నిర్మల్: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాకర్టీ ఏర్పాటుపై స్థానికులు చేపట్టిన ఆందోళనలతో అధికార యంత్రాంగం దిగొచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా తాజాగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో.. ఐదుగురు రైతులను జిల్లా కలెక్టర్ చర్చలకు పిలిచారు.
దిలావర్‌పూర్ ఇథనాల్ పరిశ్రమ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన అనుమతులు పునఃసమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు పరిశీలిస్తోంది. అవసరమైతే ఇథనాల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది అని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
దాదాపు రెండు రోజులుగా ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకంగా దిలావర్పూర్ గ్రామస్థులు నిరసనల్లో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం నుంచి ఆ నిరసనలు ఉధృతం చేశారు. నిన్న రాత్రి రోడ్డుపైనే వంటలు చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వారంతా రోడ్డుపైనే భోజనం చేశారు.
ఇవాళ మహిళలు పురుగుల మందు డబ్బాలతో నిరనసల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కొందరిని ముందస్తుగా అరెస్ట్ చేయడంతో పోలీసులపై ఆందోళనకారులు దాడి చేశారు. పోలీసుల వాహనాలపైకి రాళ్లు విసిరారు. దీంతో, పోలీసులు పరుగులు తీశారు. అనంతరం, అక్కడ ఉద్రిక్తతకర పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వచ్చే వరకు తమ నిరసనలను కొనసాగిస్తామని గ్రామస్థులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
ప్రభుత్వం సీరియస్
మరోవైపు.. ఇథనాల్ పరిశ్రమ అనుమతులను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులు పునఃసమీక్షించాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఇథనాల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment