హైదరాబాద్ : ధర్నా చౌక్ ఎత్తివేసి తెలంగాణలో పోలీసు రాజ్యం నడిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై బీజేఎల్‌పీ నేత కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మంత్రుల మీద, సచివాలయం మీద నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. గ్రామ స్వరాజ్యంలో భాగంగా పంచాయతీల వ్యవస్థ కీలకమైందని, ప్రజాస్వామ్యంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రధానమైన అంశమని పేర్కొన్నారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఇలాంటి సందర్భంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు.
సర్పంచ్ వ్యవస్థను రద్దు చేసి పంచాయతీలను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ప్రభుత్వం అనుకుంటుందని విమర్శించారు. రేషన్ కార్డులు, పెన్షన్‌లు, స్వయం ఉపాధి, పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలంటే గ్రామ సభల ద్వారానే ఇవ్వాలి..కానీ వీటికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ కండువా కప్పుకోకుంటే ట్రాక్టర్లు, సబ్సిడీ వస్తువులు రాకుండా చేస్తున్నారని విమర్శించారు. మన ఊరు- మన ప్రణాళిక అని చెప్పారు...కానీ మన ఊరు అక్కడే ఉంది కానీ ప్రణాళికలు ఎక్కడికో పోయాయని ఎద్దేవా చేశారు. కేంద్రం పంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నదని అన్నారు.
స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రంలో ఉందా? నాకు తెలిసి లేదనే అనిపిస్తోంది...నూతన పంచాయతీ రాజ్ చట్టం తీసుకువచ్చి పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహిస్తామని చెప్పారు...ఇప్పటి వరకు ఆ ఊసే లేదని తీవ్రంగా ఎండగట్టారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లపై స్పష్టత లేకపోవడంతో హైకోర్టు స్టే ఇచ్చిందని..స్టే ఇచ్చి చాలా రోజులుగా కూడా అయింది..కానీ సీఎం మిన్నకుండిపోయి చాలా సంతోషంగా కనపడుతున్నట్లు ఉందన్నారు. ఆర్ధిక, హోంశాఖలకు తెలియకుండానే కొన్ని నిర్ణయాలు జరిగిపోతున్నాయని అన్నారు.
తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోంది: కిషన్ రెడ్డి
Published Mon, Jul 23 2018 1:42 PM | Last Updated on Wed, Aug 15 2018 9:10 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment