1,756 పింఛన్ల తొలగింపు.. 514 మంజూరు
ఎన్నికల వేళ మార్పులుచేర్పులు
3,30,660 పింఛన్లకు బడ్జెట్ విడుదల
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: వృద్ధులు.. వికలాంగులు.. వితంతువులకు ‘ఆసరా’ దూరమవుతోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలోనూ మార్పులు చేర్పులు చేపడుతుండటం విమర్శలకు తావిస్తోంది. మార్చి నెలకు సంబంధించి సామాజిక భద్రత పింఛన్లలో మరికొంత కోత పెట్టారు. ఫిబ్రవరి నెలలో 3,32,017 పింఛన్లు ఉండగా.. మార్చిలో 813 డెత్ కేసులు, 943 శాశ్వతంగా గ్రామాలు వదిలి వెళ్లిన వారిని తొలగించారు. అయితే కొత్తగా 514 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కోడ్ అమలులో ఉండగా కొత్త పింఛన్ల మంజూరు విదాస్పదమవుతోంది.
తొలగింపులు పోను.. కొత్త పింఛన్లతో కలిపి మార్చి నెలలో 3,30,660 పింఛన్లకు రూ.7,50,29,100 మొత్తాన్ని బుధవారం సాయంత్రం ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. తొలగించిన పింఛన్లు తక్కువే అయినా బడ్జెట్‌లో భారీగా కోతపడింది. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
ఫిబ్రవరి నెల 13,100.. మార్చి నెలలో 1,756 పింఛన్లను తొలగించారు. ఇదిలాఉండగా మార్చి 29, 30 తేదీల్లో విడుదల కావాల్సిన బడ్జెట్ నాలుగు రోజులు ఆలస్యం కావడంతో పింఛన్ల పంపిణీ కూడా జాప్యం కానుంది.