నూతన సంవత్సరం తొలి రోజున చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు గురించి మాట్లాడారు. దేశంలోని ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఆయన స్వయంగా అంగీకరించారు.
దేశ ప్రజలు నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన అన్నారు. నూతన సంవత్సర సందేశంలో జీ జిన్‌పింగ్ దేశ ఆర్థిక సవాళ్లను ప్రస్తావించడం ఇదే మొదటిసారి. జీ జిన్‌పింగ్ గడచిన పదేళ్లుగా అంటే 2013 నుండి నూతన సంవత్సరం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా తర్వాత చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అయినప్పటికీ పెరుగుతున్న నిరుద్యోగం, తగ్గుతున్న వ్యాపార డిమాండ్ కారణంగా చైనా మాంద్యంతో పోరాడుతోంది. జీ జిన్‌పింగ్ తన టెలివిజన్ ప్రసంగంలో మాట్లాడుతూ దేశంలో కొన్ని వ్యాపారరంగాలు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయని అన్నారు. జనం ఉద్యోగాలు దొరక్క, కనీస అవసరాలు తీరక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు తన మనసులో ఎప్పుడూ తిరుగాడుతుంటాయని జీ జిన్‌పింగ్ అన్నారు. ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయడానికి, బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా జీ జిన్‌పింగ్ ప్రసంగానికి కొన్ని గంటల ముందు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌బీఎస్) పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ)కి సంబంధించిన డేటాను విడుదల చేసింది.
చైనాలో గడచిన డిసెంబర్‌లో పారిశ్రామిక కార్యకలాపాలు ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయని ఆ డేటా వెల్లడించింది. నవంబర్‌లో 49.4గా ఉన్న పీఎంఐ గత నెలలో 49కి పడిపోయింది. చైనా పీఎంఐ క్షీణించడం ఇది వరుసగా మూడోసారి. గత సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాల్లో స్వల్ప పెరుగుదల తర్వాత, అధికారిక పీఎంఐ సెప్టెంబర్ వరకు వరుసగా ఐదు నెలల పాటు 50 కంటే తక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment