కందుకూరు: పింఛన్ డబ్బులతోనే బతుకులీడ్చే దీనులను అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇచ్చే అరకొర డబ్బులకు లబ్ధిదారుల్ని కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్నారు. మండలంలో నాలుగు నెలలుగా పింఛన్లు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గోస పడుతున్నారు.
అధికారులు మాత్రం ఈ నెల వచ్చే నెల ఒకేసారి మొత్తం వస్తుందని చెప్పి పంపుతున్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ ఇదే దయనీయ పరిస్థితి నెలకొంది. పింఛన్లు అందని వారు దాదాపు ప్రతి గ్రామంలో పది, పదిహేను, ముప్పై మంది వరకు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
మండలంలోని వృద్ధాప్య, వితంతు, అభయహస్తం, వికలాంగ పింఛన్ లబ్ధిదారులు 6,737 మంది ఉన్నారు. వృద్ధులు, వితంతువులకు ప్రతి నెలా రూ.200, వికలాంగులకు, అభయహస్తం కింద మహిళలకు రూ.500 చొప్పున పింఛన్లు అందాల్సి ఉంది. వీటిని ప్రభుత్వం మణిపాల్ ఏజెన్సీ ద్వారా సీఎస్‌పీలకు అందించి వారి నుంచి లబ్ధిదారులకు ప్రతి నెలా 1 నుంచి 5 లేదా పదో తేదీ లోపు అందజేయాలి. కాగా ఏప్రిల్, మే, జూన్, జులై నెలల పింఛన్లు లబ్ధిదారుల్లో చాలా మందికి అందలేదు. పింఛన్ల పంపిణీ కోసం కొత్త స్మార్ట్ కార్డులు అందించే ప్రక్రియలో భాగంగా ఫొటో తీసుకుని ఎన్‌రోల్‌మెంట్ చే సిన లబ్ధిదారులకు నాలుగు నెలలుగా పింఛన్ పంపిణీ కాలేదు.
ఇదేమని అధికారుల్ని ప్రశ్నిస్తే ప్రాసెస్ అవుతోంది, మీ డబ్బు ఎక్కడికి పోదూ.. వచ్చే నెల మొత్తం ఒకేసారి అందుతుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో డబ్బులు అందుతాయో లేదోననే సందిగ్ధంలో పడ్డారు లబ్ధిదారులు. కనిపించిన అధికారినల్లా అడుగుతూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
కనిపించిన వారందరికీ గోడు చెప్పుకొంటున్న..
నాలుగు నెలల నుంచి పింఛన్ రావడంలేదు. గ్రామంలో ఎప్పుడూ పింఛన్ డబ్బు ఇచ్చేవారిని అడిగితే పై నుంచి రాలేదు. అధికారుల్ని అడగండి అని అంటున్నారు. ఏం చేయాలో తెలియక కనిపించిన వారందరికీ గోడు చెప్పుకొంటున్నా.
- సత్తెమ్మ, జైత్వారం
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం..
నాలుగు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. నడవటం చేతగాకపోయినా ఏదోలా కష్టాలకోర్చి పింఛన్ డబ్బు కోసం తిరగాల్సి వస్తోంది. నెలనెలా వచ్చే ఆ డబ్బే మాకు ఆధారం. ఇప్పుడు అదీ బంద్ అయింది.
- సాయిలు, జైత్వారం
నాలుగు నెలలుగా గోస!
Published Tue, Jul 15 2014 12:20 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement