ప్రమాదకరంగా కరెంట్ వైర్లు
ఆదిలాబాద్‌రూరల్ : మండలంలోని చాందా–టి గ్రామంలో ఇళ్లపై నుంచి వెళ్తున్న 33 కేవీ విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. దీంతో ప్రజలు ప్రతి రోజు భయందోళనకు గురవుతున్నారు. ఈదురుగాలులు వచ్చినప్పుడు ఎక్కడ ఇళ్లపై పడుతాయోనని అరచేతిలో ప్రాణాలు పెట్టుకుంటున్నారు. ఈ విద్యుత్‌లైన్ ఆదిలాబాద్‌లోని 132/33 కేవీ సబ్‌స్టేషన్ నుంచి ఈ లైన్ చాందా మీదుగా జైనథ్, బేల మండలాలకు వెళ్తుంది. ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలను గత 40 సంవత్సరాల కిందట వేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇండ్ల నిర్మాణాలు జరగడంతో ఈ పరిస్థితి నెలకొంది. విద్యుత్‌లైన్‌లు తొలగించాలని ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ విద్యుత్ లైన్ తొలగించాలంటే గ్రామ పంచాయితీ లేదా సంబంధిత ఇంటి యజమానులు దానికి అయ్యే ఖర్చు భరించాల్సి ఉంటుందని, అప్పుడే వాటిని తొలగించడానికి సాధ్యమవుతుందని విద్యుత్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
భయందోళనతో బతుకులు..
చిన్న విద్యుత్ తీగ ఇంటికి దగ్గర ఉంటేనే ప్రజలు భయపడిపోతారు. అలాంటిది ఏకంగా పెద్ద లైనే ఇడ్లపై నుంచి వెళ్తుంటే ఇంకెంత భయడిపోతారు అర్థం చేసుకోవచ్చు. చాందా–టి గ్రామంలోని ఇడ్లపై నుంచి వెళ్తుండడంతో నిత్యం భయంభయంగా బతుకుతున్నారు. వర్షకాలంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. గాలిదుమారం ఎక్కువగా ఉంటే తెగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. తమ సమస్యను పరిష్కరించాలని ఆ ప్రాంతంలోని ప్రజాప్రతినిధుతలో పాటు మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని వాపోతున్నారు.
భయపడుతున్నారు..
ఇంటిపై వెళ్తున్న విద్యుత్ లైన్‌తో నిత్యం మా కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఉంది. అధికారులకు ఈ విషయాన్ని తెలిపిన స్పందడం లేదు. విద్యుత్‌లైన్‌ను తొలగించి సమస్యను పరిష్కరించాలి.
– రవి, చాందా (టి)
ఎవరు బాధ్యత వహిస్తారు
తమ ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్‌లైన్ తొలగించాలని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. జరగరానిది ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు. సమస్యను ముందుగానే గుర్తించి పరిష్కరించమంటే ఎవ్వరు రావడం లేదు.
– ప్రశాంత్, చాందా(టి)
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం..
తమ గ్రామంలో ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు తొలగించాలని గతంలో విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన. సంబంధిత విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.
– బొజ్జ అడెల్లు, సర్పంచ్, చాందా–టి
తొలగించేందుకు పేమెంట్ చేయాలి...
చాందా–టి గ్రామంలో చాలా సంవత్సరాల కిందట 33 కేవీ విద్యుత్‌లైన్‌లను వేశారు. ఆ సమయంలో ఖాళీ ప్రాంతం ఉండడంతోనే విద్యుత్‌లైన్ వేయడం జరిగింది. ప్రస్తుతం వాటిని తొలగించాలంటే షిప్టింగ్‌కు సంబంధించిన చార్జీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
– శ్రావణ్‌కుమార్, విద్యుత్‌శాఖ ఏఈ, ఆదిలాబాద్ రూరల్
Comments
Please login to add a commentAdd a comment