panchayathi elections
-
మీ సదుద్దేశాలపై అనుమానం కలుగుతోంది
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సదుద్దేశాలపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ మాట చెప్పేందుకు ఈ న్యాయస్థానం ఎంతమాత్రం సంశయించడంలేదని తెలిపింది. ఎన్నికల సంఘానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్న తమ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయకుంటే, వెంటనే ఎందుకు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. ఆ తరువాత కూడా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసి, అది విచారణకు రాకున్నా కూడా పట్టించుకోలేదని.. 42 రోజులపాటు ఆ పిటిషన్‌ను అలా వదిలేశారంటే ఎన్నికల కమిషనర్‌కు ఎంత శ్రద్ధ ఉందో అర్ధమవుతుందని వ్యాఖ్యానించింది. ఇక్కడే ఎన్నికల కమిషనర్ తీరుపై ఈ న్యాయస్థానానికి సందేహాలు కలుగుతున్నాయంది. కేసు పూర్వాపరాలివీ.. ఎన్నికల కమిషన్‌కు రూ.40 లక్షలు మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆ మొత్తాలను విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించడంతో పాటు, ఎన్నికల నిర్వహణ విషయంలో సహాయ, సహకారాలను అందించేలా కూడా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్.. కమిషన్‌కు పూర్తి సహాయ సహకారాలు అందించాలని గత ఏడాది నవంబర్ 3న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ, వీటిని అమలుచేయలేదంటూ నిమ్మగడ్డ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ దేవానంద్ సోమవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్. అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశాలను అధికారులు అమలుచేయలేదన్నారు. కొత్త ఓటర్ల జాబితా తయారుచేయలేదని తెలిపారు. దీంతో 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. గత ఏడాది నవంబర్ 3న ఇచ్చిన ఉత్తర్వుల్లో చెప్పిన అంశాలకే ఈ కోర్టు పరిమితం అవుతుందని తెలిపారు. తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేశారా? లేదా? అన్నదే చూస్తామన్నారు. ఒకవేళ తాజా సమస్యలపై ఇచ్చిన వినతులపై ప్రభుత్వం స్పందించకుంటే, వాటిపై మళ్లీ పిటిషన్ దాఖలు చేసుకోవాలని, వాటిని ఈ వ్యాజ్యంలో కలపవద్దని స్పష్టంచేశారు. అనంతరం.. ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ, కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేశామన్నారు. నిజమైన స్ఫూర్తితో కోర్టు ఉత్తర్వులను అమలుచేయలేదన్న న్యాయమూర్తి, దీనిపై స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీలను ఆదేశించారు. ముందు కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలని సుమన్ అభ్యర్థించడంతో న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ విచారణను మార్చి 22కి వాయిదా వేశారు. -
బాబు పంచాయతీ లెక్కల రూటే వేరు
పంచాయతీ ఎన్నికలు ముందుగా పెడితే తమకు కొంతైనా కలిసి వస్తుందని ఆశించిన టీడీపీకి ఫలితాలు మాత్రం ఆశాభంగం కలిగించాయని చెప్పాలి. రెండు విడతలలో కలిసి వెయ్యికి పైగా పంచాయతీలు వచ్చినందుకు సంతృప్తి చెంది ఉండవచ్చు. కాగా వైఎస్సార్సీపీకి రెండు విడతల్లోనూ ఐదువేలకు పైగా పంచాయతీలు వచ్చాయి. అంటే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవడం కాకుండా, అప్పటికన్నా వైఎస్సార్సీపీకి ఓట్ల శాతం పెరిగినట్లు కనబడుతోంది. ప్రస్తుతానికి మాత్రం గ్రామ సీమలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన అనేక కార్యక్రమాలు బాగా పనిచేశాయని అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గత మార్చిలో ఆగిపోయిన మండల, జడ్పీటీసీ ఎన్నికలు కాకుండా పంచాయతీ ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహించడం ఆరంభించింది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు కూడా జరిగిపోయాయి. పేరుకు ఇవి పార్టీ రహిత పంచాయతీ ఎన్నికలు అయినా, దాదాపు రాష్ట్రం అంతా ఆయా పార్టీల మద్దతుదారులైన అభ్యర్థులు రంగంలో దిగి తమ సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహజంగానే అత్యధిక సర్పంచ్ పదవులను కైవసం చేసుకుంటోంది. తొలి విడత ఎన్నికలలో 2,640 పంచాయతీలు వైఎస్సార్సీపీ కైవసం అయితే టీడీపీకి 518 వరకు వచ్చాయని ఒక లెక్క. అయితే దీనిపై టీడీపీ కాస్త గందరగోళంగా లెక్కలు చెప్పింది. తొలుత 1,050 పంచాయతీలు గెలుచుకున్నామని ఒకసారి, అసలు పంచాయతీ ఎన్నికలు సరిగా జరపడంలో ఎన్నికల కమిషన్ విఫలం అయిందని, చాలా చోట్ల దౌర్జన్యాలు జరిగాయని మరోసారి ఆరోపించింది. ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ప్రకటించడంతో అంతవరకు తాము మద్దతు ప్రకటిస్తూ వచ్చిన ఎన్నికల కమిషనర్‌పై విమర్శలు చేయడం, కోర్టుకు వెళ్లడం వంటి చర్యలకు టీడీపీ వారు పాల్పడ్డారు. రెండో విడత పోలింగ్‌లో కూడా వైఎస్సార్సీపీకి 2,504 పంచాయతీలు, టీడీపీకి 479 పంచాయతీలు వచ్చినట్లు వైఎస్ఆర్సీపీ తెలిపింది. ఈ మేరకు వారు సర్పంచ్ల పేర్లతో సహా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ మాత్రం తమకు 666 వచ్చాయని సంబరాలు చేసుకున్నట్లు టీడీపీ అనుకూల మీడియా తెలి పింది. ఆ తర్వాత ఈ దశలోనూ వెయ్యికిపైగా వచ్చినట్లు టీడీపీ ప్రచారం చేసింది.అంతేకాక 38 శాతం సర్పంచ్ పదవులను గెలుచుకున్నామని చంద్రబాబు ప్రకటించుకున్నారు. అయితే టీడీపీ ఆ వివరాలను పూర్తిగా ఎక్కడా ఇవ్వకపోవడం గమనించదగిన విషయం. ఇక్కడ అసలు విషయం ఒకటి తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెచప్పుడు, ఆత్మ తామేనని చెప్పుకునే ఒక పెద్ద పత్రికకు తెలుగు రాష్ట్రాలలో మారుమూల ప్రాంతాలలో కూడా నెట్వర్క్ ఉంది. వారి ప్రతినిధులు ఉంటారు. నిజంగానే టీడీపీకి పెద్ద సంఖ్యలో పంచాయతీలు వచ్చి ఉంటే, ఆ విషయాన్ని వారు స్వయంగా సేకరించి వార్తలుగా ప్రచురించేవారు. వారు అలా చేయకుండా వైఎస్సార్ సీపీ పక్షాన బొత్స చేసిన ప్రకటనను, అలాగే టీడీపీ వారు ఇచ్చిన ప్రకటనను ప్రచురించి ఊరుకున్నారు. అంటే దాని అర్థం ఆ పత్రిక నెట్వర్క్ పనిచేయడం లేదని అనుకోవాలా? లేక వాస్తవ పరిస్థితి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉంది కనుక తామెందుకు ఆ విషయాలన్నిటిని వెల్లడించాలని అనుకున్నారా? అన్నది తెలియదు. కానీ వారు మాత్రం వాస్తవ పరిస్థితిని తెలియచేయడానికి ఇష్టపడలేదని అనుకోవాలి. ఇక మా అక్షరం మీ ఆయుధం అని ప్రచారం చేసుకున్న మరో పత్రిక వారి అక్షరాలను తెలుగుదేశం పార్టీకి అంకితం చేశారు కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం అనవసరం. పంచాయతీ ఎన్నికలు ముందుగా పెడితే తమకు కొంతైనా కలిసి వస్తుందని ఆశించిన తెలుగుదేశం పార్టీకి ఇవి ఆశాభంగం కలిగించాయని చెప్పాలి. కానీ వారు రెండు విడతలలో కలిసి సుమారు వెయ్యికి పైగా పంచాయతీలు వచ్చినందుకు సంతృప్తి చెందారని అనుకోవచ్చు. మరోవైపు వైఎస్సార్ సీపీకి ఐదువేలకు పైగా పంచాయతీలు వచ్చాయి. అంటే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవడం కాకుండా, అప్పటికన్నా వైఎస్సార్ సీపీకి ఓట్ల శాతం పెరిగినట్లు కనబడుతోంది. పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపాల్టీలు, మండల, జెడ్పీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయి. మున్సిపాల్టీలకు నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. అప్పుడు ఎలాగూ ఏ పార్టీకి ఎలాంటి ఆదరణ ఉందన్నది స్పష్టమైన లెక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం గ్రామ సీమలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన అనేక కార్యక్రమాలు బాగా పనిచేశాయని అర్థం అవుతుంది. ఈ ఫలితాలకు భిన్నంగా వచ్చే మున్సిపల్, మండల, జెడ్పీ ఎన్నికలలో మార్పు ఉండకపోవచ్చు. కాగా, ఎన్నికల కమిషన్ వైఖరిలో కొద్దిపాటి మార్పు కనబడడం కూడా ఆహ్వానించదగిందే. ప్రత్యేకించి పోలీసు, ఇతర పోలింగ్ సిబ్బంది, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఎన్నికలను విజయవంతం చేశారని, చెదురుమదురు ఘటనలు మినహా, అంతటా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పడం కూడా గమనించదగినదే. అంతేకాక తొలి విడతలో ఏకగ్రీవాలపై ఆయన కొంత వివాదాస్పదంగా వ్యవహరించారన్న అభిప్రాయం ఉంది. ప్రత్యేకించి చిత్తూరు, గుంటూరు జిల్లాలలో ఎక్కువ ఏకగ్రీ వాలు అయ్యాయని ఆయన కొద్ది రోజులు నిలుపుదల చేశారు. కాని ఆ తర్వాత జిల్లా కలెక్టర్ల నివేదికల ఆధారంగా వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, ఆ తర్వాత దశల్లో జరిగిన ఏకగ్రీవాలను కూడా ఓకే చేశారు. ఎన్నికల కమిషనర్, అలాగే తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా ఎంత ప్రచారం చేసినా పెద్ద తేడా కనిపించలేదని అర్థం అవుతుంది. ఈ విషయాలలో తమకు పూర్తి అనుకూలంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు ఆశించి భంగపడ్డారేమో తెలియదు కాని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల కమిషన్ కూడా విఫలం చెందిందని ఆరోపించారు. అంతవరకు రాజ్యాంగ వ్యవస్థలపై విమర్శలు చేస్తారా అని సుద్దులు చెప్పిన చంద్రబాబు స్వయంగా తానే విమర్శలు చేశారు. మరో వైపు తన పార్టీ వారితో హైకోర్టులో పలు పిటిషన్లు వేయించి అనేక ఆరోపణలు చేశారు. ఆ పిటిషన్లు చదివితే ఏపీ గ్రామాలలో హింస, నిర్బంధంగా నామినేషన్లు ఉపసంహరించడం, పోలీసులు అసలు పనిచేయడం లేదని, ఎన్నికల వ్యవస్థ గందరగోళంగా ఉందేమోనన్న అనుమానం కలుగుతుంది. ఆ కేసు విచారించిన జడ్జిగారు ఆ పిటిషన్లలోని ఆరోపణలు చూస్తే చాలా సీరియస్‌గా ఉన్నాయని, అవి నిజమే అయితే గట్టి చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌కు ఇందుకు సంబంధించిన అధికారాలు ఉంటాయని, వాటిని వాడుకోవాలని సూచించారు. నిజంగానే ఎన్నికలలో అక్రమాలు జరిగితే అడ్డుకోవలసిందే. చర్యలు తీసుకోవల్సిందే. కానీ ఉన్నవి, లేనివి కలిపి హైకోర్టులో పిటిషన్ వేసి న్యాయ వ్యవస్థను కూడా తప్పుదారి పట్టించే యత్నం జరి గిందా అనిపిస్తుంది. ప్రత్యేకించి పుంగనూరు, మాచర్ల, తంబళ్లపల్లె నియోజకవర్గాలలోని పంచాయతీలపై ఈ ఫిర్యాదు చేశారు. కానీ వాటికి సంబంధించిన ఏకగ్రీవాలను ఎన్నికల కమిషన్ ఆమోదించిన తర్వాత ఇంక సమస్య ఎక్కడ ఉంటుంది. పైగా ఎవరైనా సంబంధిత గ్రామాలకు చెందినవారు పిటిషన్ వేస్తే దానికి అర్థం ఉంటుంది కానీ, లేదా నిర్దిష్ట ఆధారాలతో ఎవరైనా పిటిషన్ వేయవచ్చు కానీ, ఏదో రకంగా వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో పిటిషన్లు వేస్తే ఏమి చేయాలి? ప్రభుత్వ న్యాయవాది ఈ పిటిషన్లు విచారణార్హం కాదని వాదించారు. న్యాయమూర్తి ఈ పిటిషన్లలోని అంశాల లోతుల్లోకి వెళ్లడం లేదని కూడా స్పష్టం చేశారు. అయినా తెలుగుదేశం మీడియా జడ్జిగారు చేసిన ఒక వ్యాఖ్యను పతాక శీర్షికలలో పెట్టి వైఎస్సార్సీపీపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని హైకోర్టు అన్నదేమోనన్న భ్రమ కల్పించడానికి ప్రయత్నించింది. ఇవన్నీ చూస్తుంటే అసలు పోటీ వైఎస్సార్సీపీకి, తెలుగుదేశం మీడియాకు మధ్య జరుగుతుందేమోనన్న అనుమానం వస్తుంది. మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు పెద్ద బూస్ట్ మాదిరిగా ఉంటే, తెలుగుదేశం పార్టీ తనకు వచ్చిన తక్కువ స్థానాలకే ఆత్మ సంతృప్తి చెందినట్లు కనిపించడం ఒక ప్రత్యేకతగా భావించాలి. బహుశా వచ్చే రెండు దశల ఎన్నికలు, మున్సిపల్, మండల, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి ఇది ఒక వ్యూహం కావచ్చు. పంచాయతీ ఎన్నికలు ముగిశాక పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్, మండల, జెడ్పీ ఎన్నికలు మరింత రాజకీయ వేడి పుట్టిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. - వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు -
రెండో దశలో 539 ఏకగ్రీవాలు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలోని 167 మండలాల పరిధిలో 3,328 పంచాయతీలకుగాను 539 ఏకగ్రీవమయినట్లు ఎస్ఈసీ ప్రకటించారు. మిగిలిన 2786 పంచాయతీలకు ఈనెల 13న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎస్ఈసీ వెల్లడించారు. రెండో దశలో జిల్లాల వారీగా ఏకగ్రీవాల వివరాలు.. శ్రీకాకుళం: 278 పంచాయతీలకి గాను 41 పంచాయతీలు ఏకగ్రీవం విజయనగరం: 415కి గాను 60 ఏకగ్రీవం విశాఖ: 261కి గాను 22 ఏకగ్రీవం తూర్పు గోదావరి: 247కి గాను 17 ఏకగ్రీవం పశ్చిమ గోదావరి: 210కి గాను 15 ఏకగ్రీవం కృష్ణా: 211కి గాను 36 ఏకగ్రీవం గుంటూరు: 236కి గాను 70 ఏకగ్రీవం ప్రకాశం: 277కి గాను 69 ఏకగ్రీవం నెల్లూరు: 194కి గాను 35 ఏకగ్రీవం చిత్తూరు: 276కి గాను 62 ఏకగ్రీవం అనంతపురం: 308కి గాను 15 ఏకగ్రీవం వైఎస్ఆర్ జిల్లా: 175కి గాను 40 ఏకగ్రీవం కర్నూలు: 240కి గాను 57 ఏకగ్రీవం -
నిమ్మగడ్డపై మంత్రి పెద్దిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, తిరుపతి: ఓటు నమోదు చేసుకోవడం చేత కాని వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా ఉండటం తమ దౌర్భాగ్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. తన పరిధిలోని అధికారాలపై లెక్చర్లు దంచికొట్టే నిమ్మగడ్డకు ఓటు ఎలా, ఎక్కడ నమోదు చేసుకోవాలో తెలీకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. టీడీపీ మేనిఫెస్టో ప్రకటించడంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ఎస్ఈసీని నిలదీశారు. చంద్రబాబుకు మేలు చేస్తే ఎమ్మెల్యేనో, ఎంపీనో చేస్తారని నిమ్మగడ్డ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎస్ఈసీ చర్యలు ఆక్షేపణీయమని ఆయన పేర్కొన్నారు. తొలిదశలో పంచాయతీ ఎన్నికల్లో 500లకుపైగా సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని ఆయన వెల్లడించారు. ఏకగ్రీవమైన అభ్యర్థులు డిక్లరేషన్ పత్రాలు తీసుకున్నాక రిజల్ట్‌ను హోల్డ్‌లో పెట్టే అధికారం నిమ్మగడ్డకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఏకగ్రీవాలు జరగకూడదని ఏ చట్టంలోనైనా ఉందా అని ఎస్ఈసీని నిలదీశారు. రిటర్నింగ్ అధికారి అధికారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఎస్ఈసీకి లేదన్నారు. నిమ్మగడ్డ అధికారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆయన మాటాలు విని అధికారులెవరు కూడా అక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అలా కాదని ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా పనిచేసిన అధికారులపై భవిష్యత్తులో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు
సాక్షి, వైఎస్సార్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకులు డబ్బు పంచుతూ.. అడ్డంగా బుక్కయ్యారు. వైఎస్సార్ జిల్లాలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బులు పంచుతూ పోలీసులకు చిక్కారు. జిల్లాలో ఇప్పటికే చాలా గ్రామాల్లో ఏకగ్రీవాలు అయ్యాయి. ఈ క్రమంలో తెలుగుదేశం నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కాజీపేట మండలం దుంపల గట్టు గ్రామంలో టీడీపీ తమ మద్దతుదారుడిని బరిలో నిలపడమే కాక అతడిని గెలిపించాలంటూ డబ్బు పంచుతూ గ్రామస్తులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. (చదవండి: పట్టాభి ఇంట్లో పచ్చ డ్రామా!) టీడీపీ నాయకుల చర్యల గురించి గ్రామస్తులే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. వారు రంగంలోకి దిగారు. పలువురు టీడీపీ నాయకులను అడ్డుకుని.. అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరి వద్ద నుంచి 50 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. -
నేటితో ముగిసిన తొలి విడత నామినేషన్లు
సాక్షి, అమరావతి: ఏపీలో నేటితో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ముగిసాయి. రాష్ట్ర వ్యాప్తంగా 168 మండలాల్లో 3,249 పంచాయతీలు, 32,504 వార్డులకు తొలి దశలో ఎన్నికలు జరుగనుండగా, సర్పంచ్ పదవులకు 13వేలకు పైగా నామినేషన్లు, వార్డు మెంబర్ పదవులకు 35వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు (ఫిబ్రవరి 3న) తొలి విడత నామినేషన్ల పరిశీలన, అనంతరం నామినేషన్ల అభ్యంతరాలపై తుది నిర్ణయం వెలువడుతుంది. ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 9న ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు సాగుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాల వెల్లడి. ఫిబ్రవరి 9న సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక జరుగనుంది. -
చంద్రబాబుపై గరు భక్తి చాటుకుంటున్నారు..
సాక్షి, కాకినాడ: టీడీపీతో కలిసి శవ రాజకీయాలు చేస్తున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. చంద్రబాబుపై గురు భక్తిని చాటుకుంటున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు. గొల్లలగుంట ఘటనలో విచారణ జరగకుండానే ఎస్ఈసీ ఎలా పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు. ఎస్ఈసీ, ట్రైనీ నాయకుడు లోకేశ్ బాబు గొల్లలగుంటలో ఒకేసారి వాలిపోవడంతో వీరి మధ్య చీకటి ఒప్పందం మరోసారి బహిర్గతమైందని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గొల్లలగుంట వ్యక్తి మృతి చాలా బాధాకరమని, దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. టీడీపీ హయాంలో ఎన్నికలు నిర్వహించలేని ఎస్ఈసీ..విపత్కర పరిస్థితుల్లో ఎన్నికల హడావిడి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏకగ్రీవాల సాంప్రదాయం 1992లో గుజరాత్లో మోదీ ప్రవేశపెట్టారని, దేశంలో అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన వివరించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 2600 స్థానాలు ఏకగ్రీవాలయ్యాయని గుర్తు చేశారు. ఏకగ్రీవాలు రాజ్యాంగ స్పూర్తి అని పేర్కొన్నారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడు కుటుంబం హత్యారాజకీయాలకు పాల్పడుతూ.. సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుందన్నారు. పార్టీలతో సంబంధం లేని ఎన్నికలకు చంద్రబాబు మేనిఫెస్టో ఎలా ప్రకటిస్తారని ఆయన నిలదీశారు. టీడీపీ మేనిఫెస్టోపై నిమ్మగడ్డ ఏం చర్యలు తీసుకున్నారని కన్నబాబు ప్రశ్నించారు. -
ఏకగ్రీవాలకు ఎన్నికల కమిషన్ వ్యతిరేకం కాదు, కానీ..
సాక్షి, కాకినాడ: ఎలక్షన్ కమిషన్ ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదంటూనే, ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ భిన్నస్వరాలను వినిపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన ఆయన.. ప్రజాస్వామ్యంలో పోటీ అనేది అరోగ్యకరమని పేర్కొన్నారు. ఏకగ్రీవాలు జరిగితేనే గ్రామాల్లో శాంతి భద్రతలు ఉంటాయనేది పిడివాదమని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యం లో భిన్నస్వరాలు వినబడాలని, అప్పుడే బలమైన సమాజం ఏర్పడుతుందని, ఇదే రాజ్యాంగం బాధ్యత అని ఆయన వివరించారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం పెంచడానికి అధికార యంత్రాంగం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు పూర్తయ్యేంతవరకు గ్రామాల్లోని ప్రతి కదలికపై నిఘా ఉంచేందుకు ఎన్నికల నిఘా యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన గొల్లలగుంట ఘటనను ప్రస్థావిస్తూ.. ఆ ఘటన చాలా బాధాకరమని, తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పిస్తామని భరోసానిచ్చారు. -
నిమ్మాడ ఘటనలో అచ్చెన్నాయుడు అరెస్ట్
సాక్షి, టెక్కలి: తన సొంత గ్రామం నిమ్మాడలో గత నెల 31వ తేదీ ఆదివారం నామినేషన్ వేసేందుకు వెళ్లిన కింజరాపు అప్పన్న, ఆయనకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ తదితరులపై జరిగిన దౌర్జన్యకాండకు ప్రధాన సూత్రధారి అయిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఏఎస్పీ శ్రీనివాసరావు, కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, టెక్కలి సీఐ ఆర్.నీలయ్యతో పాటు పోలీస్ బలగాలు నిమ్మాడలో ఆయన ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు తరలించి సంఘటనకు సంబంధించి రికార్డులను సిద్ధం చేసి కోటబొమ్మాళి జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తరలించారు. ఈ క్రమంలో కొత్తపేట జంక్షన్ వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు అచ్చెన్నాయుడు ఉన్న పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నాయి. దీంతో పోలీస్ ప్రత్యేక బలగాలు రంగ ప్రవేశం చేసి వారిని నియంత్రించాయి. అనంతరం కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రిలో ఆయనకు కోవిడ్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కోర్టు వద్దకు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని అదుపు చేశారు. కోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత అచ్చెన్నాయుడుకు 14 రోజులు రిమాండ్ విధించగా, మధ్యాహ్నం 3.40 గంటలకు ఆయన్ను జిల్లా జైలుకు తరలించారు. ఎందుకు ఈ కేసు అంటే.. ►నిమ్మాడలో కింజరాపు అప్పన్న సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేయడం అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరిప్రసాద్, ఆయన కుమారుడు సురేష్‌లకు ఇష్టం లేదు. ►అచ్చెన్నాయుడు గత నెల 30వ తేదీన అప్పన్నకు ఫోన్ చేశారు. ‘అందరం ఒకే దగ్గర ఉంటున్నాం. గతంలో నీకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే. నీ భార్యను ఉద్యోగం నుంచి తీసేయించారన్న విషయం కూడా నాకు తెలుసు. మా అన్నయ్య నోట్ పేపర్ తీసుకొన్న విషయం మాత్రం తెలియదు. అవన్నీ సరే. నువ్వు నష్టపోయావని కూడా తెలుసు. అయినా సరే ఇప్పుడు మాత్రం నువ్వు పోటీ చేయొద్దు. అదేం రాష్ట్రపతి పదవి కాదు’ అని తనదైన శైలిలో చెప్పారు. ‘ఉద్యోగం తీసేయించారు.. మీ వద్దకు 20 సార్లు వచ్చినా పట్టించుకోలేదు..’ అని బాధితుడు చెప్పిన దానికి అవునంటూనే ఎన్నికల్లో పోటీ చేయొద్దని బెదిరించారు. ►తనకు జరిగిన అన్యాయం పట్ల తీవ్రంగా కలత చెందిన అప్పన్న.. పంచాయతీ సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడానికే సిద్ధపడ్డారు. ►ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పినా వినకుండా అప్పన్న నామినేషన్ వేయడానికి వెళ్తున్నాడనే సమాచారం తెలుసుకున్న అచ్చెన్నాయుడు.. అతన్ని ఎలాగైనా సరే ఆపండని గత నెల 31న తన సోదరుడిని పురమాయించారు. దీంతో హరిప్రసాద్, సురేష్, టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై బాధితుడు అప్పన్న కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ►ఈ మేరకు క్రైమ్ నంబర్ 44/2021 ప్రకారం 147, 148, 307, 324, 506, 341, 384, 188 రెడ్ విత్ 149, ఐపీసీ సెక్షన్ 123 ఆఫ్ ది పీపుల్ రిప్రజెంట్ చట్టం, సెక్షన్ 212 ఆఫ్ ది ఏపీ పంచాయతీ రాజ్ చట్టం–1995 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 12 మందిని అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితులు కింజరాపు హరిప్రసాద్, ఆయన కుమారుడు సురేష్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 22 మందిపై కేసు నమోదు సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో నామినేషన్ వేయకుండా అడ్డుకుని, బెదిరింపులకు పాల్పడిన ఘటనలో 22 మందిపై కేసు నమోదు చేశామని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి రంగారావు తెలిపారు. మంగళవారం ఆయన విశాఖ డీఐజీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటేనని, శాంతి, సామరస్య ధోరణిలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని, ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడడం పోలీసులుగా తమ బాధ్యత అన్నారు. ఎన్నికలకు ఆటంకం కలిగించే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. నేను హోంమినిష్టర్ అవుతా.. మిమ్మల్ని విడిచిపెట్టను ‘రేపు అధికారంలోకి మేమే వస్తాం.. చంద్రబాబునాయుడుకు చెప్పి నేను హోమ్ మినిష్టర్ పదవి తీసుకుంటాను.. మీరు ఎక్కడ ఉన్నా విడిచిపెట్టను’ అని కోటబొమ్మాళి ఆస్పత్రి వద్ద కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ ఆర్.నీలయ్య, పోలీసులను అచ్చెన్నాయుడు బెదిరించారు. -
కింజారపు కుటుంబం హత్యారాజకీయాలకు అలవాటు పడింది..
సాక్షి, శ్రీకాకుళం: కింజారపు సోదరుల కుటుంబం హత్యారాజకీయాలకు అలవాటు పడిందని టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. నిమ్మాడలో ప్రతి పంచాయతీ ఎన్నికల్లో హత్యలు చేయించడం కింజారపు కుటుంబానికి పరిపాటిగా మారిందని దువ్వాడ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకుడు కింజారపు అప్పన్న నామినేషన్ వేస్తానంటే, అతని చంపుతామంటూ కింజారపు సోదరుల అనుచరులు ఇంటికి వెళ్లి బెదిరించారన్నారు. అప్పన్నకు తోడుగా తానే వెళ్లి నామినేషన్ వేయిద్దామనుకుంటే, తనపై కూడా కత్తులతో దాడి చేసి చంపాలని ప్రయత్నించారని ఆరోపించారు. తమపై దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన తన అనుచరులు, పోలీసులపై కూడా కింజారపు సోదరుల అనుచరులు దాడి చేశారన్నారు. ఈ సందర్భంగా వారు తమ వాహనాలు ధ్వంసం చేసి, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు స్వయంగా ఫోన్ చేసి అప్పన్న కుటుంబ సభ్యులను బెదిరించినా, ఎన్నికల కమిషనర్ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. అసలు నాగరిక ప్రపంచంలో ఉన్నామా అనే అనుమానం కలిగేలా అల్లరి మూకలు చెలరేగారన్నారు. అయినప్పటికీ తాము సంయమనంతో వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఇప్పటికే పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించామని, పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దువ్వాడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
రేపు ఉత్తరాంధ్ర పర్యటనకు ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ రేపటి నుండి ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 12.20 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరనున్న ఎస్ఈసీ.. మధ్యాహ్నం 1.30గంటలకు విశాఖ చేరుకొని, అక్కడి నుంచి 2.30 గంటలకు శ్రీకాకుళం బయల్దేరి వెళ్తారు. సాయంత్రం 4.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా అధికారులతో సమీక్ష అనంతరం, సాయంత్రం 7 గంటల నుంచి విజయనగరం జిల్లా అధికారులతో జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. ఆ రాత్రికి విశాఖలోనే బస చేయనున్న ఎస్ఈసీ.. 2వ తేదీ ఉదయం 9 గంటలకు విశాఖ జిల్లా అధికారులతో, మధ్యాహ్నం 1.30 గంటలకు కాకినాడ వెళ్లి తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి ఏలూరు చేరుకొని, రాత్రి 7 గంటల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు రాత్రి తిరిగి విజయవాడకు చేరుకుంటారు. -
నిమ్మగడ్డ శునకానందం పొందుతున్నారు..
సాక్షి, విజయనగరం: కరోనా కారణంగా రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఎన్నికల హడావిడి చేస్తున్న నిమ్మగడ్డ రమేశ్ చౌదరి శునకానందం పొందుతున్నారని దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్ చేశారు. ప్రజల ఆరోగ్యం కంటే చంద్రబాబు శ్రేయస్సే ప్రధానంగా పని చేస్తున్న ఆయన.. గతంలో ఎన్నికలు ఎందుకు ఆపారో, ఇప్పుడు ఎందుకు నిర్వహిస్తున్నారో తెలీడం లేదన్నారు. నిమ్మగడ్డ చర్యలు చంద్రబాబు ఆలోచనలు ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించారు. ఏదిఏమైనా తాము ఎన్నికలకు ఎప్పుడూ సిద్ధమేనని, తుది ఫలితాలు కచ్చితంగా తమకే అనుకూలంగా వస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సొంత మంటూ ఒక్క పథకం పేరైనా చెప్పుకోలేని 40 ఏళ్ల అనుభవజ్ఞులైన చంద్రబాబుకి మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ రమేష్ చౌదరి చంద్రబాబుపై చర్యలు తీసుకునే సాహసం చేయగలరా అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో భారీ ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఈ ఎన్నికల్లో శత శాతం ఫలితాలతో ప్రజలు నిమ్మగడ్డకు బుద్ధి చెబుతారని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలోని 959 పంచాయతీల్లో శత శాతం ఫలితాలకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ఎన్నికలు నిమ్మగడ్డకు, చంద్రబాబుకు గుణపాఠం కానున్నాయని మంత్రి పేర్కొన్నారు. జిల్లాకు చెందిన అశోక్ గజపతి రాజు రామతీర్ధానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు జై శ్రీరాం అన్నంత మాత్రాన ప్రజలు ఆయన్ను నమ్మరన్నారు. రామతీర్థం ఘటన చాలా దురదృష్టకరమని, రామతీర్థంను మరో భద్రాద్రిగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
కృష్ణా జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం: ఎస్పీ
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలు మొత్తం నాలుగు విడతల్లో జరగనున్నాయని, మొదటి విడత నామినేషన్ ప్రక్రియ రేపటి నుంచి మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 52 లొకేషన్లలో 76 సమస్యాత్మక ప్రదేశాలని గుర్తించామని ఆయన తెలిపారు. రౌడీ షీటర్లను, వివాదాస్పద నాయకులను ముందుగా బైండోవర్ చేశామన్నారు. లైసెన్స్ వెపన్ ఉన్న వారి నుండి వెపన్‌ను హ్యాండోవర్ చేసుకొని హెడ్ క్వాటర్‌కి డిపాజిట్ చేశామన్నారు. నాలుగు దశల ఎన్నికల విధులకు జిల్లా వ్యాప్తంగా 2200 మంది పోలీస్ సిబ్బందిని కేటాయించామన్నారు. 800 మంది సచివాలయ మహిళా పోలీసులు, రిటైర్డ్ పోలీస్ అధికారులు, ఎక్స్ ఆర్మీ, ఎక్స్ సీఆర్పిఎఫ్ సిబ్బంది సహాయం తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు డీఎస్పీ స్థాయి అధికారిని నియమించామని, 24 గంటల పర్యవేక్షణకు 8332983792 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. అధికారులకు, సిబ్బందికి వేరువేరుగా శిక్షణ: కలెక్టర్ ఇంతియాజ్ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి రెండు విడతల్లో వేరేవేరుగా శిక్షణ ఇస్తామని, ఇందులో భాగంగా నేడు అధికారులకు తొలి విడత శిక్షణను పూర్తి చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. ఫిబ్రవరి 2న వారికి రెండవ విడత శిక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక సిబ్బందికి మొదటి విడత శిక్షణ ఫిబ్రవరి 4న, రెండవ విడత.. ఫిబ్రవరి 6న ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి 7న మండల స్థాయి పరిశీలకులకు శిక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ అధికారులు, డివిజనల్ పంచాయితీ అధికారులు శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని వెల్లడించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ) సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. కాగా, తొలి విడతలో 14 మండలాల్లో 234 పంచాయితీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని, 2502 వార్డులకు 2642 బూతులు ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు. తొలి విడత ఎన్నికల్లో 30 సమస్యాత్మక పంచాయతీలను గుర్తించామని, అందులో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. -
90 శాతం స్థానాలను గెలుస్తాం: మంత్రి బాలినేని
సాక్షి, ఒంగోలు: రాష్ట్రంలో త్వరలో జరుగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 90 శాతం స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సారధ్యంలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జిల్లా పార్టీ కార్యలయంలో జరిగిన నేతల భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ఏవైనా తమ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న సంక్షేమ పథకాలే తమ పార్టీని గెలిపిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలో ఏకగ్రీవాలపై దృష్టి సారించాలని నాయకులకు పిలుపునిచ్చారు. గ్రామాల ప్రగతికి తోడ్పడతాయని తాము ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుంటే.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, చంద్రబాబు అండ్ కో కలిసి అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విషయం స్పష్టమవుతుందన్నారు. గతంలో ఆగిన ఎన్నికలను పూర్తి చేయకుండా పంచాయతీ ఎన్నికలను నిర్వహించడమేంటని రమేష్ కుమార్‌ను ప్రశ్నించారు. చీరాల ప్రాంతంలో కోర్టు కేసులు ఉండటం వల్ల అక్కడ ఎన్నికలు జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ఇంఛార్జి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. -
'పంచాయతీ' పెట్టిన చిచ్చు..
సాక్షి, అమరావతి: అన్నదమ్ముల్లా మెలిగే రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతల మధ్య పంచాయతీ ఎన్నికలు చిచ్చు పెట్టాయి. కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న సమయంలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ తగదని ఏకతాటిపై నిలిచిన అన్ని ఉద్యోగ సంఘాలు, కోర్టు తీర్పు నేపథ్యంలో వేరు పడ్డాయి. కోర్టు తీర్పు ఎన్నికల కమిషన్‌కు అనుకూలంగా రావడంతో తాము కమీషన్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదని ఓ వర్గం మాట మార్చి, ఇతర సంఘాలపై నిందలు మోపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. సచివాలయానికి వచ్చిన ఉద్యోగ సంఘం నాయకుడితో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకట రామిరెడ్డి ఆమర్యాదపూర్వకంగా వ్యవహరించారని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. అయితే దీనిపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకట రామిరెడ్డి వివరణ ఇస్తూ.. రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు నా మీద చేసిన ఆరోపణలు బాధ కలిగించాయి, నేను ఏ రోజు కూడా సచివాలయానికి వచ్చిన ఏ ఉద్యోగ సంఘ నాయకుడితో కూడా ఆమర్యాదపూర్వకంగా ప్రవర్తించలేదు, సచివాలయ గోడలపై క్యాలెండర్లు అంటించవద్దు అని చెబితే దానిని అపార్థం చేసుకొని బొప్పరాజు తనను బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి తనను విమర్శించడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాని అన్నారు. ఇలాంటి ఆరోపణల వల్ల సంఘాలు బలపడటమో, బలహీనపడటమో జరగదు కానీ ఉద్యోగుల పరువు పోతుందని వెంకట రామిరెడ్డి వ్యాఖ్యానించారు. పోరాడి ఫలితం సాధించలేక పోయామని ఉద్యోగులు నిరాశలో ఉన్న సమయంలో ఉద్యోగ సంఘాలు ఇలాంటి ఆరోపణలు చేసుకుంటే తమ పరువే పోతుందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అందరం సంయమనంతో వ్యాహరిస్ధామని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ వివాదానికి కారణం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఓ వర్గం మాట మార్చడమేనని సచివాలయ వర్గాల సమాచారం. -
ఎస్ఈసీ వ్యాఖ్యలు తమ నిబద్దతను శంకించేలా ఉన్నాయి..
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల విధులకు కేంద్ర సిబ్బందిని వినియోగించుకుంటామంటూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిబద్దతని శంకించేలా ఉన్నాయంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే ఆర్ సూర్యనారాయణ మండి పడ్డారు. గతంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించారని, కరోనా పరిస్ధితుల దృష్ట్యా మాత్రమే తాము ఎన్నికలను వాయిదా వేయాలని ఎస్ఈసీని కోరామన్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహిస్తే ఉద్యోగులు ఎదుర్కొనే ఇబ్బందులపై తాము ఎస్ఈసీకి వినతి పత్రాన్ని సమర్పించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ఉద్యోగులపై ఎస్ఈసీ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. రాష్ట్ర ఉద్యోగులను కించపరుస్తూ ఎన్నికల విధులకు కేంద్ర సిబ్బందిని వాడుకుంటామని చెప్పడంపై ఎస్ఈసీని ప్రశ్నించామన్నారు. అయితే ప్లాన్ బి కింద రాష్ట్ర ఉద్యోగుల సేవలు వినియోగించుకునేందుకు ఆలోచన చేశామని ఎస్ఈసీ వివరణ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు సరఫరా చేస్తామని గతంలో ఎస్ఈసీ ప్రకటించారని, వాటి విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదన్నారు. ప్రకటనలతో సరిపెట్టకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిని కరోనా నుంచి రక్షణ కల్పించాలని తాము ఎస్ఈసీని కోరామన్నారు. ఎస్ఈసీని కలిసిన వారిలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్సి ఆస్కార్ రావు తదితరులు ఉన్నారు. -
అత్యుత్తమ సీఎంగా పేరు తెచ్చుకున్నారు..
సాక్షి, విజయవాడ: కేవలం 18 నెలల కాలంలోనే సీఎం జగన్మోహన్రెడ్డి దేశంలోనే అత్యుత్తమ సీఎంగా గుర్తింపు తెచుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశంశల వర్షం కురిపించారు. దేశవ్యాప్తంగా సీఎం జగన్‌కు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని చంద్రబాబు.. ఆయన ఇమేజ్ను దెబ్బ తీసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ విచక్షణా రహితంగా వ్యవహరిస్తున్నారని, అధికారులను బెదిరించేలా వ్యవహరిస్తున్న ఆయన తీరు ఏమాత్రం సబబు కాదని మంత్రి బొత్స మండిపడ్డారు. పంచాయతీల్లో ఏకగ్రీవాలన్నవి తాము వచ్చాక మొదలు పెట్టినవి కావని, 2001 లోనే ఏకగ్రీవాలు ప్రారంభం అయ్యాయని వివరించారు. ఎక్కువ శాతం ఏకగ్రీవాలు చేసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమించుకున్నారన్న ఎస్ఈసీ భాష ఏమాత్రం బాగోలేదని ఆయన విమర్శించారు. గ్రామాల ప్రగతికి ఏకగ్రీవాలు తోడ్పడతాయి.. పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని, అధికారుల విషయంలో అతని ప్రవర్తన ఏమాత్రం సరిగా లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండి పడ్డారు. సక్రమంగా విధులు నిర్వహిస్తున్న అధికారలపై కక్షపూరితంగా వ్యవహరించడం అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులకు తగదని హితవు పలికారు. సీఎం జగన్మోహన్రెడ్డి పరిపాలనలో ఏ అధికారికి అన్యాయం జరగదని ఆయన భరోసాను ఇచ్చారు. ఏకగ్రీవాల విషయంలో.. గతంలో ప్రోత్సాహకాలు బాగున్నాయని వ్యాఖ్యానించిన నిమ్మగడ్డ, ఇప్పుడు వేరే ధోరణిలో వ్యవహరిస్తున్నారని, ఇవన్నీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్ది వ్యాఖ్యానించారు. ఏకగ్రీవాలు జరిగితే గ్రామాల్లో ఎలాంటి గొడవలు ఉండవని, అందుకే మన రాష్ట్రంతో సహా అనేక రాష్ట్రాల్లో ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఏకగ్రీవాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. ఏకగ్రీవాల వల్ల గ్రామాల్లో మంచి పాలనా వ్యవస్థ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఏకగ్రీవాలకు సంబందించి గతేడాది మార్చిలోనే అదేశాలిచ్చామని పేర్కొన్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ఏకగ్రీవాలు ఎంతో తోడ్పడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారంగానే తమ ప్రభుత్వం ఎన్నికలకు వెళుతుందని మంత్రి స్పష్టం చేశారు. -
పల్లెల్లో ‘పంచాయతీ’
సాక్షి, ఏలూరు (మెట్రో) : పల్లెల్లోనూ ఓట్ల పండగకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు కీలకమైన ఓటర్ల తుది జాబితాను జిల్లా పంచాయతీ అధికారి విక్టర్ సోమవారం విడుదల చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారులు 909 పంచాయతీల ఓటర్ల జాబితాలను ప్రచురించారు. వాస్తవానికి ఈనెల 10న ప్రచురించాల్సి ఉండగా తుది గడువును 20 వరకూ పెంచుతూ ఆదేశాలు రావడంతో సోమవారం ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. మహిళలే మహరాణులు సాధారణ ఎన్నికల్లో మహిళా ఓటర్లే అధికం. అలాగే పంచాయతీ ఎన్నికల్లోనూ మహిళలే మహరాణులుగా ఉన్నారు. మహిళా ఓటర్లే అధికంగా గ్రామాల్లోనూ ఉండటంతో రానున్న పంచాయతీ ఎన్నికల్లో వీరి ఓట్లు కీలకం కానున్నాయి. పల్లెల్లో పురుషులు 12,61,658 మంది ఓటు హక్కు కలిగి ఉంటే.. మహిళలు 12,89,087 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. కొత్తగా విలీన మండలాలు విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు ప్రజలు ఈ సారి ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో ఓటు హక్కును వినియోగించుకున్న వీరు ఇటీవల తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును కోల్పోయారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. కుక్కునూరు మండలంలో 15 పంచాయతీలు ఉండగా, 28,178 మంది ఓటర్లు, వేలేరుపాడు మండలంలో 9 పంచాయతీలు ఉండగా, 16,550 మంది ఓటర్లు ఉన్నారు. తాజా ఓటర్ల జాబితా ప్రకారం.. అత్యధికంగా ఏలూరు మండలంలోని 22 పంచాయతీలలో 1,03,617 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా వేలేరుపాడు మండలంలోని 9 పంచాయతీల్లో 16,550 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల ఖర్చు ఇలా.. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు రూ.14 కోట్ల 20 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేసి పంచాయతీ అధికారులు ఎన్నికల సంఘానికి నివేదించారు. తేలని రిజర్వేషన్లు ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితాలు సేకరించి, ప్రచురించిన జిల్లా పంచాయతీ అధికారులకు రిజర్వేషన్ల ప్రక్రియ మరో ప్రహసనంగా మారనుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రతి పంచాయతీలో మూడు చోట్ల జాబితా ప్రతి పంచాయతీలో పంచాయతీ కార్యాలయంతోపాటు, గ్రంథాలయం, పోస్టాఫీసులో ఓటర్లు జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. దీంతో ప్రజలు ఈ జాబితాను పరిశీలించి ఓటు ఉన్నదీ, లేనిదీ తెలుసుకోవాలని డీపీఓ విక్టర్ కోరారు. ఓటు హక్కు లేనివారు ఫారం 6 ద్వారా, అలాగే మార్పులు, చేర్పులు, బదిలీలు చేసుకోదలచిన వారు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. -
నా డబ్బులు నాకిచ్చేయ్.. అంతే!
-
అతివకు అర్ధభాగం
ఆదిలాబాద్‌టౌన్: మహిళలు ఇంటికే పరిమితంకాకుండా రాజకీయాల్లో రాణించేలా ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించడంతో ఎన్నికలకు నారీమణులు సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్‌రూరల్, మావల, బేల, జైనథ్ మండలాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రిజర్వేషన్ల కోటా ప్రకటించడంతో పల్లెపోరు సిద్ధమైంది. దీంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. పోటీలో ఉండే అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రచారాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటినుంచే రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని తమ అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల మద్దతును కూడగట్టుకుంటున్నట్లు సమాచారం. కాగా నూతన పంచాయతీరాజ్ చట్టం మహిళలకు పెద్దపీఠ వేసింది. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరిలో 50శాతం కోటాను మహిళలకు కేటాయించింది. మిగితా స్థానాల్లో కూడా పురుషులతో సమానంగా పోటీ పడే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో.. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని మావల మండలంలో మూడు గ్రామపంచాయతీలు, ఆదిలాబాద్‌రూరల్ మండలంలో 34 జీపీలు, జైనథ్ మండలంలో 42, బేల మండలంలో 37 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామపంచాయతీల్లో యాభైశాతం మహిళలకు రిజర్వేషన్ చేయగా, మిగతా యాభైశాతం జనరల్‌స్థానాల్లో మహిళలు, పురుషులు పోటీలో ఉండనున్నారు. అతివలకే సగం స్థానాలు పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు సగం స్థానాలు దక్కడంతో నారీమణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం మహిళలపట్ల శ్రద్ధ కనబర్చి ఈ నిర్ణయాన్ని తీసుకుందని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. దీంతో రాజకీయంగా మహిళలు ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది. మహిళలకు 50 శాతం స్థానాలు దక్కడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామాల్లోని మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పంచాయతీలో సర్పంచ్‌గా ఎన్నికయ్యేందుకు పలువురు మహిళలు ఆసక్తిచూపుతున్నారు. వచ్చేనెలలో జరగనున్న పంచాయతీ ఎన్నికల అనంతరం ఆయా గ్రామపంచాయతీల్లో మహిళలే సర్పంచ్‌లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 50శాతం రిజర్వేషన్ ప్రకటించడం గతంలో సర్పంచ్‌గా పని చేసిన పలువురు మహిళా సర్పంచ్‌లు, మహిళా సంఘాల నాయకురాళ్లు, మహిళా ఉద్యోగులు పట్ల హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఖరారైన జైనథ్ సర్పంచు రిజర్వేషన్లు జైనథ్: మండలంలోని 29పాత, 13 కొత్త గ్రామ పంచాయతీలు కలిపి మొత్తం 42 సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు శనివారం రాత్రి ఖరారయ్యాయి. జనరల్ : మాంగుర్ల, పిప్పర్వాడ, పూసాయి, కామాయి, దీపాయిగూడ, కంఠ, సాంగ్వి(కే), రాంపూర్(టి), బెల్గాం. జనరల్ మహిళ: పెండల్వాడ, మాండగాడ, ఆకోలి, బహదూర్‌పూర్, పిప్పల్‌గావ్, ఖాప్రి, కరంజి, కూర, భోరజ్, మాకోడ. బీసీ జనరల్ : బాలాపూర్, హషీంపూర్, గిమ్మ(కే), అడ, కౌఠ, సిర్సన్న. బీసీ మహిళ : లేకర్వాడ, సావాపూర్, ఆకుర్ల, నిరాల, తరోడ, కోర్ట. ఎస్సీ జనరల్ : గూడ, జైనథ్. ఎస్సీ మహిళ : పార్డి(కే), లక్ష్మీపూర్. ఎస్టీ జనరల్ : కాన్ప మేడిగూడ(సి), పార్డి(బి), సుందరగిరి, మార్గూడ. ఎస్టీ మహిళ : కాన్పమేడిగూడ(ఆర్), జామ్ని, బెల్లూరి. 42 పంచాయతీలకు 19 స్థానాలు జనరల్‌కు, 12 స్థానాలు బీసీలకు, నాలుగు స్థానా లు ఎస్సీలకు, ఏడు స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. దీంట్లో 50శాతం స్థానాలు(21 జీపీలు) మహిళలకు కేటాయించారు. 50శాతం రిజర్వేషన్ హర్షణీయం ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో మహిళలకోసం అమలు చేస్తున్న 50శాతం రిజర్వేషన్ హర్షించదగిన విషయం. ఇదే సమయంలో గ్రా మాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా గెలుపొందే మహిళలను వారి కుటుంబ సభ్యులు రాజకీయంగా ప్రోత్సహించాలి. ప్రభుత్వం మహిళల ప్రాముఖ్యతను గుర్తించి రాజకీయంగా రిజర్వేషన్ వర్తింపజేస్తుంది. రాజకీయంగానే కాకుం డా కుటుంబ సభ్యులు అన్నిరంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించాలి. – ఏదుల్లా శోభ, బట్టిసావర్గాం -
బీసీలకు బర్రెలు, గొర్రెలేనా.. చట్టసభల్లోకి పంపరా?
సాక్షి, హైదరాబాద్ : గత 30 సంవత్సరాలుగా బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కొనసాగుతుంటే.. ఇప్పుడు ఏ ప్రాతిపదికన 22శాతానికి కుదించారో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్ బీసీలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా విడుదల చేసిన రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఏ ప్రాతిపదికన విడుదల చేసిందో చెప్పాలన్నారు. ఐదేళ్లలో ఎలాంటి గణాంక వివరాలు లేకుండా ఎలా తగ్గిస్తారని ప్రశ్నించారు. బీసీల పట్ల టీఆర్ఎస్ ప్రభ్వుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీసీలకు బర్రెలు, గొర్రెలను ఇవ్వడమే కానీ, చట్ట సభల్లో అవకాశం కల్పించేది లేదా అని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామాన్న కేసీఆర్ మాట మార్చారని ఆరోపించారు. బీసీలు న్యాయపరమైన హక్కులు సాధించే వరకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తూ విడుదల చేసిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సొంత ప్రయోజనాల కోసమే ఫ్రంట్ సీఎం కేసీఆర్ ప్రజాభివృద్ధిని గాలికొదిలేసి ఫ్రంట్ పేరుతో దేశం మీద పడి తిరుగుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. సొంతప్రయోజనాల కోసమే ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఏ ఒక్కరూ కూడా కేసీఆర్ ఫ్రంట్‌కు సానుకూలంగా స్పందించడం లేదన్నారు. తెలంగాణాలో ఏ విధంగా టీఆర్ఎస్కు ప్రజలు మొగ్గు చూపి గెలిపించారో.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి మొగ్గుచూపి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల గల్లంతు కారకులపై చర్యలు తీసుకోవాలి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 22లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ఎమ్మెల్సీ రామచంద్రారావు ఆరోపించారు. ఒక్క మల్కాగిగిరి నియోజక వర్గంలోనే 70వేల ఓట్లు గల్లంతయ్యాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సరైన ఓటు నమోదు అయ్యేట్లు ఎన్నికల కమిషన్ జాగ్రత్త వహించాలని కోరారు. ఓట్ల గల్లంతుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రిజర్వేషన్లపై ఆశలు
వైరా: గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలు కాబోతోంది. త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో సీట్ల రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. గ్రామాల్లో రిజర్వేషన్ల వల్ల ఏ వర్గం లాభపడుతుందోనని ఊహాగానాలు మొదలయ్యాయి. రాజకీయ పార్టీలు తమ ప్రాబల్యాన్ని చాటేందుకు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నాయి. జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలు ఉండగా, 5,354 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పంచాయతీ పోరుకు సిద్ధమవుతున్న ఆశావహులు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవట్లేదు. పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ..తమకే సీటు వచ్చేలా చూసుకుంటున్నారు. ఈసారి యువత ఎక్కువచోట్ల సీట్ల కోసం ప్రయత్నిస్తోంది. పోటీ చేస్తామని ముందుగానే చెబుతూ..తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో ఈసారి మరింత ఉత్సాహంగా పోటీకి సిద్ధమవుతున్నారు. గతంలో శివారు గ్రామంగా ఉండి..అవకాశాలు రాలేదని బాధపడిన ఇక్కడి జనం..ఈసారి తమ పాలన తామే చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. జనాభా ప్రాతిపదికన సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తారా ? లేకుంటే గతంలో కేటాయించిన రిజర్వేషన్ల లెక్కనే తీసుకుంటారా? అనేది తేలాల్సి ఉంది. మద్దతుదారులను ఎలాగైనా గెలిపించుకోవడానికి వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే చాకచక్యంగా పావులు కదపడానికి వ్యూహరచన చేస్తున్నాయి. నేతలు లోలోపల మంతనాలు జరుపుతున్నారు. ఈసారి ఉపసర్పంచ్‌లకూ సర్పంచ్‌లతో పాటు చెక్ పవర్ ఇస్తుడంటంతో చాలామంది ఉప సర్పంచ్ పదవులపై దృష్టి సారిస్తున్నారు. -
తెలంగాణం... గులాబీ వనం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితిని తిరుగులేని రాజకీయశక్తిగా మార్చేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. అన్ని ఎన్నికల్లోనూ పార్టీ భారీ ఆధిక్యంతో గెలవాలనే లక్ష్యంతో ముందుకెళ్లనున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శుక్రవారం నియమితులైన వెంటనే కేటీఆర్ పార్టీ బలోపేతంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ వ్యవస్థను పటిష్ట పరిచే ప్రణాళికను రచించారు. ఇందులో భాగంగానే శనివారం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్లో గత సంప్రదాయానికి భిన్నంగా ప్రధాన కార్యదర్శులందరితో మాట్లాడించారు. పార్టీ ఎలా ఉంటే బాగుంటుందో చెప్పాలని అడిగారు. ఇన్నాళ్లూ పార్టీని పట్టించుకోలేదని ఇక నుంచి కార్యకర్తలను, నాయకులను నిత్యం పార్టీతో మమేకమయ్యేలా చూడాలని పలువురు సూచించారు. అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, దేశంలోనే పటిష్టమైన పార్టీగా టీఆర్ఎస్ను తీర్చిదిద్దుతామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి మార్గదర్శనం చేసేలా పార్టీని రూపొందిస్తామన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పార్టీని మార్చాలని... రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్నీ పార్టీకి దగ్గర చేసేలా కార్యక్రమాలు ఉండాలని సూచించారు. 16 ఎంపీ సీట్లపై గురి... దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో కలసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యం తో ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ సీట్లను గెలిస్తేనే ఫెడరల్ ఫ్రంట్ నినాదం విజయవంతం అవుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్ లోక్ సభ స్థానంలో ఎంఐఎం గెలుపు ఖాయమని... మిగిలిన 16 సీట్లనూ గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2014 ఎన్నికల్లో పార్టీ 11 ఎంపీ సీట్లను గెలుచుకోగా..కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు టీఆర్ఎస్లో చేరారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాచరణ ప్రారంభించారు. ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్‌కు ఒక ప్రధాన కార్యదర్శితోపాటు ముగ్గురు కార్యదర్శులను, పార్టీ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులను ఇన్చార్జులుగా నియమిస్తున్నారు. జిల్లా కార్యాలయాలకు శంకుస్థాపన... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కేటీఆర్ 2 వారాలపాటు అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి మినహా 29 జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల భవన నిర్మాణాలకు స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 20న వరంగల్, జనగామలలో పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లోపే అన్ని భవనాల నిర్మాణం పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఆధునిక సాంకేతిక వ్యవస్థతో ఈ కార్యాలయాల నిర్మాణం జరగనుంది. సమష్టిగా ముందుకు... టీఆర్ఎస్ అందరిదీ అనే భావన కల్పించేలా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహాలు సిద్ధం చేశారు. ప్రజాప్రతినిధులతో సమానంగా పార్టీ కమిటీల్లోని వారికి ప్రా« దాన్యత ఉండేలా మార్పులు చేయా లని భావిస్తున్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే కాకుండా ఏడాది పొడవునా శ్రేణులను మమేకం చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదు ర్కొని విజయాలు సాధించేలా పార్టీ శ్రేణులకు శిక్షణ కల్పించనున్నారు. ప్రతిష్టాత్మకంగా పంచాయతీ ఎన్నికలు... గ్రామస్థాయిలోని పార్టీ శ్రేణులకు పదవులు అందించగల సర్పంచ్ ఎన్నికలనూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 12,751 పంచాయతీల్లోనూ పార్టీ మద్దతుదారులే విజయం సాధించేలా కార్యాచరణ చేపడుతోంది. వీలైనన్ని పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా వ్యూహాలు రచిస్తోంది. ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని దీనికి అనుగుణంగా మార్చుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి జనవరి 6 వరకు టీఆర్ఎస్ నేతలు ఓటర్ల నమోదు ప్రక్రియలో కీలకంగా వ్యవహరించాలని పార్టీ నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల తర్వాత సభ్యత్వ నమోదు చేపట్టనుంది. ఈ ఎన్నికల తర్వాత సహకార సంఘాల ఎన్నికలు జరగనుండటంతో వాటిలోనూ టీఆర్ఎస్ మద్దతుదారులే విజయం సాధించేలా వ్యూహాలు రచిస్తున్నారు. 2013లో జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో ఒక్క కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మాత్రమే టీఆర్ఎస్ మద్దతుదారులు చెప్పుకోదగిన స్థానాలను గెలుచుకున్నారు. అయితేఈసారి అన్ని డీసీసీబీలు, ప్రాథమిక సహకార సంఘాల్లోనూ టీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచే లక్ష్యంతో కేటీఆర్ ఉన్నారు. నేడు అట్టహాసంగా బాధ్యతల స్వీకరణ... తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ఉదయం 11.55 గంటలకు పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ భవన్లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఉదయం 10 గంటలకు బసవతారకం కేన్సర్ ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్ వరకు పార్టీ శ్రేణులు ర్యాలీగాఆయన్ను తీసుకురానున్నాయి. ఇందులో దాదాపు 300 మంది కళాకారులు ఒగ్గుడోలు, కోలాటం, పులివేషాలు, బతుకమ్మ, బోనాలు, డప్పులు, గుస్సాడీ, కొమ్ముకొయ్యలు, చిందు యక్షగానాల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. గ్రీవెన్స్ సెల్... ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేలా తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా ప్రజా ఫిర్యాదుల విభాగం (పబ్లిక్ గ్రీవెన్స్ సెల్) ఏర్పాటు చేయాలని కేటీఆర్ నిర్ణయించారు. ప్రజలెవరైనా తమ సమస్యలపై పార్టీ సభ్యులను ఆశ్రయిస్తే వాటిని పరిష్కరించేలా అధికారిక వ్యవస్థకు, ఎమ్మెల్యేలకు నివేదించేలా ఈ వ్యవస్థ పనిచేయనుంది. -
ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించి ఫుల్ జోష్‌లో ఉన్న సీఎం కేసీఆర్ ఆ వెంటనే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏప్రిల్ నుంచి 57 ఏళ్ల వయస్సు నిండిన పేదలకు వృద్ధాప్య పింఛన్ల పం పిణీ ప్రారంభించాలని ఆదేశించారు. ఎన్నికల హామీ మేరకు ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు సూచిం చారు. ప్రగతిభవన్‌లో ఆదివారం ఆయన పంచా యతీరాజ్ అంశాలతో పాటు ఎన్నికల హామీలపై సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసు కున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, అందుకే పల్లెలపై ఎక్కువ దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియ మించాలన్నారు. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తి కాగానే, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచే కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహించాలన్నారు. 9,355 మంది కార్యదర్శుల నియామకం.. రాష్ట్రంలోని 12,751 గ్రామాలకు గాను, ప్రతీ గ్రామంలో కార్యదర్శిని నియమించడం కోసం కొత్తగా 9,355 మంది గ్రామ కార్యదర్శుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా చేపట్టిన మొదటి నియామక ప్రక్రియ కూడా ఇదే. నియామక ప్రక్రియ కూడా ముగిసింది. నియామకానికి సంబంధించి కలెక్టర్లను ఆదేశిస్తూ రూపొందించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. కొత్త గ్రామ కార్యదర్శుల నియామకంతో గ్రామాలన్నింటికీ అధికారులు ఉంటారని అన్నారు. 57 ఏళ్లు నిండిన వృద్ధులకు పింఛన్లు.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ అందించనున్నట్లు కేసీఆర్ చెప్పారు. దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయాలని, అర్హులను ఎంపిక చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. లబ్ధిదారుల లెక్క తేలిన తర్వాత 2019–20 బడ్జెట్లో దీనికి సంబంధించి నిధులు కేటాయించి, ఏప్రిల్ మాసం నుంచి పింఛన్లు అందివ్వాలని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం.. అలాగే ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి.. రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారిని ఆదేశించారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లయింది. కోరుట్ల కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, నల్లగొండ జిల్లాలో గట్టుప్పల్, భూపాలపల్లి జిల్లాలోని మల్లంపల్లి, భాన్సువాడ నియోజకవర్గం పరిధిలో చండూరు, మోస్ర, మహబూబాబాద్ పరిధిలో ఇనుమర్తి, సిద్ధిపేట పరిధిలో నారాయణపేట మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపాలని సూచించారు. 19 నుంచి బతుకమ్మ చీరలు.. బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన చీరలను ఈ నెల 19 నుంచి అందజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగానే పంచడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుతో ఆగిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లకు పంచే దుస్తులతో పాటు బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల ద్వారా కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులు... కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యేల ద్వారానే పంపిణీ చేయాలని సీఎం చెప్పారు. ఎన్నికల కోడ్ కారణంగా కొద్ది రోజుల పాటు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇప్పుడు పాత పద్ధతిలోనే ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ చేయాలని చెప్పారు. 27న పంచాయతీరాజ్ అవగాహన సదస్సు.. కొత్తగా నియామకమైన గ్రామ కార్యదర్శులు, ఇప్పటికే ఉన్న పంచాయతీ కార్యదర్శులతో కలసి మొత్తం 12,751 వేల మంది కార్యదర్శులు, ఎంపీడీవోలు, ఇవోపీఆర్డీలు, డీపీఓలు, డీఎల్పీఓలతో ఈ నెల 27న ఎల్బీ స్టేడియంలో అవగాహన సదస్సు నిర్వహించాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. అధికారులంతా మధ్యాహ్నం 12 గంటల వరకు ఎల్బీ స్టేడియం చేరుకుంటారు. మధ్యాహ్న భోజన అనంతరం 2 గంటలకు సదస్సు ప్రారంభం అవుతుంది. ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసం చేస్తారు. గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేస్తారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, సీనియర్ అధికారులు ఎస్.నర్సింగ్ రావు, రాజేశ్వర్ తివారి, రామకృష్ణారావు, వికాస్ రాజ్, స్మితా సబర్వాల్, నీతూ ప్రసాద్, రఘునందన్ రావు, పౌసమి బసు తదితరులు పాల్గొన్నారు. -
ఓటరు జాబితా సిద్ధం చేయాలి
జగిత్యాల: గ్రామపంచాయతీల్లో ఓటరు జాబి తాను తయారు చేయాలని కలెక్టర్ శరత్ ఆదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు స్థానిక దేవిశ్రీ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను శనివారం పరిశీలించి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోని జాబితాలో లేని వారి పేర్లను సిద్ధం చేసుకొని ఇంటింటికీ వెళ్లి సరిచూసుకోవాలని సూచించారు. నేషనల్ రివ్యూ కమిటీ వస్తుందని.. బీసీ ఓటరు లిస్ట్‌ను తయారుచేయాలని తెలిపారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ని ర్మించుకున్న మరుగుదొడ్ల బిల్లులు చెల్లించాలన్నా రు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయి ంచాలని సూచించారు. గ్రామపంచాయతీ సెక్రటరీ, ఏపీడీ, ఈవోపీఆర్డీ, ఎంపీడీవోలు పరిశీలించి అర్హులకే అందజేయాలన్నారు. గ్రామపంచాయతీలకు ఎల్ఈడీ లైట్లు, తడి, పొడి చెత్త డబ్బాలు వస్తాయని, సరిపోకపోతే మళ్లీ పంపిస్తామన్నారు. జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీనారాయణ, అటవీ అధికారి నర్సింహారావు పాల్గొన్నారు. లక్ష్యాన్ని పూర్తి చేయాలి గొర్రెలు, పాడిపశువుల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. తన కార్యాలయంలో రెండో విడత గొర్రెల పంపిణీపై సమీక్షించారు. పాడి పశువులు 15,412కు ఇప్పటి వరకు 1333 పంపిణీ చేసినట్లు తెలిపారు. కరీంనగర్, విజయ డెయిరీల లబ్ధిదారుల వాటాను డీడీల రూపంలో త్వరగా చెల్లించాలన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ లక్ష్యం 10,510 యూనిట్లు కాగా ఇప్పటి వరకు 4629 యూనిట్లు సరఫరా చేసినట్లు తెలిపారు. చనిపోయిన గొర్రెలకు సంబ ంధించి 3,209 గొర్రెలకు ఇన్సూరెన్స్ మంజూరుకాగా 1,745 గొర్రెల లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. జిల్లా పశువైద్యాధికారి అశోక్‌రాజు, సహాయ సంచాలకులు శ్రీధర్ పాల్గొన్నారు. ‘పది’లో ఉత్తీర్ణతశాతం పెరగాలి జిల్లాలో పదోతరగతిలో ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ శరత్ సూచించారు. విద్యాశాఖ అధికారుల సమీక్షలో భాగంగా మాట్లాడారు. జిల్లాలో ఖాళీగా ఉన్న సబ్జెక్ట్ టీచర్ పోస్టులలో విద్యావలంటీర్లను నియమించినట్లు తెలిపారు. ప్రతీ సబ్జెక్ట్‌లో వందశాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందేలా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక తరగతుల్లో స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేందుకు ప్రతీ విద్యార్థి తల్లిదండ్రుల నుంచి రూ.100 తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులు చదువుకునేందుకు గ్రామస్థాయిలో ఓ గ్రూప్, వాడస్థాయిలో మరో గ్రూప్ పెట్టాలని సూచించారు. సబ్జెక్ట్‌లవారీగా ఉపాధ్యాయులు నోట్స్ తయారుచేసి పిల్లలకు అందివ్వాలన్నారు. డీఈవో వెంకటేశ్వర్లు, ఎంఈవోలు పాల్గొన్నారు. -
పార్టీకి అండగా గులాబీ దండు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కారు స్పీడు మరింత పెంచేందుకు సంస్థాగత నిర్మాణం, పటిష్టతపై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ తగ్గకముందే గ్రామ పంచాయతీ ఎన్నికలకు తెరలేచింది. ఈ నేపథ్యంలో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ యువనేత, మాజీమంత్రి కేటీఆర్‌కు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలను కట్టబెట్టారు. అధికారికంగా కేటీఆర్ సోమవారం ఉదయం 11.56 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. అంతకంటే ముందే శనివారం తెలంగాణభవన్‌లో తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లానుంచి పలువురు పార్టీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లాలో తీసుకోవాల్సిన కార్యక్రమాలపై మార్గదర్శనం చేస్తూ.. ఈనెల 28 తర్వాత తన పర్యటన ఉంటుందని కేటీఆర్ చెప్పినట్లు నాయకులు తెలిపారు. బూతు కమిటీ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని ఆయన మార్గదర్శనం చేశారు. జిల్లా సమన్వయ కర్తా? లేక అధ్యక్షుడా? సీఎం నిర్ణయమే తరువాయి తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశానికి సీనియర్ నేత కే.కేశవరావుతోపాటు 62 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దీనికి ఉమ్మడి జిల్లా నుంచి పలువురు పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన, సహాయ కార్యదర్శులు వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్టత కోసం జిల్లా, మండల, గ్రామ కమిటీల పునరుద్ధరణ చేయాలని పలువురు సూచించారు. గతేడాది ఏప్రిల్‌లో ఉమ్మడి కరీంనగర్‌లోని నాలుగు జిల్లాలకు అధ్యక్షులను ఖరారు చేసిన పిదప ప్రకటనే తరువాయిగా మారగా.. చివరి నిమిషంలో రద్దయ్యాయి. ఇదే సమయంలో ఈసారి సభ్యత్వ నమోదుకు ముందే కమిటీలు వేయాలని జిల్లాకు చెందిన పలువురు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలో జిల్లా సమన్వయకర్తను నియమించడమా..? లేదంటే పాత పద్ధతిలో జిల్లా అధ్యక్షుడు, కమిటీలు వేయడమా? అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తంకాగా.. కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత నిర్ణయం తీసుకుందామని కేటీఆర్ చెప్పినట్లు పార్టీవర్గాల సమాచారం. డిసెంబర్ 26 నుంచి జనవరి 5 వరకు జిల్లాలో జరిగే ఓటర్ల నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని, నమోదు చేసుకోని, నమోదు చేసుకున్న మిస్సయిన వారు తిరిగి నమోదు చేసుకునేలా చూడాలని సూచించారు. వచ్చేనెల 3, 6, 8 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు సూచించారు. ఒక్కో గ్రామం నుంచి సర్పంచ్ పోటీచేసే అభ్యర్థులు ఒక్కరే ఉండేలా చూడాలని, వీలైతే ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కేటీఆర్ సూచించినట్లు నేతలు తెలిపారు. త్వరలోనే పార్టీ, అనుబంధ కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నామని, ఇందుకోసం ఉద్యమ సమయం నుంచి పనిచేసిన అందరికీ అవకాశం కల్పించడం కోసం జిల్లా నాయకత్వం చొరవ చూపాలన్నారు. రెండు పార్లమెంట్ స్థానాలకు జనరల్ సెక్రెటరీలు..ఫిబ్రవరిలో సభ్యత్వ నమోదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల పరిధిలో పార్టీని మరింత పటిష్టంగా తయారు చేసేందుకు ఇన్చార్జిలుగా జనరల్ సెక్రెటరీలను నియమిస్తామని కేటీఆర్ జిల్లా నేతలకు స్పష్టం చేశారు. అలాగే పార్లమెంట్ స్థానాలకు నియమించేవారికి సహాయకులుగా ఆయా పార్లమెంట్ పరిధిలోని మూడు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ఒక్కరి చొప్పున నియమించనున్నారు. కరీంనగర్, పెద్దపల్లితోపాటు నిజామాబాద్ పార్లమెంట్ కిందకు వచ్చే ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు కూడా ఇక్కడినుంచే జనరల్ సెక్రెటరీకి తోడు ఒకరిని సహాయకుడిగా నియమించనున్నారని తెలిసింది. సంస్థాగత నిర్మాణం, పటిష్టత కోసం కమిటీలతోపాటు పెద్ద మొత్తంలో పార్టీ సభ్యత్వం నమోదు చేసేందుకు ఫిబ్రవరి నుంచి శ్రీకారం చుట్టాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత సభ్యత్వం 7.60 లక్షలుగా నమోదుకాగా.. ఈసారి అంతకుమించి కనీసం 20 శాతం అదనంగా చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. తద్వారా టీఆర్ఎస్లో సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా కార్యకర్తలకు ధీమాగా ఉంటుందన్న కోణంలో కూడా కేడర్ సిద్ధం చేయాలన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అటు జనరంజక పాలన.. ఇటు పార్టీ నిర్మాణంపై కసరత్తు చేస్తుండగా, గులాబీశ్రేణుల్లో జోష్ మరింత కనిపిస్తోంది. -
ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ
మోర్తాడ్(బాల్కొండ): పంచాయతీ రిజ ర్వేషన్లపై ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ రిజర్వేషన్ వస్తుందోనని సర్పంచ్ పదవిపై కన్నేసిన వారిలో ఒకిం త ఆందోళన కనిపిస్తోంది. పంచాయతీ రిజర్వేషన్ల ప్రకటనపై ఇంతవరకూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తాము పోటీ చేయాలనుకునే పంచాయతీలో సర్పంచ్ పదవి ఏ సామాజిక వర్గానికి రిజర్వు వస్తుందోనని విషయంపై ఎటూ తేలక పోవడంతో ఆశావహులు అయోమయానికి గురవుతున్నారు. గతంలో సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్ రోటేషన్ పద్ధతిలో జరిగేది. అయితే, తెలంగాణ ప్రభుత్వం గిరిజన తండాలను, ఆమ్లెట్ గ్రామాలను పంచాయతీలుగా ప్రకటించడంతో గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగింది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో పాత, కొత్త పంచాయతీలు కలిపి 530 ఉండగా, కామారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలు ఉన్నాయి. గిరిజన తండాలను పంచాయతీలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో ఆ తండాలోని పదవులు గిరిజనులకే వర్తించేలా రిజర్వు చేస్తూ పేర్కొంది. దీంతో ఎస్టీలకు రిజర్వు చేసిన పంచాయతీల సంఖ్య గణనీయంగా పెరుగనుంది. అయితే, పంచాయతీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. పంచాయతీల రిజర్వేషన్ల శాతాన్ని పెంచడానికి అనుమతి ఇవ్వాలని కోర్టును విన్నవించింది. అయితే, సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో పంచాయతీల రిజర్వేషన్ 50 శాతానికి మించకుండా చర్యలు తీసుకోవడంతో పాటు వచ్చే నెల 10వ తేదీలోగా ఎన్నికల తంతును పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. జాబితాల ప్రదర్శన ఆలస్యం.. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఓవైపు కసరత్తు జరుగుతుండగా, మరోవైపు బీసీ ఓటర్ల జాబితా సవరణపై ఇప్పటికీ స్పష్టత కరువైంది. శనివారం జిల్లా వ్యాప్తంగా బీసీ ఓటర్ల జాబితా ప్రదర్శించాల్సి ఉండగా ప్రదర్శించలేదు. అయితే, రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాలను జారీ చేయలేదు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గడువు దగ్గర పడుతుండటంతో ఏ పంచాయతీ, ఏ సామాజిక వర్గానికి రిజర్వు చేస్తా రో ఎవరికీ అంతు చిక్కడం లేదు. రొటేషన్ పద్ధతి లో రిజర్వేషన్లను ప్రకటిస్తారని సమాచారం ఉంటే, పంచాయతీల రిజర్వేషన్లపై కొంత అంచనా వేయడానికి అవకాశం ఉండేది. కానీ కొత్త పంచాయతీల సంఖ్య పెరగడంతో రోటేషన్ పద్ధతిలో కాకుండా కొత్తగానే రిజర్వేషన్లను ప్రకటించాల్సి ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో రిజర్వేషన్లు తమకు అనుకూలంగా ఉంటాయా.. లేక ప్రతికూలంగా ఉంటాయో అంతు చిక్కకపోవడంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎనలేని సందిగ్ధత.. పంచాయతీల్లో రిజర్వేషన్ల పరిమితి 50 శాతనికి మించకూడదని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎస్టీలకు రిజర్వు చేసిన పంచాయతీల సంఖ్య పెరిగితే ఇతర సామాజిక వర్గాలకు రిజర్వేషన్ శాతం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో గిరిజన పంచాయతీలను పక్కన పెట్టి ఇతర పంచాయతీలలోనే 50 శాతం రిజర్వు చేస్తారా అనే విషయంపై ప్రభుత్వం సందిగ్ధంలో ఉందని ప్రచారం సాగుతోంది. రిజర్వేషన్లపై ఇది వరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఒకలా ఉండగా, హైకోర్టు తీర్పు మరోలా ఉండటంతో రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో పంచాయతీ రిజర్వేషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసే విషయంపై జాప్యం కలుగుతుందా? అనే సందేహం వ్యక్తమవుతోంది. -
సన్నద్ధం
సాక్షి, మెదక్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వారం, పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది. శనివారం బీసీ ఓటర్ల తుది జాబితాను ప్రచురించనున్నారు. బీసీ ఓటర్ల జాబితా ప్రచురణతో రిజర్వేషన్ల ప్రక్రియకు మార్గం సుగమం కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. అలాగే ఎన్నికల నిర్వహణపైనా అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 469 పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల పరిధిలో మొత్తం 4086 వార్డులు ఉన్నాయి. జిల్లాలోని 20 మండలాల్లోని 469 పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు లేదా మూడు విడతల ఎన్నికల నిర్వహణపై సోమవారం కలెక్టర్ ధర్మారెడ్డి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవడం, శిక్షణపైనా అధికారులు దృష్టి సారించారు. ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలింగ్ సిబ్బంది మొత్తం 600మందికి పైగా అవసరం కానున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శనివారం (నేడు) శిక్షణ ఇవ్వనున్నారు. మిగతా పోలింగ్ సిబ్బందికి మండల స్థాయిలో ఈ నెల 23 నుంచి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాయతీ, వార్డుల వారిగా ఓటర్ల జాబితాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. సవరించిన ఓటర్ల జాబితాను పంచాయతీ అధికారులు ఆన్లైన్లో ఉంచుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల నిర్వహణకు వీలుగా అధికారులు బ్యాలెట్ బాక్సులను, బ్యాలెట్ పేపర్లను సిద్ధంగా ఉంచారు. పోరుకు పార్టీలు సై.. పంచాయతీ పోరుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. సమరోత్సాహంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైంది. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమవుతోంది. మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. పంచాయతీల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ ఫలితాలతో కాంగ్రెస్ ఢీలా పడింది. అయితే పంచాయతీ ఎన్నికల్లోనైనా తమ సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు త్వరలో జిల్లా కాంగ్రెస్ నాయకులు సమావేశం కానున్నారు. బీజేపీ, సీపీఎం, సీపీఐ తదితర పార్టీలు సైతం పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం.రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే వాటి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తాం. శనివారం బీ సీ ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నాం. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టేందుకు రెడీ అయ్యాం. ఎన్నికల ని ర్వహణకు వీలుగా పోలింగ్ సిబ్బందికి త్వరలో శిక్ష ణ తరగతులు నిర్వహించనున్నాం. – హనోక్, డీపీఓ -
పంచాయతీ పోలింగ్
జిల్లాలో ఉన్న మూడు రెవెన్యూ డివిజన్ల వారీగా గ్రామ పంచా యతీ ఎన్నికలు జరపాలని జిల్లా అధికార యంత్రాంగం భావిస్తోంది. ఇప్పటికే గ్రామాల్లో బీసీ ఓటర్ల గణన జరుగుతోంది. ప్రస్తుతం గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈనెల 15 లోపు ఈ ప్రక్రియ పూర్తి కానుంది. అధికారులకు మరోమారు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ఎన్నికల్లోనూ నోటా ఏర్పాటు చేయనున్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో మూడు విడతలుగా గ్రామ పంచాయతీ పోలింగ్ నిర్వహించాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. అధికారులు, సిబ్బంది, పోలీసు బందోబస్తు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఉన్న మూడు రెవెన్యూ డివిజన్ల వారీగా గ్రామ పంచాయతీ పోలింగ్ జరపాలని భావిస్తోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ఒక్కో రోజు పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి. గ్రామ పంచాయతీలకు మూడు నెలల్లో పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం విదితమే. ఇప్పటికే గ్రామాల్లో బీసీ ఓటర్ల గణన జరుగుతోంది. ప్రస్తుతం గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈనెల 15 లోపు ఈ ప్రక్రియ పూర్తి కానుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. గత ఎన్నికల్లో ఈ నోటా అమలులో లేదు. ఈసారి కొత్త నిబంధనను ఎన్నికల సంఘం అమలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల బదిలీలతో... ఈ ఏడాది మే, జూన్ మాసంలోనే జిల్లా అధికార యంత్రాంగం ఈ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఇప్పటికే రెండు పర్యాయాలు శిక్షణ కూడా ఇచ్చారు. ఈలోగా అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని చాలా మంది అధికారులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు జరిగాయి. స్థాయిని బట్టి ఇతర జిల్లాలకు, మండలాలకు బదిలీపై వెళ్లిపోయారు. వారి స్థానంలో ఇతర జిల్లాలకు చెందిన అధికారులు, ఇతర మండలాలకు చెందిన అధికారులు బదిలీపై జిల్లాకు వచ్చారు. దీంతో బదిలీపై వచ్చిన అధికారులకు మరోమారు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏర్పాట్లపై ఈసీ ఆరా.. గ్రామ పంచాయతీ ఎన్నికలకు జనవరిలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలుండటంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పోలింగ్ నిర్వహణ అధికారులు, సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ బాక్సుల తరలింపు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ వంటి ఏర్పాట్లు గతంలోనే పూర్తి చేశారు. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం విదితమే. తాజాగా ఈ ఏర్పాట్లు సవ్యంగా ఉన్నాయా అనే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. జిల్లా పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి డీపీఓ కృష్ణమూరి ద్వారా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. రెండు స్థాయిల్లో రిటర్నింగ్ అధికారులు.. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా స్టేజ్–1లో ఒకరు, స్టేజ్–2లో మరొకరు రిటర్నింగ్ అధికారులను నియమిస్తున్నారు. నాలుగు, ఐదు గ్రామ పంచాయతీలకు కలిపి స్టేజ్–1 రిటర్నింగ్ అధికారి ఉంటారు. ఆయా గ్రామపంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం.. నామినేషన్లు స్వీకరణ.. పరిశీలన.. ఉపసంహరణ.. బరిలోఉండే అభ్యర్థుల తుది జాబితా.. గుర్తుల కేటాయింపు.. వంటి బాధ్యతలు స్టేజ్–1 అధికారులు నిర్వర్తిస్తారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఫలితాల ప్రకటన వంటి అంశాలు స్టేజ్–2 రిటర్నింగ్ అధికారుల పరిధిలో ఉంటాయి. ఏర్పాట్లను పరిశీలిస్తున్నాం గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలిస్తున్నాము. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, బ్యాలెట్ బాక్సుల రవాణ, పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది గుర్తింపు.. పోలింగ్ నిర్వహణపై అధికారులు, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలను పరిశీలిస్తున్నాము. ప్రస్తుతం బీసీ ఓటర్ల గణన కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. - అశోక్ కుమార్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి -
ఇక ‘పంచాయతీ’ ఎన్నికలకు వేళాయె !
అసెంబ్లీ ఎన్నికల హడావుడి తగ్గనే లేదు. అప్పుడే పంచాయతీ ఎన్నికపై జిల్లాలో చర్చ జరుగుతోంది. ముందస్తు ఎన్నికలు రాకపోయి ఉంటే ఈ సమయానికి పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేవి. కానీ ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అధికారుల సమాచారం మేరకు డిసెంబర్ 25వ తేదీలోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. జనవరి 15లోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఎన్నికల కసరత్తులో నిమగ్నమయ్యారు. అక్టోబర్‌లో ప్రకటించిన బీసీ ఓటరు జాబితాలో తప్పులున్నాయని కోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు మళ్లీ బీసీ ఓటర్ల లెక్క తేల్చాలని ఆదేశించింది. రెండో సారి బీసీ ఓటర్లను గుర్తించిన అధికారులు ఆది, సోమవారాల్లో ఓటరు జాబితాను ప్రదర్శిస్తున్నారు. అందరి దృష్టి ప్రస్తుతం శాసనసభ ఎన్నికల ఫలితాలపై ఉంది. అది పూర్తవ్వగానే.. ఇక ‘పంచాయతీల’ వైపే దృష్టి.. సాక్షి, మెదక్ : పంచాయతీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఇంకా ఒకరోజే గడువు మిగిలి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే అధికార యంత్రాంగం పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ఆగస్టుతోనే ముగిసిన విషయం తెలిసిందే. పంచాయతీ పాలకవర్గం పదవీకాలం ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే పంచాయతీ అధికారులు సిద్ధం చేసిన బీసీ ఓటరు జాబితాలో తప్పులున్నాయంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం బీసీ ఓటరు గణన మరోమారు చేపట్టి ఓటరు జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది. దీంతో అధికారులు మరో సారి బీసీ ఓటర్ల గణన చేపట్టారు. అయితే ఇంతలోనే అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చాయి. దీంతో బీసీ ఓటర్ల గణన ప్రక్రియ నిలిచిపోయింది. జనవరి 15లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ తాజాగా హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. దీంతో అధికారులు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు బీసీ ఓటరు జాబితాను సిద్ధం చేశారు. పంచాయతీ, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ప్రక్రియలో కీలకం. ఈనెల15న బీసీ ఓటరు తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు. అధికారుల సమాచారం మేరకు ఈనెల 25వ తేదీలోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తోంది. అభ్యంతరాల స్వీకరణ.. జిల్లాలో మొత్తం 20మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో 469 పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల పరిధిలో 4,086 వార్డులున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియ కీలకమైంది. ఇందుకోసం అధికారులు ఇదివరకే ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ ఓటర్లను గుర్తించి అక్టోబర్ 10వ తేదీన తుది ఓటరు జాబితాను సిద్ధం చేశారు. గ్రామాల వారిగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించడం జరిగింది. ముసాయిదా జాబితాను అనుసరించి జిల్లాలో 4,26, 873 మంది ఓటర్లున్నారు. ఇందులో ఎస్సీ ఓటర్లు 76,677, ఎస్టీ ఓటర్లు 42,031, జనరల్ ఓటర్లు 32,886 ఓటర్లు ఉన్నారు. అలాగే బీసీ ఓటర్లు 2,75,279 మంది ఉన్నట్లు ప్రకటించారు. బీసీ ఓటరు జాబితా రూపకల్పనలో తప్పులు చోటు చేసుకున్నట్లు పలువురు కోర్టును ఆశ్రయించడంతో మరోమారు బీసీ ఓటర్లను గుర్తించి జాబితాను ప్రకటించాలని కోర్టు ప్రకటించింది. కోర్టు ఆదేశాల మేరకు నవంబర్ 3వ వారంలోనే బీసీ ఓటరు జాబితా సిద్ధం చేసుకోవాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆలస్యమైంది. తాజాగా అధికారులు బీసీ ఓటర్లను గ్రామాల వారిగా గుర్తించడం జరిగింది. బీసీ ఓటర్ల ముసాదాను ఆది, సోమవారాల్లో పంచాయతీల్లో అందుబాటులో ఉంచారు. బీసీ ఓటర్ల ముసాయిదా జాబితాపై ఏవైన ఫీర్యాదులుంటే ఈనెల12న స్వీకరించనున్నారు. 13, 14 తేదీల్లో అభ్యంతరాలను పరిష్కరించి, 15న బీసీ ఓటరు తుది జాబితాను ప్రకటించడం జరుగుతుంది. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం కానుంది. బీసీ ఓటర్ల జాబితా అందుబాటులో ఉన్నందున ప్రభుత్వం త్వరలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి. -
పంచాయతీ ఎన్నికలకు ప్రణాళిక
ఖమ్మంసహకారనగర్: నిన్న మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల సందడి..ముగిసిందో లేదో ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు జనవరి నెలలోగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో అధికారులంతా ఆ పనుల్లో నిమగ్నమవుతున్నారు. కొత్త గ్రామ పంచాయతీల ప్రకారం రిజర్వేషన్లను పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించనున్నారు. తాజాగా బీసీ ఓటర్ల గణనను చేయాలని ఆదేశాలు అందడంతో జిల్లా అధికార యంత్రాంగం ఆ కసరత్తులో నిమగ్నమైంది. ఆదివారం బీసీ ఓటర్లకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను గ్రామ పంచాయతీల వారీగా విడుదల చేశారు. జిల్లాలోని 584గ్రామ పంచాయతీల్లో ఈ పోరు మొదలవనుంది. 21మండలాల పరిధిలో 584 గ్రామ పంచాయతీలు ఉండటంతో వాటిల్లో బీసీ ఓటర్ల గణనపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎట్టకేలకు ఆదివారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీన అభ్యంతరాలను స్వీకరించి అదే రోజున పరిశీలించనున్నారు. గ్రామసభలు ఇలా.. 12వ తేదీన అందిన అభ్యంతరాలు, ఓటర్ల గణనపై 13, 14వ తేదీల్లో అంతటా గ్రామసభలు నిర్వహించనున్నారు. అనంతరం 15వ తేదీన ఓటరు జాబితాను ప్రకటించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లలో సందిగ్ధత నెలకొనడంతో పాటు ఈ నెల 11వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పంచాయతీ రాజ్ ఎన్నికల గడువు కూడా దగ్గర పడుతుండడంతో వచ్చే కొత్త ప్రభుత్వం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. 15న తుది జాబితా.. బీసీ ఓటర్ల తుది జాబితాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 13, 14వ తేదీల్లో గ్రామసభ అనంతరం 15వ తేదీన తుది జాబితాను విడుదల చేయనున్నారు. దీని ప్రకారం ఎన్నికలు జరగనున్నాయి. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వేశాం.. గ్రామ పంచాయతీల్లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశాం. 12న అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. అనంతరం 13, 14వ తేదీల్లో గ్రామసభలు నిర్వహిస్తాం. ఆ తర్వాత తుది జాబితాను విడుదల చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. – శ్రీనివాస్, డీపీఓ, ఖమ్మం -
పల్లెపోరు
సాక్షి, వనపర్తి: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం పల్లెపోరుకు సన్నద్ధమవుతోంది. దీనిపై అధికార యంత్రాంగం తగిన కార్యాచరణపై దృష్టిసారించింది. పంచాయతీ ఎన్నికలను గడువులోగా నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించడంపై హైకోర్టు ఈనెల 11న తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించడం ఏకపక్ష నిర్ణయమని, రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించింది. తీర్పు వెలువడిన మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు సంక్రాంతి పండగలోపే ఎన్నికలు ముగించాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఆశలపై నీళ్లు! ఈ ఏడాది జూలైలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం జూన్ నాటికే ఓటరు తుదిజాబితా విడుదల, పోలింగ్ బూత్‌ల గుర్తింపు, ఎన్నికల నిర్వహణకు సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేయడం, బ్యాలెట్ నమూనాలు, ప్రింటింగ్ వంటి పనులు పూర్తిచేసింది. రేపోమాపో ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల కానున్న సమయంలో రిజర్వేషన్ల ప్రక్రియ తేలే వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకూడదని గత జూన్ 26న హైకోర్టు తీర్పు వెలువరించింది. అప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు చేసిన అధికారులు వాటిని పక్కన పెట్టేశారు. ఎన్నికల సామగ్రిని సైతం స్టోర్‌రూమ్‌లకు తరలించారు. ఇంతలో కోర్టు తీర్పు నేపథ్యంలో ఆశావహుల ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లయింది. మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదలు కానుంది. అధికారులకు ప్రత్యేక శిక్షణ సెప్టెంబర్ 25న అసెంబ్లీ ఎన్నికలకు విడుదల చేసిన ఓటరు తుదిజాబితా ఆధారంగానే ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన ఆదేశాలను ప్రభుత్వం ఇటీవల జారీచేసింది. నవంబర్ మొదటి వారం నుంచి మూడో వారంలోగా గ్రామాలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను తయారుచేసి అన్ని పంచాయతీ కార్యాలయాల వద్ద అతికించనున్నారు. నవంబర్ నాలుగో వారం నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త ఓటర్లను చేర్చడంతో పాటు మరోసారి జాబితాను ప్రచురించనున్నారు. నవంబర్ నాలుగో వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, స్టేజీ –1, స్టేజీ –2 అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనున్నారు. డిసెంబర్ రెండో వరకు ఎన్నికల సమాచారాన్ని సేకరించడం, ఏర్పాట్లను పూర్తిచేయడం వంటి పనులను పూర్తిచేయనున్నారు. ఈ ఎన్నికల ఏర్పాట్లకు సబ్‌కలెక్టర్, ఆర్డీఓ, జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, పంచాయతీ సెక్రటరీలు పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. రిజర్వేషన్ల అంశమే కీలకం గడువులోగా ఎన్నికలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం మేలో రిజర్వేషన్లను ప్రకటించింది. దీని ప్రకారం ఎస్టీలకు 5.17శాతం, ఎస్సీలకు 20.46శాతం, బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కేటాయించింది. కానీ వీటిని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ప్రభుత్వం మరోసారి ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్న తరుణంలో రిజర్వేషన్ల అంశం కీలకం కానుంది. పాత వాటి ప్రకారమే రిజర్వేషన్లు ఖరారు చేస్తారా ? లేక కొత్తగా ప్రకటిస్తారా అన్నది తేలాల్సి ఉంది. గ్రామాల్లో రాజకీయ వేడి ఆగస్టు 2న గ్రామపంచాయతీ పాలకవర్గాలకు గడువు ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. అదేరోజు నుంచి కొత్త పంచాయతీలుగా అవతరించిన తండాలు, అనుబంధ గ్రామాల్లోనూ పంచాయతీ కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు ప్రత్యేకాధికారులను నియమించారు. వనపర్తి జిల్లాలో కొత్తగా ఏర్పడిన వాటితో కలిపి 255 గ్రామ పంచాయతీలు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 255, నాగర్‌కర్నూల్‌లో 543, మహబూబ్‌నగర్ జిల్లాలో 721 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రత్యేకాధికారుల పాలనలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఇప్పటికే అన్నిపార్టీలు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. దీనికితోడు పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు కొనసాగుతుండటంతో గ్రామాల్లో మరింత రాజకీయ వేడి రాజుకోనుంది. -
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉమ్మడి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాజీ సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు స్పందిస్తూ.. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేశించింది. సర్పంచుల పదవీ కాలం ఆగస్ట్‌లోనే ముగియడంతో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తోంది. దానిని కొనసాగిస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.90ను హైకోర్టు కొట్టివేసింది. చివరిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పదవీ కాలం ముగిసిన తెలంగాణలోని పంచాయతీలకు కూడా మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల హైకోర్టు అదేశించిన విషయం తెలిసిందే. -
మూడు నెలల్లో పంచాయతీ
-
తెలంగాణలో పోలీస్ రాజ్యం: కిషన్ రెడ్డి
హైదరాబాద్ : ధర్నా చౌక్ ఎత్తివేసి తెలంగాణలో పోలీసు రాజ్యం నడిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మంత్రుల మీద, సచివాలయం మీద నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. గ్రామ స్వరాజ్యంలో భాగంగా పంచాయతీల వ్యవస్థ కీలకమైందని, ప్రజాస్వామ్యంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రధానమైన అంశమని పేర్కొన్నారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఇలాంటి సందర్భంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. సర్పంచ్ వ్యవస్థను రద్దు చేసి పంచాయతీలను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ప్రభుత్వం అనుకుంటుందని విమర్శించారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, స్వయం ఉపాధి, పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలంటే గ్రామ సభల ద్వారానే ఇవ్వాలి..కానీ వీటికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ కండువా కప్పుకోకుంటే ట్రాక్టర్లు, సబ్సిడీ వస్తువులు రాకుండా చేస్తున్నారని విమర్శించారు. మన ఊరు- మన ప్రణాళిక అని చెప్పారు...కానీ మన ఊరు అక్కడే ఉంది కానీ ప్రణాళికలు ఎక్కడికో పోయాయని ఎద్దేవా చేశారు. కేంద్రం పంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నదని అన్నారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రంలో ఉందా? నాకు తెలిసి లేదనే అనిపిస్తోంది...నూతన పంచాయతీ రాజ్ చట్టం తీసుకువచ్చి పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహిస్తామని చెప్పారు...ఇప్పటి వరకు ఆ ఊసే లేదని తీవ్రంగా ఎండగట్టారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లపై స్పష్టత లేకపోవడంతో హైకోర్టు స్టే ఇచ్చిందని..స్టే ఇచ్చి చాలా రోజులుగా కూడా అయింది..కానీ సీఎం మిన్నకుండిపోయి చాలా సంతోషంగా కనపడుతున్నట్లు ఉందన్నారు. ఆర్ధిక, హోంశాఖలకు తెలియకుండానే కొన్ని నిర్ణయాలు జరిగిపోతున్నాయని అన్నారు. -
‘సమగ్ర సర్వే గణాంకాలు బయటపెట్టండి’
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గ్రామ స్వరాజ్యం కోసం తీసుకువచ్చిన చట్టాన్ని అమలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఓ కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కొన్ని సాకులు అడ్డుపెట్టుకుని పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఓబీసీలకు రిజర్వేషన్ల్ అంశంలో అన్యాయం జరిగేలా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని భట్టి ఆరోపించారు. ఓబీసీల సరైన గణన చేయమని కోర్టు చెప్పిందని, సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ డబ్బుతో సమగ్ర కుటుంబ సర్వే చేశారని, దానికి సంబంధించిన లెక్కలను బయట పెట్టాలని అన్నారు. జనాభా ప్రకారం ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
పంచాయతీ ఎన్నికల్లోనూ ‘నోటా’
మోర్తాడ్(బాల్కొండ) : ఎన్నికల్లో పోటీ చేసే అభ్య ర్థులు నచ్చకపోతే నోటాకు ఓటు వేసే విధానంను ఎన్నికల కమిషన్ అమలులోకి తీసుకు వచ్చింది. నోటాకు ఓటు గడచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నుంచి అమలులోకి వచ్చింది. అయితే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే ఓటర్లు నోటాకు ఓటు వేసే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించింది. త్వరలో నిర్వహించబోయే పంచా యతీ ఎన్నికల్లో ఓటర్లు నోటాకు ఓటు వేసే చాన్స్ ను ఉపయోగించుకోవచ్చు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇంకా ఖరారు కాకపోయినా అధికార యంత్రాంగం మాత్రం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ ఉంటే ఎలాంటి గుర్తులను కేటాయిస్తామో అనే ఆంశాన్ని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో సర్పంచ్ స్థానానికి పోటీ ఉంటే కేటాయించే గుర్తులు, వార్డు స్థానాలకు పోటీ ఉంటే కేటాయించే గుర్తులను పరిగణనలోకి తీసుకుని బ్యాలెట్ పత్రాలను ముందస్తుంగా ముద్రించడానికి పంచాయతీ రాజ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శుక్ర వారం నుంచి ఆరు రోజుల పాటు సర్పంచ్, వార్డు స్థానాలకు అవసరమైన బ్యాలెట్ల ముద్రణ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఆయా మండలాల అధికారులు బ్యాలెట్ పత్రాల ముద్రణకు సిబ్బందిని కేటాయించారు. ఈవోపీఆర్డీలు, మండల పరిషత్ సూపరిండెంట్లు, పం చాయతీ కార్యదర్శులకు ఆయా మండలాల్లోని సర్పంచ్, వార్డు స్థానాలకు అవసరమైన బ్యాలెట్ పత్రాల ముద్రణ విధులను అప్పగించారు. జిల్లా లో 530 సర్పంచ్ స్థానాలతో పాటు 4,932 వార్డు స్థానాలకు ఎన్నికలు మూడు విడతల్లో జరుగనున్నాయి. జిల్లా పంచాయతీ అధికారులు ఎంపిక చేసిన ప్రింటింగ్ ప్రెస్‌లలో రెవెన్యూ డివిజన్ల వారీగా బ్యాలెట్ పత్రాల ముద్రణకు ఆర్డర్లను ఇచ్చారు. ఏ సర్పంచ్ స్థానానికి ఎంత మంది, అలాగే వార్డు స్థానానికి పోటీలో ఎంత మంది ఉంటారనే విషయం నామినేషన్ల పరిశీలన, విత్‌డ్రాల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు తెలియదు. నామినేషన్ల పరిశీలన, విత్‌డ్రాలు ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఎన్నికల అధికారి ఫాం 9 జారీ చేస్తేనే ఆయా స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనే విషయం స్పష్టం అవుతుంది ఫాం 9 జారీ తరువాత ఎన్నికల నిర్వహణకు వారం రోజులే గడువు ఉంటుంది. తక్కువ సమయంలో బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి కాదనే ఉద్దేశంతో ముందస్తుగానే ముద్రణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అయితే గతంలో బ్యాలెట్ పత్రాల్లో గుర్తులను ముద్రించి ఎన్నికల కు ముందుగానే సిద్ధంగా ఉంచేవారు. పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని అవసరం ఉన్న గుర్తుల వరకు బ్యాలెట్ పత్రాని ఉంచి అవసరం లేని గుర్తులు ఉన్న పత్రాన్ని చింపివేసేవారు. అయితే ఇప్పుడు ప్రతి బ్యాలెట్ పత్రంలో నోటాకు గుర్తును కేటాయిస్తుండటంతో అంచనాలు వేసి బ్యాలెట్ పత్రాలను ముద్రించాలని అధికారులు నిర్ణయించారు. నోటాకు ఇంటూ మార్క్‌ను కేటాయించగా ప్రతి బ్యాలెట్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తులతో పాటు ఇంటూ మార్క్ ఉన్న గుర్తు ఉంటుంది. అంచనా ఇలా కొన్ని బ్యాలెట్ పత్రాల్లో రెండు ఎన్నికల గుర్తుల తో పాటు మరోటి నోటా గుర్తు ఉంటుంది. అంటే టూ ప్లస్ వన్, త్రీ ప్లస్ వన్, ఫోర్ ప్లస్ వన్, ఇలా గరిష్టంగా 16 గుర్తులతో పాటు ఒకటి నోటాకు అవకాశం ఉంటుంది. కొన్ని స్థానాల్లోనే పోటీ ఎక్కువగా ఉంటుందని ఎక్కువ స్థానాల్లో పోటీ తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో బ్యాలెట్ పత్రా ల ముద్రణను ముందస్తుగా చేపట్టారు. బ్యాలెట్ పత్రాల ముద్రణకు సంబంధించి వివిధ సర్పంచ్, వార్డు స్థానాలకు గతంలో పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుం టున్నారు. ఒక వేళ బ్యాలెట్ పత్రాలు తక్కువ అని తేలితే ఇప్పుడు ముందస్తుగా ముద్రించిన వాటికి అదనంగా మరి కొన్నింటిని ముద్రిస్తే సమయం తక్కువ తీసుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా పంచాయతీ ఎన్నికల్లోను నోటాకు చోటు ఇవ్వడం గ్రామాలలో చర్చనీయాంశం అవుతుందని చెప్పవచ్చు. -
ఓటమి భయం వల్లేనా..?
లక్కవరపుకోట(ఎస్‌కోట): నాలుగేళ్లుగా పంచాయతీల్లో ఉప ఎన్నికలు నిర్వహించకుండా టీడీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తోంది. వాస్తవానికి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ మరణించినా, రాజీనామా చేసిన ఆరు నెలల లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ నాలుగేళ్లుగా టీడీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. మరోవైపు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేయడంతో బినామీ నాయకులు అధికారం వెలగబెడుతూ గ్రామాల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. శాసనానికి కట్టుబడి పాలన చేస్తాను అని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి కనీసం ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించని స్థితిలో ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు. పంచాయతీలకు ఉప ఎన్నికలు నిర్వహించకపోవడంతో పలువురు కోర్టుకు వెళితే అక్కడే ఎన్నికలు పెట్టి, మిగిలిన గ్రామాల్లో నిర్వహించకుండా వదిలేశారు. ఎందుకో ఆ భయం.. ఎందుకు పంచాయతీల్లో ఉప ఎన్నికలు నిర్వహించడం లేదన్న చర్చ ప్రజల్లో పెద్ద ఎత్తున నడుస్తోంది. ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి చెందుతామనే ఆలోచన రావడం వల్లే ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రజలు అనుకుంటున్నారు. 2013 జూన్‌లో జిల్లాలోని 921 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. అప్పటి నుంచి వివిధ కారణాల వల్ల 15 సర్పంచ్‌లు, 168 వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ఆయా స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. దీని వల్ల సదరు గ్రామాలు, వార్డుల్లో అభివృద్ధి కుంటు పడుతోంది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఉప ఎన్నికలు నిర్వహించాలని పట్టు పడుతున్నప్పటికీ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఎదో హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో విజయనగరం మండలం సారిక పంచాయతీలో ఉప ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించింది. మిగిలిన చోట్ల గాలికొదిలేసింది. కుంటు సాకులు చెప్పడం తప్ప ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మండలంలోని ఖాసా పేట పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇక్కడ ఉప ఎన్నికలు జరగలేదు. ఓటరు జాబితా తయారు చేశాం.. జిల్లాలో వివిధ కారణాల రీత్యా ఖాళీ అయిన సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు రెండు పర్యాయాలు ఓటర్ జాబితాను సిద్ధం చేశాం. కానీ ఎన్నికలు జరగలేదు. నిబంధనల ప్రకారం ఆరు నెలల లోపు ఎన్నికలు నిర్వహించాలి. ఈ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారులకు నివేదించాం. – బి.సత్యనారాయణ, డీపీఓ. నాలుగేళ్లు అవుతోంది.. మాది ఎల్కోట మండలంలోని ఖాసా పేట గ్రామం. మా సర్పంచ్ మరణించి నాలుగేళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఉప సర్పంచే అన్ని తానై అధికారం చెలాయిస్తున్నాడు. నిబంధనల ప్రకారం ఆరు నెలలలోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటివరకు ఆ పని అధికారులు చేయలేదు. అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే సందేహం తలెత్తుతుంది. – సిహెచ్. మాధవరావు,ఖాసాపేట,లక్కవరపుకోట. -
జులైలోగా ఎన్నికలు పూర్తి చేయాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: జూలై నెలాఖరు కల్లా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. విలేకరులతో మాట్లాడుతూ..వచ్చే ఏడాది ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ పెద్ద సవాల్‌తో కూడుకున్న విషయమని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో 1.5 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వివరించారు. జీహెచ్ఎంసీలో ఉన్న ఓటర్ల కంటే పంచాయతీ ఎన్నికల్లో రెట్టింపు సంఖ్యలో ఓటర్లు ఉన్నారని చెప్పారు. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా 30 మంది చనిపోయారని వ్యాఖ్యానించారు. మన రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ చాలా సమర్థంగా ఉంటుందని అన్నారు. ఏడాది క్రితం నుంచే ఎన్నికల నిర్వహణ కసరత్తును ప్రారంభించామని, ఎట్టి పరిస్థితుల్లోనూ జూలైలోగా ఎన్నికలు పూర్తి చేయాల్సిందేనని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ రెండు నెలల్లో కొత్తగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. అలాగే ముద్రణా సామగ్రి జూన్ 15 నాటికి సిద్ధమవుతుందని తెలిపారు. ఓటర్ల తుది జాబితా కూడా సిద్ధం చేశామని వెల్లడించారు. రిట్నరింగ్ అధికారులను గుర్తించి కలెక్టర్లు నియమించాలని సూచించారు. బ్యాలెట్ పత్రాలు జిల్లాలోనే ముద్రించాలని తెలిపారు. -
ఎన్నికల కమిషన్కేటోకరా!
అదో గిరిజన పంచాయతీ. గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. అదనంగా మరో ట్యాంకు నిర్మించాల్సి ఉంది. ఈ పంచాయతీ పరిధిలోని మధుర గ్రామాల్లో వీధులకు ఇంకా సీసీ రోడ్లు, కాలువలు నిర్మించాల్సి ఉంది. ఈ పనులు చేపట్టేందుకు కావలసిన నిధులు పంచాయతీ ఖాతాలో ఉన్నాయి. కానీ వాటిని తీయడానికి సర్పంచ్ భయపడుతున్నారు. కారణం ఈ పంచాయతీలో పలు వార్డులకు ఎన్నికలు జరిగినా... ఏకగ్రీవ ఎన్నికలు జరిగినట్టు తప్పుడు నివేదిక పంపించి నజరానాగా తెచ్చుకున్న నిధులే అవి. వాటిని ఖర్చుచేసేందుకు సాహసించక... సర్కారుకు జమచేస్తే గుట్టుకాస్తా రట్టవుతుందేమోనన్న భయంతో అలా నిధులు మగ్గబెడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : పథకాల అమలులోనే ఇంతవరకూ అవినీతి చోటు చేసుకున్న వైనం చూశాం గానీ... ఏకంగా ఎన్నికల కమిషన్నే తప్పుదారి పట్టించిన సంఘటన ఎక్కడా చూడం. కానీ మెరకముడిదాం మండలం కొండలావేరు గిరిజన పంచాయతీ 2013లో ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల కమిషన్ కు, ప్రభుత్వానికి నివేదికనిచ్చి రూ.7 లక్షల ప్రోత్సాహకాన్ని తీసేసుకున్నారు. కానీ వాస్తవాని కి ఈ పంచాయతీలోని నాలుగు వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ విషయాన్ని దాచిపెట్టి డబ్బులు పొందిన విషయం సాక్షి పరిశోధనలో స్పష్టమైం ది. నీ ఆ నిధులు గ్రామ అభివృద్ధికైనా విని యోగించారా అంటే అదీ లేదు. నేటికీ పంచా యతీ అకౌంట్లోనే మురుగుతోంది. వెనక్కి పంపి తే సమాధానం చెప్పుకోవాల్సి రావడమేగాకుండా... తప్పు ఒప్పుకోవాల్సి వస్తుందని అక్కడి టీడీపీ సర్పంచ్ సిహెచ్ బంగారు నాయుడు ఆ నిధులు వాడకుండా, వెనక్కి పంపకుండా ఉంచేశారు. అసలేం జరిగిందంటే... 2013–14 పంచాయతీ ఎన్నికల్లో ఈ పంచాయ తీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. అయితే పది వార్డుల్లో ఆరిం ట ఏకగ్రీవం కాగా మిగిలిన నాలుగు వార్డులకు (5, 6, 7, 9 వార్డులు) ఎన్నిక జరిగింది. అలాగే 4వ వార్డులో అభ్యర్థుల నామి నేషన్లను తిరస్కరించడంతో ఆ వార్డుకు మరలా కొద్దిరోజుల తరువాత ఎన్నిక జరిగింది. ఈ లెక్క న మొత్తం ఐదు వార్డులకు ఎన్నికలు జరిగాయి. అయినప్పటికీ టీడీపీ నేతల ఒత్తిళ్లతో అప్పటి ఎంపీడీఓ సిహెచ్.సుబ్బలక్ష్మి ఈ పంచాయతీ ఏకగ్రీవమైన ట్టు జిల్లా ఉన్నతాధికారులకు, ఎన్నికల కమిషన్ కు నివేదికను పంపించి వారిని తప్పుదోవ పట్టిం చారు. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్క వార్డుకు ఎన్నిక జరిగినా ఏకగ్రీవం కానట్టే. కానీ తప్పుడు నివేదిక అందించడంతో ప్రభుత్వం ముందుగా ప్రకటించిన మేరకు ఏకగ్రీవమైన పంచాయతీలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహక మొత్తం రూ.7 లక్షలు కొండలావేరు పంచాయతీకి మంజూరయ్యాయి. నిధుల ఖర్చుకు వెనుకడుగు నిధులు విడుదలైన తర్వాత సర్పంచ్‌కు వాటిని వినియోగిస్తే అసలు విషయం బయటపడుతుం దనే భయం పట్టుకుంది. పలుమార్లు ఈ నిధుల ను డ్రాచేసేందుకు ప్రయత్నించినప్పటికీ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. ఇలా నాలుగేళ్లుగా ఆ నిధులు పంచాయతీ అక్కౌంట్లో మూలుగుతున్నాయి. నిజానికి ఈ నిధులను చలానా తీసి జిల్లా పంచాయతీ అధికారి వారి సూచనల మేరకు ప్రభుత్వానికి తిరిగి వెనక్కి పంపించాలి. కానీ అలా పంపించలేదు. పంపిస్తే ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టించిన నేరాన్ని అంగీకరించాల్సి వస్తుందని ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ విషయాలేవీ గ్రామస్తులకు తెలియకుండా జాగ్రత్తపడుతూ వస్తున్నారు. ఈ వంచనను పసిగట్టిన ‘సాక్షి’ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. చివరికి సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా వాడటం తో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడీ నిధులను ఏం చేస్తారు?..తప్పు చేసిన అధికార పార్టీ సర్పంచ్, అప్పటి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది జిల్లా కలెక్టర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఏకగ్రీవానికి వచ్చిన నిధులు డ్రాచేయలేదు సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీ వం అయ్యాయని మా పం చాయితీకి రూ.7 లక్షలు నిధులు వచ్చాయి. అయితే పంచాయతీ ఏకగ్రీవం కాలేదు. కొన్ని వార్డుల్లో ఎన్నిక జరగడంతో ఏకగ్రీవం కానట్టేనని కొందరు అధికారులు చెప్పడంతో ఆ నిధులను డ్రా చేయకుండా అలాగే పంచాయతీ అక్కౌంట్లో ఉంచేశాం. – సీహెచ్.బంగారునాయుడు, సర్పంచ్, కొండలావేరు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం కొండలావేరు పంచాయతీ కి ఏకగ్రీవ నజరానాగా వచ్చిన రూ.7 లక్షల విషయమై జిల్లా ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి, ఆ నిధులను వెనక్కి పంపిస్తాం. ఆ నిధులను డ్రా చేయకుండా ఇప్పటికే మా పంచాయతీ విస్తరణాధికారి సర్పంచ్, కార్యదర్శులకు సూచించడంతో ఆ నిధులను డ్రాచేయకుండా అలాగే పంచాయతీ అకౌంట్లో వుంచారు. ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. – ఎ.త్రినాథరావు, ఎంపీడీఓ, మెరకముడిదాం. నిధులు డ్రా చేయలేదు పంచాయతీ ఏకగ్రీవమైనట్టు వచ్చిన రూ. 7 లక్షలు డ్రా చేయలేదు, వాటిని పంచాయతీ అక్కౌంట్లోనే వుంచాం. జిల్లా, మండల అధికారుల సూచనల మేరకు వారి ఆదేశానుసారం చర్యలు చేపడతాం. – బి.గోవింద్, పంచాయతీ కార్యదర్శి, కొండలావేరు -
రెండు విడతల్లో..పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు
గద్వాల రూరల్ : జిల్లాలో పోలింగ్ సిబ్బంది కొరత దృష్ట్యా ఈసారి పంచాయతీ ఎన్నికలను రెండు విడతలుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఓటర్ల జాబితా పాతవి, కొత్తవి కలిపి వార్డుల వారీగా సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా, జిల్లాలో మొత్తం 255 గ్రామపంచాయతీలు, 4,86,930మంది ఓటర్లు ఉండగా, సర్పంచ్ స్థానాలతో కలిపి వార్డుల సంఖ్య 2,645కి చేరుకుంది. ఈ ఏడాది మార్చి 25న అసెంబ్లీల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన తుది జాబితాను అనుసరించి ఫొటోలతో ఓటర్ల జాబితాను రూపొందించాలని సూచించారు. ఒక్కో జాబితాను 25 సెట్లుగా సిద్ధం చేయాలన్నారు. పంచాయతీ నోటీస్ బోర్డుపై ఒకటి, గ్రామంలో ఉండే ప్రధాన కూడళ్లలో మూడు జాబితాలను పెట్టాల్సి ఉంటుంది. అలాగే మండల పరిషత్ కార్యాలయంలో ఒకటి, జిల్లా పంచాయతీ కార్యాలయంలో రెండు, రాజకీయ పార్టీలకు ఇచ్చేందుకుగాను 11 కాపీలు, అందుబాటులో మరో ఏడు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఇందుకు అయ్యే బడ్జెట్ అంచనాలను తమకు పంపించాలని ఎన్నికల కమిషనర్ కోరారు. ఈపాటికే నోటిఫికేషన్ జారీ ఈపాటికే ఓటర్ల జాబితాపై నోటిఫికేషన్ జారీ అయింది. వచ్చే జూలై నెలాఖరుతో ప్రస్తుత పాలకవర్గాల గడువు ముగియనుండటంతో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తోంది. ప్రతి 500జనాభా కలిగి ఉండి అనుబంధ పంచాయతీకి కిలో మీటరున్నర ఉన్న గ్రామాలతోపాటు గిరిజన తండాలను గ్రామపంచాయతీలు, వార్డులను ఏర్పాటు చేయడంతోపాటు రిజర్వేషన్ల రొటేషన్‌లో పలు మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఐదేళ్ల రొటేషన్‌ను పదేళ్లకు పెంచింది. ఆయా గ్రామాల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీల వారీగా ఉన్న ఓటర్ల ఆధారంగా కొత్త రొటేషన్ ఖరారు చేయనున్నారు. ఇందులో మొదట అత్యధికంగా ఓటర్లు ఉన్న వారిని చేర్చనున్నారు. ఈనెల 30న గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. రాజకీయ పార్టీలతో మే 1న జిల్లాస్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి, 3న మండలస్థాయిలో ఎంపీడీఓలు సమావేశాలు నిర్వహించనున్నారు. మే 1 నుంచి 8వ తేదీ వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 10న పరిష్కరించి, 17వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. బ్యాలెట్ పద్ధతిలోనే.. గ్రామపంచాయతీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితా చాంతాడంత ఉండటంతో ఈసారి కూడా ఈవీఎంలతో సాధ్యం కాదు. దీంతో మే లేదా జూన్‌లో బ్యాలెట్ పద్ధతిలోనే ఈ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అందుకనుగుణంగా రెండు వేల పోలింగ్ బూత్‌లను సిద్ధం చేయనున్నారు. గద్వాల రెవెన్యూ డివిజన్ పరిధిలో అవసరాన్ని బట్టి ఏయే పంచాయతీల్లో అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందో చిన్న, మధ్యతరహా బ్యాలెట్ బాక్సులు అవసరమో గుర్తించి నివేదికలు తయారుచేసేందుకు సమాయత్తయ్యారు. ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకనుగుణంగా ప్రస్తుతం ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులను చేపట్టే ప్రక్రియ కొనసాగుతోంది. పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు, కొత్త పంచాయతీల ఏర్పాటు పూర్తయినందున గడువులోపే స్థానిక సంస్థల ఎన్నికలు జరగొచ్చు. దీనికోసం వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఐదు వేల మంది ఉద్యోగుల వివరాలను సేకరించి ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. -
పంచాయతీ సందడి!
పల్లెల్లో పంచాయతీ సందడి మొదలైంది. స్థానిక పోరుకు సర్కారు పచ్చజెండా ఊపడంతో ఆశావహులు పావులు కదుపుతున్నారు.ప్రస్తుత పాలకవర్గం ఆగస్టులో ముగియనున్న నేపథ్యంలో అప్ప ట్లోపు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చెక్ పవర్ విషయంలో తీసుకొచ్చిన నిబంధనల నేపథ్యంలో నాయకులు చర్చోపచర్చలు జరుపుతున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : స్థానిక సమరానికి తెరలేచింది. అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్ట సవరణకు ఆమోదముద్ర పడడంతో గ్రా మ పంచాయతీల ఎన్నికలపై స్పష్టత వచ్చింది. గడువులోపు ఎన్నికలు నిర్వహిస్తామని శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఎన్నికలకు దాదాపుగా లైన్ క్లియరైనట్లయింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ఆగస్టు రెండో తేదీ నాటికి ముగి యనుండడంతో అప్పటిలోపు ఎన్నికలు జరపాలని ప్రభు త్వం భావిస్తోంది. మే నెలాఖరులోగా ఎన్నికలను పూర్తి చేసి.. కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈక్రమంలో జూన్ నాటికి కొత్త పాలకవర్గాలు కొలువుదీరే అవకాశముంది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో గ్రామాల్లో స్థానిక సందడి నెలకొంది. సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్షమా..? పరోక్షమా.. అనే చర్చకు ఫుల్స్టాప్ పడిన పరిస్థితుల్లో సర్పంచ్ పీఠంపై కన్నేసిన ఆశావహులు తమదైన శైలిలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు చెక్‌పవర్ విషయంలో ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన కొత్త నిబంధనలు పల్లెల్లో చర్చోపచర్చలకు దారితీస్తున్నాయి. ఇప్పటివరకు సర్పంచ్‌తోపాటు గ్రామ కార్యదర్శికే చెక్ పవర్ ఉండేది. ఇకపై కార్యదర్శి స్థానే ఉపసర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఉండేలా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఈ నిర్ణయం స్థానిక సంస్థల్లో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. ఉప సర్పంచ్‌దే హవా! రిజర్వేషన్ల కారణంగా గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ల ప్రాబల్యమే ఎక్కువగా కనిపించనుంది. నిరక్షరాస్యులు, అణగారిన వర్గాలు సర్పంచ్ కుర్చీ ఎక్కితే.. బలమైన సామాజికవర్గం ఉప సర్పంచ్ పదవిని చేజిక్కించుకుంటోంది. వార్డు సభ్యుల సంఖ్యాబలంతో ఉప సర్పంచ్ సీటును దక్కించుకుంటున్న సభ్యులు పంచాయతీ పాలనావ్యవహారాల్లో కీలకభూమిక పోషిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ల పాత్ర కూడా దాదాపుగా వీరే పోషిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఉపసర్పంచ్‌కు చెక్‌పవర్ కూడా కట్టబెట్టడంతో గ్రామ రాజకీయాలు సరికొత్త పుంతను తొక్కనున్నాయి. ఇప్పటికే గ్రామ రాజకీయాల్లో పలుకుబడి ప్రదర్శిస్తున్న ఉపసర్పంచ్ పదవి.. వచ్చేఎన్నికల నుంచి మరింత పవర్‌ఫుల్‌గా మారనుంది. ఈ తరుణంలో ఉప సర్పంచ్ సీటును కైవసం చేసుకునేందుకు పోటీ తీవ్రం కానుంది. సర్పంచ్ అధికారాలకు తగ్గట్టు దాదాపు అవే హక్కులు ఉపసర్పంచ్ కూడా ఉండే అవకాశం ఉన్నందున ఈ పదవి దక్కించుకునే విషయంలో పల్లె రాజకీయం రసవత్తరంగా మారనుంది. మరోవైపు ఇప్పటి నుంచి పదేళ్లపాటు రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయం కూడా పంచాయతీ పోరులో కీలకం కానుంది. ప్రస్తుతం ఐదేళ్లకోసారి రిజర్వేషన్ మారేది. దీంతో ఒకసారి గెలిచిన ప్రజాప్రతినిధులు మరోసారి తన సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఉండదనే భావనలో అడ్డగోలు వ్యవహారాలకు తెరలేపేవారు. అదే సమయంలో ఎలాగూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముండదనే ధీమాతో గ్రామాభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడడమేగాకుండా.. నిధులు దుర్వినియోగం కూడా గణనీయంగా ఉండేది. ఈ పరిస్థితిని విశ్లేషించిన సర్కారు.. పదేళ్లపాటు ఒకే విధమైన రిజర్వేషన్‌ను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఒకసారి సర్పంచ్ గెలిచినా అభ్యర్థి మరోసారి తన అధిక్యతను ప్రదర్శించుకునేందుకు గ్రామాభివృద్ధిపై దృష్టిసారించే అవకాశముంది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రిజర్వేషన్ల ప్రకటనపై ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే రిజర్వేషన్ వర్తింపజేసిన సామాజికవర్గం ఆశావహులు మాత్రం.. సర్పంచ్ పదవిపైగాకుండా ఉపసర్పంచ్ పదవిపై కన్నేశారు. ఇలా పంచాయతీరాజ్ చట్ట సవరణకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందే తడువు పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీనికితోడు సార్వత్రిక ఎన్నికలకు ప్రీ పోల్స్‌గా భావించే ఈ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకోవడం ద్వారా గ్రామాల్లో బలమైన పునాది వేసుకోవాలని ఆయా రాజకీయపార్టీలు యోచిస్తున్నాయి. ఏదీఎమైనా.. పంచాయతీ ఎన్నికలకు నగారా మోగడమే తరువాయి.. బరిలో దిగేందుకు ఆశావహులు కదనకుతుహలంతో ఉన్నారు. -
మహిళలకు రిజర్వేషన్ కల్పించిన విషయం
పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు యాభైశాతం రిజర్వేషన్ కల్పించిన విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో అయితే యాభైశాతం మించి మహిళలే పాలకులు కావడం విశేషం. అన్నింటికన్నా ఎక్కువగా 56 శాతంతో జార్ఖండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఊరిపెద్ద మహిళైతే ఉండే ప్రయోజనం గురించి ఇప్పటికే అక్కడి గ్రామాల్లోని ప్రజలకు అనుభవంలోకి వచ్చింది. రిజర్వేషన్లోనే కాదు.. పాలనలో కూడా పర్ఫెక్ట్ అక్కడి మహిళాపాలకులు. అందులో ఒకరే - దొరోథియా దయామణి. జార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో ‘అర’ గ్రామ సర్పంచ్‌గా పనిచేస్తున్న దయా మణి ఒకప్పటి లక్ష్యం - లాయర్ కావాలని. ఊళ్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ పడగానే ఆమె దృష్టి మరలింది. ఎప్పటి నుంచో ‘మహిళా రిజర్వేషన్’ కోసం ఎదురు చూస్తున్న మహిళలకు ఆ వార్త చెవిలో పడగానే కడుపు నిండిపోయింది. మహిళ సర్పంచ్ అయితే ఊళ్లో ఆడవాళ్ల కష్టాలు తీరతాయన్నది వారి ఆశ. అయితే వారు కోరుకున్న మహిళ చదువుకున్న మహిళ అని స్పష్టం చేయడంతో అందరి నోటా ‘దయామణి’ పేరు వినిపించింది. ‘‘ఎంచక్కా లా చదువుతున్నావు... మహిళలకు ఏం కావాలో నీకన్నా ఎవరికి తెలుస్తుంది చెప్పు..’’ అంటూ తోటి స్త్రీలంతా నచ్చజెప్పి ఒప్పించారు. పాతికేళ్ల వయసుకే ఊరి సర్పంచ్ అవడమేమిటి? అంటూ విమర్శించిన మగవారిని పక్కనపెట్టి దయామణి నామినేషన్ వేసింది. అందరూ కోరుకున్నట్టుగానే సర్పంచ్ అయింది. ఆ ఊళ్లో పది వార్డులకు తొమ్మిది వార్డులలో ఆడవాళ్లే సభ్యులు కావడం ఈ సర్పంచ్ అమ్మాయికి మరింత కలిసొచ్చింది. పాలన కాదు పోరాటం... అయితే, తాను చేయవలసింది పాలన కాదు..పోరాటం అని సర్పంచ్కుర్చీలో కూర్చున్న మూడురోజులకే దయా మణికి అర్థమైంది. ‘‘అవును... గ్రామాభివృద్ధికి నిధులను ఖర్చు చేయడంతోనే నా బాధ్యత తీరిపోదు కదా! ఒక మహిళా సర్పంచ్‌గా తోటి మహిళల క్షేమం కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అర్థమైంది. ఉపాధి లేని మహిళలపైన ముందుగా నా దృష్టి పెట్టాను. వ్యవసాయ పనులు, పాడి, పౌల్ట్రీ వంటి వాటిల్లో మహిళల పాత్ర చాలా కీలకమైంది. ఈ విషయంపై పోరాటం చేయదలచుకున్నాను. ఆ రంగాల్లోని యజమానులకు కౌన్సెలింగ్ చేసి మహిళలకు పనులిప్పించే పని చేశాను. మగవారనుకోండి.. పక్క ఊరికి వెళ్లయినా పని చేసుకోవచ్చు. ఆడవాళ్లకలా కుదరదు కాబట్టి ఊరి పనుల్లో వారికి అవకాశం కల్పించాలని పట్టుబట్టా. మొదట్లో కొందరు మగవాళ్ళు వ్యతిరేకించినా తర్వాత మెల్లగా అర్థం చేసుకున్నారు’’ అని దయామణి చెప్పారు. ఆమె ఆలోచనలోని అంతరార్థమేమిటంటే, మహిళకు ఆర్థిక స్వాతంత్య్రం వస్తేనే మిగతా స్వాతంత్య్రాలన్నీ వస్తాయని. ఉపాధి తర్వాత... మహిళలకు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించడంలో విజయం సాధించిన ఈ లాయరమ్మ సర్పంచ్ పదవి రాగానే తన చదువుకు స్వస్తి చెప్పలేదు. పదవి చూసుకుంటూనే మరో పక్క ప్రయివేటు డిగ్రీ చేస్తోంది. చుట్టుపక్కలున్న మహిళా సర్పంచ్‌లతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. గ్రామాభివృద్ధితో పాటు మహిళాభివృద్ధికి మహిళా సర్పంచ్‌లంతా కృషి చేయాలనే ఆలోచనను రేకెత్తించింది. ఆ భావన అందరిలో కలగడంతో ఆ రాష్ర్టంలోని 31 వేల మహిళా గ్రామపాలకులంతా కలిసి మొన్నీమధ్యనే ఒక ప్రదర్శన కూడా చేశారు. స్త్రీల పురోభివృద్ధికి కృషి చేస్తున్న దయామణి ‘‘ఆడది సంతోషంగా లేనిచోట అభివృద్ధికి తావులేదు’’ అంటారు. ఆమె మాటలు అక్షరసత్యాలు -కదూ! -
తెలుసుకో.. ఏలుకో..
సాక్షి, మెదక్ డెస్క్: ఏడేళ్ల తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగడంతో ఎట్టకేలకు గ్రామాల్లో సర్పంచ్‌లు కొలువుదీరారు. అందులో ఎక్కువ మంది మహిళలు.. పదవికి కొత్తవారు ఉండడంతో పాలనా పరమైన సమస్యలు తలెత్తే అ వకాశం ఏర్పడింది. అందుకే ప్రభుత్వం జిల్లాలోని సర్పంచ్‌లకు విడతల వారీగా శిక్షణ ఇవ్వనుంది. నిధులు, విధులు, బాధ్యతలపై ఆయా శాఖలకు చెందిన అధికారులు, నిష్ణాతులు శిక్షణ ఇస్తున్నారు. అయినా వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో ఈలోపు పొరపాట్లు చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయని చట్టం చెబుతోంది. కొద్దిరోజుల క్రితమే ప్రభుత్వం నిధులకు సంబంధించి అధికారాలను అ ప్పగిస్తూ 431జీఓను జారీ చేసింది. నిధులను డ్రా చేసేందుకు ప్రత్యేకంగా జీఓ నంబర్ 432 మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని 1,066 పంచాయతీలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో వారి పాలన సౌలభ్యం కోసం ‘సాక్షి’ అందిస్తున్న కథనం.. ఐఎస్ఐ వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వాలి పంచాయతీలకు అవసరమైన బ్లీచింగ్ పౌడర్, ట్యూబ్ లైట్లు, ఇతర పరికరాలు, సామగ్రి కొనుగోలు చేసేముందు నిబంధనలు తెలుసుకోవాలి. అధీకృత డీలర్ వద్దనే ఐఎస్ఐ మార్కు ఉన్న వస్తువులను కొనుగోలు చేయా లి. సాదాసీదా వస్తువులు కొనుగోలు చేస్తే పదవికే ఎసరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొనుగోలు చేసిన పరికరాలు, వస్తువుల నిల్వలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేయాలి. అధికారులు తనిఖీకి వస్తే స్టాక్ రిజిస్టర్ ఆధారంగా కొనుగోలు చేసిన, నిల్వ ఉన్న వస్తువుల వివరాలు పారదర్శకంగా ఉండేలా చూడాలి. నిధుల వ్యయంలో నియమాలు పాటించాలి పంచాయతీలకు ఇంటి, నీటి పన్నులతోపాటు ఇతర రూపాల్లో వచ్చే నిధులను ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి. నిధులు వెచ్చిస్తే వాటి వివరాలతో కూడిన వినిమయ ధ్రువపత్రాన్ని ఈఓపీఆర్డీకి సమర్పించాలి. ఏటా డిసెంబర్లో ఆదాయం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు, వాటి వ్యయాలు ఆడిట్ చేయించాలి. లేకపోతే బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. ఏడాదికి నాలుగుసార్లు గ్రామ సభలు ఏడాదికి నాలుగుసార్లు గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. జనవరి 2, ఏప్రిల్ 14, జూలై 1, అక్టోబర్ 3వ తేదీల్లో గ్రామ సభలు నిర్వహించాల్సి ఉంటుంది. వాటిని ఫొటోలు తీసి, గ్రామ సభల్లో ప్రజల అభిప్రాయాలు, వివరాలను జిల్లా అధికారులకు తెలియజేయాలి. సర్పంచు పక్షం రోజులు స్థానికంగా అందుబాటులో లేకపోతే సెలవు పెడుతూ బాధ్యతలను ఉప సర్పంచ్‌కు అప్పగించాలి. సర్పంచు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలిస్తే గ్రామ కార్యదర్శి ఉన్నతాధికారులకు సమాచారం అందించాలి. లేకపోతే పంచాయతీలో ఏ తప్పు జరిగినా కార్యదర్శిని బాధ్యులుగా చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకునేందుకు పాలకవర్గం ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలి. కేటాయింపులకు మించి ఖర్చు చేయరాదు గ్రామ పంచాయతీల్లో నిధులు ఎలా ఖర్చు చేయాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. వేటికి ఎంత శాతం నిధులు కేటాయించాలో స్పష్టంగా పేర్కొంది. వేతనాలకు 30 శాతం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్‌కు 15 శాతం, అభివృద్ధి పనులకు 20 శాతం, ఇతర ఖర్చులు, స్టేషనరీ కొనుగోలుకు 5 శాతం నిధులు ఖర్చు చేసుకోవాలి. అందులో తేడాలు రాకుండా చూసుకోవాలి. అభివృద్ధి పనుల ఆమోదంపై ఆచితూచి.. గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టే ముందు అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. భవనాల నిర్మాణాలు, రహదారి, మురికి కాలువలు, ఇతర అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపించాలి. ఆయా విభాగాల సాంకేతిక నిపుణులు అంచనా వ్యయం నిర్ధేశించి నివేదికలు ఇస్తారు. ఇంజనీరింగ్ అధికారి అభివృద్ధి పని విలువను మెజర్మెంట్(ఎం- బుక్) పుస్తకంలో నమోదు చేస్తారు. ఉప కార్యనిర్వాహక ఇంజనీరు పని నా ణ్యతను పరిశీలిస్తారు. ఏ పని చేయాలన్నా ముందుగా పాలకవర్గంలో మెజార్టీ సభ్యుల ఆమోదం పొందాలి. రూ.2లక్షల నిధులు వ్యయం చేసే పనులకు పాలకవర్గం నిర్ణయం సరిపోతుంది. అంతకంటే ఎక్కువ నిధులు అవసరమైతే డివిజనల్ లేదా జిల్లా అధికారుల అనుమతి పొందక తప్పదు. అనుమతులు లేకుండా పనులు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. చెక్ పవర్ విషయంలో జాగ్రత్త చెక్ పవర్ వినియోగం విషయంలో సర్పంచులు జాగ్రత్తగా ఉండాలి. గతంలో చెక్ పవర్ కార్యదర్శి, సర్పంచులకు ఉమ్మడిగా ఉండేది. సర్పంచుల విన్నపం మేరకు ప్రభుత్వం వారికే ఆ పవర్‌ను కల్పించింది. వస్తువుల కొనుగోలుకు సంబంధించిన పేమెంట్లు, సిబ్బంది వేతనాల చెల్లింపులు చెక్కుల రూపంలోనే సాగాలి. చెక్కుపై సంతకం చేసే సమయంలో అన్ని విషయాలూ పరిశీలించాలి ఉంది. పంచాయతీ రికార్డులను ఇంటి వద్ద పెట్టుకోవడం నేరంగా పరిగణిస్తారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనే వాటిని ఉంచడం శ్రేయస్కరం. తాటిపల్లిలో రెండు దూడలు ఓ ఆవుకు ఒకే ఈతలో రెండు దూడలు జన్మించాయి. మునిపల్లి మండలం తాటిపల్లి మాజీ సర్పంచ్ అనసూజాప్రభాకర్రెడ్డి, రాంరెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన ఆవు శనివారం తెల్లవారుజామున ఈనింది. మొదటి ఈతలో ఓ దూడకు జన్మనివ్వగా తాజాగా శనివారం రెండింటికి ప్రాణం పోసింది. విషయం తెలుసుకున్న స్థానికులు వాటిని ఆసక్తిగా పరిశీలించారు. - న్యూస్‌లైన్, మునిపల్లి ఒకే ఈతలో ఐదు మేక పిల్లలు సాధారణంగా మేకలు ఒక ఈతలో రెండు లేదా మూడు పిల్లలకు జన్మనిస్తాయి. కానీ న్యాల్కల్ మండలం రాంతీర్థ్ గ్రామంలో రైతు మల్లప్పకు చెందిన మేక శనివారం ఒకేసారి ఐదు పిల్లలను ఈనింది. పుట్టిన పిల్లలన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయి. ఈ మేకను రెండేళ్ల క్రితం కర్నాటక రాష్ట్రంలోని తమ బంధువుల వద్ద కొనుగోలు చేసినట్టు రైతు మల్లప్ప తెలిపాడు. మొదటి ఈతలో రెండు పిల్లలు పుట్టగా శనివారం నాటి రెండో ఈతలో ఐదు పిల్లలు పుట్టినట్టు చెప్పాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ మేక పిల్లలను ఆసక్తిగా తిలకించారు. - న్యూస్‌లైన్, న్యాల్కల్ -
ఉనికిని చాటుకున్న వైఎస్సార్సీపీ, ఎంఐఎం..
ఈ ఏడాది జిల్లాలో వైఎస్సార్సీపీ, ఎంఐఎంలు తమ ఉనికిని చాటుకునే కార్యక్రమాలు చేపట్టాయి. వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పర్యటించడం ప్రాథమిక, పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసొచ్చింది. అలాగే ఎంఐఎం అగ్రనాయకులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీ పలు కార్యక్రమాలలో పాల్గొంటూ జిల్లాకు అధిక సమయం కేటాయించారు. వైఎస్సార్సీపీ జిల్లాలో బలమైన పార్టీగా ఎదిగెందుకు ప్రయత్నించింది. పంచాయతీ ఎన్నికల్లో 14 గ్రామాల్లో జెండా ఎగురవేసింది. సహకార సంఘాల ఎన్నికల్లో కూడా పది సంఘాల్లో విజయం సాధించింది. తృ టిలో డీసీఎంఎస్ చైర్మన్ పదవిని పొగొట్టుకుంది. - వైఎస్సాఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ రెండు పర్యాయాలు జిల్లాలో పర్యటించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ సభలో ఆమె పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ మధుశేఖర్ ఈ ఏడాదిలోనే బాధ్యతలను స్వీకరించారు. బోధన్, నిజామాబాద్, కామారెడ్డి తదితర నియోజకవర్గాలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తమ ఉనికి నిలుపుకునేందుకు ఎంఐఎం ప్రయత్నం చేసింది. పార్టీ రాష్ట్ర నేతలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక గ్రామంలో విజయం సాధించింది. నిజామాబాద్, బోధన్‌లలో జరిగిన బహిరంగసభలకు ఆ పార్టీ అగ్రనేతలు అసదుద్దీన్ఓవైసీ, అక్బరుద్దీన్ఓవైసీలు హాజరయ్యారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నామన్న సంకేతాలను ఎంఐఎం ఇవ్వగలిగింది. -
పంచాయతీలకు ‘సమ్మె’ పోటు
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది పంచాయతీల పరిస్థితి. రెండేళ్లపాటు ప్రత్యేక అధికారుల పాలనలో మగ్గిన పంచాయతీలకు జూలైలో జరిగిన ఎన్నికల్లో పాలకవర్గాలను ఎన్నుకున్నారు. కొత్త సర్పంచ్‌లు బాధ్యతలను చేపట్టారు. ఇంతవరకూ బాగానే ఉన్నా సమ్మె కారణంగా నిధులు అందుబాటులో లేకపోవడంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఎటు చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయి. పారి శుద్ధ్యం లోపించి కంపుకొడుతున్నాయి. వీధి దీపాలు వెలగక అంధకారం రాజ్యమేలుతోంది. రోడ్లు, తాగునీటి సరఫరా పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎన్నికల ప్రక్రియ ముగి సిన మరుసటి రోజు నుంచే సమైక్య ఉద్యమం జిల్లాలో ఊపందుకోవడంతో ప్రభుత్వ ఉద్యోగులంతా సమ్మెబాట పట్టారు. దీంతో పంచాయతీల్లో అసలు ఎంత మొత్తంలో నిధులు ఉన్నాయన్న లెక్కలు వారికి తెలియకపోగా రావలసిన నిధులకు బ్రేక్ పడింది. ఏకగ్రీవ పంచాయతీలకు అందని ప్రోత్సాహక నిధులు జిల్లాలో 921 పంచాయతీలకు వాటి పరిధిలోని 8,764 వార్డులకు ఈ ఏడాది జూలై 23, 27 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 131 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఆయా పంచాయతీల్లో ఎన్నికల ఖర్చు లేకపోవడంతో గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఏకగ్రీవంగా ఎన్నికైన మేజర్ పంచాయతీలకు రూ.10 లక్షలు, మైనర్ పంచాయతీలకు రూ.5 లక్షల వరకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవమైన 131 పంచాయతీలూ మైనర్ పంచాయతీలు కావడంతో ఒక్కొక్క పంచాయతీకి రూ.5 లక్షల చొప్పున నిధులు విడుదల కావాల్సి ఉంది. ఈ లెక్కన జిల్లాకు రూ 6.55 కోట్లు రావలసి ఉంది. మరో రూ 2 కోట్ల వరకు నిధులు పంచాయతీల్లో ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వీటితో పాటు పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు, వృత్తిపన్ను, సీనరేజీ పన్ను, ప్రత్యేక గ్రాంట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఈ నిధులతో పంచాయతీల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం, వీధిలైట్ల నిర్వహణ వంటి అభివృద్ధి పనులు చేపడతారు. అయితే ఎన్నికల ప్రక్రియ ముగిసిన మరుసటి రోజు నుంచే జిల్లాలో సమైక్య ఉద్యమం ఊపందుకోవడం పంచాయతీలకు గొడ్డలిపెట్టుగా మారింది. ఎంపీడీఓలు, ఖజానా శాఖ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, డివిజనల్ పంచాయతీ అధికారులు సమ్మెలో ఉండడంతో నిధులున్నా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఉద్యోగుల సమ్మెతో నిలిచిపోయిన సేవలు.. రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లాలో ఉద్యోగులంతా ఆగస్టు మొదటి వారంలో సమ్మెబాటపట్టారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. బ్లీచింగ్ చల్లాలన్నా, కాలువల్లో పూడికలు తీయాలన్నా, తాగునీటి పైపులైన్లు మరమ్మతులు చేయించాలన్నా, వీధి లైట్లు వెలగించాలన్నా పంచాయతీల్లో నిధులు లేకపోవడం, ఉన్నా అవి ఎక్కడ ఉన్నాయో తెలియకపోవడంతో సొంత నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు ఎక్కువై సర్పంచ్‌లు అప్పులు పాలైన తరుణంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయాల్సి రావడం వారికి భారంగా మారింది. పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో లేకపోవడంతో ఇంటి పన్ను ఎలా వసూలు చేయాలో తెలియని పరిస్థితిలో సర్పంచ్‌లు కొట్టుమిట్టాడుతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. బ్లీచింగ్ చల్లేందుకు ప్రతి పంచాయతీకి కనీసం రూ2 వేల నుంచి రూ3 వేల వరకు ఖర్చవుతుందని అంచనా. అయితే ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సొంత నిధులు వెచ్చిస్తే తీర్మానాలు లేకుండా చేసిన పనులకు బిల్లులు వస్తాయా...? రావా...? అన్న ప్రశ్నలు వారిలో తలెత్తుతున్నాయి. రెండేళ్ల పాటు రాజకీయ నిరుద్యోగంతో విసిగెత్తిపోయిన గ్రామస్థాయి నాయకులు పంచాయతీ ఎన్నికలు ప్రకటించగానే పరుగులు పెట్టి పోటీ చేసి గెలుపొందినప్పటికీ ఆదిలోనే వారి ఆశలు అడియాశలుగా మారుతున్నాయి. ఓ వైపు నిధులు విడుదల కాక, మరోవైపు బాధ్యతలు పూర్తి స్థాయిలో అందకపోవటంతో వారి బాధను బయటకు కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు.