వితంతువుల ర్యాలీ
భర్త చనిపోయినంత మాత్రాన పూలు, బొట్టుకు దూరం కావాల్సిన పని లేదని చెప్పాం. అక్కడకు వచ్చిన వారిని పూలు, బొట్లు పెట్టుకోవాలని చెప్పాం. అక్కడున్న వారిలో 70 శాతం మంది పూలు, బొట్లు పెట్టుకున్నారు. మళ్లీ మమ్మల్ని మేము ఇలా చూసుకుంటామని అనుకోలేదంటూ సగం మంది ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజంగా అదొక మరపురాని సన్నివేశం.
సరళ, సుజాతలవి (మారు పేర్లు) ఇరుగు పొరుగు ఇళ్లు. ఇద్దరూ మంచి స్నేహితులు. ఉదయం పాలప్యాకెట్లతో మొదలయ్యే పలకరింపులు రాత్రి టీవీ సీరియల్స్‌పై మంచిచెడ్డలు చర్చించే వరకు కొనసాగేవి. కూరగాయలు కొనాలన్నా కలిసే వెళ్లేవారు. దురదృష్టవశాత్తు సరళ భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అంతే! సుజాతలో అనూహ్యమైన మార్పు. సరళతో మాట్లాడటం తగ్గించేసింది. విధవ ముఖం చూస్తే కీడు, ఎదురైతే అపశకునం అనే భావనతో స్నేహాన్ని చెరిపేసింది. ఉదయం సరళ కనిపిస్తే చాలు ముఖం మీదే తలుపేసేది. – లలితకు పదహారేళ్ల వయసులో పెళ్లైంది. పందొమ్మిదేళ్లకే భర్త మరణించాడు.ఒడిలో చంటి పిల్లాడు. ఓ పక్క నిర్జీవంగా ఉన్న భర్త, మరో పక్క పాలకోసం గుక్క పట్టి ఏడుస్తున్న చంటి పిల్లాడు. భర్త పోయిన మహిళ తన బిడ్డకు పాలిస్తే మంచిది కాదు. పిల్లాడికి పాలివ్వనీయకుండా అడ్డుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు. ఆకలితో పసి పిల్లాడు ఏడుస్తున్నా బిడ్డకు పాలు ఇవ్వనివ్వలేదు. ఓ వైపు భర్త మరణం, మరోవైపు ఆకలితో పిల్లాడి ఏడ్పు. వరుసగా పదకొండు రోజుల పాటు ఇదే నరకం. భర్త చనిపోయినంత మాత్రాన తల్లిపాలు బిడ్డకు ఎలా విషమవుతాయని గొంతు చించుకుని అరవాలని ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి.
చెప్పుకుంటే తమ ప్రమేయం లేకున్నా సమాజం నుంచి స్వంత కుటుంబ సభ్యుల నుంచి వింతంతు మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో. ఎలా వచ్చాయో, ఎప్పటి నుంచి అమలవుతున్నాయో కానీ నేటికి చేయని తప్పుకు మహిళలను శిక్షకు గురి చేస్తున్నాయి. ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా నిందలు, ఏ పని చేయకుండా అడ్డగింతలు ... ఈ పరంపరకు అడ్డుకట్ట వేస్తోంది బాల వికాస సంస్థ. వితంతువులపై కొనసాగుతున్న వివక్షకు అడ్డుకట్ట వేస్తోంది. కట్టుబొట్టులపై ఉన్న ఆంక్షలను పలుచన చేస్తున్నారు. సమాజంలో ముందుకు పోయేందుకు తోడ్పాటును అందిస్తున్నారు. వితంతువులపై ఉన్న ఆంక్షలు, కట్టుబాట్లను తొలగించడంపై చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై బాలవికాస వ్యవస్థాపకురాలు బాలథెరిస్సా చెప్పిన వివరాలు.
సూటీపోటీ మాటలు భరించలేక...
బాల వికాస ఆధ్వర్యంలో వేల సంఖ్యలో మహిళా సంఘాలు ఉన్నాయి. వీరితో సమావేశం జరుగుతున్నప్పుడు వితంతువుల ఇబ్బందుల విషయం చర్చకు వచ్చింది. ఒకరి తర్వాత ఒకరు చెప్పుకున్న కష్టాలను విని కళ్లు చెమర్చాయి. దీంతో వరంగల్, కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకంగా 2010లో సర్వే చేశాం. సుమారు ఐదువేల మంది వితంతువులతో మాట్లాడాం. ఇందులో 29 శాతం మంది సమాజం నుంచి ఎదురయ్యే సూటిపోటీ మాటలు భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేశారని తేలింది. ఆ తర్వాత విజయవాడ, కర్నూలు జిల్లాలలో సర్వే చేశాం. అక్కడ ఈ తరహా ఫలితాలే వచ్చాయి. అప్పటికే బాధలో ఉన్న వారిని మరింతగా బాధపెట్టేలా అమానవీయంగా, మానవ హక్కులకు విరుద్ధంగా ఉన్న కట్టుబాట్ల విషస్వరూపం కళ్లకు కట్టినట్లు కనపించింది. అందరితోపాటే మనం అన్నట్లుగా ఈ కట్టుబాట్లను సహిస్తూ వచ్చామనిపించింది. దీన్ని రూపుమాపేందుకు ఏదైనా చేయలని అప్పుడే నిర్ణయించుకున్నాం.
పూలు, బొట్లు
వితంతువుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ముందు వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయూత ఇవ్వాలనుకున్నాం. ఇది ఎక్కువ ఫలితం ఇవ్వదని అనిపించాక ... వారి ఆలోచన తీరులోనే మార్పు తేవాలని నిర్ణయించుకున్నాం. 2013లో తొలిసారిగా 250 మంది వితంతువుతో సమావేశం ఏర్పాటు చేశాం. భర్త చనిపోయినంత మాత్రాన పూలు, బొట్టుకు దూరం కావాల్సిన పని లేదని చెప్పాం. అక్కడకు వచ్చిన వారిని పూలు, బొట్లు పెట్టుకోవాలని చెప్పాం. అక్కడున్న వారిలో 70 శాతం మంది పూలు, బొట్లు పెట్టుకున్నారు. మళ్లీ మమ్మల్ని మేము ఇలా చూసుకుంటామని అనుకోలేదంటూ సగం మంది ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజంగా అదొక మరపురాని సన్నివేశం. ఇంత వేదన ఉందా అనిపించింది. అయితే బాల వికాస గేటు దాటగానే దాదాపు అందరూ బొట్టు పూలు తీసేసి .. ఎప్పటిలాగే ఇళ్లకు వెళ్లిపోయారు.
సాటి మహిళలతోనే
ఇక్కడ బొట్టు, పూలు పెట్టుకున్న వాళ్లు బయటకు వెళ్లగానే ఎందుకు తీసేశార ని అడిగాం. ఇలా చేస్తే తమకు ఇంకా వేధింపులు ఎక్కువ అవుతాయంటూ వారు బదులిచ్చారు. దీంతో ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని నిర్ణయించుకున్నాం. మహిళ సంఘాల గ్రూపు సమావేశాల్లో వితంతువుల సమస్యలు చర్చించాం. ఆ గ్రూపులో ఉన్న మహిళలలే ఈ సమస్యను అర్థం చేసుకునేలా వివరించాం. దీంతో వితంతువులు బొట్టు, పూలు పెట్టుకోవాలంటూ ఇతర గ్రూపు సభ్యులే ప్రోత్సహించారు. అలా మార్పు మొదలైంది. ఇప్పుడు బాల వికాస పరిధిలో 15000 మంది వితంతువులు ఉన్నారు. వీరిలో 70 శాతం మంది ఈ కట్టుబాట్లకు దూరంగా ఉన్నారు. ఇప్పటికీ కట్టుబాటు పాటించే వారిలో వయసు పైబడిన వారు ఎక్కువ మంది ఉన్నారు.
ఇంకా చేయాలి
వితంతువుల సమస్యలపై బాల వికాస చేసిన కృషి పరిమితమైంది. దీన్ని మరింత విస్తరించాలని నిర్ణయించాం. ఇతర ఎన్జీవోలు, ప్రభుత్వ రంగ సంస్థలు. మీడియా, సోషల్ మీడియాలతో కలిసి పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం. ముల్తైదువులు– వితంతువులు అనే భేదాలు ఉండకూడదు. మతం, కులం, ధనిక, పేద తేడా లేకుండా వితంతువుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం. వీటితోపాటు వారు ఆర్థికంగా నిలదొక్కుకునే కార్యక్రమాలు, నైపుణ్య శిక్షణ, దూరవిద్య వంటి కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగిస్తాం.
– తాండ్ర కృష్ణగోవింద్, సాక్షిప్రతినిధి, వరంగల్
వ్యవస్థాపకురాలు బాలథెరిస్సా
Comments
Please login to add a commentAdd a comment