ఫైల్ ఫోటో
సాక్షి, ప్రకాశం: తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నట్టు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం బాలినేని మాట్లాడుతూ.. ‘‘వైఎస్‌ఆర్ మరణం తర్వాత నాలుగేళ్ల ముందే మంత్రి పదవి వదులుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పక్కన నిలబడ్డాను. సీఎం జగన్‌కు నేను వీరాభిమానిని. కేబినెట్ మొత్తాన్ని తొలగిస్తున్నా అని సీఎం జగన్ అన్నప్పుడే నా పూర్తి మద్దతును బహిరంగంగా ప్రకటించాను. నాకు పార్టీ ముఖ్యం.. మంత్రి పదవి కాదని నేను ఎప్పుడో చెప్పాను. ఆంధ్రజ్యోతి రాతలు మరింత నీచంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఆంధ్రజ్యోతి విషప్రచారం మానుకోకపోతే ఆ పత్రికపై పరువునష్టం దావా వేస్తా’’ అని హెచ్చరించారు.
మరోవైపు.. విజయవాడలో సీదిరి అప్పలరాజు సాక్షి టీవీతో మాట్లాడుతూ.. రాజీనామాల తర్వాత అసంతృప్తి అనేది అవాస్తవం. మంత్రులందరం సీఎం జగన్ నిర్ణయాన్ని గౌరవించి ఏకాభిప్రాయంతోనే రాజీనామా చేశాం. కొన్ని మీడియాలు ప్రజలని తప్పుదోవ పట్టించేలా అసంతృప్తులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కేబినెట్ కూర్పుపై స్వేచ్చగా నిర్ణయం తీసుకునే అధికారం సీఎం జగన్‌కు ఉంది. ముఖ్యమంత్రి నిర్ణయాలకి అనుగుణంగానే అందరూ పనిచేయాల్సి ఉంటుంది.
సీఎం జగన్ పనితీరుని చూసే ప్రజలు ఓట్లేస్తారు.. మమ్మల్ని చూసి కాదు. మా అందరికీ ముఖ్యమంత్రి జగన్‌పై అపార నమ్మకం, అచంఛల విశ్వాసం ఉంది. బలహీనవర్గాలలో ఇంతమందికి గతంలో ఎవరూ అవకాశం కల్పించలేదు. సామాన్య కుటుంబంలో పుట్టిన నాకు ఎమ్మెల్యేగా, మంత్రిగా సీఎం వైఎస్ జగన్ నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. సీఎం జగన్ దగ్గర పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా సంతోషంగా పాటిస్తాం’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment