారంతా గత తొమ్మిది నెలలుగా కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఎటూ పాలుపోని అధికారులు రేపు మాపు అంటూ ఇంతకాలం వారికి చెబుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో బుధవారం నుంచి రెండో విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమం ప్రారంభమవుతోంది. కనీసం ఇందులోనైనా కార్డులు వస్తాయని అంతా ఆశించారు. ఇప్పుడు ఆ ఆశలు కూడా అడియాసలు అవుతున్నాయి. ఎందుకంటే ఈసారి జన్మభూమి కార్యక్రమంలో ప్రభుత్వం అసలు రేషన్‌కార్డుల ప్రస్తావనే తీసుకురాలేదు. దీంతో కొత్త కార్డులు వస్తాయని ఆశిస్తున్న వారంతా ప్రభుత్వ తీరుపై ఆవేదన చెందుతున్నారు.
గాలిలో ‘దీపం’
దీపం గ్యాస్ కనెక్షన్ల మంజూరులోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. 2014-15 సంవత్సరానికిగానూ జిల్లాకు ప్రభుత్వం 29 వేల దీపం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది. వీటిని జిల్లాలోని 64 మండలాలకు 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన కేటాయించారు. కాకినాడ డివిజన్‌కు 6,301, రాజమండ్రి డివిజన్‌కు 5,518, రామచంద్రపురానికి 3,597, అమలాపురం డివిజన్‌కు 6,588, పెద్దాపురానికి 5,077, రంపచోడవరం డివిజన్‌కు 1,917 కనెక్షన్లను కేటాయించారు. ఇవి మంజూరై మూడు నెలలు దాటినా లబ్ధిదారుల జాబితాకు ఇంతవరకూ గ్రీన్‌సిగ్నల్ లభించలేదు. మండలాలవారీగా కేటాయించిన గ్యాస్ కనెక్షన్లకు లబ్ధిదారుల జాబితాను మండల స్థాయిలో తయారు చేసినప్పటికీ ఆన్‌లైన్‌లో పరిశీలన జరగాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 9,42,472 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో హెచ్‌పీ 6,63,846, ఇండేన్ 1,40,018, భారత్ గ్యాస్ 1,38,608 కనెక్షన్లు ఉన్నాయి. వీటికి అదనంగా ఒక్క గ్యాస్ కనెక్షన్‌కు కూడా ఆమోదం లభించకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎడతెగని నిరీక్షణ
Published Wed, Jun 3 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM
Advertisement
Advertisement