
మహిళలకు రిజర్వేషన్ కల్పించిన విషయం
పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు యాభైశాతం రిజర్వేషన్ కల్పించిన విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో అయితే యాభైశాతం మించి మహిళలే పాలకులు కావడం విశేషం. అన్నింటికన్నా ఎక్కువగా 56 శాతంతో జార్ఖండ్ మొదటి స్థానంలో నిలిచింది.
ఊరిపెద్ద మహిళైతే ఉండే ప్రయోజనం గురించి ఇప్పటికే అక్కడి గ్రామాల్లోని ప్రజలకు అనుభవంలోకి వచ్చింది. రిజర్వేషన్‌లోనే కాదు.. పాలనలో కూడా పర్‌ఫెక్ట్ అక్కడి మహిళాపాలకులు. అందులో ఒకరే - దొరోథియా దయామణి.
జార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో ‘అర’ గ్రామ సర్పంచ్‌గా పనిచేస్తున్న దయా మణి ఒకప్పటి లక్ష్యం - లాయర్ కావాలని. ఊళ్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ పడగానే ఆమె దృష్టి మరలింది. ఎప్పటి నుంచో ‘మహిళా రిజర్వేషన్’ కోసం ఎదురు చూస్తున్న మహిళలకు ఆ వార్త చెవిలో పడగానే కడుపు నిండిపోయింది. మహిళ సర్పంచ్ అయితే ఊళ్లో ఆడవాళ్ల కష్టాలు తీరతాయన్నది వారి ఆశ. అయితే వారు కోరుకున్న మహిళ చదువుకున్న మహిళ అని స్పష్టం చేయడంతో అందరి నోటా ‘దయామణి’ పేరు వినిపించింది. ‘‘ఎంచక్కా లా చదువుతున్నావు... మహిళలకు ఏం కావాలో నీకన్నా ఎవరికి తెలుస్తుంది చెప్పు..’’ అంటూ తోటి స్త్రీలంతా నచ్చజెప్పి ఒప్పించారు.
పాతికేళ్ల వయసుకే ఊరి సర్పంచ్ అవడమేమిటి? అంటూ విమర్శించిన మగవారిని పక్కనపెట్టి దయామణి నామినేషన్ వేసింది. అందరూ కోరుకున్నట్టుగానే సర్పంచ్ అయింది. ఆ ఊళ్లో పది వార్డులకు తొమ్మిది వార్డులలో ఆడవాళ్లే సభ్యులు కావడం ఈ సర్పంచ్ అమ్మాయికి మరింత కలిసొచ్చింది.
పాలన కాదు పోరాటం...
అయితే, తాను చేయవలసింది పాలన కాదు..పోరాటం అని సర్పంచ్‌కుర్చీలో కూర్చున్న మూడురోజులకే దయా మణికి అర్థమైంది. ‘‘అవును... గ్రామాభివృద్ధికి నిధులను ఖర్చు చేయడంతోనే నా బాధ్యత తీరిపోదు కదా! ఒక మహిళా సర్పంచ్‌గా తోటి మహిళల క్షేమం కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అర్థమైంది. ఉపాధి లేని మహిళలపైన ముందుగా నా దృష్టి పెట్టాను. వ్యవసాయ పనులు, పాడి, పౌల్ట్రీ వంటి వాటిల్లో మహిళల పాత్ర చాలా కీలకమైంది. ఈ విషయంపై పోరాటం చేయదలచుకున్నాను. ఆ రంగాల్లోని యజమానులకు కౌన్సెలింగ్ చేసి మహిళలకు పనులిప్పించే పని చేశాను. మగవారనుకోండి.. పక్క ఊరికి వెళ్లయినా పని చేసుకోవచ్చు. ఆడవాళ్లకలా కుదరదు కాబట్టి ఊరి పనుల్లో వారికి అవకాశం కల్పించాలని పట్టుబట్టా. మొదట్లో కొందరు మగవాళ్ళు వ్యతిరేకించినా తర్వాత మెల్లగా అర్థం చేసుకున్నారు’’ అని దయామణి చెప్పారు. ఆమె ఆలోచనలోని అంతరార్థమేమిటంటే, మహిళకు ఆర్థిక స్వాతంత్య్రం వస్తేనే మిగతా స్వాతంత్య్రాలన్నీ వస్తాయని.
ఉపాధి తర్వాత...
మహిళలకు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించడంలో విజయం సాధించిన ఈ లాయరమ్మ సర్పంచ్ పదవి రాగానే తన చదువుకు స్వస్తి చెప్పలేదు. పదవి చూసుకుంటూనే మరో పక్క ప్రయివేటు డిగ్రీ చేస్తోంది. చుట్టుపక్కలున్న మహిళా సర్పంచ్‌లతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. గ్రామాభివృద్ధితో పాటు మహిళాభివృద్ధికి మహిళా సర్పంచ్‌లంతా కృషి చేయాలనే ఆలోచనను రేకెత్తించింది. ఆ భావన అందరిలో కలగడంతో ఆ రాష్ర్టంలోని 31 వేల మహిళా గ్రామపాలకులంతా కలిసి మొన్నీమధ్యనే ఒక ప్రదర్శన కూడా చేశారు. స్త్రీల పురోభివృద్ధికి కృషి చేస్తున్న దయామణి ‘‘ఆడది సంతోషంగా లేనిచోట అభివృద్ధికి తావులేదు’’ అంటారు. ఆమె మాటలు అక్షరసత్యాలు -కదూ!