కొత్త రేషన్ కార్డులు రాక, రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్ల చేర్పు జరగక సామాన్య, మధ్యతరగతి ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఆధార్, ఫొటోలు ఇచ్చినా
విజయనగరం కంటోన్మెంట్: కొత్త రేషన్ కార్డులు రాక, రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్ల చేర్పు జరగక సామాన్య, మధ్యతరగతి ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఆధార్, ఫొటోలు ఇచ్చినా అవి అప్‌లోడ్ కాక పోవడం వల్ల రేషన్ కార్డులుండీ సరుకులు అందక అధిక సంఖ్యలోని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరో పక్క కుటుంబ సభ్యుల నుంచి విడిపోయిన వారు, వివాహాలు జరిగి వేరే గ్రామాలకు వెళ్తున్నవారు కొత్త కార్డులకు దరఖాస్తులు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా వారికి రేషన్ కార్డులందడం లేదు.
గిరిశిఖర ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాల వరకూ నచ్చిన విధంగా కార్డులు రద్దు చేయడంతో వినియోగ దారులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. జిల్లాలో 649576 తెల్ల రేషన్‌కార్డులున్నాయి. ఇందులో ఏఏవై కార్డులు 86,256 కాగా అన్నపూర్ణ కార్డులు 895 ఉన్నాయి. ఇవి కాకుండా ఏ విధమైన ప్రయోజనం లేకపోయినా 42,935 పింక్ రేషన్ కార్డులున్నాయి. ఏఏవై కార్డులకు ఒక్కో కార్డుకు కిలో రూపాయి చొప్పున 35 కిలోల బియ్యం ఇస్తారు. అన్నపూర్ణ కార్డులకు ఒక్కో కార్డుకు ఉచితంగా ప్రతి నెలా 10 కిలోల బియ్యం ఇస్తారు. జిల్లాలోని 15 ఎంఎల్‌ఎస్ పాయింట్లు(మండల లెవెల్ స్టాక్ పాయింట్లు),1388 రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు ఇస్తారు. ప్రతి నెలా రూ.కోటీ 83లక్షల 678 సబ్సిడీ భరించి సరుకులు అందిస్తున్నారు.
పరిష్కారం కాని సమస్యలు
అయితే ఈ ప్రయోజనాలు అందుకునేందుకు వినియోగదారులకు సవాలక్ష నిబంధనలు విధించినప్పటికీ వినియోగదారులు వాటిని సమర్పించుకుంటున్నారు. అయినా ఇంకా కార్డులు రద్దయి రేషన్ సరుకులు అందక ఇక్కట్లు పడుతున్నారు. ఒకే కుటుంబ సభ్యుడు ఉన్న వృద్ధులకు బయోమెట్రిక్ రావడం లేదు. ఇటువంటి వారి సమస్యలను పరిష్కరించడం లేదు. అలాగే రేషన్ కార్డుల్లో కొత్త కుటుంబ సభ్యుల పేర్ల కోసం గత కొన్ని సంవత్సరాలుగా 12,851 కుటుంబాలు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నాయి. అయితే ఈ కుటుంబాలకు సంబంధించి విచారణ చేసింది మాత్రం కేవలం 7099 కుటుంబాలను మాత్రమే! విచారణపూర్తయిన వారికి కూడా కొత్తగా రేషన్ కార్డుల్లో సభ్యుల పేర్లు చేర్చలేదు. అలాగే జిల్లాలో కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుని ఎదురు చూస్తున్నవారు 19629 కుటుంబాలున్నాయి. ఇవి కేవలం డీఎస్వో కార్యాలయంలో ఉన్న వివరాలు మాత్రమే.
అరకొరగా సరుకులు
వాస్తవానికి జన్మభూమి తదితర గ్రామ సభలతో పాటు వ్యక్తిగత దరఖాస్తులు అయితే దాదాపు 42వేలకు పైగా ఉన్నాయి. మరో పక్క వినియోగదారులకు బియ్యం, పంచదార, కిరోసిన్‌మాత్రమే ఇస్తున్నారు. పామాయిల్, కందిపప్పు, గోధుమ పిండి, గోధుమలు తదితర సరుకులు ఇవ్వడమే లేదు.ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారా అందే సరుకులపై ఆధార పడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నా పట్టించుకోవడం లేదు.