
మా ఆయనే ఉంటే మీ పింఛన్ ఎవరికి కావాలి ?
శెట్టూరు : ‘మాకు భర్తలు ఉండి ఉంటే మీరిచ్చే వెయ్యి రూపాయలకు ఆశ పడేవారమా..’ అంటూ మండలంలోని చెర్లోపల్లి, మాలేపల్లికి చెందిన వితంతువులు అధికారులను నిలదీశారు. తమకు భర్తలు ఉన్నారంటూ వితంతు పింఛన్లు తొలగించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా మా భర్తలు బతికి ఉంటే చూపించండి అంటూ ధ్వజమెత్తారు.
శుక్రవారం చెర్లోపల్లి గ్రామంలో ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ పరిధిలో దాదాపు 60 మంది వితంతువుల పింఛన్లను జాబితా నుంచి తొలగించారు. బాధిత వితంతువులు తిప్పమ్మ, శ్రీకాంతమ్మ, లక్ష్మక్క, సిద్దమ్మ, అనసూయమ్మ తదితరులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ పింఛన్లు ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. భర్త బతికున్నందున వితంతు పింఛన్‌కు అనర్హులుగా భావిస్తూ తీసేశారని అధికారులు సమాధానమిచ్చారు. తహశీల్దార్ వాణిశ్రీ మాట్లాడుతూ పింఛన్ రద్దయిన వారు తిరిగి దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి న్యాయం చేస్తామన్నారు.
దీనికి శాంతించని బాధితులు మాకు మీరిచ్చే పింఛన్ వద్దు.. మా భర్తలు బతికే ఉంటే తెచ్చివ్వండి అంటూ బాధితులు నిలదీశారు. మీ నీచ నికృష్ట విధానాల వల్ల మాలాంటి వారిని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారంటూ శాపనార్థాలు పెట్టారు. గ్రామ రాజకీయాలకు అర్హులైన తమను బలి చేయడం తగదన్నారు. రెండు గ్రామాల పరిధిలో 240 పింఛన్లను ఎందుకు తొలగించారో తెలియజేయాలని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆనందప్ప, గంగప్ప, హుస్సేన్‌పీరా, నాయకులు మల్లేశప్ప, ప్రకాష్, శేఖర్, తిమ్మప్ప, గోవిందప్ప, హనుమంతరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు తిమ్మరాజు పట్టుబట్టారు.
అర్హుల జాబితాను కూడా చదివి వినిపించాలని డిమాండ్ చేశారు. వేరేదారి లేక చివరకు అధికారులు జాబితా చదివారు. అందులో అర్హులైన వితంతువులు, వృద్ధులు, వికలాంగులను కుట్రపూరితంగానే తొలగించారని భావించిన బాధితులు గొడవకు దిగారు. దీంతో స్పెషలాఫీసర్ రామసుబ్బయ్య జోక్యం చేసుకుని అర్హులందరికీ పింఛన్ మంజూరు చేస్తామని చెప్పడంతో వారు శాంతించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శివయ్య, ఏఓ వాసుకీరాణి, జెడ్పీటీసీ సభ్యురాలు కవిత, ఎంపీపీ మానస, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు సునీత, ఓబులమ్మ, విద్యుత్ ఏఈ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.