వైరా: గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలు కాబోతోంది. త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో సీట్ల రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. గ్రామాల్లో రిజర్వేషన్ల వల్ల ఏ వర్గం లాభపడుతుందోనని ఊహాగానాలు మొదలయ్యాయి. రాజకీయ పార్టీలు తమ ప్రాబల్యాన్ని చాటేందుకు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నాయి. జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలు ఉండగా, 5,354 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పంచాయతీ పోరుకు సిద్ధమవుతున్న ఆశావహులు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవట్లేదు. పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ..తమకే సీటు వచ్చేలా చూసుకుంటున్నారు. ఈసారి యువత ఎక్కువచోట్ల సీట్ల కోసం ప్రయత్నిస్తోంది.
పోటీ చేస్తామని ముందుగానే చెబుతూ..తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో ఈసారి మరింత ఉత్సాహంగా పోటీకి సిద్ధమవుతున్నారు. గతంలో శివారు గ్రామంగా ఉండి..అవకాశాలు రాలేదని బాధపడిన ఇక్కడి జనం..ఈసారి తమ పాలన తామే చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. జనాభా ప్రాతిపదికన సర్పంచ్‌ల రిజర్వేషన్లు ఖరారు చేస్తారా ? లేకుంటే గతంలో కేటాయించిన రిజర్వేషన్ల లెక్కనే తీసుకుంటారా? అనేది తేలాల్సి ఉంది. మద్దతుదారులను ఎలాగైనా గెలిపించుకోవడానికి వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే చాకచక్యంగా పావులు కదపడానికి వ్యూహరచన చేస్తున్నాయి. నేతలు లోలోపల మంతనాలు జరుపుతున్నారు. ఈసారి ఉపసర్పంచ్‌లకూ సర్పంచ్‌లతో పాటు చెక్ పవర్ ఇస్తుడంటంతో చాలామంది ఉప సర్పంచ్ పదవులపై దృష్టి సారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment