మనదేశంలో కొందరు రాజకీయ నేతలు జైలుకు వెళ్లిన సందర్భంలో వారి భార్యలు రాజకీయాల్లోకి ప్రవేశించడాన్ని చూస్తుంటాం. ఇటువంటి దృశ్యం రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ కనిపించనుంది. జైల్లో ఉన్న తమ భర్తల రాజకీయ వారసత్వాన్ని కాపాడుకునేందుకు వారి భార్యలు సిద్ధమయ్యారు.
ఈ జాబితాలో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారే జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, యూపీ మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్ భార్య శ్రీకళ. వీరి భర్తలు వేర్వేరు కేసుల్లో అరెస్టయ్యారు. వారు లోక్‌సభ ఎన్నికల్లోగా బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. దీంతో తమ భర్తల రాజకీయ పలుకుబడిని కాపాడేందుకు ఈ ముగ్గురూ రాజకీయాల్లోకి దిగారు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే జైలులో ఉన్న ఈ ముగ్గురు నేతలు ప్రతిపక్ష శిబిరానికి చెందినవారే. భూ కుంభకోణం ఆరోపణలపై జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. అతనిని జ్యుడీషియల్ కస్టడీ కింద రాంచీ జైలులో ఉంచారు. హేమంత్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన భార్య కల్పనా సోరెన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు.
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. కిడ్నాప్ కేసులో దోషిగా తేలిన ధనంజయ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఈసారి కూడా ధనంజయ్ జౌన్‌పూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే జైలులో ఉండటంతో ఆయన ఆశలు నెరవేరలేదు. ఈ నేపధ్యంలో ఆయన భార్య శ్రీకళారెడ్డి జౌన్‌పూర్ నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీని ఉలిక్కిపడేలా చేసింది. అయితే కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పార్టీ తరపున ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment