
దేశీయ ఇంధన అవసరాలు తీర్చడానికీ, ఇంధన దిగుమతి భారం తగ్గించడానికీ, వాయు, కర్బన కాలుష్యాలను తగ్గించడానికీ ఇథనాల్ కలిపిన పెట్రోలు పరిష్కారమని భారత ప్రభుత్వం ఎన్నో వెసులు బాట్లు కల్పించి ప్రోత్సహిస్తున్నది. ఆహార ధాన్యాలైన బియ్యం, గోధుమలు, మొక్కజొన్నల నుండి ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి సత్వర పర్యావరణ అనుమతులూ, సబ్సిడీలూ, వడ్డీ రాయితీతో రుణాలూ మంజూరు చేసి 2025 నాటికి 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నది.
ఇథనాల్‌ను పెట్రోలుకు కలపడం కొత్తేమీ కాదు. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుండీ వాడుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, ఇతర ఐరోపా దేశాలూ; కెనడా, చైనా కూడా మిశ్రమ ఇంధనాన్ని ప్రస్తుతం వాడుతున్నాయి.
శాస్త్రీయ అధ్యయనాలు ఇథనాల్‌ను ఇంధనంగా వాడడం లోని నష్టాలను వెలుగులోకి తెచ్చాయి. 2023 మార్చి13న ఐపీసీసీ విడుదల చేసిన నివేదిక, తాపం పెరుగుదల 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించకుండా నిరోధించడానికి శిలాజ ఇంధనాలకు సత్వర ముగింపు పలకాలని స్పష్టం చేసింది. కొత్తగా నిర్మిస్తున్న ఇథనాల్ ప్లాంట్లు కనీసం 30 ఏళ్లు పని చేస్తాయి. మరి 2070 నాటికి నికర జీరో కర్బన ఉద్గారాలెలా సాధ్యమవుతాయి?
అమెరికా ప్రభుత్వ శక్తి (ఎనర్జీ) విభాగం ‘ఇ20... పెట్రోల్ కంటే 7.7 శాతం తక్కువ ఇంధన శక్తి కలిగి ఉంటుందని’ నిర్ధారించింది. ఒక లీటరు పెట్రోల్... 1.073 లీటర్ల మిశ్రమ ఇంధనానికి సమానం. పరిశీలనల్లో పెట్రోలునూ, మిశ్రమ ఇంధనాన్నీ వాడినప్పుడు దాదాపు కర్బన ఉద్గారాలు అదేస్థాయిలో ఉంటాయని తేలింది. ప్రతి ఇథనాల్ ప్లాంట్‌కీ ఒక బొగ్గుతోకానీ, బయోమాస్‌తో కానీ నడిచే పవర్ ప్లాంట్‌కు అనుమతిస్తున్నారు.
వాటి ఉద్గారాలు అదనం. ఇంకా ప్రతి లీటరు ఇథనాల్ ఉత్పత్తికి 0.76 కిలోల కార్బన్– డై–ఆక్సైడ్ విడుదలవుతుంది. దానిని పూర్తిగా పట్టి గాలిలో చేరకుండా ఆపే వ్యవస్థ లేదు. అంటే మొత్తం ఉత్పత్తయిన కార్బన్– డై–ఆక్సైడ్ చివరికి గాలిలోకి చేరుతుంది. భూతాపానికి దోహద పడుతుంది. అంటే లక్ష్యం తిరగబడుతుందన్న మాట.
చమురు దిగుమతుల ఆర్థిక భారం తగ్గించడానికి ఇథనాల్ ఇంధనం పరిష్కారంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇ10 ఇంధనం అందుబాటులోకి వచ్చింది. అయినా పెరుగుతున్న డిమాండ్ వల్ల చమురు దిగుమతి భారం తగ్గ లేదన్నది స్పష్టం. విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెరిగింది కాని తగ్గ లేదు.
ఇంకా తగిన ఇథనాల్ ఉత్పత్తి లేక ఇథనాల్ దిగుమతి కూడా పెరిగింది. దేశీయ చమురు ఉత్పత్తులు గణనీ యంగా క్షీణిస్తున్నందునా, చమురు వినియోగం పెరుతున్నందునా, ఇథనాల్ కలపడం చమురుపై ఆధారపడడం నుండి విముక్తం చేయదు. కర్బన ఉద్గారాలు పారిస్ ఒప్పందానికి అనుగుణంగా తగ్గవు.
చెరకు, బియ్యం, మొక్క జొన్నల నుండి ఇథనాల్ ఉత్పత్తి నీటి వనరులపై భారం పెంచుతుంది. ఇథనాల్ ప్లాంట్‌ల ప్రతిపాదనలు లీటర్ ఇథనాల్‌కు 8 నుండి 10 లీటర్ల నీరు కావాలంటున్నాయి. చెరకు నుండి లీటరు ఇథనాల్ ఉత్పత్తికి దాదాపు మూడు వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. ఆహార పంటలను ఇంధన ఉత్పత్తికి తరలించడం వల్ల అదనపు భూమిని సాగులోకి తేవలసి వస్తుంది. దానివల్ల భూవిని యోగం మార్పు వస్తోంది.
అందువల్ల ఉద్గారాలు పెరుగుతాయి. భూతాపం వల్ల పంటల దిగుబడి గణనీయంగా తగ్గడంతో ఆహార కొరత సమస్య ఉత్పన్నమవుతుంది. రైతులకు ఇథనాల్ ఉత్పత్తితో ఒరిగేదేమీ లేదు. ప్రభుత్వమే సబ్సిడీ ధరకు కంపెనీలకు బియ్యం సరఫరా చేస్తుంది. కిలో బియ్యం రూ. 20కు ఇస్తున్నది. అంటే కిలోకు రూ.17 సబ్సిడీ ఇస్తున్నది. ఒక లీటరు ఇథనాల్ ఉత్పత్తికి 2.22 కిలోల బియ్యం సబ్సిడీ ధరకు ఇస్తున్నారు.
లీటరు ఇథనాల్ ఉత్పత్తికి బియ్యంపై రాయితీ రూ. 37.74. ఎఫ్‌సీఐ సరఫరా ధర రూ. 37 కు బియ్యం కొంటే లీటరు ఇథనాల్‌కు కావలసిన బియ్యం ధర రూ. 83.78. ప్రభుత్వం నిర్ణయించిన ఇథనాల్ ధర లీటరుకు 56.87. లీటరు పెట్రోలుకు ఇంధన శక్తిలో సమాన మైన 1.51 లీటర్ల ఇథనాల్ ఉత్పత్తికి వాడే బియ్యం ఖరీదు రూ.126.5. ఆ పైన ఉత్పత్తి ఖర్చులు ఎటూ ఉంటాయి.
అంటే మిశ్రమ ఇంధనం పెట్రోలు కంటే ప్రియమన్న మాట. ప్రస్తుతం రోడ్డుపైనున్న వాహనాలేవీ ఇ20 ఇంధనాన్ని వాడ డానికి పనికిరావు. కొత్తగా వచ్చే వాహనాలను అందుకు అను వుగా రూపొందించినా ఇ20 అవసరం తక్కువే ఉంటుంది. అనువుగా మార్చని వాహనాలలో ఇ20 వాడితే ఇంజన్‌కు జరిగే నష్టం గణనీయం. ఇథనాల్ ఇంధనంతో జాతికీ, వాతావరణానికీ ప్రయోజనమేమిటో చర్చ జరగాలి.
– డా‘‘ కలపాల బాబూరావు, విశ్రాంత శాస్త్రవేత్త
Comments
Please login to add a commentAdd a comment