వాషింగ్టన్: భారత్‌లో వాయు కాలుష్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మాజీ ఉపాధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తప్పుపట్టారు. తాను, తమ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ భారత్‌తో అమెరికా భాగస్వామ్యానికి అత్యధిక విలువ ఇస్తున్నామని, ఎంతగానో గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. తమ విదేశాంగ విధానంలో అమెరికా–భారత్ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు.
ఒబామా–బైడెన్ హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని గుర్తుచేశారు. బైడెన్–కమలా హారిస్ హయాంలో ఈ సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి చేరుస్తామని స్పష్టం చేశారు. ఇండియా ఒక మురికి దేశమని ట్రంప్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. వాతావరణ మార్పులు మానవాళికి పెను సవాళ్లు విసురుతున్నాయని, ఆ సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా మిత్రుల గురించి చెడుగా మాట్లాడడం మంచిది కాదని బైడెన్ హితవు పలికారు. చైనా, ఇండియా, రష్యా దేశాలు వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని గురువారం అధ్యక్ష అభ్యర్థుల సంవాదంలో ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment