Economic affairs
-
చైనాలో ఆర్థిక మాంద్యం?.. నిజాలు వెళ్లగక్కిన జిన్‌పింగ్!
నూతన సంవత్సరం తొలి రోజున చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు గురించి మాట్లాడారు. దేశంలోని ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఆయన స్వయంగా అంగీకరించారు. దేశ ప్రజలు నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన అన్నారు. నూతన సంవత్సర సందేశంలో జీ జిన్‌పింగ్ దేశ ఆర్థిక సవాళ్లను ప్రస్తావించడం ఇదే మొదటిసారి. జీ జిన్‌పింగ్ గడచిన పదేళ్లుగా అంటే 2013 నుండి నూతన సంవత్సరం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా తర్వాత చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయినప్పటికీ పెరుగుతున్న నిరుద్యోగం, తగ్గుతున్న వ్యాపార డిమాండ్ కారణంగా చైనా మాంద్యంతో పోరాడుతోంది. జీ జిన్‌పింగ్ తన టెలివిజన్ ప్రసంగంలో మాట్లాడుతూ దేశంలో కొన్ని వ్యాపారరంగాలు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయని అన్నారు. జనం ఉద్యోగాలు దొరక్క, కనీస అవసరాలు తీరక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు తన మనసులో ఎప్పుడూ తిరుగాడుతుంటాయని జీ జిన్‌పింగ్ అన్నారు. ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయడానికి, బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా జీ జిన్‌పింగ్ ప్రసంగానికి కొన్ని గంటల ముందు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ)కి సంబంధించిన డేటాను విడుదల చేసింది. చైనాలో గడచిన డిసెంబర్లో పారిశ్రామిక కార్యకలాపాలు ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయని ఆ డేటా వెల్లడించింది. నవంబర్‌లో 49.4గా ఉన్న పీఎంఐ గత నెలలో 49కి పడిపోయింది. చైనా పీఎంఐ క్షీణించడం ఇది వరుసగా మూడోసారి. గత సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాల్లో స్వల్ప పెరుగుదల తర్వాత, అధికారిక పీఎంఐ సెప్టెంబర్ వరకు వరుసగా ఐదు నెలల పాటు 50 కంటే తక్కువగా ఉంది. -
Recession: ముందు నుయ్యి... వెనుక గొయ్యి
పెట్టుబడిదారీ వ్యవస్థ డొల్లతనం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు మరణశాసనం లిఖిస్తోంది. సాంకేతిక పురోగతి వేగం పుంజుకున్న కొద్దీ నిరుద్యోగం పెరుగుదల, వృద్ధి రేటు పతనం వంటి రూపాలలో ప్రజల జీవితం అతలాకుతలం అవుతోంది. ఆదాయం తగ్గిపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి వస్తు సేవల వినియోగం తగ్గిపోతోంది. ఈ స్థితిలో ప్రజల కొనుగోలుశక్తిని పెంచడం కోసం ప్రభుత్వాలు కరెన్సీ ముద్రిస్తున్నాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ద్రవ్యోల్బణం తగ్గించడానికి వడ్డీరేట్లు పెంచుతున్నారు. దీంతో ఉత్పాదకత తగ్గిపోతోంది. మొత్తం మీద ఒక అనివార్య చక్రబంధంలో పెట్టుబడిదారీ దేశాలు చిక్కుకు పోయాయి. ప్రపంచ పెట్టుడిదారీ వ్యవస్థ ఇప్పటి వరకూ వాయిదా వేసిన తన అధికారిక మరణ ప్రకటనను నేడు ముఖాముఖి ఎదుర్కోక తప్పని స్థితి ఏర్పడింది. నిజానికి వ్యవస్థ తాలూకు అంతిమ వైఫల్యం 3, 4 దశాబ్దాల క్రితమే నిర్ధారణ అయిపోయింది. 1979ల తర్వాత పెట్టుబడి దారి ధనిక దేశాలలో ఆయా వ్యవస్థలు ఇక ఎంత మాత్రమూ ప్రజలకు ఉపాధిని కల్పించలేని పరిస్థితులు వేగవంతం అయ్యాయి. దీనికి కారణాలుగా అప్పటికే పెరిగిపోసాగిన యాంత్రీకరణ; ఈ దేశాలలో కార్మికులు, ఉద్యోగుల వేతనాలు అధికంగా ఉన్నాయి గనుక అక్కడి నుంచి పరిశ్రమలు చైనా వంటి చౌక శ్రమ శక్తి లభించే దేశాలకు తరలిపో నారంభించడం వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధనిక దేశాలు అన్నీ, మరీ ముఖ్యంగా అమెరికా వంటివి తమ పారిశ్రామిక పునాదిని కోల్పోయాయి. అలాగే 1990ల అనంతర సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ విప్లవా లతో ఈ దేశాలలోని సేవారంగం కూడా (ఐటీ, బీపీఓ) భారత దేశం వంటి దేశాలకు తరలిపోయింది. ఈ క్రమంలోనే ఆయా ధనిక దేశాలలోని ప్రజలకు ఇక ఎంత మాత్రమూ ఉపాధి కల్పించలేని ప్రభుత్వాలూ, వ్యవస్థలూ ఆ ప్రజలలో అసంతృప్తి జ్వాలలు రగులకుండానూ, వారి కొనుగోలు శక్తి పతనం కాకుండానూ కాపాడుకునేందుకు దశాబ్దాల పాటు క్రెడిట్ కార్డుల వంటి రుణ సదుపాయాలపై ఆధారపడ్డాయి. అలాగే 1990లలో యావత్తూ... సుమారు 2001 వరకూ ఇంటర్నెట్ ఆధారిత హైటెక్ కంపెనీల షేర్ల విలువలలో భారీ వృద్ధి ద్వారా జరిగిన షేర్ మార్కెట్ సూచీల పెరుగుదల పైనా వ్యవస్థలు నడిచాయి. ఇక చివరగా 2003 తర్వాతి కాలంలో... 2008 వరకూ రియల్ ఎస్టేట్ బూమ్‌పై ఆధారపడి ప్రజల కొనుగోలు శక్తి కొనసాగింది. అంతిమంగా 2008 చివరిలో ఈ రియల్ బుడగ పగిలిపోవడంతో వ్యవస్థలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు వేరే దారిలేక ఈ ధనిక దేశాలన్నీ ప్రజల కొనుగోలు శక్తిని నిలబెట్టేందుకు, ఉద్దీపన రూపంలో కరెన్సీల ముద్రణను మార్గంగా ఎంచుకున్నాయి. దీంతో ధనిక దేశాలన్నింటిలోనూ ద్రవ్యోల్బణం 4 దశాబ్దాల రికార్డు స్థాయికి చేరింది. ఈ ద్రవ్యోల్బణ పరిస్థితికి మరో ముఖ్యమైన కారణం ధనిక దేశాలలో దేశీయంగానే సరుకులూ, సేవల ఉత్పత్తి తాలూకూ పారిశ్రామిక పునాదులు లేకపోవడం. ఫలితంగా ఈ దేశాలలో ముద్రించబడిన డబ్బు, అవి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోన్న సరుకులు, సేవలకు ఖర్చవుతోంది. అందుకే ద్రవ్యోల్బణం తగ్గడంలేదు. దాంతో ప్రస్తుతం దరిదాపు అన్ని ధనిక దేశాలూ ద్రవ్యోల్బణం అదుపు కోసం బ్యాంకు వడ్డీ రేట్లను పెంచసాగాయి. ఈ క్రమంలో పెరిగిన వడ్డీ రేట్ల వలన ఆయా దేశాలలో రుణ స్వీకరణ తగ్గిపోతోంది. ఇది వేగంగా ప్రజల కొనుగోలు శక్తి పతనానికీ... అంటే అంతిమంగా వృద్ధి రేటు పతనానికీ దారితీస్తోంది. అదీ కథ! అంటే ఆర్థిక మాంద్య స్థితిలో ఉద్దీపన కోసం కరెన్సీలు ముద్రిస్తే రెండో ప్రక్కన ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. అలాగని వడ్డీ రేట్లను పెంచితే తక్షణమే ఆర్థిక వృద్ధి రేటు పడిపోయి నిరుద్యోగం పెరుగుతోంది. కొద్ది నెలల క్రితం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే పేరిట అమెరికాలో వడ్డీ రేట్లు పెంచగానే తర్వాతి త్రైమాసిక కాలం నుంచీ ఆర్థిక వృద్ధి రేటు అకస్మాత్తుగా పడిపోసాగింది. వ్యవస్థ పరిమితులలో పరిష్కారం సాధ్యంకాని చిక్కుముడిగా... వైరుధ్యంగా ఈ పరిస్థితి తయారయ్యింది. ముందు నుయ్యి... వెనుక గొయ్యి స్థితి ఇది. స్థూలంగానే... ఆయా ధనిక దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థిక సంక్షోభ కాలంలో ఉద్దీపనలు లేదా వాటి ద్వారా ప్రభుత్వమే పూను కొని (ప్రైవేటు పెట్టుబడి దారులకు బదులు) ఉపాధి కల్పన చేసి వ్యవస్థను తిరిగి గట్టెక్కించే అవకాశాలు నేడు సన్నగిల్లి పోయాయి. యాంత్రీకరణ వేగం పెరగడం... విపరీతమైన స్థాయిలో మర మనుషుల వినియోగం పెరగడం వంటి వాటి వలన నేడు ఈ దేశాలలో ఉపాధి కల్పనకు అవకాశాలు ఇక ఎంత మాత్రమూ లేకుండా పోతున్నాయి. వాస్తవంలో నేటి ప్రపంచంలో జరిగిన... జరుగుతోన్న హైటెక్ సాంకేతిక విప్లవం ప్రజల జీవితాలను మరింత మెరుగు పరచాల్సింది. ఎందుకంటే ప్రతి కొత్త సాంకేతిక ఆవిష్కరణ ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి భారీగా ఉత్పత్తిని పెంచి తద్వార జన జీవితాన్ని మరింత సులువైనదిగా, సంపన్నవంతమైనదిగా మార్చ గలగాలి. కానీ ఇప్పుడు జరుగుతోంది... సాంకేతిక పురోగతి వేగం పుంజుకున్న కొద్దీ నిరుద్యోగం పెరుగుదల... వృద్ధి రేట్ల పతనం వంటి రూపాలలో ప్రజల జీవితం అతలాకుతలం అవుతోంది. అంటే కమ్యూనిస్టు సిద్ధాంతకారుడు కారల్ మార్క్స్ పరిభాషలో చెప్పాలంటే... నేడు జరుగుతోంది ఉత్పత్తి శక్తులు ఎదుగుతున్న కొద్దీ అవి ప్రజలకు మేలుచేయక పోగా... వినాశకరకంగా మారడమే. ఈ పరిస్థితికి కారణం నేటి వ్యవస్థ తాలూకు కీలక చలన సూత్రం లాభాల కోసం మాత్రమే పెట్టుబడులు పెట్టడం. అంటే ఇక్కడ... ఈ వ్యవస్థలో నిర్జీవమైన డబ్బును... లాభార్జన ద్వారా... మరింత అధిక డబ్బుగా మార్చడం అనేదే ప్రాథమిక సూత్రం. దీనిలో ప్రాణం ఉన్న మనుషులు... ప్రాణం లేని పెట్టుబడీ, దాని తాలూకు లాభాల కోసం పని చేస్తున్నారు. అందుచేత ఇక్కడ మనుషుల స్థానంలో యంత్రాలను పెట్టుకొని లాభాలు సంపాదించుకోగలిగితే అది పెట్టుబడి దారులకు మహా సంతోషం. అలాగే ఈ పెట్టుబడిదారులు తమ ఈ ఆలోచనా విధానం వలన ఏర్పడిన ఆర్థిక మాంద్యాల కాలంలో ప్రజల కొనుగోలు శక్తి, డిమాండ్ పడిపోయినప్పుడు ఆ స్థితి నుంచి వ్యవస్థను గట్టెక్కించేందుకు ఇక ఎంత మాత్రమూ కొత్తగా పెట్టుబడులు పెట్టరు. అప్పుడు ప్రభుత్వాలు రంగంలోకి దిగి ప్రజల కొనుగోలు శక్తిని కాపాడవలసి రావడమే ప్రతి ఆర్థిక మాంద్య కాలంలోనూ జరిగింది. అయితే 1980ల నుంచి ప్రపంచవ్యాప్తంగా అమలులోకి వచ్చిన నయా ఉదారవాద సంస్కరణలు కనీసం ప్రభుత్వాలైనా ప్రజల కొనుగోలు శక్తిని పెంచే దిశగా నికరంగా పూనుకోగలగడాన్ని చాలా వరకూ ఆటంక పరుస్తున్నాయి. ఈ సంస్కరణల తాలూకు ఆలోచనా విధానంలో ప్రభుత్వ పాత్ర కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ ధనవంతులకు అనుకూలంగా వ్యవహారిస్తేనే దానివలన పెట్టుబడులు పెరిగి ప్రజలకు ఉపాధి లభిస్తుందనేది కీలక విధానంగా ఉండడం. అంటే ఈ ప్రపంచీకరణ విధానాలకు ముందరి... 1980ల ముందరి సంక్షేమ రాజ్య ఆలోచనలైన ఉద్యోగులు, కార్మికుల జీతభత్యాలు బాగుండి, వారి ఆర్థిక స్థితి బాగుంటేనే వ్యవస్థలో కొనుగోలు శక్తి... డిమాండ్ స్థిరంగా ఉంటాయనే దానికి తదనంతరం తిలోదకాలిచ్చారు. అలాగే ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణల కలగలుపు అయిన ఈ ఉదారవాద సంస్కరణలు ఆర్థిక వ్యవస్థలలో ప్రభుత్వం పాత్ర తక్కువగా ఉండాలని సిద్ధాంతీకరించాయి. అంటే పూర్తిగా డిమాండ్ సరఫరాలపై ఆధారపడిన మార్కెట్ ఆలోచనా విధానం ఈ సంస్కరణలకు కేంద్ర బిందువు. అందుచేత ఈ విధానాలను విశ్వసించేవారు ఆర్థిక సంక్షోభ కాలంలో కూడా తమ తమ దేశాల ఆర్థిక వ్యవస్థలలో ప్రభుత్వ పాత్రను తిరస్కరించే గుడ్డితనానికి పోతున్నారు. ఈ క్రమంలోనే నేడు ప్రపంచ పెట్టుబడి దారి వ్యవస్థ వేగంగా తిరిగి కోలుకోలేని సంక్షోభంలోకి జారిపోతోంది. 2008 ఆర్థిక సంక్షోభ అనంతరం కాగితం కరెన్సీల ముద్రణపై ఆధారపడి తమ మరణ శాసనాలను వాయిదా వేసుకున్న పెట్టుబడిదారీ పాలకులు నేడు ఇక ఎంత మాత్రమూ వ్యవస్థను కాపాడుకోలేని స్థితిలో పడిపోయారు! డి. పాపారావు, వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు మొబైల్: 98661 79615 -
ఇథనాల్ ధర పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ ధరల్ని కేంద్రం పెంచింది. వచ్చే ఏడాది నుంచి పెట్రోల్‌లో 12 శాతం ఇథనాల్ కలిపేలా చర్యలు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) పలు నిర్ణయాలు తీసుకుంది. వివరాలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మీడియాకు తెలిపారు. ‘‘మూడు రకాల ఇథనాల్ ధరల్ని పెంచాం. చెరుకు రసం నుంచి తీసే ఇథనాల్ లీటర్‌కు రూ.63.45 నుంచి రూ.65.61కి సి–హెవీ మోలాసెస్ నుంచి తీసే ఇథనాల్ రూ.46.66 నుంచి రూ.49.41కు, బి–హెవీ రూట్ నుంచి వచ్చే ఇథనాల్ లీటర్ రూ.59.08 నుంచి రూ.60.73కు పెరుగుతాయి’’ అన్నారు. ఎరువులపై రూ.51,875 కోట్ల సబ్సిడీ 2022–23 ఆర్థిక సంవత్సరంలో రబీ సీజన్‌కు ఫాస్మాఫాటిక్ పొటాసిక్ (పీ అండ్ కే) ఎరువులపై రూ.51,875 కోట్ల సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నైట్రోజన్‌పై కేజీకి రూ.98.02, ఫాస్ఫరస్పై కేజీకి రూ.66.93, పొటాష్పై కేజీకి రూ.23.65, సల్ఫర్పై కేజీకి రూ.6.12 సబ్సిడీని ఇస్తూ నిర్ణయం తీసుకుంది. డెన్మార్క్‌తో నీటి వనరుల సంరక్షణ, నిర్వహణకు అవగాహనా ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. 4 శాతం డేర్‌నెస్ అలవెన్స్(డీఏ)ను పెంచుతూ కేబినెట్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ 38 శాతానికి చేరనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెరిగిపోతున్న ధరల కారణంగా డేర్‌నెస్ అలవెన్స్ పెంచుతూ మోదీ ప్రతిపాదించారు. మోదీ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ అలవెన్స్ పెరిగింది. కేబినెట్ తాజా నిర్ణయంతో 47.68 లక్షల మంది ఉద్యోగులకు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. వీరితో పాటు సివిలియన్ ఎంప్లాయిస్, డిఫెన్స్ విభాగానికి చెందిన ఉద్యోగులు సైతం డీఏ అలవెన్స్ వర్తించనుంది. ఇక కేంద్రం పెంచిన డీఏ అలవెన్స్ ఈ ఏడాది జులై 1 నుంచి లబ్ధి దారులు పొందవచ్చు. జులై 1 నుంచి ఉద్యోగులు తీసుకున్న శాలరీస్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న బకాయిలు (arrears) సైతం చెల్లిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రి వర్గ కీలక నిర్ణయాలు ►గరిబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం మరో మూడు నెలలు పొడిగింపు ►డిసెంబర్ 2023 వరకు పథకం పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయం ►కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్ దారులకు 4 శాతం డీ ఎ పెంపు ►ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు 10వేల కోట్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం -
ప్రత్యేక ఆర్థిక జోన్లకూ పన్ను రిఫండ్ పథకం?
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక జోన్లకూ (ఎస్ఈజడ్) పన్నులు, సుంకాల రిఫండ్ పథకం– ఆర్ఓడీటీఈపీ (రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడె ప్రొడక్ట్స్) ప్రయోజనాలను వర్తింపజేయాలని ఈఓయూ, ఎస్ఈజడ్ల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈపీసీఈఎస్) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ పథకం కింద వివిధ ప్రొడక్టులపై విధించిన వివిధ కేంద్ర, రాష్ట్ర సుంకాలు, పన్నులు, లెవీలను ఎగుమతిదారులకు రిఫండ్ జరుగుతుంది. అలాగే ఈ రంగానికి మౌలికరంగం హోదా ఇవ్వాలని కోరింది. తద్వారా ప్రాధాన్యత రంగం కింద తక్కువ రేటుకు ఎస్ఈజడ్లకు బ్యాంకుల నుంచి రుణాల మంజూరు సాధ్యమవుతుందని పేర్కొంది. పెరుగుతున్న ఎగుమతులు జోన్ల నుంచి ఎగుమతుల భారీ పెరుగుదలకు వాణిజ్య మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక మండలి– ఈపీసీఈఎస్ ఈ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. ఈపీసీఈఎస్ చైర్మన్ భువనేష్ సేథ్ ఆయా అంశాలపై మాట్లాడుతూ, ప్రత్యేక ఆర్థిక జోన్ల నుంచి ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 2020–21లో ఎస్ఈజడ్ ఎగుమతుల విలువ రూ.7.55 లక్షల కోట్లుకాగా, 2021–22లో ఈ విలువ రూ.8 లక్షల కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. తద్వారా కోవిడ్ ముం దస్తు ఎగుమతుల విలువ (2019–20లో రూ.7.84 లక్షల కోట్లు)ను ఈ విభాగం అధిగమిస్తుందన్న అంచనాలు ఉన్నాయన్నారు. ప్రత్యేక ఆర్థిక జోన్ల నుంచి నౌకాశ్రయాలకు రవాణా సౌలభ్యతపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్ఓడీటీఈపీ వివరాలు ఇవీ.. ఆర్ఓడీటీఈపీ స్కీమ్ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. ఎగుమతుల రంగానికి ఊతం ఇస్తూ, కేంద్రం ఇటీవలే ఆర్ఓడీటీఈపీ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రూ.12,454 కోట్లు కేటాయించింది. 8,555 ఉత్పత్తులకు వర్తించే విధంగా ఆర్‌ఓడీటీఈపీకి ఈ నిధులను కేటాయించింది. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై విధించిన సుంకాలు, పన్నుల రిఫండ్‌కు ఉద్ధేశించిన ఈ పథకం కింద పన్ను రిఫండ్ రేట్లను కూడా కేంద్రం నోటిఫై చేసింది. వివిధ రంగాలకు సంబంధించి పన్ను రిఫండ్ రేట్లు 0.5 శాతం నుంచి 4.3 శాతం శ్రేణిలో ఉన్నాయి. విద్యుత్ చార్జీలపై సుంకాలు, రవాణా ఇంధనంపై వ్యాట్, వ్యవసాయం, సొంత అవసరాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పత్తి, మండీ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ఇంధనంపై సెంట్రల్ ఎక్సైజ్‌పన్ను వంటి విభాగాల్లో రిఫండ్స్ జరుగుతాయి. రిఫండ్ జరిగే 8,555 ఉత్పత్తుల్లో సముద్ర ప్రాంత ఉత్పత్తులు, దారం, డెయిరీ ప్రొడక్టులు, వ్యవసాయం, తోలు, రత్నాలు–ఆభరణాలు, ఆటోమొబైల్, ప్లాస్టిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మిషనరీ ఉన్నాయి. స్టీల్, రసాయనాలు, ఔషధ రంగాలకు మాత్రం ఆర్ఓడీటీఈపీ పథకం వర్తించదు. ఎటువంటి ప్రోత్సాహకాలూ లేకుండా ఈ రంగాలు కార్యకలాపాలు నిర్వహించడమే దీనికి కారణం. జౌళి ఎగుమతిదారులకు భరోసా కల్పిస్తూ కేంద్రం ఇటీవలే ఆర్ఓఎస్సీటీఎల్ స్కీమ్‌ను పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం, దుస్తుల ఎగుమతిదారులు 2024 మార్చి వరకూ తమ ఎగుమతులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర పన్నులపై రాయితీలను పొందగలుగుతారు. ఈ స్కీమ్ కింద వస్త్రాలపై గరిష్టంగా 6.05 శాతం వరకూ రాయితీ అందుతుంది. రెడీమేడ్స్‌పై ఈ రేటు 8.2 శాతం వరకూ ఉంది. ఎస్ఈజడ్లవైపు దేశంలో మొత్తం 427 జోన్లకు ప్రభుత్వం ఆమోదముద్ర ఉంది. అయితే జూన్ 30వ తేదీ నాటికి వీటిలో 267 మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2021 జూన్ 30వ తేదీ నాటికి ప్రత్యేక జోన్లపై రూ.6.25 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. వీటిలో దాదాపు 24.47 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఎస్ఈజడ్ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎగుమతులు భారీగా 41.5 శాతం పెరిగాయి. విలువలో ఇది 2.15 లక్షల కోట్లు. ఔషధాలు, ఇంజనీరింగ్, రత్నాలు–ఆభరణాల ఎగుమతులు భారీగా పెరగడం దీనికి ప్రధాన కారణం. దేశం ఎగుమతుల్లో నాల్గవ వంతు ప్రత్యేక జోన్ల నుంచి జరుగుతుండడం గమనార్హం. నేడు కొత్త కార్యాలయం ప్రారంభం దేశ రాజధాని న్యూఢిల్లీలోని హిమాలయ భవన్లో ఈపీసీఈఎస్ కొత్త కార్యాలయం సెప్టెంబర్ 8వ తేదీన ప్రారంభమవుతుందని చైర్మన్ భువనేష్ సేథ్ తెలిపారు. వాణిజ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్, వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యంలు ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. ‘ఎగుమతులు పెంపు, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, సాంకేతిక వినియోగం, నూతన ఆవిష్కరణలు– ఎస్ఈజడ్లపై ప్రభావం’ అన్న అంశంపై పీడబ్ల్యూసీ నిర్వహించిన ఒక అధ్యయన నివేదికను ఈ సందర్భంగా ఆవిష్కరించడం జరుగుతుందని కూడా ఆయన వెల్లడించారు. చదవండి : గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ -
లాక్డౌన్ ఎంతో కాపాడింది: రజనీష్‌కుమార్
కోల్‌కతా: లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ.. దేశాన్ని రక్షించిందని, కేసుల సంఖ్య అదుపులోనే ఉందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్‌కుమార్ వ్యాఖ్యానించారు. పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన తర్వాతే లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని అభిప్రాయపడ్డారు. ‘‘ఎంతో సహనం కావాలి. వైరస్ వ్యాప్తి, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందన్న నమ్మకం ఏర్పడక ముందే ఆయుధాన్ని కిందకు దించకూడదు’’ అని రజనీష్‌కుమార్ పేర్కొన్నారు. లాక్డౌన్ కొనసాగినంత కాలం ఆర్థిక కార్యకలాపాలు బలహీనంగానే ఉంటాయని, డిమాండ్ మాత్రం ఆర్థిక వ్యవస్థలో నిలిచే ఉంటుందన్నారు. ప్రజలు క్రమశిక్షణ పాటిస్తే వైరస్ త్వరగా అదుపులోకి వస్తుందన్నారు. -
‘పన్ను’ ఊరట!
న్యూఢిల్లీ: మందగమన బాటలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా పలు చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇన్వెస్టర్ల సెంటిమెంటును మెరుగుపర్చేందుకు, విదేశీ పెట్టుబడులు మరింతగా ఆకర్షించేందుకు.. మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టనుంది. దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) ట్యాక్స్, సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టీటీ), డివిడెండ్ పంపిణీ పన్ను (డీడీటీ)లను తగ్గించే విధంగా.. వాటి స్వరూపాన్ని మార్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నీతి అయోగ్, ఆర్థిక శాఖలో భాగమైన రెవెన్యూ విభాగంతో కలిసి ప్రధాని కార్యాలయం (పీఎంవో) వీటిని సమీక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘నవంబర్ ఆఖరు నాటికి దీనిపై కసరత్తు పూర్తి కావచ్చు. బడ్జెట్లో లేదా అంతకన్నా ముందే ఇందుకు సంబంధించిన ప్రకటనలు ఉండవచ్చు‘ అని వివరించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఫిబ్రవరి 3న కేంద్రం ప్రవేశపెట్టవచ్చని అంచనా. సావరీన్ వెల్త్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, బీమా తదితర రంగాల సంస్థలు.. దేశీ ఈక్విటీల్లో మరింత పెట్టుబడులు పెంచేందుకు ప్రోత్సహించే విధంగా ..ఇతర దేశాలకు దీటుగా దేశీయంగా పన్ను రేట్లను సవరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని అధికారులు తెలిపారు. ‘ఈక్విటీ, డెట్, కమోడిటీల మార్కెట్ల పన్ను రేట్లను సమీక్షిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లో పన్నుల విధానాన్ని క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా పెన్షన్ ఫండ్స్ నుంచి దేశీ ఈక్విటీల్లోకి పెట్టుబడులు ఆకర్షించాలంటే పెద్ద ప్రతిబంధకంగా ఉంటోందన్న అభిప్రాయాల నేపథ్యంలో డీడీటీని గణనీయంగా తగ్గించడంపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష పన్నులను సమీక్షించేందుకు ఏర్పాటైన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్.. దీన్ని ఏకంగా తొలగిం చాలని సిఫార్సు చేసింది‘ అని వివరించారు. ఎల్టీసీజీ..డీడీటీ..ఏంటంటే.. షేర్ల విక్రయంతో ఇన్వెస్టరుకు లాభాలు వచ్చిన పక్షంలో క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది పైబడి అట్టే పెట్టుకున్న షేర్లను విక్రయిస్తే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 10 శాతం ఎల్టీసీజీ అమల్లోకి వచ్చింది. ఒకవేళ లాభాలు రూ. లక్ష దాటితేనే ఇది వర్తిస్తుంది. ఏడాది వ్యవధి లోపే షేర్లను విక్రయించిన పక్షంలో స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎస్టీసీజీ) ట్యాక్స్ 15% మేర వర్తిస్తుంది. ఇక, కంపెనీలు తమ వాటాదారులకు పంచే డివిడెండుపై ప్రస్తుతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(సెస్సులు, సర్‌చార్జీలన్నీ కలిపి) 20.35% స్థాయిలో ఉంటోంది. ఎల్టీసీజీ, డీడీటీలపై దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు చాన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్నారు. రూ. 1.5 లక్ష కోట్ల ఆదాయానికి గండి.. పన్ను రేట్లలో కోతలతో ప్రభుత్వ ఖజానాకు రూ. 1.5 లక్షల కోట్ల మేర ఆదాయానికి గండిపడే అవకాశం ఉందని అంచనా. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను మరింతగా విక్రయించడం, పన్ను రాబడులను మెరుగుపర్చుకోవడం, వ్యయాలను నియంత్రించుకోవడం వంటి చర్యలతో దీన్ని భర్తీ చేసుకోవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వృద్ధికి ఊతమిచ్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత కొద్ది నెలలుగా పలు సంస్కరణలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల విక్రయంపై మరింత దూకుడు, బడ్జెట్లో జరిపిన కేటాయింపులను వినియోగించుకునేలా ప్రభుత్వ విభాగాలను ప్రోత్సహించడం, ప్రభుత్వ బ్యాంకులు.. చిన్న సంస్థలకు రుణాలిచ్చేలా చర్యలు వీటిలో ఉన్నాయి. ప్రస్తుతం ఆగ్నేయాసియా మొత్తం మీద భారత్‌లోనే కార్పొరేట్ ట్యాక్స్ తక్కువగా ఉంది. ఈ సంస్కరణలు.. దేశీ స్టాక్ మార్కెట్లకు, ఇన్వెస్టర్ల సెంటిమెంటుకు ఊతమిస్తున్నాయి. ఆదాయపు పన్ను రేటూ తగ్గింపు: డీబీఎస్ కార్పొరేట్ ట్యాక్స్ రేటును 25 శాతానికి తగ్గించిన నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రేటును కూడా భారత్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని సింగపూర్‌కి చెందిన డీబీఎస్ బ్యాంకు ఒక నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం రూ. 2.5 లక్షలుగా ఉన్న మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచవచ్చని వివరించింది. రూ. 5 లక్షలకు పైబడిన ఆదాయాలపైనా ట్యాక్స్ రేటును తగ్గించవచ్చని తెలిపింది. దీని వల్ల చిన్న స్థాయి పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గుతుందని, మధ్య స్థాయిలో ఉన్న వారికీ ఓ మోస్తరు ఊరట లభించగలదని.. పై స్థాయి శ్లాబ్‌లో ఉన్న వారికి మాత్రమే పన్ను భారం పెరగవచ్చని డీబీఎస్ బ్యాంకు పేర్కొంది. -
జీపీఎఫ్ వడ్డీరేటు 0.4 శాతం పెంపు
న్యూఢిల్లీ: జనరల్ ప్రావిడెండ్ ఫండ్ (జీపీఎఫ్), సంబంధిత ఇతర స్కీమ్‌ల వడ్డీరేటును అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ప్రభుత్వం 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) రేటుకు అనుగుణంగా ఈ రేట్లలో మార్పు చేసినట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పెంపు నిర్ణయంతో జీపీఎఫ్‌పై వడ్డీరేటు 7.6 శాతం (జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో) నుంచి 8 శాతానికి ఎగసింది. ప్రావిడెంట్ ఫండ్స్‌పై వడ్డీరేటు పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వేలు, డిఫెన్స్ దళాలకు వర్తిస్తుంది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి ఎన్ఎస్సీ, పీపీఎఫ్‌సహా పొదుపు పథకాలపై వడ్డీరేటును గత నెల్లో ప్రభుత్వం 0.4 శాతం పెంచిన సంగతి తెలిసిందే. బ్యాంకుల్లో పెరిగిన డిపాజిట్ రేట్లకు అనుగుణంగా ఈ రేట్లు పెరిగాయి. -
ఆ రాష్ట్రాలకు అన్యాయం జరగదు
న్యూఢిల్లీ: జనాభాను సమర్థంగా నియంత్రించిన రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో అన్యాయం జరగకుండా 15వ ఆర్థిక సంఘం తగిన విధానాన్ని అవలంబిస్తుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు చెప్పారు. రాష్ట్రాలకు నిధులను కేటాయించేందుకు గత ఆర్థిక సంఘాల మాదిరి 1971 నాటి జనాభా లెక్కలను కాకుండా 15వ ఆర్థిక సంఘం 2011 నాటి జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటుండటం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలన్నీ జనాభాను సమర్థంగా నియంత్రించడం ద్వారా అభివృద్ధిలో ముందున్నాయనీ, ఇప్పుడు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు నిధులు తగ్గి అన్యాయం జరుగుతుందని అన్నాడీఎంకే ఎంపీ మైత్రేయన్ ప్రస్తావించారు. -
వారఫలాలు (25-12-2016 to 31-12-2016)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. చేపట్టిన పనులు కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరం. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీల్లో చికాకులు తొలగుతాయి. కొన్ని విషయాలలో కార్యోన్ముఖులై ముందడుగు వేస్తారు. ఉద్యోగయోగం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం. పారిశ్రామికవర్గాలకు అనుకూలం. నీలం, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) బంధువుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. కళాకారులకు సన్మానయోగం. లేత ఎరుపు, బంగారు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) వారం మొదట్లో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం మందగిస్తుంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. కొంత నిరుత్సాహంగా ఉన్నా క్రమేపీ అనుకూల పరిస్థితి ఉంటుంది. రాబడికి లోటు ఉండదు. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులు అందుతాయి. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. లేత పసుపు, గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ముఖ్యమైన కొన్ని పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆదాయం కొంత సంతృప్తికరంగా ఉంటుంది. ఒక సమస్య నేర్పుగా పరిష్కరించుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. ఎరుపు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) రాబడికి మించి ఖర్చులు ఎదురవుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయటా ఒత్తిడులు తప్పకపోవచ్చు. అయినవారే సమస్యలు సృష్టించే పరిస్థితులు ఉండవచ్చు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. ఆకుపచ్చ, లేత గులాబీరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులో ఆనందంగా గడుపుతారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు సన్మానాలు. నీలం, బంగారు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృపిక్తరం. కొన్ని రుణాలు తీరతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఎరుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో సమస్యలు సర్దుబాటు కాగలవు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆత్మీయులు,బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు ప్రయత్నాలలో అనుకూలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. పారిశ్రామికవర్గాలకు అరుదైన సన్మానాలు. ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులు శ్రమకు ఫలితం పొందుతారు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. నలుపు, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుందరకాండ పారాయణ చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) అనుకున్న ఆదాయం సమకూరుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఇంటిలో శుభకార్యాలు. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. నీలం, లేత ఆకుపచ్చరంగులు, శివపంచాక్షరి పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) వారం ప్రారంభంలో స్వల్ప అవాంతరాలు ఎదురైనా అనుకున్న పనులు పూర్తి చే స్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాలు తీరి ఊరట చెందుతారు. కొన్ని సమస్యలను సమయస్ఫూర్తితో చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు కలసివస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు అనుకూల సమాచారం. కళాకారులకు పురస్కారాలు. గులాబీ, తెలుపు రంగులు, నృసింహ స్తోత్రాలు పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (25 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్, 2016 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈ వారమంతా అవిశ్రాంతంగా పని చేసినా, చురుగ్గా ఉంటే కానీ, పనులు తొందరగా పూర్తి కావని గ్రహించండి. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు మరింత పదును పెట్టుకుని, శ్రద్ధాసక్తులతో పనిని పూర్తి చేస్తారు. ప్రేమ ఫలిస్తుంది. విందు, విహార యాత్రలను ఆస్వాదిస్తారు. మనసు చెప్పినట్లు నడచుకోండి. కలిసి వచ్చే రంగు: మబ్బురంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కాలంతో పోటీగా పరుగెత్తుతూ పని చేసే మిమ్మల్ని అర్థం చేసుకోవడం మీ సహ^è రుల వల్ల కాదు. పాతబంధాలు బలపడతాయి. దానితోబాటు మీ స్నేహితులు, బంధుమిత్ర సన్నిహితుల జాబితాలో కొత్తపేర్లు చేరతాయి. ఏ సమస్య వచ్చినా, తగిన పరిష్కారం కనుగొనడంలో మీకు మీరే సాటి. ప్రకృతి ఉత్పాదనల వాడకంతో ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కలిసివచ్చే రంగు:ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) భద్రతకు, విజయానికి ప్రాధాన్యత ఇస్తారు. ఊహించినంత ఆనందంగా, సాఫీగా రోజులు గడవడం లేదనిపిస్తుంటుంది. అయితే, ప్రణాళికాబద్ధంగా చేయడం వల్ల తగిన ఫలితం ఉంటుందని గ్రహించండి. సొంత వ్యాపారులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. మీ రుగ్మతలకు సంగీత చికిత్స ఉపకరిస్తుంది. కలిసివచ్చే రంగు: లేత వంకాయంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీది కాని ఒక కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. ప్రకృతి ఒడిలో మీకు మంచి స్వాంతన లభిస్తుంది. కలిసి వచ్చే రంగు: వెండి సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకోవడంలో బిజీగా ఉంటారు. ఆఫీసులో పనులు చురుగ్గా జరుగుతాయి. ఆందోళనలను పక్కనబెట్టి వృత్తిగతమైన మెలకువలతో పని చేయండి. సహోద్యోగులకు మీ ఆలోచనలు నచ్చకపోతే వినమని బలవంతపెట్టకండి. గొంతునొప్పి బాధించవచ్చు. కలిసి వచ్చే రంగు: నారింజ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఇంటాబయటా కూడా మంచి మార్పులు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. శాలరీ పెరగవచ్చు. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో బిజీగా ఉంటారు. కలిసి వచ్చే రంగు: లేత అరిటాకు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మీ వాక్చాతుర్యం, ప్రజాసంబంధాల సాయంతో మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వెన్ను, వీపు నొప్పి బాధించవచ్చు. ప్రేమలో విజయాన్ని అందుకుంటారు. మీరు అనుకున్న పనులను చేయడానికి ఇది తగిన సమయం. పనిలో కొన్ని ప్రతిబంధకాలు ఎదురు కావచ్చు. కలిసి వచ్చే రంగు: గులాబీ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీ వ్యాపార భాగస్వాములు మీపట్ల పూర్తి సానుకూల ధోరణిలో ఉంటారు. పనిలో ఆందోళనలను, అవరోధాలను అధిగమిస్తారు. మీ ఆలోచనలు, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. మీ పనిలో ఉత్పాదకతను సాధించేందుకు ఇది తగిన సమయం. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. కలిసి వచ్చే రంగు: బూడిద రంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తారు. అందులో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. మీ కోరికలకూ, ఆదాయానికీ, తాహతుకూ సమన్వయాన్ని సాధించండి. తెగిపోయిన ఒక బంధాన్ని ప్రేమతో అతికే ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పటికైనా చేయకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. కలిసి వచ్చే రంగు: నిండు ఎరుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) సన్నిహితులు, బంధువులకు సరైన సమయంలో సరైన సలహాలనిచ్చి వారిని కాపాడతారు. వారి మనసును గెలుచుకుంటారు. మిమ్మల్ని చూసి చెవులు కొరుక్కునేవాళ్ల గురించి పట్టించుకోకండి. కరుణ, సానుభూతితో మెలగండి. మీరు చేపట్టిన ప్రాజెక్టులో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. కొత్తదుస్తులు కొనుగోలు చేస్తారు. కలిసి వచ్చే రంగు: నారింజ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఈ వారం మీకు చాలా అదృష్టకరంగా ఉంటుంది. విజయాల బాటలో నడుస్తారు. ఇతరుల ప్రేమను గెలుచుకుంటారు. మీ ఆధ్యాత్మికత, భక్తిభావం, పరోపకార గుణాలే మిమ్మల్ని కాపాడుతూ వున్నాయని గ్రహించండి. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా రోడ్డు పక్కన అమ్మే వాటి విషయంలో. మీకు ఇష్టమైన వారితోనూ, మిమ్మల్ని ఇష్టపడేవారితోనూ ఎక్కువ సమయం గడపండి. కలిసి వచ్చే రంగు: గోధుమ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) వృత్తిపరంగా విజయం సాధించాలంటే దానికి అనుగుణంగా నడుచుకుంటూ, కష్టపడి పని చేస్తేనే సాధ్యమని గ్రహించండి. ప్రేమించిన వారికోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. పురాతన నగలు, వస్తువులు, అలంకరణ సామగ్రిని కొనుగోలు చేస్తారు. అందరితో కలసి మెలసి ఉండటం ద్వారా సానుకూల భావనలను నింపుకోండి. వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. కలిసి వచ్చే రంగు: లేత ఆకుపచ్చ టారో ఇన్సియా అనలిస్ట్ -
62 కొత్త నవోదయలకు కేబినెట్ ఓకే
కాకినాడలో రహదారి మళ్లింపునకు కూడా న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దేశంలో మరో 62 కొత్త జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్వీ)లను ప్రారంభించేందుకు బుధవారం ఆమోదం తెలిపింది. రూ.2,871 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు 11, గుజరాత్‌కు 8, ఢిల్లీకి 7, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్‌లకు చెరో 5 జేఎన్వీలు దక్కారుు. పల్లెల్లోని ప్రతిభావంతుల కోసం ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కాకినాడలో నౌకాదళానికి చెందిన భూభాగం నుంచి వెళ్తున్న రాష్ట్ర రహదారి(ఎస్‌హెచ్)-149 మార్గం మళ్లింపునకు కేబినెట్ ఆమోదం లభించింది. ప్రస్తుతం ఈ దారి విస్తరించి ఉన్న 11.25 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం నుంచి కేంద్రం తీసుకుంది. దీనికి ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త మార్గం నిర్మాణం కోసం 5.23 ఎకరాల భూమిని, రూ. 18.83 కోట్ల డబ్బును పరిహారంగా చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ఈ రహదారిని మళ్లించడం ద్వారా శిక్షణా కార్యక్రమాలను ఏ ఆటంకం లేకుండా నిర్వహిచుకోవచ్చని కేంద్రం తెలిపింది. అలాగే సులభతర వ్యాపార నిర్వహణను ప్రోత్సహించడంతోపాటు సేవలలో పారదర్శకత, నాణ్యతను తీసుకొచ్చేందుకు తోడ్పడే ‘మర్చంట్ షిప్పింగ్ బిల్లు’ను కూడా మంత్రివర్గం ఆమోదించింది.