Widows
-
ఎడబాటు మానసికమా? భౌతికమా?
కాలం మారుతోంది... కాలం మారితే కొత్త ప్రశ్నలు వస్తాయి.భర్త మరణించిన తర్వాత స్త్రీల పట్ల వివక్షాపూరితమైన వ్యవహారశైలిమన దేశంలో అన్ని మతాలలో ఉంది.అయితే ఆ ఎడబాటును మానసికంగా ఉంచుకుంటే చాలదా... భౌతిక ఆనవాళ్లతో వివక్షకు గురవ్వాలా అనే చర్చ ఇప్పుడు మహారాష్ట్రలో నడుస్తోంది. అక్కడి 7000 గ్రామాలు వితంతువులు తాము వితంతువులుగా వెలిబుచ్చే చిహ్నాలతో ఉండాల్సిన పనిలేదని నిర్ణయం తీసుకున్నాయి. ఈ గ్రామాల సంఖ్య ఇంకా పెరగనుంది.నేను చాలా ఇబ్బందులు పడ్డాను. చదువుకుంటుంటే అందరూ అభ్యంతర పెట్టారు... వితంతువుకు చదువు ఏంటని. నా వయసు 42. ఇద్దరు పిల్లలు. భర్త చనిపోయాడు. చదువుకుని టీచర్ అయి నా పిల్లలను చూసుకోవాలని నా ప్రయత్నం. అందుకోసం సల్వార్ కమీజ్ వేసుకుని బయటకు వచ్చినా తప్పే. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది’ అంది సోనాలి పాట్దర్. ఈమెది కొల్హాపూర్‌లోని అంబప్ అనే గ్రామం. ఈమే కాదు పశ్చిమ మహారాష్ట్రలోని సుగర్ బెల్ట్‌గా చెప్పుకునే ప్రాంతంలో ఒక విప్లవంలా ఉద్యమం రేగి వితంతువులు వివక్ష లేకుండా జీవించే మార్పులు జరుగుతున్నాయి.గ్రామాలే మారాలి... మారాయిమన దేశంలో గ్రామాల్లోనే పట్టింపు ఎక్కువ. ముఖ్యంగా వితంతువులకు గ్రామాల్లో ఎక్కడా లేని అనాదరణ ఉంటుంది. వాళ్లు బొట్టు, గాజులు, పూలు పెట్టుకోకూడదు. మంగళసూత్రం వేసుకోకూడదు. శుభకార్యాలకు రాకూడదు. కొన్నిచోట్లయితే గణేశ్ ఉత్సవాలకు వచ్చినా ఊరుకోరు. వీరిని పనిలో కూడా పెట్టుకోరు. కొన్ని ఇళ్లల్లో వీరు రావాల్సిన ఆస్తి రాక అవస్థలు పడుతుంటారు. వితంతువులు కావడం వారి తప్పా? భర్త చన΄పోయిన బాధ ఒకవైపు... బయట సమాజం నుంచి వచ్చే బాధలు మరోవైపు. తమ బాధ మానసికంగా ఉంచుకుని బయట మామూలు జీవితం గడిపే హక్కు తమకు లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు.2022లో మొదలైన ఉద్యమంమహారాష్ట్రలో పేరు పొందిన ప్రమోద్ జింజడే అనే సామాజిక కార్యకర్త పల్లెల్లో వితంతు స్త్రీలకు జరిగే అన్యాయాన్ని ఒకరోజు గమనించాడు. ‘భర్త చనిపోయాక ఒక స్త్రీ అతని గుర్తుగా బొట్టూ గాజులు ఉంచుకుంటానని బతిమిలాడుతుంటే సాటి స్త్రీలు వాటిని తొలగించడం చూశాను’ అన్నాడాయన. 2022లో ఒక అర్ధరాత్రి ఆయనకు సుస్తీ చేసింది. ప్రాణంపోపోయే స్థితి. కాని బయటపడ్డాడు. ఆయన ‘కర్మలా’ అనే ఊరిలో ఉంటాడు. వెంటనే ఆయన కర్మలా తాసిల్దార్ దగ్గరకు వెళ్లి ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశాడు. ‘నేను చనిపోతే నా భార్య వొంటి మీద బొట్టు గాజులు మంగళసూత్రం తీసే హక్కు ఎవరికీ ఉండకూడదు. అలా చేసినవారిని చట్టపరంగా శిక్షించాలి’ అని ఆ అఫిడవిట్ సారాంశం. అక్కడున్న వారు ప్రమోద్‌కు పిచ్చెక్కిందనుకున్నా క్రమంగా ఈ సంగతి ప్రచారం పొందింది. మే 2022లో ఈ ఘటన జరిగితే వెంటనే ‘హెర్వాడ్’ అనే పల్లె నుంచి ఈ ఉద్యమం మొదలైంది.ముక్తి పొందిన 7,683 గ్రామాలుమహారాష్ట్రలో ఇప్పటికి 7,683 గ్రామాలు, 1,182 మునిసిపల్ వార్డులు తాము వితంతువుల పట్ల వివక్ష చూపం అని తీర్మానాలు చేశాయి. వితంతువులు తమకు నచ్చిన ఆహార్యంతో ఉండవచ్చని, అన్ని చోట్లకు రాక΄ోకలు సాగించవచ్చని, ఉద్యోగాలు చేసుకోవచ్చని అవి వారిని ్ర΄ోత్సహించడానికి ముందుకొచ్చాయి. కొన్నిచోట్ల ఆగస్టు పదిహేనున వితంతువులతో జెండా వందనం కూడా చేయిస్తూ ఉన్నారు. ‘ఈ ఉద్యమం ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా పాకుతోంది. ముందుగా గోవా అందుకుంది’ అని ఉద్యమకారులు అంటున్నారు. భర్త చనిపోయాక నిరాశ నిస్పృహల్లో ఉన్న స్త్రీలకు సమాజమే బాసట. దాని నుంచి వందల ఏళ్లుగా ఎదుర్కొంటున్న వివక్షతో ఎంత మంది స్త్రీలు కుమిలిపోయి ఉంటారో అర్థం చేసుకుంటే ఈ ఉద్యమం అవసరం తెలిసి వస్తుందని ఈ ఉద్యమకారుల వాదన. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించింది. 78 శాతం గురించి ఆలోచించాలిమన దేశంలో జీవిత భాగస్వామిని కోల్పోయిన వారి సంఖ్య సుమారు ఐదున్నర కోట్లు ఉంది. వీరిలో 78 శాతం స్త్రీలు. వీరిలో 32 శాతం సగటున 40 ఏళ్ల వయసున్న వారు. ఈ వయసు స్త్రీలు ఇందరు వివక్షను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు వెళ్లలేక΄ోతే ఎలా అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినబడుతోంది. బహుశా ఈ స్త్రీలే తమ ఆకాంక్షలను సమాజానికి మరింత గట్టిగా తెలియ చేస్తారు. -
తను.. గూంగీ గుడియా కాదు.. ఉక్కు మహిళ!
బొట్టు, గాజులు, పువ్వులు.. భారతీయ స్త్రీకి అలంకారంగానే చూస్తున్నారు! వాటి చుట్టూ ఆర్థిక, సామాజిక భద్రత చట్రాన్ని బిగించి మహిళను బందీ చేశారు! అయితే స్వాతంత్య్రానికి పూర్వమే బుద్ధిజీవులు ఆ కుట్రను పసిగట్టారు. అలంకారం స్త్రీ హక్కు.. అది ఆత్మవిశ్వాసానికి ప్రతీక.. ఆ ఆత్మవిశ్వాసమే ఆమె ఆర్థిక, సామాజిక సాధికారతకు పునాది అని నినదించారు! వితంతు చదువు, కొలువు, పునర్వివాహం కోసం పోరాడారు. సమాజాన్ని చైతన్యపరచడానికి చాలానే ప్రయత్నించారు. అయినా .. వితంతువుల జీవితాలేం మారలేదు.. సంఘసంస్కర్తల పోరు చిన్న కదలికగానే మిగిలిపోయింది! పురోగమిస్తున్న.. పురోగమించిన సమాజాల్లో ఎన్నో అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి.. చట్టాలు వస్తున్నాయి!కానీ ఆల్రెడీ చట్టాల తయారీ వరకు వెళ్లిన విడో సమస్యల మీద మాత్రం ఆ సమాజాల్లో కనీస అవగాహన కొరవడుతోంది! చర్చలు అటుంచి ఆ పేరు ఎత్తితేనే అపశకునంగా భావించే దుస్థితి కనపడుతోంది! అందుకే యూఎన్ఓ ‘ఇంటర్నేషనల్ విడోస్ డే’ను నిర్వహించడం మొదలుపెట్టింది.. ఏటా జూన్ 23న. ఆ రకంగానైనా ప్రపంచ దేశాలు విడో సమస్యలను పట్టించుకుని వాళ్ల రక్షణ, సంరక్షణ బాధ్యతను సీరియస్‌గా తీసుకుంటాయని.. ప్రజలూ వాళ్లను సమదృష్టితో చూసే పెద్దమనసును అలవరచుకుంటారని! ఆ సందర్భాన్నే ఈ వారం కవర్ స్టోరీగా మలిచాం!మోదీ 3.0 కేబినేట్లో అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి పొందిన వ్యక్తిగా రక్షా ఖడ్సే రికార్డులోకి ఎక్కారు. ఆ ఘనత ఆమెకు గాలివాటంగా రాలేదు. దాని వెనుక పెద్ద కథే ఉంది. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన రక్షా భర్త, ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అనివార్యంగా రక్షా ఖడ్సే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. వరుసగా మూడుసార్లు మహరాష్ట్రలోని రావేర్ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. భర్త తరఫు కుటుంబం నుంచి సహకారం అందడంతో ఆమె రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. అయితే అందరికీ రక్షా ఖడ్సేలా çకుటుంబం నుంచి, సమాజం నుంచి సహాయ సహకారాలు అందడం లేదనడానికి ఒక ఉదాహరణ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇటీవల కనిపించింది.తెలుగు రాష్ట్రాల్లోని ఓ గ్రామంలో కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంచాయతీ ముదిరింది. ఒత్తిడి తట్టుకోలేక ఆ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుడి తరఫు బంధువులు ఆస్తి పంపకం విషయంలో మృతుడి భార్య తరఫువారు వెనక్కి తగ్గితేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఈ ప్రతిపాదనకు అవతలి వారు ఒప్పుకోలేదు. ఫలితంగా మూడు రోజులైనా దహన సంస్కారాలు జరగలేదు. చివరకు మృతుడి కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గడంతో మూడు రోజుల తర్వాత అంత్యక్రియల ప్రక్రియ ముందుకు సాగింది. ఓవైపు భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మహిళ అదే సమయంలో తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. లేదంటే తనకు, తన పిల్లలకు ఈ సమాజం నుంచి ఎంతమేరకు మద్దతు లభిస్తుందనేది ప్రశ్నార్థకమే! ఆనాటి నుంచి ఈనాటి వరకు భర్తను కోల్పోయి ఒంటరైన మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలపై జరగాల్సినంత చర్చ జరగడం లేదు.మధ్యయుగాల్లో..భర్త చనిపోతే అతని చితిపైనే బతికున్న భార్యకు కూడా నిప్పంటించే సతీ సహగమనం అనే అమానవీయ ఆచారాలను రూపుమాపే ప్రయత్నాలు బ్రిటిష్ జమానాలోనే మొదలయ్యాయి. భర్త చనిపోయిన స్త్రీలకు గుండు చేసి, తెల్ల చీరలు కట్టించి, ఇంటి పట్టునే ఉంచే దురాచారాన్ని పోగొట్టేందుకు రాజా రామమోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారు అలుపెరగని పోరాటం చేశారు. వీరి కృషి ఫలితంగా ఈరోజు సతీసహగమనం కనుమరుగైంది. తెల్లచీర, శిరోముండన పద్ధతులూ దాదాపుగా కనుమరుగయ్యాయి. అంతగా కాకపోయినా పునర్వివాహాల ఉనికీ కనపడుతోంది. అయితే ఇంతటితో భర్తను కోల్పోయిన మహిళల జీవితాల్లో వెలుగు వచ్చేసిందా? వారి కష్టాలన్నీ తీరిపోయాయా? అని ప్రశ్నించుకుంటే కాదనే సమాధానమే స్ఫురిస్తుంది. భర్తపోయిన స్త్రీలకు కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు మన దగ్గరే కాదు చాలా దేశాల్లో కనిపిస్తున్నాయి.ప్రస్తుత ప్రపంచ జనాభాను దాదాపు ఎనిమిది వందల కోట్లకు అటూ ఇటూగా పరిగణిస్తే అందులో వితంతువుల సంఖ్య 25 కోట్లకు పైమాటే! సమాజంలో అందరికంటే అత్యంత నిరాదరణ, అవమానాలు, కనీస మద్దతు వంటివీ కరువైనవారిలో వితంతువులే ముందు వరుసలో ఉన్నారు. జాతి, మతం, కులం, వర్గంతో సంబంధం లేకుండా భర్తను కోల్పోయిన స్త్రీకి సమాజం నుంచి కనీస నైతిక మద్దతు కూడా లభించకపోగా అవమానాలు, అవాంతరాలు ఎదురవుతున్నాయి. సమాజం పుట్టుక నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ జాతి వివక్ష, లింగ వివక్ష, కుల వివక్ష, ఆర్థిక అంతరాల మీద జరుగుతున్నంత చర్చ వితంతు సమస్యల మీద జరగడం లేదు. విపత్తులు, యుద్ధాలు, మహమ్మారులు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నప్పుడు ఈ సమస్య పెరుగుతోంది. కరోనా, రష్యా– ఉక్రెయిన్, ఇజ్రాయేల్– పాలస్తీనా యుద్ధాల నేపథ్యంలోనూ వితంతువుల సమస్యలను ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది.గూంగీ గుడియా..మన దేశ తొలి మహిళా ప్రధాని, ఉక్కు మహిళగా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులరాలైన ఇందిరా గాంధీ తన 43వ ఏట భర్త (ఫిరోజ్ గాంధీ)ను కోల్పోయారు. ఆ తర్వాత రెండేళ్లకు తండ్రి జవహర్ మరణంతో ఆమె రాజకీయ ప్రవేశం అనివార్యమైంది. ఇందిరా రాజకీయ జీవితం తొలినాళ్లలో సోషలిస్ట్ నేత రామ్మనోహర్ లోహియా ఆమెను గూంగీ గుడియా (మూగ బొమ్మ)గా అభివర్ణించేవారు. తర్వాత ఆమె తీసుకున్న బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి నిర్ణయాలు, చేపట్టిన ప్రజాదరణ పథకాలు, గరీబీ హఠావో వంటి నినాదాలతో పాటు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి నాంది పలకడం వంటి సాహసాలతో ఆమె గూంగీ గుడియా కాదు ఐరన్ లేడీ అనే ప్రతిష్ఠను సాధించింది. అప్పటిదాకా వితంతువు దేశానికి అపశకునం అని నిందించిన నోళ్లే ఆమె రాజకీయ చతురతను చూసి దుర్గాదేవిగా కీర్తించటం మొదలుపెట్టాయి. ఆ తరానికి చెందిన ఎంతోమంది తమ పిల్లలకు ఇందిరా ప్రియదర్శిని అనే పేరు పెట్టుకునేలా ప్రేరణను పంచారు ఆమె. ఆఖరికి ఇందిరా సమాధిని శక్తిస్థల్గా పిలిచే స్ఫూర్తిని చాటారు.కరోనాతో మరోసారి..రెండు ప్రపంచ యుద్ధాల సందర్భంగా ఈ ప్రపంచం గతంలో ఎన్నడూ చూడనంతగా వితంతు సమస్యను ఎదుర్కొంది. ఆ గాయాల నుంచి బయటపడే సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదం పెచ్చరిల్లింది. మరోవైపు సామ్రాజ్యవాదం నాటిన విషబీజాల కారణంగా ఆర్థికంగా, రాజకీయంగా బలహీనంగా ఉన్న దేశాల్లో అంతర్యుద్ధాలు గడిచిన రెండు దశాబ్దాల్లో పెరిగాయి. వెరసి ఆయుధాల నుంచి తూటాలు దూసుకువస్తున్నాయి. ఆకాశం నుంచి జారిపడే బాంబుల గర్జన పెరిగింది. ఫలితంగా ఎందరో మృత్యువాత పడుతున్నారు. వీటి వల్ల అనూహ్యంగా వితంతువుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం వీరి సంఖ్య .. ఇరాక్, అఫ్గానిస్తాన్, పాలస్తీనా వంటి ఆసియా దేశాలతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోనూ అధికంగా ఉంది. యుద్ధాలు, అంతర్యుద్ధాలకు తోడు కరోనా వైరస్ ఒకటి. అది సృష్టించిన భయోత్పాతానికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. రోజుల తరబడి స్తంభించిపోయాయి. 2020, 2021లలో లక్షలాది మంది జనం కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలో అధికారిక లెక్కల ప్రకారమే నాలుగున్న లక్షల మంది కరోనాతో చనిపోయారు. అనధికారికంగా ఈ సంఖ్య మరో పది రెట్లు ఎక్కువగా ఉండవచ్చని అంచనా. కరోనా చేసిన గాయాల కారణంగా మనదేశంలోనూ వితంతువుల సంఖ్య పెరిగింది.మరిన్ని రూపాల్లో.. యుద్ధాలు, విపత్తులు, మహమ్మారుల రూపంలోనే కాకుండా ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు, రైతుల ఆత్మహత్యలు వంటివీ మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వితంతువుల సంఖ్య పెరగడానికి కారణాలవుతున్నాయి. కష్టనష్టాలకు ఓర్చి సాగు చేసిన రైతులు అప్పుల పాలవుతున్నారు. మార్కెట్ స్థితిగతులపై అవగాహన లేకపోవడం, కరువు, అధిక వడ్డీలు, ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం వంటి కారణాల వల్ల ఏ ఏటికి ఆ ఏడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరకు అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. అప్పటికే అప్పుల పాలైన సదరు రైతు కుటుంబం, ఆ రైతు జీవిత భాగస్వామి అలవికాని కష్టాల్లో మునిగిపోయుంటోంది. మరోవైపు వెనుకబడిన ప్రాంతాల్లో మద్యం ప్రాణాలను కబళిస్తోంది. తాగుడు అలవాటైన వ్యక్తులు అందులోనే జోగుతూ కుటుంబాలను అప్పుల్లోకి నెడుతూ అనారోగ్యంపాలై చనిపోతున్నారు. ఆఖరికి ఆ కుటుంబం చిక్కుల్లో పడుతోంది. అందులో అత్యంత వేదనను భరిస్తోంది సదరు మృతుడి జీవిత భాగస్వామే!అత్యంత సంపన్న మహిళ..33.50 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళాగా గుర్తింపు పొందిన సావిత్రి జిందాల్ కూడా ఒంటరి మహిళే! తన ¿¶ ర్త.. జిందాల్ గ్రూప్ ఫౌండరైన ఓంప్రకాశ్ జిందాల్ మరణం తర్వాత.. స్టీల్, పవర్, సిమెంటుకు చెందిన జిందాల్ గ్రూప్ వ్యాపార సంస్థలకు చైర్పర్సన్ గా ఆ గ్రూప్ వ్యాపార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.సమస్యల వలయం..హఠాత్తుగా భర్తను కోల్పోవడం స్త్రీ జీవితంలో అతి పెద్ద కుదుపు. అప్పటి వరకు తనతో జీవితాన్ని పంచుకున్న వ్యక్తితో ఉండే అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఒక్కసారిగా దూరం అవుతాయి. దీంతో మానసిక తోడును ఒక్కసారిగా కోల్పోతారు. ఆ స్థితిని అర్థం చేసుకుని మానసికంగా తమను తాము కూడగట్టుకోక ముందే ఆచారాలు, సంప్రదాయాలు ఆ స్త్రీ పై తమ దాడిని మొదలెడతాయి. ఆ వెంటనే ఆస్తి పంపకాలు, బాధ్యతల విభజన విషయంలో భర్త తరఫు కుటుంబ సభ్యుల ఒత్తిడి మొదలవుతుంది. కాస్త చదువు, అదిచ్చిన ధైర్యం ఉన్న స్త్రీ అయితే స్వయంగా నిర్ణయం తీసుకుని తనకు, తన పిల్లలకు సురక్షితంగా ఉన్న దారిని ఎంచుకుంటుంది. ఆ రెండూ లేని వితంతువులు భర్త తరఫు కుటుంబం లేదా పుట్టింటి వారి దయాదాక్షిణ్యాలకు తల ఒగ్గుతారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఆ రెండు ఇళ్లలో ఏదో ఒక ఇంటికి స్వచ్ఛంద వెట్టి చాకిరికి కుదిరిపోతారు వారి తుది శ్వాస వరకు. కాలం మారినా ఈ దృశ్యాలు మాత్రం మారలేదు. పై చదువులు, కొలువుల కోసం అమ్మాయిలు ఒంటరిగా విదేశాలకు వెళ్లే పురోగతి ఎంతగా కనిపిస్తోందో.. దేశానికి ఇంకోవైపు భర్తపోయిన ఒంటరి స్త్రీల దయనీయ జీవితపు అధోగతీ అంతే సమంగా దర్శనమిస్తోంది.కుటుంబాల మద్దతు లేకపోయినా, మెరుగైన జీవితం కోసం ధైర్యంగా అడుగు ముందుకు వేసి జీవన పోరాటం మొదలుపెట్టినా.. పొద్దునే ఆమె ఎదురొస్తే సణుక్కుంటూ మొహం తిప్పుకుని వెళ్లడం, శుభకార్యాలకు ఆమెను దూరంగా పెట్టడం, నోములు వ్రతాలకు ఆమెను బహిష్కరించడం, అంతెందుకు దేవుడి గుడిలోనూ అలాంటి అవమానాన్నే పంటి బిగువున భరించాల్సి వస్తోంది ఆమె! వీటన్నిటినీ జయించే శక్తిని కూడదీసుకున్నా, భర్త పోయిన ఆడవాళ్లకు ఇంటా, బయటా ఎదురయ్యే లైంగిక వేధింపుల చిట్టా మరొక కథ. ఇలా విడో అన్నిటికీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిన తీరు అభివృద్ధి చెందుతున్న, చెందిన సమాజాల్లోనూ కామన్ సీన్‌గా ఉందంటే లేశమాత్రం కూడా అతిశయోక్తి లేదు. మరోవైపు వారికి అందాల్సిన ఆర్థిక మద్దతు కరువైన కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆఖరికి యాచకుల్లో కూడా విడోలకు ఆదరణ ఉండదనేది చేదు వాస్తవం. యాచనకు దిగిన వితంతువులను అపశకునంగా భావించి దానం చేసేందుకు నిరాకరించే జనాలు కోకొల్లలు. ఇలా నిరాశ్రయులైన వారికి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తోన్న శరణాలయాలు ప్రధాన దిక్కుగా ఉంటున్నాయి. ఇక్కడ కూడా మానవత్వం లోపించిన వారి నుంచి వితంతువులకు ఇక్కట్లు తప్పడం లేదు.వరల్డ్ విడోస్ డే..ప్రపంచవ్యాప్తంగా వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, వాటి పట్ల అవగాహన కల్పిస్తూ వారికి మద్దతుగా నిలవడానికి ఐక్యరాజ్య సమితి ‘వరల్డ్ విడోస్ డే’ను నిర్వహించాలని 2011లో నిర్ణయించింది. అందుకు జూన్ 23వ తేదీని ఎంచుకుంది. నాటి నుంచి ‘వరల్డ్ విడోస్ డే’ ద్వారా భర్తపోయిన స్త్రీల రక్షణ, సంరక్షణల కోసం ప్రపంచ దేశాలు తమ పరిధిలో చట్టాలను తీసుకురావడానికి కృషి చేస్తోంది. దీంతో పాటు వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సమాజంలోని అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించడం, ఆచారాలు, సంప్రదాయాల పేరిట వారిపై జరుగుతున్న మానసిక, శారీరక దాడుల నుంచి విముక్తి కల్పించడం వంటివి ఐరాస ముఖ్య ఉద్దేశాల్లో కొన్నిగా ఉన్నాయి.మెహినీ గిరి..మన దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం నుంచే వింతతు సమస్య తీవ్రంగా ఉంది. దీనికి ముఖ్య కారణాలు ఆడపిల్లలకు చదువు లేకపోవడం, మూఢవిశ్వాసాలు, కన్యాశుల్కం. ఈ సమస్యను స్వాతంత్య్రానికి పూర్వమే గ్రహించారు రాజా రామమోహన్ రాయ్, జ్యోతిబా పూలే, కందుకూరి విరేశలింగం వంటి సంఘసంస్కర్తలు. అందుకే ఆడపిల్లలు, బాల వితంతువులకు చదువు, స్వావలంబన, వితంతు వివాహాల కోసమూ అంతే పోరాటం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అంబేడ్కర్ సైతం ఈ అంశంపై దృష్టి సారించారు. అయితే వితంతువుల జీవితాల్లో వెలుగు నింపేందుకు శ్రమించిన వారిలో మోహినీ గిరికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తన జీవితంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ సమస్యపై చర్చను సమాజంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఆమె పాటుపడ్డారు. ఆమె చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2007లో ఆమెకు పద్మభూషణ్ సత్కారాన్ని అందజేసింది.వార్ విడోస్ అసోసియేషన్..స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో లక్నో యూనివర్సిటీలో సైన్ ్స డిపార్ట్మెంట్ను ప్రారంభించడంలో మోహిరీ గిరి తండ్రి కీలకమైన పాత్ర పోషించారు. దీంతో యూనివర్సిటీలో మోహినీ గిరి తండ్రికి ఒక పెద్ద బంగ్లాను కేటాయించడంతో పాటు విశేషమైన గౌరవ మర్యాదలనూ ఆ కుటుంబానికి ఇచ్చేవారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే అంటే మోహినీ పదేళ్ల వయసులో ఆమె తండ్రి చనిపోయాడు. దీంతో ఆ యూనివర్సిటీలో ఆమె కుటుంబ పరిస్థితి తారుమారైంది. అప్పటికే ఆమె తల్లికి సంగీతంలో డాక్టరేట్ పట్టా ఉన్నా, యూనివర్సిటీ నుంచి సరైన రీతిలో ప్రోత్సాహం లభించలేదు. పిల్లల పెంపకం కష్టం కావడంతో ఆమె యూనివర్సిటీని వదిలి బయటకు వచ్చారు. ఒంటరి తల్లిగా ఆమెకు ఎదురైన కష్టాలు, తమను పెంచి పెద్ద చేయడంలో ఆమె పడ్డ ఇబ్బందులను మోహినీ దగ్గరగా చూశారు. ఆ తర్వాత ఆమె మాజీ రాష్ట్రపతి వరహాగిరి వెంకటగిరి ఇంటికి కోడలిగా వెళ్లారు. ఆ సమయంలోనే అంటే 1971లో ఇండో–పాక్ యుద్ధం జరిగి బంగ్లాదేశ్‌కు విముక్తి లభించింది. అయితే ఆ పోరులో ఎందరో జవాన్లు అమరులయ్యారు. వారి భార్యలు తమ జీవిత భాగస్వాములను కోల్పోయి ఒంటరయ్యారు. దీంతో ఆమె 1972లో దేశంలోనే తొలిసారిగా ‘వార్ విడోస్ అసోసియేషన్ ’ను ప్రారంభించారు.దాడులు..ఆ రోజుల్లో (ఇప్పటికీ చాలా చోట్ల) వితంతువులు బయటి పనులకు వెళ్లడాన్ని అనాచారంగా భావించే వారు. అంతేకాదు రంగురంగుల దుస్తులు ధరించడంపైనా ఆంక్షలు ఉండేవి. జీవితాన్ని మెరుగుపరచుకునేందుకు ప్రత్యేక నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాలు అందుబాటులో ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘వార్ విడోస్ అసోసియేషన్ ’ ఆధ్వర్యంలో మోహినీ గిరి.. వారణాసి, బృందావన్, పూరి, తిరుపతి వంటి ప్రాంతాల్లో వితంతు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ వారికి ఆశ్రయం కల్పించి ఆ కేంద్రాలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా తీర్చిదిద్దారు. వారి పిల్లలకు చదువులు చెప్పించారు. వీవీ గిరి ప్రభుత్వపరంగా పెద్ద పోస్టుల్లో ఉన్నంత వరకు మోహినీ గిరి చేపట్టిన కార్యక్రమాలన్నింటికీ సహకారం అందించిన సమాజం.. ఆయన పదవుల్లోంచి దిగిపోయిన వెంటనే తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. మోహినీ గిరి.. వితంతువులకు రంగురంగుల దుస్తులు వేసుకోమని ప్రోత్సహిస్తోందంటూ మన తిరుపతిలోనే ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. కోడిగుడ్లు, టొమాటోలు విసిరారు. ఆ దాడులకు ఆమె వెరవలేదు. తన ప్రయాణాన్ని ఆపలేదు. నేటికీ ఆ స్ఫూర్తి కొనసాగుతోంది. ఎందరో బుద్ధిజీవులు మోహినీ గిరి అడుగుజాడల్లో నడుస్తూ వితంతు జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు.వితంతు రక్షణ చట్టాలు..వితంతువులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్రంతో పాటు దేశంలో అనేక రాష్ట్రాలు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇవి కనిష్ఠంగా నెలకు రూ. 300ల నుంచి రూ.3,000ల వరకు ఆయా ప్రభుత్వాల వారీగా అందుతున్నాయి. పెన్షన్ తో పాటుగా వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిం చేందుకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలనూ పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 నుంచి ఇప్పటి వరకు వితంవులు రక్షణ, భద్రత కోసం అనేక చట్టాలను రూపొందించినా, సామాజిక రుగ్మతల కారణంగా చాలా సందర్భాల్లో అవి నిస్తేజమవుతున్నాయి. చట్టాల రూపకల్పన, ప్రత్యేక పథకాల అమలుతో పాటు వివక్ష, సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలు వంటివాటిని దూరం చేసేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకరిపై ఆధారపడే స్థితి నుంచి అద్భుతాలు సాధించే దశకు చేరుకుంటారు. – తాండ్ర కృష్ణ గోవింద్ -
అక్కడ సామాజిక కట్టుబాట్లపై సాధించిన విజయానికి గుర్తుగా హోలీ!
మన భారతదేశంలో కొన్ని ఆచారాల ప్రకారం భర్త చనిపోయిన స్త్రీ పలు పండుగలను జరుపుకోనివ్వకుండా నిషేధాలు ఉండేవి. వారు నలుగురుతో కలిసి ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోకూడదు. కనీసం చూడటానికి కూడా ఉండేది కాదు. చెప్పాలంటే నాలుగు గోడల మధ్యనే బంధించేసేవారు. వారికి కావాల్సినవి తీసుకొచ్చి వారి గది బయటపెడితే తీసుకోవాలి అంతే. ఎవ్వరికీ కనిపించను కూడా కనిపంచకూడదు. అంత దారుణమైన గడ్డు పరిస్థితుల్లో జీవించేవారు నాటి వితంతువులు. ఇప్పుడిప్పుడే కొంచె వారిని మంచిగానే చూస్తున్నా..కొన్ని విషయాల్లో వారి పట్ల అమానుషంగానే ప్రవర్తిస్తున్నారు. వాళ్లు ఇలాంటి హోలీ పర్వదినం రోజున బయటకు అస్సలు రాకూడదు, రంగులు జల్లుకోకూడదట. వారికోసం ఓ ఎన్జీవో ముందుకోచ్చి సుప్రీం కోర్టులో పోరాడి మరీ వారు కూడా సెలబ్రేట్ చేసుకునేలా చేసింది. ఈ కథ ఎక్కడ జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లోlr వింతతు స్త్రీలను మాత్రం రంగుల హోలీలో పాల్గొనిచ్చేవారు కాదు. అస్సలు వారు సెలబ్రేట్ చేసుకోకూడదని నిషేధం విధించారు అక్కడి పెద్దలు. తెల్లటి చీరతో ఉండేవారికి సంతోషానికి ప్రతీకలైన రంగులను ముట్టకూదని కట్టుదిట్టమైన ఆంక్షాలు ఉండేవి. పితృస్వామ్య నిబంధనలు గట్టిగా రాజ్యమేలుతున్న ఆ బృందావన్‌లో వారి స్థితి అత్యంత కడు దయనీయంగా ఉండేది. వారి జీవితాలలో వెలుగు నింపేందుకు ఎన్జీవ్ సులభ్ ఇంటర్నేషన్ల అనే స్వచ్ఛంద సంస్థ మార్పుకు నాంది పలికింది. ఆ ఎన్జీవో మహిళా సాధికారత, సామాజిక సమ్మేళనం వంటి వాటికి ప్రసిద్ధి చెందింది. ఆ స్వచ్ఛంద సంస్థ ఇలాంటి నిబంధనలను తొలగించి వారుకూడా అందరిలా పండుగలను చేసుకునేలా చేయాలంటూ సుప్రీం కోర్టుని ఆశ్రయించి మరీ వారికి సామాజిక కట్టుబాట్ల నుంచి విముక్తి కలిగించింది. అయినప్పటికీ ఆ వితంతువులు పండుగ చేసుకోవడం చాలా సవాలుగా ఉండేది. సరిగ్గా 2012 నుంచి వారంతా కూడా ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభమయ్యింది. అప్పటి నుంచే ప్రతి ఏటా ఈ హోలీ రోజున వారంతా కృష్ణుని సమక్షంలో ఆడి పాడి వేడుకగా చేసుకుంటున్నారు. అంతేగాదు ఈ ఒక్క పండుగే గాక దీపావళి వంటి ఇతర అన్ని పండుగలు చేసుకునేలా స్వేచ్ఛను పొందారు. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి పండుగలకు దూరమై ఉన్న ఆ వితంతువులను ధైర్యంగా అడుగు వేసి, తాము సాటి మనుషులమే ఇది తమ హక్కు అని వారికి గుర్తు చేసింది ఆ స్వచ్ఛంద సంస్థ. ఆ వితంతువులు ఈ హోలీని స్త్రీ ద్వేషం, పితృస్వామ్య నిబంధనలపై విజయం సాధించి, పొందిన స్వేచ్ఛకు గుర్తుగా సంతోషభరితంగా చేసుకుంటారు ఆ వితంతువులు. చెప్పాలంటే ఇది అసలైన హోలీ వేడుక అని చెప్పొచ్చు కథ! (చదవండి: రంగులు చల్లుకోని హోలీ గురించి తెలుసా?) -
రెండు రోజుల్లో అవ్వాతాతల చేతికి రూ.1,654.61 కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్ డబ్బులు పంపిణీ రెండో రోజు శనివారం కూడా ముమ్మరంగా కొనసాగింది. వలంటీర్లు శనివారం సాయంత్రం వరకు 60,03,709 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రూ.1,654.61 కోట్లు పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. డిసెంబరు నెలలో మొత్తం 65,33,781 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.1,800.96 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం లబ్ధిదారుల్లో 91.89 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తిచేశారు. ఈ నెల 5వ తేదీ వరకు మిగిలిన లబ్ధిదారుల ఇళ్లకు వలంటీర్లు వెళ్లి పింఛన్లు అందజేస్తారని అధికారులు తెలిపారు. -
పింఛన్లు:65,98,138
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల చేతి వృత్తిదారులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మరో 1,93,680 మందికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మంగళవారం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో ప్రతి నెలా అందజేసే పింఛన్ల సంఖ్య రికార్డు స్థాయిలో 65,98,138కి చేరింది. కొత్తగా మంజూరైన వారికి ఈ నెల నుంచే ఫింఛన్ డబ్బులు పంపిణీ చేసేందుకు వీలుగా ఈ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 14వతేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. కొత్త పింఛన్ల మంజూరుకు అదనంగా అవసరమయ్యే నిధులను కూడా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని, చాలా చోట్ల మంగళవారం సాయంత్రం నుంచే కొత్త పింఛన్‌దారులకు నగదు పంపిణీ ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెలలో కొత్తగా పింఛన్ మంజూరైన 1,93,680 మంది లబ్ధిదారులలో 95,653 మంది అవ్వాతాతల వృద్ధాప్య పింఛన్లున్నాయి. 40,058 మంది వితంతువులు, 29,858 మంది దివ్యాంగులు, 6,861 మంది డప్పు కళాకారులు, 4,763 మంది మత్య్సకారులు, 2,844 మంది కల్లుగీత కార్మికులు, 4 వేల మంది హెచ్ఐవీ బాధితులు కాగా మిగిలినవి ఇతర పింఛన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెలలో కొత్తగా 3,42,452 మందికి పింఛన్లు... ఎప్పటిమాదిరిగానే ఈ నెల ఒకటో తేదీనే ప్రభుత్వం పింఛన్ల పంపిణీ ప్రారంభించే సమయంలో 1,48,772 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. అప్పటికే పింఛన్ల పొందుతున్న వారితో కలిపి సెప్టెంబరు ఒకటో తేదీన ప్రభుత్వం మొత్తం 64,04,458 మంది లబ్ధిదారులకు పింఛన్ల మొత్తాన్ని విడుదల చేసింది. తాజాగా రెండో విడతగా మంగళవారం మంజూరు చేసిన 1,93,680 మంది కొత్త లబ్ధిదారులతో కలిపి ఈ నెలలో రెండు విడతల్లో మొత్తం 3,42,452 మందికి ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయడం గమనార్హం. ఒక్క నెలలో పింఛన్లకు రూ.1,819.02 కోట్లు.. సెప్టెంబరు ఒకటో తేదీన మొత్తం 64,04,458 మందికి పింఛను డబ్బుల పంపిణీకి రూ.1,764.83 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా కొత్తగా మంజూరు చేసిన వారితో కలిపి ఈ నెలలో మొత్తం 65,98,138 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం మొత్తం రూ.1,819.02 కోట్లను సెప్టెంబర్‌లో విడుదల చేసింది. ఈ నెలలో రెండు విడతలతో పాటు కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన 3,42,452 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.96.12 కోట్ల చొప్పున అదనంగా ఖర్చు చేసేందుకు ముందుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగేళ్లలో 28.26 లక్షల కొత్త పింఛన్లు రాష్ట్రంలో ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న ప్రతి పది మందిలో నలుగురుకి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తరువాతే కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. జగన్ సీఎం అయ్యాక 28,26,884 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు గణాంకాలతో వెల్లడిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ల కోసం సరాసరిన రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం సెప్టెంబరు నెలలో ఏకంగా రూ.1,819 కోట్లు వెచ్చించడం గమనార్హం. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నాలుగేళ్లుగా లంచాలు, వివక్షకు తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. అవ్వాతాతలతో పాటు దివ్యాంగులకు ఏ చిన్న కష్టం లేకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ల సొమ్మును అందజేస్తున్నారు. -
వితంతువులకే మొదటి ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులెవరినీ వారి సొంత గ్రామ పంచాయతీలకు లేదా వారి సొంత మున్సిపల్ వార్డుల పరిధిలోకి ఎట్టి పరిస్థితిలో బదిలీ చేయబోమని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్ లక్ష్మీశ శనివారం పూర్తి మార్గదర్శకాలను విడుదల చేశారు. 2019, 2020 నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు పొంది.. ఈ ఏడాది మే 25 నాటికి ప్రొబేషన్ ప్రక్రియ పూర్తయిన వారు బదిలీ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇక ఏఎన్ఎంలకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు పరస్పర అంగీకార బదిలీలకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. బదిలీలకు దరఖాస్తు చేసుకునే వారిపైన ఎలాంటి శాఖపరమైన క్రమశిక్షణా చర్యలు, ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారు. ఒంటరి మహిళలకే తొలి ప్రాధాన్యం.. ♦ కాగా బదిలీ దరఖాస్తులో సచివాలయాల ఉద్యోగులు ఐదు మండలాలు లేదా ఐదు మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకునే వీలు కల్పించారు. పరస్పర అంగీకార బదిలీలకు కేవలం ఒక మండలం లేదా మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్నే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేటప్పుడు ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ల ద్వారా పొందిన నో డ్యూస్ సర్టిఫికెట్‌ను అప్లోడ్ చేయాలి. ♦ బదిలీలు కోరుకునేవారిలో... వితంతువులు తమ భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని, వ్యాధిగ్రస్తులు మెడికల్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. చెరొక చోట ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలకు వివాహ ధ్రువీకరణపత్రంతో పాటు భర్త లేదా భార్య ఆధార్ వివరాలు, వారి ఉద్యోగ ఐడీ కార్డు, ఉన్నతాధికారి జారీ చేసిన సర్టిఫికెట్లు ఉండాలి. వాటిని దరఖాస్తుతోపాటు జత చేయాలి. ♦ ఒక జిల్లా పరిధిలో 15 శాతం నాన్ లోకల్ నిబంధనలకు లోబడి అంతర్ జిల్లాల బదిలీలు ఉంటాయి. ఒక లోకల్ ఉద్యోగి, మరొక నాన్ లోకల్ ఉద్యోగి పరస్పర అంగీకారంతో అంతర్ జిల్లా కేటగిరీలో బదిలీ కోరుకున్నప్పుడు ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బదిలీపై వెళ్తున్న ఉద్యోగితో సహా కొత్తగా ఆ జిల్లాకు వచ్చే నాన్ లోకల్ ఉద్యోగి సంఖ్య మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం మించి ఉన్నప్పుడు అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం ఉండదని వెల్లడించారు. ♦ బదిలీలకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించే సమయంలో మొదట జిల్లా పరిధిలో, ఆ తర్వాత దశలో మాత్రమే అంతర్ జిల్లాల బదిలీలను పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్లతోసహా ఇతర నియామక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిధిలో బదిలీల్లో మొదట ఒంటరి మహిళ లేదా వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆ తర్వాత వరుస క్రమంలో అనారోగ్య కారణాలు, భార్యాభర్తలు వేర్వేరు చోట్ల పనిచేస్తుండడం వంటివాటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇక చివరి ప్రాధాన్యతగా పరస్పర అంగీకార బదిలీలకు వీలు కల్పించాలన్నారు. అర్హులందరికీ బదిలీలకు అవకాశం బదిలీ కోరుకునే ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరగకుండా.. నిర్ణీత గడువులోగా అర్హులందరికీ ప్రొబేషన్ కూడా పూర్తయ్యేలా కలెక్టర్లతో కలిసి ఆయా శాఖాధిపతులు చర్యలు చేపట్టాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ సూచించారు. డైరెక్టర్ లక్ష్మీశతో కలిసి శనివారం ఆయన సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖాధిపతులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. -
పుల్వామా అమర జవాన్ల భార్యల అరెస్ట్
జైపూర్: పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన అమరవీర జవాన్ల భార్యలను రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు డిమాండ్లతో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్ల భార్యలు జైపూర్‌లోని సచిన్ పైలట్ ఇంటి ఎదుట ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం దీక్షను భగ్నం చేసి.. స్థానిక స్టేషన్‌కు తరలించారు పోలీసులు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ నివాసం ఎదుట ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఈ ముగ్గురు మహిళలు నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ క్రమంలో సచిన్ పైలెట్ ఆ ముగ్గురితో మాట్లాడినా కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. దీంతో.. తమ దీక్షను ఆమరణ దీక్షగా మార్చుకున్నారు వాళ్లు. అయితే శుక్రవారం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి స్థానిక పీఎస్‌కు తరలించారు. అరెస్ట్ క్రమంలో పోలీసులు ఆ మహిళలతో దురుసుగా ప్రవర్తించగా.. సచిన్ పైలట్ పోలీసుల తీరును తప్పుబట్టారు. మరోవైపు ఈ ఉదంతంపై జాతీయ మహిళా కమిషన్ మండిపడింది. వితంతువులపై భౌతిక దాడి జరిగిందంటూ రాజస్థాన్ డీజీపీ లేఖ రాసి.. ఘటనపై వివరణ కోరింది. ఇదిలా ఉంటే.. అమర వీరుల కుటుంబ సభ్యులకు సాధారణంగా ప్రభుత్వాలు ఉద్యోగాలను ప్రకటిస్తుంటాయి. అయితే తమ పిల్లలకు బదులుగా బంధువులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఈ మేరకు అవసరమైతే రూల్స్ సవరించాలని ఈ ముగ్గురు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. తమ గ్రామాలకు రోడ్లు వేయించాలని, ఊరి నడిబొడ్డున తమ భర్తల విగ్రహాలు ఏర్పాటు చేయించాలని కోరారు. దీనిపై ట్విటర్ ద్వారా స్పందించిన సీఎం అశోక్ గెహ్లాట్.. ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే రాతపూర్వకంగా స్పష్టమైన హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తామని చెబుతూ.. తమ దీక్షను కొనసాగించారు వాళ్లు. మరోవైపు బీజేపీ ఈ పరిణామాల ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. అయితే దీనిని రాజకీయం చేయడం సరికాదని అంటున్నారు సీఎం గెహ్లాట్. జమ్ముకశ్మీర్ పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14వ తేదీన.. శ్రీనగర్ జాతీయ రహదారిపై పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRFP) సిబ్బంది కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు తెగబడ్డారు. ఈ దాడిలో 40 మంది జవాన్లు అమరులు కాగా, యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. -
ఒంటరి మహిళలే టార్గెట్.. నమ్మించి నగ్న వీడియోలు తీసి..
బనశంకరి(కర్ణాటక): ఒంటరి, వితంతు మహిళలను మాయమాటలతో నమ్మించి నగ్నచిత్రాలు తీసి డబ్బు గుంజుతున్న మహిళతో పాటు నలుగురు ఖతర్నాక్ గ్యాంగ్‌ను ఆదివారం మహాలక్ష్మీ లేఔట్ పోలీసులు అరెస్ట్‌చేశారు. మంగళ, రవి, శివకుమార్, శ్రీనివాస్ ఆ ముఠా సభ్యులు. మంగళ, రవి దంపతులు కాగా శివకుమార్, శ్రీనివాస్‌తో కలిసి ముఠాగా అయ్యారు. ఒంటరి మహిళలను గాలించి మంగళ వారిని పరిచయం చేసుకునేది. చదవండి: ఒంటరిగా బతకలేను.. అందుకే వెళ్లిపోతున్నా.. నన్ను క్షమించండి మహిళలను కారులో ఎక్కించుకుని నిర్జన ప్రాంతాల్లోకి తీసుకెళ్లి ప్రాణాలు తీస్తామని బెదిరించి నగ్నచిత్రాలు వీడియో తీసేవారు. ఇక అప్పటినుంచి వారిని బెదిరించి డబ్బులు రాబట్టుకునేవారు. ఈ ముఠాపై మహాలక్ష్మీ లేఔట్ పోలీస్‌స్టేషన్‌లో ఓ బాధితురాలు కేసు పెట్టింది. తనను బెదిరించి బంగారుచైన్, నగలు, రూ.84 వేల నగదు దోచుకున్నారని తెలిపింది. దీంతో ముఠాను అరెస్ట్‌చేసి వీరి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన నగలు, రూ.70 వేల నగదు, కారు, మొబైల్, కత్తులను స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు. -
వారికి విముక్తి ఎప్పుడో?!
కుటుంబ సభ్యుల్ని కోల్పోతేనే తట్టుకోలేం. వారి జ్ఞాపకాలతో భారంగా కాలం వెళ్లదీస్తాం. కానీ ఓ మహిళ తన భర్తను కోల్పోతే భరించడం ఎంతో కష్టం. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు కరువై, సమాజం నుంచి వచ్చే చీత్కారాలు, ఆర్ధికంగా వెనకబాటు, పిల్లల పోషణ ఇలా అన్నీ విషయాల్లో భర్తను కోల్పోయిన భార్యలు నరకాన్ని అనుభవిస్తున్నారు. అలాంటి వారి కోసం ఐక్యరాజ్య సమితి ప్రతిఏడు జూన్ 23న అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం జరుపుతోంది. వారికి విముక్తి కలిగించేందుకు కృషి చేస్తోంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం.. ప్రపంచంలో వితంతువులు 25కోట్ల మందికి పైగా ఉన్నారు. వారిలో 10 కోట్ల మంది తీవ్ర పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ప్రస్తుత కరోనా సంక్షొభంలో కారణంగా వారి జీవనం మరింత దయనీయంగా మారింది. నేపథ్యం "ఇన్ విజుబుల్ ఇన్ విజుబుల్ ప్రాబ్లమ్స్" అనే థీమ్‌తో జూన్ 23న వితంతువుల దినోత్సవంగా నిర్ణయించింది. భర్త జీవించినంత కాలం ఆమెను గుర్తించిన సమాజం.. వితంతువుగా మారడంతో అదే సమాజం నుంచి ఎన్నో అవమానాల్ని ఎదుర్కొంటుంది. చట్టాల్ని అమలు చేసే ప్రభుత్వాలు సైతం వారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వలేకపోతున్నాయి. చరిత్ర డిసెంబర్ 23, 2010లో ఐకరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జూన్ 23ను వితంతు దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. అంతకు ముందు లుంబా ఫౌండేషన్ జూన్ 23న వితంతు దినోత్సవాన్ని నిర్వహించేంది. 2005 నుంచి 2010 వరకు ఐదేళ్ల పాటు లుంబా ఫౌండేషన్ ఈ పనిని చేసింది. దీనికి కారణరం లేకపోలేదు.. లూంబా వ్యవస్థాపకుడు రజిందర్ తల్లి పుష్పవతి లూంబా 1954 జూన్ 23న వితంతువు అయ్యారు. దీంతో పడిన కష్టాలు... వితంతువుగా ఆమె ఎదుర్కొన్న సమస్యలు... వాటిని ఆమె ఎదిరించిన తీరును స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చదవండి: ఏది నిజం, అక్కడ అమ్మాయిలు ఉన్నట్లా! లేనట్లా? -
వితంతువులను గౌరవిద్దాం...
ప్రపంచ వ్యాప్తంగా వితంతువులు ఏదో ఒక రూపంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. గృహ బహిష్కరణ, గృహ హింస, వివక్షత, మూఢాచారాలు, పేదరికం లాంటి ఎన్నో సమస్యల వలయంలో చిక్కుకొని బతుకుబండి లాగుతున్నారు. అనునిత్య జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్న వితంతువులకు అండగా ఉంటూ ఆదరణ చూపించడానికై ఐక్యరాజ్య సమితి 2011 జూన్ 23వ తేదీని అంతర్జాతీయ వితంతువుల దినోత్సవంగా ఏర్పాటుచేసి వితంతు వివక్ష విముక్తి కోసం పోరాడాలని పిలుపు ఇచ్చింది. గత పదేళ్లుగా తెలుగు రాష్ట్రాలలో వితంతు విముక్తి ఉద్యమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో ముమ్మరంగా నడుపుతున్న బాల వికాస సామాజిక సేవా సంస్థ, వరంగల్ వారు ప్రపంచ చరిత్రలోనే 10,000 మంది వితంతువులతో అతి పెద్ద మహాసభను 2018 జూన్ 23న హైద్రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటుచేశాము. ఈ సభకు వచ్చిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు వితంతు వివక్ష అనేది ఏ మతంలోనూ ప్రోత్సహించరని, జరుగుతున్న తంతు అంతా కూడా ఒక సామాజిక మూఢ నమ్మకం, మూఢాచారం మాత్రమే అని చాటి చెప్పారు. భారదేశంలో సుమారు నాలుగున్నర కోట్ల వితంతువులు ఆధరణ నోచుకోకుండ, ఆత్మాభిమానం కోల్పోయి జీవిస్తున్నారు. గ్రామాలలో, పట్టణాలలో అనేక మంది వితంతువులు అనేక పరిస్థితులలో భయంకర వివక్షతను అనుభవిస్తున్నారు. పండుగల్లో, కుటుంబ శుభకార్యాలలో వివక్షత. కనీసం కన్నబిడ్డ వివాహాల్లో మనస్పుర్తిగా ఆశీర్వదించలేని అభాగ్యురాలిగా, సాటి మహిళలలాగా సాధారణ బట్టలు వేసుకోలేక, పురుషులలాగా రెండో పెళ్ళి చేసుకోలేక, ముఖ్యంగా యువ వితంతువులు ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, వితంతువులు సాటి మహిళతో సమానత్వం కావాలనీ, కనీసం తనను మనిషిలా చూడాలని కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాము. ప్రభుత్వాలతోపాటు, సమాజంలోని అందరు వితంతువులపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటే ప్రజల ఆలోచనలు మారి, ఆచరణలో మార్పు వచ్చినప్పుడు సమాజం మార్పు చెందుతుంది. ఈ వితంతు వివక్షా విముక్తి ఉద్యమంలో భాగస్వాములై మన అమ్మ, అక్క, చెల్లి, కూతురు అందరూ ఆత్మగౌరవంగా జీవించే హక్కు కల్పిద్దాం. – సింగారెడ్డి శౌరిరెడ్డి బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొబైల్: 98491 65890 -
ఏ చట్టమైనా ఇంటి స్త్రీని రక్షించాలి..
చనిపోయినవారు బతికున్నవారితో కలిసి ఒకేచోట చేరడం ఢిల్లీలో జరిగింది. పంజాబ్‌లోని దాదాపు 2000 మంది వితంతువులు ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంలో పసుపుపచ్చటి దుపట్టాలు తలపై కప్పుకుని పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లో ఫొటోలే. భర్తలవి. తండ్రులవి. కుమారులవి. అన్నీ బాగుంటేనే ఇంత మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.. ఈ కొత్త చట్టాల వల్ల ఇంకా ఎంతమంది వితంతువులను తయారు చేస్తారు మీరు? అని వారు ప్రశ్నించారు. వితంతువులందరూ ఒక్కటై తమ నిరసనను వ్యక్తం చేయడం ఈ ఉద్యమంలో ఒక బలమైన సందర్భం. వీరు చెబుతున్న కథలు వ్యధాభరితం. శోకం చాలా గాఢంగా ఉంటుంది. అది చాలా సహనాన్ని కూడా ఇస్తుంది. కాని ఒక దశ తర్వాత అది తిరగబడుతుంది. శోకానికి కూడా చివరి బిందువు ఉంటుంది. అది దాటితే కన్నీరు కార్చే కళ్లు రుధిర జ్వాలలను వెదజల్లుతాయి. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంలో ఇదే కనిపిస్తోంది. చదవండి: నాకు పేరొస్తుందనే.. విపక్షాలపై మోదీ ధ్వజం ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళనలో బుధవారం ప్రత్యేకంగా ‘వితంతువుల నిరసన’ నిర్వహించేందుకు సోమ, మంగళవారాల్లోనే పంజాబ్ నుంచి వితంతువులు ప్రత్యేక బస్సుల్లో, ట్రాలీలలో బట్టలు, ఆహారం పెట్టుకుని బయలుదేరారు. బయలుదేరేముందు స్థానిక కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, ధర, నిల్వకు సంబంధించిన కొత్త సవరణలతో వచ్చిన చట్టాలు వీరికి ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేవు. చదవండి: రైతుల వాదనకే మద్దతు ఢిల్లీ– హర్యానా సరిహద్దులోని టిక్రీ వద్ద వేలాదిగా రైతులు బైఠాయించి నెల రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని, సవరింపులను ఒప్పుకోము అని వారు తేల్చి చెబుతున్నారు. మగవారు వ్యవసాయాన్ని వదిలి ఇక్కడకు చేరగా పంజాబ్‌లో చాలా మటుకు స్త్రీలు, పిల్లలు పొలం పనులు చూస్తున్నారు. అయితే బుధవారం రోజున ప్రత్యేకంగా వ్యవసాయ రుణాల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల భార్యలు, తల్లులు, తోబుట్టువులు ఈ నిరసనలో పాల్గొన్నారు. భారతదేశంలో 2019లో 10,281 మంది వ్యవసాయరంగంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో 5,957 మంది రైతులు కాగా, 4,324 మంది రైతు కూలీలు. దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యల్లో వ్యవసాయరంగ ఆత్మహత్యలు 7.5 శాతం ఉన్నాయి. పురుషుడు పరువు కోసం ప్రాణాలు తీసుకుంటూ ఉంటే స్త్రీ కుటుంబం కోసం ప్రాణాలు నిలబెట్టుకుంటూ రావడం దేశమంతా ఉంది. ‘ఏ రోజైతే మా ఇంటి మగాళ్లు ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ రోజే మా జీవితం ఆగిపోయింది’ అని ఇక్కడ నిరసనలో పాల్గొన్న వితంతువులు తెలియచేశారు. ‘పంజాబ్‌లో సంపన్న రైతులు ఉన్నారు. అలాగే పేద రైతులు తక్కువేం లేరు’ అని ఈ మహిళలు అన్నారు. వీరు ఇలా వచ్చి నిరసన తెలపడానికి కారణం ఏమంటే ఆ అప్పులు పెరుగుతూ ఉండటం. దేశంలో ఏ చట్టమైనా ఇంటిని, ఇంటి స్త్రీని రక్షించేదిగా ఉండాలని ప్రజలు అనుకోవడం సహజం. ఇప్పడు ఆ స్త్రీ తీవ్ర ఆందోళనలో ఉంది. ఆ ఆందోళన తొలగక పోతే అశాంతి కొనసాగుతూనే ఉంటుంది. – సాక్షి ఫ్యామిలీ -
చివరి మజిలీలో ఏడి'పింఛన్'
సాక్షి, అమరావతి : అన్ని అర్హతలుండీ సామాజిక భద్రత పింఛన్ల కోసం లక్షలాది మంది కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అర్హత ఉన్న లక్షలాది మంది వృద్ధులు పింఛన్ కోసం మండల, పంచాయతీ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. గతంలో ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఉన్న పాత పద్ధతి పునరావృతమవుతోంది. ఎవరైనా పింఛన్‌దారుడు మరణిస్తేనే ఆ స్థానంలో మరొకరికి పింఛన్ మంజూరు చేస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో లక్షలాది మంది పింఛన్ల కోసం ఎదురుచూస్తుండగా.. ప్రభుత్వం మంజూరు చేసే పరిస్థితి కనిపించడం లేదు. వైఎస్ హయాంలో అందరికీ పింఛన్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఏడాది వ్యవధిలోనే దాదాపు 23 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు కొత్తగా పింఛన్లు ఇచ్చిన చరిత్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ది. 2007–08 సంవత్సరంతో పోల్చితే.. 2008–09 సంవత్సరానికి ఒక్క ఏడాదిలోనే దాదాపు 23 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు 2014 సెప్టెంబర్ ఆరో తేదీన రాష్ట్ర శాసనసభకు సమర్పించిన కాగ్ రిపోర్టులోనే ప్రభుత్వం పేర్కొంది. 2004కు ముందు తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో పింఛనుదారుల్లో ఎవరో ఒకరు చనిపోతేనే ఆ స్థానంలో కొత్త వారికి పింఛన్ మంజూరు చేసే పరిస్థితి ఉండగా.. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరు చేయాలని ఆదేశాలు జారీచేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దుర్భర జీవితం గడుపుతున్నా.. నాకు 75 ఏళ్లు. నా భర్త 40 ఏళ్ల కిందట ఓ ప్రమాదంలో మృతిచెందాడు. నా ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లయ్యాయి. ప్రభుత్వం ఇస్తున్న రూ.1,000 పింఛన్ ఎటూ చాలడం లేదు. పెరిగిన ధరలు, అనారోగ్య సమస్యలకు వాడుతున్న మందులకు పింఛన్ నగదు సరిపోక దుర్భర కష్టాలు అనుభవిస్తున్నాను. అయితే పాదయాత్ర చేస్తున్న జగన్.. మా లాంటి వృద్ధుల పింఛన్‌ను రూ.2,000కు పెంచుతానని ప్రకటించడంతో చాలా సంతోషమేసింది. పక్కా ఇళ్లు కూడా కట్టిస్తానని చెప్పడంతో నాకు ఈ ఇరుకు ఇంటికి బదులు మంచి ఆసరాదొరుకుతుందని నమ్ముతున్నాను. ఆయన ముఖ్యమంత్రి అయి మా లాంటి పేదల కష్టాలు తీర్చాలని కోరుకుంటున్నాను. – వాసంశెట్టి సుబ్బాయమ్మ, అంగర గ్రామం,కపిలేశ్వరపురం మండలం, తూర్పుగోదావరి జిల్లా ఆశలన్నీ రాజన్న బిడ్డమీదే.. నిరుపేద రజక కుటుంబంలో పుట్టిన నేను సమస్యలతో సహవాసం చేస్తున్నాను. భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. నాకు నిలువ నీడ లేదు. 50 ఏళ్ల వయసున్న నన్ను కాళ్ల వాపు, థైరాయిడ్, అధిక బరువు, బీపీ సమస్యలు బాధిస్తున్నాయి. ఇంటి పనులు కూడా చేసుకోలేకపోతున్నాను. చాలీచాలని రూ.1,000 వితంతు పింఛనే నాకు ఆధారం. మందుల ఖర్చులు పెరగడంతో డబ్బులు సరిపోక దుర్భర జీవితం గడుపుతున్నాను. అయితే వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలతో నాలో ఆశలు చిగురిస్తున్నాయి. రూ.2,000 పింఛన్, ఇంటి సదుపాయం పథకాలతో నా జీవితానికి భరోసా దొరుకుతుందని ఎదురు చూస్తున్నాను. పాదయాత్రగా మా ఊరు వచ్చిన వైఎస్ జగన్‌ను కలిసి నా కష్టాలు చెప్పుకున్నాను. అప్పుడు రాజన్న బిడ్డ నాకు ధైర్యం చెప్పారు.. భరోసా ఇచ్చారు. ఆ బిడ్డ చూపిన ఆప్యాయత ఎప్పటికీ మరువలేను. ఆశలన్నీ రాజన్న బిడ్డమీదే పెట్టుకుని బతుకుతున్నాను. – బైనపాలెం పుష్ప, తాటిపాకమఠం,రాజోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా జగన్ రాక కోసం ఎదురుచూస్తున్నా.. నాకు 70 ఏళ్లు.. 30 ఏళ్ల కిందట నా భార్య మృతి చెందింది. నాకు ముగ్గురు కుమార్తెలు.. ఓ కుమారుడు. కుమార్తెలకు వివాహం చేశాను. తీవ్ర అనారోగ్యంతో నా పనులు కూడా నేను చేసుకోలేకపోతున్నాను.నా కుమారుడు బాధ్యత మరవడంతో వాడిని కూడా నేనే సాకాల్సిన పరిస్థితి. రోజు రోజుకూ ఒంట్లో సత్తువ కోల్పోతున్నాను. వృద్ధాప్య పింఛన్ రూ.1,000 ఎటూ చాలడం లేదు. భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న దశలో రాజన్న బిడ్డ ప్రకటించిన నవరత్నాలతో నాలో ఆశలు చిగురిస్తున్నాయి. ఆ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక నాకు పింఛన్ నగదు పెరుగుతుందని ఆశిస్తున్నాను. – కోటి శేషారావు, తాతపూడి,కపిలేశ్వరపురం, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ జగన్ నవరత్నాల హామీ.. ►ప్రస్తుతం ఉన్న వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం. ►వృద్ధాప్య, వితంతువులకు రూ.2000 చొప్పున పింఛన్ ►వికలాంగులకు పింఛన్ రూ.3,000కు పెంచుతాం. ►అర్హత ఉన్న కుటుంబానికి ►ఈ పథకంలో ఏడాదికి రూ.24 వేల నుంచి రూ.48 వేల దాకా లబ్ధి బాబు ప్రభుత్వ తీరును తప్పుబట్టిన కోర్టు చంద్రబాబు ప్రభుత్వం జన్మభూమి కమిటీల ద్వారా రాజకీయ కారణాలతో పింఛన్ల తొలగింపునకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు మూకుమ్మడిగా కోర్టులను ఆశ్రయించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో కోర్టు గడప తొక్కారు. హైకోర్టు సైతం ఒకానొక సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోర్టు తీర్పు ద్వారా చాలా మంది పింఛన్లు పొందుతున్న పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు సర్కార్‌లో పింఛన్లపై ఆంక్షలు ►వృద్ధాప్య పింఛన్‌కు 60 ఏళ్లు దాటిన వారు అర్హులని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటే.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 65 ఏళ్లు దాటితేగానీ పింఛన్‌కు అర్హులు కాదని నిబంధనపెట్టింది. ►తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో గ్రామ, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు సూచించిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు. ► అసలైన అర్హత టీడీపీ ► మద్దతుదారులుగా ఉండటమే. -
‘దుక్కలా ఉండి పెన్షన్ అడుగుతారా’
సాక్షి, విశాఖ : ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు మహిళల గురించి అసభ్యంగా మాట్లాడారు. విశాఖ జిల్లాలోని బుచ్చయ్యపేట మండలం చిన్నపాలెంలో గురువారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వితుంతు మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘భర్త చనిపోయినవారికి పెన్షన్ అడిగితే సరేగాని.. దుక్కలా ఉండి పెన్షన్ కావాలంటే ఎలా? ఊళ్లలో కొంతమంది మహిళలు తమ భర్త లేడు. పెన్షన్ కావాలంటారు. ఉన్నాడా.. పోయాడా అంటే చెప్పరు. పదేళ్లుగా జాడ లేదని చెప్తారు. అలాంటి వారికి పెన్షన్ ఎందుకు ఇస్తాం. ఎక్కడి నుంచి ఇస్తాం. భర్తలను మీరు (వితంతువులు) రాచి రంపాన పెడితేనే వారు పారిపోయారు’ అని దిక్కుమాలిన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై మహిళలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత గల పదవిలో ఉండి ఇంత నీచంగా మాట్లాడుతారా అని తిట్టిపోస్తున్నారు. -
చేలల్లో నీలిమ
జర్నలిస్టు, రచయిత్రి అయిన నీలిమ ఈ మధ్యే ‘విడోస్ ఆఫ్ విదర్భ’ అనే పుస్తకం రాసింది. ఆక్స్ఫర్డ్ ప్రచురణ. ఈ పుస్తకం ఇటీవలే విడుదలైంది.తెలంగాణ వ్యవసాయ పరిస్థితులు, రైతుల స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడితే చాలా విషయాలను పంచుకుంది. వాటిలోని విశేషాంశాలివి. 2001.. జూలై. ఫూలన్ దేవి హత్య జరిగిన రెండు రోజుల తర్వాత ఆమె హత్యకు పాల్పడ్డ షేర్ సింగ్ రాణా లొంగిపోనున్నాడనే వార్తలు మొదలయ్యాయి. అప్పటికే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్‌లో మంచిపేరు తెచ్చుకున్న ముప్పై ఏళ్ల యంVŠ జర్నలిస్ట్ ఒక అమ్మాయి తన ప్రశ్నలతో షేర్ సింగ్ రాణాను ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అతను డెహ్రాడూన్ వైపు గాని, రూర్కీ వైపు గాని వెళ్లి ఉండొచ్చు అని పోలీసుల ఊహాగానాలు. ఆ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్స్ అన్నీ అలెర్ట్ అయ్యాయి. కానీ ఆ అమ్మాయిలో ఏదో సందేహం? అతను ఆ రెండు ప్రాంతాల వైపు కాకుండా... తనింటికి దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌లోనే సరెండర్ అవుతాడని. అందుకే అతని ఇంటికి దగ్గర్లో ఉన్న పోలీస్‌స్టేషన్ మీదే దృష్టి పెట్టింది. ఆమె అనుమానం నిజమైంది. వెంటనే ఆ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ షేర్ సింగ్ రాణా ఉన్నాడు! గబగబా ప్రశ్నల పరంపర సంధించింది. పదిహేను నిమిషాలకు మిగతా మీడియాకు ఉప్పంది, అక్కడికి వచ్చి వాలింది. కానీ రాణాను మొదట పట్టుకున్న ఘనత ఆమెకే దక్కింది. ఆమె కెరీర్లో ఇలాంటివి ఎన్నో! 2జీ స్పెక్ట్రమ్, నార్కోటిక్స్ నుంచి రాజకీయ కుట్రల దాకా ఎన్నెన్నో రిపోర్టింగ్స్.. చెప్పుకుంటూ వెళితే చాలానే! ఆమే నీలిమ. ‘ది స్టేట్స్‌మన్’లో తొలి ఉద్యోగం కోట నీలిమ పుట్టింది విజయవాడలో. పెరిగింది ఢిల్లీలో. తండ్రి కేవీఎస్ రామశర్మ. ఆయనా జర్నలిస్టే. నేషనల్ హెరాల్డ్‌కి ఎడిటర్‌గా పనిచేశారు. తల్లి ఉమా శర్మ. రచయిత్రి. ప్రపంచాన్ని ఎలా చూడాలో నాన్న ద్వారా నేర్చుకుంది నీలిమ. అమ్మ వల్ల ఊహాత్మక శక్తి పెరిగింది. ఈ రెండూ తన వృత్తికి ఎంతగానో ఉపయోగపడ్డాయి అంటుంది నీలిమ. అసలు తను జర్నలిస్ట్ అవడానికి ప్రేరణ మాత్రం తండ్రి నుంచే వచ్చింది అని చెప్తుంది. ఢిల్లీలో చదువు. అమెరికాలో పీహెచ్డీ చేసింది. జర్నలిస్ట్‌గా మొదట పెన్ను పట్టింది ‘‘ది స్టేట్స్‌మన్’’ పత్రికలో. తర్వాత ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది సండే గార్డియన్లకు పనిచేసింది. ప్రస్తుతం ది హఫింగ్టన్ పోస్ట్, డైలీ ఓ, డీఎన్ఏ, న్యూస్ 18లకు కాలమిస్ట్‌గా వ్యాసాలు రాస్తోంది. ఆమె దృష్టి అంతా పాలిటిక్స్, పాలసీస్, జెండర్, రైతుల మీదే. పత్రికల విధానాలు నచ్చలేదు! 2001–02 మధ్య.. హఠాత్తుగా రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతున్నట్టు గమనించింది నీలిమ. దేశానికి అన్నం పెట్టే రైతు బలవంతంగా ప్రాణం తీసుకునేదాకా వెళ్లాడంటే ఎంత దారుణమైన పరిస్థితులున్నట్టు! వాళ్లకోసం విధానాలు రూపొందించే యంత్రాంగానికి క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసా? రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుందో కనీసం రైతులకన్నా తెలుసా? వీటి గురించి కదా తను రిపోర్ట్ చేయాలి. వీటిని కదా.. మీడియా బ్యానర్లు రాయాలి. కానీ వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంది. నిజాన్ని చెప్పాలి అంటే తాను పనిచేస్తున్న పత్రికల పాలసీకి భిన్నంగా నడవాలి. అందుకే రాజీనామా చేయాలనుకుంది నీలిమ. వెంటనే నెలవారీ ఖర్చులు, ఈఎమ్ఐలు, కట్టవలసిన లోన్లు కళ్లముందు కనిపించాయి. ఉద్యోగం వదిలేసి పూర్తిగా రైతుల ఆత్మహత్యల రీసెర్చ్ మీదే ఉండాలంటే ఇంకో ఇన్కమ్ సోర్స్కావాలి. అదేంటి? ఈ సంఘర్షణతో మరో రెండేళ్లు గడిచాయి. ఉద్యోగం మాని, విదర్భకు నీలిమ పెయింటర్ కూడా. ఉపనిషత్ల సారమే ఆమె పెయింటింగ్స్ థీమ్. దేశవిదేశాల్లో ఎగ్జిబిషన్స్ పెడ్తుంది. అప్పుడనిపించింది.. ఆదాయం కోసం ఈ కళనే ఉపయోగించుకోవాలని. రైతుల ఆత్మహత్యల పరిస్థితుల మీద రీసెర్చ్‌ను ఖరారు చేసుకుంది. 2004లో ఉద్యోగానికి రాజీనామా చేసి మహారాష్ట్రలోని విదర్భ బయలుదేరింది. అంతకుముందు మన దేశ వ్యవసాయం, పద్ధతులు, నష్టాలు వగైరా అన్నిటి మీద వచ్చిన పుస్తకాలు, శాస్త్రీయ పరిశోధనలన్నిటినీ అక్కడ చదివింది. తన పరిశోధనను సాగించింది. ఆ శోధననంతా పాఠ్యాంశంగా చెబితే ప్రజలకు పట్టదనీ గ్రహించింది. అందుకే వాటిని కథల రూపంలో, నవలల రూపంలో రాసింది. అలా రాసిన మొదటి పుస్తకం ‘‘రివర్‌స్టోన్స్’’. వ్యవసాయాన్ని, రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వ పాలసీలు ఎంత నిర్లక్ష్యం చేశాయో నవలారూపంలో వివరించిన పుస్తకం అది. 2007లో అచ్చయింది. రెండో పుస్తకం ‘‘డెత్ ఆఫ్ ఎ మనీలెండర్’’ 2009లో వచ్చింది. పల్లెల్లో పేదరికాన్ని పట్టించుకోకుండా వదిలేసిన మెయిన్ జర్నలిజం మీద ఎక్కుపెట్టిన అక్షరాస్త్రం ఆ పుస్తకం. 2013లో మూడో పుస్తకం ‘‘షూస్ ఆఫ్ ది డెడ్’’ని రాసింది. పొలిటికల్ బుక్‌గా అది బాగా పాపులర్ అయింది. పల్లెల్లోని యువత, నగరంలోని యువత మధ్య ఉండే వ్యత్యాసాన్ని.. దానికి కారణమైన వ్యవస్థకు నీలిమ అద్దం పట్టిందీ నవలలో. 2016లో ‘‘ది హానెస్ట్ సీసన్’’ను రాసింది. పార్లమెంట్ నాలుగు గోడల మధ్య జరిగే డీల్స్‌ను బహిర్గతం చేసిందీ పుస్తకంలో. ఆమె రాసిన ‘‘షూస్ ఆఫ్ ది డెడ్’’నవలను ప్రముఖ తమిళ దర్శకుడు వెట్టిమారన్ సినిమాగా కూడా రూపొందించబోతున్నాడు. ఇదీ కోట నీలిమ రచయిత్రిగా మారిన తీరు. ది గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ నీలిమ పుస్తకాలన్నీ ఇంగ్లిష్‌లోనే ఉన్నాయి. కారణం తనకు తెలుగు అంత గొప్పగా రాయడం రాకపోవడమే అంటారు. ‘‘చిన్నప్పుడు మా నాన్న గారు మాకు తెలుగు నేర్పే విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. ఏదైనా తెలుగు పుస్తకం ఇచ్చి చదవమని చెప్పేవారు. చాలా హార్డ్‌గా ఉంది నాన్నా అంటే అవునా అంటూ ‘వేయి పడగలు’ వంటి భారీ పుస్తకాన్ని తెచ్చి ముందు పెట్టేవారు. మేం మొహం తేలేస్తే.. ‘ఇప్పుడు ముందు ఇచ్చిన పుస్తకం తేలిగ్గా అనిపిస్తుంది కదా.. చదవండి’ అనేవారు. అలా తెలుగు నేర్పే విషయంలో ఎంత పట్టుదలగా ఉండేవారో.. పుస్తకాలు చదివే విషయంలో కూడా అంతే ఇదిగా ఉండేవారు. నా ఎనిమిదో యేటనే చార్ల్స్ డికెన్స్ ‘‘ది గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్’ పుస్తకం ఇచ్చారు. అర్థంకాలేదు. మళ్లీ నాలుగేళ్లకు ఇచ్చారు చదవమని. అలా ఉంటుంది ఆయన ట్రైనింగ్. ఈ రోజు ఇలా ఉన్నామంటే అమ్మా, నాన్నే కారణం’’ అని గుర్తు చేసుకుంది నీలిమ. తెలుగు నేర్పాలని తండ్రి అంత ప్రయత్నించినా.. ఢిల్లీలో పెరగడం, వృత్తిరీత్యా ఇంగ్లిష్ భాషకే పరిమితమవడం వల్ల తెలుగు మీద పట్టు రాలేదు నీలిమకు. అందుకే తన పుస్తకాలను తెలుగులో అనువదించేందుకు.. ఇంకా చెప్పాలంటే ఇతర భారతీయ భాషల్లో అనువదించేందుకూ ప్రయత్నిస్తోంది. సమస్యలపై ‘స్టూడియో అడ్డా’ ప్రస్తుతం తెలంగాణ రైతు సమస్యలు, చేనేత కార్మికుల అవస్థలు, గల్ఫ్ వలసల గురించీ అధ్యయనం చేయడానికి హైదరాబాద్ వచ్చింది. ‘‘తెలంగాణలోనూ రైతుల ఆత్మహత్యలు భయం కలిగిస్తున్నాయి. ముందు నేను తెలంగాణ పల్లెలన్నీ తిరగాలనుకుంటున్నాను’’ అంది నీలిమ. ఇంకోవైపు ‘‘స్టూడియో అడ్డా’’ అనే సంస్థనూ స్థాపించి.. సోషల్ ఫారమ్‌గా మలిచింది. ఎవరైనా ఆ సంస్థలో ఎన్రోల్ చేసుకోవచ్చు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న అన్ని అంశాలు, సమస్యలు చర్చిస్తారు. ఆర్ట్ ఎగ్జిబిషన్స్నూ ఆమె కండక్ట్ చేస్తోంది. ఇదీ కోట నీలిమ మల్టీ టాస్కింగ్. విడోస్ ఆఫ్ విదర్భ నాలుగు పుస్తకాలు రాశాక నీలిమ ఆలోచన మారింది. ఇంత రీసెర్చ్‌లో ఆమెకు విషయాలన్నీ చెప్పింది చనిపోయిన రైతుల భార్యలు, తల్లులే. బరువు, బాధ్యతలను వదిలేసి ఆత్మహత్యతో రైతులు సాంత్వన పొందితే వాటన్నిటినీ నెరవేరుస్తున్నది ఈ ఆడవాళ్లే. అప్పులు తీర్చి, పిల్లలకు చదువులు చెప్పించి, పెళ్లిళ్లు చేసి జీవనాన్ని వెళ్లదీస్తున్నారు. అలాంటి వాళ్ల స్ట్రగుల్‌ని కదా చెప్పాలి అనుకుంది. అందుకే ‘‘విడోస్ ఆఫ్ విదర్భ’’గా పుస్తకాన్ని తెచ్చింది. ‘‘ఈ పుస్తకం రాయడానికి నాలుగేళ్లు పట్టింది. ముందు 100 కేస్‌స్టడీస్ తీసుకున్నా.. అందులోంచి 50 ఎంచుకొని అందులోంచి మళ్లీ పద్దెనిమిది తీసుకున్నా. ఆ పద్దెనిమిది మంది జీవితాలు ఒకేరకంగా లేవు. ఒక్కొక్కరూ ఒక్కోరకంగా జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. ఎవరూ ఎక్కడా ఆత్మగౌరవాన్ని కోల్పోలేదు. ధైర్యంగా నిలబడ్డారు. వాళ్లను చూస్తే.. వాళ్ల కథలు వింటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. వాళ్లకున్నంత సెల్ఫ్ ప్రైడ్, సెల్ఫ్‌రెస్పెక్ట్ అర్బన్ విమెన్, ఈవెన్ వర్కింగ్ క్లాస్ విమెన్‌కి కూడా ఉండదనిపించింది. చాలా నార్మల్ లేడీస్.. చదువు లేదు.. బయటి ప్రపంచం తెలియదు.. ఆర్థికంగా ఎలాంటి అండలేని వాళ్లు.. అయినా వాళ్లు నిలబడ్డ తీరు.. అద్భుతం! వాళ్ల భర్తలు చేసిన పనే వాళ్లు చేసి ఉంటే ఎన్ని కుటుంబాలు రోడ్డున పడేవి?’’ అంటూ తన పుస్తక నేపథ్యాన్ని వివరించింది నీలిమ. – సరస్వతి రమ -
‘జీవితభాగస్వామిని కోల్పోతే గుండెకు ముప్పు’
లండన్ : జీవితంలో ఓ దశ దాటిన తర్వాత ఒంటరితనం శాపమే. ఒంటరితనం పలు రుగ్మతలకు దారితీస్తుందని ఇప్పటికే పలు అంచనాలు వెలువడ్డాయి. జీవిత భాగస్వామిని కోల్పోయిన తర్వాత తొలి ఆరునెలల్లో హృద్రోగ ముప్పుతో మరణం సంభవించే ప్రమాదం 40 శాతం అధికంగా ఉందని తాజా అథ్యయనం పేర్కొంది. ఎంతో ప్రేమించే వ్యక్తిని కోల్పోయిన తర్వాత తొలి ఆరునెలలు ఆ బాధను నియంత్రించుకోవడం ఎవరికైనా చాలా కష్టమని ఈ సమయంలో బాధితులకు మరణం ముప్పు 41 శాతం వరకూ అధికంగా ఉంటుందని టెక్సాస్‌కు చెందిన రైస్ యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన అథ్యయనం వెల్లడించింది. తీవ్ర విచారం మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఈ అథ్యయనంలో తేలిందని పరిశోధకులు పేర్కొన్నారు. జీవిత భాగస్వామిని కోల్పోవడం విషాదకరమని, ఈ ఒత్తిడి జీవించి ఉన్న వ్యక్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతుందని తెలిపింది. ముఖ్యంగా గుండె జబ్బుల కారణంగానే వీరికి మరణ ముప్పు 53 శాతం వరకూ అధికంగా ఉంటుందని అథ్యయనానికి నేతృత్వం వహించిన రైస్ వర్సిటీ సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రిస్ ఫగుండెస్ చెప్పారు. అథ్యయనంలో భాగంగా జీవిత భాగస్వామిని కోల్పోయిన 32 మంది ఆరోగ్య పరిస్థితిని టెక్సాస్‌లోని రైస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు విశ్లేషించారు. తామెంతో ప్రేమించే వ్యక్తిని కోల్పోతే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ సహా పలు హృదయ సంబంధిత వ్యాధులు తలెత్తే ముప్పుందని చెప్పారు. హృదయ కవాటాలు రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయని, హార్మోన్లు అమాంతం పెరగడం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నా వాస్తవంగా దీనికి కారణమేంటన్నది అస్పష్టంగా ఉంది. తమ అథ్యయనంతో జీవిత భాగస్వామిని కోల్పోయిన వారిని స్వాంతన పరిచే ప్రక్రియలో వినూత్న చికిత్సకు మార్గం సుగమమవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. -
వితంతు వేదన
భర్త చనిపోయినంత మాత్రాన పూలు, బొట్టుకు దూరం కావాల్సిన పని లేదని చెప్పాం. అక్కడకు వచ్చిన వారిని పూలు, బొట్లు పెట్టుకోవాలని చెప్పాం. అక్కడున్న వారిలో 70 శాతం మంది పూలు, బొట్లు పెట్టుకున్నారు. మళ్లీ మమ్మల్ని మేము ఇలా చూసుకుంటామని అనుకోలేదంటూ సగం మంది ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజంగా అదొక మరపురాని సన్నివేశం. సరళ, సుజాతలవి (మారు పేర్లు) ఇరుగు పొరుగు ఇళ్లు. ఇద్దరూ మంచి స్నేహితులు. ఉదయం పాలప్యాకెట్లతో మొదలయ్యే పలకరింపులు రాత్రి టీవీ సీరియల్స్‌పై మంచిచెడ్డలు చర్చించే వరకు కొనసాగేవి. కూరగాయలు కొనాలన్నా కలిసే వెళ్లేవారు. దురదృష్టవశాత్తు సరళ భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అంతే! సుజాతలో అనూహ్యమైన మార్పు. సరళతో మాట్లాడటం తగ్గించేసింది. విధవ ముఖం చూస్తే కీడు, ఎదురైతే అపశకునం అనే భావనతో స్నేహాన్ని చెరిపేసింది. ఉదయం సరళ కనిపిస్తే చాలు ముఖం మీదే తలుపేసేది. – లలితకు పదహారేళ్ల వయసులో పెళ్లైంది. పందొమ్మిదేళ్లకే భర్త మరణించాడు.ఒడిలో చంటి పిల్లాడు. ఓ పక్క నిర్జీవంగా ఉన్న భర్త, మరో పక్క పాలకోసం గుక్క పట్టి ఏడుస్తున్న చంటి పిల్లాడు. భర్త పోయిన మహిళ తన బిడ్డకు పాలిస్తే మంచిది కాదు. పిల్లాడికి పాలివ్వనీయకుండా అడ్డుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు. ఆకలితో పసి పిల్లాడు ఏడుస్తున్నా బిడ్డకు పాలు ఇవ్వనివ్వలేదు. ఓ వైపు భర్త మరణం, మరోవైపు ఆకలితో పిల్లాడి ఏడ్పు. వరుసగా పదకొండు రోజుల పాటు ఇదే నరకం. భర్త చనిపోయినంత మాత్రాన తల్లిపాలు బిడ్డకు ఎలా విషమవుతాయని గొంతు చించుకుని అరవాలని ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. చెప్పుకుంటే తమ ప్రమేయం లేకున్నా సమాజం నుంచి స్వంత కుటుంబ సభ్యుల నుంచి వింతంతు మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో. ఎలా వచ్చాయో, ఎప్పటి నుంచి అమలవుతున్నాయో కానీ నేటికి చేయని తప్పుకు మహిళలను శిక్షకు గురి చేస్తున్నాయి. ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా నిందలు, ఏ పని చేయకుండా అడ్డగింతలు ... ఈ పరంపరకు అడ్డుకట్ట వేస్తోంది బాల వికాస సంస్థ. వితంతువులపై కొనసాగుతున్న వివక్షకు అడ్డుకట్ట వేస్తోంది. కట్టుబొట్టులపై ఉన్న ఆంక్షలను పలుచన చేస్తున్నారు. సమాజంలో ముందుకు పోయేందుకు తోడ్పాటును అందిస్తున్నారు. వితంతువులపై ఉన్న ఆంక్షలు, కట్టుబాట్లను తొలగించడంపై చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై బాలవికాస వ్యవస్థాపకురాలు బాలథెరిస్సా చెప్పిన వివరాలు. సూటీపోటీ మాటలు భరించలేక... బాల వికాస ఆధ్వర్యంలో వేల సంఖ్యలో మహిళా సంఘాలు ఉన్నాయి. వీరితో సమావేశం జరుగుతున్నప్పుడు వితంతువుల ఇబ్బందుల విషయం చర్చకు వచ్చింది. ఒకరి తర్వాత ఒకరు చెప్పుకున్న కష్టాలను విని కళ్లు చెమర్చాయి. దీంతో వరంగల్, కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకంగా 2010లో సర్వే చేశాం. సుమారు ఐదువేల మంది వితంతువులతో మాట్లాడాం. ఇందులో 29 శాతం మంది సమాజం నుంచి ఎదురయ్యే సూటిపోటీ మాటలు భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేశారని తేలింది. ఆ తర్వాత విజయవాడ, కర్నూలు జిల్లాలలో సర్వే చేశాం. అక్కడ ఈ తరహా ఫలితాలే వచ్చాయి. అప్పటికే బాధలో ఉన్న వారిని మరింతగా బాధపెట్టేలా అమానవీయంగా, మానవ హక్కులకు విరుద్ధంగా ఉన్న కట్టుబాట్ల విషస్వరూపం కళ్లకు కట్టినట్లు కనపించింది. అందరితోపాటే మనం అన్నట్లుగా ఈ కట్టుబాట్లను సహిస్తూ వచ్చామనిపించింది. దీన్ని రూపుమాపేందుకు ఏదైనా చేయలని అప్పుడే నిర్ణయించుకున్నాం. పూలు, బొట్లు వితంతువుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ముందు వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయూత ఇవ్వాలనుకున్నాం. ఇది ఎక్కువ ఫలితం ఇవ్వదని అనిపించాక ... వారి ఆలోచన తీరులోనే మార్పు తేవాలని నిర్ణయించుకున్నాం. 2013లో తొలిసారిగా 250 మంది వితంతువుతో సమావేశం ఏర్పాటు చేశాం. భర్త చనిపోయినంత మాత్రాన పూలు, బొట్టుకు దూరం కావాల్సిన పని లేదని చెప్పాం. అక్కడకు వచ్చిన వారిని పూలు, బొట్లు పెట్టుకోవాలని చెప్పాం. అక్కడున్న వారిలో 70 శాతం మంది పూలు, బొట్లు పెట్టుకున్నారు. మళ్లీ మమ్మల్ని మేము ఇలా చూసుకుంటామని అనుకోలేదంటూ సగం మంది ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజంగా అదొక మరపురాని సన్నివేశం. ఇంత వేదన ఉందా అనిపించింది. అయితే బాల వికాస గేటు దాటగానే దాదాపు అందరూ బొట్టు పూలు తీసేసి .. ఎప్పటిలాగే ఇళ్లకు వెళ్లిపోయారు. సాటి మహిళలతోనే ఇక్కడ బొట్టు, పూలు పెట్టుకున్న వాళ్లు బయటకు వెళ్లగానే ఎందుకు తీసేశార ని అడిగాం. ఇలా చేస్తే తమకు ఇంకా వేధింపులు ఎక్కువ అవుతాయంటూ వారు బదులిచ్చారు. దీంతో ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని నిర్ణయించుకున్నాం. మహిళ సంఘాల గ్రూపు సమావేశాల్లో వితంతువుల సమస్యలు చర్చించాం. ఆ గ్రూపులో ఉన్న మహిళలలే ఈ సమస్యను అర్థం చేసుకునేలా వివరించాం. దీంతో వితంతువులు బొట్టు, పూలు పెట్టుకోవాలంటూ ఇతర గ్రూపు సభ్యులే ప్రోత్సహించారు. అలా మార్పు మొదలైంది. ఇప్పుడు బాల వికాస పరిధిలో 15000 మంది వితంతువులు ఉన్నారు. వీరిలో 70 శాతం మంది ఈ కట్టుబాట్లకు దూరంగా ఉన్నారు. ఇప్పటికీ కట్టుబాటు పాటించే వారిలో వయసు పైబడిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా చేయాలి వితంతువుల సమస్యలపై బాల వికాస చేసిన కృషి పరిమితమైంది. దీన్ని మరింత విస్తరించాలని నిర్ణయించాం. ఇతర ఎన్జీవోలు, ప్రభుత్వ రంగ సంస్థలు. మీడియా, సోషల్ మీడియాలతో కలిసి పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం. ముల్తైదువులు– వితంతువులు అనే భేదాలు ఉండకూడదు. మతం, కులం, ధనిక, పేద తేడా లేకుండా వితంతువుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం. వీటితోపాటు వారు ఆర్థికంగా నిలదొక్కుకునే కార్యక్రమాలు, నైపుణ్య శిక్షణ, దూరవిద్య వంటి కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగిస్తాం. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షిప్రతినిధి, వరంగల్ వ్యవస్థాపకురాలు బాలథెరిస్సా -
పింఛన్ పాట్లు..
జడ్చర్ల : ప్రభుత్వం ప్రతి నెల ఆసరా పథకం కింద అందజేస్తున్న పించన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు,తదితర పింఛన్ లబ్ధిదారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఉదయం లేచింది మొదలు పింఛన్లు పంపిణీ చేసే పోస్టాఫీస్ కార్యాలయాల వద్దకు చేరుకుని పింఛన్ తమకు ఎప్పుడు ఇస్తారా అంటూ ఎదురుచూస్తున్నారు. పంపిణీలో సాంకేతిక సమస్యలు, నగదు లేకపోవడం, తదితర కారణంగా పింఛన్లు తమ చేతికి అందడం లేదని ఈ సందర్భంగా వారు పేర్కొంటున్నారు. సోమవారం బాదేపల్లి, జడ్చర్ల పోస్టాఫీస్‌ల వద్ద పింఛన్ దారులు తీవ్ర ఇబ్బందులు పడినా చివరకు చేతికి అందక నిరాశగా వెనుదిరిగారు. పింఛన్ల కోసం పోస్టాఫీస్ చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోతున్నామని, తమకు ఇబ్బందులు కలుగకుండా పింఛన్లు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
రుణాల పేరుతో ఘరానా మోసం
‘మీరు రూ.5 వేలు కడితే చాలు లక్ష రూపాయల దాకా బ్యాంకులో రుణం ఇప్పిస్తా. మళ్లీ కట్టాల్సిన పనిలేదు. రుణమాఫీ చేయిస్తా’ అని నమ్మబలుకుతూ వృద్ధులు, వితంతువులను నిలువునా మోసం చేసిన ఘరానా మోసగాడి ఉదంతం వెలుగుచూసింది. ఎంతో ఆశతో ఉరవకొండ నుంచి అనంతపురానికి వచ్చిన మహిళలు కనీసం చార్జీలకు డబ్బులు లేకపోవడంతో స్వస్థలాలకు వెళ్లడానికి అష్టకష్టాలు పడ్డారు. అనంతపురం సెంట్రల్: ఉరవకొండ పట్టణానికి చెందిన 14 మంది వృద్ధులు, వితంతువులు ఓ ఘరానా మోసగాని చేతిలో తీవ్రంగా నష్టపోయారు. ఒక్కొక్కరు రూ. 5 వేలు కడితే రూ. 50 వేలు నుంచి రూ. లక్ష వరకూ స్టేట్ బ్యాంకులో రుణం మంజూరు చేయిస్తానని వెంకటరమణ అనే వ్యక్తి నమ్మబలికాడు. అదీ వృద్ధులు, వితంతువులకు మాత్రమే బ్యాంకులో రుణం మంజూరు చేస్తారని తెలిపాడు. దీంతో పట్టణంలో వివిధ కాలనీలకు చెందిన మొత్తం 14 మందిని గుంపు చేశాడు. అంకెల గారడీ.. అందరికీ బ్యాంకులో విత్‌డ్రా ఫాంలలో ఒక్కొక్కరికీ రూ. 50వేలు నుంచి రూ. లక్ష మంజూరు చేయిస్తున్నట్లు అంకెలు రాశాడు. రెండు రోజుల క్రితం అందరి ఇళ్ల వద్దకు పోయి ఈ నెల 31వ తేదీన అనంతపురానికి వెళితే డబ్బులు డ్రా చేసుకోవచ్చునని తెలిపాడు. అదేరోజు ఒక్కొక్కరు రూ. 5 వేలు తీసుకురావాలని చెప్పాడు. నమ్మితే నట్టేట ముంచాడు.. లక్ష రూపాయల వరకూ రుణం వస్తుండడంతో మహిళలంతా ఎంతో ఆశతో బుధవారం అనంతపురం వచ్చారు. టవర్‌క్లాక్ వద్ద దిగి అతని సెల్ నంబర్‌కు 9542948475 ఫోన్ చేశారు. వెంటనే ద్విచక్రవాహనంలో అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తి అందరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడు. సాయినగర్ స్టేట్ బ్యాంకు వద్దకు ఆటోలో రండి.. తాను అక్కడికి వస్తానని నమ్మబలికాడు. ఆటో ముందుకు వెళ్లిన వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. బ్యాంకు వద్దకు వెళ్లిన బాధిత మహిళలు అతని కోసం కొన్ని గంటల పాటు ఎదురుచూశాడు. సెల్‌కు ఫోన్ చేస్తే పనిచేయలేదు. కేసు నమోదుకు ససేమిరా.. మోసపోయామని గ్రహించిన బాధిత మహిళలు వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించారు. తమకు ఓ వ్యక్తి అన్యాయం చేశాడని మొరపెట్టుకున్నారు. పోలీసులు మాత్రం తమ పరిధిలోకి రాదంటూ ఒకరిపై ఒకరు నెట్టుకున్నారు. చివరకు బాధితులు నిరాశతో వెనుదిరిగారు. చలించిన హృదయం నడిరోడ్లో దిక్కుతోచని స్థితిలో ఉన్న మహిళల సమస్యను విన్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు చంద్రశేఖర్‌రెడ్డి బాధిత మహిళలను ఉరవకొండ వరకూ ఉచితంగా తీసుకెళతానని ముందుకు వచ్చాడు. కనీసం ఆ మాత్రం కూడా పోలీసులు చేయకపోవడంపై బాధిత మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు కనికరం చూపలేదు వెంకటరమణ అనే వ్యక్తి మోసం చేశాడని అన్ని పోలీస్స్టేషన్లకూ వెళ్లాం. అయితే ఎవరూ మా సమస్య వినేందుకు కూడా ఇష్టం చూపలేదు. కేసు నమోదు చేయలేదు. సీసీ కెమెరాల్లో చూస్తే నిందితున్ని పట్టుకోవచ్చు. పోలీసులు మాపై కనికరం చూపి నిందితున్ని గుర్తించి కఠినంగా శిక్షించాలి. – షరీఫా, బాధితురాలు, ఉరవకొండ -
5,054
∙ గుర్తించిన జిల్లా యంత్రాంగం ∙ రేపు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత ∙ అనర్హుల్లో ఎక్కువమంది వితంతువులే రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ఒంటరి మహిళల లెక్క తేలింది. 5,054 మంది అర్హులను గుర్తించారు. ఏ ఆధారమూ లేని వీరి ఎదురుచూపులకు రెండు రోజుల్లో మోక్షం లభించనుంది. జీవనభృతి కోసం గుర్తించిన ఈ లబ్ధిదారులకు ఆదివారం ప్రొసీడింగ్స్ అందజేయనున్నారు. ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం చేసే అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. గత నెల 8 నుంచి 25 తేదీ వరకు ఒంటరి మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో నాలుగు వేల వరకు దరఖాస్తులు రావచ్చని అధికారులు తొలుత అంచ నా వేశారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,017 దరఖాస్తులు అందాయి. వీటిని గత నెల 26 నుంచి 31వ తేదీ వరకు రెండు దశల్లో అధికారులు పరిశీలన చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లి పూర్వపరాలు ఆరా తీసి పరిశీలన జరిపారు. ఆ తర్వాత దశలో అన్ని దరఖాస్తుల్లో 10 శాతం రాండమ్‌గా మరోసారి పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతల మేరకు ఉన్న 5,054 మంది అర్హులను జీవనభృతికి ఎంపిక చేశారు. రెండు రోజుల కిందటే ఈ జాబితా ఖరారైంది. కలెక్టర్ రఘునందన్ రావు కూడా జాబితాకు ఆమోదముద్ర వేశారు. అనర్హుల్లో చాలామంది వితంతువులే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ఏదో ఒక పెన్షన్ పొందుతున్న వాళ్లూ దరఖాస్తుదారుల్లో ఉన్నట్లు గుర్తించారు. ఇటువంటి వాటిని తిరస్కరించామని వివరిస్తున్నారు. అర్హత సాధించిన వారిలోనూ 80 శాతం విడాకులు తీసుకున్న లబ్ధిదారులే ఉన్నారని సమాచారం. మిగిలిన వారు అవివాహితులై తల్లిదండ్రులపై ఆధారపడిన వారేనని తెలిసింది. ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా.. గుర్తించిన లబ్ధిదారులకు ఆదివారం ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందజేయనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ నియోజవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల ద్వారా ప్రొసీడింగ్స్‌ని లబ్ధిదారులకు అప్పగిస్తారు. మండల కేంద్రాల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో ఆ తంతు జరగనుంది. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో ఏప్రిల్, మే నెలలకు సంబంధించి రూ. వెయ్యి చొప్పున మొత్తం రూ. 2వేలు జమ చేస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న లబ్ధిదారులకు మాత్రమే బ్యాంకు ద్వారా డబ్బులు అందుతాయి. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా అందజేస్తారు. వీరికి వారంలోగా భృతి అందే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అప్పటికప్పుడే వారి వేలిముద్రలు తీసుకుని డబ్బులు అందజేస్తారని పేర్కొంటున్నారు. మొత్తం లబ్ధిదారులు : 5,054 గ్రామీణ ప్రాంతాల్లో : 3,300 జీహెచ్ఎంసీ పరిధి : 1,352 షాద్‌నగర్ మున్సిపాలిటీ : 78 మీర్‌పేట మున్సిపాలిటీ : 56 జిల్లెలగూడ మున్సిపాలిటీ : 37 జల్పల్లి మున్సిపాలిటీ : 62 బడంగ్‌పేట నగర పంచాయతీ : 79 ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ : 26 పెద్ద అంబర్‌పేట నగర పంచాయతీ : 64 -
తిట్టిన వారికీ దీవెనలే!
వలస వచ్చిన విశ్వాసుల్లో అబూ తాలిబ్ తనయుడు హజ్రత్ జాఫర్ రజీ, చక్రవర్తి ప్రశ్నలకు సమాధానాలిస్తూ, ‘మహారాజా! మేము పూర్వం చాలా అజ్ఞానంగా ఉండేవాళ్ళం. విగ్రహారాధన చేసేవాళ్ళం. సారాయి, జూదం, అశ్లీలతల రొచ్చులో కూరుకు పోయి ఉండేవాళ్ళం. చచ్చిన జంతువులను తినేవాళ్ళం. పగలు, ప్రతీకారాలతో రగిలిపోతూ ఒకళ్ళనొకరు చంపుకునేవాళ్ళం. కక్షలు, కార్పణ్యాల పరంపర తరతరాలుగా కొనసాగేది. ఇలాంటి పరిస్థితిలో దేవుడు మాపై దయ దలిచాడు. మాలోనే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. ఆయనది ఎంతో గౌరవప్రదమైన వంశం. ఆయనగారి నీతి నిజాయితీ, సత్యసంధత మాకు మొదటి నుండీ తెలుసు. ఆయన మమ్మల్ని సత్యం వైపు, ధర్మం వైపు పిలిచాడు. దేవుని సందేశం మాకు బోధించాడు. సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యమే పలకాలనీ, జాలి, దయ, పరోపకారం లాంటి సుగుణాలు కలిగి ఉండాలనీ, సాటి మానవుల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలనీ, బంధువుల హక్కులు నెరవేర్చాలనీ, అనాధలను ఆదరించాలనీ, వారిసొమ్ము కబళించకూడదనీ, శీలవతులపై అపనిందలు మోపకూడదనీ, దానధర్మాలు చేస్తూ ఉండాలనీ ఆయన మాకు బోధించాడు. మేమాయన మాటలు విని, ఆయనను అనుసరిస్తున్న కారణంగా మా వాళ్ళు మమ్మల్ని హింసించడం ప్రారంభించారు. వారి దౌర్జన్యాలు భరించలేక, ఇక్కడైనా కాస్త ప్రశాంతంగా బ్రతకవచ్చని మీ దేశంలో తలదాచుకున్నాం. ఇదే మేము చేసిన నేరం’ అన్నారు. తరువాత జాఫర్ ద్వారా కొన్ని ఖురాన్ వాక్యాలు కూడా చదివించుకొని విన్నాడు – నీగస్ చక్రవర్తి. ఈసా ప్రవక్తకు సంబంధించి ఖురాన్ చెప్పిన విషయాలను ధ్రువీకరించాడు. అంటే, ముహమ్మద్ ప్రవక్త(స) వారి సందేశం మహోన్నతమైన నైతిక, మానవీయ ప్రమాణాలతో నిండి ఉందని మనకు అర్థమవుతోంది. జీవితంలోని ప్రతి రంగంలో నీతిని పాటించాలనీ, ఇంట్లోనైనా, వీధిలోనైనా, కార్యాలయాల్లోనైనా, న్యాయస్థానాల్లోనైనా, అధికార పీఠంపైనా ప్రతిచోటా నిజాయితీ, సౌశీల్యం తొణికిసలాడాలనీ, జీవితంలోని ఏ రంగమూ నీతి రహితంగా ఉండకూడదనీ ప్రవక్త అభిలషించారు. సామాజిక రుగ్మతల నిర్మూలనకూ, మానవీయ సంబంధాల పెంపుదలకూ ఎంతటి ప్రాముఖ్యమిచ్చారో ప్రవక్త జీవితం ద్వారా మనకు తెలుస్తోంది. ప్రవక్త(స) తన సందేశ కార్యక్రమంలో భాగంగా ‘తాఝెఫ్’ అనే ఊరికి వెళ్ళారు. గ్రామ పెద్దలను కలుసుకొని తన సందేశం వినిపించారు. కానీ వారు చాలా అమర్యాదగా, అమానవీయంగా ప్రవర్తించారు. మంచిని బోధించినందుకు నానా మాటలన్నారు. రౌడీ మూకను ఆయనపైకి ఉసిగొలిపి రక్తసిక్తమయ్యేలా కొట్టించారు. అయినా ప్రవక్త పల్లెత్తుమాట అనలేదు. పర్వతాలపై అదుపు కలిగిన దైవదూతలు ప్రత్యక్షమై, తమరు అనుమతిస్తే రెండు కొండల మధ్య ఉన్న ఈ ఊరిని విసుర్రాయిలో పప్పులు నలిపినట్లు నలిపి పిండి చేస్తామన్నా, ఆ మానవతామూర్తి ససేమిరా ఒప్పుకోలేదు. చెడుకు చెడు సమాధానం కాదని ఉపదేశించారు. తనను హింసించిన వారిని దీవించి, వారికి సద్బుద్ధిని ప్రసాదించమని దైవాన్ని ప్రార్థించారు. (మిగతాది వచ్చేవారం) -
బలహీనుల ఆశాజ్యోతి
సమస్త సృష్టికీ కర్త అయిన ఏకైక దైవాన్నే ఆరాధించమని ప్రజలకు పిలుపునిచ్చిన మహనీయుడు ముహమ్మద్ ప్రవక్త. తల్లితండ్రులను గౌరవించాలనీ, వారిపట్ల విధేయతా భావం కలిగి ఉండాలనీ, వారి సేవ చేయని వారు నరకానికి పోతారనీ హెచ్చరించారాయన. బంధువులు, బాటసారులు, అనాథలు, వితంతువులు, నిస్సహాయుల పట్ల దయగా ఉండాలని బోధించారు. మానవ మహోపకారి ముహమ్మద్ (స) ఒక్క ముస్లిమ్ సముదాయానికే కాక సమస్త మానవ జాతికీ సంపూర్ణ మార్గదర్శకులు. ఆయన జన్మదినమైన ‘మిలాద్ –ఉన్–నబీ’ వేళ ఆయన బోధనలపై దృష్టి సారించాలి. సత్యమే పలకాలి. చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి. పలికే ప్రతిమాటకు, చేసే ప్రతి పనికీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని బాధ్యతా భావాన్ని ప్రవక్త నూరిపోశారు. అన్యాయానికీ, అధర్మ సంపాదనకు ఒడిగట్టవద్దన్నది ఆయన బోధ. అలాగే ధనాన్ని దుర్వినియోగం, దుబారా చేయవద్దని కూడా ఆయన హెచ్చరించారు. వ్యభిచారం దరిదాపులకు కూడా పోవద్దని, ఈ పాపానికి దూరంగా ఉండటమే కాకుండా, దానికై పురిగొలిపే ప్రసారసాధనాల్ని కూడా రూపుమాపాలని పిలుపునిచ్చారు. నిష్కారణంగా ఏ ప్రాణినీ చంపకూడదనీ, ప్రజల ధన, మాన ప్రాణాలు సురక్షితంగా లేని సమాజం ప్రగతిపథంలో పయనించజాలదనీ ఉపదేశించారు. వ్యాపార లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, లెక్కపత్రాలు, కొలతలు, తూనికలు చాలా ఖచ్చితంగా, నికార్సుగా ఉండాలని ముహమ్మద్ ప్రవక్త (స) బోధించారు. స్వార్థాన్ని, అహాన్ని త్యజించాలని, తోటి మానవ సోదరుల్ని తమకన్నా తక్కువగా చూడకూడదని ఆయన ఉపదేశించారు. స్త్రీ జాతిని గౌరవించాలనీ, అనాథలను ఆదరించని వారు మహాపాపాత్ములనీ, వారిని ఆదరించి, సంరక్షిస్తే స్వర్గార్హత సాధించవచ్చని ఆయన చెప్పారు. అదేవిధంగా ఖైదీల పట్ల కరుణతో వ్యవహరించాలని, వారిని హింసించకూడదని, అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న అమాయకుల విడుదలకు కృషి చేయాలని ఉపదేశించారు. వితంతువులను చిన్నచూపు చూడకూడదని, సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం దక్కాలని, శుభకార్యాల్లో వారిని ఆహ్వానించకపోవడం అన్యాయమని, ఈ దురాచారాన్ని మానుకోవాలని హెచ్చరించారు. అవసరం, అవకాశం ఉన్నవారి పునర్వివాహానికి ప్రయత్నించాలని, వారిని నిర్లక్ష్యం చేసిన సమాజం అథోగతి పాలవుతుందని కూడా ఆయన హెచ్చరించారు. వృద్ధులను ఆదరించాలని హితవు పలికారు. ఒక మార్గదర్శిగా ప్రవక్త (స) బోధించే ప్రతి విషయాన్ని స్వయంగా ఆచరించి చూపేవారు. ఆచరణ లేని హితబోధ జీవం లేని కళేబరం వంటిదని ఆయన చెప్పేవారు. ఆ మహనీయుని మంచితనానికీ, మానవీయ సుగుణానికీ అద్దం పట్టే ఓ సంఘటన... ఇది ముహమ్మద్ ప్రవక్త ధర్మప్రచారం చేస్తున్న తొలినాళ్ళ మాట. ఒకసారి ఆయన మక్కా వీధిలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఒక చౌరస్తాలో ఓ వృద్ధురాలు తన మూటాముల్లెతో సహా నిలబడి ఉంది. వృద్ధురాలు కావడంతో మూటల బరువు మోయలేక పరుల సహాయం కోసం అర్థిస్తోంది. దారిన వెళ్ళేవాళ్ళను బతిమాలుతోంది కాస్తంత సాయం చేయమని! చాలామంది ఆ దారిన వెళుతున్నారు కానీ, వృద్ధు్ధరాలిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతలో ముహమ్మద్ ప్రవక్త అటుగా వెళుతూ, వృద్ధు్ధరాలిని ఎవరూ పట్టించుకోకపోవడం చూసి, ఆమెను సమీపించారు. ‘అమ్మా! నేను మీకు సహాయం చేస్తాను’ అన్నారు. ‘బాబ్బాబూ! నీకు పుణ్యం ఉంటుంది. ఈ మూట చాలా బరువుగా ఉంది. మోయలేకపోతున్నాను. కాస్త అందాకా సాయం చేస్తే, నేను వెళ్ళిపోతాను’ అన్నదా వృద్ధురాలు. ‘అయ్యో! దీనికేం భాగ్యం’ అంటూ మూట భుజానికెత్తుకొని, ఆమె కోరిన చోటుకు చేర్చారు ప్రవక్త. ‘బాబూ! దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఏ తల్లి కన్నబిడ్డవో గాని ముక్కూమొహం తెలియని నా లాంటి ముసలిదానికి ఇంత సాయం చేశావు. బాబూ! ఒక్కమాట వింటావా! ఎవరో ముహమ్మద్ అట, ఏదో కొత్త మతాన్ని ప్రచారం చేస్తున్నాడట. అతని మాటల్లో ఏముందో గాని చాలామంది అతని ప్రభావంలో పడిపోతున్నారు. జాగ్రత్త నాయనా! అతని మాటల్లో పడకు. నేను కూడా అందుకే ఊరే విడిచి వెళ్ళిపోతున్నాను’ అని హితవు పలికింది. ‘సరేనమ్మా’ అంటూ ఆమె చెప్పినదంతా విని, వినయపూర్వకంగా అవ్వకు అభివాదం చేసి సెలవు తీసుకున్నారు ప్రవక్త. ఆ మహనీయుని మంచితనానికీ, వినయపూర్వకమైన ఆ వీడ్కోలుకూ ఆనందభరితురాలైన వృద్ధురాలు ఒక్కసారిగా భావోద్రేకానికి లోనై, ‘బాబూ!’ అని పిలిచింది ఆప్యాయంగా. ‘అమ్మా!’ అంటూ దగ్గరికి వచ్చిన ప్రవక్త తలపై చేయి వేసి నుదుటిని ముద్దాడుతూ, ‘బాబూ! నీ పేరేమిటి నాయనా!’ అని ప్రశ్నించింది ప్రేమగా. కాని ప్రవక్త మాట్లాడకుండా, మౌనం వహించారు. ‘బాబూ! పేరైనా చెప్పునాయనా! కలకాలం గుర్తుంచుకుంటాను’ అంటూ అభ్యర్థించింది. అప్పుడు ప్రవక్త మహనీయులు, ‘అమ్మా! నా పేరు ఏమని చెప్పను ? ఏ ముహమ్మద్‌కు భయపడి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావో ఆ అభాగ్యుణ్ణి నేనేనమ్మా!’ అన్నారు ప్రవక్త మహనీయులు. దీంతో ఒక్కసారిగా ఆ వృద్ధురాలు అవాక్కయిపోయింది. కాసేపటి వరకు ఆమెకేమీ అర్థం కాలేదు. ఏమిటీ.. నేను వింటున్నది ముహమ్మద్ మాటలనా..! నేను చూస్తున్నది స్వయంగా ముహమ్మద్నేనా..? నా కళ్ళు, చెవులు నన్ను మోసం చేయడం లేదు కదా..! ఇలా ఆమె మనసు పరిపరి విధాల ఆలోచిస్తోంది. ఎవరి మాటలు వినకూడదనీ, ఎవరి ముఖం కూడా చూడకూడదనీ పుట్టిపెరిగిన ఊరినే వదిలేసిందో, అతనే తనకు సహాయం చేశాడు. ఎవరూ పట్టించుకోని నిస్సహాయ స్థితిలో ఆప్యాయత కురిపించాడు. సహాయం కంటే ఎక్కువగా ఆయన మాట, మంచితనం, వినమ్రత, మానవీయ సుగుణం ఆమెను మంత్రముగ్దురాలిని చేశాయి. కళ్ళ నుండి ఆనందబాష్పాలు రాలుతుండగా, ‘బాబూ ముహమ్మద్ ! నువ్వు నిజంగా ముహమ్మద్వే అయితే, నీ నుండి పారిపోవాలనుకోవడం నా దురదృష్టం. ఇక నేను ఎక్కడికీ వెళ్ళను. నీ కారుణ్య ఛాయలోనే సేద దీరుతాను’ అంటూ అదే క్షణాన ప్రవక్త వారి ప్రియ శిష్యురాలిగా మారిపోయింది. ఇదీ ప్రవక్త మహనీయుని ఆచరణవిధానం. ప్రజల పట్ల, ముఖ్యంగా నిస్సహాయులు, బడుగు, బలహీనులు, పీడిత తాడిత శ్రామిక వర్గాల పట్ల ఆ మహనీయుడు అవలంబించిన ఆచరణ శైలి. ఇందులో ఎంతో కొంతైనా మనం ఆచరించడానికి ప్రయత్నిస్తే నేటి మన సమాజం ఎలా ఉంటుందో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి. ఇలా మానవ మహోపకారి ముహమ్మద్ (స) ఊహ తెలిసినప్పటి నుండి అంతిమ శ్వాస వరకు సమాజ సంక్షేమం కోసం, సంస్కరణ కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. మానవాళికి సత్యధర్మాన్ని పరిచయం చేస్తూ, వారి ఇహ పర సాఫల్యాల కోసం అహర్నిశలు శ్రమించారు. ఆ మహనీయుని జీవన విధానం మానవాళికి అంతటికీ ఆదర్శం కావాలి. ప్రజలతో ఆయన ఏవిధంగా ప్రేమానురాగాలతో,స్నేహ సౌహార్దాలతో, సానుభూతితో వ్యవహరించేవారో, అవసరార్థులకు, ఆపదలో ఉన్నవారికి, ఏ విధంగా ఆపన్నహస్తం అందించేవారో, అలాంటి వ్యవహారశైలి నేడు మనలోనూ తొణికిసలాడాలి. ప్రవక్త తన చివరి హజ్‌యాత్ర సందర్భంగా ఇలా అన్నారు... ‘‘ప్రజలారా! ఒక మనిషికి మరో మనిషిపై ఎలాంటి ఆధిక్యతా లేదు. మీరు తినేదే మీ సేవకులకు పెట్టండి. కూలివాని చెమట బిందువులు ఆరక ముందే అతని వేతనం చెల్లించండి. మహిళల గురించి దైవానికి భయపడండి. మీకు వారిపై ఎలాంటి హక్కులున్నాయో, ధర్మం ప్రకారం వారికీ మీపై అలాంటి హక్కులే ఉన్నాయి. వడ్డీ తినకండి, దాన్ని త్యజించండి. సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి. ఆయనకు ఎవరి భాగస్వామ్యాన్నీ కల్పించకండి. బాధ్యతాభావం, జవాబుదారీతనం కలిగి ఉండండి. మీ కర్మలన్నింటికీ ఒకనాడు దైవం ముందు సమాధానం చెప్పుకోవాల్సి ఉంది...’’ ఇలా ప్రజానీకానికి అనేక హితోపదేశాలు చేశారు. అవన్నీ మనకు మార్గదర్శకం. రేపు‘మిలాద్–ఉన్–నబీ’ ముహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు -
వితంతువులపై వివక్షను రూపుమాపాలి
బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి కాజీపేట రూరల్ : వితంతువులపై వివక్షను రూపుమాపాలని బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి పిలుపునిచ్చారు. కాజీపేట ఫాతిమానగర్‌లోని బాలవికాస శిక్షణ సంస్థలో ఆదివారం వితంతు వివక్ష ఉద్యమంలో మత సంస్థల పాత్ర అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా శౌరిరెడ్డి మాట్లాడుతూ వితంతువులపై వివక్షను రూపుమాపడానికి బాల వికాస కృషిచేస్తోందని తెలిపారు. తెలంగా నఅర్చక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన హన్మకొండలోని వేయి స్తంభాలగుడిలో వితంతువులచే గౌరమ్మపూజ చేయించి బతుకమ్మ ఆటలాడిస్తానని ఆయన అన్నారు. బ్రహ్మశ్రీ తాండ్ర నాగేంద్రశర్మ మాట్లాడుతూ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్ని మానవాళి అభివృద్ధి కాంక్షిస్తూ మనం రాసుకున్నవేనని, కాలమాన మార్పు ప్రకారంగా ఆచారాలు కూడా మార్చుకోవచ్చని పేర్కొన్నారు. డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ వితంతువులపై వివక్ష పునరావృతం కాకుండా చూడాలని కోరారు. వరంగల్ డయాసిస్ ఫాదర్ జోసఫ్ మాట్లాడుతూ ఈ ఆచారాన్ని రూపు మాపేందుకు బాలవికాసకు తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ముస్లిం మత గురువు మోహినుద్దీ¯ŒS మాట్లాడుతూ ముస్లిం మతంలో ప్రవక్త ఒక వితంతువును వివాహాన్ని చేసుకుని ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. బాలవికాస సంస్థ వ్యవస్థాపకురాలు బాలథెరిస్సా మాట్లాడుతూ వితంతువులపై వివక్షను రూపుమాపేందుకు 10 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.డాక్టర్ విశ్వనాథరావు, రిటైర్ట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణమూర్తి, డాక్టర్ కోదండ రామారావు, రమణగుప్తా, అష్టకాల నర్సమ్మ శర్మ, వేదాంతం జగన్నాథాచారి, ధూళిపాల శ్రీనివాస్, పవ¯ŒS శర్మ, ఫాదర్ జారోమ్, వల్లంపట్ల నాగేశ్వర్రావు, ప్రతినిధులు మంజుల, లత, ఉపేంద్ర బాబు, శివ, రాధిక, రమ, వితంతువులు పాల్గొన్నారు. -
విల పింఛెన్
కొవ్వూరు : భద్రత ఐదు రెట్లు అంటూ ప్రచార ఆర్భాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. అర్హత ఉన్నా సామాజిక పింఛన్లు అందక వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు కాళ్లరిగేలా అధికారులు, ప్రజాప్రతి నిధుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి సోమవారం మండల స్థాయిలో నిర్వహించే మీకోసం కార్యక్రమాల్లో వచ్చే వినతుల్లో మూడొంతులు పింఛన్లకు సంబంధించే ఉంటున్నాయి. కనిపించిన ప్రతి అధికారికి దరఖాస్తులిస్తూ.. పింఛను ఇప్పించాలని వేలాదిమంది దీనంగా వేడుకుంటున్నా వారిపై చంద్రబాబు సర్కారు కనికరం చూపడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 24 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మీ కోసం కార్యక్రమంలో అందిన దరఖాస్తులను కలిపితే ఆ సంఖ్య 30 వేలకు పైనే ఉంటుందని అంచనా. కొత్త వారికి దక్కని చోటు జిల్లాలో వివిధ సామాజిక పథకాల కింద 3,39,083 మందికి పింఛన్లు ఇస్తున్నట్టు సర్కారు చెబుతోంది. వీరిలో 1,56,827 మంది వృద్ధులు కాగా, 1,06,308 మంది వితంతువులు ఉన్నారు. 44,409 మంది దివ్యాంగులు, 1,977 మంది కల్లుగీత కార్మికులు పింఛన్లు పొందుతుండగా, 26,399 మంది అభయహస్తం పథకం కింద పింఛన్లు ఇస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా అన్ని పథకాల కింద పింఛన్లు పొందుతున్న వారిలో 900 నుంచి 1,100 మంది ప్రతినెలా మృత్యువాత పడుతున్నట్టు డీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. సగటున నెలకు వెయ్యి మంది పింఛనుదారులు మరణిస్తున్నట్టు అంచనా. మరణించిన వారి స్థానంలో కొత్త వారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. జిల్లాలో ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదు. గడచిన ఏడాది కాలంలో మరణించిన వారి స్థానంలో కొత్తగా ఒక్కరికి కూడా పింఛను మంజూరు కాలేదు. పాత పింఛన్లకూ కొర్రీలు కొత్త పింఛన్ల మంజూరు విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పటికే పింఛన్లు పొందుతున్న పాత వారికి వివిధ కారణాలతో చెల్లించకుండా ఎగవేస్తున్నారు. వరుసగా మూడు నెలలపాటు పింఛను సొమ్ము తీసుకోకపోతే వారి పేర్లను శాశ్వతంగా తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మొదట్లో గుర్తింపు కార్డుల ఆధారంగా పింఛను సొమ్ము చెల్లించేవారు. ఆ తరువాత వేలిముద్రలు, కనురెప్పలు (ఐరిస్) ద్వారా అందిస్తున్నారు. వేలిముద్రలు పడనివారు, పొరుగూళ్లకు వెళ్లిన వారు మరుసటి నెలలో అయినా సొమ్ము అందుకునే వీలుండేది. లబ్ధిదారుల్లో కొందరి పేర్లు మాయమవుతున్నాయి. కనురెప్పలు, వేలిముద్రలు పడని వారికి గ్రామాల్లో అయితే వీఆర్వోలు, పట్టణాల్లో అయితే బిల్లు కలెక్టర్ల వేలిముద్ర ద్వారా సొమ్ము ఇచ్చేవారు. తాజాగా, అందులోనూ అక్రమాలు జరుగుతున్నా నెపంతో కొర్రీలు వేస్తున్నారు. ఈ తరహా కేసులు 5 శాతం మించకూడదని సర్కారు ఆంక్షలు విధించగా, అధికారులు మరో అడుగు ముందుకేసి 2 శాతం మించకూడదనే నిబంధన పెట్టారు. ఫలితంగా వేలిముద్రలు, కనురెప్పలు పడని వారిలో చాలామంది సొమ్ము తీసుకోలేక సతమతం అవుతున్నారు. -
అక్కడ వితంతువులే ఉండరు!
బెహంగాః ప్రాంతాన్నిబట్టి గిరిజన తెగల్లో ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగుతుంటాయి. అయితే మధ్యప్రదేశ్ లోని గోండ్ల లో కనిపించే సంప్రదాయం మాత్రం విభిన్నంగా కనిపిస్తుంది. కుటుంబంలోని మహిళకు భర్త చనిపోతే ఆమె జీవితాంతం వితంతువుగా ఉండాల్సిన అవసరం వారి తెగల్లో ఉండదు. భర్త చనిపోయిన పదోరోజు కుటుంబంలోని పెళ్ళికాని ఏ యువకుడైనా తిరిగి ఆమెను పెళ్ళి చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు వారి సంప్రదాయం ప్రకారం భర్త కావడానికి మనుమడుకి కూడ అర్హత ఉంటుంది. మధ్యప్రదేశ్ మండ్లా జిల్లాలోని గోండ్లలో కనిపించే ప్రత్యేక సంప్రదాయంతో, వారి తెగల్లో మహిళలు వితంతువులుగా మిగిలిపోయే అవకాశం ఉండదు. భర్త చనిపోయిన పది రోజుల్లోగా ఆ మహిళను వారి కుటుంబంలోని పెళ్ళికాని ఏ యువకుడైనా తిరిగి వివాహమాడొచ్చు. కనీసం ఆమెకు మనుమడు వరుస అయ్యే వాడు కూడ నాయనమ్మను, లేదా అమ్మమ్మను పెళ్ళి చేసుకునేందుకు అర్హత ఉంటుంది. ఒకవేళ కుటుంబ సభ్యుల్లో ఎవ్వరూ లేనప్పుడు, లేదా అలా చేసుకునేందుకు ఇష్టపడని పక్షంలో, భర్త చనిపోయిన పది రోజులకు.. ఆమెకు సంఘంలోని పెద్దలు ప్రత్యేకంగా వెండి గాలులు చేయిస్తారు. పదో రోజు అనంతరం ఆ గాజులను ఆమెకు ఎవరు అందిస్తే వారిని పెళ్ళి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ సంప్రదాయాన్ని 'పోటో' గా పిలుస్తారు. ఇదే నేపథ్యంలో 'పటిరం వర్కేడ్' పెళ్ళి కూడ జరిగింది. అతడికి ఆరేళ్ళ వయసున్నపుడు అతడి తాత మరణించడంతో తొమ్మిదవరోజున పటిరం.. 'నాటి పాటో' సంప్రదాయంలో భాగంగా తన నాయనమ్మ చమ్రీబాయ్ ని పెళ్ళి చేసుకున్నాడు. అలా సంప్రదాయ బద్ధంగా ఆ వితంతు మహిళకు పెళ్ళి అయితే... తిరిగి ఆ దంపతులు... భార్యాభర్తలుగా సంఘంలో జరిగే అన్ని కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. నేను ఇతర అమ్మాయినే పెళ్ళి చేసుకుందాం అనుకున్నానని, అయితే తమ సంప్రదాయంలో భాగంగా, కుల పెద్దల నిర్ణయంతో మైనర్లు పెద్ద వారిని చేసుకునే అవకాశం ఉండటంతో తన నాయనమ్మను పెళ్ళి చేసుకొన్నానని బెహంగా గ్రామంలో నివసించే 42 రెండేళ్ళ పటిరం చెప్తున్నాడు. అయితే ఐదేళ్ళ క్రితం తన నాయనమ్మ మరణించే వరకూ తన భార్య రెండో భార్య హోదాలో కొనసాగేదని వివరించాడు. గోండ్ల ప్రత్యేక సంప్రదాయంలో జీవిత భాగస్వాముల మధ్య తీవ్ర వయోబేధం ఉన్నపుడు ఎటువంటి భౌతిక సంబంధాలు ఉండవు. అయితే సంఘంలో వారు గౌరవ మర్యాదలను పొందేందుకు, సాన్నిహిత్యంతో ఉండేందుకు ఈ ప్రత్యేక సంస్రదాయం సహకరిస్తుంది. 75 ఏళ్ళ సుందరో బాయి కుర్వాతి కూడ పెళ్ళయిన రెండేళ్ళకే తన భర్త చనిపోవడంతో 'దేవర్ పాటో' సంప్రదాయంలో భాగంగా అప్పట్లో ప్రస్తుతం 65 ఏళ్ళున్న తన మరిదిని వివాహమాడింది. భర్త చనిపోయిన సమయంలో అతడు తనను పెళ్ళాడేందుకు ఇష్టాన్ని చూపించలేదని, దాంతో తనను సంఘ పెద్దలు శుభకార్యాలకు అనుమతించే వారు కాదని, అనంతరం రెండేళ్ళ తర్వాత అతడు నన్ను పెళ్ళాడటంతో పెద్దలు తిరిగి అన్నికార్యాలకూ హాజరయ్యేందుకు అంగీకరించారని, అప్పట్నుంచీ దశాబ్దాల కాలంగా తాము ఎంతో సంతోషంగా ఉన్నామని సుందరో బాయి చెప్తోంది. అలాగే తనకంటే ఐదేళ్ళు పెద్దదైన వదినగారిని పెళ్ళాడానని 55 ఏళ్ళ కృపాల్ సింగ్ చెప్తున్నారు. అయితే కొందరు మహిళలు భర్త చనిపోయినప్పటికీ, తిరిగి వివాహం చేసుకోకుండానే వితంతువుగా కాక వివాహితగా కొనసాగేందుకు పెద్దలనుంచి అనుమతి తీసుకుంటారు. అటువంటి వారిలో 28ఏళ్ళ భాగ్వతి ఒకరు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోవడంతో ఆమె తిరిగి వివాహం చేసుకునేందుకు అంగీకరించలేదు. పాంచ్ పటో సంప్రదాయంలో భాగంగా ఆమె వివాహితగా కొనసాగేందుకు సంఘ పెద్దలనుంచి అనుమతి తీసుకుంది. ఎంత పెద్ద చదువులు చదువుకున్నా గోండ్లు తమ సంప్రదాయాలు పాటిస్తారని, ఒక్క తమ గ్రామంలోనే కాక, భోపాల్ లోని భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేస్తున్నఇద్దరు ఇంజనీర్లు సైతం తమ దేవర్ పాటో సంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకున్నారని ట్రైబల్ లీడర్ గుల్జార్ సింగ్ మర్కమ్ తెలిపారు. ఈ వివాహ వ్యవస్థ మా సంస్కృతిలో భాగమని, నాటీ పాటో వివాహంలో నాయనమ్మను పెళ్ళి చేసుకున్న పిల్లలు ఆమెతో ఆడుకోవడం కనిపించడం సాధారణమని గుల్జార్ తెలిపారు. అయితే నాటి పాటోలో నాయనమ్మను పెళ్ళాడిన మనుమడే కుటుంబ పెద్దగా ఉంటాడని వివరించాడు. -
మన ఊళ్లు ఇలా కాకూడదు
సామాజికం మద్యం మత్తులో మృత్యువు ఒడిలోకి ఏజెన్సీ గ్రామాలు నాటు సారాతో నిర్జీవంగా మారుతున్న యువతరం పాతికేళ్లు నిండకుండానే వితంతువులుగా మారుతున్న స్త్రీలు పల్లెలో సెలయేరు పారాలి... సారా కాదు. కానీ.. ఏజెన్సీ ప్రాంతాల్లో సారా సెలయేరులా పారుతోంది. ప్రాణాలు తీస్తోంది. స్త్రీలను చిన్నవయసులోనే వితంతువులను చేస్తోంది. ఈ దుస్థితి ఏ ఊరికీ రాకూడదు. మనం రానివ్వకూడదు. విశాఖ జిల్లాలోని కొయ్యూరు మండలంలోని ఐదు గ్రామాల్లో సాక్షి ‘ఫ్యామిలీ’ ఇటీవల పర్యటించింది. ఏ గ్రామాన్ని కదలించినా నాటుసారా తాగి మృత్యువాత పడి భర్తలను కోల్పోయిన మహిళలే కనిపించారు! ఈ గ్రామాల్లో భర్తలు కోల్పోయిన స్త్రీలుంటే, మరికొన్ని గ్రామాల్లో తాగుడుకి బానిసైన యువకులకి 40 ఏళ్లొచ్చినా పెళ్లి కాని పరిస్థితి. ఇంకొన్ని గ్రామాల్లో మంచంలోనే తాగి తాగి కిడ్నీలు పాడయిన యువకులు కొందరైతే, శరీరభాగాలన్నీ చచ్చుబడిపోయి కాటికి కాళ్లు చాపుకున్న నవ యువకులు మరికొందరు. వీటికి తోడు తాగిన మత్తులో విచక్షణ మరిచి వ్యవహరిస్తున్న కొడుకుల నుంచి రక్షించుకోవడానికి రాత్రిళ్లు తల్లులు గ్రామాల నుంచి అడవుల్లోకి పారిపోతున్న దారుణాలు ఆదివాసీ స్త్రీల జీవితాలకు అద్దంపడుతున్నాయి. రాత్రంతా చెట్టుపైనే! కుర్జు పెంటమ్మది కొయ్యూరు మండలం కొమ్మిక గ్రామం. ఒక కొడుకు నిత్యం సారా మత్తులో మునిగి తేలుతుంటే, మరోకొడుకు తాగొచ్చి, కత్తి చేత్తో పట్టుకొని వెంటపడ్డాడు. కొడుకునుంచి ప్రాణాలు రక్షించుకోవడానికి ఆ తల్లి జీడిమామిడి చెట్లపైనే రాత్రంతా గడిపి తెల్లారాకైనా కొడుకు మత్తు దిగుతుందని ఇంటికొచ్చానంటోంది. ఇది ఒక్కతల్లి పరిస్థితే కాదు. అక్కడ తల్లులెందరిదో ఇదే పరిస్థితి. గొడ్డలి ఎత్తి చంపేస్తానన్నాడు బోండా పూర్ణకి ఇద్దరాడపిల్లలు. తాగుడుకి బానిసై డబ్బులివ్వమని వేధిస్తున్నా, భర్తను భరించింది. కానీ గొడ్డలి పట్టుకొని చంపేస్తానని వెంటపడే భర్తనుంచి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలని ప్రశ్నిస్తోంది. ఇద్దరు కూతుళ్లను భర్త బారినుంచి తప్పించేందుకు తంటాలు పడుతోంది. పొయ్యిలో కాళ్లు పెట్టాడు నీలపు దేవుడమ్మది కొయ్యూరు మండలంలోని కొమ్మిక గ్రామం. కొడుకు గౌరీనాయుడు నిత్యం సారాయిలో మునిగితేలుతున్నా ఏదోలే అని ఊరుకుంది. తాగినా ఇంటిపట్టున పడుంటాడనుకుంది. కూలోనాలో చేసి ఇంత గంజిపోసి కొడుకు ఆకలి నింపుతోంది. వారం క్రితం మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో కణకణమండే పొయ్యిలో కాళ్లు పెట్టాడు. కాళ్లు పూర్తిగా కాలిపోయిన కొడుకుకి యిప్పుడా తల్లే సేవలు చేస్తోంది. ఈ ఊరిలో మొత్తం 125 కుటుంబాలున్నాయి. 100 ఇళ్లున్నాయి. 35 ఏళ్ల లోపే భర్తలను కోల్పోయిన మహిళలు 36 మంది. 35 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి కాని పురుషులు 32 మంది ఉన్నారు. పిల్లనిచ్చేవారి సంగతి సరే ఈ ఊరు పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నారు జనం. ఎటు చూసినా వితంతువులే కొయ్యూరు మండలంలోని ఎం.మాకవరం గ్రామంలో మొత్తం 300 కుటుంబాలు, 150 ఇళ్లున్నాయి. ఇక్కడ తాగుడుకి బానిసై భర్తలను కోల్పోయిన స్త్రీలు 18 నుంచి 30 ఏళ్ల లోపు వాళ్లు మొత్తం 32 మంది ఉన్నారు. 31 నుంచి 40 ఏళ్లలోపు వారిలో భర్తలను కోల్పోయిన స్త్రీలు 31 మంది. అంటే మొత్తం భర్తలు లేని స్త్రీలు 63 మంది. ఇదే మండలంలోని కర్నిక పాలెం గ్రామంలో మొత్తం 80 ఇళ్లు న్నాయి. 105 కుటుంబాలున్నాయి. ఇక్కడ 35 ఏళ్ల లోపు భర్తలను కోల్పోయిన స్త్రీలు 17 మంది. 35 ఏళ్లు పైబడిన వారిలో భర్తలు లేని స్త్రీలు 12 మంది. మొత్తం 47 మంది. అంటే దాదాపు సగం కుటుంబాల్లో కుటుంబ పెద్ద తాగుడుకి బానిసై మరణించినవారే. ఇక ఇదే గ్రామంలో 35 ఏళ్లొచ్చినా తాగుడు కారణంగా పెళ్లి కాని యువకులు 16 మంది ఉన్నారు. మాకవరం గ్రామం లో చింతల్లి అనే మహిళ భర్త తాగి, తాగి రక్తం కక్కుకుని చనిపోయాడు. ఉన్న ఇద్దరు కొడుకులు మద్యానికి బానిసలయ్యారు. అంతేకాదు రోజుకి 20 నుంచి 25 గుట్కాలు తింటాడని చెబుతోంది. భర్త చావుకళ.. కొడుకుల్లోనూ కనిపిస్తోంటే విలపిస్తోంది. గ్రామ స్వరాజ్యం కోసం... కొయ్యూరు మండలంలోని సర్వన్న పాలెం సర్పంచ్ నారాయణ మూర్తికి ఒకప్పుడు బ్రాందీ షాపు ఉండేది. ఆ ఊరికి రోడ్డు లేదు. ఆసుపత్రి లేదు. కానీ బ్రాందీ షాపు ఉంది. జనం తాగుడుకి బానిసై ఇల్లు గుల్ల చేసుకుంటోంటే ఆ పాపపు సొమ్ము నాకొద్దంటూ బ్రాందీ షాపు మూసేసి చిల్లర కొట్టు పెట్టుకున్నాడు. ‘గ్రామస్వరాజ్యం’ అనే స్థానిక స్వచ్ఛంద సంస్థ తమ చైతన్యానికి కారణమని గ్రామస్థులు అంటున్నారు. స్వతంత్రంగా పనిచెయ్యనివ్వాలి ‘‘గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కోసం మా సంస్థకి ‘గ్రామ స్వరాజ్యం’ అని పేరు పెట్టుకున్నాం. ప్రజల్లో చైతన్యం కోసం ప్రయత్నిస్తున్నాం. అయితే ఐటిడిఎలు స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఉండాలి’’ అని గ్రామస్వరాజ్యం డెరైక్టర్ రాము అంటున్నారు. ఈ గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్యం లేదు. కేవలం తాగుడే అలవాటుంటే ఇంతలా చనిపోరు. అసలు వాళ్లకు పౌష్టికాహారమే లేదు. చదువుకున్న వారు ఒకటీ అరాతప్ప లేనేలేరు. ఉపాధి సంగతి సరే సరి. ఆడవాళ్లే రోజు కూలికి వెళ్లి, మగాళ్లని పోషిస్తున్న పరిస్థితి. శక్తిమంతమైన యువతరం మత్తులో జోగుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యమే అందుకు కారణమంటున్నారు ఆదివాసీల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్త వెంకట్రావు. - అత్తలూరి అరుణ, ప్రిన్సిపల్ కరస్పాండెంట్, ‘సాక్షి’ -
ఆడవాళ్ల గ్రామమండీ..!
ఆడవాళ్ల కోసం స్పెషల్ బస్సులు చూశాం.. షీ క్యాబులు, లేడీస్ స్పెషల్ రైళ్లు, రెస్టారెంట్లు, కిట్టీ పార్టీల సంగతులూ విన్నాం. అయితే, ప్రత్యేకించి ఆడవాళ్ల కోసమే నిర్మించిన గ్రామం గురించి ఎప్పుడైనా విన్నారా..? ఇటువంటి గ్రామం కెన్యాలో ఉంది. విధివంచిత మహిళలకు స్వర్గధామంగా.. మగవాసనకు దూరంగా ఉండే ఈ గ్రామం పేరు ఉమోజా. కెన్యా ఉత్తర ప్రాంతంలో రెబెక్కా అనే మహిళ 25 ఏళ్ల క్రితం ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారు. కేవలం మహిళల కోసమే నిర్మించిన ఈ గ్రామంలోకి పురుషుల్ని అనుమతించరు. వివరాల్లోకి వెళ్తే.. సంబూరు తెగకు చెందిన రెబెక్కాను కొందరు వ్యక్తులు కొడుతూ ఉంటే, భర్త చూస్తూ ఉండిపోయాడు. ఏ మాత్రం ప్రతిఘటించలేదు. ఇదేకాక, గతంలో ఈ ప్రాంతంలో బ్రిటిష్ సైనికులు శిక్షణ పొందేవారు. వారి అకృత్యాలకు అడ్డూ అదుపూ ఉండేది కాదు. మహిళలను శారీరకంగా, లైంగికంగా హింసించేవారు. ఇవన్నీ కళ్లారా చూసిన రెబెక్కాకు పురుషులంటే అసహ్యం వేసింది. తనలాంటి వారికి రక్షణగా ఓ సరికొత్త గ్రామాన్ని సృష్టించాలనుకుంది. ఆ ప్రయత్నమే ఉమోజా అంటారు గ్రామస్థులు. 1990లో ఏర్పాటైన ఈ గ్రామంలోకి నెమ్మదినెమ్మదిగా బాధితులు రాసాగారు. భర్త వేధింపులు తాళలేనివారు, భర్త చనిపోయినవారు, అత్యాచారాలకు గురైనవారు, అనాథలు.. ఇలా స్త్రీలంతా ఒకచోట చేరారు. వీరంతా బతుకుతెరువు కోసం ఆభరణాల తయారీ చేపడుతుంటారు. వీరందరికీ నాయకత్వం వహిస్తున్నారు రెబెక్కా. ప్రస్తుతం ఈ గ్రామం కెన్యాలోని పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. అయితే, మగ పర్యాటకులకు మాత్రం అనుమతి లేదండోయ్! -
పింఛన్లు ఎప్పుడు?
వితంతువుల, వృద్ధుల ఆర్తనాదాలు, ఆకలి కేకలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినిపించ డం లేదు. రూ.1,000 పింఛన్ ఆశ చూపించి ఈ వర్గాల ఓట్లను దండుకుని ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. మంత్రి మండలి సమా వేశాలలో, జన్మభూమి బహిరంగ సభలలో లక్షలలో పింఛన్లు మంజూరు చేస్తున్నట్టు ఆయ న ప్రకటిస్తున్నారు. కొత్త పింఛన్లు ఈ నెల నుం చే అంటారు. కానీ ఎన్ని నెలలు గడిచిపోయినా ఈ పథకం అమలుకు నోచుకోవడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో అసలు ఈ ఊసే లేదు. పాత పింఛన్లు రద్దుచేయడం, మళ్లీ వారి పేర్లనే చేర్చడం - గత కొద్దికాలంగా ఈ తంతుతోనే రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. యాభై లేదా అరవై పర్యాయాలు అధికారుల చుట్టూ తిరిగినా ఏమీ ప్రయోజనం ఉండడం లేదు. ఆచరణాత్మక వైఖరితో రూ.700 పింఛన్ ఇచ్చి ఆదుకుంటానని చెప్పిన జగన్‌ను ఎన్ను కోకుండా ప్రజలు తప్పటడుగు వేశారు. బారుట్ల మంగమ్మ గుత్తి, అనంతపురం జిల్లా -
పింఛన్లలో కోతపై జెడ్పీటీసీల ఆగ్రహం
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సభ సూచన వాడీవేడీగా స్టాండింగ్ కమిటీల సమావేశాలు హన్మకొండ : ఆసరా పింఛన్ల నుంచి ఇంటి పన్నుల వసూలు చేయడంపై ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆసరా కల్పించేందుకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తుంటే వచ్చిన దానిలో నుంచి పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్నులు పేరిట కత్తిరించడం ఎంత వరకు సమంజసమని డీపీఓను నిలదీశారు. దీంతో సంబంధిత అధికారి మాట్లాడుతూ ఆసరా పింఛన్ల నుంచి ఇంటి పన్నులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని తెలిపారు. హన్మకొండలోని జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ స్థాయి సంఘాల సమావేశం శనివారం జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన 1, 2,4, 7 స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. 3వ స్థాయి సంఘం సమావేశం ధర్మసాగర్ జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, 5వ స్థాయి సంఘం సమావేశం వీరమ్మ, 6వ స్థాయి సంఘం సమావేశం మాదాసు శైలజ అధ్యక్షతన జరిగాయి. క్వారీ నిర్వాహకులు భారీ ఎత్తున గ్రానైట్ రాళ్లు తరలిస్తుండడంతో రోడ్లు పాడవుతున్నాయని జెడ్పీటీసీ సభ్యులు వాపోయూరు. ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ తాను నెల్లికుదురు మండలం చిన్ననాగారం శివారు తండాను సందర్శించినపుడు గ్రానైట్ క్వారీతో ప్రజలు పడుతున్న బాధలు స్వయంగా చూశానన్నారు. క్వారీ యజమానిని పిలిచి తన వంతుగా భారీ వాహనాల రాకపోకలకు అనుగుణంగా రోడ్డు నిర్మించాలని సూచించానన్నారు. మైనింగ్ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని, క్వారీలున్న గ్రామాలను మైనింగ్ చేస్తున్న ఏజెన్సీలు దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ఉపప్రణాళిక నిధుల నుంచి ఎస్సీ, ఎస్టీల బిల్లులు చెల్లించాల్సిన నిధులను ఇతర పనులకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు తరలించాయని. దీంతో బకాయిలు పేరుకుపోయాయన్నారు. తాగునీటికి ఇబ్బం ది ఎదురుకాకుండా విద్యుత్ సమస్యను అధిగమించేందుకు సోలార్ మోటార్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం నిధులు భరిస్తున్నట్లు తెలిపారు. మహబూబాబాద్ లోక్‌సభ నియోజవ ర్గానికి 179 సోలార్ పంప్సెట్లు మంజూరైనట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రా లు మంజూరైన చోట భవనాలు నిర్మించడం లేదని సభ్యులు అధికారులను ప్రశ్నించారు. దీంతో పంచాయతీ అధికారులు మాట్లాడుతూ అంగన్వాడీలకు కేటాయించిన రూ.4.50 లక్షల నిధులతో భవనాలు పూర్తి కావన్నారు. ఏటూరునాగారం డిగ్రీ కాలేజీలోని విద్యార్థులకు మూడేళ్లుగా స్కాలర్షిప్లు రాకుండా ఇబ్బందులు పడుతున్నారని జెడ్పీటీసీ సభ్యు లు అధికారులను నిలదీశారు. స్కాలర్షిప్లో అక్రమాలు జరుగుతున్నాయని, వీటిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువుల అభివృద్ధి పనులకు లెస్‌కు టెండర్ వేయడం ద్వారా పనుల నాణ్యతపై సందేహాలు కలుగుతున్నాయని ఎమ్మెల్యే అరూరి రమేశ్, జెడ్పీటీసీ సభ్యులు పేర్కొన్నారు. పనుల వివరాలు తమకు ఎందుకు ఇవ్వడం లేదని అధికారులను ప్రశ్నిం చారు. నివేదికలు జెడ్పీటీసీ సభ్యులకు అందించాలని సూచిం చారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ అనిల్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, టీడీపీ ఫ్లోర్‌లీడర్ శివశంకర్, అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
పింఛను చెల్లింపులు
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలలో భాగంగా పేద వితంతువులకు నెలకు రూ.1,000ల పింఛను ఇస్తున్నాయి. అయితే పిల్లలున్న వితంతువులు ఎవరూ ఈ వెయ్యి రూపాయల తోటే బతకలేరు. వీరి పిల్లలు బతుకుతెరువుకోసం సుదూర పట్టణా లకు వలసపోతున్నారు. వితంతువులు పింఛను పొందడానికి ప్రతినెలా పింఛను పంచే పోస్టాఫీసులు వీరిని స్వయంగా అక్కడకు వచ్చి తీసు కోమంటున్నాయి. అయితే వీరికి వచ్చే పింఛనులో సగం పైగా రాకపో కల ఖర్చుకే అయిపోతోంది. ఇలాకాక, కేంద్రప్రభుత్వ పద్ధతిలో ఈ లబ్ధి దారులను పోస్టాఫీసులో సేవింగ్స్ అక్కౌంటు తెరిపించి ఆ అక్కౌం టులో ప్రతి నెలా పింఛను జమచేయాలి. సంవత్సరానికి ఒకసారి కేంద్ర ప్రభుత్వోద్యోగుల మాదిరిగా లబ్ధిదారు స్వయంగా పోస్టుమాస్టరు వద్ద హాజరై, బతికి ఉన్నాననే సర్టిఫికెట్‌పై సంతకం పెడితే సరిపోతుంది. వితంతువులైతే తాము తిరిగి పెళ్లి చేసుకోలేదని ప్రమాణ పత్రం ఇవ్వాలి. వయో భారంతో నడక కూడా సమస్యగా ఉన్న వితంతువు లను పింఛన్ తీసుకోవడం కోసం ప్రతినెలా పోస్టాఫీసులకు రావాలని ఆదేశించడం అమానుషం. లబ్ధిదారుల ప్రయోజనం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేసి అభాగ్యుల బాధను తగ్గించాలి. త్రిపురనేని హనుమాన్ చౌదరి కార్ఖానా, సికింద్రాబాద్ -
పింఛన్ తంటాలు
జీవితానికి ఆసరా కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పడరాని పాట్లు పడుతున్నారు. పింఛన్ జాబితాలో పేరు లేదని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అన్నపానీయాలు మానుకుంటున్నారు. ఆందోళన బాట పడుతున్నారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు పింఛన్ల జాబితాలో పేరు లేదని ఆరుగురు చనిపోయారు. నిజామాబాద్‌లో ఎంపీ కవితను అడ్డుకున్నారు. వరంగల్‌లో దీక్షలు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో ఓ వృద్ధురాలు అన్నపానీయాలు మానేసి నిరసన వ్యక్తం చేస్తోంది. మరోపక్క అధికారులు నిర్లక్ష్యంతో అనర్హులకు ఆసరా దక్కుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పింఛన్ కోసం అన్నపానీయాలు బంద్ రెండు రోజులుగా వృద్ధురాలి నిరసన ఆందోళనలో కుటుంబ సభ్యులు తూప్రాన్: ప్రభుత్వం ‘ఆసరా’ పథకం ద్వారా అందిస్తున్న పింఛన్ జాబితాలో తన పేరు లేదని ఓ వృద్ధురాలు రెండు రోజులుగా అన్నపానీయాలు మానేసి నిరసన తెలుపుతోంది. మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన పిట్ల పోచమ్మ (85) వితంతువు. కాగా.. అప్పులబాధతో పన్నెండేళ్ల క్రితం కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి అత్త, కోడళ్లు వితంతు పింఛన్ తీసుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ‘ఆసరా’ పథకం ద్వారా వృద్ధులకు, వితంతువులకు రూ.1000 అంది స్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ పంచాయతీ వద్ద వీఆర్ఓ అరుణ గ్రామానికి చెందిన అర్హుల జాబితా అతికించింది. అందులో గ్రామానికి చెందిన 09 మంది కి చెందిన వితంతువుల పేర్లు లేవు. విషయం తెలుసుకున్న పిట్ల పోచమ్మ తనకున్న ఒక్క ఆసరా రాకుండా పోయిందని బాధపడుతూ శుక్రవారం నుంచి అన్నపానీయాలు మానేసింది. కుటుంబ సభ్యులు ఎంత బతిమిలాడినా ఏమీ తీసుకోవడం లేదు. పంచాయతీ కార్యదర్శి పింఛన్లు రాని వారికి తిరిగి వచ్చే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినా వృద్ధురాలు మాత్రం అన్నపానీయాలు ముట్టుకోవడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
ఆసరా లేక ఆందోళన..
ఆసరా పింఛన్లు అందక జిల్లాలో లబ్ధిదారులు ఇంకా ఆందోళనలకు దిగుతూనే ఉన్నారు. ఇప్పటికే పింఛన్ల పంపిణీ ప్రారంభమైనా.. పలువురి పేర్లు జాబితాల్లో కనిపించకపోవడంతో వారు ఆందోళనబాట పట్టాల్సి వస్తోంది. నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అలసిపోతున్నారు. గురువారం కాగజ్‌నగర్ తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన వికలాంగ యువతి స్పృహ కోల్పోయి పడిపోయింది. ఆసిఫాబాద్, కెరమెరిలో ఆందోళనలు చేపట్టారు. ఆసిఫాబాద్ : ‘ఆసరా’ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువుల ఆందోళనలు కొనసాగుతున్నా యి. గురువారం ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట, బూర్గుడ, కొమ్ముగూడ, ఆసిఫాబాద్‌కు చెందిన వృద్ధులు స్థానిక ఎంపీడీవో కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. పింఛన్‌పై ఆధారపడి బతుకుతున్న తమ పేర్లు తొలగించ డం సరికాదని ఆందోళన వ్యక్తం చేశారు. అదే స మయంలో అక్కడికి చేరుకున్న జెడ్పీటీసీ సభ్యు డు కొయ్యల హేమాజీ, ఎంపీడీవో శ్రీనివాస్ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని హా మీనివ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో గుండక్క, పోశక్క, తార, సౌమ్యరాణి, రాజక్క, తిరుపతి, అలీమా, వృద్ధులు పాల్గొన్నారు. కెరమెరిలో..కెరమెరి : ఆంధ్రా, మహారాష్ట్ర వివాదాస్పద గ్రా మాలైన పరందోళి, కోటా, ముకందంగూడ, మ హరాజ్‌గూడ, తాండ గ్రామాలకు చెందిన వృ ద్ధులు, వితంతువులు, వికలాంగులు గురువా రం కెరమెరి ఎంపీడీవో కార్యాలయంలో గంట న్నరపాటు ధర్నా నిర్వహించారు. పింఛన్లు నిలి పివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నా పింఛన్ రావడం లే దని ఆవేదన చెందారు. అక్కడికి వచ్చిన జెడ్పీటీసీ సభ్యుడు అబ్దుల్‌కలాంకు తమ సమస్యను విన్నవించారు. అధికారులతో మాట్లాడి పింఛ న్లు ఇప్పిస్తానని హామీనిచ్చారు. ఈ కార్యాక్రమంలో ఎ.కిషన్, బాపూరావు, దేవాజీ, వి.కిష న్, మిట్టు, చంద్రభాగా, గంగాబాయి, తుల్సాబాయి, శ్యామలాబాయి పాల్గొన్నారు. -
ఇదేం ‘ఆసరా’
చిత్రంలో కనిపిస్తున్న వికలాంగులు.. హసన్‌పర్తి మండలం పెగడపల్లికి చెందిన గన్నోజు శ్రీనివాస్, దామెరబాబు, తిరుపతి, గన్నోజు కుమారస్వామి, రాజ్‌కుమార్. బుధవారం అధికారులు ప్రకటించిన ఆసరా పింఛన్ జాబితాలో వీరి పేర్లు లేవు. దీంతో వీరు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. గతంలో మాకు పింఛన్లు వచ్చారుు. మాకు అర్హత లేదా? అని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. పరిశీలించి డబ్బులు ఇప్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. - హసన్‌పర్తి కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం రాస్తారోకోలు.. ధర్నాలతో దద్దరిల్లిన పంపిణీ కేంద్రాలు ఇంటి, నల్లా పన్నుల పేరిట కోత రఘునాథపల్లి, ధర్మసాగర్.. మహబూబాబాద్ సెగ్మెంట్లోని కేసముద్రంలో పింఛన్‌దారుల నుంచి పంచాయతీ కార్యదర్శులు ఇల్లు, నల్లా పన్నును బలవంతంగా వసూలు చేశారు. దీంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆవేదన వ్యక్తం చేశారు. పర్వతగిరి మండలం రావూర్లో పింఛన్‌దారుల నుంచి కారోబార్ రూ.200 వసూలు చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే పేర్లు తొలగిస్తాననడంతో ఇచ్చినట్లు బానోత్ అచ్చిరాం, బానోత్ కోట, బానోత్ చాంది, ఆర్. దేవేందర్, డి.బిచ్చానాయక్, రాజేందర్ తెలిపారు. దుగ్గొండి వుండల వికలాంగుల సంఘం అధ్యక్షురాలు బోళ్ల దేవికి వికలాంగుల పింఛన్‌కు బదులుగా వితంతు పింఛన్ వుంజూరైంది. నర్సింహులపేట మండలం రేపోణి గ్రామంలో తమ కుటుంబాల వారికి పింఛన్లు మంజూరు కాకపోవడంతో వీఆర్వో రమేష్‌పై ఇద్దరు వ్యక్తులు దాడికి ప్రయత్నించగా.. పింఛన్ల పంపిణీ నిలిచింది. జిల్లావ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే దాదాపు 46 వేల మందికి రూ.9.30 కోట్ల పంపిణీ జరిగింది. జిల్లాలో ‘ఆసరా’ పథకం కొందరికి మోదం కలిగించగా.. మరికొందరికి ఖేదం మిగిల్చింది. జాబితాలో పేర్లు లేకపోవడంతో అర్హులైన వికలాంగులు, వితంతువులు, వృద్ధులు రాస్తారోకోలు నిర్వహించారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు తప్పలేదు. ఆన్లైన్ మొరాయించడంతో లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. పలు కారణాలతో కొన్ని చోట్ల పింఛన్ పంపిణీ కాలేదు.. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పింఛన్ ఇస్తామని అధికారులు ప్రకటించారు. సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పథకం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత కార్మికులకు అవస్థలు తెచ్చిపెట్టింది. రెండు నెలల పింఛన్లు బుధవారం నుంచి ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనకు.. అధికారుల చర్యలకు సారూప్యత కనిపించలేదు. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కొద్ది మందికే పింఛన్లు మంజూరయ్యాయి. పంపిణీ చేసిన కొద్ది మందికి సంబంధించిన నగదులో పంచాయతీ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కోత పెట్టారు. ఇంటి, నల్లా పన్నుల కింద జమ చేసుకున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. జిల్లావ్యాప్తంగా లబ్ధిదారుల జాబితాపై అర్హులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్హతలు ఉన్న చాలా మంది తమ పేర్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. అభ్యుదయ అధికారి, కమిటీ సభ్యులైన సర్పంచ్, వీఓ మెంబర్, మహిళా వార్డు మెంబర్ సమక్షంలో పింఛన్లు పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఉన్నా, క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. నియోజకవర్గాల వారీగా ఇలా... స్టేషన్‌ఘన్‌పూర్ : ధర్మసాగర్ మండలం కమ్మరిపేటలో అర్హులందరికీ పింఛన్లు అందే వరకు పంపిణీ కార్యక్రమం చేపట్టొద్దని ప్రజలు అడ్డుకున్నారు. దీంతో కార్యక్రమాన్ని అధికారులు నిలిపేశారు. రఘునాథపల్లి మండల కేంద్రంలో ఇంటిపన్నులు వసూలు చేస్తుండగా కొందరు అడ్డుకుని అధికారులతో గొడవకు దిగారు. ధర్మసాగర్ మండలం ధర్మసాగర్, వేలేరు, పీచర, నారాయణగిరి, పెద్దపెండ్యాల, జానకిపురం, క్యాతంపల్లి, సోమదేవరపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాల్లో పింఛన్ లబ్ధిదారులకు ఇచ్చే మొత్తంలో కోత విధించారు. ఇంటి, నల్ల పన్నుల రూపంలో వసూలు చేశారు. వరంగల్ తూర్పు : కాశిబుగ్గలో పింఛన్‌దారులకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆందోళన నిర్వహించారు. పింఛన్ డబ్బులు వస్తాయని, ఈ సారైనా తమ పేర్లు జాబితాలో ఉంటాయని ఆశతో ఉర్సు చమన్ సీఆర్సీ భవన్‌కు వద్దకు వచ్చిన వారు నిరాశకు గురయ్యారు. రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమ : హన్మకొండలోని పింఛన్ పంపిణీ కేంద్రాల వద్దకు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సాయంత్రం వరకు అధికారుల కోసం పడిగాపులు కాసిన వృద్ధులు, వితంతువులు చేసేది లేక... తిరిగి ఇళ్లకు వెళ్లారు. లబ్ధిదారులకు డబ్బులు రాకపోవడంతో అధికారులు, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డోర్నకల్ : డోర్నకల్ మండలంలో పింఛన్ లబ్ధిదారుల వివరాలు ‘ఆన్లైన్’లో డౌన్లోడ్ కాకపోవడంతో పంపిణీ గురువారానికి వాయిదా పడింది. నర్సింహులపేట మండ లం రేపోణిలో తమ కుటుంబాల వారికి పింఛన్లు మంజూరు కాకపోవడంతో ఇద్దరు వ్యక్తులు వీఆర్వో రమేష్‌పై దాడికి యత్నించడంతో పంపిణీ నిలిచిపోరుుంది. ఈ విషయా న్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లిన అనంతరం వీఆర్వో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చే శారు. మహబూబాబాద్ : పింఛన్ల జాబితా, నగదు రాలేదని మునిసిపల్ కమిషనర్ రాజలింగు పేర్కొన్నరు. దీనిపై ఇన్చార్జ్ ఎంపీడీఓ రవీందర్‌ను సంప్రదించగా పింఛన్ డబ్బుల చెక్కులను సంబంధిత గ్రామాల వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల పేర్ల మీద రాసి ఇవ్వగా, బ్యాంక్ అధికారులు తిరస్కరించారని తెలిపారు. కేవలం రూ.25 వేలు మాత్రమే ఆ విధంగా తీసుకునే అవకాశం ఉన్నదని చెప్పడంతో మళ్లీ సెల్ఫ్ చెక్కులు ఇచ్చామని వెల్లడించారు. కేసముద్రం మండలం వెంకటగిరిలో పింఛన్లు తీసుకున్న వారివద్ద అదే పంచాయతీ ఆఫీసులోని కారోబార్ ఇంటి, నల్లా పన్నులు వసూలు చేయడంతో వాగ్వాదం జరిగింది. నర్సంపేట : దుగ్గొండి వుండల వికలాంగుల సంఘం అధ్యక్షురాలు బోళ్ల దేవికి వికలాంగుల పింఛన్‌కు బదులుగా వితంతు పింఛన్ వుంజూరైంది. చెన్నారావుపేట వుండలంలోని పలు గ్రావూల్లో అర్హులైన వారికి పింఛన్లు రాకపోవడంతో అధికారులను నిలదీశారు. పరకాల : పరకాల నగర పంచాయతీ, మం డల పరిధిలో పింఛన్ల పంపిణీ జరగలేదు. పింఛన్ల జాబితా ఇంకా ఖరారు కాకపోవ డం... సర్వసభ్య సమావేశం ఉండడంతో పింఛన్ల పంపిణీ చేపట్టలేదు. వర్ధన్నపేట : కొన్ని గ్రామాల్లో లబ్ధిదారులకు పింఛన్లు ఇచ్చే ముందే స్థానిక పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు వారితో ఇంటి, నల్లా పన్నులు చెల్లించుకున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఆయూ మండలాల్లో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పింఛన్లు పంపిణీ చేశారు. జనగామ : జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ నర్మెటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ ఒక్క గ్రామంలోనూ పూర్తి స్థాయిలో పంపిణీ పూర్తి కాక పోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుర్తి : తొర్రూరు మండలం మినహా నాలుగు మండలాల్లో జరిగిన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దయాకర్‌రావు పాల్గొన్నారు. తొర్రూరు మండలం మడిపెల్లి గ్రామంలో సుమారు 70 మంది అర్హులకు పింఛన్ మంజూరు కాలేదని గొడవ చేయడంతో కార్యక్రమం నిలిపేశారు. -
పెన్షన్... టెన్షన్...
-
ఆసరా కోసం ఆందోళన
నిజామాబాద్‌లో మొక్కుబడి జాబితాలో పేరు లేదని ఆందోళన నెట్వర్క్: వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవితాలకు ఆసరా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఆసరా పింఛన్ల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలుజిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో పింఛన్ల తంతు మొక్కుబడిగా సాగింది. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం ఫాజుల్‌నగర్‌లో పంచాయతీ కార్యదర్శిని, సీనియర్ అసిస్టెంట్‌ను గదిలో నిర్బంధించారు. సారంగాపూర్ మండలం రేచపల్లిలో గ్రామపంచాయతీని ముట్టడించారు. భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌లో ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్, పంచాయితీ కార్యదర్శి, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను గ్రామ పంచాయతీలో మూడు గంటల పాటు నిర్బంధించారు. ఇదే మండలం ముస్తఫాపూర్, గొల్లపల్లి గ్రామాలకు చెందిన బాధితులు ధర్నా చేశారు. ఇబ్రహీంపట్నం ఎర్దండిలో పింఛన్‌దారుల నుంచి కాగితాల ఖర్చులకంటూ రూ.వంద చొప్పున వసూలు చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో సుమారు 1,000 మంది పింఛన్లు గల్లంతయ్యాయి. గతంలో పింఛన్లు పొందుతూ అన్ని అర్హతలున్న వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. బాధితులంతా బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించా రు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. జిల్లాలో మొత్తం 3,13,831 మంది దరఖాస్తు చేసుకోగా, 2,14,605 మందిని అర్హులుగా గుర్తించామని, తొలిరోజున 1.92 ల క్షల మందికి పంపిణీ చేశామని కలెక్టర్ ఇలంబరితి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా లక్ష్మణచందా మండలం రాచాపూ ర్ పంచాయతీ పరిధిలోని కొత్తపతి(కె) గ్రామస్తులు 30 మంది ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల ముందు బుధవారం ఆందోళన చేశారు. జాబితాలో పేర్లు లేకపోవడంతో కెరమెరి మండలం గోయగాం, సావర్‌ఖేడ్ గ్రామస్తులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశా రు. కాసిపేట మండలంలో బుధవారం చేపట్టాల్సిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారానికి వాయిదా వేశారు. నెన్నెల మండల పరిధిలోని పలు గ్రామాల్లోనూ పెన్షన్ల పంపిణీ జరగలేదు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో పలువురి పేర్లు జాబితాలో లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ కుంచె కుమారస్వామి రెండ్రోజుల్లోగా పెన్షన్లు అందజేస్తానని హామీ ఇచ్చారు.నిజామాబాద్ జిల్లాలో ఆర్భాటంగా పంపిణీకి శ్రీకారం చుట్టినా.. 20 శాతం మంది కి కూడా పంపిణీ చేయలేదు. బాన్సువాడ నియోజకవర్గంలో ఒక్క వర్ని మండలంలో మాత్ర మే పింఛన్లు పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక్క ఎల్లారెడ్డి మినహా మిగిలిన ఐదు మండలాల్లో పంపిణీ వాయిదా పడింది. బోధన్‌లో పింఛన్ల పంపిణీ గురువారం నుంచి చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆర్మూర్ పట్టణంలో పింఛన్ల కోసం సాయంత్రం వరకు నిరీక్షించారు. వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పింఛన్లు పంపిణీ కాలేదు. చిట్యా ల, డోర్నకల్, మహబూబాబాద్, నెల్లికుదురు, ఏటూరునాగారం, తొర్రూరు, నర్సంపేటతో పాటు నగరంలో అధికారులు సకాలంలో రాకపోవడంతో లబ్ధిదారులు నిరసన తెలిపారు. మంగపేటలో పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు. నర్సింహులపేట మండలం రేపోణి గ్రామంలో తమ కుటుంబాలకు చెందిన వారికి పింఛన్లు మంజూరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరు వ్యక్తులు వీఆర్వో రమేష్‌పై దాడికి ప్రయత్నించారు. జాబితాలో పేరు లేదని ఆత్మహత్య గార్ల: పింఛన్ల జాబితాలో పేరు లేదని మనస్తాపంతో ఖమ్మం జిల్లా గార్ల మండలం సీతంపేటకు చెందిన దైదా సత్యనారాయణరెడ్డి(65) ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యనారాయణరెడ్డి మూడేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నాడు. మంగళవారం కొత్త జాబితా ప్రకటించగా, అందులో సత్యనారాయణరెడ్డి పేరు లేదు. దీంతో మనోవేదనకు గురై బుధవారం ఇంట్లో ఉరి వేసుకున్నాడు. పింఛన్ కోసం వెళ్తూ మృత్యుఒడికి.. సిరిసిల్ల : కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పింఛన్ కోసం వెళ్తూ బండారి కాంతమ్మ(65) బుధవారం మృతి చెందింది. సిరిసిల్ల శాంతినగర్‌కు చెందిన కాంతమ్మ పింఛన్ కోసం రెండోవార్డులో ఏర్పాటు చేసిన పంపిణీ పాయింట్‌కు వెళ్తుండగా, వెనుక నుంచి వస్తున్న సైకిలిస్ట్ ఆమెను ఢీకొట్టాడు. రోడ్డుపై పడిపోయిన కాంతమ్మను స్థానికులుఆస్పత్రికి తీసుకెళ్లగా రాత్రి చనిపోయింది. -
పెన్షన్... టెన్షన్...
మొక్కుబడిగా పింఛన్ల పంపిణీ బ్యాంకుల్లో జమకాని నగదు మంత్రుల కోసం మరి కొన్ని చోట్ల వాయిదా లబ్ధిదారుల పడిగాపులు సిటీబ్యూరో: నగరంలో బుధవారం చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొక్కుబడి తంతుగా మారింది. అనేక ప్రాంతాల్లో విచారణ పూర్తి కాకపోవడం... అందరికీ మంజూరు కాకపోవడం... ప్రజల నిరసనలతో ఈ కార్యక్రమానికి ఆటంకాలు ఎదురయ్యాయి. రోజంతా ఎదురు చూసి విసిగి వేసారిన లబ్ధిదారులు నిరాశతో ఇంటిముఖం పట్టారు. గ్రేటర్‌లోని మారేడుపల్లి, సికింద్రాబాద్, ముషీరాబాద్ మండలాలు, ఎల్బీనగర్, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, కూకట్పల్లి, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించలేదు. మారేడుపల్లి, ముషీరాబాద్‌లకు సంబంధించి బ్యాంకుల్లో సంబంధిత మొత్తం జమ కాకపోవటంతో పంపిణీ చేయలేదు. సికింద్రాబాద్, మరికొన్ని ప్రాంతాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవటంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 10 నుంచి రెండు నెలల పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించటంతో గ్రేటర్‌లోని పింఛన్ కేంద్రాల వద్ద లబ్ధిదారులు బుధవారం ఉదయం నుంచి పడిగాపులు కాశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు గంటల తరబడి ఎదురు చూశారు. అధికారులు రాకపోవటంతో ఆందోళనకు గురయ్యారు. ఒక దశలో ఆగ్రవేశాలు వ్యక్తంచేశారు. కొన్ని కేంద్రాలలోనైతే నిరసనలకు దిగారు. ఈ పరిస్థితి సమూర్నగర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, మారేడుపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్ జిల్లాలో పింఛన్ల పంపిణీకి 130 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 30 చోట్ల పంపిణీ చేయలేదు. హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో త హశీల్దారుల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుండగా.. శివారు ప్రాంతాల బాధ్యతను జీహెచ్ఎంసీ అధికారులు తీసుకున్నారు. అయితే వారు దిల్షుక్నగర్ మినహాయించి ఎక్కడా పంపిణీ చేయలేదు. నగరంలో 7,900 మందికి... నగరంలో బుధవారం 7,900 మందికి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. హైదరాబాద్ జిల్లాలోని 13 మండలాల పరిధిలో 6,900 మందికి... శివారు ప్రాంతాల్లో వెయ్యి మందికి అందజేసినట్లు అధికారవర్గాల సమాచారం. ఈ కార్యక్రమం ఈ నెల 15 వరకు కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు పింఛన్లు అందుకున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని నందినగర్ గ్రౌండ్లో పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆనందం వ్యక్తం చేశారు. షేక్‌పేట మండల పరిధిలో బుధవారం మూడు చోట్ల అర్హులకు పింఛన్లు పంపిణీ చేశారు. అక్కడ 800 మందికి వీటిని అందజేశారు. బహదూర్‌పురా మండలంలో అత్యధికంగా పంపిణీచేసినట్లు తెలుస్తుంది. అమీర్‌పేట, అంబర్‌పేట, చార్మినార్, పాతబస్తీల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగింది. హైదరాబాద్ జిల్లాలో దీన్ని కలెక్టర్ ముఖేష్‌కుమార్ పర్యవేక్షించారు. ఎన్ని వింతలో... ఆసరా కార్డుల్లో వింతలు చోటు చేసుకున్నాయి. కుత్బుల్లాపూర్ మండలంలోని కొంపల్లిలో ఇద్దరు వితంతువులకు జారీ చేసిన ఆసరా కార్డులపై యువకుడు, పాఠశాల విద్యార్థినిల ఫొటోలు ముద్రించారు. దీంతో లబ్ధిదారులు అవాక్కయ్యారు. గుడిపల్లి ప్రమీల(38) కార్డుపై యువకుడి ఫొటో దర్శనమివ్వగా.... బాలోని నీరజ(33) కార్డుపై చిన్నారి ఫోటో ఉంది. ఈ విషయంపై ఎంపీడీఓ కె.అరుణను ‘సాక్షి’ వివరణ కోరగా... అధికారులు విచారణకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న ఎవరిదో ఒక ఆధార్ నెంబరు ఇస్తే నోట్ చేసుకుని వచ్చి కంప్యూటర్లో పొందుపరిచారని తెలిపారు. ఈక్రమంలో తప్పులు దొర్లాయని అన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు. ఉప్పల్‌లో సర్కిల్లోని వెంకట్‌రెడ్డి నగర్, రామాం తానపూర్లకు చెందిన వికలాంగులు ఉపేంద్ర (59), జి.మాణిక్యం(44)లకు జారీ చేసిన ఆసరా కార్డుైలపై ‘వితంతువు’గా ముద్రించారు. ఇది చూసిన స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. ఒ క్కో కార్డును పరిశీలించి సంతకాలు పెట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలిసింది. -
పింఛన్ల కోసం ఆందోళనలు
కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ధర్నాలు కరీంనగర్: పింఛన్లు తొలగించి మా నోట్లో మట్టికొట్టొద్దంటూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల పరిషత్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. 90% వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికేట్ ఉన్నప్పటికీ పింఛన్లు తొలగించారని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అర్హతలున్నప్పటికీ వృద్ధాప్య, వితంతు పింఛన్లు రద్దు చేశారని మరికొందరు వాపోయారు. ఎంపీపీ గుడిసె ఐలయ్య అర్హులందరికీ పింఛన్లు వచ్చేలా చూస్తామని హా మీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ముస్తాబాద్‌లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు రాజీవ్‌చౌక్‌లో రాస్తారోకో నిర్వహించారు. వయ సు నిండిన, అరవై శాతానికి పైగా అంగవైకల్యం కలిగిన, భర్త చనిపోయిన వారికి పింఛన్లు ఇవ్వ డం లేదన్నారు. మండలానికి మరో వెయ్యికిపైగా పింఛన్లు వస్తాయని ఎంపీడీవో ఓబులేసు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు ఆ ధ్వర్యంలో కాల్వశ్రీరాంపూర్‌లో ధర్నా చేశారు. మాదాసు సతీష్(28) అనే సర్పంచ్‌ను చేనేత కార్మికుడిగా గుర్తిస్తూ పింఛన్ ఎలా మంజూరు చేశారంటూ అధికారులను నిలదీశారు. గతంలో ఉన్న పింఛన్లను తొలగించి తమకు అన్యాయం చేశారంటూ వెల్గటూరు మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు. -
మా ఓట్లతో గద్దెనెక్కి..మా పొట్ట కొడతారా?
బత్తలపల్లి : మా ఓట్లతో గద్దెనెక్కి..మా పొట్ట కొడతారా?..అంటూ పలువురు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు కోల్పోయినవారు, సీఎస్పీ స్వాహా చేయడంతో పింఛను అందని బాధితులు మండల కేంద్రంలో శుక్రవారం రాస్తారోరో చేశారు. కదిరి-అనంతపురం జాతీయ రహదారిపై బైఠాయించి గంటసేపు నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు వీరికి మద్దతుగా నిలిచారు. టీడీపీకి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వృద్దులు పట్ల ఆటవికంగా వ్యవహరిస్తున్న టీడీపీకి బుద్ధి చెబుతామంటూ నినాదాలు చేశారు. పలువరు వృద్ధులు మాట్లాడుతూ ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, భూములున్నాయంటూ పింఛను ఎగురగొట్టేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. మంజూరైన పింఛను మొత్తాన్ని సీఎస్పీ స్వాహా చేశారని డీ చెర్లోపల్లికి చెందిన వృద్ధులు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నాయకులు ఎంపీపీ కోటి సూర్యప్రకాష్‌బాబు, జెడ్పీటీసీ అక్కిం నరసింహులు, సింగిల్ విండో అధ్యక్షుడు కేశనపల్లి వెంకటచౌదరి, మండల కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, గుర్రం శ్రీనివాసరెడ్డి తదితరులు మాట్లాడారు. డి.చెర్లోపల్లిలో టీడీపీ నాయకుడు రామమూర్తినాయుడు సీఎస్పీ అవతారం ఎత్తి వృద్ధుల పింఛన్ ను స్వాహా చేశాడని ఆరోపించారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి, పింఛన్‌దారులకు డబ్బు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పింఛన్లను పునరుద్ధరించాలన్నారు. ఎస్ఐ శాంతీలాల్, ఎంపీడీఓ బండి నాగరాజు, ఈఓ పీఆర్డీ లక్ష్మీబాయి ఆందోళనకారులతో మాట్లాడారు. డి.చెర్లోపల్లిలో పింఛన్ సొమ్ము కాజేసినట్లు ప్రజావాణిలో పిర్యాదు చేశారన్నారు. డీఆర్డీఏ అధికారులతో చర్చించి అక్విటెన్స్లు తెప్పించి విచారించగా సంతకాలు తమవి కాదని పింఛన్‌దారులు చెప్పినట్లు తెలిపారు. దీనిపై స్టేట్మెంట్ రికార్డు చేసి చర్యలు తీసుకోవాలని నివేదికలు పంపినట్లు సంబంధిత అధికారులు వివరిచారు. అనంతరం ధర్మవరం రూరల్ సీఐ విజయభాస్కర్గౌడు వచ్చి నేతలతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. రాస్తారోకోతో ఇరువైపులా వాహనాల రాకపోకలు స్తంభించాయి. వైఎస్సార్ సీపీ నాయకులు, సర్పంచ్‌లు సంజీవు, సానే సూర్యనారాయణరెడ్డి, ఎంపీటీసీలు మాతంగి రామాంజనేయులు, వడ్డె క్రిష్టప్ప, ముష్ఠూరు నరసింహారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, వెంకటరెడ్డి, జయరామిరెడ్డి, ఈడిగ కాశప్ప, మాల్యవంతం పరేష్, వేణు, మాజీ డీలర్ సూరీ, అనంతసాగరం క్రిష్ట, డి.చెర్లోపల్లి యల్లప్పనాయుడు, రామకృష్ణ, చల్లా క్రిష్టా, ముసలయ్య, నారాయణస్వామి, నరసింహులునాయుడు, నారప్పనాయుడు, పుల్లానాయుడు, రామానాయుడు, పురుషోత్తంచౌదరి, మనోహరరెడ్డి, ప్రభాకరరెడ్డి, శ్రీరాములు, చెన్నారెడ్డి, చెన్నక్రిష్ణారెడ్డి, బాలకృష్ణారెడ్డి, మాజీ డీలర్లు రామకృష్ణారెడ్డి, ఆదెప్ప, నాగభూషణ, బిల్లే సూరీ, శంకర్, బేల్దారి నరసింహులు పాల్గొన్నారు. -
పింఛన్లు పీకేశారు
ఒంగోలు టౌన్: ప్రతి నెలా ఠంచనుగా వచ్చే పింఛన్‌ను రెండు నెలల నుంచి రాకుండా చేశారని కందుకూరు మండలం ఓగూరుకు చెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వాపోయారు. సోమవారం ప్రకాశం భవనం ఆవరణలోని ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన ప్రజావాణిలో వారు తమ గోడును కలెక్టర్ విజయకుమార్‌కు విన్నవించుకున్నారు. కబుర్లు చెప్పుకోవడానికి వచ్చారా?: కలెక్టర్ ‘50 మంది అధికారులు ఒకేచోట కూర్చొని నాలుగు గంటలు పనిచేస్తున్నారు. దానివల్ల సమస్యలకు పరిష్కారం రావాలి. మీరు(అధికారులు) మాత్రం ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి వచ్చినట్లుంది’ అని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై అధికారులు స్పష్టమైన నిర్ణయాలు రాయకుండా తూతూ మంత్రంగా కలెక్టర్‌కు అందించడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కారంచేడు మండలం స్వర్ణ గ్రామ పంచాయతీలోని రెగ్యులర్, కాంట్రాక్టు కార్మికులు తమకు 14 నెలల నుంచి వేతనాలు రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఇన్చార్జ్ డీఎల్పీవో నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో కలెక్టర్ మండిపడ్డారు. రెగ్యులర్ కార్మికులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించేలా సర్క్యులర్ జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నా దగ్గరకు ఊరికే ఎందుకు పంపిస్తారు : మండల పరిధిలో మీరు చేయాల్సిన పనులు చేయకుండా నా దగ్గరకు ఊరికే ఎందుకు పంపిస్తున్నారని పొదిలి తహశీల్దార్‌ను కలెక్టర్ నిలదీశారు. పొదిలి మండలం రాజుపాలెంలో 448 మందికి 2009లో సర్వే నెం 1064లో ఇళ్ల పట్టాలిచ్చినా ఇంతవరకు పొజిషన్లు చూపించలేదు. దాంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఐదేళ్ల నుంచి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించారు. స్పందించిన కలెక్టర్ పట్టాలు పంపిణీ చేసిన వారిలో అర్హులైన వారితో జాబితాను ప్రచురించి వెంటనే పొజిషన్లు చూపించాలని పొదిలి తహశీల్దార్‌ను ఆదేశించారు. ఏ లోకంలో ఉన్నావు ? - మార్కెటింగ్‌శాఖ అధికారిపై కలెక్టర్ మండిపాటు సుబాబుల్, జామాయిల్ రైతుల నుంచి తక్కువ ధరకు కర్ర కొనుగోలుచేసి మద్దతు ధరకు కొన్నట్లు బిల్లులు ఇస్తుండటంపై కలెక్టర్ విస్మయం వ్యక్తం చేశారు. ఒంగోలు, చీమకుర్తి మార్కెట్ కమిటీల పరిధిలో జరుగుతున్న తంతును ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకట్రావు, ఇతర నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకిలా జరుగుతోందని మార్కెటింగ్‌శాఖ అధికారిని కలెక్టర్ ప్రశ్నించారు. సుబాబుల్ టన్ను 4400, జామాయిల్ టన్ను 4600 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన చెప్పడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు చెబుతున్న ధర జిల్లాలోదా లేక దేశంలోదా, నువ్వు ఏ లోకంలో ఉన్నావు, ఏమి జరుగుతుందో తెలియకుండా ఊహల్లో ఉండి మాట్లాడతావా అని నిలదీశారు. ఒంగోలు, చీమకుర్తి మార్కెట్ యార్డులపై పోలీసుల సాయంతో ఆకస్మిక తనిఖీలుచేసి నివేదికలు అందించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ కలెక్టర్‌ను ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలో ప్రైవేట్ సెప్టిక్ ట్యాంకులా? ఉలవపాడు మండలం చాకిచర్ల పంచాయతీ పరిధిలోని సుబ్బారాయుడు సత్రం ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ప్రైవేట్ గృహాలకు చెందిన సెప్టిక్ ట్యాంకులు నిర్మించిన విషయమై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో చుట్టుపక్కన ఉన్నవారు సెప్టిక్ ట్యాంకులు కట్టారని గ్రామ ఉప సర్పంచ్ కామేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందిస్తూ సెప్టిక్ ట్యాంకులు కట్టిన వారికి నోటీసులు ఇచ్చి పాఠశాల ప్రాంగణం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. వెట్టిచాకిరి నుంచి విముక్తి చేసినా సాయం అందలేదు: ఉలవపాడు, సింగరాయకొండ మండలాల్లోని 58 మందికి వెట్టిచాకిరి నుంచి విముక్తి అయినా ఇంతవరకు ఎలాంటి సాయం అందలేదని ప్రకాశం జిల్లా యానాది యువజన సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వై జాలయ్య, వై అంజిబాబు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గత ఏడాది అక్టోబర్ 3వ తేదీ నెల్లూరు జిల్లా గూడూరులో వెట్టి నుంచి విముక్తి చేసినా ప్రభుత్వం నుంచి 20 వేల రూపాయల నగదు, ఇంటి స్థలం రాలేదన్నారు. దీనిపై విచారించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్..కందుకూరు సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు. చదువులోనూ, మెనూలోనూ వివక్ష : సంతమాగులూరు మండలం ఏల్చూరులోని కేజీబీవీ ఎస్వో తమ పిల్లలకు చదువు చెప్పించడంలో, మెనూ పాటించడంలో వివక్ష ప్రదర్శిస్తోందని విద్యార్థినుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 2011లో ఎస్‌వోగా బాధ్యతలు స్వీకరించిన ఆవుల సునీత ఎస్సీ విద్యార్థినులను, ఇతర కులాల విద్యార్థినులను వేర్వేరుగా విభజించి వారిమధ్య తగువులు పెట్టిస్తోందన్నారు. కేజీబీవీలో ఎస్సీ కులానికి చెందిన ఎస్వోను నియమించాలని కోరారు. -
‘ఆసరా’ తొలగిస్తే ఊరుకోం: ఎడ్మ కిష్టారెడ్డి
కల్వకుర్తి: అర్హులైన వితంతువులు, వృద్ధుల పింఛన్లు రద్దుచేస్తే ఊరుకునేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి హెచ్చరించారు. వృద్ధుల వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచడం సరికాదన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని పేదలు ఆశించారని, వారి ఆశలు అడియాసలవుతాయని పేర్కొన్నారు. పింఛన్ల కోసం వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచడం దారుణమన్నారు. కేసీఆర్ పాలన దొరలు, భూస్వాములు, పెత్తందారులను తలపిస్తుందని విమర్శించారు. ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తే అందుకు సహకరించేందుకు తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం ఉద్యమిస్తామని హెచ్చరించారు. రేషన్‌కార్డులను సైతం తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో అప్పులపాలైన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి రేషన్‌కార్డులను తీసివేస్తే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం మానవతాహృదయంతో ఆలోచించి అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని కోరారు. -
పింఛన్ల కోసం కలెక్టరేట్ ముట్టడి
ఆదిలాబాద్ అర్బన్/ఆదిలాబాద్ రిమ్స్ : పింఛన్ల కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గురువారం కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. పదేళ్లుగా తమకు పింఛన్ వస్తుందని.. ఇప్పుడేందుకు రాదని ప్రశ్నించారు. నెలనెల పింఛన్ తీసుకుంటున్న మాకు సర్వే తర్వాత మంజూరు కాకపోవడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీలో పాత విధానాన్నే కొనసాగించి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గురువారం బీజేపీ ఆధ్వర్యంలో పట్టణంలోని సుమారు 60 మంది బాధితులు ముట్టడిలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లోనికి వెళ్లి ఆర్డీవో చాంబర్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఆర్డీవో సుధాకర్‌రెడ్డి బయటకు వచ్చి బాధితుల గోడు విన్నారు. బీజేపీ నాయకుడు సురేశ్‌జోషి మాట్లాడుతూ సర్వే పేరుతో పింఛన్లు తొలగించడం తో వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వితంతువులకు పింఛన్‌కు మరణ ధ్రువీకరణ పత్రం అడుగుతున్నారని, పదేళ్ల క్రితం వితంతు పింఛన్ మంజూరైన వారు ఇప్పుడా పత్రం ఎలా తీసుకొస్తారన్నారు. అక్కడికి వచ్చిన ఆర్డీవో సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ పింఛన్ల నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తిన మాట వాస్తవమేనని, దీంతో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఇంకా ప్రక్రియ కొనసాగుతుందని, ఈ నెలాఖరులోగా అర్హులందరికీ తప్పకుండా న్యాయం చేస్తామని తెలిపారు. కలేక్టరేట్ నుంచి వెళ్లిన బాధితులు మున్సిపల్ కార్యాలయం ఎదుట కూడా ధర్నా చేశారు. బీజేపీ నాయకులు కిషన్, ఆదినాథ్ పాల్గొన్నారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం ఆదిలాబాద్ రిమ్స్ : అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సీపీఐ ఆధ్వర్యంలో పట్టణంలోని బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకుడు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఆసరా పథకం పేరుతో అర్హులకు ప్రభుత్వం అ న్యాయం చేస్తోందన్నారు. అర్హుల పేర్లు సైతం జాబితాల్లోంచి తొలగించడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు అరుణ్‌కుమార్, అరవింద్, కె.గణేశ్, మధుసుధన్, తదితరులు పాల్గొన్నారు. -
విన్నపాలు వినేదెవరు?
ఒంగోలు టూటౌన్: సర్కారు నిర్వాకంతో పింఛన్లు కోల్పోయిన వేలాది మంది కలెక్టర్‌కు తమ గోడు చెప్పుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి సోమవారం ఒంగోలు తరలి వచ్చారు. జన్మభూమి అనంతరం కలెక్టరేట్లో తిరిగి ప్రారంభమైన ప్రజావాణి వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో నిండిపోయింది. నడవలేని వారు..కర్ర ఊతంతోనో..కుటుంబ సభ్యుల సాయంతోనో మారుమూల ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చారు. పింఛన్లు తీసేశారంటూ వచ్చిన వారిని పలకరించే నాథుడే లేకుండాపోయారు. ఉదయం 10.30కు గ్రీవెన్స్‌సెల్ ప్రారంభించగా 12 కాకుండానే వేరే కార్యక్రమాలున్నాయంటూ కలెక్టర్ విజయకుమార్, ఇతర ఉన్నతాధికారులు వెళ్లిపోయారు. కొత్తగా వచ్చిన డీఆర్వో ఎన్ఆర్ ఖాసీం, అదనపు జాయింట్ కలెక్టర్ ప్రకాష్‌కుమార్ మాత్రమే మిగిలారు. దీంతో అర్జీ ఎవరికి ఇవ్వాలో తెలియక..ఎక్కువ దూరం నడవలేక ఎక్కడివారు అక్కడే నిరాశగా కూలబడిపోయిన దృశ్యాలు చూపరులను కలచివేశాయి. ఎవరైనా పలకరిస్తే చాలు.. ఆగని కన్నీళ్లతో అన్యాయంగా పింఛన్ తీసేశారంటూ విలపించిన పండుటాకుల పరిస్థితి వేదనాభరితం. పింఛన్లకు రాజకీయ రంగు: చూసేవాళ్లు లేక, ఆదరించే వాళ్లు కరువైన వృద్ధులకు ఏదో కంటితుడుపుగా ఇచ్చే పెన్షన్‌కు రాజకీయరంగు పులిమారు. కొన్ని చోట్ల వైఎస్సార్సీపీకి ఓట్లేశారని పగబట్టి పెన్షన్లు తొలగించారని పొన్నలూరు మండలం ఇప్పగుంట, పెద్ద వెంకన్నపాలెం గ్రామాలకు చెందిన దాదాపు 50 మంది బాధితులు వాపోయారు. తన పేరు మీద ఒకటిన్నర ఎకరపొలం ఉందని పెన్షన్ తొలగించారని కోడూరి తిరుపతయ్య వాపోయాడు. ఎక్కడో అమెరికాలో ఉంటున్న వారికి, 20 ఎకరాలు ఉన్న వాళ్లకి, అనర్హుల పేర్లను మళ్లీ ఇటివల జాబితా తయారు చేసి పంపారని.. అర్హులమైన తమ పేర్లు పంపలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులకు చేయూత: పెన్షన్ల కోసం అష్టకష్టాలు పడి ఒంగోలు గ్రీవెన్స్సెల్కి వచ్చిన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కష్టాలు చూడలేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జ్ వరికూటి అశోక్ బాబు వారికి మధ్నాహ్నం భోజన సదుపాయం కల్పించారు. అనంతరం ఇళ్లకు వెళ్లేందుకు వాహనాలు సమకూర్చారు. కొండపి నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి బాధితులు వచ్చారు. వీరందరికీ స్థానిక అంబేద్కర్ భవనంలో భోజనాలు ఏర్పాటు చేశారు. కనిగిరి నియోజకవర్గం నుంచి దాదాపు వెయ్యి మందికి పైగా పెన్షన్ బాధితులు వచ్చారు. ఇలా అన్ని మండలాల నుంచి వేలాది మంది పండుటాకులు తరలిరావడం చూపరులను కలచివేసింది. కొందరు వృద్ధులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఇంత మంది వేదనకు కారణభూతమైన ప్రభుత్వంపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు. -
అయ్యో పాపం!
రాష్ర్ట ప్రభుత్వ నిర్ధయకు పరాకాష్ట ఈ సంఘటనలు. వయసు పైబడి... కుటుంబసభ్యుల నిరాదరణను మౌనంగా భరిస్తున్న వృద్ధుల, ఒకరు సాయం చేస్తే తప్పా ఎలాంటి పనులు చేసుకోలేని వికలాంగుల, కట్టుకున్న వాడు అకాల వృత్యువాత పడితే అయినోళ్ల పంచన చేరి తలదాచుకుంటున్న వితంతువుల పింఛన్లను రద్దు చేసిన చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఈసడించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నెరవేర్చకపోయినా పర్వాలేదు. ప్రతి నెలా తమకు అందజేస్తున్న పింఛన్లను మాత్రం రద్దు చేయకుంటే చాలునన్న భావన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది. - చెన్నేకొత్తపల్లి/అనంతపురం కార్పొరేషన్ వంద శాతం వైకల్యం ఉన్నా అందని పింఛన్ అర్హులైన వారు పింఛన్లు అందక నానా ఇబ్బందులు పడుతుంటే అనర్హులు మాత్రం దర్జాగా వాటిని ఎగరేసుకువెళుతున్నారు. చెన్నేకొత్తపల్లికి చెందిన రామలక్ష్మి, శ్రీనివాసులు దంపతుల రెండవ సంతానంగా పుట్టిన పూజారి నరసింహులుది అదే పరిస్థితి. పుట్టుకతోనే ఆ బాలుడికి రెండు చేతులూ లేవు. ప్రస్తుతం చెన్నేకొత్తపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న నరసింహులుకు వంద శాతం వైకల్యం ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరణ పత్రం కూడా ఉంది. దీనిపై గతంలో 416381నంబర్లో పింఛన్ బుక్కును కూడా ఇచ్చారు. కొన్నేళ్లుగా రూ. 500 చొప్పున పింఛన్‌ను ఇస్తూ వచ్చారు. రాష్ర్టంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వే పేరుతో పింఛన్ జాబితా నుంచి నరసింహులు పేరు తొలగించారు. దీనిపై అధికారులను కలిసి విచారణ చేస్తే నిర్లక్ష్యమే వారికి ఎదురవుతోంది. ప్రస్తుతం బడికి వెళ్లడం మానేసి పింఛన్‌ను పునరుద్ధరించాలంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం నరసింహులు, అతని తల్లిదండ్రులకు నిత్యృత్యమైంది. -
ఏడ్చారు.. దుమ్మెత్తిపోశారు
కూచున్న చోట నుంచి పట్టుమని పది అడుగులు నడవలేని స్థితిలో ఉన్నవారు..అవసాన దశలో ఆదెరువు లేక దేవుడా అంటూ బతుకులు ఈడుస్తున్న అభాగ్యులు..బతకడానికి వేరే దారిలేక పింఛన్లే ఆసరాగా జీవిస్తున్న వారు. ప్రభుత్వం ఇచ్చే పింఛనే వారికి జీవనాధారం.. అలాంటి స్థితిలో ఉన్న వారి పేర్లు పింఛన్ జాబితాలో నుంచి తీసేశారు. దీంతో ఆ అభాగ్యులు షాక్‌కు గురయ్యారు. తమకు జరిగిన అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వందలాదిమంది పానం కూడగట్టుకొని మహబూబ్ నగర్ కలెక్టరేట్‌కు వచ్చారు. అక్కడ అధికారుల ఎదుట కష్టాలు చెప్పుకొని ఏడ్చారు. చివరకు వారి కడుపు మండింది. ప్రభుత్వానికి శాపనార్ధాలు పెట్టారు. దుమ్మెత్తి పోశారు. మహబూబ్‌నగర్ టౌన్: ‘ఇన్నాళ్లూ వచ్చే కాస్త పింఛన్‌తో మాకు బుక్కెడు బువ్వ దొరికేది. ఇప్పుడు ఆ ఆసరా కూడా లేకుండా చేసినవ్. మాకు అన్నం లేకుండా చేసిన నీకు పుట్టగతులుండవ్..’ అంటూ వృ ద్ధులు, వితంతువులు సీఎం కేసీఆర్‌కు శా పనార్థాలు పెట్టారు. ఏ దిక్కూలే ని మా పింఛన్ తీసేసి నోట్లో మట్టికొడతారా? అ ని మండిపడ్డారు. 65ఏళ్లు నిండి న వారికి మాత్రమే ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద పింఛన్‌ను ఈనెల 8న మంజూరుచేసింది. దీంతో వయస్సు అర్హత నిబంధనతో చాలామం ది పింఛన్లు కోల్పోయారు. ఈ క్రమంలో సోమవారం వందలాది మంది వృద్ధులు, వికలాంగు లు, వితంతువులు తరలిరావడంతో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వారికి మద్దతుగా పాలకపక్షం, ప్రతిపక్షాల నాయకులు కూడా వే ర్వేరుగా ఆందోళన లు చేపట్టారు. ఇలా ని రసనలు, నిలదీతలతో రెవెన్యూ సమావేశ హాల్లో జరుగుతున్న ప్రజావాణి ద ద్దరిల్లింది. నాలుగు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెల కొంది. కొందరు వృద్ధు లు చెప్పులు చూ పుతూ తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. తమకు అన్యాయం చేసిన ఈ ప్రభుత్వానికి చెప్పులతోనే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వీరికి సర్దిచెప్పేందుకు వచ్చిన ఏజేసీ రాజారాం పరిస్థితిని చూసి వెనక్కి వెళ్లిపోతుంటే ఆయన వెనుక నుంచి వారంతా దుమ్మెత్తిపోశారు. ఒకాకనొక దశలో పరి స్థితి చేయిదాటిపోయింది. ఈ సందర్భం గా పలువురు వృద్ధులు మాట్లాడుతూ.. మా దేవుడు మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యంతో నెలకు వచ్చే పింఛన్‌తో తమకు కాస్త ఆసరా ఉండేదన్నారు. ఏ తోడు లేకపోయినా ప్రతినెలా వచ్చే పింఛన్ పైన ఆధారపడ్డామని, తెలంగాణ రాష్ట్రం అంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తమ పింఛన్లు తొలగిస్తావా? అని ధ్వజమెత్తారు. మాలాంటి వాళ్లకు అన్యాయం ఎలా చేయాలనిపించిందని నిలదీశారు. అఖిలపక్షం నేతల మద్దతు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు మద్దతు పలికారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలమూరు మునిసిపల్ చైర్పర్సన్ రాధ కలెక్టరేట్ ఆవరణలో వారితో కలిసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదల కడుపుకొట్టిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ధ్వజమెత్తారు. అన్ని అర్హతలు ఉన్నా కావాలనే పింఛన్లను తొలగించారని మండిపడ్డారు. అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేసేవరకు ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కాంగ్రెస్‌పార్టీ మహబూబ్‌నగర్ పట్టణాధ్యక్షుడు అమరేందర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు ఇచ్చామని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిరాగానే వారి కడుపు కొట్టిందని ధ్వజమెత్తారు. అర్హులందరికీ పింఛన్లు వచ్చే వరకు ఉద్యమిస్తామన్నారు. పింఛన్లను తొలగించడంతో టీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన బాట పట్టారు. అర్హత ఉన్న పింఛన్లు రాని కారణంగా తమపై దాడికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ వైస్ చైర్మన్ రాములు, టీడీపీ ఫ్లోర్‌లీడర్ కృష్ణమోహన్, ఎంఐఎం ఫ్లోర్‌లీడర్ హాదీ, టీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రసన్న ఆనంద్, జ్యోతి పాల్గొన్నారు. -
పింఛన్ వస్తుందో.. రాదోనని ఆందోళన
సామాజిక సీలింగ్ నిబంధనతో కులాల వారీగా తుదిజాబితా రెండు రోజులు పడుతుందంటున్న అధికారులు ఇంటికొకరికేనంటూ మరికొందరి పేర్లు గల్లంతు ఆధార్‌కార్డులో 65 ఏళ్లు లేకపోతే నో పింఛన్ పింఛన్.. పింఛన్.. పింఛన్... వారంరోజులుగా జిల్లాలో ఏ నోట విన్నా ఇదే మాట. ‘ఆసరా’ పేరుతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వృత్తి కార్మికులకు ఈనెల ఎనిమిదో తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. గ్రామాల్లో రచ్చబండల నుంచి కలెక్టరేట్ దాకా చర్చ జరుగుతోంది ఈ పింఛన్ల గురించే. దరఖాస్తుల ఆహ్వానంనుంచి.. పంపిణీ ప్రారంభం వరకు అంతా హడావిడిగా, వాడీవేడిగా జరుగుతున్న పింఛన్ల ప్రహసనంపై ‘సాక్షి’ ఫోకస్... క్షేత్రస్థాయిలో ఎన్నో ఆటంకాలు, అనుమానాలు, ఆందోళనలు, ఆవేదనల నడుమ ‘ఆసరా’ పిం ఛన్ల పంపిణీ సాగుతోంది. వాస్తవానికి దరఖాస్తుదారుల సంఖ్య ఈసారి భారీఎత్తున పెరగగా, అందులో కూడా ప్రభుత్వంటార్గెట్ విధించి కోత పెడుతోందన్న ఆరోపణలున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవలే కొత్తగా తెరపైకి వచ్చిన ‘సామాజిక సీలింగ్’ నిబంధన గ్రామస్థాయిలో వృద్ధులను కలవరపెడుతోంది. మరోవైపు సమగ్రసర్వే, ఆధార్‌కార్డుకు లింకులు పెట్టి ఏదోసాకుతో పింఛన్ కోసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో ఈ సమస్య మరింత జఠిలమవుతోంది. అసలు తుది జాబితాలు సిద్ధంకాక ముందే పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించడం, ఎంపిక చేసిన వారికి పెన్షన్లు ఇస్తుండడంతో, మిగిలినవారు తమకు పింఛన్ వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో అర్హులెంతమంది ఉన్నా, ఒక్కరికే పింఛన్ ఇస్తామని, వివిధ కేటగిరీల్లో ఉంటేనే అందరికీ ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో చాలామంది తమకు పింఛన్ రాదేమోననే ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, డ్వాక్రాగ్రూపుల్లో తమవంతు వాటా చెల్లించి పింఛన్ పొందుతున్న ‘అభయహస్తం’ లబ్ధిదారులకు ప్రస్తుతం నెలకు రూ.500 పింఛన్ వస్తుండగా, ఇప్పుడు వీరికి రూ.1000 పింఛన్ అమలుచేస్తారా లేక అదే కొనసాగిస్తారా అన్న దానిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టతా ఇవ్వడం లేదు. ఇక, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారి విషయంలో కూడా సామాజిక సీలింగ్ అమలు చేస్తున్నారన్న ప్రచారమే నిజమైతే కుష్ఠు ఎయిడ్స్ రోగులకు కూడా పింఛన్లో కోతపడే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలో గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధిం చిన వివరాలన్నీ ఆన్లైన్లో అన్ని మండలాల్లో నమో దు కాకుండానే సర్వేకు, పింఛన్‌కు లింకుపెడుతున్నారని, ఆధార్ కార్డులో 65 ఏళ్ల వయసు నమోదు కాకపోయినా పింఛన్ తీసేస్తున్నారని జరుగుతున్న ప్రచారం వృద్ధులను రోడ్లెక్కేలా చేస్తోంది. రెండు రోజులుగా పింఛన్ల పంపిణీపై ఆందోళనలు జిల్లావ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వృత్తికార్మికులు తమ పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే పింఛన్ లబ్ధిదారులను ఎంపిక చేశామని అధికారులంటున్నారు. అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని కలెక్టర్ చిరంజీవులు అధికారికంగా ప్రకటనలు చేస్తుం డడం కొంత భరోసా కలిగిస్తున్నా, అధికారిక తుది జాబితాలు వచ్చి తమ పేర్లను చూసుకునేంతవరకు దరఖాస్తుదారుల్లో ఇదే ఆవేదన కొనసాగనుంది. -
1,00,859 వితంతు పింఛన్ లబ్ధిదారులు
రాష్ట్రంలో 6 శాతం.... వరంగల్‌లో 11 శాతం జిల్లాలోని మహిళా జనాభా లెక్కన రాష్ట్రంలో ప్రథమ స్థానం ఆందోళన కలిగిస్తున్న మూడు పదుల్లోపే వైదవ్యం... ఓరుగల్లు మహిళలకు ఒక్కో రంగంలో ఒక్కో చరిత్ర ఉంది. ఉద్యమం.. రాజకీయ నేపథ్యంలో వారిది ప్రత్యేక శైలి. కానీ.. ఇదే గడ్డపై దిగ్భ్రాంతికరమైన విషయం కూడా ఉంది.. అదేమిటంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వితంతువులు జిల్లాలోనే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మూడు పదుల వయసు దాటకుండానే వారిని వైదవ్యం వెక్కిరిస్తోంది. జిల్లాలో 11 శాతం వితంతువులు ఉన్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. రాష్ట్రంలో సగటున 6 శాతం వితంతువులు ఉంటే.. జిల్లాలో మాత్రం ఆ సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంది. దీనికి కారణాల పలు రకాలు ఉన్నప్పటికీ.. ముఖ్యమైన కారణం మాత్రం మద్యం మహమ్మారేనని జిల్లా యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు మాత్రం పెద్దగా లేవని చెప్పొచ్చు. భర్త మరణించిన వారు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసి చేతులు దులుపుకుంటే చాలదు. మూలాల్లోకి వెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే మూడు పదుల్లోపే వైధవ్యం పొందుతున్న విషయంలో మన అపఖ్యాతి మరింత విస్తరించే ప్రమాదం లేకపోలేదు. పింఛన్లలో... ప్రభుత్వం అందజేసే సామాజిక భద్రతా పింఛన్లు(ఎస్ఎస్పీ) పొందుతున్న వితంతువుల సంఖ్య జిల్లాలో లక్ష దాటింది. 10 జిల్లాల్లో వితంతు పింఛన్లు పొందుతున్న వారిలో సంఖ్యాపరంగా జిల్లా రెండో స్థానంలో నిలుస్తోంది. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా మనకన్నా కాస్త ముం దుంది. అయితే అన్ని వర్గాల వారిని ఆందోళనకు గురిచేస్తున్న ఈ విష యం ప్రస్తుతం కొత్త పింఛన్ల పంపిణీతో రాష్ట్రస్థాయిలో చర్చకు వస్తోంది. జిల్లాలో అత్యధికంగా వితంతువులు ఉండటంపై పలు స్వచ్ఛంద సంస్థలు పలుమార్లు సర్వేలు కూడా నిర్వహించాయి. కబళిస్తున్న గుడుంబా.. 2009లో డీఆర్డీఏతోపాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు జిల్లాలో ప్రత్యేకంగా వితంతువుల విషయంలో సర్వే చేశాయి. ఇందలో గుడుంబా మరణాలే ఎక్కువ మందిని వితంతువులను చేశాయని సర్వేలు నిర్ధారించా యి. సర్వే లెక్కలో గుర్తిస్తున్న భయంకర నిజాల ఆధారంగా నివారణ చర్యలు తీసుకోవడంలో మాత్రం ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితిలో మార్పు రావడంలేదనే విమర్శ వినిపిస్తోంది. కాగా, జిల్లాలో ప్రభుత్వ పింఛన్లు 4,45,030 ఉండగా.. అందులో 1,00,859 మంది వితం తు పింఛన్‌దారులు ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో మొత్తం పింఛన్లు 4,41,603 ఉండగా.. వితంతు పింఛన్లు 1,02,259 ఉన్నాయి. నా కుటుంబం వీధిన పడింది.. ఈమె పేరు బి.స్వరూప. వయసు 28 ఏళ్లు. హన్మకొండ మండలం వడ్డేపల్లి. భర్త సంజీవ్ ఆటోనడుపు తూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి ఒక బాబు, పాప. సంతోషంగా సాగుతున్న కుటుం బంలో మద్యం మహమ్మారి చిచ్చుపెట్టింది. తాగుడుకు బానిసై కొంతకాలానికి భర్త అనారోగ్యంతో చనిపోయాడు. భర్త మరణంతో కుటుంబం వీధిన పడింది. పిల్లల పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో నాలుగిళ్లలో పాకి పనిచేసి పిల్లల్ని చదివిస్తోంది. ఇప్పటికి 20 సార్లు వితంతు పింఛన్ కోసం అర్జీ పెట్టుకున్నా అధికారులకు స్వరూప దీన స్థితిపై జాలి కలగలేదు. ఇటీవల ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోమంటే.. తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటోంది. ఎక్కువగా ఉన్న మండలాలు మండలం పేరు వితంతు పింఛన్లు మొత్తం పింఛన్లు మహబూబాబాద్ 3,104 11,292 మరిపెడ 2,962 11,077 స్టేషన్‌ఘన్‌పూర్ 2,939 13,056 పరకాల 2,667 13,441 కురవి 2,594 9,881 ఆత్మకూరు 2,416 10,580 వర్ధన్నపేట 2,382 8,868 హన్మకొండ 2,346 7,951 హసన్‌పర్తి 2,298 8,567 ధర్మసాగర్ 2,236 10,068 -
పింఛన్ల మంజూరుకు అర్హతలివే..
హన్మకొండ అర్బన్ : వివిధ రకాల పింఛన్ల కోసం ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించగా జిల్లాలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నా యి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు ఐదు లక్షల దరఖాస్తులు అందినట్లు అధికారిక వర్గాల సమాచారం. అయితే, దరఖాస్తుదారుల్లో ఎవ రు అర్హులో, ఎవరు అనర్హులో అనే విషయమై ప్రభుత్వం విధివిధానాలను రూపొందించింది. ఆ వివరాలు విభాగాల వారీగా ఇలా ఉన్నాయి. దరఖాస్తు విధానం ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, వికలాం గులు, గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు సంచార గిరిజన జాతుల వారికి వేర్వేరు గా పింఛన్లు మంజూరు చేయనుంది. ఈ మేర కు అర్హతలు కలిగిన వారు తెల్ల కాగితంపై వ్యక్తిగత వివరాలు, ఆధార్ నంబర్‌తో సంబందిత గ్రామపంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడించిన విషయాల ఆధారంగా దరఖాస్తుదారుల కుటుంబ వివరాలు ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అర్హుల దరఖాస్తులను పింఛన్ కోసం ప్రతిపాదిస్తారు. వృద్ధాప్య పింఛన్ ఈ పింఛన్ కోసం 65 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకోవాలి. జనన ధ్రువీకరణ పత్రం, ఓటరు జాబితా, ఆధార్ కార్డు ఆధారంగా వ యస్సు నిర్ధారిస్తారు. వాటిలో వివరాలు వాస్తవదూరంగా ఉన్నప్పుడు కుటుంబ పరిస్థితి, వివాహ సమయం, పిల్లల వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, కుటుంబంలో ఒకరికి మాత్రమే వృద్ధాప్య పింఛన్ మంజూరు చేస్తారు. ఇంట్లో భార్యాభర్తలు పింఛన్‌కు అర్హులని తేలితే భార్యకు మాత్రమే మంజూరవుతుం ది. ఇక ఐకేపీ ఉన్నతి సర్వేలో పేదలుగా గుర్తిం చిన వారిని తప్పనిసరిగా పింఛన్ కోసం అధికారులు ప్రతిపాదిస్తారు. వితంతు పింఛన్ 18ఏళ్లు వయస్సు నుంచి వివాహమై భర్త మరణించిన మహిళలు వితంతు పింఛన్‌కు అర్హులవుతారు. దరఖాస్తుతోపాటు భర్త మరణ ధ్రు వీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ భర్త మరణించి పదేళ్లు దాటి రికార్డులు లభించని వారి నుంచి దరఖాస్తు స్వీకరించి ఆ తర్వాత ఆర్డీఓ ధ్రువీకరణ పత్రం ఇస్తే పింఛన్ కోసం ప్రతిపాదిస్తారు. ఇక్కడ కూడా ఉన్నతి సర్వేలో నిర్ధారణ అయిన వారికి ప్రాధాన్యముంటుంది. వికలాంగుల పింఛన్ కుటుంబంలో వైకల్యం ఉన్న వారు 40 శాతానికి పైగా వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ పొంది ఉండాలి. వినికిడి లోపం ఉన్న వారైతే 51శాతం వైకల్యంతో సర్టిఫికెట్ కలిగి ఉండాలి. సదరం సర్టిఫికెట్ లేని వారు కూడా దరఖాస్తు చేసుకుంటే అధికారులే సదరం క్యాంపునకు పంపిస్తారు. ఉన్నతి సర్వేలో ప్రతిపాదించిన వికలాంగులను అధికారులు విధిగా పింఛన్ కోసం ప్రతిపాదిస్తారు. చేనేత, గీత కార్మికులు 50ఏళ్ల వయస్సు నిండి చేనేత సహకార సం ఘంలో సభ్యుడైన వ్యక్తి చేనేత పింఛన్ కోసం అర్హులవుతారు. కుటుంబంలో చేనేత పింఛన్‌తో పాటు వితంతువులు, వికలాంగులు ఉన్నట్లయితే వారు కూడా పింఛన్‌కు అర్హులుగా అధికారులు గుర్తిస్తారు. గీత కార్మికుల విషయంలో కూడా 50ఏళ్లు నిండి గీత పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యుడై ఉండాలి. ఈ పింఛన్‌తో పాటు కుటుంబంలో అర్హులు ఉంటే ఇతర పిం ఛన్లు పొందవచ్చు. అలాగే, 50ఏళ్ల వయస్సు నిండిన వారు సంచార గిరిజన జాతుల పింఛన్ కు అర్హులవుతారు. -
పింఛను మంటలు
పెన్షన్ల లబ్ధిదారుల ‘సర్వే’లో నిబంధనలను తుంగలో తొక్కిన ప్రభుత్వం అర్హతలున్నా 84,617 మందినిఅనర్హులుగా చిత్రీకరించిన వైనం నోటికాడ ముద్దను లాగేయడంతో వృద్ధులు, వికలాంగుల ఆకలికేకలు సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఖజానాపై భారాన్ని తగ్గించుకోవడం కోసం కాటికి కాలు చాపిన పండుటాకులు.. ఊతం లేని వికలాంగులు.. దిక్కులేని వితంతువుల నోళ్లను ప్రభుత్వం కొట్టింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు సామాజిక భద్రత కల్పించడం కోసం ఇస్తోన్న పింఛన్లలో కోత విధించింది. అనర్హుల ఏరివేత కోసం చేపట్టిన సర్వేలో నిబంధనలను యథేచ్ఛగా తుంగలోతొక్కింది. నిబంధనలను వక్రీకరించి అర్హులను అనర్హులుగా చిత్రీకరించి.. అధికార టీడీపీ నేతల కనుసన్నల్లో పింఛన్ల లబ్ధిదారుల జాబితా నుంచి 84,617 మందిని తొలగించేసింది. జిల్లాలో అనర్హులను జాబితా నుంచి తొలగించడం వల్ల ఖజానాకు నెలకు రూ.8.61 కోట్లు.. ఏడాదికి రూ.103.32 కోట్లు మిగులుబాటు అవుతుందని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు జబ్బలు చరుచుకుంటుండడంపై సామాజికవేత్తలు విస్తుపోతున్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత. సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెబుతోన్న టీడీపీ అధినేత చంద్రబాబు గద్దెనెక్కగానే కోతలకు తెరతీశారు. ఇదే క్రమంలో పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడానికి ఎత్తు వేశారు. అనుకున్నదే తడవుగా అధికారులు, సామాజిక కార్యకర్తల ముసుగులో టీడీపీ కార్యకర్తలతో కమిటీ వేసి.. తస్మదీయులు అర్హులైనా అనర్హులుగా చిత్రీకరించి పెన్షన్ల లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాలని కనుసైగలు చేశారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. పింఛనుదారుల్లో అనర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. రెండున్నర ఎకరాల మాగాణి, ఐదెకరాల మెట్ట భూమి ఉన్న వారు పింఛను పొందడానికి అనర్హులు. మూడు గదులకు మించి శ్లాబ్ ఇల్లు.. కారు ఉన్న వారు కూడా అనర్హులే. ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగంతో సహా ఎలాంటి ఉద్యోగం చేస్తూ జీతం లేదా ఉద్యోగానికి సంబంధించి పింఛను పొందుతున్న వారు కూడా అనర్హులే.. నెలవారీ జీతం పొందుతున్న ప్రైవేట్ ఉద్యోగం చేసే వారు సైతం అనర్హులే. వృద్ధాప్య పెన్షన్‌దారులకు కనీస వయస్సు 65 సంవత్సరాలు.. వితంతువులకు కనీస వయస్సు 16 ఏళ్లు. వికలాంగులకు కనీస అంగవైకల్యం 40 శాతం కలిగి ఉన్న వాళ్లే అర్హులు. ఆధార్ సీడింగ్ చేసుకోని వారూ అనర్హులే. కానీ.. ఈ నిబంధనలను సర్వేకమిటీ తుంగలో తొక్కిం ది. అన్ని అర్హతలున్నా అనర్హులుగా చిత్రీకరిస్తూ 54,254 మంది వృద్ధులు, 22,108 మంది వితంతువులు, 3,330 వికలాంగులు, 1,673 మంది చేనేత కార్మికులు, 2,786 మంది అభయహస్తం, 16 మంది గీత కార్మికులను పెన్షన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడం గమన్హాం. తప్పులతడకగా లబ్ధిదారుల సర్వే! పింఛను లబ్ధిదారులపై నిర్వహించిన సర్వే తప్పులతడకగా అధికారవర్గాలే అభివర్ణిస్తుండడం గమనార్హం. కమిటీలో టీడీపీ కార్యకర్తలు ఉండడం.. ఆ పార్టీ అగ్రనేతలు ఒత్తిడి తేవడంతో సర్వే మొత్తం వారి కనుసన్నల్లోనే సాగిందని రెవెన్యూశాఖకు చెందిన ఓ కీలకాధికారి ఇటీవల బాహాటంగా వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోం ది. తిరుపతి మండలం ఎమ్మార్పల్లెకు చెందిన వికలాం గుడు బాలకృష్ణను సకలాంగుడుగా తేల్చడమే అందుకు తార్కాణం. భూమి లేకున్నా ఉన్నట్లు.. ఇళ్లు లేకున్నా ఉన్నట్లు తిమ్మిని బిమ్మిని చేసి అనర్హులుగా చిత్రీకరించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పింఛను లబ్ధిదారుల జాబితాలో ఉంటే.. ఒకరి పేరును నిర్ధాక్షిణ్యంగా తొలగిం చారు. ఇదే పద్ధతిలో 84,617 మందిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. నెలనెలా వృద్ధాప్య, వితం తు, గీత, నేత కార్మికులు రూ.వెయ్యి.. వికలాంగులు రూ.1500 పింఛను వస్తుందని ఆశించారు. కానీ.. ఉన్న పింఛనే పీకేయడంతో తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు రోడ్డెక్కుతున్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా పింఛను జాబితా నుంచి తొలగించిన వృద్ధులు, వికలాం గులు, వితంతువులు ఆందోళనలు చేయడమే అందుకు తార్కాణం. -
పింఛన్లు తొలగిస్తే చర్యలు తప్పవు
నిండ్ర: వుండలంలో అర్హులైన పేదలు, వికలాంగులు, వితంతువుల పింఛన్లు తొలగిస్తే చర్యలు తప్పవని నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా అధికారుల ను హెచ్చరించారు. శుక్రవారం ఆమె మండలంలోని అత్తూరు గ్రావుంలో నిర్వహించిన జన్మభూమి-వూ ఊరు కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ప్రతి గ్రామంలో నిరుపేదలను గుర్తించి అర్హులైన వారికి పింఛన్లు వచ్చేలా చూడాలన్నారు. అలాకాకుండా అధికార పార్టీ నాయకుల అండదండలతో అధికారులు పింఛన్ల జాబితా నుంచి అర్హుల పేర్లను తొలగిస్తే చూస్తూ ఊరుకునేదిలేదని ఆమె హెచ్చరించారు. పేదలకు ఇప్పటికీ గుర్తున్న నాయకులు ఇద్దరేనని, వారు ఎన్టీఆర్, వైఎస్.రాజశేఖర రెడ్డి అని గుర్తుచేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కను నాటారు. వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జన్మభూమి ప్రత్యేకాధికారి రవికూవూర్, ఎంపీపీ వసంతవ్ము, జెడ్పీటీసీ వూలతి, ఎంపీడీవో సతీష్, సర్పంచ్ లోకేష్, ఎంపీటీసీ కవిత, తహశీల్దార్ బాబు, వైఎస్సార్ సీపీ నాయకులు చక్రపాణిరెడ్డి, వునోహర్‌నాయుడు, వుురళీనాయుుడు, శ్యామ్‌లాల్ పాల్గొన్నారు. నగరిలో.. ప్రజల పక్షాన పోరాడుతామని ఎమ్మెల్యే ఆర్కే.రోజా అన్నారు. మేళపట్టు గ్రామంలో జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీలు ఎంతవరకు అమలుచేసిందని ప్రశ్నించారు. డ్వాక్రా మహిళలకు లక్షవరకు అందిస్తే ఒక్కొక్క మహిళకు పదివేల రూపాయలు మాత్రమే లభిస్తుందన్నారు. ఇది కాస్త వడ్డీ కిందకు బ్యాంకులు జమచేసుకుంటే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తెలుగుతమ్ముళ్లు చెప్పినట్లుగా అధికారులు తలొగ్గి పనిచేయడం సిగ్గుచేటన్నారు. సభలో రభస ఎంపీడీవో సీతమ్మ గ్రామసభకు అధ్యక్షత వహించారు. ముందుగా సర్పంచ్ మధుసూదన్‌కు, ఆ తర్వాత వరుసగా టీడీపీకి చెందిన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, కో-ఆప్షన్ మెంబర్లకు పలుమార్లు అడిగి మైకు అందించి మాట్లాడించారు. వారు చంద్రబాబు పాలన గురించి పదేపదే మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే రోజా తన ప్రసంగంలో ముఖ్యమంత్రి సందేశపత్రాన్ని చేతపట్టి వాటిలోని అంశాలకు వివరణ ఇస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఏవిధంగా లబ్ధిచేకూరాయన్న విషయాలను తెలియజేశారు. దీని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు రోజా ప్రసంగాన్ని అడ్డుకొని గొడవకు దిగారు. సింగిల్ విండో అధ్యక్షుడు బాల సురేష్, ఎంపీటీసీ హరిబాబు వేదిక వద్ద వీరంగం సృష్టించారు. అడ్డుకున్న వైఎస్సార్సీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ప్రభుత్వం మాది అంటూ బిగ్గరగా కేకలు వేస్తూ సవాళ్లకు దిగారు. సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు తక్కువమంది ఉండటంతో వారిని నిలువరించడం కష్టసాధ్యమైంది. పలమనేరులో జన్మభూమి రచ్చరచ్చ పలమనేరు: పలమనేరు పురపాలక సంఘంలో శుక్రవారం జరిగిన జన్మభూమి- మా ఊరు గ్రామసభలు రచ్చరచ్చగా మారాయి. పట్టణంలోని సీఎస్ఐ కాంపౌండ్‌లో నిర్వహించిన 8వ వార్డుసభలో వైఎస్ఆర్సీపీ చెందిన మున్సిపల్ వైస్‌చైర్మన్ చాంద్‌బాషాకు పూలమాల వేయకపోగా.. వేదికపై ఉన్న అధికారులను పక్కకు పొమ్మని తెలుగుతమ్ముళ్లు టీడీపీ ఇన్చార్జ్ని కుర్చోబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో ప్రోటోకాల్ వివాదం తెరమీదికొచ్చింది. ఇరుపార్టీల నాయకులు వాగ్వాదాలకు దిగారు. ఈ సంఘటనకు నిరసనగా వైస్ చైర్మన్ వార్డు సభను బహిష్కరించి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులతో కలసి జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు. పోలీసులు వీరి ధర్నాను అడ్డుకుని వివాదం పెద్దది కాకుండా చూశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమరనాథరెడ్డి కౌన్సిలర్లతో కలసి ప్రోటోకాల్ వివాదం, తెలుగు తమ్ముళ్ల హంగామాపై సీఐ బాలయ్య దృష్టికి తీసుకెళ్ళారు. అక్కడికి చేరుకున్న డిఎస్పీ హరినాథ రెడ్డి కమిషనర్ వెంకటేశ్వరరావ్ను స్టేషన్‌కు పిలిపించి ఈ సంఘటనపై పూర్తిగా విచారించారు. నేటి నుంచి జరిగే వార్డుసభల్లో వీడియో రికార్డింగ్ చేపట్టాలని కమిషనర్‌ను ఆదేశించారు. జన్మభూమి వద్ద గొడవలు సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్ఐలను ఆదేశించారు. అధికారులు సైతం ప్రోటోకాల్‌ను పటిష్టంగా అమలు చేయాలని ఆయన సూచించారు. ఆయన వెంట వైస్ చైర్మన్ చాంద్‌బాషా పలువురు కౌన్సిలర్లు ఆ పార్టీ నాయకులు సివి కుమార్, హేమంత్‌కుమార్ రెడ్డి మైనారిటీ నాయకులు రహీంఖాన్, కమాల్, ఖాజా, శ్యామ్, చెంగారెడ్డి, ప్రహ్లాద తదితరులు పాల్గొన్నారు. -
మా ఆయనే ఉంటే మీ పింఛన్ ఎవరికి కావాలి ?
శెట్టూరు : ‘మాకు భర్తలు ఉండి ఉంటే మీరిచ్చే వెయ్యి రూపాయలకు ఆశ పడేవారమా..’ అంటూ మండలంలోని చెర్లోపల్లి, మాలేపల్లికి చెందిన వితంతువులు అధికారులను నిలదీశారు. తమకు భర్తలు ఉన్నారంటూ వితంతు పింఛన్లు తొలగించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా మా భర్తలు బతికి ఉంటే చూపించండి అంటూ ధ్వజమెత్తారు. శుక్రవారం చెర్లోపల్లి గ్రామంలో ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ పరిధిలో దాదాపు 60 మంది వితంతువుల పింఛన్లను జాబితా నుంచి తొలగించారు. బాధిత వితంతువులు తిప్పమ్మ, శ్రీకాంతమ్మ, లక్ష్మక్క, సిద్దమ్మ, అనసూయమ్మ తదితరులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ పింఛన్లు ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. భర్త బతికున్నందున వితంతు పింఛన్‌కు అనర్హులుగా భావిస్తూ తీసేశారని అధికారులు సమాధానమిచ్చారు. తహశీల్దార్ వాణిశ్రీ మాట్లాడుతూ పింఛన్ రద్దయిన వారు తిరిగి దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. దీనికి శాంతించని బాధితులు మాకు మీరిచ్చే పింఛన్ వద్దు.. మా భర్తలు బతికే ఉంటే తెచ్చివ్వండి అంటూ బాధితులు నిలదీశారు. మీ నీచ నికృష్ట విధానాల వల్ల మాలాంటి వారిని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారంటూ శాపనార్థాలు పెట్టారు. గ్రామ రాజకీయాలకు అర్హులైన తమను బలి చేయడం తగదన్నారు. రెండు గ్రామాల పరిధిలో 240 పింఛన్లను ఎందుకు తొలగించారో తెలియజేయాలని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆనందప్ప, గంగప్ప, హుస్సేన్‌పీరా, నాయకులు మల్లేశప్ప, ప్రకాష్, శేఖర్, తిమ్మప్ప, గోవిందప్ప, హనుమంతరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు తిమ్మరాజు పట్టుబట్టారు. అర్హుల జాబితాను కూడా చదివి వినిపించాలని డిమాండ్ చేశారు. వేరేదారి లేక చివరకు అధికారులు జాబితా చదివారు. అందులో అర్హులైన వితంతువులు, వృద్ధులు, వికలాంగులను కుట్రపూరితంగానే తొలగించారని భావించిన బాధితులు గొడవకు దిగారు. దీంతో స్పెషలాఫీసర్ రామసుబ్బయ్య జోక్యం చేసుకుని అర్హులందరికీ పింఛన్ మంజూరు చేస్తామని చెప్పడంతో వారు శాంతించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శివయ్య, ఏఓ వాసుకీరాణి, జెడ్పీటీసీ సభ్యురాలు కవిత, ఎంపీపీ మానస, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సునీత, ఓబులమ్మ, విద్యుత్ ఏఈ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
తేలని పింఛన్ల జాబితా
మచిలీపట్నం : జిల్లాలో పింఛనుదారుల అర్హత జాబితా ఇంకా కొలిక్కి రాలేదు. అక్టోబర్ రెండో తేదీ నుంచి అర్హులైన వృద్ధులు, వితంతువులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు, 80 శాతం కన్నా వైకల్యం అధికంగా ఉన్న వికలాంగులకు రూ.1500 పింఛను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ నెల ప్రారంభమవుతున్నా జిల్లాలో పింఛనుదారుల వివరాల సేకరణ ఇంకా పూర్తికాలేదు. జిల్లాలో మొత్తం 3,12,185 మంది లబ్ధిదారులు వివిధ రకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వారిలో ఇప్పటివరకు 2,97,710 పింఛనుదారుల వివరాలు పరిశీలించిన అధికారులు 12,857 మందిని అనర్హులుగా గుర్తించారు. ఇంకా 16,475 మందికి సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించాల్సి ఉంది. వీరిలో ఎంతమంది అనర్హులుగా ఉంటారో తేల్చాలి. అధికారులు పింఛనుదారుల వివరాలు సేకరించే సమయంలో వారికి ఉన్న రేషన్ కార్డు, ఆధార్ కార్డులు రెండుచోట్ల నమోదయ్యాయా అనే అంశంపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రెండుచోట్ల నమోదై ఉంటే ఒకచోట తొలగిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రెండున్నర ఎకరాల మాగాణి, ఐదు ఎకరాల మెట్ట భూమి ఉంటే వారిని అనర్హులుగా గుర్తిస్తున్నారు. వితంతు పింఛను పొందేవారి వద్ద మరణ ధ్రువీకరణ పత్రాలు లేకపోవటంతో వారు పింఛను వస్తుందా, రాదా అనే అంశంపై లోలోపల మధనపడుతున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరికి వృద్ధాప్య పింఛను వస్తుంటే వారిలో ఎవరికి నిలిపివేస్తారోననే అంశంపైనా చర్చ సాగుతోంది. పింఛన్ల తుది జాబితా ఇంకా ఖరారు చేయలేదని, త్వరితగతిన పూర్తిచేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీఆర్డీఏ పీడీ రజనీకాంతారావు తెలిపారు. కొత్తగా వివిధ రకాల పింఛన్ల మంజూరు కోసం 25 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు. -
పింఛన్లు పీకేశారు
ఒంగోలు టౌన్ : వారంతా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు. నెలనెలా వచ్చే పింఛనే ఆధారం. అలాంటి పింఛన్‌ను సర్వే పేరుతో పీకేశారు. అప్పటివరకూ అందుకున్న పింఛన్లకు వారిని అనర్హులను చేశారు. జాబితాల్లో ఉన్న పేర్లను ఏకపక్షంగా తొలగించారు. తమకు జరిగిన అన్యాయం గురించి వారంతా మండల అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో ఏకంగా ధ్రువీకరణ పత్రాలు తీసుకుని స్థానిక ప్రకాశం భవనం ఆవరణలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. కలెక్టర్ విజయకుమార్‌ను కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఆ వివరాల ప్రకారం... చీమకుర్తి మండలం పీ నాయుడుపాలెం గ్రామంలో ఆ గ్రామ కమిటీ పింఛన్ల పరిశీలన కార్యక్రమం చేపట్టింది. అయితే ఆ గ్రామ సర్పంచ్, కార్యదర్శులు ఏకపక్షంగా వ్యవహరించి 75 మంది అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పేర్లను తొలగించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికామన్న కారణంతోనే పింఛన్ల జాబితా నుంచి తమపేర్లు తొలగించారంటూ బాధితులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇంతమంది పింఛన్లు తొలగించారా:కలెక్టర్ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెద్ద సంఖ్యలో కలెక్టర్‌ను కలిసి తమ పింఛన్లు తొలగించారని చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఇంతమంది పింఛన్లు తొలగించారా అని అవాక్కయ్యారు. సర్వే నిర్వహించి తమ పేర్లను తొలగించారంటున్న బాధితుల్లో కొంతమంది 90 శాతం వరకూ అంగవైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్లు చూపించడంతో వారి పింఛన్ల తొలగింపునకు కారణాలు తెలియజేయాలని డీఆర్డీఏ పీడీ పద్మజను ఆదేశించారు. ప్రతిఒక్కరినీ విచారించి నివేదికలు అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. -
పెన్షన్ల కోతే..
10,600 మంది పెన్షన్ల తొలగింపు నేడుమరో 15 వేలు కట్! కోతే లక్ష్యంగా పెన్షన్ తనిఖీలు జిల్లాలో సాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘పచ్చ’ కమిటీలు లబ్ధిదారులను కుదించే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నాయి. రెండు రోజులుగా జరుగుతున్న సర్వేలో అప్పుడే 10,600 మందిని అనర్హులుగా గుర్తించి నిర్దాక్షిణ్యంగా పెన్షన్ రాకుండా చేశారు. మంగళవారం కూడా ఇంటింటా తనిఖీలతో 15 వేల మందికి పైగా లబ్ధిదారులను తొలగించాలని కంకణం కట్టుకున్నట్లు తెలిసింది. విశాఖ రూరల్: జిల్లాలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పెన్షన్ల సర్వేపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1,500 చొప్పున పెన్షన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈలోగా లబ్ధిదారుల సంఖ్యను వీలైనంత తగ్గించాలని ప్రభుత్వం ఇంటింటా సర్వేకు ఆదేశించింది. కొన్ని చోట్ల ఇంటింటా సర్వే నిర్వహించకుండా పంచాయతీ కార్యాలయాల్లోను, చెట్ల కింద కూర్చొని లబ్ధిదారుల వడపోతను చేపడుతుండడంతో పెన్షన్‌దారుల్లో ఆందోళన నెలకొంది. మాకవరపాలెం మండలం రాచపల్లిల్లో పంచాయతీ కార్యాలయంలో కూర్చుని పెన్షన్లు తనిఖీ చేస్తున్న కమిటీ సభ్యులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీల్లో టీడీపీ నేతలు,కార్యకర్తలు అధికంగా ఉండడంతో వారికి అనుకూలమైన వారిని చూసీచూడనట్లు వదిలేసి, ఇతర పార్టీల వారిని అనర్హులుగా గుర్తిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత శుక్రవారం నుంచి ఈ సర్వే ప్రారంభం కాగా, తొలి రెండు రోజులు సర్వే నామమాత్రంగా జరిగింది. దీంతో మరో రెండు గడువు పొడిగించారు. జిల్లాలో మొత్తం 3,20,895 మంది పెన్షన్‌దారులు ఉండగా ఇంటింటా సర్వేలో ఇప్పటి వరకు 2,14,736 మంది వివరాలను పరిశీలించారు. ఇందులో 10,600 మందిని అనర్హులుగా గుర్తించినట్లు తెలిసింది. ఇంకా 1,06,159 మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పరిశీలన చేయాల్సి ఉంది. ఒక్కరోజులో ఇంత మంది ఇళ్లకు వెళ్లడం కష్టం. అయినప్పటికీ మంగళవారం సాయంత్రంతో సర్వేను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో చివరి నిమిషంలో ఇష్టానుసారంగా లబ్ధిదారులను గుర్తింపును చేపట్టే అవకాశాలు లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 25 రాత్రికి అప్లోడ్ లబ్ధిదారుల వివరాలతో పాటు అనర్హుల జాబితాను ఈ నెల 25వ తేదీ రాత్రికి అధికారులు అప్లోడ్ చేయనున్నారు. అలాగే పెన్షన్ల కోసం కొత్త దరఖాస్తులను మంగళవారం మాత్రమే స్వీకరించనున్నారు. ఇప్పటికే ఇంటింటా సర్వేలోనే సిబ్బంది కొత్త దరఖాస్తులు స్వీకరించారు. వారిలో అర్హులను కూడా అక్కడే నిర్ధారిస్తున్నారు. మంగళవారం కొత్త దరఖాస్తులు స్వీకరించిన వెంటనే వాటిని పరిశీలించనున్నారు. కొత్త దరఖాస్తులను కూడా 25వ తేదీ రాత్రిలోగా అప్లోడ్ చేయనున్నారు. అయితే కొత్త వారికి పెన్షన్ల మంజూరు అక్టోబర్ 2 నుంచి జరుగుతుందా లేదా అన్ని విషయంపై అధికారులకు స్పష్టమైన సమాచారం లేదు. రద్దు సరికాదు నాది పెదబయలు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు 2006లో వికలాంగుల కోటాలో పెన్షన్ మంజూరయింది. నాటి నుంచి నెలకు రూ. 500లు ఇస్తున్నారు. అది చాలక ఇటీవల పాఠశాలలో పార్టుటైం ఉద్యోగం చేస్తున్నాను. ప్రస్తుతం రద్దు చేస్తామనడం సరికాదు. వికలాంగుడినా కాదా అన్నది చూడాలి తప్ప.. ఇలాంటి చర్యలు సరికాదు. - విద్యాకుమార్ పట్నాయక్ -
చిరు ఆసరాపై పెనుగాభరా
- పింఛన్ సర్వే కేంద్రాలకు ఎగబడ్డ లబ్ధిదారులు - భారీవర్షంలోనూ వృద్ధులు, వికలాంగుల ఉరుకులు - తొలిరోజు జరిగింది 25 శాతం పరిశీలనే - అస్తవ్యస్తంగా, హడావుడిగా సాగిన ప్రక్రియ - ఎన్నడో ‘చెరిగిన బొటు’కు సర్టిఫికెట్ అడగడంతో - కలత చెందుతున్న వితంతువులు సాక్షి, రాజమండ్రి / మండపేట : పూలవాన కురిపిస్తామని బులిపించి, అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు సర్కారు.. అనంతరం బడుగుల బతుకుల్లో పిడుగులు కురిపిస్తోంది. మాఫీ మాయ నాటకంలో రోజుకో ఆటంకపు అంకాన్ని రచిస్తున్న ప్రభుత్వం.. తాజాగా పింఛన్ల మొత్తం పెంపు వాగ్దానం అమలుకు ముందు అసలుకే ఎసరు పెట్టే తంతును మొదలు పెట్టింది. బతుకు పడమటి పొద్దున పండుటాకులకు, విధి వెక్కిరించిన వికలాంగులకు, వితంతువులకు పీడకలలా పింఛన్ల సర్వేను ప్రారంభించింది. సకాలంలో వెళ్లి తమ పత్రాలు చూపకపోతే గోరంత ఆసరాను ఎక్కడ రద్దు చేస్తారోనన్న కొండంత ఆందోళనతో.. పింఛన్‌దారులు కుండపోతగా వాన కురుస్తున్నా సర్వే జరుగుతున్న తావులకు ఉరుకులు, పరుగులు పెట్టారు. తాము పింఛన్లకు అర్హులమన్న రుజువులు చూపించేందుకు ఎగబడ్డారు. గుండెలు గుబగుబలాడుతుండగా.. ప్రభుత్వం తలపెట్టిన పింఛన్ల సర్వే శుక్రవారం జిల్లాలో ప్రారంభమైనా కొన్నిచోట్ల అపశ్రుతులు ఎదురవడంతో వాయిదా పడింది. అనర్హుల పేరిట పింఛన్‌దారుల సంఖ్యను భారీగా తగ్గించేందుకు ప్రభుత్వం వేసిన ఈ ఎత్తుగడ లబ్ధిదారుల గుండెల్లో ముందే గుబులు రేపగా.. ఓ ప్రామాణికత లేకుండా సాగిన సర్వే వారిని ఏమవుతుందోనన్న దిగులులోకి నెట్టింది. తొలిరోజు జిల్లాలో సుమారు 25 శాతం మాత్రమే సర్వే జరిగిందని అంచనా. రాజమండ్రి, కాకినాడ నగర పాలక సంస్థలతో పాటు పలు మున్సిపాలిటీల్లో సాయంత్రం మూడు గంటల వరకూ పింఛనుదారుల డేటా కంప్యూటర్లలోకి ఆన్లైన్ ద్వారా చేరలేదు. సర్వే కేంద్రాల వద్ద ఉదయం నుంచి లబ్ధిదారులు బారులు తీరి, కూడూనీళ్లూ లేకుండా పడిగాపులు పడ్డారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో సాంకేతిక సిబ్బంది చేతులెత్తేయడంతో తొలిరోజు చేయాల్సిన సర్వేను 21కి వాయిదా వేశారు. మామిడికుదురు తదితర మండలాల్లో కూడా డేటా రాక జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పింఛ న్ల అర్హత పత్రాలను తీసుకుని సర్వే కేంద్రాలకు రావాలనడంతో వాటి నకళ్ల కోసం ఉదయం నుంచి జిరాక్సు సెంటర్ల వద్ద పింఛనుదారులు క్యూలు కట్టారు. మండపేట, జగ్గంపేట, పెద్దాపురం, రాజానగరం మండలాల్లోని పలుచోట్ల వర్షంలోనూ పింఛన్‌దారులు బారులు తీరారు. వేర్వేరు జాబితాలు ఎగనామానికేనా..? పరిశీలనలో క్రమపద్ధతి లోపించడంతో ఆ ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగింది. మండపేటలోని కొన్ని వార్డుల్లో పింఛన్ పంపిణీ కేంద్రాల వద్ద సర్వే నిర్వహించారు. ధృవీకరణ పత్రాలను అందజేసిన వారి పేర్లను ఓ జాబితాలో, అవి లేని వారి పేర్లను మరో జాబితాలో నమోదు చేశారు. దీంతో పత్రాలు ఇవ్వని పింఛన్‌దారులు ఏమవుతుందోనని కలత చెందుతున్నారు. సర్వే తీరును బట్టి కూడా పింఛన్లకు పెద్ద సంఖ్యలో ఎగనామం పెట్టే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా వితంతు పింఛన్ల లబ్ధిదారులను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. రేషన్, ఆధార్ కార్డులున్నా భర్త మరణ ధృవీకరణ పత్రం అడగడంతో చాలామంది వితంతువులు దిక్కుతోచని స్థితిలో చిక్కుకుంటున్నారు. తన భర్త 30 ఏళ్ల క్రితం మృతి చెందాడని, ఇప్పటికిప్పుడు ధృవీకరణ పత్రం ఎక్కడి నుంచి తీసుకురావాలని ఓ మహిళ వాపోయింది. వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి రేషన్, ఆధార్ కార్డుల్లో దేనిలో వయసు ఎక్కువగా ఉంటే దానినే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. రెండింటిలో వయసు తక్కువగా ఉన్న వృద్ధులు తమ పింఛన్లకు ఎసరు పెడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 30 శాతం వరకూ రేషన్ కార్డులకు, ఆధార్ కార్డులకు పొంతన లేకుండా వయసు నమోదు జరిగింది. సర్వేకు దూరంగా టీడీపీ ప్రజాప్రతినిధులు అనర్హత సాకుతో పింఛన్లలో భారీగా కోత పెట్టడమే సర్వే లక్ష్యమన్న ఉద్దేశంతో.. ఆ నింద తమపై పడకుండా పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు సర్వేకు దూరంగా ఉన్నారు. కాగా కమిటీల్లో సామాజిక కార్యకర్తలను తొలగించి అన్ని చోట్లా టీడీపీ కార్యకర్తలకు స్థానం కల్పించారు. నియోజక వర్గాల ఎమ్మెల్యేలు నేరుగా పిలిచి ఆదేశాలిస్తుండడంతో తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. పింఛన్‌దారులకు న్యాయం చేయాలంటే వారి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయాలంటే సర్వే మరో మూడు రోజులైనా కొనసాగించాల్సిన అవసరం ఉందని అధికారులే అంటున్నారు. కానీ సాంకేతిక సమస్యలు తలెత్తిన చోట్ల తప్ప ఇతర ప్రాంతాల్లో శనివారంతోనే సర్వే ముగించేయనుండడంతో ఈ హడావుడి వల్ల అర్హులు కూడా పింఛన్లు కోల్పోతామని భయపడుతున్నారు. -
మోడీ కోసం వెయ్యి రాఖీలు
వారణాసి: రక్షాబంధన్(రాఖీ) పండుగ ఈ సారి ప్రధాని మోడీకి ప్రత్యేకం కానుంది. అంతేకాదు జీవిత భాగస్వాములను కోల్పోయి మలిదశలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారణాసి మహిళలకు కూడా ప్రత్యేక ఆనందాన్ని తెచ్చిపెట్టనుంది. మోడీ వారణాసి ఎంపీ అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారణాసిలోని పలు ఆశ్రమాల్లో గడుపుతున్న వితంతు మహిళలు కొందరు ప్రధాని, సోదర సమానుడైన మోడీ కోసం వెయ్యి రాఖీలు తయారు చేసే పనిలో పడ్డారు. తమ సోదరుడు(మోడీ)కి వెయ్య రాఖీలు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బిర్లా ఆశ్రమంలో ఉంటున్న వితంతు మహిళ ఒకరు చెప్పారు. -
పెన్షనర్లకు పండగ
క్యాబినెట్ ఆమోదంతో పెరగనున్న పింఛన్లు హైదరాబాద్ జిల్లాలో 83 వేల మందికి లబ్ధి సాక్షి, సిటీబ్యూరో: వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్ల పెంపునకు రాష్ట్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపడంతో నగరంలోని పెన్షనర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నో ఏళ్లుగా చాలీచాలని పింఛన్లతో అవస్థ పడుతూ బతుకులీడుస్తున్న పింఛనర్లలో క్యాబి నెట్ నిర్ణయం కొత్త ఆశలు చిగురింపజేసింది. ఇప్పటి వరకు వృద్ధులు, వితంతువులకు ప్రభుత్వం నుంచి పింఛన్‌గా కేవలం రూ.200, వికలాంగులకు రూ.500 అందుతుండగా, తాజా పెంపుతో వృద్ధులు, వితంతువులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 వంతున అందనుంది. రాష్ట్ర సర్కారు తాజా నిర్ణయంతో హైదరాబాద్ జిల్లాలో 83వేల 752మందికి లబ్ధికి చేకూరనుంది. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ప్రతినెలా పింఛనర ్లకు 2.09కోట్లు అందుతుండగా, తాజా పెంపుతో ఇకపై ఈమొత్తం నెలకు రూ.9.06 కోట్లు కానుంది. దసరా పండుగ నుంచి పెరిగిన పింఛను అమలులోకివస్తుందని సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏ కేటగిరి పెన్షనర్లు ఎంతమందంటే.. కేటగిరి పెన్షనర్లు ప్రస్తుతం(రూ.ల్లో) దసరా నుంచి(రూ.ల్లో) వృద్ధులు 33, 060 66,12,000 3,30,60,000 వితంతువులు 36, 869 73,73,800 3,68,69,000 వికలాంగులు 13,823 69,11,500 2,07,34,500 మొత్తం 83,752 2,08,97,300 9,06,63,500 -
నాలుగు నెలలుగా గోస!
కందుకూరు: పింఛన్ డబ్బులతోనే బతుకులీడ్చే దీనులను అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇచ్చే అరకొర డబ్బులకు లబ్ధిదారుల్ని కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్నారు. మండలంలో నాలుగు నెలలుగా పింఛన్లు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గోస పడుతున్నారు. అధికారులు మాత్రం ఈ నెల వచ్చే నెల ఒకేసారి మొత్తం వస్తుందని చెప్పి పంపుతున్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ ఇదే దయనీయ పరిస్థితి నెలకొంది. పింఛన్లు అందని వారు దాదాపు ప్రతి గ్రామంలో పది, పదిహేను, ముప్పై మంది వరకు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మండలంలోని వృద్ధాప్య, వితంతు, అభయహస్తం, వికలాంగ పింఛన్ లబ్ధిదారులు 6,737 మంది ఉన్నారు. వృద్ధులు, వితంతువులకు ప్రతి నెలా రూ.200, వికలాంగులకు, అభయహస్తం కింద మహిళలకు రూ.500 చొప్పున పింఛన్లు అందాల్సి ఉంది. వీటిని ప్రభుత్వం మణిపాల్ ఏజెన్సీ ద్వారా సీఎస్పీలకు అందించి వారి నుంచి లబ్ధిదారులకు ప్రతి నెలా 1 నుంచి 5 లేదా పదో తేదీ లోపు అందజేయాలి. కాగా ఏప్రిల్, మే, జూన్, జులై నెలల పింఛన్లు లబ్ధిదారుల్లో చాలా మందికి అందలేదు. పింఛన్ల పంపిణీ కోసం కొత్త స్మార్ట్ కార్డులు అందించే ప్రక్రియలో భాగంగా ఫొటో తీసుకుని ఎన్రోల్మెంట్ చే సిన లబ్ధిదారులకు నాలుగు నెలలుగా పింఛన్ పంపిణీ కాలేదు. ఇదేమని అధికారుల్ని ప్రశ్నిస్తే ప్రాసెస్ అవుతోంది, మీ డబ్బు ఎక్కడికి పోదూ.. వచ్చే నెల మొత్తం ఒకేసారి అందుతుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో డబ్బులు అందుతాయో లేదోననే సందిగ్ధంలో పడ్డారు లబ్ధిదారులు. కనిపించిన అధికారినల్లా అడుగుతూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కనిపించిన వారందరికీ గోడు చెప్పుకొంటున్న.. నాలుగు నెలల నుంచి పింఛన్ రావడంలేదు. గ్రామంలో ఎప్పుడూ పింఛన్ డబ్బు ఇచ్చేవారిని అడిగితే పై నుంచి రాలేదు. అధికారుల్ని అడగండి అని అంటున్నారు. ఏం చేయాలో తెలియక కనిపించిన వారందరికీ గోడు చెప్పుకొంటున్నా. - సత్తెమ్మ, జైత్వారం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం.. నాలుగు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. నడవటం చేతగాకపోయినా ఏదోలా కష్టాలకోర్చి పింఛన్ డబ్బు కోసం తిరగాల్సి వస్తోంది. నెలనెలా వచ్చే ఆ డబ్బే మాకు ఆధారం. ఇప్పుడు అదీ బంద్ అయింది. - సాయిలు, జైత్వారం -
అయ్యా.. పింఛన్..!
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : మూడు నెలల నుంచి పింఛన్ రాకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అరిగోస పడుతున్నారు. పింఛన్ కోసం ఎండలో కాళ్లకు బొబ్బలు పెట్టంగా.. వందలాది రూపాయలు రవాణా చార్జీలు భరిస్తూ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా అధికారులు కనికరించడం లేదు. మా కష్టం పగవాడికి కూడా రావొద్దని పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ విధానం.. గతంలో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, పట్టణాల్లో మున్సిపల్ అధికారులు పింఛన్ డబ్బులు పంపిణీ చేసేవారు. నెల మొదటి వారంలోనే ఆయా కార్యాలయాల వద్ద వారి పేర్లకు అనుగుణంగా సంతకాలు, వేలి ముద్రలు తీసుకొని పింఛన్ ఇచ్చేవారు. ఆ తర్వాత డీఆర్డీఏ నుంచి సీఎంఎస్వోలు కొన్ని రోజులపాటు పంపిణీ చేశారు. మృతిచెందినవారు, ఊరు వదిలి వెళ్లిపోయినవారు, పలువురు అనర్హులు పింఛన్లు పొందుతున్నారని సర్కారు దృష్టికి రావడంతో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకోసం యాక్సెస్ బ్యాంక్, ఫినో కంపెనీ ఆధ్వర్యంలో జిల్లాలోని 18 మండలాలు, పోస్టల్ ద్వారా 34 మండలాలు, ఏడు మున్సిపాలిటీల్లో ఐసీఐసీఐ బ్యాంక్, మణిపాల్ ఆధ్వర్యంలో బయోమెట్రి క్ విధానంలో పింఛన్ పంపిణీ విధానానికి తెర లేపారు. కష్టాలు మొదలు.. బయోమెట్రిక్ విధానంతో పింఛన్‌దారుల కష్టాలు మొదలయ్యాయి. ప్రధానంగా పలువురికి ఆధార్‌కార్డు లేకపోవడం, ఆధార్ కార్డు ఉన్నా అనుసంధానం కాకపోవడం, బయోమెట్రిక్ విధానంలో వృద్ధుల వేలి ముద్రులు నమోదు కాకపోవడం కారణంగా బ్యాంక్ ఖాతాలు తెరవలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే బ్యాంక్ కరస్పాండెంట్లు ప్రతినెల పింఛన్ వివరాలు ఎంపీడీవోకు అందజేయాలి. ఎంపీడీవోలు డీఆర్డీఏ కార్యాలయానికి సదరు వివరాలు పంపిస్తారు. ఈ ప్రక్రియ సరిగ్గా జరగకపోవడంతో పింఛన్లు అందుతున్నాయా లేదా అన్న వివరాలు కూడా తెలియలేదు. దీంతో నెలనెల పింఛన్ అందకపోవడంతో లబ్ధిదారులకు కష్టాలు రెట్టింపు అయ్యాయి. వృద్ధుల వేళ్లు అరిగిపోవడం, బయోమెట్రిక్ విధానంలో వేలి ముద్రలు చూపించకపోవడంతో వారి పింఛన్‌ను ఇవ్వడం లేదు. గాడిలోపడని ఐరీస్ ఆధార్ ద్వారా సేకరించిన ఐరీష్ (కంటిపాపలు) విధానంలో నమోదు చేసుకొని పింఛన్ పంపిణీ చేస్తామని అధికారులు చెప్పినా ఆ ప్రక్రియ ఇంకా గాడిలో పడటం లేదు. పెలైట్ ప్రాజెక్టు కింద బోథ్, ఆదిలాబాద్, లక్ష్మణచాంద, నేరడిగొండ, కుంటాల, ఇచ్చోడ మండలాల్లోని పది గ్రామాల్లో ఐరీష్ విధానాన్ని చేపట్టారు. అక్కడ విజయవంతమైతే మిగతా మండలాల్లోనూ అమలు చేస్తామని అధికారులు అంటున్నారు. మరోపక్క బ్యాంక్ కరస్పాండెంట్లకు ఇచ్చిన మిషన్లు గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్స్ లేక పనిచేయకపోవడం, బ్యాటరీ బ్యాకప్ రాకపోవడం, కరస్పాండెంట్లకు ఈ ఆపరేటింగ్ విధానంపై అవగాహన లేకపోవడంతో సమస్య తలెత్తుతుంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని సుమారు సగం మంది పింఛన్‌దారులకు పింఛన్లు అందని పరిస్థితి నెలకొంది. ఇచ్చేది అరకొరే.. జిల్లాలో 2,62,004 మంది లబ్ధిదారులు వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. అందులో వృద్ధాప్య 1,35,750, చేనేత 537, వికలాంగులు 26,964, వితంతువులు 79,921, కల్లుగీత కార్మికులు 283, అభయహస్తం కింద 18,549 మంది ప్రతినెల పింఛన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులకు ప్రతినెలా రూ.200, వికలాంగులు, అభయహస్తం పింఛన్‌దారులకు ప్రతి నెల రూ. 500 పింఛన్ కింద అందజేస్తారు. ఈ లెక్కన ప్రతినెల రూ.7.75 కోట్లు పింఛన్ల రూపంలో డీఆర్డీఏ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మొదట చేపట్టిన 34 మండలాల్లో బయోమెట్రిక్ విధానం ద్వారా 1,50,179 మందికి రూ.4.35 కోట్లు పింఛన్ నగదు అందజేస్తున్నారు. అయితే మొదట చేపట్టిన ఈ ప్రక్రియలోనూ ఇప్పటికీ పూర్తిస్థాయిలో బయోమెట్రిక్ విధానం అమలుకు నోచుకోలేదు. 18 మండలాల్లో చేపట్టిన బయోమెట్రిక్ విధానంలో ఇంకా బాలారిష్టాలు దాటలేదు. ఈ పరిస్థితుల్లో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడ ం లేదు. నెలనెలా పింఛన్లు తీసుకోకపోతే మూడో నెల తర్వాత డబ్బులు వెనక్కి వెళ్లిపోతాయి. ఆ నెలకు సంబంధించిన పింఛన్ మాత్రమే వస్తుంది. పింఛన్‌దారులు తపాలా కార్యాలయానికి వెళ్లి బయోమెట్రిక్ యంత్రంలో వేలి ముద్ర వేసే పింఛన్ వస్తుంది. విధానం గాడిలో పడకపోవడంతో కష్టాలెప్పుడు దూరమవుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. -
‘ఆసరా’తో ఆటలు
1,756 పింఛన్ల తొలగింపు.. 514 మంజూరు ఎన్నికల వేళ మార్పులుచేర్పులు 3,30,660 పింఛన్లకు బడ్జెట్ విడుదల కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: వృద్ధులు.. వికలాంగులు.. వితంతువులకు ‘ఆసరా’ దూరమవుతోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలోనూ మార్పులు చేర్పులు చేపడుతుండటం విమర్శలకు తావిస్తోంది. మార్చి నెలకు సంబంధించి సామాజిక భద్రత పింఛన్లలో మరికొంత కోత పెట్టారు. ఫిబ్రవరి నెలలో 3,32,017 పింఛన్లు ఉండగా.. మార్చిలో 813 డెత్ కేసులు, 943 శాశ్వతంగా గ్రామాలు వదిలి వెళ్లిన వారిని తొలగించారు. అయితే కొత్తగా 514 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కోడ్ అమలులో ఉండగా కొత్త పింఛన్ల మంజూరు విదాస్పదమవుతోంది. తొలగింపులు పోను.. కొత్త పింఛన్లతో కలిపి మార్చి నెలలో 3,30,660 పింఛన్లకు రూ.7,50,29,100 మొత్తాన్ని బుధవారం సాయంత్రం ఆన్లైన్లో విడుదల చేశారు. తొలగించిన పింఛన్లు తక్కువే అయినా బడ్జెట్లో భారీగా కోతపడింది. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఫిబ్రవరి నెల 13,100.. మార్చి నెలలో 1,756 పింఛన్లను తొలగించారు. ఇదిలాఉండగా మార్చి 29, 30 తేదీల్లో విడుదల కావాల్సిన బడ్జెట్ నాలుగు రోజులు ఆలస్యం కావడంతో పింఛన్ల పంపిణీ కూడా జాప్యం కానుంది. -
విల‘పింఛన్’
సాక్షి, మంచిర్యాల : సర్కారు నిర్ణయాలతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అవస్థలు పడుతున్నారు. పూటకో విధానం అమలు చేయడంతో గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. గతంలో స్మార్ట్‌కార్డుల ద్వారా పంపిణీ చేస్తామని, అనంతరం ఆధార్, రేషన్ కార్డుల ఎన్రోల్మెంట్ అంటూ తిప్పుకున్నారు. ప్రస్తుతం పింఛన్ల పంపిణీలో అక్రమాలను నిరోధించడానికి బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానంతో చేతుల వేళ్లు లేనివారు.. వంకరగా ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారు. వీరికోసం ప్రస్తుతం మళ్లీ ఐరీష్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒక్కవిధానం సక్రమంగా అమలు చేయకపోవడంతో పింఛన్‌కు వచ్చిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎండనకా.. వాననకా పింఛన్ కోసం బారులు తీరుతున్నారు.. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.. ఉదయం నుంచి సాయంత్రం అధికారుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయినా బాధలు తీరడం లేదు.. వీరి గోస ప్రభుత్వానికి తగలడం లేదు. అక్రమాల పర్వం జిల్లా వ్యాప్తంగా 2,75,639 మందికి ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. ఇందులో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఉన్నారు. 65 ఏళ్ల పైబడి వయస్సు ఉన్న వారితోపాటు అభయహస్తం కింద 60 ఏళ్ల వయస్సు ఉన్న వారికి వృద్ధాప్య పెన్షన్ కింద ప్రతినెలా రూ.200, 40 శాతం అంగవైకల్యం ఉన్న వారికి రూ.500, వితంతువులకు రూ.500 చొప్పున డీఆర్డీఏ అందిస్తోంది. ప్రభుత్వం పెన్షన్ రూపంలో అర్హులకు అందిస్తున్న ఆర్థికసహాయాన్ని చూసి కొందరు దళారులు, ఉద్యోగులు అనర్హులనూ జాబితాలో చేర్చి అక్రమంగా పింఛన్ పొందుతున్నారు. పలుచోట్ల అర్హులకు అందించాల్సిన పింఛన్ కాజేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం అనర్హులను గుర్తించడంతోపాటు వారి పెన్షన్లు రద్దు చేసేందుకు రెండు నెలల క్రితం బయోమెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టింది. పింఛన్‌దారులు ప్రతినెల వారి చేతి బొటన వేలిముద్ర ఆ పరికరంపై పెడితే యంత్రం వారి వేలిముద్ర స్కాన్ చేసుకుంటుంది. వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు వస్తాయి. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ వేలి ముద్రలు చెరిగిపోయి ప్రమాదాల్లో చేతులు పోయిన వారికి మాత్రం సమస్యలు మొదలయ్యాయి. వృద్ధులు పరికరంపై వేలిముద్ర పెడితే స్కాన్ కావడం లేదు. చేయిలేని వాళ్లు వేలిముద్రలు వంకర ఉన్న వాళ్లు తమ వేలి ముద్రలు స్కాన్ చేయించుకోలేని పరిస్థితి. దీంతో వీరికి పెన్షన్ నిలిచింది. ఇలాంటి వాళ్లు జిల్లా వ్యాప్తంగా 15 వేల మంది వరకు ఉంటారని అంచనా. తెరపైకి ‘ఐరీష్’ వేలిముద్రలు చెరిగిపోయిన వృద్ధులు, చేతివేళ్లు లేని వాళ్లకు రెండు నెలల నుంచి పింఛన్ అందక అవస్థ లు పడుతున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఐరీష్ విధానంలో ఇవ్వాలని ఆలోచిస్తోం ది. ఐరీష్ ద్వారా కంటి స్కాన్ చేసి పెన్షన్ ఇస్తారు. అధికారులు ఇప్పటికే జిల్లాలోని ఏదైన గ్రామంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించా రు. ఓ విధంగా ఆలోచిస్తే ఈ ప్రక్రియ బాగానే ఉ న్నా ఐరీష్తోనూ వృద్ధులకు ఇబ్బందులు తప్పేట ట్లు లేవు. ఇప్పటికే ఆధార్ కార్డు దరఖాస్తు సమయంలో చాలామంది వృద్ధులకు కళ్లు స్కాన్ కాక ఇబ్బందులు తలెత్తాయి. కళ్లు కూడా స్కాన్ కాక పో తే ఎలా అని పలువురు వృద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. బయోమెట్రిక్ పద్ధతిలో చేతి బొటన వేలు స్కాన్ కాని వారి కోసం ఐరీష్ విధానం అమలు చేస్తామన్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభించి.. అర్హులందరికీ పెన్షన్లు అందజేస్తామని చెప్పారు. -
పింఛన్ల కోసం లబ్ధిదారుల పాట్లు
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: ప్రతినెలా ఇచ్చే అరకొర పింఛన్ల కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు నానా అగచాట్లు పడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఉద్యోగులతో సమానంగా ప్రతినెలా ఒకటి, రెండు తేదీల్లోనే తలుపు తట్టి మరీ పింఛన్లు అందించేవారు. ప్రస్తుతం పోస్టాఫీసులకు అప్పగించడం, వాటికి తోడు ఆధార్ అనుసంధానం, పీఓటీడీ (పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డివైస్) పరికరాలు పెట్టి వేలిముద్రలు సరిచూస్తుండటంతో లబ్ధిదారుల అవస్థలు అన్నీ ఇన్నీకావు. అన్ని గ్రామాల్లో పోస్టాఫీసులు లేకపోవడంతో పింఛన్ల కోసం 5 నుంచి పది కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తోంది. వృద్ధులు, వికలాంగులకు అది మరింత భారంగా మారుతోంది. జిల్లాలో మొత్తం 3,13,569 మంది పెన్షన్ అర్హులున్నారు. వీరిలో 33,269 మంది వికలాంగులు, 127 మంది కల్లుగీత కార్మికులు, 1,72,671 మంది వృద్ధులు, 6,722 మంది చేనేత కార్మికులు, 82,958 మంది వితంతువులు, 17,764 మంది అభయహస్తం పెన్షన్‌దారులున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సబ్పోస్టుమాస్టర్లు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని ఒంగోలు నగరం, కందుకూరు, చీరాల, మార్కాపురం పట్టణాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా మణిపాల్ బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ పెన్షన్లను పంపిణీ చేస్తోంది. వీరికి రూ 10,17,60,200లను ప్రతి నెలా చెల్లిస్తున్నారు. వీరిలో 65 వేల మందికి పైగా వృద్ధులకు, వితంతువులకు ఆధార్ కార్డులు లేవు. దీంతో జనవరి నుంచి వీరికి పెన్షన్లు అందవు. గతంలో ఐకేపీ డీపీఎం సంతకం చేస్తే ఆధార్ కార్డు లేకపోయినా పెన్షన్లు అందించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. చీరాల నియోజకవర్గ పరిధిలో దేశాయిపేట పంచాయతీలో ఒకటో వార్డు పింఛన్‌దారులు పోస్టాఫీసుకు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. అదేవిధంగా పాతరెడ్డిపాలెం, ఊటుకూరు సుబ్బయ్యపాలెం, బొచ్చులవారిపాలెం, కొత్తపాలెం గ్రామాలకు చెందిన పింఛన్‌దారులు రామన్నపేట, వేటపాలెం పోస్టాఫీసులకు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో పెద్దదోర్నాల మండలంలో వృద్ధుల వేలిముద్రలను పీఓటీడీ యంత్రాలు అంగీకరించకపోవడంతో మండల ఏపీ ఆన్లైన్ కోఆర్డినేటర్ సమక్షంలో పింఛన్లు తీసుకోవాల్సి వస్తోంది. నెట్‌వర్క్‌లో సైతం తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. త్రిపురాంతకంలో విద్యుత్ కోత, సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో సర్వర్లు పనిచేయక పింఛన్ల కోసం లబ్ధిదారులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. దర్శి నియోజకవర్గంలో 22514 మంది పింఛన్‌దారులుండగా వారిలో 5622 మందికి ఆధార్ కార్డులు లేక రెండు నెలలుగా పింఛన్లు పొందలేకపోతున్నారు. ముండ్లమూరు మండలంలో వేములబండ, రమణారెడ్డిపాలెం, అయోధ్యనగర్, రాజగోపాలరెడ్డి నగర్, పలుకురాళ్ల తండా, నందమూరి నగర్, బసవాపురం, జగత్నగర్, శ్రీనివాసా నగర్, తమ్మలూరు, సుంకరవారిపాలెం గ్రామాల పింఛన్‌దారులు నాలుగు కిలోమీటర్లు కాలినడకన పోస్టాఫీసుకు వెళ్లి పింఛన్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. గిద్దలూరు పోస్టాఫీసులో పింఛన్లు తీసుకునేందుకు గురువారం వచ్చిన వృద్ధులు పలువురు జాబితాలో పేర్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరు మున్సిపాలిటీలో వివిధ వార్డుల్లో రోజుకు నలుగురైదుగురికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేసి మిగిలిన వారికి తరువాత రండి అంటూ రోజుల తరబడి తిప్పుకుంటున్నారు. కొండపి నియోజకవర్గం టంగుటూరు పంచాయతీ పరిధిలోని 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రావివారిపాలెం, బాపూజీ కాలనీ, వెంకటాయపాలెం వారు టంగుటూరు పోస్టాఫీసుకు రావాల్సిందే. కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్‌పురం మండలంలో కొత్తగా 615 మంది దరఖాస్తు చేసుకున్నా..వారికి ఇంకా మంజూరు కాలేదు. పీఓటీడీ మిషన్లకు సిగ్నల్ అందక అవస్థలు పడుతున్నారు. పర్చూరు నియోజకవర్గంలోని చినగంజాం మండలంలో కొందరికి ఆగస్టు నెల పింఛన్లు కూడా రాక ఇబ్బంది పడుతున్నారు. యద్దనపూడి మండలంలో పోస్టాఫీసుల వద్ద పీఓటీడీ మిషన్లకు సిగ్నల్స్ సరిగా అందక లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. కరెంటు కోతల కారణంగా చార్జింగ్ లేదనే సాకుతో లబ్ధిదారులను ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండేలా చేస్తుండటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఒంగోలు నగరంలో పింఛన్ల కోసం వృద్ధులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వ స్తోంది. ప్రతినెలా 7వ తేదీలోపు పింఛన్లు అందించాల్సి ఉన్నా..15వ తేదీ వరకూ ఇస్తున్నారు. నగర పరిధిలో ఆధార్ కార్డులు లేక వెయ్యి మంది జనవరి నుంచి పింఛన్లు కోల్పోయారు. సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని చీమకుర్తిలో పింఛన్‌దారులు ఎక్కడ పింఛన్లిస్తారో స్పష్టత లేక పోస్టాఫీసులు, మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉన్న పనితోనే సతమతమవుతుంటే పింఛన్ల పంపిణీ పేరుతో తమపై అదనపు భారం మోపుతున్నారని గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇచ్చే జీతం తక్కువ..పనిభారం ఐదు రెట్లు పెంచి తమ శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వితంతువుపై లైంగిక దాడి
పటాన్చెరు టౌన్, న్యూస్‌లైన్: భార్య సహకారంతో ఓ వితంతువుపై భర్త లైంగిక దాడికి పాల్పడిన సంఘటనలో దంపతులు ఇరువురిపై కేసు నమోదు చేశారు. సీఐ శంకర్‌రెడ్డి కథనం మేరకు. పటాన్చెరు మండల పరిధిలోని చిన్నకంజర్ల గ్రామానికి చెందిన ఓ వితంతువు (35) వద్ద అదే గ్రామానికి చెందిన మంగలి నర్సింహ నెలలో డబ్బు ఇస్తానని ఆరేళ్ల క్రితం రూ. 30 వేలు అప్పుగా తీసుకున్నాడు. డబ్బు ఇవ్వాలని పలుమార్లు కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మంగళవారం నరసింహ పనిచేస్తున్న మంగలి దుకాణం వద్దకు వెళ్లిన డబ్బు ఇవ్వాలని బాధితురాలు డిమాండ్ చేసింది. అయితే తానే ఇంటికి వచ్చి మాట్లాడతానని అక్కడి నుంచి ఆమెను పంపేశాడు. అనంతరం అదే రోజు రాత్రి బాధితురాలి ఇంటికి వెళ్లి తన వద్ద డబ్బు లేదని, తరువాత ఇస్తానని చెప్పి ఆమెను ఒప్పించాడు. అనంతరం అక్కడి ఉండిపోయాడు. దీంతో నరసింహులు భార్య కూడా అక్కడికి చేరుకుంది. వీరి మధ్య ఏం జరిగిందో గాని నరసింహులుకు భార్య సహకరించడంతో వితంతువుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈమేరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వితంతు పింఛను నిబంధనలో మార్పు
న్యూఢిల్లీ: వితంతువులు పింఛన్లు పొందే నిబంధనల్లో కేంద్రం మార్పులు చేసింది. కొన్ని ప్రత్యేక కేసుల్లో కుటుంబ పింఛను పొందేందుకు వితంతువులు ఇద్దరు గెజిటెడ్ అధికారుల ధ్రువీకరణ పొందాల్సిన అవసరం లేకుండా చేసింది. కుటుంబ పింఛను కోసం ‘ఫామ్ 14’ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన వితంతువులకు ఇబ్బందికరంగా మారిందంటూ వివిధ వర్గాల నుంచి కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజా సమస్యలు, పింఛన్ల శాఖకు వినతిపత్రాలందాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం పింఛనుదారుకు, భర్త/భార్యకు జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టయితే ఇతర వ్యక్తులెవరో కుటుంబ పింఛను కోసం దరఖాస్తు చేసుకోవడమనే సమస్యే ఉత్పన్నం కాదనే అంశంతో ఏకీభవించింది. అందువల్ల ఇలాంటి కేసుల్లో ‘ఫామ్ 14’ అవసరం ఉండదు. పింఛనుదారు మరణాన్ని భర్త/భార్య బ్యాంకు అధికారులకు తెలియజేయడం ద్వారా ఓ చిన్న లేఖతో తనకు కుటుంబ పింఛను మంజూరు చేయవలసిందిగా కోరవచ్చని ప్రభుత్వం తెలిపింది.