
న్యూఢిల్లీ: జనాభాను సమర్థంగా నియంత్రించిన రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో అన్యాయం జరగకుండా 15వ ఆర్థిక సంఘం తగిన విధానాన్ని అవలంబిస్తుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు చెప్పారు. రాష్ట్రాలకు నిధులను కేటాయించేందుకు గత ఆర్థిక సంఘాల మాదిరి 1971 నాటి జనాభా లెక్కలను కాకుండా 15వ ఆర్థిక సంఘం 2011 నాటి జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటుండటం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలన్నీ జనాభాను సమర్థంగా నియంత్రించడం ద్వారా అభివృద్ధిలో ముందున్నాయనీ, ఇప్పుడు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు నిధులు తగ్గి అన్యాయం జరుగుతుందని అన్నాడీఎంకే ఎంపీ మైత్రేయన్ ప్రస్తావించారు.