‘ఆహార భద్రత’ అందేనా..!
ఆదిలాబాద్‌అర్బన్ : కొత్త రేషన్‌కార్డుల(ఆహార భద్రత)కు దరఖాస్తులు అధిక సంఖ్యలో వస్తున్నాయి. ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే వేల సంఖ్య లో దరఖాస్తులు స్వీకరించగా, చేర్పులు, మార్పు ల కోసం ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. కానీ అధికారులు నూతన రేషన్ కార్డుల మంజూరుపై దృష్టి సారించలేకపోతున్నారు. గత పక్షం రోజుల క్రితం ప్రారంభమైన రైతుబంధు పథకం ఆర్థిక సాయం చెక్కులను రైతులకు పంపిణీ చేయడంలో యంత్రాంగం బీజీగా ఉంది. జిల్లా స్థాయి అధికారులు మండల ప్రత్యేక అధికా రులుగా వ్యవహరిస్తుండగా, మండలాల్లోని తహసీల్దార్‌తోపాటు వీఆర్‌ఏ, వీఆర్వో, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు పెట్టుబడి పథకంలో ప్రతి రోజు పాల్గొం టున్నారు. దీంతో నూతన రేషన్‌కార్డుల మంజూ రుకు వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో తమకు ఆహారభద్రత కార్డు ఎప్పుడు మంజూరు అవుతుందోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
కొత్త కార్డులకు వెల్లువలా..
కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం జిల్లాలో 2015లో ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. ఈ లెక్కన జిల్లాలో 1,81,926 ఆహార భద్రత, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. కార్డు మంజూరు చేయడమే కాకుండా రేషన్ కార్డుకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇది నిరంతర ప్రక్రియ అయినందున కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జిల్లాలో 2015 తర్వాత కూడా 1,425 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులు ప్రస్తుతం ఆయా మండలాల తహసీల్దార్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్లు కార్డులు పొందడం, ఒక్కో కుటుంబానికి రెండు, మూడు కార్డులు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం 2017 మే నెలలో కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకునే ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను నిలిపివేసింది. దీంతో గత రెండేళ్లుగా ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు మంజూరు కాలేదు. తాజాగా ప్రభుత్వం మళ్లీ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించింది. అర్హులైన లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. ఇవీ ప్రస్తుతం ఆయా మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి.
రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్థాయిలో పెండింగ్...
రేషన్‌కార్డులకు అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా అవి ప్రస్తుతం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 4,941 దరఖాస్తులు రాగా, తహసీల్దార్ స్థాయిలో 8, డీఎస్‌వో స్థాయిలో 4 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా 4,929 దరఖాస్తులు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్థాయిలో పెండింగ్‌లో ఉండడం గమనార్హం. జిల్లాలోని 18 మండలాల్లో కొత్త రేషన్‌కార్డులకు ఏప్రిల్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆర్‌ఐ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పరిశీలించిన తర్వాత తహసీల్దార్ లాగిన్‌కు వస్తాయి. అక్కడి నుంచి డీఎస్‌వో లాగిన్‌లోకి వెళ్తాయి. డీఎస్‌వో పౌర సరఫరాల కమిషనర్ కార్యాలయానికి పంపితే అక్కడ ఆమోదం పొంది కొత్త కార్డులు జారీ అవుతాయి. కానీ గత పక్షం రోజులుగా రెవెన్యూ యంత్రాంగం పెట్టుబడి చెక్కుల పంపిణీలో బీజీగా ఉంది. దీంతో కొత్త రేషన్ కార్డులవైపు అధికారులు చూడడం లేదని తెలుస్తోంది. ఇందుకు కొంత సమయం పట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
పెరగనున్న కోటా...
జిల్లాలో ప్రస్తుతం 1,81,926 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులకు ప్రతి నెల 4,015 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ అవుతున్నాయి. ప్రతి రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల పరిమితి లేకుండా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ అవుతున్నాయి. తాజాగా కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నందున రేషన్ కార్డుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. కొత్త కార్డులు మంజూరైతే జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతుంది. జిల్లాకు కేటాయించనున్న కోటా సైతం పెరిగే అవకగాశం ఉంది. ప్రస్తుతం స్వీకరిస్తున్న దరఖాస్తుల్లో ఎక్కువగా కార్డులో పేర్లు చేర్చాలని, సభ్యుల పేర్లను తొలగించాలని, ఆధార్ అనుసంధానం చేయాలనే దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. ఇంకొన్ని దరఖాస్తులు రేషన్‌కార్డు పేరు మార్పు కోసం రావడంతోపాటు కొత్త కార్డులకు సైతం వచ్చాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment