సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితిని తిరుగులేని రాజకీయశక్తిగా మార్చేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. అన్ని ఎన్నికల్లోనూ పార్టీ భారీ ఆధిక్యంతో గెలవాలనే లక్ష్యంతో ముందుకెళ్లనున్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శుక్రవారం నియమితులైన వెంటనే కేటీఆర్ పార్టీ బలోపేతంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ వ్యవస్థను పటిష్ట పరిచే ప్రణాళికను రచించారు.
ఇందులో భాగంగానే శనివారం టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌లో గత సంప్రదాయానికి భిన్నంగా ప్రధాన కార్యదర్శులందరితో మాట్లాడించారు. పార్టీ ఎలా ఉంటే బాగుంటుందో చెప్పాలని అడిగారు. ఇన్నాళ్లూ పార్టీని పట్టించుకోలేదని ఇక నుంచి కార్యకర్తలను, నాయకులను నిత్యం పార్టీతో మమేకమయ్యేలా చూడాలని పలువురు సూచించారు. అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, దేశంలోనే పటిష్టమైన పార్టీగా టీఆర్‌ఎస్‌ను తీర్చిదిద్దుతామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి మార్గదర్శనం చేసేలా పార్టీని రూపొందిస్తామన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పార్టీని మార్చాలని... రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్నీ పార్టీకి దగ్గర చేసేలా కార్యక్రమాలు ఉండాలని సూచించారు.
16 ఎంపీ సీట్లపై గురి...
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో కలసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యం తో ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ సీట్లను గెలిస్తేనే ఫెడరల్ ఫ్రంట్ నినాదం విజయవంతం అవుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్ లోక్ సభ స్థానంలో ఎంఐఎం గెలుపు ఖాయమని... మిగిలిన 16 సీట్లనూ గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2014 ఎన్నికల్లో పార్టీ 11 ఎంపీ సీట్లను గెలుచుకోగా..కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాచరణ ప్రారంభించారు. ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్‌కు ఒక ప్రధాన కార్యదర్శితోపాటు ముగ్గురు కార్యదర్శులను, పార్టీ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులను ఇన్‌చార్జులుగా నియమిస్తున్నారు.
జిల్లా కార్యాలయాలకు శంకుస్థాపన...
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కేటీఆర్ 2 వారాలపాటు అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి మినహా 29 జిల్లాల్లో టీఆర్‌ఎస్ కార్యాలయాల భవన నిర్మాణాలకు స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 20న వరంగల్, జనగామలలో పార్టీ కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లోపే అన్ని భవనాల నిర్మాణం పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఆధునిక సాంకేతిక వ్యవస్థతో ఈ కార్యాలయాల నిర్మాణం జరగనుంది.
సమష్టిగా ముందుకు...
టీఆర్‌ఎస్ అందరిదీ అనే భావన కల్పించేలా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహాలు సిద్ధం చేశారు. ప్రజాప్రతినిధులతో సమానంగా పార్టీ కమిటీల్లోని వారికి ప్రా« దాన్యత ఉండేలా మార్పులు చేయా లని భావిస్తున్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే కాకుండా ఏడాది పొడవునా శ్రేణులను మమేకం చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదు ర్కొని విజయాలు సాధించేలా పార్టీ శ్రేణులకు శిక్షణ కల్పించనున్నారు.
ప్రతిష్టాత్మకంగా పంచాయతీ ఎన్నికలు...
గ్రామస్థాయిలోని పార్టీ శ్రేణులకు పదవులు అందించగల సర్పంచ్ ఎన్నికలనూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 12,751 పంచాయతీల్లోనూ పార్టీ మద్దతుదారులే విజయం సాధించేలా కార్యాచరణ చేపడుతోంది. వీలైనన్ని పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా వ్యూహాలు రచిస్తోంది. ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని దీనికి అనుగుణంగా మార్చుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి జనవరి 6 వరకు టీఆర్‌ఎస్ నేతలు ఓటర్ల నమోదు ప్రక్రియలో కీలకంగా వ్యవహరించాలని పార్టీ నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల తర్వాత సభ్యత్వ నమోదు చేపట్టనుంది. ఈ ఎన్నికల తర్వాత సహకార సంఘాల ఎన్నికలు జరగనుండటంతో వాటిలోనూ టీఆర్‌ఎస్ మద్దతుదారులే విజయం సాధించేలా వ్యూహాలు రచిస్తున్నారు. 2013లో జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో ఒక్క కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మాత్రమే టీఆర్‌ఎస్ మద్దతుదారులు చెప్పుకోదగిన స్థానాలను గెలుచుకున్నారు. అయితేఈసారి అన్ని డీసీసీబీలు, ప్రాథమిక సహకార సంఘాల్లోనూ టీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలిచే లక్ష్యంతో కేటీఆర్ ఉన్నారు.
నేడు అట్టహాసంగా బాధ్యతల స్వీకరణ...
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ఉదయం 11.55 గంటలకు పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ భవన్‌లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఉదయం 10 గంటలకు బసవతారకం కేన్సర్ ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్ వరకు పార్టీ శ్రేణులు ర్యాలీగాఆయన్ను తీసుకురానున్నాయి. ఇందులో దాదాపు 300 మంది కళాకారులు ఒగ్గుడోలు, కోలాటం, పులివేషాలు, బతుకమ్మ, బోనాలు, డప్పులు, గుస్సాడీ, కొమ్ముకొయ్యలు, చిందు యక్షగానాల ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
గ్రీవెన్స్ సెల్...
ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేలా తెలంగాణ భవన్‌లో ప్రత్యేకంగా ప్రజా ఫిర్యాదుల విభాగం (పబ్లిక్ గ్రీవెన్స్ సెల్) ఏర్పాటు చేయాలని కేటీఆర్ నిర్ణయించారు. ప్రజలెవరైనా తమ సమస్యలపై పార్టీ సభ్యులను ఆశ్రయిస్తే వాటిని పరిష్కరించేలా అధికారిక వ్యవస్థకు, ఎమ్మెల్యేలకు నివేదించేలా ఈ వ్యవస్థ పనిచేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment