మరింత చెరకుతోనే అనుకున్న లక్ష్యం | 20 percent ethanol in petrol in india | Sakshi
Sakshi News home page

మరింత చెరకుతోనే అనుకున్న లక్ష్యం

Published Wed, Aug 21 2024 10:57 AM | Last Updated on Wed, Aug 21 2024 11:48 AM

20 percent ethanol in petrol in india

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌  

ఈ ఏడాదిలో సాధించాలనుకుంటున్న కేంద్రం 

 కీలక సూచనలు చేసిన క్రిసిల్‌ రేటింగ్స్‌ 

 గత సీజన్‌లో 14 శాతానికి చేరిక

ముంబై: పెట్రోల్‌లో 20% మేర ఇథనాల్‌ మిశ్రం లక్ష్యాన్ని 2025 సరఫరా సంవత్సరంలోనే సాధించాలంటే అందుకు మరింత చెరకు వినియోగించాల్సి ఉంటుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ తెలిపింది. దీనివల్ల మిల్లర్లకు నగదు ప్రవాహాలు మెరుగవుతాయని పేర్కొంది. నవంబర్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఇథనాల్‌ సరఫరా సంవత్సరంగా (ఈఎస్‌వై) పరిగణిస్తుంటారు. ఈ ఏడాది అక్టోబర్‌ వరకు.. ఈఎస్‌వై 2025 సీజన్‌ పరిధిలోకి వస్తుంది. ఈఎస్‌వై 2025 నాటికి పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ను కలపాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. ‘‘ఇందుకు ఏటా 990 కోట్ల లీటర్ల ఇథనాల్‌ అవసరం. 

ఇందుకు చెరకుతోపాటు, గ్రెయిన్‌(ధాన్యాలు)ను సైతం వినియోగించుకోవడం ద్వారానే సరఫరా మెరుగుపడుతుంది’’అని క్రిసిల్‌ రేటింగ్స్‌ తన తాజా నివేదికలో వివరించింది. ధాన్యం ద్వారా వార్షిక ఇథనాల్‌ ఉత్పత్తి గణనీయంగా పెరిగి వచ్చే సీజన్‌ నాటికి 600 కోట్ల లీటర్లకు చేరుకుంటుందని క్రిసిల్‌ తెలిపింది. ప్రస్తుత సీజన్‌లో ఇది 380 కోట్ల లీటర్లుగా ఉంటుందని అంచనా. మిగిలిన మేర చెర కు వినియోగం ద్వారా ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. 

మిల్లుల్లో గణనీయమైన త యారీ సామర్థ్యం కారణంగా అది సాధ్యమేనని అభిప్రాయపడింది. చక్కెర నిల్వలను ఇథనాల్‌ త యారీకి మళ్లించకుండా, ఎగుమతులు చేయకుండా కేంద్రం నిషేధం విధించడంతో నిల్వలు పెరగడా న్ని క్రిసిల్‌ నివేదిక ప్రస్తావించింది. ఈ నిల్వలను ఇథనాల్‌ తయారీకి అనుమతించాలని సూచించింది.   

పెట్రోల్‌ దిగుమతులు తగ్గించుకోవచ్చు.. 
20 శాతం ఇథనాల్‌ను కలపడం ద్వారా పెట్రోల్‌ దిగమతులపై ఆధారపడడాన్ని భారత్‌ తగ్గించుకోవచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ తెలిపింది. ఈఎస్‌వై 2021 నుంచి ఏటా పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమం 2–3 శాతం మేర పెరుగుతూ వస్తున్నట్టు వెల్లడించింది. ‘‘ఇథనాల్‌ తయారీకి ఆహార ధాన్యాల వినియోగంపై కేంద్రం ఎలాంటి నియంత్రణలు విధించలేదు. కాకపోతే డిమాండ్‌–సరఫరా అంచనాల ఆధారంగా ఎంత మేర చెరకును ఇథనాల్‌ కోసం వినియోగించుకోవాలన్నది సీజన్‌కు ముందు నిర్ణయిస్తుంది. 

గతేడాది వర్షాలు సరిగ్గా లేకపోవడంతో ఈ ఏడాది సీజన్‌లో చెరకు ఉత్పత్తిపై ప్రభావం పడింది’’అని క్రిసిల్‌ రేటింగ్స్‌ తెలిపింది. దీంతో ఈ సీజన్‌లో చెరకు ఆధారిత ఇథనాల్‌ ఉత్పత్తి 250 కోట్ల లీటర్లకు పరిమితం కావచ్చని అంచనా వేసింది. ధాన్యాల ద్వారా ఇథనాల్‌ తయారీ 40 శాతం పెరగడంతో ఈఎస్‌వై 2024 సీజన్‌లో పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమం 14 శాతానికి చేరినట్టు వివరించింది. చెరకు నుంచి ఇథనాల్‌ తయారీ తగ్గడాన్ని ఇది భర్తీ చేసినట్టు తెలిపింది.

భారీ స్థాయిలో చెరకు అవసరం
ఈఎస్‌వై 2025 సీజన్‌లోనే పెట్రోల్‌లో 20 % ఇథనాల్‌ లక్ష్యాన్ని సాధించాలంటే 4 మి లియ న్‌ టన్నుల చక్కెర తయారీకి సరిపడా చెరకును ఇథనాల్‌ కోసం కేటాయించాల్సి ఉంటుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ పూనమ్‌ ఉపాధ్యాయ తెలిపారు. ఈఎస్‌వై 2025 సీజన్‌లో స్థూల చక్కెర ఉత్పత్తి 33.5 మిలియన్‌ టన్నులుగా ఉంటుందని, చక్కెర వినియోగం 29.5 మిలియన్‌ టన్నుల స్థాయిలో ఉండొచ్చని క్రిసిల్‌ నివేదిక పేర్కొంది. ఈ సీజన్‌ చివరికి చక్కెర నిల్వలు మెరుగైన స్థాయి లో ఉంటాయంటూ.. ఇథనాల్‌ తయారీకి సరిపడా చెరకును అనుమతించాలని సూచించింది. దీంతో  చక్కెర నిల్వలనూ తగిన స్థాయిలో వినియోగించుకోవడానికి వీలు కలుగుతుందని పేర్కొంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement