
న్యూఢిల్లీ: పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ ధరల్ని కేంద్రం పెంచింది. వచ్చే ఏడాది నుంచి పెట్రోల్‌లో 12 శాతం ఇథనాల్ కలిపేలా చర్యలు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) పలు నిర్ణయాలు తీసుకుంది. వివరాలను కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి మీడియాకు తెలిపారు. ‘‘మూడు రకాల ఇథనాల్ ధరల్ని పెంచాం. చెరుకు రసం నుంచి తీసే ఇథనాల్ లీటర్‌కు రూ.63.45 నుంచి రూ.65.61కి సి–హెవీ మోలాసెస్ నుంచి తీసే ఇథనాల్ రూ.46.66 నుంచి రూ.49.41కు, బి–హెవీ రూట్ నుంచి వచ్చే ఇథనాల్ లీటర్ రూ.59.08 నుంచి రూ.60.73కు పెరుగుతాయి’’ అన్నారు.
ఎరువులపై రూ.51,875 కోట్ల సబ్సిడీ
2022–23 ఆర్థిక సంవత్సరంలో రబీ సీజన్‌కు ఫాస్మాఫాటిక్ పొటాసిక్ (పీ అండ్ కే) ఎరువులపై రూ.51,875 కోట్ల సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నైట్రోజన్‌పై కేజీకి రూ.98.02, ఫాస్ఫరస్‌పై కేజీకి రూ.66.93, పొటాష్‌పై కేజీకి రూ.23.65, సల్ఫర్‌పై కేజీకి రూ.6.12 సబ్సిడీని ఇస్తూ నిర్ణయం తీసుకుంది. డెన్మార్క్‌తో నీటి వనరుల సంరక్షణ, నిర్వహణకు అవగాహనా ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.