న్యూఢిల్లీ: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే లక్ష్యాన్ని 2025 నాటికే సాధిస్తామని పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్‌పురి తెలిపారు. ముందుగా నిర్దేశించుకున్న 2030తో పోలిస్తే ఐదేళ్లు ముందుగానే చేరుకుంటామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ విక్రయాలను ఈ ఫిబ్రవరిలో ప్రయోగాత్మకంగా ఆరంభించడం గమనార్హం.
కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, పెట్రోల్ దిగుమతుల భారాన్ని తగ్గించుకోవాలన్న రెండు లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం 10 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. వచ్చే ఏడాదికే 20 శాతం పెట్రోల్‌ను సరఫరా చేయగలమన్న నమ్మకంతో ఉన్నట్టు పురి చెప్పారు. పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ మిశ్రమంతో రూ.41,500 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఒక ఏడాదిలో ఆదా అవుతుండగా, దేశీయ రైతులకు, పరిశ్రమలకు ఈ మేరకు ప్రయోజనం లభించనుంది.
చెరకు, విరిగిన, తినడానికి అనుకూలం కాని బియ్యంతో ఇథనాల్‌ను ప్రస్తుతం మన దేశంలో తయారు చేస్తున్నారు. 20 శాతం ఇథనాల్ కలపడం వల్ల ద్విచక్ర వాహనాల నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలను 50 శాతం, నాలుగు చక్రాల వాహనాల నుంచి 30 శాతం మేర తగ్గించొచ్చని అంచనా. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. 2021–22లో ముడి చమురు దిగుమతుల కోసం మన దేశం 120.7 బిలియన్ డాలర్లు వెచ్చించింది.
Comments
Please login to add a commentAdd a comment