వికారాబాద్: జిల్లాలోని అనేక మంది అర్హులకు ఆహార భద్రత కరువైంది. తెలంగాణ సర్కారు కొలువుదీరిన తర్వాత ఒకేసారి కొత్త కార్డులు జారీచేసింది. ఈ సమయంలో కూడా దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు సగం మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంది. దీంతో మిగిలిన వారంతా రేషన్‌తో పాటు అనేక ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ఇదిలా ఉండగా కార్డుల్లో కొత్త పేర్లను చేర్చే విషయంపై ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంబిస్తోంది. ఆహార భద్రతపథకంలో భాగంగా ఏడేళ్ల క్రితం లబ్ధిదారులను ఎంపిక చేసి సుమారు ఆరు వేలకు పైగా కొత్త కార్డులు జారీ చేశారు. కానీ గడిచిన ఏడేళ్లలో ఆయా కుటుంబాల్లో పెళ్లిళ్లు, ప్రసవాలు జరిగి సభ్యులసంఖ్య పెరిగింది. మృతి చెందిన వారి పేర్లను కార్డుల్లోంచి తొలగిస్తున్న అధికారులు.. కొత్తగా వచ్చిన వారి వివరాలను మాత్రం పట్టించుకోవడంలేదు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి.
35,000 పెండింగ్
ఏడేళ్ల క్రితం లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం అర్హుల జాబితాను ఆన్‌లైన్‌లో పెట్టింది. కానీ వీరికి కార్డులు జారీ చేయకుండా ఏడాదికి సరిపడే కూపన్లు అందజేసింది. ఆతర్వాత బయోమెట్రిక్ విధానంలో బియ్యం సరఫరా చేస్తోంది. కానీ కొత్తగా ఆయా కుటుంబాల్లోకి వచ్చిన వారిని చేర్చడంపై మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదు. ఇలాంటి వారు జిల్లా వ్యాప్తంగా 35,000 మంది ఉన్నారు. వీరందరూ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. దరఖాస్తు చేసుకోని వారు సైతం వేల సంఖ్యలో ఉన్నారు. వీటన్నింటికీ మోక్షం కలిగితే జిల్లాకు మరో 210 మెట్రిక్ టన్నుల బియ్యం కోటా పెరగనుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్‌పై రాష్ట్ర సర్కారు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా అనేక మంది పేదలు నష్టపోతున్నారు.
2,41,622 కార్డులు
జిల్లాలోని 20 మండలాల్లో 588 చౌకధరలదుకాణాలు, 2,41,622 ఆహార భద్రతా కార్డులు ఉన్నాయి. వీటిలో 2,14,853 ఎఫ్‌ఎస్‌సీ, 26,730 అంత్యోద య, 39 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా 4,673 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతున్నాయి. గతంలో లబ్ధిదారులందరికీ సబ్సిడీపై చక్కర పంపిణీ చేయగా ప్రస్తుతం అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు మాత్రమే ఇస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి
రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చేందుకు మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించాం. వీటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేశాం. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆదేశాలు వస్తే అమలు చేస్తాం.
– రాజేశ్వర్, డీఎస్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment