త్వరలో కొత్త రేషన్‌ కార్డులు, పింఛన్లు | New Ration Cards And New Pensions Will Be Issued Soon In Telangana | Sakshi
Sakshi News home page

త్వరలో కొత్త రేషన్‌ కార్డులు, పింఛన్లు

Published Thu, Apr 15 2021 4:28 AM | Last Updated on Thu, Apr 15 2021 12:47 PM

New Ration Cards And New Pensions Will Be Issued Soon In Telangana - Sakshi

జడ్చర్ల/అచ్చంపేట:  రాష్ట్రంలో త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు, కొత్త పింఛన్లు జారీ చేస్తామని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 1.52 లక్షల ఉద్యోగాలు కల్పించామని, త్వరలోనే మరో 52 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నామని ప్రకటించారు. కరోనా కారణంగా పలు అంశాల్లో కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అధోగతి పాలైన తెలంగాణను.. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీల్లో, రంగారెడ్డి జిల్లా కొత్తూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయా చోట్ల జరిగిన బహిరంగ సభల్లో కేటీఆర్‌ మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్‌ పాలనలో వివక్షకు గురైన తెలంగాణను.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు.

ఉమ్మడి పాలనలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పింఛన్‌ రూ.75 ఇచ్చేవారని, ఎవరైనా లబ్ధిదారు మరణిస్తే గానీ కొత్తగా మరొకరికి పింఛన్‌ వచ్చే పరిస్థితి ఉండేది కాదని గుర్తు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.200 చొప్పన పింఛన్‌ ఇచ్చిందని, ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ పది రెట్లు పెంచి రూ.2,000 చొప్పున.. ఏకంగా 40 లక్షల మందికి అందిస్తున్నారని పేర్కొన్నారు. అర్హులైన మహిళల పేరిట డబుల్‌ బెడ్రూం ఇండ్లను కేటాయిస్తామన్నారు. ఒంటరి మహిళలకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా పింఛన్లు ఇస్తున్నామన్నారు. ‘‘ఇల్లు నేనే కట్టిస్తా, పెళ్లి నేనే చేయిస్తానంటూ మేనమామలా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు’ అని కేటీఆర్‌ కొనియాడారు.
 
రైతులకు మేలు కోసం.. 
రాష్ట్రంలో మాతాశిశు మరణాల రేటు తగ్గిందని, జాతీయ స్థాయి గణాంకాలు కూడా ఇదే చెప్తున్నాయని కేటీఆర్‌ అన్నారు. 75 ఏళ్ల ఎందరో పీఎంలు, సీఎంలు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించారని.. అంతా రైతుల గురించి మాట్లాడే వారేగానీ చేసిందేమీ లేదని చెప్పారు. కేసీఆర్‌ వచ్చాక రైతు బంధు, బీమాతో భరోసా కల్పించారన్నారు. జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. కాగా.. కేటీఆర్‌ పర్యటన ఉండటంతో అచ్చంపేటలో బీజేపీ, పలు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అయినా కొందరు నేతలు, కార్యకర్తలు అచ్చంపేట బస్టాండ్‌ సమీపంలో కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు.

ఈ కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు శ్రీనివాస్‌రెడ్డి, రాములు, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి.. అచ్చంపేట సభలో ఎంపీ రాములు, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, హర్షవర్ధన్‌రెడ్డి, అబ్రహం తదితరులు పాల్గొన్నారు.

చదవండి: కరోనా రోగుల్లో మూడోవంతు ఆసుపత్రుల్లోనే..!


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement