Ethanol
-
పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ 20 శాతానికి పెంపు
గౌహతి: పెట్రోల్(Petrol)లో జీవ ఇంధనం ఇథనాల్(Ethanol)ను 20 శాతానికి పైగా కలపడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలనుకుంటున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఇందులో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నీతి ఆయోగ్య సారథ్యంలో ఓ కమిటీ ఏర్పాటైందని వెల్లడించారు. పెట్రోల్‌లో 19.6 శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని ఇప్పటికే సాధించామన్నారు. 20 శాతం ఇథనాల్‌ను కలపాలన్న లక్ష్యాన్ని 2026 నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే అంతకుమునుపే అంటే వచ్చే నెలలోనే ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అడ్వాంటేజ్ అసోం 2.0 బిజినెస్ సమిట్‌లో బుధవారం మంత్రి పురి ప్రసంగించారు. మనకు 1,700 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను కలిపే సామర్థ్యముండగా ఇప్పటికే 1,500 కోట్ల లీటర్లను వాడుతున్నామని చెప్పారు. వివిధ రకాలైన ఇంధన దిగుమతుల కోసం దేశం ఏటా 15,000 కోట్ల డాలర్లను విచ్చిస్తోందని మంత్రి వివరించారు. అయితే, సంప్రదాయ ఇంధనాలకు బదులుగా గ్రీన్ హైడ్రోజన్‌పై దృష్టి సారించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ ధర 4.5 డాలర్లుగా ఉంది. దీనిని 2.5 డాలర్లకు తగ్గించ గలిగితే ఈ రంగంలో పెను విప్లవమే వస్తుందన్నారు.ఇదీ చదవండి: అగ్రి, గృహ రుణాల్లో ఎగవేతలు పెరగొచ్చుప్రస్తుతం మన దేశంలో రోజుకు 55 లక్షల బారెళ్ల ముడి చమురును వాడుతున్నామని మంత్రి తెలిపారు. సమీప భవిష్యత్తులో ఇది 65 లక్షల బ్యారెళ్ల నుంచి 70 లక్షల బ్యారెళ్లకు పెరగనుందని, అదేవిధంగా దేశీయ పెట్రోలియం, సహజ వాయువుల ఉత్పత్తి 2030కల్లా 50 లక్షల టన్నులకు చేరనుందని మంత్రి పురి అంచనా వేశారు. -
‘చౌకగా పెట్రోల్.. ప్రజలకు రాయితీల్లేవు’
మోదీ ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ(బ్లెండెడ్) పెట్రోల్‌ను తీసుకొచ్చిన నేపథ్యంలో పెట్రోల్ ధరను తగ్గించాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకెత్ గోఖలే రాజ్యసభలో డిమాండ్ చేశారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ లీటరుకు కనీసం రూ.9 చౌకగా లభిస్తున్నప్పటికీ వినియోగదారు నుంచి పూర్తి స్థాయిలో వసూలు చేస్తున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం ఈ విషయంలో ప్రజలను మోసం చేస్తోందని, ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును లాగేసుకుంటుందని విమర్శించారు. దాంతో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు కారణమవుతుందని దుయ్యబట్టారు.‘మోదీ ప్రభుత్వం పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలపాలని గతంలోనే ఆదేశించింది. ఇథనాల్ చౌకైనది మాత్రమే కాదు.. వాహన మైలేజీని కూడా గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇది బీఎస్-IV, పాత ఇంజిన్లను నాశనం చేస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ లీటరుకు కనీసం రూ.9 చౌకగా లభిస్తోంది. కానీ ప్రజలు ఈ రాయితీ పొందడం లేదు. వాస్తవ ధరకే పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం నిస్సందేహంగా ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును దొచుకుంటోంది. దాంతో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు కారణం అవతుంది. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను తప్పనిసరి చేస్తే మోదీ ప్రభుత్వం ధరలు తగ్గించాలి’ అని ఎంపీ తెలిపారు.𝐈𝐦𝐩𝐨𝐫𝐭𝐚𝐧𝐭:𝐘𝐨𝐮 𝐚𝐫𝐞 𝐛𝐞𝐢𝐧𝐠 𝐎𝐕𝐄𝐑𝐂𝐇𝐀𝐑𝐆𝐄𝐃 𝐛𝐲 𝐚𝐭 𝐥𝐞𝐚𝐬𝐭 ₹𝟗 𝐩𝐞𝐫 𝐥𝐢𝐭𝐞𝐫 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐩𝐞𝐭𝐫𝐨𝐥 𝐩𝐮𝐦𝐩. Modi Govt has mandated 20% blending of ethanol with petrol. Ethanol is not only cheaper but also significantly reduces your car… pic.twitter.com/iEBjgp9SX9— Saket Gokhale MP (@SaketGokhale) February 5, 2025ఇథనాల్ పెట్రోల్‌పై భిన్నాభిప్రాయాలుముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, గ్రీన్ ఎన్విరాన్మెంట్ను ప్రోత్సహించడంలో భాగంగా గతంలో ప్రభుత్వం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపాలని నిర్ణయించింది. ఇథనాల్ పెట్రోల్ కంటే తక్కువ శక్తి కంటెంట్ కలిగి ఉంటుందని అభిప్రాయాలున్నాయి. ఇది వాహనం మైలేజ్‌ను 3-4% తగ్గిస్తుందని వాహన నిపుణులు చెబుతున్నారు. పాత వాహనాలకు ముఖ్యంగా బీఎస్-4 ఇంజిన్లు ఉన్న వాహనాలకు అధిక ఇథనాల్ కంటెంట్ ప్లాస్టిక్, రబ్బరు, అల్యూమినియం భాగాలకు హాని కలిగిస్తుందని తెలియజేస్తున్నారు. ఇది ఇంజిన్ పనిచేయకపోవడం, మన్నిక తగ్గడానికి దారితీస్తుందంటున్నారు.ఇదీ చదవండి: అంతకంతకూ పెరుగుతున్న పసిడి ధర! తులం ఎంతంటే..పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం వల్ల ముడి చమురు దిగుమతులపై తక్కువ ఆధారపడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం తెలుపుతుంది. ఇది ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది. ఇథనాల్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిస్తుంది. చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. -
తొక్కలో ఇంధనం
తొక్కే కదా అని అలుసుగా చూడొద్దు! ఏమో రేపు అవే మన బైకులు.. కార్లు.. లారీలను నడిపే ఇం‘ధనం’గా మారొచ్చు! దేనిగురించి అనుకుంటున్నారా? అదేనండీ మనం కరకరలాడించే చిప్స్.. ఫ్రై.. కూరల్లో లొట్టలేసుకుంటూ లాగించే బంగాళాదుంపల సంగతిది. ఈ ఆలుగడ్డ తొక్కలు, వ్యర్థాల నుంచి బయో ఇంధనాన్ని ఉత్పత్తి(Biofuel Production) చేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కనిపెట్టారు మన శాస్త్రవేత్తలు. దీన్ని పరీక్షించేందుకు త్వరలో ప్రయోగాత్మక (పైలట్) ప్లాంటును కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది విజయవంతమైతే.. బంగాళా దుంపలతో బైక్ నడిపేయొచ్చన్నమాట!!సాక్షి, బిజినెస్ డెస్క్: బంగాళాదుంపల(potato) ఉత్పత్తిలో ప్రపంచంలోనే చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది భారత్. అయితే, సరైన నిల్వ సదుపాయాల్లేక పంట చేతికొచ్చాక పాడైపోయే ఆలుగడ్డలు మొత్తం ఉత్పత్తిలో 10–15 శాతం ఉంటాయని అంచనా. మరోపక్క పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ప్రాసెస్డ్ ఆహారోత్పత్తులను పెద్ద ఎత్తున తయారుచేసే స్నాక్స్ కంపెనీల నుంచి తొక్కలు ఇతరత్రా రూపంలో వేల టన్నుల వ్యర్థాలు వెలువడుతుంటాయి. వీటి నుంచి జీవ ఇంధనాన్ని (బయో ఫ్యూయల్–ఇథనాల్) ఉత్పత్తి చేసే టెక్నాలజీని సిమ్లాలోని సెంట్రల్ పొటాటో రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీపీఆర్ఐ) రూపొందించింది. ల్యాబ్ పరీక్షలు కూడా పూర్తి కావడంతో, ఈ టెక్నాలజీని టెస్ట్ చేయడం కోసం పైలట్ ప్లాంటును నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది.బంగాళాదుంప తొక్కలు, వ్యర్థాల నుంచి ఇథనాల్చెరకు, మొక్కజొన్నతో పాటు..దేశంలో ప్రస్తుతం చెరకు, మొక్కజొన్న నుంచి పెద్ద ఎత్తున ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వీటితోపాటు బంగాళాదుంపల వ్యర్థాలను కూడా ఇథనాల్ ఉత్పత్తికి ఫీడ్ స్టాక్‌గా ఉపయోగించేందుకు జాతీయ జీవ ఇంధన పాలసీలో ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ లభించింది. ‘ఆలుగడ్డల నుంచి గణనీయమైన వ్యర్థాలు ఉంటున్న నేపథ్యంలో ఇథనాల్ ఉత్పత్తికి వీటిని విలువైన ప్రత్యామ్నాయాలుగా పరిగణించవచ్చు’అని సీపీఆర్ఐ శాస్త్రవేత్త ధర్మేంద్ర కుమార్ పేర్కొన్నారు. దేశంలో ఏటా సగటున సుమారు 5.6 కోట్ల టన్నుల ఆలుగడ్డలు ఉత్పత్తి అవుతున్నాయి.ఇందులో 8–10 శాతం, అంటే 50 లక్షల టన్నులను పొటాటో చిప్స్, ఫ్రైస్, ఇంకా డీహైడ్రేటెడ్ ప్రాడక్టులుగా ప్రాసెస్ చేస్తున్నారు. ఆయా ప్లాంట్ల నుంచి భారీ మొత్తంలో తొక్కలు, ఇతరత్రా వ్యర్థాలు బయటికొస్తాయి. ఇక పంట చేతికొచ్చాక ఉత్పత్తి నష్టాలు 20–25 శాతం, అంటే సుమారు 1.1–1.4 కోట్ల టన్నుల మేరకు ఉంటాయని అంచనా. ప్రధానంగా సరైన నిల్వ సదుపాయాలు లేకపోవడం, సరిగ్గా రవాణా చేయకపోవడం వంటివి దీనికి కారణం. ‘అత్యధికంగా బంగాళాదుంపలను ఉత్పత్తి చేస్తున్న ఉత్తరప్రదేశ్ లేదా పశ్చిమ బెంగాల్, అలాగే భారీగా ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్న గుజరాత్ వంటి చోట్ల పొటాటో ద్వారా ఇథనాల్ తయారు చేసే పైలట్ ప్లాంటును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం’అని కుమార్ తెలిపారు.20% ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్.. క్రూడ్ ఆయిల్ దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడం, కాలుష్యాన్ని నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపే బయో ఫ్యూయల్ పాలసీని పక్కాగా అమలు చేస్తోంది. 2013–14 ఇథనాల్ సరఫరా సంవత్సరం (ఈఎస్‌వై)లో 38 కోట్ల లీటర్ల ఇథనాల్ (ఫ్యూయల్ గ్రేడ్) దేశంలో ఉత్పత్తి కాగా, 2020–21 నాటికి ఇది 302.3 కోట్ల లీటర్లకు చేరింది. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 1.53 శాతం నుంచి 8.17 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో దేశంలో పెట్రోల్ వినియోగం 64 శాతం ఎగబాకడం గమనార్హం. 2030 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తొలుత లక్ష్యంగా నిర్దేశించింది.అయితే, 2022 జూన్ నాటికే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) 10 శాతం బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవడంతో 2025–26 నాటికి 20 శాతం లక్ష్యాన్ని కుదించారు. 2023–24లో ఈ బ్లెండింగ్ 13 శాతంగా నమోదైంది. డీజిల్‌లో సైతం 5% ఇథనాల్‌ను కలిపే పాలసీని తీసుకొచ్చే ప్రణాళికల్లో ప్రభుత్వం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇథనాల్ ఉత్పత్తికి మరిన్ని రకాల ఫీడ్ స్టాక్లనువినియోగించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.2025 కల్లా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లు తప్పనిసరి..పెట్రోలు, డీజిల్‌తో నడిచే సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) వాహనాల స్థానంలో రాబోయే రోజుల్లో ఫ్లెక్సి ఫ్యూయల్ వెహికల్స్ (ఎఫ్‌సీవీ)లు పరుగులు తీయనున్నాయి. బయో ఫ్యూయల్ పాలసీకి అనుగుణంగా 2025 చివరినాటికి దేశంలో ఉత్పత్తి అయ్యే ఐసీఈ వాహన ఇంజిన్లను పెట్రోల్‌తోపాటు ఫ్లెక్స్ ఫ్యూయల్ (85 శాతం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్–ఈ 85)కు అనుగుణంగా మార్చడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఆటోమొబైల్ కంపెనీలు ఆ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. -
Telangana: పల్లెల్లో ఇథనాల్ చిచ్చు!
సాక్షి, హైదరాబాద్: పెట్రోలియం దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్’ తెలంగాణ పల్లెల్లో చిచ్చు పెడుతోంది. పెట్రోల్‌లో కలిపేందుకు అవసరమైన ఇథనాల్ తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. చెరుకు నుంచి చక్కెర తీయగా మిగిలే మొలాసిస్, ధాన్యం నుంచి అవి ఇథనాల్‌ను తయారు చేస్తాయి. అయితే రాష్ట్రంలో ఈ యూనిట్ల ఏర్పాటుకు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏడాది క్రితం నారాయణపేట జిల్లా చిత్తనూరులో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంపై స్థానికులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో.. పనులు నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాలుష్య రహితంగా (జీరో లిక్విడ్ డిశ్చార్జి) ఏర్పాటు కావాల్సిన ఇథనాల్ ఫ్యాక్టరీలు నిబంధనలు పాటించట్లేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇథనాల్ ఫ్యాక్టరీలు వాయు, జల కాలుష్యానికి కారణమై తమ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందంటూ చిత్తనూరు, దిలావర్పూర్ ప్రాంత వాసులు ఆందోళనలు చేపట్టారు. రాష్ట్రంలో 28 సంస్థలకు గ్రీన్ సిగ్నల్ విదేశాల నుంచి శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించడం, విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం 2018లో నేషనల్ బయో ఫ్యూయల్ పాలసీని ప్రవేశపెట్టింది. 2025–26 నాటికి మొలాసిస్ లేదా ధాన్యం నుంచి ఏటా 1,080 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో తెలంగాణకు 43 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించింది. ఇథనాల్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు ‘ఇథనాల్ ఇంటరెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్’ కింద వడ్డీ రేటులో 4 శాతం నుంచి 50శాతం వరకు రాయితీ ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణలో ఇథనాల్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు 31 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో 2018 నుంచి 2022 మధ్యకాలంలో 28 సంస్థలకు అనుమతి ఇచ్చింది. మొత్తంగా రోజుకు 5,256 కిలోలీటర్ల (కేఎల్‌పీడీ) ఇథనాల్ తయారీ ప్రతిపాదనలను ఆమోదించింది. వీటిలో నారాయణపేట జిల్లా చిత్తనూరులో వీటిలో ప్రస్తుతం 400 కేఎల్‌పీడీ సామర్థ్యమున్న జూరాల ఆర్గానిక్ ఫార్మ్ ఒక్కటే నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించింది. జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో మరో ఇథనాల్ కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి, నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోనూ యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలిసింది. అయితే కేంద్రం నుంచి ఆమోదం పొందిన సంస్థల్లో ఎన్ని నిర్మాణ పనులు ప్రారంభించాయనే సమాచారం తమ వద్ద లేదని అధికారులు చెప్తున్నారు. అనుమతులపై అధికారుల మౌనం నేషనల్ బయో ఫ్యూయల్ పాలసీ కింద ఇథనాల్ తయారీ యూనిట్లకు ఇచ్చిన అనుమతులతో తమకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గతంలో ఉమ్మడి జాబితాలో ఉన్న ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ (ఐడీఆర్ యాక్ట్) కేంద్ర ప్రభుత్వ జాబితాలోకి వెళ్లిపోయిందని... దీంతో అందులో అంతర్భాగమైన ఇథనాల్ తయారీపై తమకు సమాచారం లేదని అంటున్నాయి. నిజానికి ఐడీఆర్ యాక్ట్ కేంద్ర జాబితాలోకి వెళ్లడాన్ని దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు ఆమోదించగా.. తెలంగాణ, ఏపీ మాత్రం దూరంగా ఉన్నాయి. మరోవైపు ఇథనాల్ తయారీని ఉమ్మడి కోటాలో చేర్చి పర్యవేక్షక బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని సుప్రీంకోర్టు పది రోజుల క్రితమే ఆదేశించింది. కానీ రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఇథనాల్ యూనిట్లకు నిర్మాణ అనుమతులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని... లైసెన్సు, రవాణా, మార్కెటింగ్, భూ కేటాయింపులు వంటి అంశాలతో రాష్ట్రానికి సంబంధం లేదని పరిశ్రమల శాఖ అధికారులు చెప్తున్నారు. ఇందులో టీజీఐపాస్ కింద ఎన్ని సంస్థలు దరఖాస్తులు చేసుకున్నాయి, వాటి స్థితిగతులు ఏమిటనే సమాచారం తమ వద్ద లేదనే పేర్కొంటున్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా 1,213 సంస్థలకు 1,37,342 కేఎల్‌పీడీ సామర్థ్యం కలిగిన ఇథనాల్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అందులో ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలోనే ఉన్నాయి. అవగాహన లేకనే వ్యతిరేకత అంటున్న పరిశ్రమలు ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుపై స్థానికులకు అవగాహన లేనందునే వ్యతిరేకత వస్తున్నట్టు పారిశ్రామికవర్గాలు చెప్తున్నాయి. ఇథనాల్ తయారీ యూనిట్లను వ్యతిరేకిస్తున్న ప్రజా సంఘాలు, స్థానికులు ఇటీవల హైదరాబాద్‌లో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కలసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇథనాల్ యూనిట్ల ఏర్పాటుపై ఎదురవుతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని అనుమతులను తిరిగి పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అనుమతులిచ్చింది నాటి సర్కారేగత సర్కారు దిలావర్పూర్లో ఇథనాల్ కంపెనీకి నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు ఇచ్చిందని కాంగ్రెస్ సర్కారు అంటోంది. కేంద్రం కోరిన ఇథనాల్ ఫ్యూయల్ తయారీకి బదులుగా.. ఇథనాల్, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కాహాల్, ఇండ్రస్టియల్ స్పిరిట్స్, అబ్సల్యూట్ ఆల్కాహాల్ వంటి ఇతర ఉత్పత్తులకు రాష్ట్ర మంత్రివర్గం 2022లో అనుమతి ఇచ్చిందని చెబుతోంది. ఈ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామ పంచాయతీ నుంచి ఎన్ఓసీ, పర్యావరణ అనుమతులు, ఇతర ఉత్పత్తులకు లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ అంశాల్లో పీఎంకే డిస్టిలేషన్స్ నిబంధనలను ఉల్లంఘించిందని అధికారులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నీటి కేటాయింపులు మాత్రమే జరిగాయని చెబుతున్నారు. -
నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపేయాలని కలెక్టర్ ఆదేశం
-
నిర్మల్: నిరసనల ఎఫెక్ట్.. ఇథనాల్ పరిశ్రమ పనులకు బ్రేక్
నిర్మల్: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాకర్టీ ఏర్పాటుపై స్థానికులు చేపట్టిన ఆందోళనలతో అధికార యంత్రాంగం దిగొచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా తాజాగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో.. ఐదుగురు రైతులను జిల్లా కలెక్టర్ చర్చలకు పిలిచారు. దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన అనుమతులు పునఃసమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు పరిశీలిస్తోంది. అవసరమైతే ఇథనాల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది అని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.దాదాపు రెండు రోజులుగా ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకంగా దిలావర్పూర్ గ్రామస్థులు నిరసనల్లో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం నుంచి ఆ నిరసనలు ఉధృతం చేశారు. నిన్న రాత్రి రోడ్డుపైనే వంటలు చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వారంతా రోడ్డుపైనే భోజనం చేశారు.ఇవాళ మహిళలు పురుగుల మందు డబ్బాలతో నిరనసల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కొందరిని ముందస్తుగా అరెస్ట్ చేయడంతో పోలీసులపై ఆందోళనకారులు దాడి చేశారు. పోలీసుల వాహనాలపైకి రాళ్లు విసిరారు. దీంతో, పోలీసులు పరుగులు తీశారు. అనంతరం, అక్కడ ఉద్రిక్తతకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వచ్చే వరకు తమ నిరసనలను కొనసాగిస్తామని గ్రామస్థులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ప్రభుత్వం సీరియస్మరోవైపు.. ఇథనాల్ పరిశ్రమ అనుమతులను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులు పునఃసమీక్షించాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఇథనాల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. -
TG: దిలావర్పూర్లో మరోసారి ఉద్రిక్తత
సాక్షి,నిర్మల్‌జిల్లా: జిల్లాలోని దిలావర్పూర్లో బుధవారం(నవంబర్27) ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తుల పోరాటం కొనసాగుతోంది. ఇక్కడ మంగళవారం జరిగిన ధర్నా సందర్భంగా పోలీసులు పలువురిని అరెస్టు చేయడంపై గ్రామస్తులు బుధవారం ఉదయం స్థానిక పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించి నిరసనకు దిగారు.ఈ క్రమంలో శాంతిభద్రతలను కాపాడేందుకుగాను పోలీసులు గ్రామ ప్రజలను నిర్మల్- కళ్యాణ్ నేషనల్ హైవేపైకి రానివ్వలేదు. దీంతో పోలీసులను తరుముకుంటూ వారిపై రాళ్లదాడి చేస్తూ గ్రామస్తులు నేషనల్హైవేపైకి చేరుకున్నారు. పోలీసుల వాహనాలపైనా గ్రామస్తులు రాళ్లదాడి చేశారు. పరిస్థితి విషమించడంతో ఘటనాస్థలం నుంచి పోలీసులు తమ వాహనాలను తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ చదవండి: నిర్మల్ పల్లెల్లో ఇథనాల్ మంట -
నిర్మల్ పల్లెల్లో ‘ఇథనాల్’ మంట
నిర్మల్/దిలావర్పూర్: తమ పచ్చని పంటపొలాల్లో ఇథనాల్ చిచ్చు పెట్టొద్దంటూ నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు కొన్ని నెలలుగా చేపడుతున్న నిరసన మంగళవారం తీవ్రరూపు దాల్చింది. దిలావర్పూర్ మండలంలోని దిలావర్పూర్–గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలన్న తమ డిమాండ్‌ను అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆయా గ్రామాల ప్రజల సహనం నశించింది. బంద్ పాటించడంతోపాటు దిలావర్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద 61వ నంబర్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా వందలాది మంది నిరసనకారులు రాస్తారోకోకు దిగారు. నిర్మల్–భైంసా మార్గంలో దాదాపు 12 గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో హైవేపై కొన్ని గంటలపాటు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.ఆర్డీవో నచ్చజెప్పినా..: నిరసనకారులు రోడ్డుపైనే మధ్యాహ్నం, రాత్రి వంటావార్పు చేసుకోవడంతోపాటు సాయంత్రం నుంచి అక్కడే చలిమంటలు వేసుకున్నారు. వారికి నచ్చజెప్పేందుకు మధ్యాహ్నం 3 గంటల వేళ నిర్మల్ ఆర్డీవో రత్నకల్యాణి రాగా ఆమెను నిరసనకారులు అడ్డుకున్నారు. 20 మంది గ్రామస్తులను కలెక్టరేట్‌కు తీసుకెళ్లి కలెక్టర్‌తో మాట్లాడిస్తానని చెప్పినా వారు ససేమిరా అన్నారు. గతంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. అందుకే కలెక్టరే తమ వద్దకు రావాలంటూ ఆమెను ఘెరావ్ చేశారు. దీంతో ఆమె రాత్రి 9:30 గంటల వరకు వాహనంలోనే కూర్చుండి పోయారు. చివరకు జిల్లా ఎస్పీ జానకీ షర్మిల స్వయంగా రోప్‌పార్టీ పోలీసులతో వచ్చి అడ్డుగా కూర్చున్న మహిళలను బలవంతంగా పక్కకు తప్పించి ఆర్డీఓను వాహనంలో నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో కోపోద్రిక్తులైన నిరసనకారులు ఆర్డీవో వాహనాన్ని బోల్తా పడేసి దానిపై చలిమంటల్లోని కర్రలను విసిరేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో లక్ష్మణచాంద మండల ఎస్సై సుమలత గాయపడ్డారు. మరోవైపు కొన్ని గంటలపాటు వాహనంలో కూర్చుండిపోయిన ఆర్డీఓ సైతం అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది.చేతిలో ప్లకార్డులు, పురుగుమందు డబ్బాలుమాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ‘కనబడుట లేదు..’ అంటూ వారి ఫొటోలతో కూడిన ప్లకార్డులను నిరసనకారులు ప్రదర్శించారు. అలాగే కొందరు మహిళలు పురుగుల మందు డబ్బాలు తీసుకొచ్చి ఇప్పటికైనా ఫ్యాక్టరీని తీసేయకపోతే తమకు అవే దిక్కంటూ చూపించారు.300 మంది పోలీసుల మోహరింపు..నిరసనకారులు బంద్‌తోపాటు ఆందోళన చేయొచ్చన్న సమాచారంతో నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దకు మంగళవారం వేకువ జామునే నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డితోపాటు జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, దాదాపు 300 మంది పోలీసు బలగాలను పంపించారు. రోజంతా రాస్తారోకో చేస్తున్నంత సేపు శాంతియుతంగానే ఉండాలని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తమ సిబ్బందిని ఆదేశించారు. రాత్రిపూట ఆందోళనకారులను అడ్డుకునేందుకు నిజామాబాద్ జిల్లా నుంచీ బలగాలను రప్పించారు.సీఎంవోకు నివేదిక పంపాం: కలెక్టర్నిర్మల్ చైన్‌గేట్: ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనపై ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ఓ ప్రకటనలో తెలిపారు. వారి ఆవేదనను సీఎంవోకు నివేదించినట్లు వివరించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.ఆది నుంచి వద్దంటూనే..దిలావర్పూర్–గుండపల్లి గ్రామాల మధ్య శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌కు సమీపంలో దాదాపు 40ఎకరాల్లో పీఎంకే గ్రూప్ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ప్రహరీతోపాటు దాదాపు నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. రూ. వందల కోట్ల పెట్టుబడితో పెడుతున్న తమ ఫ్యాక్టరీ జీరో పొల్యూషన్‌తో కూడినదని నిర్వాహకులు చెబుతున్నారు. కానీ సమీపంలోని దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాలు తొలి నుంచీ ఈ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. గతేడాది సైతం ఈ గ్రామాలు చేపట్టిన పరిశ్రమ ముట్టడి ఉద్రిక్తంగా సాగింది. రైతులపై పోలీసులు లాఠీచార్జి చేసే వరకూ పరిస్థితి వెళ్లింది. నాటి నుంచి ఆయా గ్రామస్తులు దీక్షలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. తాజాగా దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాలతో పాటు సమీపంలోని సముందర్‌పల్లి, కాండ్లి, టెంబరేణి, లోలం గ్రామాలూ ఆందోళనలో భాగమయ్యాయి. -
TG: గంటల తరబడి హైవేపై రాస్తారోకో.. వాహనంలోనే ఆర్డీవో రత్న కళ్యాణి
సాక్షి, నిర్మల్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్నాటును నిలిపివేయాలని మహిళలు రాస్తారోకో చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ వద్ద భారీ సంఖ్యలో మహిళలు జాతీయ రహదారిపైకి వచ్చి రాస్తారోకో చేపట్టారు. దిలావర్పూర్లో నిర్మించే ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మహిళలు వందల సంఖ్యలో కుటుంబ సమేతంగా జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలిపారు. ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేతలు కనిపించడంలేదని ప్లకార్డులు ప్రదర్శించారు. పరిశ్రమ ఏర్పాటు విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు.. ఎనిమిది గంటల పాటు రాస్తారోకోలోనే ఉన్నారు. నిరసనలు తెలుపుతున్న సమయంలోనే ఆర్డీవో రత్న కళ్యాణి అటువైపు రావడంతో ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో రత్న కళ్యాణి వాహనాన్ని దాదాపు మూడు గంటల పాటు అక్కడే నిలిపివేశారు. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. అక్కడే రోడ్డుపైనే వారంతా వంట చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. -
2047 నాటికి ఇంధన డిమాండ్ రెట్టింపు
దేశ ఇంధన డిమాండ్ 2047 నాటికి రెట్టింపు అవుతుందని పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా దేశీయ డిమాండ్ 25 శాతం పెరుగుతుందన్నారు. సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్టీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) సంయుక్తంగా బెంగళూరులో నిర్వహించిన ఎనర్జీ టెక్నాలజీ మీట్ (ఈటీఎం)2024ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు.‘ఎనర్జీ సెక్యూరిటీ, సుస్థిరత, సాంకేతిక ఆవిష్కరణలకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలిచింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) గణాంకాల ప్రకారం 2047 నాటికి భారత ఇంధన డిమాండ్ రెట్టింపు అవుతుంది. రాబోయే రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా దేశీయ ఇంధన డిమాండ్ గణనీయంగా 25 శాతం పెరుగుతుంది. నికర-సున్నా ఉద్గారాల లక్ష్యాలను సాధించడంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) మెరుగైన విధానాలు పాటించాలి. ఇథనాల్, హైడ్రోజన్, జీవ ఇంధనాలలో పురోగతి ద్వారా వికసిత్ భారత్ సాధనలో భాగం కావాలి. ఫాజిల్ ప్యూయెల్లో కలిపే జీవ ఇంధనం మిశ్రమం రేటు ప్రస్తుతం 16.9%కి చేరుకుంది. 2030 నాటికి ఇది 20% లక్ష్యాన్ని చేరాలనే లక్ష్యం ఉంది. కానీ షెడ్యూల్ కంటే ఐదేళ్ల ముందే ఈ లక్ష్యాన్ని అధిగమించే దిశగా ముందుకు సాగుతున్నాం’ అని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: ఇంటర్లో 39% మార్కులు! కట్ చేస్తే కంపెనీకి సీఈఓ‘భారతదేశం 250 రూపాల్లోని ముడి చమురును ప్రాసెస్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశీయ ప్రస్తుత ముడి చమురు శుద్ధి సామర్థ్యం 258 మిలియన్ మెట్రిక్టన్స్ పర్ యానమ్(ఎంఎంటీపీఏ)గా ఉంది. రానున్న రోజుల్లో ఇది 310 ఎంఎంటీపీఏకి పెరుగుతుందని అంచనా’ అన్నారు. డిజిటల్ ఇన్నోవేషన్‌పై స్పందిస్తూ 2027 నాటికి దేశీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ 70 బిలియన్ డాలర్లు(రూ.5.81 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ అండ్ డైరెక్టర్ (మార్కెటింగ్) వి.సతీష్ కుమార్ పాల్గొన్నారు. -
భారత్‌కు బాసటగా బ్రెజిల్!.. సరికొత్త ప్లాన్ ఇదే..
భారతదేశం ఇతర దేశాల నుంచి పెట్రోల్, డీజిల్ దిగుమతులను తగ్గించాలని.. ప్రత్యామ్నాయ వనరులను దేశంలోనే అభివృద్ధి చేసుకోవాలని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' చెబుతూనే ఉన్నారు. ఇందులో భాగంగానే మనదేశంలో ఇథనాల్ ఉత్పత్తి పెంచడానికి సరైన టెక్నాలజీని సిద్ధం చేస్తున్నారు. దీనికి బ్రెజిల్ కూడా సహకరించనుంది.ఇటీవల బ్రెజిల్‌లోని కుయాబాలో జరిగిన జీ20 వ్యవసాయ మంత్రివర్గ సమావేశంలో ఇథనాల్ ఉత్పత్తికి సంబంధించిన సాంకేతికతను భారతదేశంలో పెంచడానికి బ్రెజిల్ కూడా సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ , రైతు సంక్షేమ శాఖ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్.. బ్రెజిల్ వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కార్లోస్ ఫవారో ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ సమావేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇథనాల్ ఉత్పత్తికి సంబంధించిన విషయాల మీద చర్చలు జరిగాయి. దీనికి సంబంధించిన ఒప్పందం నవంబర్‌లో జరిగే జీ20 నాయకుల సమావేశానికి ముందే ఖరారు అవుతుందని పెకొన్నారు.జూన్ 2024లో జరిగిన ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ (ISO) 63వ కౌన్సిల్ సమావేశంలో.. చెరకు సాగు, చక్కెర, ఇథనాల్ ఉత్పత్తుల మెరుగైన వినియోగంలో మరింత స్థిరమైన పద్ధతులను అవలంబించడానికి భారతదేశం సభ్య దేశాల నుంచి సహకారాన్ని కోరింది. ప్రస్తుతం ఇథనాల్ ఉత్పత్తిలో యూఎస్ఏ, బ్రెజిల్ మొదటి, రెండో స్థానాల్లో ఉండగా.. భారత్ మూడో స్థానంలో ఉంది.ఇదీ చదవండి: బిజినెస్ లోన్ కావాలా?.. ముందుగా ఇవి తెలుసుకోండివినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారతదేశంలో ఇథనాల్ మిశ్రమం శాతం 2019-20లో 5 శాతం నుంచి 2022-23లో 12 శాతానికి పెరిగింది. ఈ సమయంలో ఇథనాల్ ఉత్పత్తి 173 కోట్ల లీటర్ల నుంచి 500 కోట్ల లీటర్ల పెరిగింది. కాగా ఇప్పుడు బ్రెజిల్ సహకారంతో ఇది మరింత ఎక్కువవుతుంది భావిస్తున్నారు. -
మరింత చెరకుతోనే అనుకున్న లక్ష్యం
ముంబై: పెట్రోల్‌లో 20% మేర ఇథనాల్ మిశ్రం లక్ష్యాన్ని 2025 సరఫరా సంవత్సరంలోనే సాధించాలంటే అందుకు మరింత చెరకు వినియోగించాల్సి ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. దీనివల్ల మిల్లర్లకు నగదు ప్రవాహాలు మెరుగవుతాయని పేర్కొంది. నవంబర్ నుంచి అక్టోబర్ వరకు ఇథనాల్ సరఫరా సంవత్సరంగా (ఈఎస్‌వై) పరిగణిస్తుంటారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు.. ఈఎస్‌వై 2025 సీజన్ పరిధిలోకి వస్తుంది. ఈఎస్‌వై 2025 నాటికి పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ను కలపాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. ‘‘ఇందుకు ఏటా 990 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం. ఇందుకు చెరకుతోపాటు, గ్రెయిన్(ధాన్యాలు)ను సైతం వినియోగించుకోవడం ద్వారానే సరఫరా మెరుగుపడుతుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ తన తాజా నివేదికలో వివరించింది. ధాన్యం ద్వారా వార్షిక ఇథనాల్ ఉత్పత్తి గణనీయంగా పెరిగి వచ్చే సీజన్ నాటికి 600 కోట్ల లీటర్లకు చేరుకుంటుందని క్రిసిల్ తెలిపింది. ప్రస్తుత సీజన్లో ఇది 380 కోట్ల లీటర్లుగా ఉంటుందని అంచనా. మిగిలిన మేర చెర కు వినియోగం ద్వారా ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. మిల్లుల్లో గణనీయమైన త యారీ సామర్థ్యం కారణంగా అది సాధ్యమేనని అభిప్రాయపడింది. చక్కెర నిల్వలను ఇథనాల్ త యారీకి మళ్లించకుండా, ఎగుమతులు చేయకుండా కేంద్రం నిషేధం విధించడంతో నిల్వలు పెరగడా న్ని క్రిసిల్ నివేదిక ప్రస్తావించింది. ఈ నిల్వలను ఇథనాల్ తయారీకి అనుమతించాలని సూచించింది. పెట్రోల్ దిగుమతులు తగ్గించుకోవచ్చు.. 20 శాతం ఇథనాల్‌ను కలపడం ద్వారా పెట్రోల్ దిగమతులపై ఆధారపడడాన్ని భారత్ తగ్గించుకోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ఈఎస్‌వై 2021 నుంచి ఏటా పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 2–3 శాతం మేర పెరుగుతూ వస్తున్నట్టు వెల్లడించింది. ‘‘ఇథనాల్ తయారీకి ఆహార ధాన్యాల వినియోగంపై కేంద్రం ఎలాంటి నియంత్రణలు విధించలేదు. కాకపోతే డిమాండ్–సరఫరా అంచనాల ఆధారంగా ఎంత మేర చెరకును ఇథనాల్ కోసం వినియోగించుకోవాలన్నది సీజన్‌కు ముందు నిర్ణయిస్తుంది. గతేడాది వర్షాలు సరిగ్గా లేకపోవడంతో ఈ ఏడాది సీజన్లో చెరకు ఉత్పత్తిపై ప్రభావం పడింది’’అని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. దీంతో ఈ సీజన్లో చెరకు ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి 250 కోట్ల లీటర్లకు పరిమితం కావచ్చని అంచనా వేసింది. ధాన్యాల ద్వారా ఇథనాల్ తయారీ 40 శాతం పెరగడంతో ఈఎస్‌వై 2024 సీజన్లో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 14 శాతానికి చేరినట్టు వివరించింది. చెరకు నుంచి ఇథనాల్ తయారీ తగ్గడాన్ని ఇది భర్తీ చేసినట్టు తెలిపింది.భారీ స్థాయిలో చెరకు అవసరంఈఎస్వై 2025 సీజన్లోనే పెట్రోల్‌లో 20 % ఇథనాల్ లక్ష్యాన్ని సాధించాలంటే 4 మి లియ న్ టన్నుల చక్కెర తయారీకి సరిపడా చెరకును ఇథనాల్ కోసం కేటాయించాల్సి ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ తెలిపారు. ఈఎస్‌వై 2025 సీజన్లో స్థూల చక్కెర ఉత్పత్తి 33.5 మిలియన్ టన్నులుగా ఉంటుందని, చక్కెర వినియోగం 29.5 మిలియన్ టన్నుల స్థాయిలో ఉండొచ్చని క్రిసిల్ నివేదిక పేర్కొంది. ఈ సీజన్ చివరికి చక్కెర నిల్వలు మెరుగైన స్థాయి లో ఉంటాయంటూ.. ఇథనాల్ తయారీకి సరిపడా చెరకును అనుమతించాలని సూచించింది. దీంతో చక్కెర నిల్వలనూ తగిన స్థాయిలో వినియోగించుకోవడానికి వీలు కలుగుతుందని పేర్కొంది. -
2025-26 నాటికి ఇదే లక్ష్యం: అమిత్ షా
ఫ్యూయెల్ (పెట్రోల్, డీజిల్) వాడకాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలు ఉత్పత్తిని ప్రోత్సహించడం చేస్తోంది. కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' హైడ్రోజన్ వాహనాలను ఉత్పత్తి చేయాలని కంపెనీలకు చెబుతున్నారు. అంతే కాకుండా ఇథనాల్ వాడకాన్ని పెంచాలని సూచిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర హోం మంత్రి 'అమిత్ షా' కూడా ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలని కోరుతున్నారు.మోదీ ప్రభుత్వం 2025-26 నాటికి 20 శాతం ఇథనాల్‌ను కలపాలనే లక్ష్యాన్ని సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం అన్నారు. ఇథనాల్ ఉత్పత్తి పెరిగితే ముడిచమురు దిగుమతి తగ్గుతుందని అమిత్ షా చెప్పారు. దీనికోసం చక్కెర మిల్లులు ఇథనాల్‌ను ఉత్పత్తి చేయాలని కోరారు.పెట్రోల్ వినియోగం తగ్గితే.. పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో అమిత్ షా అన్నారు. దాదాపు 5000 కోట్ల లీటర్ల పెట్రోలుకు వెయ్యి కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం ఉంటుందని కూడా ఆయన చెప్పారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ యూనివర్సల్ 4జీ, 5జీ సిమ్: ఎక్కడైనా.. ఎప్పుడైనాఇథనాల్ను కలపడం వల్ల పర్యావరణం మెరుగుపడటమే కాకుండా.. చక్కెర మిల్లుల లాభాలు పెరగడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని అమిత్ షా అన్నారు. ఇథనాల్ ఉత్పత్తిపైన ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని, మంత్రుల బృందం ద్వారా ఇథనాల్ మిశ్రమాన్ని ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తారని షా అన్నారు. -
పెట్రోల్ అవసరం లేని వాహనాలు వచ్చేస్తున్నాయి: నితిన్ గడ్కరీ
భారతదేశంలో డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్, సీఎన్జీ కార్లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో 100 శాతం ఇథనాల్‌తో నడిచే కార్లు, ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయడానికి ఇండియన్ కంపెనీలు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం తెలిపారు.టయోటా కంపెనీ ఉత్పత్తి చేసిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజిన్ కలిగిన కారులోనే పార్లమెంటుకు వచ్చిన గడ్కరీ.. మీడియాతో మాట్లాడుతూ.. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్ ఇంజిన్, యూరో 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉండే మొదటి వాహనం అని ఆయన అన్నారు. ఇది జీరో ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుందని ఆయన అన్నారు.టయోటా కంపెనీ ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఫ్లెక్స్ కార్లను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. టాటా, మారుతి సుజుకి కంపెనీలు కూడా 100 శాతం ఇథనాల్ లేదా ఫ్లెక్స్ ఇంజన్ కార్లను ఉత్పత్తి చేసే దిశగా అడుగులు వేస్తోందని ఆయన అన్నారు.టూ వీలర్ విభాగంలో.. బజాజ్, టీవీఎస్, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలు.. ఫ్లెక్స్ ఇంజిన్ బైక్‌లు, స్కూటర్లను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. పెట్రోల్ పంపుల మాదిరిగానే ఇథనాల్ పంపులు కూడా రానున్నాయి. ఇథనాల్ పరిశ్రమ రైతులకు ఒక వరం అని, ఇథనాల్ డిమాండ్ పెరగడంతోపాటు భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం జరుగుతుందని గడ్కరీ అన్నారు.ఇదీ చదవండి: 'తాత చేసిన పనికి కోటీశ్వరురాలైన మనవరాలు'ఇది పెట్రోల్ దిగుమతులను భారీగా తగ్గిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి చేయడానికి ఇదొక చక్కని మార్గమని గడ్కరీ అన్నారు. 2023 ఆగష్టులో నితిన్ గడ్కరీ టయోటా కిర్లోస్కర్ మోటార్స్ అభివృద్ధి చేసిన 100 శాతం ఇథనాల్ బీఎస్ 6 కంప్లైంట్ ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు నమూనాను ఆవిష్కరించారు. అయితే ఇవి ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయనే విషయం మీద ఎటువంటి అధికారిక ప్రకటన అందుబాటులో లేదు.#WATCH | Delhi: Union Minister Nitin Gadkari says, "This is the world's first vehicle which has a flex engine and complies with emission norms of Euro 6. It gives net zero emissions. Runs on ethanol produced from sugarcane juice, molasses, and corn... Other manufacturers are also… pic.twitter.com/UO2zGJpK8i— ANI (@ANI) August 5, 2024 -
‘ఇథనాల్’పై గ్రామస్తుల ఆగ్రహజ్వాల
దిలావర్పూర్ (నిర్మల్): నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రం–గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన బుధవారం ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారిగా తరలివచ్చిన గ్రామస్తులు, రైతులు ఫ్యాక్టరీపై దాడిచేసి, వాహనాన్ని తగులబెట్టడంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. పోలీసులు లాఠీచార్జీ చేసినా రైతులు వెనక్కి తగ్గకపోవడంతో కొన్ని గంటలపాటు ఉద్రిక్తత కొనసాగింది. చివరకు జిల్లా ఉన్నతాధికా రులు సముదాయించడంతో గ్రామస్తులు వెనక్కితగ్గారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ సమీపంలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీపై మొదటి నుంచీ రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సమీప గ్రామస్తులు పలుమార్లు ఆందోళనలు చేయడంతోపాటు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా ఫ్యాక్టరీ పనులు ఊపందుకోవడంతో బుధవారం దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు ఒక్కసారిగా పరిశ్రమ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అక్కడ నిర్మిస్తున్న ప్రహరీని కూల్చేశారు. నిర్మాణా లను అడ్డుకున్నారు. వందలమంది మూకుమ్మ డిగా దాడికి పాల్పడటంతో నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఓ కారును ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. నిర్మల్ నుంచి ఫైరింజిన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. మరోపక్క రైతులు, గ్రామస్తులు దిలావర్పూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వారిని సివిల్‌డ్రెస్‌లో ఉన్న పోలీసులు వీడియో తీస్తుండగా వారు ఇథనాల్ కంపెనీ వారని అనుకున్న గ్రామస్తులు దాడి చేశారు. పోలీసుల ఫోన్లు లాక్కుని ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీచార్జీ చేశారు. ఇందులో పలువురు రైతులు, గ్రామస్తులకు గాయాలయ్యాయి. అడిషనల్ కలెక్టర్ కిశోర్‌కుమార్, భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, తహసీల్దార్ సరిత అక్కడికి వచ్చి సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తామని, అప్పటివరకు శాంతియుతంగా ఉండాలని గ్రామస్తులను కోరగా, రైతులు శాంతించారు. కాగా, రైతులు, ప్రజలు గురువారం దిలావర్పూర్ మండల బంద్‌కు పిలుపునిచ్చారు. -
ఇథనాల్ తయారీలో చెరకు రసం వినియోగంపై నిషేధం
న్యూఢిల్లీ: ఇథనాల్ ఉత్పత్తిలో చెరకు రసం, షుగర్ సిరప్‌ల వినియోగాన్ని నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోనే ప్రారంభమైన 2023–24 సరఫరా సంవత్సరానికి (డిసెంబర్–నవంబర్ మధ్య కాలం) ఇది వర్తిస్తుంది. దేశీయంగా వినియోగానికి తగినంత స్థాయిలో చక్కెర నిల్వలు ఉండేలా చూసేందుకు, అలాగే ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇథనాల్ ఉత్పత్తి కోసం ’బి–మొలాసిస్’ను వినియోగించడానికి అనుమతించింది. చక్కెర పరిశ్రమ దీన్ని స్వాగతించింది. అయితే ప్రత్యేకంగా చెరకు రసం, షుగర్ సిరప్‌ల ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి యూనిట్లు పని చేయకపోతే అవి ఖాయిలా పడే అవకాశం ఉందని పేర్కొంది. 2023–24 మార్కెటింగ్ సంవత్సరంలో (అక్టోబర్–సెప్టెంబర్) చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) అంచనాల ప్రకారం 2023–24 మార్కెటింగ్ సంవత్సరంలో స్థూలంగా చక్కెర ఉత్పత్తి 9 శాతం తగ్గి 337 లక్షల టన్నులకు పరిమితం కానుంది. 2022–23 మార్కెటింగ్ సంవత్సరంలో భారత్ 61 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. అంతక్రితం ఏడాది రికార్డు స్థాయిలో 112 లక్షల టన్నుల చక్కెర ఎగుమతైంది. ధరలను అదుపులో ఉంచే ఉద్దేశంతో ఈ మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఎగుమతులకు కేంద్రం అనుమతించలేదు. -
పోలీసులపై స్థానిక ప్రజల ఎదురుదాడి.. 'సీఐ' ను వ్యవసాయ పొలాల్లో వెంబడించి.. మరీ
సాక్షి, మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని చిత్తనూర్‌లో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీ వ్యర్థాలను ఎక్లాస్పూర్, జిన్నారం, చిత్తనూర్, చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామాల శివారుల్లో పారబోస్తుండడంతో అనారోగ్యం బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఓ ట్యాంకర్ వ్యర్థాలను నింపుకొని బయటికి రావడాన్ని గమనించిన గ్రామస్తులు.. ఎక్లాస్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద అడ్డుకున్నారు. ఇథనాల్ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. 16 గంటలపాటు ఆత్మకూర్ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. పోలీసులు నచ్చజెప్పేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం తహసీల్దార్ సునీత అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఈ నెల 25న ఆర్డీఓ సమక్షంలో కంపెనీని పరిశీలిస్తామని చెప్పినా వినలేదు. ట్యాంకర్లో ఉన్న కెమికల్‌ను పరీక్షించే వరకు ఆందోళన విరమించేది లేదని గ్రామస్తులు భీష్మించారు. నారాయణపేట డీఎస్పీ సత్యనారాయణ ఆదేశాల మేరకు మరికల్, మక్తల్, నర్వ, ధన్వాడ పోలీసులతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. గ్రామస్తులపై లాఠీచార్జ్ చేయడంతో పలువురికి గాయాలవగా.. పొలాల వెంబడి గ్రామస్తులు పరుగులు పెట్టారు. ఇదే సమయంలో ఇథనాల్ కంపెనీ ట్యాంకర్‌ను పోలీసుల బందోబస్తు మధ్య తరలించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోలీసులపై ఎదురుదాడికి పాల్పడ్డారు. రాళ్లు, ఇటుకలు, కర్రలతో దూసుకురావడంతో అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడేందుకు పోలీసులు పరుగులు పెట్టారు. మక్తల్ సీఐ రాంలాల్‌ను వ్యవసాయ పొలాల్లో వెంబడించి తీవ్రంగా గాయపర్చారు. గాయపడిన మరికొందరు పోలీసులు పక్కనే ఉన్న నరసింహస్వామి ఆలయ గదిలోకి వెళ్లారు. అనంతరం అరెస్ట్ చేసిన ఆందోళనకారులను వదిలిపెట్టి, గదిలో ఉన్న పోలీసులను విడిపించుకున్నారు. గాయపడిన పోలీసులు.. చిత్తనూర్ ఇథనాల్ కంపెనీ ఆందోళనలో పోలీసులు, గ్రామస్తులకు మధ్య జరిగిన ఘర్షణలో మక్తల్ సీఐ రాంలాల్తోపాటు కృష్ణ ఎస్ఐ విజయభాస్కర్, కానిస్టేబుళ్లు అనిత, అరుణ, వెంకటేశ్వరమ్మ, చెన్నరాయుడు, నవ్వు శ్రీనులకు గాయాలయ్యాయి. అలాగే పోలీస్ టీఆర్ గ్యాస్ వాహనంతోపాటు రెండు బైక్‌లకు గ్రామస్తులు నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయాయి. డీఎస్పీ వాహనంతోపాటు మరో మూడు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. కంపెనీకి వెళ్లే 8 లారీల అద్దాలను ధ్వంసం చేయడంతోపాటు టైర్లలో గాలి తీశారు. ఈ ఘటనకు కారణమైన వారి ఆచూకీ కోసం చిత్తనూర్, ఎక్లాస్పూర్, జిన్నారం గ్రామాలను జల్లెడ పడుతున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. కాలు విరగొట్టారు.. పోలీసులు కర్రలతో కొట్టడంతో కాలు విరిగిపొయింది. కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాల నుంచి తమకు ప్రాణహాని ఉందని రెండేళ్ల నుంచి ఆందోళన చేస్తున్నాం. పిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా పోలీసులు కొట్టడం వల్ల చాలామంది గాయపడ్డారు. ఇంకా కంపెనీని రద్దు చేసే వరకు నిద్రపోం. – చంద్రమ్మ, జిన్నారం ప్రాణం పోయినా.. పట్టువదలం! ఇక్కడి నుంచి కంపెనీ ఎత్తివేసే వరకు తమ పోరాటం ఆగదు. ఇథనాల్ కంపెనీ నుంచి ప్రమాదం కలిగించే కెమికల్స్‌ను గ్రామ శివారులో వేయడం వల్ల దుర్వాసన వస్తోంది. వ్యర్థాలను తరలించే ట్యాంకర్‌ను అడ్డుకొని శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు దాడిచేసి గాయపర్చారు. అక్కడి నుంచి పరుగు తీసినా వదిలిపెట్టలేదు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు.. కంపెనీని తొలగించే వరకు ఆందోళన చేస్తాం. – హన్మమ్మ, మానస, ఎక్లాస్పూర్ డీఎస్పీదే బాధ్యత.. ఇథనాల్ కంపెనీ నుంచి బయటకు తెచ్చి పారబోస్తున్న విష రసాయనాల ట్యాంకర్‌ను అడ్డుకొని ఆందోళన చేస్తున్న గ్రామస్తులపై పోలీసు లను రెచ్చగొట్టి లాఠీచార్జీ చేయించిన డీఎస్పీపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యు డు చక్రవర్తి అన్నారు. కంపెనీ నుంచి ట్యాంకర్ల ద్వారా వ్యర్థాలను తీసుకువచ్చి జిన్నారం, ఎక్లాస్పూర్, చిత్తనూర్, ఉంద్యాల గ్రామాల పక్కన పారపోయడంపై తహసీల్దార్‌తో మాట్లాడుతుండగా డీఎస్పీ పోలీసులను రెచ్చగొట్టి లాఠీచార్జీ చేయించారని, ఇందుకు ఆయనే బాధ్యత వహించాలని చెప్పారు. -
సమస్యలపై నిలదీస్తే అరెస్ట్ చేస్తారా?.. డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు
ఆదిలాబాద్: ప్రజాసమస్యలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను నిలదీయడానికి వస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తారా? అని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో దిలావర్పూర్ మండలం గుండంపల్లి హెలీప్యాడ్ వద్దకు వెళ్లిన శ్రీహరిరావును బుధవారం అరెస్ట్ చేసి సారంగపూర్ పోలీస్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలో పోలీసుల తీరును నిరసిస్తూ సారంగపూర్ పోలీస్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆయన పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. గుండంపల్లిలోని కాళేశ్వరం ప్యాకేజీ నంబర్ 27 అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారో.. చెప్పాలని డిమాండ్ చేశారు. దిలావర్పూర్ మండలంలో పచ్చని పంటపొలాల మధ్య విషవాయువు వెలువరించి ప్రజల ప్రాణాలు, పచ్చటి పంటపొలాలకు హాని కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించడం వెనుక మరమ్మమేమిటో తెలుపాలని పేర్కొన్నారు. వెంటనే దానిని రద్దు చేయాలని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని తెలిపారు. నిర్మల్ మున్సిపాలిటీలో అక్రమంగా 42 ఉద్యోగాలు అమ్ముకున్నారని తేలినప్పటికీ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో? ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత దారుణమైన పాలన సాగిస్తూ నియంతలా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రజలకు సమాధానం చెప్పలేని మంత్రులకు ప్రజలే తగిన బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరగబడతారని, ఓటు హక్కుతో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. సమర్థవంతమైన పాలన అందించే కాంగ్రెస్‌నే ప్రజలు కోరుకుంటున్నారని, తప్పకుండా రాష్ట్రంలో ఆ పార్టీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తంజేశారు. ఈయన వెంట కాంగ్రెస్ నాయకులు అరుగుల రమణ, విలాస్‌రావు, బొల్లోజి నర్సయ్య, రొడ్డ మారుతి, అబ్దుల్ హాదీ, న్యాయవాది మల్లారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వజీద్ అహ్మద్, పొడెల్లి గణేశ్ తదితరులున్నారు. -
మరింత లాభసాటిగా వ్యవసాయం
వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడానికి ఇంధన ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. రాష్ట్రంలో అత్యధిక శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తుండటంతో రైతులకు మరింత ఆదాయం సమకూర్చడానికి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఓవైపు వ్యవసాయ ఉత్పత్తుల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు ఇంధన తయారీపై దృష్టి పెట్టింది. ఇందుకోసం రాష్ట్రంలో బయో ఇథనాల్ తయారీకి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తోంది. బయో ఇథనాల్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రిలో అస్సాగో యూనిట్‌కు స్వయంగా శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా క్రిభ్కో, డాల్వకోట్ యూనిట్లకు వర్చువల్‌గా శంకుస్థాపనలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే అస్సాగో, క్రిభ్కో, అవేశా ఫుడ్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఈఐడీ ప్యారీ, డాల్వకోట్, ఎకో స్టీల్, చోడవరం షుగర్స్, రోచే గ్రీన్ ఆగ్రో, నితిన్‌సాయి, గ్రేస్ వెంచర్స్ వంటి 20కిపైగా సంస్థలు రాష్ట్రంలో రూ.3,000 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. మరికొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. ఈ యూనిట్ల అన్నింటి ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిపి చూస్తే రోజుకు 5,000 కిలో లీటర్లకు పైగా బయో ఇథనాల్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది దేశంలోనే అత్యధికమని చెబుతున్నాయి. –సాక్షి, అమరావతి పెట్టుబడుల ఆకర్షణ.. రాష్ట్రంలో రైతులు ధాన్యం, మొక్కజొన్నలను అత్యధికంగా సాగు చేస్తుండటమే కాకుండా భారీగా ఎగుమతులు చేస్తున్నారు. దీంతో ఇథనాల్ తయారీలో పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు ముందుకు వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 13 మిలియన్ టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి అయ్యింది. అలాగే మూడు మిలియన్ టన్నులకు పైగా మొక్కజొన్న ఉత్పత్తి అయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో రాష్ట్రం నుంచి 6 మిలియన్ టన్నుల బియ్యం (నాన్ బాస్మతి), ఒక మిలియన్ టన్ను మొక్కజొన్నను ఎగుమతి చేశారు. మిగులు ఆహార ఉత్పత్తుల నుంచి ఇథనాల్‌ను తయారు చేయడానికి కేంద్రం అనుమతించడంతో పెట్టుబడిదారుల చూపు మనరాష్ట్రంపై పడింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తోంది. విత్తనం నుంచి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అండగా నిలుస్తోంది. దీంతో వ్యవసాయం నుంచి ఇంధన తయారీకి హబ్‌గా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోంది. ఏడాదికి 3.1 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం.. ప్రస్తుతం దేశంలో ఆహార ధాన్యాల నుంచి 760 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతోంది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి 2025–26 నాటికి అదనంగా 1,016 కోట్ల లీటర్లు అవసరమవుతుందని అంచనా. ఇథనాల్ కలపడాన్ని ప్రస్తుతం ఉన్న 10 శాతం నుంచి 20 శాతానికి పెంచడం వల్ల ఏటా ఇంధన దిగుమతి వ్యయంలో రూ.51,600 కోట్ల మేర విదేశీమారక ద్రవ్యం ఆదా అవుతుందని నీతిఆయోగ్ అంచనా. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఏటా 16 కోట్ల లీటర్ల పెట్రోల్‌ను విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో 20 శాతం లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏడాదికి 3.1 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని అంచనా. క్లీన్ ఎనర్జీకి పెద్దపీట.. పర్యావరణహిత క్లీన్ ఎనర్జీ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, బయో ఇథనాల్ తయారీని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో రోజుకు 5,000 కిలోలీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో 20కుపైగా ఇథనాల్ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. – ప్రవీణ్ కుమార్, రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్, ఏపీఐఐసీ వీసీ–ఎండీ, ఏపీఈడీబీ సీఈవో -
‘అలా చేస్తే లీటర్ పెట్రోల్ రూ.15కే!’
ఢిల్లీ: పెట్రో ధరలు దేశవ్యాప్తంగా మంట పుట్టిస్తున్నాయి. అయితే.. దీనికి పరిష్కారం ఉందని, అలా చేస్తే గనుక పెట్రోల్ ధర పాతాళానికి దిగొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అదే సమయంలో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఓ ప్రధాన సమస్య కూడా లేకుండా పోతుందట!. పెట్రోలు ధరను లీటరుకు రూ. 15కే దొరికే దిశగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం వినూత్న ప్రతిపాదన చేశారు. రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో గడ్కరీ మాట్లాడుతూ.. తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇథనాల్,ఎలక్ట్రిసిటీ మిశ్రమాలను ఉపయోగించడం వల్ల పెట్రోల్ ధరలు వాటంతట అవే దిగి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. ఈ ప్రతిపాదన వెనుక ఉద్దేశం, తన ప్రధాన అభిమతం రైతులను ‘‘ఉర్జాదాత’’(శక్తి ప్రదాతలు)గా తీర్చిదిద్దడమేనని పేర్కొన్నారాయన. మన రైతులు అన్నదాతలే కాదు.. ఉర్జాదాతలు కూడా అనే ధోరణితో మా ఈ ప్రభుత్వం ఉంది. రైతులు ఉత్పత్తి చేసే ఇథనాల్‌తో వాహనాలన్నీ గనుక నడిస్తే ప్రయోజనం ఉంటుంది. సగటున 60% ఇథనాల్- 40% విద్యుత్ తీసుకుంటే.. అప్పుడు పెట్రోల్ లీటరుకు ₹ 15 చొప్పున అందుబాటులో ఉంటుంది. ప్రజలకు ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారాయన. తద్వారా ప్రపంచాన్ని పీడిస్తున్న కాలుష్యం తగ్గుతుందని, పెట్రో దిగుమతుల కోసం ఖర్చయ్యే 16 లక్షల కోట్ల రూపాయలు.. రైతుల ఖాతాల్లోకి మళ్లి వాళ్లకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారాయన. #WATCH | Pratapgarh, Rajasthan | Union Minister Nitin Gadkari says, "Our government is of the mindset that the farmers become not only 'annadata' but also 'urjadata'...All the vehicles will now run on ethanol produced by farmers. If an average of 60% ethanol and 40% electricity… pic.twitter.com/RGBP7do5Ka — ANI (@ANI) July 5, 2023 ఇదీ చదవండి: 'స్టార్లను తయారుచేసేది టీచర్లే కదా' -
గ్రామస్తుల పోరాటానికి బీజేపీ మద్దతు
వెల్గటూర్(ధర్మపురి): ఇథనాల్ పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా రెండు గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటానికి తమ పార్టీ పూర్తిస్థాయిలో మద్దతుగా తెలుపుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటలో జరిగే బహిరంగ సభకు వెళ్తూ మార్గమధ్యంలోని వెల్గటూర్ మండలం పాశిగామ స్టేజీ వద్ద ఆగారు. పాశిగామ, స్తంభంపల్లి గ్రామస్తులు ఆయనతోపాటు పార్టీ నాయకుడు వివేక్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఈసందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. కేంద్రప్రభుత్వం ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నా.. ఎక్కడా జనావాసాల మధ్య ఏర్పాటు చేయబోమన్నారు. మంత్రి అబద్ధపు ప్రచారాలతో గ్రామస్తులను మో సం చేస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. అవసరమైతే మరోసారి వచ్చి అందరినీ కలుస్తానని అన్నారు. బండి సంజయ్‌కి సన్మానం ధర్మపురి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఆ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో బుధవారం జరిగే బహిరంగ సభకు వెళ్తున్న ఆయనను రాయపట్నం జాతీయ రహదారి వద్ద బీజేపీ జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకుడు లవన్‌కుమార్ తదితరులు కలిసి స్వాగతం పలికారు. బండి సంజయ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. -
2025 నాటికే 20 శాతం ఇథనాల్
న్యూఢిల్లీ: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే లక్ష్యాన్ని 2025 నాటికే సాధిస్తామని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్‌పురి తెలిపారు. ముందుగా నిర్దేశించుకున్న 2030తో పోలిస్తే ఐదేళ్లు ముందుగానే చేరుకుంటామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ విక్రయాలను ఈ ఫిబ్రవరిలో ప్రయోగాత్మకంగా ఆరంభించడం గమనార్హం. కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, పెట్రోల్ దిగుమతుల భారాన్ని తగ్గించుకోవాలన్న రెండు లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం 10 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. వచ్చే ఏడాదికే 20 శాతం పెట్రోల్‌ను సరఫరా చేయగలమన్న నమ్మకంతో ఉన్నట్టు పురి చెప్పారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ మిశ్రమంతో రూ.41,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఒక ఏడాదిలో ఆదా అవుతుండగా, దేశీయ రైతులకు, పరిశ్రమలకు ఈ మేరకు ప్రయోజనం లభించనుంది. చెరకు, విరిగిన, తినడానికి అనుకూలం కాని బియ్యంతో ఇథనాల్‌ను ప్రస్తుతం మన దేశంలో తయారు చేస్తున్నారు. 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల ద్విచక్ర వాహనాల నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలను 50 శాతం, నాలుగు చక్రాల వాహనాల నుంచి 30 శాతం మేర తగ్గించొచ్చని అంచనా. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. 2021–22లో ముడి చమురు దిగుమతుల కోసం మన దేశం 120.7 బిలియన్ డాలర్లు వెచ్చించింది. -
ఇథనాల్ కలిపిన పెట్రోలుతో ఎవరికి ప్రయోజనం?
దేశీయ ఇంధన అవసరాలు తీర్చడానికీ, ఇంధన దిగుమతి భారం తగ్గించడానికీ, వాయు, కర్బన కాలుష్యాలను తగ్గించడానికీ ఇథనాల్ కలిపిన పెట్రోలు పరిష్కారమని భారత ప్రభుత్వం ఎన్నో వెసులు బాట్లు కల్పించి ప్రోత్సహిస్తున్నది. ఆహార ధాన్యాలైన బియ్యం, గోధుమలు, మొక్కజొన్నల నుండి ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి సత్వర పర్యావరణ అనుమతులూ, సబ్సిడీలూ, వడ్డీ రాయితీతో రుణాలూ మంజూరు చేసి 2025 నాటికి 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నది. ఇథనాల్‌ను పెట్రోలుకు కలపడం కొత్తేమీ కాదు. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుండీ వాడుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, ఇతర ఐరోపా దేశాలూ; కెనడా, చైనా కూడా మిశ్రమ ఇంధనాన్ని ప్రస్తుతం వాడుతున్నాయి. శాస్త్రీయ అధ్యయనాలు ఇథనాల్‌ను ఇంధనంగా వాడడం లోని నష్టాలను వెలుగులోకి తెచ్చాయి. 2023 మార్చి13న ఐపీసీసీ విడుదల చేసిన నివేదిక, తాపం పెరుగుదల 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించకుండా నిరోధించడానికి శిలాజ ఇంధనాలకు సత్వర ముగింపు పలకాలని స్పష్టం చేసింది. కొత్తగా నిర్మిస్తున్న ఇథనాల్ ప్లాంట్లు కనీసం 30 ఏళ్లు పని చేస్తాయి. మరి 2070 నాటికి నికర జీరో కర్బన ఉద్గారాలెలా సాధ్యమవుతాయి? అమెరికా ప్రభుత్వ శక్తి (ఎనర్జీ) విభాగం ‘ఇ20... పెట్రోల్ కంటే 7.7 శాతం తక్కువ ఇంధన శక్తి కలిగి ఉంటుందని’ నిర్ధారించింది. ఒక లీటరు పెట్రోల్... 1.073 లీటర్ల మిశ్రమ ఇంధనానికి సమానం. పరిశీలనల్లో పెట్రోలునూ, మిశ్రమ ఇంధనాన్నీ వాడినప్పుడు దాదాపు కర్బన ఉద్గారాలు అదేస్థాయిలో ఉంటాయని తేలింది. ప్రతి ఇథనాల్ ప్లాంట్కీ ఒక బొగ్గుతోకానీ, బయోమాస్‌తో కానీ నడిచే పవర్ ప్లాంట్‌కు అనుమతిస్తున్నారు. వాటి ఉద్గారాలు అదనం. ఇంకా ప్రతి లీటరు ఇథనాల్ ఉత్పత్తికి 0.76 కిలోల కార్బన్– డై–ఆక్సైడ్ విడుదలవుతుంది. దానిని పూర్తిగా పట్టి గాలిలో చేరకుండా ఆపే వ్యవస్థ లేదు. అంటే మొత్తం ఉత్పత్తయిన కార్బన్– డై–ఆక్సైడ్ చివరికి గాలిలోకి చేరుతుంది. భూతాపానికి దోహద పడుతుంది. అంటే లక్ష్యం తిరగబడుతుందన్న మాట. చమురు దిగుమతుల ఆర్థిక భారం తగ్గించడానికి ఇథనాల్ ఇంధనం పరిష్కారంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇ10 ఇంధనం అందుబాటులోకి వచ్చింది. అయినా పెరుగుతున్న డిమాండ్ వల్ల చమురు దిగుమతి భారం తగ్గ లేదన్నది స్పష్టం. విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెరిగింది కాని తగ్గ లేదు. ఇంకా తగిన ఇథనాల్ ఉత్పత్తి లేక ఇథనాల్ దిగుమతి కూడా పెరిగింది. దేశీయ చమురు ఉత్పత్తులు గణనీ యంగా క్షీణిస్తున్నందునా, చమురు వినియోగం పెరుతున్నందునా, ఇథనాల్ కలపడం చమురుపై ఆధారపడడం నుండి విముక్తం చేయదు. కర్బన ఉద్గారాలు పారిస్ ఒప్పందానికి అనుగుణంగా తగ్గవు. చెరకు, బియ్యం, మొక్క జొన్నల నుండి ఇథనాల్ ఉత్పత్తి నీటి వనరులపై భారం పెంచుతుంది. ఇథనాల్ ప్లాంట్ల ప్రతిపాదనలు లీటర్ ఇథనాల్‌కు 8 నుండి 10 లీటర్ల నీరు కావాలంటున్నాయి. చెరకు నుండి లీటరు ఇథనాల్ ఉత్పత్తికి దాదాపు మూడు వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. ఆహార పంటలను ఇంధన ఉత్పత్తికి తరలించడం వల్ల అదనపు భూమిని సాగులోకి తేవలసి వస్తుంది. దానివల్ల భూవిని యోగం మార్పు వస్తోంది. అందువల్ల ఉద్గారాలు పెరుగుతాయి. భూతాపం వల్ల పంటల దిగుబడి గణనీయంగా తగ్గడంతో ఆహార కొరత సమస్య ఉత్పన్నమవుతుంది. రైతులకు ఇథనాల్ ఉత్పత్తితో ఒరిగేదేమీ లేదు. ప్రభుత్వమే సబ్సిడీ ధరకు కంపెనీలకు బియ్యం సరఫరా చేస్తుంది. కిలో బియ్యం రూ. 20కు ఇస్తున్నది. అంటే కిలోకు రూ.17 సబ్సిడీ ఇస్తున్నది. ఒక లీటరు ఇథనాల్ ఉత్పత్తికి 2.22 కిలోల బియ్యం సబ్సిడీ ధరకు ఇస్తున్నారు. లీటరు ఇథనాల్ ఉత్పత్తికి బియ్యంపై రాయితీ రూ. 37.74. ఎఫ్‌సీఐ సరఫరా ధర రూ. 37 కు బియ్యం కొంటే లీటరు ఇథనాల్‌కు కావలసిన బియ్యం ధర రూ. 83.78. ప్రభుత్వం నిర్ణయించిన ఇథనాల్ ధర లీటరుకు 56.87. లీటరు పెట్రోలుకు ఇంధన శక్తిలో సమాన మైన 1.51 లీటర్ల ఇథనాల్ ఉత్పత్తికి వాడే బియ్యం ఖరీదు రూ.126.5. ఆ పైన ఉత్పత్తి ఖర్చులు ఎటూ ఉంటాయి. అంటే మిశ్రమ ఇంధనం పెట్రోలు కంటే ప్రియమన్న మాట. ప్రస్తుతం రోడ్డుపైనున్న వాహనాలేవీ ఇ20 ఇంధనాన్ని వాడ డానికి పనికిరావు. కొత్తగా వచ్చే వాహనాలను అందుకు అను వుగా రూపొందించినా ఇ20 అవసరం తక్కువే ఉంటుంది. అనువుగా మార్చని వాహనాలలో ఇ20 వాడితే ఇంజన్‌కు జరిగే నష్టం గణనీయం. ఇథనాల్ ఇంధనంతో జాతికీ, వాతావరణానికీ ప్రయోజనమేమిటో చర్చ జరగాలి. – డా‘‘ కలపాల బాబూరావు, విశ్రాంత శాస్త్రవేత్త -
ఈ20 ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ: ఈ20 పెట్రోల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తగు స్థాయిలో ఇంధనం అందుబాటులో ఉండేలా చూసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఇథనాల్ ఉత్పత్తిని మరింతగా పెంచడంపై దృష్టి పెడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 31 నగరాల్లో 100 బంకుల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) ఈ20 ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. అంతా సక్రమంగా సాగితే ఈ ఇంధన వినియోగం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆహార శాఖ అదనపు కార్యదర్శి సుబోధ్ కుమార్ తెలిపారు. దీంతో చక్కెర తరహాలోనే 2023–24 ఇథనాల్ సంవత్సరానికి గాను (డిసెంబర్–నవంబర్) ఇథనాల్ నిల్వలను పెంచుకునే యోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఇథనాల్ ఉత్పత్తి కోసం మరింతగా చక్కెరను మళ్లించే అవకాశం ఉందని వివరించారు. ఫిబ్రవరి ఆఖరు నాటి వరకూ 120 కోట్ల లీటర్ల పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపినట్లు కుమార్ చెప్పారు. ఇథనాల్ లభ్యత, ఉత్పత్తి సామర్థ్యాలు ఈ ఏడాది లక్ష్యాల సాధనకు సరిపడేంత స్థాయిలో ఉన్నట్లు వివరించారు. పరిశ్రమకు ప్రోత్సాహం.. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి వినియోగించడం ద్వారా క్రూడాయిల్ దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 20 శాతంగా ఉంటే దాన్ని ఈ20 ఇంధనంగా వ్యవహరిస్తారు. 2001ల నుంచి దీనికి సంబంధించి ప్రయోగాలు జరుగుతున్నాయి. గతేడాది 10.02 శాతం ఇథనాల్‌ను కలిపిన పెట్రోల్‌ను వినియోగంలోకి తెచ్చారు. 2022–23 ఇథనాల్ సంవత్సరంలో (డిసెంబర్–నవంబర్) దీన్ని 12 శాతానికి, వచ్చే ఏడాది 15 శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 2030 నాటికల్లా దీన్ని 20 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యం గడువును కుదించుకుని 2025 నాటికే సాధించాలని నిర్దేశించుకుంది. ప్రస్తుత ఏడాదికి గాను 50 లక్షల టన్నుల చక్కెరను ఇథనాల్ ఉత్పత్తి కోసం మళ్లించనున్నారు. వచ్చే ఏడాది నిర్దేశించుకున్న 15 శాతం మిశ్రమ లక్ష్య సాధన కోసం అదనంగా 150 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని అంచనా. దీనితో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలంటూ చక్కెర మిల్లులు, డిస్టిలరీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 243 ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించగా, బ్యాంకులు రూ. 20,334 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. వచ్చే 9–10 నెలల్లో అదనంగా 250–300 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రాగలదని అంచనా. -
నారాయణపేట జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
-
రెండు రోజుల్లో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్
న్యూఢిల్లీ: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యాన్ని నిర్ణీత గడువు కంటే ముందే కేంద్ర సర్కారు అమల్లో పెట్టనుంది. రెండు రోజుల్లోనే 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ20 పెట్రోల్) విక్రయాలను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఇండియా ఎనర్జీ వీక్ 2023లో భాగంగా ‘డ్యాన్స్ టు డీకార్బనైజ్’ అనే అంశంపై మంత్రి మాట్లాడారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యానికి 2022 నవంబర్ వరకు గడువు ఉన్నప్పటికీ జూన్ నాటికే సాధించినట్టు మంత్రి తెలిపారు. మరో ఒకటి రెండు రోజుల్లో 20 శాతం కలిసిన పెట్రోల్ అమ్మకాలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మొదలవుతాయన్నారు. 2023 ఏప్రిల్ 1 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 20 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యం విధించుకోవడం గమనార్హం. కానీ, దీన్ని తాము మరింత ముందుగానే సాధిస్తామని పురి చెప్పారు. దేశవ్యాప్తంగా దీన్ని దశలవారీగా 2025 ఏప్రిల్ నాటికి అమలు చేయనున్నట్టు మంత్రి చెప్పారు. దీనివల్ల ఇంధన భద్రత పెరగడంతోపాటు, రూ.41,500 కోట్ల మేర విదేశీ మారకం ఆదా అవుతుందన్నారు. అలాగే, గ్రీన్హౌస్ గ్యాస్‌ల విడుదల 27 లక్షల టన్నుల మేర తగ్గుతుందని.. రైతులకు రూ.40,600 కోట్ల మేర ప్రయోజనం చేకూరుందని వివరించారు. -
ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను మిశ్రమం చేయాలన్న లక్ష్య సాధనలో 2జీ (రెండో తరం) ఇథనాల్ కీలకం కానున్నట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ వెల్లడించారు. అందుకోసం 2జీ బయో ఇథనాల్ రిఫైనరీల ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుందని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రశ్నకు రాతపూర్వకంగా బదులిస్తూ చెప్పారు. ప్రభుత్వ ఆయిల్ రంగ సంస్థలు ఈ ఏడాది నవంబర్ 15 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి 16.19 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి గడిచిన 5 సంవత్సరాలలో 385.92 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. 2025 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని సాధించేందుకు రెండో తరం ఇథనాల్ ఉత్పత్తిని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారన్న ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ప్రధాన మంత్రి జేఐ-వన్ (జీవ్ ఇంధన్- వాతావరణ్ అనుకూల్ ఫసల్ అవశేష్ నివారణ్) యోజన పథకం కింద సెల్లులోసిక్, లింగో సెల్లులోసిక్ బయోమాస్ నుంచి అలాగే పెట్రో కెమికల్ మార్గం ద్వారా 2జీ ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు 2 జీ ఇథనాల్ బయో రిఫైనరీస్‌ను పెద్ద ఎత్తు ఏర్పాటు చేయాలని తలపెట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఈ రిఫైనరీలకు తగిన విధంగా ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రం నోటిఫికేషన్ కూడా విడుదల చేసినట్లు తెలిపారు. వరి దుబ్బు, ఇతర పంట వ్యర్థాల ఆధారిత 2జీ ఇథనాల్ బయో రిఫైనరీలు పంజాబ్, హర్యానా, ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. హర్యానాలోని పానిపట్‌లో నెలకొల్పిన బయో రిఫైనరీని జాతికి అంకితం చేసినట్లు తెలుపారు. బయోమాస్ సేకరణ కోసం ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు వివిధ రాష్ట్రాలు, రైతులు, ఇతర భాగస్వాములతో సమన్వయం చేసుకుంటోందని మంత్రి తెలిపారు ఏపీలో లక్షా 90 వేల వీధి వర్తకులకు స్వానిధి రుణాలు ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 1,90,433 మంది వీధి వర్తకులకు రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1,12,744 మందికి, 2021-22 లో 70,415 మందికి, 2022-23 లో 7,274 మందికి మొదటి దశ కింద ఒక్కొక్కరికి 10 వేల రూపాయల రుణం మంజూరు చేసినట్లు తెలిపారు. మొదటి తీసుకున్న రుణం సక్రమంగా చెల్లించిన వారికి రెండవ దఫా రుణం కింద 20 వేల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. మూడవ దశ కింద 251 మందికి 50 వేల రూపాయల రుణం అందించినట్లు మంత్రి తెలిపారు. అలాగే వడ్డీ సబ్సిడీ కింద 3 కోట్ల రూపాయలు, క్యాష్ బ్యాక్ కింద కోటి 65 లక్షల రూపాయలు లబ్దిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 4 నాటికి పీఎం స్వానిధి పథకం కింద రుణాల కోసం ఏపీ నుంచి 4 లక్షల దరఖాస్తులు అందగా అందులో 67,404 దరఖాస్తులు అర్హత లేనివిగా గుర్తించి తిరస్కరించినట్లు తెలిపారు. 16,118 దరఖాస్తులు మంజూరు దశలో ఉన్నాయని, 29,853 మంది బ్యాంకులకు అందుబాటులో లేని కారణంగా రుణాల పంపిణీ పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి వివరించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా కుదేలైన వీధి వర్తకులు తిరిగి వారి వ్యాపార కార్యకలాపాలను కొనగించుకునేందుకు వర్కింగ్ కాపిటల్ కింద 10 వేల రూపాయలు రుణం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వానిధి పథకాన్ని 2020 జూన్ 1న ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. తీసుకున్న రుణం సకాలంలో చెల్లించిన వారికి రెండవ దఫా రుణం కింద 20 వేలు, మూడవ దఫా కింద 50 వేల రూపాయలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. సకాలంలో రుణం చెల్లించిన వారికి తీసుకున్న రుణంపా 7 శాతం వడ్డీ రాయితీ, డిజిటల్ చెల్లింపులు చేసిన వారికి క్యాష్ బ్యాక్ కింద ఏడాదికి 1200 రూపాయలు చెల్లించినట్లు మంత్రి పేర్కొన్నారు. చదవండి: ఏపీలో భారీగా ఉద్యోగావకాశాలు.. వేల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ -
గుమ్మళ్లదొడ్డిలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
సాక్షి, రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇథనాల్) పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం అధికారిక పర్యటన షెడ్యూల్ విడుదలైంది. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 9.35కు తాడేపల్లి నుంచి హెలికాప్టర్ బయలుదేరి 10.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10.40 గంటలకు అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారు. 10.45 నుంచి 11.40 గంటల వరకు శంకుస్థాపన, బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సభా వేదిక నుంచి 11.45 బయలుదేరి రోడ్డు మార్గంలో 11.50 గుమ్మళ్లదొడ్డి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 1.10 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకుంటారు. చదవండి: (టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్) -
ఇథనాల్ ధర పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ ధరల్ని కేంద్రం పెంచింది. వచ్చే ఏడాది నుంచి పెట్రోల్‌లో 12 శాతం ఇథనాల్ కలిపేలా చర్యలు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) పలు నిర్ణయాలు తీసుకుంది. వివరాలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మీడియాకు తెలిపారు. ‘‘మూడు రకాల ఇథనాల్ ధరల్ని పెంచాం. చెరుకు రసం నుంచి తీసే ఇథనాల్ లీటర్‌కు రూ.63.45 నుంచి రూ.65.61కి సి–హెవీ మోలాసెస్ నుంచి తీసే ఇథనాల్ రూ.46.66 నుంచి రూ.49.41కు, బి–హెవీ రూట్ నుంచి వచ్చే ఇథనాల్ లీటర్ రూ.59.08 నుంచి రూ.60.73కు పెరుగుతాయి’’ అన్నారు. ఎరువులపై రూ.51,875 కోట్ల సబ్సిడీ 2022–23 ఆర్థిక సంవత్సరంలో రబీ సీజన్‌కు ఫాస్మాఫాటిక్ పొటాసిక్ (పీ అండ్ కే) ఎరువులపై రూ.51,875 కోట్ల సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నైట్రోజన్‌పై కేజీకి రూ.98.02, ఫాస్ఫరస్పై కేజీకి రూ.66.93, పొటాష్పై కేజీకి రూ.23.65, సల్ఫర్పై కేజీకి రూ.6.12 సబ్సిడీని ఇస్తూ నిర్ణయం తీసుకుంది. డెన్మార్క్‌తో నీటి వనరుల సంరక్షణ, నిర్వహణకు అవగాహనా ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. -
ఇథనాల్ ఉత్పత్తికి ప్రభుత్వ మద్దతు కావాలి
న్యూఢిల్లీ: ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలంటే చక్కెర పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు అవసరమని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) ప్రెసిడెంట్ ఆదిత్య ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. అప్పుడే 2025 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ పరిమాణాన్ని 20 శాతానికి (ఈ20) పెంచాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యపడగలదని పేర్కొన్నారు. ఈ20 లక్ష్య సాధన కోసం 1,000 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసిందని భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీయంగా చెరకు, చక్కెర ఉత్పత్తిని పెంచేందుకు మరింత అధిక తయారీ సామర్థ్యాలు, మరిన్ని డిస్టిలరీలు అవసరమవుతాయని ఆదిత్య చెప్పారు. ఇందుకు ప్రభుత్వ విధానాలపరమైన తోడ్పాటు కావాల్సి ఉంటుందన్నారు. పరిశ్రమ ఇప్పటికే పూర్తి ఉత్పత్తి సామర్థ్యాలతో పనిచేస్తోందని, కొత్తగా మరిన్ని ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉంటుందని ఆదిత్య వివరించారు. చక్కెర పరిశ్రమ ఇథనాల్ ఉత్పత్తిని పెంచేందుకు మరిన్ని పెట్టుబడులు పెడుతోందని, దీనికి ప్రభుత్వం నుంచి కూడా కొంత మద్దతు అవసరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, చెరకు పంటకు నీరు ఎక్కువగా అవసరం అవుతుంది కాబట్టి వ్యవసాయ వ్యర్ధాల్లాంటి వనరుల నుండి ఇథనాల్ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పురి చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలకు స్పష్టమైన విధానాలు కీలకం హెచ్ఎంఎస్ఐ సీఈవో ఒగాటా దేశీయంగా ప్రత్యామ్నాయ ఇంధన మార్గదర్శ ప్రణాళికను అమలు చేయాలంటే స్పష్టమైన, స్థిరమైన విధానాల ప్రణాళిక కీలకమని ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ప్రెసిడెంట్ అత్సుషి ఒకాటా చెప్పారు. ప్రభుత్వ విజన్‌ను అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే ఇంధన సరఫరా, ధర వంటి సవాళ్లను పరిష్కారం కావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రణాళిక విజయవంతంగా అమలయ్యేందుకు తగిన విధానం అవసరమన్నారు. -
యమహా గుడ్‌న్యూస్ చెప్పిందిగా!
సాక్షి, ముంబై: పెరుగుతున్న ఇంధన ధరలు, కర్బన ఉద్గారాల కాలుష్యం, ఇథనాల్లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో తన వినియోగ దారులకు మంచి వార్త చెప్పింది.ఎలక్ట్రిక్ వాహనాలు ధరలను చూసి బెంబేలెత్తిపోతున్న రైడర్లకు ఊరట కలిగేలా పెట్రోలు, ఇథనాల్ లేదా రెండిటితో కలిసి పనిచేసి అద్భుతమైన ఇంజీన్‌తో కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. 2023 యమహా ఎఫ్‌జెడ్-15ను బ్రెజిల్లో లాంచ్ చే సింది. కంపెనీ ఈ బైక్‌ను దక్షిణ అమెరికా దేశంలో Fazer FZ-15 పేరుతో విక్రయిస్తోంది. అయితే ఇదే ఇంజీన్‌తో అప్డేట్ చేసి ఇండియాలో ఇథనాల్ ఆధారిత Yamaha FZ V3 బైక్‌ను త్వరలోనే తీసుకురావచ్చని భావిస్తున్నారు. యమహా ఎఫ్‌జెడ్-15ను బ్లూఫ్లెక్స్ సిస్టమ్‌తో కూడిన 150సీసీ ఇంజిన్‌తో వచ్చింది. ఇది పెట్రోల్, ఇథనాల్ లేదా రెండింటిలో ఏది ఎక్కువ పొదుపుగా ఉంటుందో దాన్ని ఎంచుకునేలా సపోర్ట్ చేస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త యమహా బైక్‌లు ప్రొజెక్టర్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ముందు భాగంలో ABS బ్రేక్‌లు, రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, మోనోక్రాస్ సస్పెన్షన్, వైడ్ టైర్లు, క్లాక్, గేర్ ఇండికేటర్, టాకోమీటర్,ఈకో ఫంక్షన్‌గా విడదుల చేసింది.రేసింగ్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ మరియు మాగ్మా రెడ్ అనే మూడు రంగుల ఎంపికలో లభ్యం. ధర సుమారు రూ. 2.69 లక్షలుగా ఉంటుంది. -
ఇంధన సంక్షోభం: ప్రత్యామ్నాయాలు, ప్రయోజనాలు
భూమిలోని క్రూడ్ ఆయిల్ నిల్వలు అయిపోతే ఏం చేయాలి? అందుకే ప్రత్యామ్నాయ ఇంధనం కోసం అన్ని దేశాలు అన్వేషిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా కొద్ది కొద్దిగా వాడుతున్న ఇథనాల్ వినియోగం పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి? అసలు ఇథనాల్ దేని నుంచి తయారవుతుంది? దాని వల్ల మేలు జరుగుతుందా? సమాజానికి నష్టమా? • సకల చరాచర జగత్తు ఇంధనం మీదే ఆధారపడి నడుస్తోంది.. • భూమిలో లభిస్తున్న క్రూడ్ ఆయిల్ అయిపోతే..? • మానవాళి మనుగడే ప్రశ్నార్థకం కాదా? • ఈ ప్రశ్నలనుంచి ఉద్భవించిందే ప్రత్యామ్నాయ ఇంధనం.. •పెట్రోలియంకు బదులుగా తయారు చేసుకుంటున్నదే ఇథనాల్.. చెరకు నుంచి పంచదార, బెల్లం తయారు చేసుకుంటాం. చెరకు పిప్పి నుంచి ఆల్కహాల్, మొలాసిస్ తయారవుతాయని కూడా మనకు తెలుసు. బియ్యం దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన ఆహారం. మొక్కజొన్నలు కాల్చుకుని వేడి వేడిగా తింటాం. సినిమా థియేటర్లలో పాప్‌కార్న్ పేరుతో వందల రూపాయలు ఖర్చుపెడతాం. కాని ఇప్పుడు చెప్పుకున్న ఈ మూడు పదార్థాల నుంచి ఇంధనం తయారవుతుందంటే నమ్మగలమా? నమ్మాల్సిందే.. 2013 నుంచే మన దేశంలో కూడా చెరకు, బియ్యం, మొక్కజొన్నల నుంచి తయారవుతున్న జీవ ఇంధనాన్ని పెట్రోల్‌లో కొద్ది కొద్దిగా కలుపుతున్నారు. మనకు ఆ విషయం తెలియదు. ప్రపంచమంతా ఇప్పుడు జీవ ఇంధనం దిశగా అడుగులు వేస్తోంది. విదేశీ మారకద్రవ్యం ఆదా చేసుకోవడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం, వేగంగా అంతరించిపోతున్న ముడిచమురు నిల్వల్ని మరికొంత కాలం అదనంగా లభించేలా చూసుకోవడం వంటి లక్ష్యాలతో ప్రపంచమంతా జీవ ఇంధనం తయారీ దిశగా అడుగులు వేస్తోంది. భూమి మీద కొన్ని దేశాల్లోనే క్రూడ్ ఆయిల్ లభిస్తుంది. వాటి నుంచే మిగిలిన ప్రపంచమంతా దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న అమెరికా...అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం అంటే నమ్మగలమా? అమెరికా తర్వాత రష్యాలోనే అధిక చమురు నిల్వలున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో వాడుతున్న పెట్రోల్, డీజిల్‌లో 82 శాతం ఆయిల్ రిచ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనదేశంలో ఉత్పత్తి అవుతున్నది కేవలం 18 శాతం మాత్రమే. మనం వాడే గ్యాస్‌లో 45 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. 202122 ఆర్థిక సంవత్సరంలో భారత్ ముడి చమురు, గ్యాస్ కోసం 119 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. ఈ మొత్తాన్ని మన రూపాయల్లో లెక్కిస్తే 95,166 కోట్ల రూపాయలు అవుతుంది. ఆధునిక సమాజంలో ఇంధనం లేకపోతే మనిషి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి భూమి తనలో దాచుకున్న ముడి చమురును ఎడా పెడా తోడేస్తున్నాం. జనాభా పెరుగుతూ, అవసరాలు పెరిగే కొద్దీ సరికొత్త టెక్నాలజీతో చమురు తీసే వేగం కూడా పెరుగుతోంది. ఇలా భూమిలోని చమురును తోడేస్తూ ఉంటే 2052 నాటికి ముడి చమురు పూర్తిగా అంతరించిపోతుందనే అంచనాలు వేస్తున్నారు. అలాగే 2060 నాటికి సహజ వాయువు కూడా అదృశ్యమైపోతుంది. 2090 నాటికి బొగ్గు గనుల్లో బొగ్గు కూడా అయిపోతుంది. ఇవన్నీ అయిపోతే మనిషి మనుగడ ఏంకావాలి? అందుకే నాలుగైదు దశాబ్దాల నుంచే ప్రత్యామ్నాయ ఇంధనం గురించి అన్వేషణ మొదలైంది. ఇప్పటికే గాలినుంచి, సూర్యుడి శక్తి నుంచి విద్యుత్‌ను తయారు చేస్తున్నాం. 50 ఏళ్ళకు పూర్వమే జీవ ఇంధనం వాడకం కూడా మొల్లగా మొదలైంది. జీవ ఇంధనం అంటే మొక్కల నుంచి తయారు చేసుకోవడమే. అన్ని రకాల మొక్కలూ ఇందుకు ఉపయోగపడవు. మనం ఆహారానికి ఉపయోగించే చెరకు, మొక్కజొన్న, బియ్యం, బంగాళాదుంపలు, ఇతర నిరుపయోగమైన ఆహార పదార్థాల నుంచి ఇథనాల్ అనే చమురును తయారు చేసే టెక్నాలజీ ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇథనాల్. ఇథనాల్‌కు అనుగుణంగా వాహనాలను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం కంపెనీలను ఆదేశించింది. పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిన ఇథనాల్ ఉత్పత్తికి వాడే ముడి సరుకు ఏంటి? దాని వల్ల మానవాళికి ఏమైనా నష్టం జరుగుతుందా? పర్యావరణానికి మేలు జరుగుతుందా? భూమిలోని చమురు అయిపోతుండటం ఒక కారణం కాగా...చమురు నిల్వలు లేని దేశాలు వాటిని దిగుమతి చేసుకోవడానికి చెల్లించే విదేశీ మారకద్రవ్యం బిల్లులు ఏటేటా పెరిగిపోతుండటం కూడా ప్రత్యామ్నాయ ఇంధనం అన్వేషణకు కారణమైంది. అదే సమయంలో ప్రస్తుతం మనం వాడే పెట్రోల్, డీజిల్ వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. కర్బన పదార్ధాల వల్ల భూమి, పర్యావరణం వేడెక్కి రుతువులు గతి తప్పుతున్నాయి. జీవ ఇంధనం వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదమూ ఉండదు. ఇలా అనేక కారణాలతో ప్రపంచమంతా ఇథనాల్‌ని ప్రత్యామ్నాయ ఇంధనంగా తయారు చేసుకుంటోంది. చమురు నిల్వల్లో అగ్రభాగాన ఉన్న అమెరికానే ఇథనాల్ ఉత్పత్తిలో కూడా ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుగా చెరకు నుంచి ఇథనాల్ తయారు చేసే టెక్నాలజీ కనిపెట్టిన బ్రెజిల్ ఇప్పుడు రెండోస్థానంలో ఉంది. చెరకు ఉత్పత్తిలో ప్రపంచంలో నెంబర్ వన్‌గా ఉన్న బ్రెజిల్ చాలా తక్కువ ఖర్చుతో ఇథనాల్ తయారు చేసుకుంటోంది. -ఈవీ బాలాజీ, సాక్షి -
జీవ ఇంధనం దిశగా ప్రపంచం అడుగులు
-
ఇథనాల్ హబ్‌గా ఏపీ
సాక్షి, అమరావతి: ఇథనాల్ తయారీ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోంది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడంతో చెరకు నుంచే కాకుండా బియ్యం నూక, మొక్కజొన్నలు లాంటి ఆహార ధాన్యాల నుంచి ఏపీలో ఇథనాల్ తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. భగ్గుమంటున్న ఇంధన ధరల నేపథ్యంలో 2025–26 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి విక్రయించాలన్న లక్ష్యంతో ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ తయారీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవడంతో ఏపీలో ఇథనాల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు క్రిబ్కో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అస్సాగో, ఈఐడీ ప్యారీ, డాల్వకోట్, ఎకో స్టీల్ లాంటి పలు కంపెనీలు ఇప్పటికే ప్రకటించగా మరికొన్ని కంపెనీలు చర్చలు జరుపుతున్నాయి. దీనివల్ల సుమారు రూ.1,917 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానున్నాయి. ఎక్కడెక్కడ? రూ.560 కోట్లతో నెల్లూరు జిల్లాలో క్రిబ్కో బయో ఇథనాల్ తయారీ యూనిట్‌కు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చెరో రూ.600 కోట్లతో ఇథనాల్ తయారీ యూనిట్లను స్థాపిస్తున్నట్లు ప్రకటించగా రాజమహేంద్రవరం వద్ద బియ్యం నూక, పాడైన బియ్యం నుంచి ఇథనాల్ తయారీ యూనిట్‌ను రూ.300 కోట్లతో పెడుతున్నట్లు అస్సాగో ప్రకటించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎకోస్టీల్ సంస్థ మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈఐడీ ప్యారీ రూ.94 కోట్లతో ఇథనాల్ తయారీ యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చేస్తోంది. రూ.84 కోట్లతో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఇథనాల్ తయారీ యూనిట్ ఉత్పత్తికి సిద్ధమైంది. ఏప్రిల్ నుంచి కొన్ని రాష్ట్రాల్లో.. భారీగా పెరుగుతున్న ముడి చమురు దిగుమతి వ్యయాన్ని అరికట్టేందుకు పెట్రోల్‌లో ఇథనాల్ కలిపి విక్రయించడాన్ని కేంద్రం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం పెట్రోల్‌లో 10.5% ఇథనాల్ కలిపి విక్రయిస్తుండగా 2030 నాటికి దీన్ని 20 శాతానికి పెంచాలని కేంద్రం తొలుత నిర్ణయించింది. భారీగా పెరుగుతున్న చమురు రేట్లను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొన్ని రాష్ట్రాల్లో 20% ఇథనాల్ కలపటాన్ని తప్పనిసరి చేయగా 2025–26 నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ తయారీకి పచ్చజెండా ఊపింది. 1,016 కోట్ల లీటర్లు అవసరం దేశంలో ఆహార ధాన్యాల నుంచి 760 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అవుతుండగా 20% లక్ష్యాన్ని చేరుకునేందుకు 2025–26 నాటికి అదనంగా 1,016 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం కానుందని అంచనా. చక్కెర తయారీ సంస్థలు కూడా ఇథనాల్ ఉత్పత్తి పెంచుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఇథనాల్ కలపటాన్ని 20%కి పెంచడం వల్ల ఏటా ఇంధన దిగుమతి వ్యయంలో రూ.51,600 కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది. వచ్చే ఏడాది నుంచి 20 శాతం ఇథనాల్ బ్లెండ్ చేసిన పెట్రోల్ విక్రయించేలా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం ఏపీలో ఏటా 15.5 కోట్ల లీటర్ల పెట్రోల్ విక్రయాలు జరుగుతున్నాయని అంచనా. వచ్చే ఏడాది నాటికి 20 శాతం లక్ష్యం చేరుకోవాలంటే కనీసం 3.1 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని అంచనా. త్వరలో ఇథనాల్ పాలసీ రాష్ట్రంలో ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ తయారీకి పలు సంస్థల నుంచి ప్రతిపాదనలు అందాయి. ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా ఇథనాల్ పాలసీ రూపొందిస్తున్నాం. ఆహార ధాన్యాలకు ఎలాంటి కొరత రాకుండా రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా ఈ పాలసీని రూపొందిస్తున్నాం. నూకలు, పాడైన బియ్యం నుంచి మాత్రమే ఇథనాల్ తయారీకి అనుమతించాలన్నది ప్రభుత్వ విధానం. – జి.సృజన, పరిశ్రమల శాఖ డైరెక్టర్ -
World Biofuel Day: 8 ఏళ్లు.. రూ. 50 వేల కోట్లు..
పానిపట్: పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి వినియోగించడం వల్ల గత 7–8 ఏళ్లలో రూ. 50,000 కోట్ల మేర విదేశీ మారకం ఆదా అయ్యిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. రైతులకు ఆ స్థాయిలో లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ఐవోసీ పానిపట్‌లో నెలకొల్పిన రెండో తరం ఇథనాల్ ప్లాంటును ప్రపంచ బయో ఇంధన దినోత్సవం సందర్భంగా బుధవారం జాతికి అంకితం చేసిన మోదీ ఈ విషయాలు తెలిపారు. దాదాపు రూ. 900 కోట్లతో ఏర్పాటైన ఈ ప్లాంటుతో.. వ్యవసాయ క్షేత్రాల్లో గడ్డిదుబ్బును తగులబెట్టే సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం కూడా లభించగలదని అన్నారు. హర్యానా, ఢిల్లీలో కాలుష్యం తగ్గడానికి కూడా ఈ ప్లాంటు దోహదపడగలదని ప్రధాని చెప్పారు. గత 8 ఏళ్లలో ఇథనాల్ ఉత్పత్తి 40 కోట్ల లీటర్ల నుండి 400 కోట్ల లీటర్లకు పెరిగినట్లు వివరించారు. 2023 ఏప్రిల్ నుంచి 20% ఇథనాల్ మిశ్రమం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 20% ఇథనాల్ మిశ్రమంతో పెట్రోల్‌ను ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల ద్వారా సరఫరా చేయనున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ పురి తెలిపారు. 2025 నాటికి దేశమంతటా దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఇది 10 శాతం స్థాయిలో ఉంటోంది. -
పెట్రోల్ ధరలకు విరుగుడు.. ఫ్లెక్స్ ఇంజన్‌తో వస్తోన్న హోండా బైక్
పెట్రోలు ధరలు సామాన్యులనే కాదు సంపన్నులను ఇబ్బంది పెడుతున్నాయి. రెండేళ్లలో లీటరు పెట్రోలు ధర రమారమి రూ.50 వంతున పెరిగింది. దీంతో పెట్రోలు వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు జనాలు మళ్లుతున్నారు. ఈ తరుణంలో మరో ఐడియాతో వచ్చింది హోండా మోటర్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా సంస్థ. పెట్రోలుతో పాటు ఇథనాల్‌తో నడిచే ఫ్లెక్స్ ఇంజన్‌ను ఉపయోగిస్తూ బైక్‌ను ఇండియా మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నట్టు హోండా ప్రకటించింది. అంటే హోండా త్వరలోనే మార్కెట్లోకి తెచ్చే ఫ్లెక్స్ ఇంజన్ స్కూటర్ ఇటు పెట్రోలుతో పాటు అటు ఇథనాల్ ఇంధనంతో కూడా నడుస్తుంది. హోండా సంస్థ 2009లోనే టైటాన్ సీజీ ఫ్లెక్స్ పేరుతో ఓ బైకు విదేశీ మార్కెట్లో రిలీజ్ చేసింది. అయితే అప్పుడు పెట్రోలు ధరలు అదుపులోనే ఉండటంతో అంతగా క్లిక్ కాలేదు. ఇండియాలో సాగు రంగంలో చెరుకు బాగా ఉత్పత్తి అవుతోంది. చెరుకు పంట నుంచి బై ప్రోడక్టుగా భారీ ఎత్తున ఇథనాల్ తయారు చేసే అవకాశం ఉంది. దీంతో ఇటు రైతులకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు పెట్రోలు నుంచి ఉపశమనం కలిగించేందుకు ఫ్లెక్స్ ఇంజన్లతో కూడిన వాహనాలు తయారు చేయాలంటూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఇప్పటికే అనేక సంస్థలకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే టీవీఎస్ సంస్థ ఫ్లెక్స్ ఇంజన్‌తో అపాచీ ఆర్టీఆర్ 200 ఎఫ్ఐ ఈ100 బైకును మార్కెట్లోకి తెచ్చింది. ఆ తర్వాత హోండా సంస్థ నుంచి మరో బైక్ మార్కెట్లోకి రాబోతుంది. లీటరు పెట్రోలు ధరతో పోల్చినప్పుడు సగం ధరకే ఇథనాల్ లభిస్తుంది. అంతేకాక రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. చదవండి: ‘ఫ్లెక్స్ ఇంధనాల’ ఇంజిన్లపై త్వరలో ఆదేశాలు -
అలా చేస్తే.. ఇక పెట్రోల్ అవసరం లేదు: నితిన్ గడ్కరీ
వాహనాల్లో ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ ఇంజిన్లను ప్రవేశపెట్టాలని కార్ల తయారీదారులకు ప్రభుత్వం సలహా ఇచ్చినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. ఒక కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగిస్తూ.. ఎలక్ట్రిక్ వాహనలను, ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ''నిన్న, నేను ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లను తయారు చేయమని కార్ల తయారీదారులకు సలహా ఇవ్వడానికి ఒక ఫైల్ పై సంతకం చేశాను. ఈ ఇంజిన్లను కార్ల తయారీదారులు తయారు చేయడానికి ఆరు నెలలు సమయం ఇచ్చాము' అని ఆయన అన్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ లేదా ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ అనేది గ్యాసోలిన్, మిథనాల్ లేదా ఇథనాల్ కలయికతో తయారు చేసిన ప్రత్యామ్నాయ ఇంధనం. టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో వంటి కంపెనీలు ఇప్పటికే తమ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల కోసం ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి తెలిపారు. ''త్వరలో, కార్లు కూడా 100 శాతం ఇథనాల్ ఇంధనంతో నడుస్తాయి. కాబట్టి, మాకు పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. అలాగే గ్రీన్ ఫ్యూయల్ వాడకం వల్ల భారీగా డబ్బు ఆదా అవుతుంది' అని గడ్కరీ అన్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ ఎలా పని చేస్తుంది? ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ అనేది ఒక అంతర్గత దహన యంత్రం. ఈ ఇంధనం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల ఇంధనంతో పని చేయగలదు. సాధారణ భాషలో చెప్పాలంటే ఈ ఇంజిన్‌లో పెట్రోల్, ఇథనాల్ లేదా మిథనాల్ మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ ఇంజన్ మిక్సర్‌లోని ఇంధన పరిమాణానికి అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే ఫ్యూయల్ మిక్సర్ సెన్సార్ లాగా పనిచేస్తుంది. ఫ్యూయల్ కంపోజిషన్ సెన్సార్, ఈసీయు ప్రోగ్రామింగ్ వంటి సాంకేతికత అందుబాటులోకి రావడంతో, ఇంజిన్ పరిమాణాన్ని సెట్ చేయడం ద్వారా ఆటోమేటిక్‌గా ఇంధనాన్ని ఉపయోగించుకోవచ్చు. (చదవండి: క్యాబ్ యూజర్ల కష్టాలకు చెక్.. సరికొత్త ఆప్షన్ తీసుకొచ్చిన ఓలా!) -
AP: ఇథనాల్ ఉత్పత్తి రెట్టింపు
సాక్షి, అమరావతి: గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి కార్యాచరణ చేపట్టింది. కాలుష్య నియంత్రణ, తక్కువ వ్యయంతో ఇంధన వనరులను సముపార్జన లక్ష్యాలుగా ఈ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ముఖ్యోద్దేశం. ఇందుకోసం తొలిసారిగా ఆహార ధాన్యాల నుంచి కూడా ఇథనాల్ ఉత్పత్తికి సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు చెరకు నుంచి వచ్చే మొలాసిస్ ద్వారా మాత్రమే ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తుండగా.. ఇకపై మొక్కజొన్న, ఇతర ఆహార ధాన్యాల నుంచి కూడా ఈ ఉత్పత్తిని ప్రోత్సహించాలని సంకల్పించింది. అలాగే, ఇథనాల్ ఉత్పత్తిని రెట్టింపు చేసేందుకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. మరోవైపు.. ఔషధ రంగానికే పరిమితమైన ఇథనాల్‌ను ఇకపై పెట్రోలియం ఉత్పత్తుల్లో కూడా విరివిగా ఉపయోగించాలని నిర్ణయించింది. చెరకు ఉప ఉత్పత్తులకు ప్రోత్సాహం దేశంలో అవసరానికంటే ఎక్కువగా చక్కెర ఉత్పత్తి అవుతుండడంతో ఆశించిన గిట్టుబాటు ధర లభించడంలేదు. దీంతో చక్కెర దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. అంతేకాక.. ఫ్యాక్టరీల వారీగా క్రషింగ్‌కు కోటా పెట్టి ఎగుమతులకు ఇన్సెంటివ్‌లు ఇస్తోంది. చక్కెర కంటే చెరకు నుంచి వచ్చే ఉప ఉత్పత్తులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇక చెరకు నుంచి వచ్చే మొలాసిస్ ద్వారా ఇ నాల్, ఈఎన్ఏ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్), ఆర్ఎస్ (రెక్టిఫైడ్ స్పిరిట్) వంటి ఉత్పత్తులు వస్తాయి. వీటిలో ఇథనాల్‌ను గ్రీన్ ఎనర్జీగా పరిగణిస్తారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు పెట్రోల్‌లో 10శాతం ఇథనాల్‌ను కలుపుతున్నారు. 2030 నాటికి దీనిని 20 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా.. ఇథనాల్‌ను ఉత్పత్తిచేసే డిస్టిలరీల సామర్థ్యం పెంచుకునేందుకు.. అలాగే, మొక్కజొన్న, ఇతర ఆహార ధాన్యాల నుంచి కూడా ఇథనాల్ ఉత్పత్తి నిమిత్తం కొత్త డిస్టిలరీల ఏర్పాటుకు కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. ఇందుకోసం ఆర్థికంగా చేయూతనివ్వడమే కాక.. వాటికి వడ్డీ చెల్లింపుపై కనీసం 2–3 ఏళ్ల పాటు మారటోరియం కూడా విధిస్తోంది. ఇథనాల్ ఉత్పత్తి ఎలాగంటే.. ►చెరకును క్రషింగ్ ద్వారా వచ్చిన మొలాసిస్‌ను చక్కెర కర్మాగారానికి అనుబంధంగా ఉండే డిస్టిలరీకి తరలిస్తారు. ►అక్కడ ఒక లీటర్ మొలాసిస్‌కు మూడు లీటర్ల నీరు కలిపి ఫర్మెంటేçషన్ చేస్తారు. అనంతరం డిస్టిలేషన్ యూనిట్‌కు పంపిస్తారు. ►అక్కడ ఆవిరిని కండెన్స్ చేయగా వచ్చే పదార్థమే ఇథనాల్. దీనిని స్టోరేజ్ ట్యాంక్‌కు తరలిస్తారు. ఒక టన్ను చెరకు నుంచి 47 కేజీల మొలాసిస్ వస్తుంది. టన్ను మొలాసిస్ నుంచి 12.5 లీటర్ల ఇథనాల్ వస్తుంది. ►ఇక మొలాసిస్ నుంచి మూడు రకాలుగా ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తారు. ఇలా టన్నుకు సీ మొలాసిస్ నుంచి 260 లీటర్లు, బి.మొలాసిస్ నుంచి 320 లీటర్లు, షుగర్ సిరప్ నుంచి 285 లీటర్లు ఇథనాల్‌ను తీస్తారు. ►షుగర్ సిరప్ నుంచి ఉత్పత్తయ్యే ఇథనాల్‌ను లీటర్‌కు రూ.62.65లు, బి మొలాసిస్ నుంచి వచ్చే ఇథనాల్‌కు లీటర్‌కు రూ.57.61లు, సీ మొలాసిస్ నుంచి వచ్చే ఇథనాల్‌ను లీటర్‌కు రూ.45.69లుగా కేంద్రం ధర నిర్ణయించింది. ►వీటిని పెట్రోల్ ఉత్పత్తి చేసే ఆయిల్ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ►ఇలా రాష్టంలో 13.75 లక్షల కిలో లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. సామర్థ్యం పెంచేందుకు యత్నిస్తున్నాం కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహంతో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తున్నాం. మా ఫ్యాక్టరీలో రోజుకు 48వేల లీటర్ల చొప్పున ఏటా 1.58 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నాం. వచ్చే ఏడాదికి దీనిని మరింతగా పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం రూ.95 కోట్లు ఖర్చుచేయబోతున్నాం. – ఎ. నాగశేషారెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, ఈఐడీ ప్యారీ ఇండియా లిమిటెడ్, సంకిలి, శ్రీకాకుళం జిల్లా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం రాష్ట్రంలో ఈఐడీతో పాటు సర్వారాయ, ఆంధ్రా, కేసీపీ, ఎస్ఎన్జీ షుగర్స్ ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. చెరకు నుంచే కాకుండా మొక్కజొన్న, ఇతర ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ ఉత్పత్తి కోసం డిస్టిలరీల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఉన్న డిస్టలరీల ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి యత్నిస్తున్నాయి. ఇది ఆహ్వానించదగిన పరిణామం. – వడకాని వెంకట్రావు, డైరెక్టర్ ఆఫ్ షుగర్స్ -
ఫార్ములా వన్ రేసులు.. సంచలన నిర్ణయం
అసలే ఇంధన ధరలు మండిపోతున్నాయి. దీనికితోడు ఆ ఇంధనాల వల్ల కాలుష్యం పెరిగి పర్యావరణానికి మరింత హాని చేస్తోంది. ఈ తరుణంలో వచ్చే ఫార్ములా వన్ సీజన్ కోసం ఎఫ్ఐఏ (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్) సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ అత్యున్నత ఆటో రేసింగ్ ఫార్ములా వన్ తరపున ఎఫ్ఐఏ అభినందనీయమైన నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్లో స్థిరమైన ఇంధనాలు(sustainable fuels).. అదీ సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది. తద్వారా కాలుష్యాన్ని తగ్గించే పనిలో పడింది. ఈ నిర్ణయంతో వచ్చే ఏడాది నుంచి ఈ10 ఫ్యూయల్ ఉపయోగించనున్నారు. అయితే ఇప్పటిదాకా ఉపయోగిస్తున్న ఇంధన వనరుల వ్యాపార ఒప్పందాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపించనుంది. 2022 ఎఫ్‌వన్ సీజన్ మార్చ్ 20న బహ్రయిన్లో మొదలై.. నవంబర్ 20న అబుదాబిలో ముగియనుంది. ఇక చాలా ఏళ్లుగా రేసింగ్‌లో ఉపయోగించే ఇంధనాల వల్ల కాలుష్యం పెరుగుతోందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో ఇంధనాల్లో ఇథనాల్ మిక్సింగ్ మోతాదును పెంచాలని నిర్ణయించారు. రానున్న పదేళ్లకల్లా జీరో కార్బన్ లక్క్ష్యంగా పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది ఎఫ్ఐఏ. 2025, 2026 నాటికల్లా 100 శాతం స్థిరమైన ఇంధనాలు (sustainable fuels) ఉపయోగ సాధన దిశగా ఎఫ్ఐఏ అడుగులు వేస్తోంది. చదవండి: ఫార్ములా వన్.. సెంచరీ విక్టరీల వీరుడు ఎవరో తెలుసా? -
‘ఫ్లెక్స్ ఇంధనాల’ ఇంజిన్లపై త్వరలో ఆదేశాలు
పుణె: కార్ల తయారీ కంపెనీలు.. ఫ్లెక్స్–ఫ్యుయల్ ఇంజిన్లను ప్రవేశపెట్టడం తప్పనిసరి చేస్తూ త్వరలోనే ఆదేశాలు ఇవ్వనున్నట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ మొదలుకుని టాటా, మహీంద్రా వంటి సంస్థలు దీన్ని పాటించేలా 3–4 నెలల్లో ఆదేశాలు జారీ చేయనున్నట్లు వివరించారు. తన జీవితకాలంలో పెట్రోల్, డీజిల్ వినియోగం పూర్తిగా నిలిచిపోవాలని, దేశీయంగా ఉత్పత్తయ్యే ఇథనాల్ ఇంధన వినియోగం పెరగాలని ఆకాంక్షిస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. ఫ్లెక్స్ ఇంజిన్లు తయారు చేసే దాకా తన వద్దకు రావద్దంటూ ద్విచక్ర వాహన సంస్థలకు కూడా సూచించానని, ఆ తర్వాత అవి ఇథనాల్–ఫ్లెక్స్ ఇంజిన్లను రూపొందించాయని గడ్కరీ తెలిపారు. ఇంధనంలో 51–83% దాకా ఇథనాల్ లేదా మిథనాల్‌ను కలిపినా పనిచేయగలిగే ఇంజిన్లను ఫ్లెక్స్ ఇంజిన్లుగా వ్యవహరిస్తారు. మరోవైపు, శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు హారన్లను కూడా సంగీత ధ్వనులతో రూపొందించాలని కార్ల తయారీ సంస్థలకు సూచించినట్లు గడ్కరీ చెప్పారు. -
ఆటోమేకర్స్‌కి సర్కార్ షాక్ ! మంత్రి నితిన్ గడ్కారీ కీలక ప్రకటన
చిప్ సెట్ల కొరతతో సతమతం అవుతున్న అటోమొబైల్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కార్ల తయారీకి సంబంధించి అత్యంతక కీలకమైన విభాగంలో మార్పులు చేర్పులు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ కీలక ప్రకటన చేశారు. ప్రతికూల పరిస్థితులు కరోనా సంక్షోభం తర్వాత కార్ల అమ్మకాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. అయితే అంతర్జాతీయంగా కార్ల తయారీలో కీలకమైన చిప్సెట్ల కొరత నెలకొంది. దీంతో కార్ల తయారీ సంస్థల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. ఇలా అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య ఉన్న ఆటో మొబైల్ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌కి మరో షాక్ ఇచ్చేందుకు కేంద్రం రెడీ అయ్యింది. ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయండి పెట్రోలు ధరలు కంట్రోల్ కాకపోవడంతో ప్రత్యామ్నాయంగా బయో ఇథనాల్‌తో నడిచే ఇంజన్లతో నడిచే కార్లను మార్కెట్లోకి తేవాలంటూ కార్ల తయారీ సంస్థలను కేంద్రం ఇప్పటి వరకు కోరుతూ వస్తోంది. ఇటు పెట్రోలో/డీజిల్‌తో పాటు బయో ఇథనాల్‌తో నడిచే విధంగా ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయాలని చెబుతోంది. అయితే కేంద్రం సూచనలకు తగ్గట్టుగా ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయడంపై కంపెనీలు ఆసక్తి చూపించడం లేదు. ఈవీ మార్కెట్‌పై కొద్దొగొప్పో ఫోకస్ చేస్తున్నాయి. తప్పనిసరి చేస్తాం చెరుకు, వరి ఇతర పంట ఉత్పత్తుల నుంచి బయో ఇథనాల్ భారీ ఎత్తున తయారు చేసే అవకాశం ఉందని, కాబట్టి బయో ఇథనాల్‌కి మార్కెట్ కల్పించాలంటే ఫ్లెక్సీ ఇంజన్లతో నడిచే వాహనాలు ఉండాలి. దీంతో ఫ్లెక్సీ ఇంజన్ల తయారీని తప్పని సరి చేస్తూ త్వరలో ఆదేశాలు ఇస్తామని, ఇందుకు ఆర్నెళ్లకు మించి సమయం పట్టబోదంటూ కేంద్ర రవాణాశాఖ మంత్రి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కుండ బద్దలు కొట్టారు. అయోమయంలో కంపెనీలు ఓ వైపు కర్భణ ఉద్గారాలు తగ్గించాలని చెబుతూ... ఈవీ మార్కెట్‌కి అనుకూలంగా ప్రభుత్వ విధానాలు రూపొందుతున్నాయని ఇప్పుడు కొత్తగా ఫ్లెక్సీ ఇంజన్లు అంటూ ఒత్తిడి చేస్తే ఎలాగంటూ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర విధానం రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. చదవండి: BH-Series Tag: రాష్ట్రాల మధ్య వాహనాల తరలింపు సులభతరం -
ఇథనాల్ తయారీకి ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: చక్కెర మిల్లులకు ప్రోత్సాహకాలతో కూడిన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రానున్న సీజన్ 2021–22కు సంబంధించి అదనపు దేశీయ విక్రయకోటాను ప్రకటించింది. ఇందులో భాగంగా చెరకును ఇథనాల్ తయారీకి వినియోగించే మిల్లులకు ప్రోత్సాహకాలు లభించనున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న గరిష్ట ధరలను సానుకూలంగా మలుచుకుని అక్టోబర్ నుంచి మొదలయ్యే కొత్త సీజన్ తొలినాళ్లలోనే ఎగుమతులకు ప్రణాళిక రూపొందించుకోవాలని మిల్లులకు సూచించింది. దీంతో ఎగుమతులకు సబ్సిడీలను కొనసాగించకపోవచ్చని తెలుస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద చక్కెర ఉత్పత్తి దేశంగా ఉన్న భారత్.. గత రెండేళ్ల నుంచి చక్కెర ఎగుమతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. దేశీయంగా వినియోగం కంటే ఉత్పత్తి అధికంగా ఉండడమే దీనికి కారణం. ఖరీదైన చమురు ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా దేశీయంగా ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్రం పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే ఇథనాల్ తయారీకి చెరకును మళ్లించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. రెండు విధాలుగా ప్రయోజనం చక్కెరను ఎగుమతి చేసే మిల్లులు.. ఇథనాల్ తయారీకి మళ్లించడం ద్వారా ‘అదనపు నెలవారీ దేశీయ కోటా’ కింద ప్రోత్సాహకాలు అందుకోవచ్చంటూ ఆహార శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతానికి దేశీయ మార్కెట్లో చక్కెర విక్రయాలకు నెలవారీ కోటాను (సుమారు 21 లక్షల టన్నులు) కేంద్రం నిర్ణయిస్తోంది. ‘గత నెలరోజుల్లో అంతర్జాతీయంగా చక్కెర ధరలు గణనీయంగా పెరిగాయి. భారత ముడి చక్కెరకు ఎంతో డిమాండ్ ఉంది. కనుక రానున్న సీజన్లో ఎగుమతులకు సంబంధించి మిల్లులు ముందే ప్రణాళిక రూపొందించుకోవాలి. చక్కెర ఎగుమతితోపాటు.. ఇథనాల్ తయారీకి మళ్లించడం వల్ల మిల్లులకు నిధుల ప్రవాహం పెరిగి చెరకు రైతులకు సకాలంలో చెల్లింపులు చేయగలుగుతాయి. ఇది దేశీయంగా ధరల స్థిరత్వానికి, మిల్లులకు ఆదాయం పెరిగేందుకు తోడ్పడుతుంది’ అని ఆహార శాఖ పేర్కొంది. మూడు సీజన్లలో రూ.22,000 కోట్లు గడిచిన మూడు చెరకు సీజన్లలో ఇథనాల్ తయారీ వల్ల మిల్లులు రూ.22,000 కోట్ల ఆదాయన్ని పొందినట్టు కేంద్ర ఆహార శాఖ తెలిపింది. ప్రస్తుత సీజన్లో ఇథనాల్ విక్రయం ద్వారా మిల్లులకు రూ.15,000 కోట్ల ఆదాయం లభించినట్టు వివరించింది. 2019–20 సీజన్లో 9,26,000 టన్నుల చక్కెరను ఇథనాల్ తయారీకి మిల్లులు వినియోగించాయి. 2018–19లో 3,37,000 టన్ను లతో పోలిస్తే మూడింతలు పెరగడం గమనార్హం. -
పెట్రోల్‌లో ఇథనాల్ మిక్సింగ్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
సాక్షి, వెబ్‌డెస్క్: పెట్రోలు ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే లీటరు పెట్రోలు ధర వంద దాటింది. ఇప్పుడప్పుడే ధర తగ్గుతుందన్న నమ్మకం కూడా లేదు. దీనికి తోడు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం లీటరు పెట్రోలులో 10 శాతం ఇథనాల్‌ను కలిపి అమ్ముతున్నారు. కొత్తగా వచ్చిన ఈ మార్పులకు అనుగుణంగా వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జులై 9 నుంచి పెట్రోలు దిగుమతులు తగ్గించడంతో పాటు దేశీయంగా రైతులకు ఉపయోగపడేలా ఇథనాల్ వినియోగం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో రాబోయే ఐదేళ్లలో లీటరు పెట్రోలులో 20 శాతం ఇథనాల్ కలపాలంటూ ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు. దీన్ని అనుసరించి జులై 9 నుంచి లీటరు పెట్రోలులో 10 శాతం ఇథనాల్‌ను కలిపి బంకులు అమ్మకాలు సాగిస్తున్నాయి. సాధారణంగా పెట్రోలు, ఇథనాల్ కలపడం వల్ల ఎక్కువ శక్తి విడుదల అవుతుంది. ఇంజన్‌పై పెద్దగా ప్రభావం చూపదు. వాహనం నడిపేప్ప్పుడు పెద్దగా తేడాలు కూడా రావు. అయితే వాహనంలో ఉన్న పెట్రోలు ట్యాంకు నిర్వహాణలో నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవు. నీటితో ఇబ్బందులు తప్పవు పెట్రోలు, ఇథనాల్లను కలిపినా అవి రెండు వేర్వేరు లేయర్లుగానే ఉండి పోతాయి. నీరు పెట్రోలుతో కలవదు, కానీ ఇథనాల్, నీరు త్వరగా కలిసిపోతాయి. వర్షకాలంలో బైకులు బయట పెట్టినప్పుడు, లేదా వాటర్ సర్వీసింగ్‌కి ఇచ్చినప్పుడు ఒక్క చుక్క నీరు పెట్రోలు ట్యాంకులోకి పోయినా సమస్యలు ఎదురవుతాయి. చిన్నీ నీటి బిందువు, తేమ ఉన్నా సరే ఇథనాల్ వాటితో కలిసి పోతుంది. నీరు, ఇథనాల్ కలిసి ప్రత్యేక పొరగా ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఇంజన్ అకస్మాత్తుగా ఆగిపోతుంది. హైవేలపై, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట ఇలా జరిగితే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. జాగ్రత్తలు పెట్రోల్‌లో ఇథనాల్ శాతం 10కి చేరడంతో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెట్రోల్ పంప్ డీలర్ అసోసియేషన్లు అవగాహన కల్పిస్తున్నాయి. వారు చెప్పిన వివరాల ప్రకారం ఈ కింది జాగ్రత్తలు తీసుకోవడం మంచింది. - పెట్రోలు పంప్ ట్యాంక్ మూతలను సరిగా పరిశీలించాలి. నీటి బిందువులు, తేమ లోపలికి వెళ్లకుండా గట్టిగా బిగించాలి - వాటర్ సర్వీసింగ్ చేసేప్పుడు ట్యాంకులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలి - వర్షంలో వాహనాలు ఆపినప్పుడు ట్యాంకుపై నీరు పడకుండా చూసుకోవాలి - ప్రయాణం మధ్యలో వాహనం అకస్మాత్తుగా ఆగిపోతుంటే వెంటనే మెకానిక్‌కి చూపించాలి -
పెట్రోల్‌కి ప్రత్యామ్నాయం ఇథనాల్, అడ్డా తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: పెట్రోలుకు ప్రత్యామ్నాయంగా భావిస్తోన్న ఇథనాల్ తయారీకి తెలంగాణ అడ్డా కాబోతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో ఇథనాల్ తయారీ ప్లాంటు స్థాపనకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఉంది. వరితో పాటు మొక్కజొన్న, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడ ఎక్కువే. దీంతో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ‘ఇంధన గ్రేడ్’ఇథనాల్ తయారీ ప్లాంటును తెలంగాణలో ఏర్పాటు చేయాలని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రతిపాదిస్తోంది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇథనాల్ తయారు చేసే 1జీ (ఫస్ట్ జనరేషన్) ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రూ.1000 కోట్లతో స్థాపించే ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 5 లక్షల లీటర్ల ఇథనాల్ తయారవుతుంది. ప్లాంటు ఏర్పాటుకు వంద ఎకరాల స్థలం అవసరమవుతుందని అంచనా. ఈ ప్లాంటు రోజూవారీ కార్యకలాపాల నిర్వహణకు 4 వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఇథనాల్ తయారీ ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూరడంతో పాటు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అధికారులతో సమావేశం తెలంగాణలో ఇథనాల్ తయారీ పరిశ్రమ నెలకొల్పే అంశంపై బీపీసీఎల్ ఎగ్జిక్టూటివ్ డైరెక్టర్ (జీవ ఇంధనాలు) అనురాగ్ సరోగి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో భేటీ అయ్యారు. జయేశ్‌ను కలసిన వారిలో బీపీసీఎల్ ఈడీ (ఇంజనీరింగ్, ప్రాజెక్టులు) ఎల్ఆర్ జైన్, కేహెచ్‌పీఎల్ ప్రాజెక్టు లీడర్ బి.మనోహర్ ఉన్నారు. భవిష్యత్తులో ఇథనాల్ ఇథనాల్ తయారీ పరిశ్రమకు తమ మద్దతు ఉంటుందని కేంద్ర మంతత్రి నితిన్ గడ్కారీ ప్రకటించారు. పెటట్రోలు ఇథనాల్‌తో నడిచేలా ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయాలంటూ వాహన తయారీదారులకు సూచించారు. అంతకు ముందు పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ శాతం పెంచాలంటూ ప్రధాని మోదీ ప్రకటించారు. కేంద్రం నుంచి ఇథనాల్ తయారీకి భారీగా మద్దతు దక్కుతున్న తరుణంలో కొత్త ప్లాంటు ఏర్పాటుకు బీసీసీఎల్ తెలంగాణను ఎంచుకోవడం గమనార్హం -
పెట్రోల్, డీజిల్‌లతోకాదు.. ..ఇథనాల్‌తో నడిచేలా ..
పెరగడమే తప్ప తరగడం అనే మాట లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ఫ్యూయల్ ఛార్జీలకు ప్రత్యామ్నయంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుదామంటే వాటి ధర ఎక్కువ. దీంతో వాహనదారుల సమస్యలకు ఇథనాల్ ఇంజన్లు ప్రత్యామ్నాయంగా నిలవబోత్నున్నాయి. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లు పెట్రోలుతోనే కాకుండా ఇథనాల్‌తో కూడా నడిచే విధంగా ‘ఫ్లెక్స్ ఇంజన్లు’ డిజైన్ చేయాలంటూ వాహన తయారీ కంపెనీలను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఇటీవల కోరారు. ఫ్లెక్స్ ఇంజన్లు అంటే రెండు రకాల ఇంధనాలతో నడిచే వాహనాలు. ప్రస్తుతం మనకు పెట్రోల్, సీఎన్జీ (గ్యాస్)తో నడిచే ఫ్లెక్స్ ఇంజన్ వాహనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో పెట్రోల్, ఇథనాల్‌లతో నడిచే ఫెక్స్ ఇంజన్లు రూపొందించేందుకు వాహన తయారీ సంస్థలు ముందుకు వచ్చేలా కేంద్రం కార్యాచరణ సిద్ధం చేయనుంది. పంట ఉత్పత్తులతో విదేశాల్లో గోధుమలు, మొక్కజోన్న, వరి ధాన్యాల నుంచి కూడా ఇథనాల్ ముడి పదార్థాలను తయారు చేస్తున్నారు. మనదగ్గర ఇథనాల్ తయారు చేసేందుకు కేవలం చెరుకు ఉత్పత్తులనే ఉపయోగిస్తున్నారు. మన దగ్గర సమృద్ధిగా ఉన్న చెరుకుతో పాటు వరి, గోదుమ, మొక్కజొన్నల నుంచి భారీ ఎత్తున ఇథనాల్ తయారు చేసేందుకు అవకాశాలున్నాయి. ఇలా చేయడం వల్ల రైతుల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. గతంలోనూ గతంలో పలు కంపెనీలు ఇథనాల్‌తో నడిచే వాహనాలు తయారు చేసినా అవేవీ మార్కెట్లోకి రాలేదు. ఇప్పుడు కొత్తగా ఇథనాల్ ఉత్పత్తి పెంచడంతో పాటు ఇథనాల్ బంకులు కూడా ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో పలు కంపెనీలు ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్ ఇంజన్ వాహనాల తయారీపై ఆసక్తి చూపించే అవకాశం ఉంది. 20 శాతం గత ఎనిమిదేళ్లుగా పెట్రోలులో ఇథనాల్లు కలిపే విక్రయిస్తున్నారు. అయితే పెట్రోలులో కలిపే ఇథనాల్ శాతాన్ని క్రమంగా ఒక శాతం నుంచి 10 వరకు తీసుకొచ్చారు. రాబోయే మూడేళ్లలో 20 శాతం ఇథనాల్‌ను పెట్రోల్, డీజిల్‌లో కలపాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి : దూసుకుపోతున్న ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ పరిశ్రమ -
వెహికల్ ఇంజన్లకు ఇథనాల్ టెన్షన్
వెబ్‌డెస్క్ : కేంద్రం ప్రకించిన ఇథనాల్ రోడ్‌మ్యాప్ 2020-25పై ఆటోమోబైల్ పరిశ్రమపై ఎటువంటి ప్రభావం పడనుంది. పెట్రోల్‌లో ఇథనాల్ శాతం 20కి పెరిగితే ఇంజన్లపై ఏ విధమైన ప్రభావం ఉంటుంది. సాంకేతిక సమస్యలు తలెత్తుతాయా ? మెయింటనెన్స్ పెరుగుతుందా ? ఇలా అనేక సందేహాలు ఇటు పరిశ్రమ వర్గాల నుంచి అటు వాహనదారుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి ఆటోమొబైల్ రంగ నిపుణులు ఏమంటున్నారంటే... 20 శాతం ఇథనాల్ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పెట్రోలు దిగుమతి భారాన్ని తగ్గించుకునేందుకు లీటరు పెట్రోలులో ఇథనాల్ శాతాన్ని రాబోయే రోజుల్లో 20 శాతానికి పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. 2025 కల్లా ఈ లక్ష్యాన్ని సాధించాలని చెప్పారు. అందుకు తగ్గట్టుగా ఇథనాల్ ఉత్పత్తిని పెంచాలంటూ ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు 2014 నుంచి పెట్రోలులో ఇథనాల్‌ని మిక్స్ చేయడం 2014 నుంచి ప్రారంభమైంది. మొదట 1 నుంచి 1.5 శాతం వరకు ఇథనాల్ కలిపేవారు. ప్రస్తుతం లీటరు పెట్రోలులో 8.5 శాతం ఇథనాల్ కలిపి చమురు సంస్థలు విక్రయిస్తున్నాయి. దీన్ని రాబోయే మూడేళ్లలో 20 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంజన్లపై ప్రభావం ? కార్లను తయారు చేసేప్పుడు స్వచ్ఛత ఎక్కువగా పెట్రోలు, డీజిల్‌లు ఉపయోగించేలా డిజైన్ చేస్తారు. పెట్రోలు స్వచ్ఛత తగ్గితే సాధారణంగానే ఇంజనుపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మరోవైపు సాధారణంగా పెట్రోలుకు మండే స్వభావం ఎక్కువ. తద్వారా ఇంజన్‌కి ఎక్కువ మొత్తంలో ఉష్ణశక్తి లభిస్తుంది. పెట్రోలుతో పోల్చినప్పుడు ఇథనాల్‌కి మండే స్వభావం తక్కువగా ఉంటుంది. పెట్రోలులో ఇథనాల్ శాతం పెరిగితే క్రమంగా ఇంజన్ సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇథనాల్ తినేస్తుంది ఇథనాల్ కరోసివ్ లక్షణం కలిగి ఉంటుంది. ముఖ్యంగా ప్లాస్టిక్, రబ్బర్ పదార్థాలను ఇథనాల్ కాలక్రమేనా తినేస్తుంది. పెట్రోల్‌లో ఇథనాల్ శాతం పెరిగితే ట్యాంకు పెట్రోలు పోయడం దగ్గర నుంచి ఇంజన్లో శక్తి వెలువడే వరకు ఇంజన్, వాహనం విడిభాగాలు ఇథనాల్ కారణంగా చెడిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం 8.5 శాతం ఇథనాల్ కలిసిన పెట్రోల్ దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్నా పెద్దగా సమస్యలు రాలేదు , కాబట్టి 20 శాతం ఇథనాల్ కలిపినా సమస్యలు రాకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. అయోమయం కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో అన్ని కార్లు, వాహనాల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాయి. అంతకు ముందు బీఎస్ 6 ప్రమాణాలకు తగ్గట్టు ఇంజన్ డిజైన్లలో మార్పులు చేశాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇథనాల్ శాతం పెంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు అయోమయంలో పడ్డాయి. చదవండి: పెట్రోల్‌లో 20% ఇథనాల్! -
పెట్రోల్‌లో 20% ఇథనాల్!
న్యూఢిల్లీ: కాలుష్యకారక కర్బన ఉద్గారాలను తగ్గించడంతోపాటు విదేశాల నుంచి చమురు దిగుమతుల తగ్గింపే లక్ష్యంగా మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ ముందడుగు వేసింది. ప్రతీ లీటర్ ఇథపెట్రోల్లో నాల్ మిశ్రమ పరిమాణాన్ని 20 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2025 నాటికి ఇది అమలయ్యేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ‘ఇథనాల్ రోడ్‌మ్యాప్ 2020–25’ను శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. చెరకు నుంచి ఇథనాల్‌ను తయారుచేస్తారు. పాడైపోయిన గోధుమలు, నూక(విరిగిన బియ్యం)లు, వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథనాల్‌ను భారీ మొత్తంలో ఉత్పత్తిచేయొచ్చు. బయో ఇంథనమైన ఇథనాల్ వాటాను లీటర్ పెట్రోల్‌లో 20 శాతానికి పెంచడం ద్వారా కర్బన ఉద్గారాల కాలుష్యాన్ని భారీ మొత్తంలో తగ్గించవచ్చు. ఇథనాల్ వాడకం పెరగడంతో విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై భారత్ ఆధారపడటమూ తగ్గనుంది. వ్యవసాయ వ్యర్థాల నుంచే ఇథనాల్ ఉత్పత్తి సాధ్యం కనుక రైతులకు ఇది మంచి ఆదాయ వనరుగా మారనుంది. సమీకరణకు రూ.21వేల కోట్లు వచ్చే ఏడాదికల్లా 10 శాతం కలపాలని, 2030కల్లా 20% కలపాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. 2014లో పెట్రోల్‌లో 1–1.5 శాతం ఇథనాల్ కలిపేవారు. ప్రస్తుతం ఇది 8.5 శాతానికి చేరింది. గతంలో 39 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను కేంద్రం సమీకరించగా ప్రస్తుతం 320 కోట్ల లీటర్లను సమీకరిస్తోంది. గత ఏడాది ఇథనాల్ సమీకరణ కోసం చమురు సంస్థలు రూ.21వేల కోట్లు ఖర్చు చేశాయి. అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ మూడోస్థానంలో ఉంది. దేశీయ డిమాండ్‌లో 85% చమురు విదేశాల నుంచే వస్తోంది. 10% ఇథనాల్ కలపాలంటే భారత్ 400 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను సమీకరించాల్సిఉంటుంది. అంతకుముందే లక్ష్యాన్ని సాధించాలి ‘పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ వాటా అనే లక్ష్యాన్ని 2030 ఏడాదికల్లా సాధించాలని గతంలో అనుకున్నాం. కానీ, అంతకుముందే(2025కల్లా) సాధించాలనేది మా ఆకాంక్ష. ఇథనాల్ వినియో గం పెరిగితే అది పర్యావరణానికీ మంచిదే. రైతుల ఆదాయం పెరిగి వారి జీవితాలు మెరుగు పడతాయి. పర్యావరణ సమతుల్యత కోసం భారత్ అంతర్జాతీయంగా పోరాడుతోంది. భారత పునరుత్పాదక ఇంథన సామర్థ్యం 250 శాతం పెరిగింది. ఈ విభాగంలో భారత్ ప్రపంచంలో టాప్–5లో నిలిచింది. భారత సౌర శక్తి సామర్థ్యం గత ఆరేళ్లలో 15 రెట్లు పెరిగింది. గృహాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు 37 కోట్ల ఎల్ఈడీ బల్బులు, 23 లక్షల ఎనర్జీ ఎఫీషియన్సీ ఫ్యాన్లు, వంట గ్యాస్‌ను అందించాం’అని రోడ్‌మ్యాప్ ఆవిష్కరణ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. అంతకుముందు మోదీ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రైతులతో మాట్లాడారు. -
తెలుగు రాష్ట్రాల్లో భారీ ఇథనాల్ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగంలో ఉన్న ఆయిల్, గ్యాస్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. ప్రత్యామ్నాయ ఇంధనం కోసం భారీ ఇథనాల్ ఉత్పత్తి కేంద్రాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఒక్కో ఫెసిలిటీకి రూ.600 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సంస్థ పరిశోధన, అభివృద్ధి విభాగం డైరెక్టర్ ఎస్ఎస్వీ రామకుమార్ తెలిపారు. కంపెనీ ఈడీ, తెలంగాణ, ఏపీ హెడ్ ఆర్ఎస్ఎస్ రావుతో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఒక్కో కేంద్రం రోజుకు 5 లక్షల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం రెండు స్థలాలను ప్రతిపాదించింది. ఏపీ సైతం ఇదే స్థాయిలో స్పందిస్తుందన్న ధీమా ఉంది. స్థలం చేతిలోకి రాగానే 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తాం’ అని చెప్పారు. బ్యాటరీ ప్లాంటు.. ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల తయారీ కోసం ఇజ్రాయెల్ కంపెనీ ఫినెర్జీతో ఇండియన్ ఆయిల్ ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒక గిగావాట్ వార్షిక సామర్థ్యంతో రానున్న ప్రతిపాదిత ప్లాంటు ఎక్కడ ఏర్పాటు చేసేది త్వరలో ప్రకటించనున్నారు. అల్యూమినియం ఆధారిత బ్యాటరీలను ఇక్కడ తయారు చేస్తారు. ఒకసారి చార్జీ చేస్తే ఈ బ్యాటరీతో 400 కిలోమీటర్ల వరకు వాహనం ప్రయాణిస్తుంది. బ్యాటరీలకు కావాల్సిన ముడి పదార్థాలన్నీ దేశీయంగా లభించేవే. రెండవ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఇండియన్ ఆయిల్ నోయిడాలో నెలకొల్పనుంది. 2023 జూలై నాటికి ఇది సిద్ధం కానుంది. ఈ కేంద్రం కోసం సంస్థ రూ.2,300 కోట్లు వెచ్చించనుంది. సుపీరియర్ డీజిల్ త్వరలో.. ఇండియన్ ఆయిల్ త్వరలో సుపీరియర్ డీజిల్‌ను అందుబాటులోకి తేనుంది. ఇందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, చట్టబద్ధమైన అనుమతులు సైతం పొందామని రామకుమార్ తెలిపారు. ధర ఎక్కువ ఉన్నప్పటికీ కస్టమర్లకు ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పారు. ఇంజన్ శుభ్రంగా ఉండడం, తక్కువ ఉద్గారాలు, అధిక మైలేజీ ఇస్తుందని వివరించారు. ఎనర్జీ స్టేషన్స్‌గా అవతరణ.. సంస్థ ఫ్యూయల్ స్టేషన్స్ రూపురేఖలు మారనున్నాయి. 5–10 ఏళ్లలో ఇండియన్ ఆయిల్ పంపుల్లో మిథనాల్, ఇథనాల్, సీఎన్జీ, ఎల్ఎన్జీ సైతం విక్రయించనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ పాయింట్లూ రానున్నాయి. సాధారణ ఫ్యూయల్ స్టేషన్స్ కాస్తా ఇండియన్ ఆయిల్ ఎనర్జీ స్టేషన్స్‌గా రూపొందనున్నాయి. అలాగే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 5,000 కంప్రెస్డ్ బయోగ్యాస్ కేంద్రాలు రానున్నాయి. ఇప్పటికే 600 కేంద్రాలకు అనుమతులు ఇచ్చారు. ఒక ఎకరం స్థలం, రూ.3–5 కోట్ల పెట్టుబడి పెట్టగలిగే ఔత్సాహికులు ముందుకు రావొచ్చు. రుణమూ దొరుకుతుంది. కేజీకి సంస్థ రూ.46 చెల్లిస్తుంది. -
మార్కెట్లు వీక్- షుగర్ షేర్లు స్వీట్
ముంబై, సాక్షి: లాభాల స్వీకరణ కోసం ట్రేడర్ల అమ్మకాలు, సరికొత్త గరిష్టాలకు చేరడంతో ఇన్వెస్టర్ల అప్రమత్తత వంటి అంశాలతో స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 147 పాయింట్లు క్షీణించి 43,681 వద్ద ట్రేడవుతోంది. అయితే ఆటుపోట్ల మార్కెట్లోనూ ఉన్నట్టుండి చక్కెర తయారీ రంగ కంపెనీలకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో దాదాపు లిస్టెడ్ షుగర్ కంపెనీల షేర్లన్నీ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. కారణాలున్నాయ్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో షుగర్ కంపెనీలు అంచనాలను మించిన ఫలితాలు సాధించాయి. ఇందుకు కంపెనీలు చేపట్టిన వ్యయాల కోత, లాభదాయకత మెరుగుపడటం వంటి అంశాలు సహకరించాయి. ప్రధానంగా క్యూ2(జులై-సెప్టెంబర్)లో నిర్వహణ నగదు లాభాలు పెరగడం, వర్కింగ్ క్యాపిటల్ రుణాలు తగ్గడం చక్కెర కౌంటర్లకు ఆకర్షణను తీసుకువచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. దీనికితోడు డిస్టిల్లరీ విభాగాల నుంచి ఆదాయాలు పుంజుకోవడం చక్కెర పరిశ్రమకు మద్దతిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నాయి. అక్టోబర్ చివర్లో ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ఇథనాల్ ధరలను 2 శాతం పెంచి 6 శాతానికి చేర్చింది. ఈ డిసెంబర్ నుంచి 2021 నవంబర్వరకూ ధరలు అమలుకానున్నాయి. తద్వారా పరిశ్రమలు చక్కెర తయారీ నుంచి ఇథనాల్‌వైపునకు మళ్లే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను మిక్స్ చేసే విషయం విదితమే. ఈ నేపథ్యంలో క్యూ3(అక్టొబర్- డిసెంబర్)లోనూ షుగర్ కంపెనీలు పటిష్ట ఫలితాలు సాధించవచ్చన్న అంచనాలు పెరుగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ అంశాలు షుగర్ రంగ కౌంటర్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నట్లు విశ్లేషించారు. షేర్ల దూకుడు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో పలు చక్కెర రంగ కౌంటర్లు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. జాబితాలో కేసీపీ, ఉత్తమ్, అవధ్, ధంపూర్ తదితరాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అవధ్ షుగర్స్ 12.4 శాతం ఎగసి రూ. 206 వద్ద, కేసీపీ 12 శాతం పెరిగి రూ. 17 వద్ద, మగధ్ 12.5 శాతం దూసుకెళ్లి రూ. 116 వద్ద, ఉత్తమ్ 9.5 శాతం జంప్‌చేసి రూ. 99 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో దాల్మియా భారత్ 5.2 శాతం పురోగమించి రూ. 144 వద్ద, ద్వారికేష్ 5 శాతం పుంజుకుని రూ. 30 వద్ద, ధంపూర్ 4 శాతం లాభంతో రూ. 161 వద్ద ఉగర్ షుగర్స్ 5 శాతం లాభపడి రూ. 15 వద్ద కదులుతున్నాయి. ఇదే విధంగా డీసీఎం శ్రీరామ్, శ్రీ రేణుకా షుగర్స్, ఈఐడీ ప్యారీ, మవానా, శక్తి షుగర్స్ తదితర పలు కౌంటర్లు 9-3 శాతం మధ్య బలపడ్డాయి. -
లాక్డౌన్: కేంద్రం వివాదాస్పద ప్రకటన
న్యూఢిల్లీ: గోదాముల్లో అవసరానికి మించి ఉన్న బియ్యాన్ని ఇథనాల్‌గా మార్చి, శానిటైజర్ల తయారీకి, కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు పెట్రోల్‌లో కలిపేందుకు ఉపయోగిస్తామని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. జీవ ఇంధనాలపై జాతీయ విధానంలో భాగంగా.. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన జరిగిన ‘నేషనల్ బయో ఫ్యూయల్ కోఆర్డినేషన్’ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ కారణంగా లక్షలాదిగా వలస కూలీలు, ఇతర పేదలు ఆకలితో బాధపడుతున్న తరుణంలో కేంద్రం చేసిన ఈ ప్రకటన వివాదాస్పదమైంది. లాక్డౌన్ సమయంలో.. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు రానున్న మూడు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం గతంలో చెప్పింది. అధికారిక సమాచారం ప్రకారం ఎఫ్‌సీఐ గోడౌన్లలో 58.49 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి. ఇందులో 30.97 మిలియన్ టన్నుల బియ్యం, 27.52 మిలియన్ టన్నుల గోధుమలు ఉన్నాయి. నిర్దేశించిన ఆహార నిల్వల కంటే ఏప్రిల్ 1 నాటికి 21 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉన్నాయి. కాగా, ఇథనాల్‌తో హాండ్ శానిటైజర్ల తయారీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వ షూగర్ కంపెనీలు, డిస్టిలరీస్‌కు అనుమతి ఇచ్చింది. సాధారణంగా పెట్రోల్‌లో కలిపేందుకు ఇథనాల్‌ను చమురు సంస్థలకు షూగర్ కంపెనీలు సరఫరా చేస్తుంటాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున శానిటైజర్లు తయారుచేసి ఆస్పత్రులు, సంస్థలకు సరఫరా చేయాలని నిర్ణయించినట్టు షూగర్ కంపెనీల సంఘం(ఐఎస్ఎంఏ) వెల్లడించింది. వీటిని తయారు చేసిన ధరకు లేదా ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. చదవండి: కరోనాపై అంతుచిక్కని అంశాలు -
ఇథనాల్ ధర లీటరుకు రూ.1.84 పెంపు
న్యూఢిల్లీ: చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకునే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ రేటును లీటరుకు రూ. 1.84 దాకా పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏటా 1 బిలియన్ డాలర్ల మేర చమురు దిగుమతుల భారం తగ్గుతుందని అంచనా. డిసెంబర్ 1 నుంచి చక్కెర మిల్లుల నుంచి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ రంగ కంపెనీలు కొత్త రేట్ల ప్రకారం కొనుగోళ్లు జరుపుతాయని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. ’సి గ్రేడు మొలాసిస్’ నుంచి తీసిన ఇథనాల్ ధర లీటరుకు 29 పైసలు పెంచడంతో కొత్త ధర రూ. 43.75గా ఉండనుంది. ఇక ’బి గ్రేడు మొలాసిస్’ నుంచి తీసే ఇథనాల్ రేటు రూ. 1.84 పెరిగి లీటరు ధర రూ. 54.27కి చేరుతుంది. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమ పరిమాణం పెంచడం వల్ల ఏటా 2 మిలియన్ టన్నుల మేర చమురు వినియోగం, తద్వారా 1 బిలియన్ డాలర్ల దిగుమతుల భారం తగ్గుతుందని ప్రధాన్ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమ పరిమాణం ప్రస్తుతమున్న 6 శాతం నుంచి 7 శాతానికి, 2021–22 నాటికి 10 శాతానికి పెరగనున్నట్లు ఆయన వివరించారు. 2018–19లో 226 మిలియన్ టన్నుల చమురు దిగుమతులపై భారత్ 112 బిలియన్ డాలర్లు వెచ్చించింది. -
ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్ సాధ్యమేనా ?
ఆగస్టు 10వ తేదీ ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని జరుపుకున్నాం. జీవ ఇంధనాలను ఉపయోగించడం ద్వారా పెట్రోలు వినియోగాన్ని తగ్గించవచ్చని, తద్వారా కోట్ల రూపాయలు ఆదా చేసుకోవచ్చన్న భావనతో ప్రపంచ దేశాలు జీవ ఇంధనమైన ఇధనాల్‌ను పెట్రోల్‌లో కలపాలని నిర్ణయించాయి. మన దేశంలో కూడా ఇథనాల్ వినియోగాన్ని పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వంలోని నూతన,పునర్వినియోగ ఇంధన మంత్రిత్వ శాఖ 2009లో జీవ ఇంధనాలపై జాతీయ విధానాన్ని రూపొందించింది.2013 జనవరి నుంచి ఇథనాల్ కలిపిన పెట్రోలును అమ్మే విధానాన్ని(ఇబీపీ) ప్రారంభించింది. పెట్రోలియం కంపెనీలు 5శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలునే అమ్మాలని ఆదేశించింది.2017 నాటికి 20శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది.అయితే, ప్రభుత్వాల అలసత్వం, ఇథనాల్ తగినంత ఉత్పత్తి కాకపోవడం తదితర కారణాల వల్ల గడువుదాటినా లక్ష్యం నెరవేరలేదు. ఇథనాల్‌కు కొరత చక్కెర పరిశ్రమల్లో ఉప ఉత్పత్తిగా ఇథనాల్ తయారవుతోంది. వివిధ కారణాల వల్ల చెరకు దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇథనాల్ ఉత్పత్తి తగ్గిపోతోంది. ఇథనాల్‌ను లిక్కర్ తయారీలో ఉపయోగించడం, లిక్కర్ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండటంతో ఆ ప్రభుత్వాలు ఇథనాల్‌పై అధిక పన్నులు వసూలు చేస్తున్నాయి. చక్కెర కంపెనీలు కూడా ఇథనాల్‌ను డిస్టిలరీలకు (ఎక్కువ ధర లభిస్తుండటం వల్ల) అమ్మడానికే మొగ్గు చూపుతున్నాయి.దాంతో చమురు కంపెనీలకు కావలసినంత ఇథనాల్ దొరకడం లేదు.ఈ సమస్యను అధిగమించడం కోసం ప్రభుత్వం 2018 నాటి జాతీయ జీవ ఇంధన విధానంలో కొన్ని వెసులుబాట్లు కల్పించింది. చక్కెర కర్మాగారాలు చక్కెరను తయారు చేయకుండానే ఇథనాల్‌ను తయారు చేయడానికి అనుమతి ఇచ్చింది.అలాగే,సంప్రదాయంగా వస్తున్న మొలాసిస్ నుంచే కాకుండా ఇతర జీవ వ్యర్థాలు, కుళ్లిన బంగాళాదుంపలు, పాడైపోయిన ధాన్యం, గోధుమ, జొన్న, తవుడు మొదలైన వాటి నుంచి కూడా ఇథనాల్ తయారీకి అవకాశాలు కల్పించింది. రెండో తరం ఇథనాల్ గోధుమ పొట్టు, తవుడు, పంట వ్యర్థాల నుంచి తయారు చేసే ఇథనాల్‌ను రెండోతరం ఇథనాల్‌గా పిలుస్తారు. ఈ రకం ఇథనాల్ తయారీకి చమురు సంస్థలు 12 రెండో తరం ఇథనాల్ రిఫైనరీలను దేశంలో ఆంధ్ర ప్రదేశ్ సహా11 రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నాయి.వీటి ఏర్పాటుకు 10,000 కోట్లు వెచ్చిస్తున్నాయి. పెట్రోల్‌లో ఇథనాల్‌ని కలుపుతూ వాడుతున్న రాష్ట్రాలు 21 కేంద్ర పాలిత ప్రాంతాలు 4 ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న ఇథెనాల్ 300 కోట్ల లీటర్లు ఇందులో 130 కోట్ల లీటర్లను లిక్కర్ తయారీకి వినియోగిస్తున్నారు మిగిలిన 170 లీటర్లలో 60 నుంచి 80 శాతం రసాయనాల తయారీకి వాడుతున్నారు. 100 నుంచి 120 కోట్ల లీటర్లు మాత్రమే పెట్రోలులో కలపడానికి అందుబాటులో ఉంది ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకాన్ని పెంచడం కోసం ఇథనాల్‌పై 18 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది -
భారాన్ని ఇథనాల్‌తో తగ్గిద్దాం!
న్యూఢిల్లీ: వచ్చే నాలుగేళ్లలో ఇథనాల్ ఉత్పత్తిని మూడింతలు పెంచాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. చెరకు నుంచి సంగ్రహించే ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం వల్ల ఇంధన దిగుమతులకు వెచ్చిస్తున్న వ్యయంలో రూ.12 వేల కోట్లను ఆదాచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. దేశ వ్యాప్తంగా రూ.10 వేల కోట్ల వ్యయంతో 12 జీవ ఇంధన శుద్ధి కర్మాగారాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. పంట అవశేషాలు, పట్టణ ప్రాంతాల వ్యర్థాల నుంచి ఈ కేంద్రాలు ఇంధనాన్ని తయారుచేస్తాయని తెలిపారు. స్వచ్ఛ భారత్, రైతుల ఆదాయం రెట్టింపునకు జీవ ఇంధనాలు సహకారం అందిస్తాయన్నారు. అభివృద్ధి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులిచ్చే సింగిల్ విండో వెబ్ పోర్టల్ ‘పరివేశ్’ను ప్రారంభించారు. రైతుకు ఆదాయం, యువతకు ఉపాధి.. జీవ ఇంధనాలు పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, ముడిచమురుపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు, రైతులకు అదనపు ఆదాయం సమకూరడంలో అవి దోహదపడతాయన్నారు. ‘2013–14లో పెట్రోల్‌లో కలిపిన ఇథనాల్ పరిమాణం 38 కోట్ల లీటర్లు ఉండగా, 2017–18 నాటికి 141 కోట్ల లీటర్లకు చేరింది. దీంతో ఇంధన దిగుమతుల బిల్లులో రూ.4 వేల కోట్లు ఆదా అయ్యాయి’ అని మోదీ అన్నారు. -
ఫ్లెక్స్ ఇంజిన్ బైక్స్ వస్తున్నాయి
సాక్షి, న్యూఢిల్లీ : ఫ్లెక్స్ ఇంజిన్ బైక్స్ త్వరలో భారత్ మార్కెట్లోకి రానున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రెండు బైక్స్ కంపెనీలు ఎలక్ట్రిక్, ఫ్లెక్స్ ఇంజిన్ బైక్‌లను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. జనవరి నెలాఖరులోగా బైక్స్‌ను మార్కెట్లోకి తెస్తామని రెండు కంపెనీలు చెప్పాయని తెలిపారు. ఏంటీ ఫ్లెక్స్ ఇంజిన్? రెండు రకాల ఇంధనాలను ఫ్లెక్స్ ఇంజిన్‌లో వినియోగించొచ్చు. పెట్రోల్, ఇథనాల్‌లతో ఫ్లెక్స్ ఇంజిన్ బైక్స్ నడుస్తాయి. పెట్రోల్ వినియోగాన్ని క్రమంగా తగ్గించాలనే వ్యూహంలో భాగంగా ఇథనాల్‌ను ప్రత్యామ్నాయంగా వినియోగించాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. క్రూడ్ ఆయిల్ కోసం ప్రతి ఏటా రూ. 7 లక్షల కోట్లను ఖర్చుచేస్తున్నామని, ఇందులో కనీసం రూ. 2 లక్షల కోట్లను ఇథనాల్ వైపు మళ్లించినా వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చినట్లు అవుతుందని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఒక టన్ను వరి పొట్టు నుంచి 280 లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేయొచ్చని తెలిపారు. ఇథనాల్ కేవలం దిగుమతుల ప్రత్యామ్నాయం కాదని చెప్పుకొచ్చిన గడ్కరీ.. ఇథనాల్ కాలుష్య రహితం అని చెప్పారు. గోధుమ పొట్టు, వెదురు చెట్ల నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయొచ్చు. ఇథనాల్ ఉత్పత్తి పెరిగేందుకు అందుకు అనుకూలమైన పంటలను వేయాలని చెప్పారు. అమెరికా, బ్రెజిల్, కెనడాల్లో మెర్సిడెజ్, బీఎండబ్ల్యూ, టయోటా కార్లు ఫ్లెక్స్ ఇంజిన్‌తో నడుస్తున్నాయని వెల్లడించారు. -
మందు ‘వాసన’ పట్టేస్తుంది!
ఫొటోలో కనిపిస్తున్నది ఏదైనా స్మార్ట్ వాచ్ అనుకుంటున్నారా? ఊహూ కానేకాదు. ఇదో వినూత్నమైన పరికరం. ఒళ్లు తెలియకుండా మద్యం తాగేవారికి, దాని పర్యవసానాలు తెలిసినా అలవాటు వదులుకోలేక పోతున్న వారికీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పరికరం పేరు ‘స్కిన్’. దీన్ని చేతికి తొడుక్కుంటే చాలు.. మీరు ఎప్పుడు మద్యం తాగినా రక్తంలో ఎంత ఆల్కహాల్ ఉన్నది ఇట్టే చెప్పేయడమే దీని ప్రత్యేకత. మితంగా తాగాలనుకున్న వారికి... డ్రంకన్ డ్రైవ్‌లో పోలీసులకు పట్టుబడి అభాసు పాలు కాకూడదనుకున్న వారికి ఇది బాగా పనికొస్తుందన్న మాట. తాగిన మద్యంలో కొంతభాగం ఇథనాల్ రూపంలో చెమట ద్వారా విడుదల అవుతుంది. ‘స్కిన్’లో ఉండే సెన్సర్ ఈ ఇథనాల్‌ను పసిగట్టి రక్తంలో ఉన్న ఆల్కహాల్ మోతాదును లెక్కిస్తుందన్న మాట. అసలు చిక్కేంటంటే మద్యం సేవించాక కనీసం 45 నిమిషాల తర్వాత గానీ ఇది గుర్తించదు. ఎందుకంటే అప్పుడు కానీ ఇథనాల్ చెమటలోకి చేరదు. చెమటలోకి చేరితే కాని ఇది పనిచేయదు. శాన్ఫ్రాన్సిస్కోలోని బ్యాక్‌ట్రాక్ అనే కంపెనీ అభివృద్ధి చేసిన ఈ గాడ్జెట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.