ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు పటిష్టం | Optimism Rises in India-US Trade Relations under Trump | Sakshi
Sakshi News home page

ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు పటిష్టం

Published Thu, Jan 23 2025 4:56 AM | Last Updated on Thu, Jan 23 2025 7:55 AM

Optimism Rises in India-US Trade Relations under Trump

ట్రంప్‌ హయాంపై ఆశావహంగా కార్పొరేట్లు 

న్యూఢిల్లీ: డొనాల్డ్‌ ట్రంప్‌ రెండో విడత అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో భారత్‌–అమెరికా మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలు పటిష్టం కాగలవని దేశీ పరిశ్రమ దిగ్గజాలు ఆశాభావం వ్యక్తం చేశారు. హెల్త్‌కేర్, ఫార్మా, ఎల్రక్టానిక్స్‌ వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అవకాశాలు లభించగలవని పేర్కొన్నారు. 

ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు మరిన్ని అమెరికా ఉత్పత్తులను దేశీ మార్కెట్‌లో అనుమతించడం, స్టార్‌లింక్‌.. టెస్లాకు స్వాగతం పలకడం, అమెజాన్‌ విషయంలో ఉదారంగా వ్యహరించడం మొదలైనవి భారత్‌ చేయాల్సి రావచ్చని .. ట్రంప్‌ ప్రమాణానికి కొద్ది గంటల ముందు ఎక్స్‌లో ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ హర్ష్ గోయెంకా పోస్ట్‌ చేశారు. దీనికి ప్రతిగా ఏరోస్పేస్‌ .. డిఫెన్స్‌ ఉత్పత్తుల తయారీలో భారత్‌కు సహకరించడం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌ సభ్యత్వానికి మద్దతునివ్వడం, భారతీయులకు వీసా నిబంధనలను సడలించడం మొదలైనవి ట్రంప్‌ చేయొచ్చని పేర్కొన్నారు. 

 మరోవైపు, ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలపరంగా ట్రంప్‌ తొలి విడత పాలన సానుకూలంగానే ఉండేదని, ఆయన తిరిగి అధికారం చేపట్టడంతో ఇవి మరింత బలోపేతం కాగలవని పీహెచ్‌డీసీసీఐ డిప్యుటీ సెక్రటరీ జనరల్‌ ఎస్‌పీ శర్మ తెలిపారు. ఫార్మా పరిశోధనలు, తయారీ మొదలైన అంశాల్లో పరస్పర సహకారానికి అవకాశాలను పరిశీలించవచ్చని ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అలయన్స్‌ సెక్రటరీ జనరల్‌ సుదర్శన్‌ జైన్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారని, స్మార్ట్‌ఫోన్లు .. ఎల్రక్టానిక్స్‌ మొదలైన ఉత్పత్తులకు సంబంధించి వాణిజ్యం గణనీయంగా పెరగవచ్చని ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎల్రక్టానిక్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ పంకజ్‌ మహీంద్రూ తెలిపారు. అమెరికా డాలరును పక్కన పెట్టి ప్రత్యామ్నాయ కరెన్సీ కోసం ప్రయత్నిస్తే భారత్‌ కూడా భాగంగా ఉన్న బ్రిక్స్‌ కూటమిపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తానంటూ ట్రంప్‌ హెచ్చరించిన నేపథ్యంలో దేశీ కార్పొరేట్ల ఆశాభావం ప్రాధాన్యం సంతరించుకుంది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement