సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలు మొత్తం నాలుగు విడతల్లో జరగనున్నాయని, మొదటి విడత నామినేషన్ ప్రక్రియ రేపటి నుంచి మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 52 లొకేషన్లలో 76 సమస్యాత్మక ప్రదేశాలని గుర్తించామని ఆయన తెలిపారు. రౌడీ షీటర్లను, వివాదాస్పద నాయకులను ముందుగా బైండోవర్ చేశామన్నారు. లైసెన్స్ వెపన్ ఉన్న వారి నుండి వెపన్‌ను హ్యాండోవర్ చేసుకొని హెడ్ క్వాటర్‌కి డిపాజిట్ చేశామన్నారు. నాలుగు దశల ఎన్నికల విధులకు జిల్లా వ్యాప్తంగా 2200 మంది పోలీస్ సిబ్బందిని కేటాయించామన్నారు. 800 మంది సచివాలయ మహిళా పోలీసులు, రిటైర్డ్ పోలీస్ అధికారులు, ఎక్స్ ఆర్మీ, ఎక్స్ సీఆర్పిఎఫ్ సిబ్బంది సహాయం తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు డీఎస్పీ స్థాయి అధికారిని నియమించామని, 24 గంటల పర్యవేక్షణకు 8332983792 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
అధికారులకు, సిబ్బందికి వేరువేరుగా శిక్షణ: కలెక్టర్ ఇంతియాజ్
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి రెండు విడతల్లో వేరేవేరుగా శిక్షణ ఇస్తామని, ఇందులో భాగంగా నేడు అధికారులకు తొలి విడత శిక్షణను పూర్తి చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. ఫిబ్రవరి 2న వారికి రెండవ విడత శిక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక సిబ్బందికి మొదటి విడత శిక్షణ ఫిబ్రవరి 4న, రెండవ విడత.. ఫిబ్రవరి 6న ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి 7న మండల స్థాయి పరిశీలకులకు శిక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ అధికారులు, డివిజనల్ పంచాయితీ అధికారులు శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని వెల్లడించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ) సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. కాగా, తొలి విడతలో 14 మండలాల్లో 234 పంచాయితీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని, 2502 వార్డులకు 2642 బూతులు ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు. తొలి విడత ఎన్నికల్లో 30 సమస్యాత్మక పంచాయతీలను గుర్తించామని, అందులో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment