సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల విధులకు కేంద్ర సిబ్బందిని వినియోగించుకుంటామంటూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిబద్దతని శంకించేలా ఉన్నాయంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే ఆర్ సూర్యనారాయణ మండి పడ్డారు. గతంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించారని, కరోనా పరిస్ధితుల దృష్ట్యా మాత్రమే తాము ఎన్నికలను వాయిదా వేయాలని ఎస్‌ఈసీని కోరామన్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహిస్తే ఉద్యోగులు ఎదుర్కొనే ఇబ్బందులపై తాము ఎస్‌ఈసీకి వినతి పత్రాన్ని సమర్పించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ఉద్యోగులపై ఎస్ఈసీ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. రాష్ట్ర ఉద్యోగులను కించపరుస్తూ ఎన్నికల విధులకు కేంద్ర సిబ్బందిని వాడుకుంటామని చెప్పడంపై ఎస్‌ఈసీని ప్రశ్నించామన్నారు. అయితే ప్లాన్ బి కింద రాష్ట్ర ఉద్యోగుల సేవలు వినియోగించుకునేందుకు ఆలోచన చేశామని ఎస్ఈసీ వివరణ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్లు సరఫరా చేస్తామని గతంలో ఎస్ఈసీ ప్రకటించారని, వాటి విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదన్నారు. ప్రకటనలతో సరిపెట్టకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిని కరోనా నుంచి రక్షణ కల్పించాలని తాము ఎస్‌ఈసీని కోరామన్నారు. ఎస్‌ఈసీని కలిసిన వారిలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్సి ఆస్కార్ రావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment