
సాక్షి, శ్రీకాకుళం: కింజారపు సోదరుల కుటుంబం హత్యారాజకీయాలకు అలవాటు పడిందని టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. నిమ్మాడలో ప్రతి పంచాయతీ ఎన్నికల్లో హత్యలు చేయించడం కింజారపు కుటుంబానికి పరిపాటిగా మారిందని దువ్వాడ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకుడు కింజారపు అప్పన్న నామినేషన్ వేస్తానంటే, అతని చంపుతామంటూ కింజారపు సోదరుల అనుచరులు ఇంటికి వెళ్లి బెదిరించారన్నారు. అప్పన్నకు తోడుగా తానే వెళ్లి నామినేషన్ వేయిద్దామనుకుంటే, తనపై కూడా కత్తులతో దాడి చేసి చంపాలని ప్రయత్నించారని ఆరోపించారు.
తమపై దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన తన అనుచరులు, పోలీసులపై కూడా కింజారపు సోదరుల అనుచరులు దాడి చేశారన్నారు. ఈ సందర్భంగా వారు తమ వాహనాలు ధ్వంసం చేసి, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు స్వయంగా ఫోన్ చేసి అప్పన్న కుటుంబ సభ్యులను బెదిరించినా, ఎన్నికల కమిషనర్ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. అసలు నాగరిక ప్రపంచంలో ఉన్నామా అనే అనుమానం కలిగేలా అల్లరి మూకలు చెలరేగారన్నారు. అయినప్పటికీ తాము సంయమనంతో వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఇప్పటికే పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించామని, పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దువ్వాడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment