
‘ఆసరా’ తొలగిస్తే ఊరుకోం: ఎడ్మ కిష్టారెడ్డి
అర్హులైన వితంతువులు, వృద్ధుల పింఛన్లు రద్దుచేస్తే ఊరుకునేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి హెచ్చరించారు.
కల్వకుర్తి: అర్హులైన వితంతువులు, వృద్ధుల పింఛన్లు రద్దుచేస్తే ఊరుకునేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి హెచ్చరించారు. వృద్ధుల వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచడం సరికాదన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని పేదలు ఆశించారని, వారి ఆశలు అడియాసలవుతాయని పేర్కొన్నారు.
పింఛన్ల కోసం వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచడం దారుణమన్నారు. కేసీఆర్ పాలన దొరలు, భూస్వాములు, పెత్తందారులను తలపిస్తుందని విమర్శించారు. ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తే అందుకు సహకరించేందుకు తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం ఉద్యమిస్తామని హెచ్చరించారు.
రేషన్‌కార్డులను సైతం తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో అప్పులపాలైన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి రేషన్‌కార్డులను తీసివేస్తే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం మానవతాహృదయంతో ఆలోచించి అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని కోరారు.