మోర్తాడ్(బాల్కొండ): పంచాయతీ రిజ ర్వేషన్లపై ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ రిజర్వేషన్ వస్తుందోనని సర్పంచ్ పదవిపై కన్నేసిన వారిలో ఒకిం త ఆందోళన కనిపిస్తోంది. పంచాయతీ రిజర్వేషన్ల ప్రకటనపై ఇంతవరకూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తాము పోటీ చేయాలనుకునే పంచాయతీలో సర్పంచ్ పదవి ఏ సామాజిక వర్గానికి రిజర్వు వస్తుందోనని విషయంపై ఎటూ తేలక పోవడంతో ఆశావహులు అయోమయానికి గురవుతున్నారు.
గతంలో సర్పంచ్, వార్డు స్థానాల రిజర్వేషన్ రోటేషన్ పద్ధతిలో జరిగేది. అయితే, తెలంగాణ ప్రభుత్వం గిరిజన తండాలను, ఆమ్లెట్ గ్రామాలను పంచాయతీలుగా ప్రకటించడంతో గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగింది.
మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో పాత, కొత్త పంచాయతీలు కలిపి 530 ఉండగా, కామారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలు ఉన్నాయి. గిరిజన తండాలను పంచాయతీలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో ఆ తండాలోని పదవులు గిరిజనులకే వర్తించేలా రిజర్వు చేస్తూ పేర్కొంది. దీంతో ఎస్టీలకు రిజర్వు చేసిన పంచాయతీల సంఖ్య గణనీయంగా పెరుగనుంది.
అయితే, పంచాయతీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. పంచాయతీల రిజర్వేషన్ల శాతాన్ని పెంచడానికి అనుమతి ఇవ్వాలని కోర్టును విన్నవించింది. అయితే, సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో పంచాయతీల రిజర్వేషన్ 50 శాతానికి మించకుండా చర్యలు తీసుకోవడంతో పాటు వచ్చే నెల 10వ తేదీలోగా ఎన్నికల తంతును పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడింది.
జాబితాల ప్రదర్శన ఆలస్యం..
గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఓవైపు కసరత్తు జరుగుతుండగా, మరోవైపు బీసీ ఓటర్ల జాబితా సవరణపై ఇప్పటికీ స్పష్టత కరువైంది. శనివారం జిల్లా వ్యాప్తంగా బీసీ ఓటర్ల జాబితా ప్రదర్శించాల్సి ఉండగా ప్రదర్శించలేదు. అయితే, రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాలను జారీ చేయలేదు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గడువు దగ్గర పడుతుండటంతో ఏ పంచాయతీ, ఏ సామాజిక వర్గానికి రిజర్వు చేస్తా రో ఎవరికీ అంతు చిక్కడం లేదు.
రొటేషన్ పద్ధతి లో రిజర్వేషన్లను ప్రకటిస్తారని సమాచారం ఉంటే, పంచాయతీల రిజర్వేషన్లపై కొంత అంచనా వేయడానికి అవకాశం ఉండేది. కానీ కొత్త పంచాయతీల సంఖ్య పెరగడంతో రోటేషన్ పద్ధతిలో కాకుండా కొత్తగానే రిజర్వేషన్లను ప్రకటించాల్సి ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో రిజర్వేషన్లు తమకు అనుకూలంగా ఉంటాయా.. లేక ప్రతికూలంగా ఉంటాయో అంతు చిక్కకపోవడంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఎనలేని సందిగ్ధత..
పంచాయతీల్లో రిజర్వేషన్ల పరిమితి 50 శాతనికి మించకూడదని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎస్టీలకు రిజర్వు చేసిన పంచాయతీల సంఖ్య పెరిగితే ఇతర సామాజిక వర్గాలకు రిజర్వేషన్ శాతం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో గిరిజన పంచాయతీలను పక్కన పెట్టి ఇతర పంచాయతీలలోనే 50 శాతం రిజర్వు చేస్తారా అనే విషయంపై ప్రభుత్వం సందిగ్ధంలో ఉందని ప్రచారం సాగుతోంది. రిజర్వేషన్లపై ఇది వరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఒకలా ఉండగా, హైకోర్టు తీర్పు మరోలా ఉండటంతో రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో పంచాయతీ రిజర్వేషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసే విషయంపై జాప్యం కలుగుతుందా? అనే సందేహం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment