మాట్లాడుతున్న దువ్వాడ శ్రీనివాస్
టెక్కలి: ఆత్మస్థైర్యంతో కరోనాను జయించానని.. వైరస్ సోకిన వారి పట్ల వివక్ష చూపవద్దని వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ తాజాగా నిర్వహించిన నిర్థారణ పరీక్షల్లో గురువారం నెగిటివ్ రిపోర్టు రావడంతో స్థానిక విలేకరులతో మాట్లాడారు. తనకు పాజిటివ్ వచ్చినా ఎటువంటి ఆందోళనకు గురి కాలేదని, మనోధైర్యంతో పాటు ప్రభుత్వం అందజేస్తున్న వైద్య, ఆరోగ్య సలహాలను పాటిస్తూ కరోనాను జయించానని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు కరోనా వస్తుంది.. పోతుందని దువ్వాడ అన్నారు. సరైన పోషకాహారం, మందులు, రోజూ యోగా, ధ్యానం చేస్తే సులువుగా బయటపడవచ్చన్నారు. తాను వినియోగించిన వస్తువులు ఇతరులు తాకకుండా భౌతిక దూరం పాటిస్తూ మాస్క్‌లను ధరిస్తూ హోంఐసోలేషన్ పాటించడం వల్ల తనతో పాటు కుటుంబ సభ్యులకు సైతం నెగిటివ్ రిపోర్టులు వచ్చాయని శ్రీనివాస్ చెప్పారు. కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
రేపు లింగాలవలసలో మంత్రి పర్యటన
టెక్కలి మండలం లింగాలవలసలో ఆగస్టు 1న రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పర్యటిస్తున్నట్లు దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. పశు పోషణ అభివృద్ధిలో భాగంగా ‘జాతీయ ఉచిత పశు కృత్రిమ గర్భధారణ’ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అధికారులు, నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment