సాక్షి, ఒంగోలు: రాష్ట్రంలో త్వరలో జరుగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 90 శాతం స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జిల్లా పార్టీ కార్యలయంలో జరిగిన నేతల భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ఏవైనా తమ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న సంక్షేమ పథకాలే తమ పార్టీని గెలిపిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
జిల్లాలో ఏకగ్రీవాలపై దృష్టి సారించాలని నాయకులకు పిలుపునిచ్చారు. గ్రామాల ప్రగతికి తోడ్పడతాయని తాము ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుంటే.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, చంద్రబాబు అండ్ కో కలిసి అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విషయం స్పష్టమవుతుందన్నారు. గతంలో ఆగిన ఎన్నికలను పూర్తి చేయకుండా పంచాయతీ ఎన్నికలను నిర్వహించడమేంటని రమేష్ కుమార్‌ను ప్రశ్నించారు. చీరాల ప్రాంతంలో కోర్టు కేసులు ఉండటం వల్ల అక్కడ ఎన్నికలు జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ఇంఛార్జి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment