సంక్షేమానికి కత్తెర
సంక్షేమ పథకాల అమలుకు సిక్స్ పాయింట్ ఫార్ములా
పక్కాగృహాలు, రేషన్ కార్డులు, పింఛన్లలో కోత
సాక్షి, చిత్తూరు: సంక్షేమ పథకాల్లో కోత విధించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. నిబంధనల పేరుతో పేదలకడుపు కొట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులోభాగంగా సిక్స్‌పాయింట్ ఫార్ములాను తెరపైకి తెచ్చింది. ఇకనుంచి పేదలకు పక్కాగృహాలు మంజూరు కావాలంటే రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు తప్పనిసరి. గృహం కోరే వ్యక్తి నెలకు రూ.500 విద్యుత్ బిల్లు చెల్లిస్తుంటే అర్హులు కాదు. ఐదు ఎకరాల మాగాణి, పది ఎకరాల మెట్ట పొలం ఉండకూడదు. ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం, నాలుగు చక్రాల సొంతవాహనం ఉండకూడదు. తెల్లరేషన్ కార్డు ఉండి వరుసగా నాలుగు నెలల పాటు రేషన్ తెచ్చుకోకపోయినవారూ అనర్హులే. ఈ కొత్త నిబంధనలు ఇప్పటికే అమల్లోకొచ్చాయి.
ఈ లెక్కన చాలామంది అర్హులకు పక్కా గృహాలు అందే పరిస్థితి లేదు. జిల్లాకు 15,250 పక్కా గృహాలు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అధికార పార్టీ నాయకులున్న జన్మభూమి కమిటీలు అర్హుల జాబితాలను ఇప్పటికే సిద్ధం చేశాయి. ఈ జాబితా జిల్లా ఇన్‌చార్జి మంత్రిద్వారా గృహ నిర్మాణ శాఖకు వెళుతుంది. ఆ తరువాత ఆధార్ ఆధారంగా సిక్స్ పాయింట్ ఫార్ములా మేరకు వివరాలను సేకరించి అర్హుల జాబితాలను ఖరారు చేస్తారు.
కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరుకు సైతం సిక్స్‌పాయింట్ ఫార్ములాను అమలుచేయనున్నారు. ఇప్పటివరకూ జిల్లాలో తెల్ల రేషన్‌కార్డులు 10.83 లక్షలు ఉండగా పింఛన్లు పొందేవారు 3.92 లక్షల మంది ఉన్నారు. వారికి కూడా ఈ నిబంధనలు వర్తించనున్నాయి. దీంతో చాలామంది పేదలు సంక్షేమ పథకాలను కోల్పోనున్నారు. అర్హులందరికీ సంక్షేమపథకాలను అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కి వంచనకు పాల్పడడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త నిబంధనల వల్ల చాలా పేదలకు సంక్షేమ పథకాలు అందే పరిస్థితి లేదని జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.