పింఛన్ వస్తుందో.. రాదోనని ఆందోళన
సామాజిక సీలింగ్ నిబంధనతో కులాల వారీగా తుదిజాబితా
రెండు రోజులు పడుతుందంటున్న అధికారులు
ఇంటికొకరికేనంటూ మరికొందరి పేర్లు గల్లంతు
ఆధార్‌కార్డులో 65 ఏళ్లు లేకపోతే నో పింఛన్
పింఛన్.. పింఛన్.. పింఛన్... వారంరోజులుగా జిల్లాలో ఏ నోట విన్నా ఇదే మాట. ‘ఆసరా’ పేరుతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వృత్తి కార్మికులకు ఈనెల ఎనిమిదో తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. గ్రామాల్లో రచ్చబండల నుంచి కలెక్టరేట్ దాకా చర్చ జరుగుతోంది ఈ పింఛన్ల గురించే. దరఖాస్తుల ఆహ్వానంనుంచి.. పంపిణీ ప్రారంభం వరకు అంతా హడావిడిగా, వాడీవేడిగా జరుగుతున్న పింఛన్ల ప్రహసనంపై ‘సాక్షి’ ఫోకస్...
క్షేత్రస్థాయిలో ఎన్నో ఆటంకాలు, అనుమానాలు, ఆందోళనలు, ఆవేదనల నడుమ ‘ఆసరా’ పిం ఛన్ల పంపిణీ సాగుతోంది. వాస్తవానికి దరఖాస్తుదారుల సంఖ్య ఈసారి భారీఎత్తున పెరగగా, అందులో కూడా ప్రభుత్వంటార్గెట్ విధించి కోత పెడుతోందన్న ఆరోపణలున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవలే కొత్తగా తెరపైకి వచ్చిన ‘సామాజిక సీలింగ్’ నిబంధన గ్రామస్థాయిలో వృద్ధులను కలవరపెడుతోంది. మరోవైపు సమగ్రసర్వే, ఆధార్‌కార్డుకు లింకులు పెట్టి ఏదోసాకుతో పింఛన్ కోసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో ఈ సమస్య మరింత జఠిలమవుతోంది. అసలు తుది జాబితాలు సిద్ధంకాక ముందే పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించడం, ఎంపిక చేసిన వారికి పెన్షన్లు ఇస్తుండడంతో, మిగిలినవారు తమకు పింఛన్ వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో అర్హులెంతమంది ఉన్నా, ఒక్కరికే పింఛన్ ఇస్తామని, వివిధ కేటగిరీల్లో ఉంటేనే అందరికీ ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో చాలామంది తమకు పింఛన్ రాదేమోననే ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, డ్వాక్రాగ్రూపుల్లో తమవంతు వాటా చెల్లించి పింఛన్ పొందుతున్న ‘అభయహస్తం’ లబ్ధిదారులకు ప్రస్తుతం నెలకు రూ.500 పింఛన్ వస్తుండగా, ఇప్పుడు వీరికి రూ.1000 పింఛన్ అమలుచేస్తారా లేక అదే కొనసాగిస్తారా అన్న దానిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టతా ఇవ్వడం లేదు. ఇక, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారి విషయంలో కూడా సామాజిక సీలింగ్ అమలు చేస్తున్నారన్న ప్రచారమే నిజమైతే కుష్ఠు ఎయిడ్స్ రోగులకు కూడా పింఛన్‌లో కోతపడే అవకాశం కనిపిస్తోంది.
జిల్లాలో గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధిం చిన వివరాలన్నీ ఆన్‌లైన్‌లో అన్ని మండలాల్లో నమో దు కాకుండానే సర్వేకు, పింఛన్‌కు లింకుపెడుతున్నారని, ఆధార్ కార్డులో 65 ఏళ్ల వయసు నమోదు కాకపోయినా పింఛన్ తీసేస్తున్నారని జరుగుతున్న ప్రచారం వృద్ధులను రోడ్లెక్కేలా చేస్తోంది. రెండు రోజులుగా పింఛన్ల పంపిణీపై ఆందోళనలు జిల్లావ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, వృత్తికార్మికులు తమ పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే పింఛన్ లబ్ధిదారులను ఎంపిక చేశామని అధికారులంటున్నారు. అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని కలెక్టర్ చిరంజీవులు అధికారికంగా ప్రకటనలు చేస్తుం డడం కొంత భరోసా కలిగిస్తున్నా, అధికారిక తుది జాబితాలు వచ్చి తమ పేర్లను చూసుకునేంతవరకు దరఖాస్తుదారుల్లో ఇదే ఆవేదన కొనసాగనుంది.